సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అమృతవాక్కులు



1. నన్ను ప్రాణసమానంగా ప్రేమించేవారు అరుదు. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను.
2. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను.
3. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కానీ, వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగిందేముంది?
4. ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు. నీ కోరిక నెరవేరుతుంది.
5. నన్ను నమ్మినవారిని ఎన్నడూ పతనం కానివ్వను.
6. సర్వప్రాణులరూపంలో సంచరించే నన్ను గుర్తించి, ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు.
7. జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు! నాపై విశ్వాసముంచు!
8. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరూ వారంతట వారుగా నా వద్దకు రారు.
9. గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను.
10. పనిచెయ్యి! సద్గ్రంథాలు చదువు! దేవుని నామం ఉచ్ఛరించు!
11. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి.
12. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడూ కాదు. అది అల్లాకు మాత్రమే బానిస.
13. అన్నీ నావే. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు.
14. ఈ మసీదుతల్లి చాలా దయార్ద్రహృదయురాలు. ఆమె ఒడిని ఆశ్రయించినవారి కష్టములన్నియు తొలగిపోయి ఆనందముగా ఉంటారు.
15. దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు.
16. ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ, మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ‘సాయి, సాయి’ అన్న నామాన్నే స్మరిస్తూ, నన్నే అనన్యంగా నమ్ముకొనివుంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పనిలేదు.
17. ప్రపంచంలోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము.
18. సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు.
19. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలచింది వారు అడిగేంతవరకు.
20. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను.
21. ఋణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో! నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు! ఆకలిగొన్నవారికి అన్నం, గుడ్డలులేనివారికి గుడ్డలు ఇవ్వు! భగవంతుడు సంప్రీతుడవుతాడు.
22. బస్తాలకొద్దీ ఊదీ ఇక్కడ ఉంది, బండ్లకొద్దీ తీసుకెళ్ళండి. నా భాండాగారపు తలుపులు తెరచిపెట్టబడి ఉన్నాయి, తీసుకోండి, ఎవ్వరూ అడ్డుచెప్పరు.
23. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి.
24. నన్నే ధ్యానించి నా లీలలు గానంచేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను.
25. మహాత్ముల సముఖంలో కూర్చోవాలి. సజ్జనుల, సంతుల సాంగత్యం చేయాలి.
26. ఎలా నడుచుకొనడంవల్ల ఆ దైవం సంతసిస్తాడో అలా నడుచుకోండి. ఎప్పుడూ ఎవ్వరినీ కష్టపెట్టవద్దు.
27. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే!
28. మీరెక్కడున్నా, ఏమి చేస్తున్నా నాకు తెలుసునని బాగా గుర్తుంచుకోండి.
29. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తున్నాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చుతాను.
30. నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెనుకే వస్తాను. నాకు ఏ వాహనాలూ అక్కరలేదు.
31. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూస్తాను. నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లుచేయను.
32. ఎవరైతే నన్ను శరణువేడి, భక్తివిశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధనముల నుండి తప్పిస్తాను.
33. ఈ లోకములో అనేకమంది యోగులు కలరు. మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కానీ, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు.
34. భక్తివిశ్వాసములతో నా వద్దకు వచ్చినవారినెవ్వరినీ ఎన్నడూ దూరం చేయను. ఇది నా వాగ్దానం.
35. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే.
36. పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాలవిశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం.
37. నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానదృష్టితో చూస్తాను.
38. నేనెప్పుడూ చమత్కారాలు చేయను. నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి.
39. నేను శిరిడీలోనూ, ఎల్లెడలా ఉన్నాను. సర్వజగత్తూ నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలసి నేను.
40. ఎక్కడైనను, ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉంటాను. భక్తుడు భక్తిప్రేమలతో ఉండవలెను. నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను.
41. ఈ విశాలవిశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్తసముద్రాలకు ఆవల ఉన్నా నా అనుగ్రహదృష్టి మీ మీదనే ఉంటుంది.
42. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు ఎవ్వరిమీదా కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా?
43. ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను.
44. నేనుండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో! అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
45. నాకు వారసులెవరూ లేరు. నన్ను ఆశ్రయించినవారికి నా సమాధినుండే సమాధానమిస్తాను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలోనుండి నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగిస్తాయి.
46. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయకండి. ఇతరులకు మీరేదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి.
47. ఎవరినీ ద్వేషించకు. ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీలకు చోటివ్వవద్దు.
48. ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్ఛరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తాను. వారి భక్తిని హెచ్చించి వారిని అన్నివిధముల కాపాడుతాను.
49. నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? అనుగ్రహించడమే నా అవతార కార్యం.
50. ఉపవాసాలు, తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను.
51. స్వల్పంగా తిను! ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు! రుచులకోసం ప్రాకులాడవద్దు!
52. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుంటాను.
53. నా లీలలు వినినచో సకల రోగములు నివారింపబడును. వాటిని మనసులో నిలుపుము. ఆనందమునకు, తృప్తికి ఇదియే మార్గము.
54. ఎన్నడూ వాదించకు. పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు.
55. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను.
56. ఒక్కసారి సద్గురువుకు పగ్గాలప్పగించిన తరువాత దుఃఖానికి చోటులేదు.
57. మీ ఆనందం నా ఖజానాలో ఉంది. నా ఖజానా నూటికి నూరుశాతం ఆనందాన్నిస్తుంది.
58. తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలనెలా రక్షిస్తుందో, అలానే నేను నా (మనో)దృష్టిచేతనే నిన్ను కాపాడుతాను.
59. నా భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, లోపల, వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను.
60. నా భక్తుని గురించే నేనెల్లప్పుడూ ఆలోచిస్తున్నాను.
61. ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి!
62. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
63. ఏదైనా పనిచేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు.
64. నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను. లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎఱుక.
65. ఎవరి మంచితనం ఎట్లావుంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది.
66. నేను అందరినీ దక్షిణ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను. కానీ, బదులుగా వారికి నేను తీసుకున్నదానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది.
67. నా చరిత్ర పఠనం చేస్తూ, ఊదీ రాస్తూ ఉండు. నీకు నయమవుతుంది.
68. నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు.
69. మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి. నేనూ మీ మాటలు వింటూ ఉంటాను.
70. నా దర్బారు అందరికీ అన్నివేళలా తెరిచే ఉంటుంది.
71. నిన్నెవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానమివ్వు, లేదా ఆ చోటునుండి వెళ్ళిపో. మీరెవరితోనైనా తగవుపెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది.
72. భయపడవద్దు. నేను నీతోనే ఉంటాను. నన్నెప్పుడు తలచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను.
73. నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో! నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు! నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో! అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను.
74. నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ప్రతిచోటా నన్ను దర్శించవచ్చు.
75. మనం ఇతరులకేదైనా చేయదలిస్తే వారి బరువుబాధ్యతలను స్వీకరించాలి.
76. నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి – నిష్ఠ (అనన్యమైన నమ్మకం), రెండవది – సబూరి (సంతోషంతో కూడిన ఓరిమి)
77. ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది?
78. నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను.
79. ఈ ప్రదేశం(శిరిడీ) జనులను చంపడానికి కాదు, వారిని కాపాడి తరింపజేయడానికే ఉన్నది.
80. ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను. రెండు ఇచ్చినవారికి ఐదు ఇస్తాను. ఐదు ఇచ్చినవారికి పది ఇస్తాను.
81. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది.
82. భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది.
83. నీవు నా వద్ద ఊరకే కూర్చో! చేయవలసినదంతా నేనే చేస్తాను!
84. మనము ఎవరి కష్టాన్నీ ఉచితంగా పొందకూడదు.
85. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు.
86. సద్గురువును తెలుసుకో! ఎందుకొచ్చినట్లు, పిడకలు ఏరుకోవటానికా?
87. నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు.
88. బాబా అంటే ఈ మూడున్నర మూరల దేహమేనని అనుకుంటే నువ్వు నన్నసలు చూడనట్లే! నీ జీవితపర్యంతం నువ్వు నా ప్రక్కనున్నా ఉపయోగం లేదు.
89. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు లోటు ఉండదు.
90. నాపై నీ దృష్టి నిలుపు, నేనూ నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
91. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ, కేవలం నన్నే నమ్ముకొనివుంటారో వారికి నేను ఋణగ్రస్తుడను. వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను.
92. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు.
93. నేను అందరి హృదయాలను పాలించువాడను, అందరి హృదయాలలో నివసించువాడను.
94. నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే. ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు. అది సరే! కానీ నా మాటేమిటి? నేనెప్పుడూ నీతోనే ఉన్నాను కదా! నీవు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా?
95. నేనే వివిధరూపాల్లో ప్రపంచమంతటా సంచరిస్తున్నాను. పిల్లులేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి, అన్నీ నేనే! ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు.
96. నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడచిరా! వేటినీ పిలనొద్దు! తరమొద్దు! ‘తినడానికి ఏ జంతువొచ్చింది’ అన్నదాని గురించి అసలు ఆలోచించనేవద్దు! అలా చేస్తే రోజూ లక్షలాది అతిథులను ఆదరించినట్లే!

97. జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి. కూడా వచ్చినవాళ్ళను వదిలిపెట్టి ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. అందువల్లనే, పువ్వును పరిమళం వదలనట్లు కల్పాంతం వరకూ వదలకుండా కలిసివుండేవారినే తోడు తెచ్చుకోవాలి.
98. నన్ను నీ హృదయంలో నిలుపుకో! బుద్ధిని, మనస్సును ఏకం చేయి! అది చాలు!
99. అతిథి అంటే అయిదున్నర అడుగుల మానవుడేననీ, అందులోనూ బ్రాహ్మణుడేననా నీ భావం? వేళకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణియైనా సరే, పక్షైనా, పురుగైనా అతిథే!
100. ఏ కోరికా లేకుండా శిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు! వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు!
101. ఎప్పుడైనా, ఎవరైనా నీ దగ్గరకు భిక్షకుగానీ, మరే సహాయాన్ని ఆశించిగానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అదీ నెమ్మదిగానే చెప్పు. అంతేగానీ, ఎవరినీ ఎప్పుడూ కసరవద్దు, తిట్టవద్దు.
102. ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడు.
103. శిరిడీలో ఎక్కడ కొన్నా అది నా స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమే!
104. నా మాట విను! జన్మకుండలిని చుట్టచుట్టి అవతలపారెయ్! జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు! నాపై విశ్వాసముంచు!
105. భక్తితో మీరు ఏమి చేసినా నాకు ఇష్టమే!
106. గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే!
107. మహారాజు పదవికంటే పేదరికం శ్రేష్ఠం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యంకంటే పేదరికం లక్షరెట్లు శ్రేష్ఠం. అల్లా పేదల బంధువు.
108. నేనెవరిమీదా కోపించను. మీరంతా నా బిడ్డలు. నాకెవరిమీదా ఎప్పుడూ కోపం రాదు. నేను ఆశీర్వదిస్తున్నాను.
109. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో, వారికి అంతా మంచే జరుగుతుంది.
110. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతుంటాను. వారిని కాపాడటానికి వేయి చేతులను ఉపయోగిస్తాను.
111. అడిగినవారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కానీ నా మాటలు చెవినబెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరచిపెట్టి ఉంచాను. కానీ ఆ సంపదను తీసుకునిపోయేవారే లేరు. ప్రజలు ఊరికే నా వద్దకొచ్చి ‘ఇవ్వు, ఇవ్వు’ అంటారు. నేను తీసుకోమంటాను. కానీ తీసుకునేవారే లేరు.
112. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకుంటే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానమివ్వు. లేకుంటే నా నామాన్ని స్మరించి అక్కడనుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు.
113. ఎవరినీ నీ విరోధిగా అనుకోకు. ఎవరు ఎవరికి విరోధి? ఎవరిపైనా విరోధభావం పెంచుకోకు. అందరూ ఒక్కటే!
114. భక్తులకు ఐహికంగానూ, ఆముష్మికంగానూ లాభం చేకూర్చడానికే మహాత్ములున్నది. నీ ప్రాపంచిక వ్యవహారాలను ఆనందంగా నిర్వర్తించుకో! కానీ భగవంతుని మరువకు!
115. నాకు సంబంధించినవారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి, వారెంత దూరానవున్నా సరే, రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను. ఎవరూ వారంతటవారుగా నా దగ్గరకు రారు.
116. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గము అసామాన్యము. మిక్కిలి విలువైనది. కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. చేసేవాడూ, చేయించేవాడూ అన్నీ ఆ దైవమే. ఆయన దయవుంటే దుర్లభమైన కార్యాలు కూడా సులభసాధ్యమౌతాయి. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు.
117. గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి, అర్థము చేసుకొని, ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహములేని ఉత్త పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము.
118. ఆకలిదప్పులు మరచి, నా పంచప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను. వారి సన్నిధి నుండి ఎవరూ రిక్తహస్తములతో బయటకు పోరు. నా ప్రతిభకంతటికీ కర్త నా గురువే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే.
119. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరచి, నా నామమునే స్మరిస్తూ, నా పూజనే చేస్తూ, నా లీలలను, చరిత్రను మననము చేస్తూ, ఎప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనువారిని ప్రాపంచిక విషయాల నుండి బయటపడేసి, రోగములను నివారించి, మరణము నుండి బయటకు లాగి ఆనందమును ఇచ్చెదను.
120. ఎవరైనా సరే, ఎవరిని గురించైనా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్నే గాయపరచినట్లు.
121. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములుగానీ, అష్టాంగయోగములుగానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము.
122. నా భక్తుణ్ణి నేనెన్నటికీ పతనం కానివ్వను. నా రెండు చేతులూ చాచి అతన్ని ఆదుకుంటాను.
123. మానవుడిచ్చినదేదీ మనకు భగవంతుడిచ్చినదానితో సరికాదు.
124. నీవెక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత ఉంటాను.
125. మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడేవారి సాంగత్యానికి దూరంగా ఉండు.
126. గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్నపానీయాలు.
127. అన్నీ నావే; అందరికీ అన్నీ ఇచ్చేది నేనే!
128. ‘సాయి, సాయి’ అను నామమను జ్ఞప్తియందు ఉంచుకున్నంత మాత్రాన, చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి.
129. ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు.
130. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను.
131. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను.
132. నీవు చూచేదంతా కలిపితే నేను. నేనే దైవాన్ని. నేను సర్వత్రా ఉన్నాను.
133. ఎవరైతే నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడూ ‘సాయి, సాయి’ అని స్మరిస్తూ, నాయందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు.
134. మీరు ఎక్కడున్నా సరే, భక్తిభావంతో నావైపు మళ్ళితే నేను మీ భక్తిశ్రద్ధలననుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నప్పటికీ మీరు సప్తసముద్రాలకవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయమే నా నివాసం.
135. ఈ మసీదుమాయి బిడ్డలు ఏ ఆపదకు భయపడవలసిన పనిలేదు. నన్నెవరైతే స్మరిస్తారో వాళ్ళపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ చెంత నేనెప్పుడూ తిరుగుతూ ఉంటాను. పిలిస్తే పలుకుతాను.
136. మనకిద్దరికీ ఋణానుబంధముంది. మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి. అందువల్ల మనిద్దరి మధ్య భేదం లేదు.
137. హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్యశరణాగతి వేడుము. భక్తితో వారి పాదములు మ్రొక్కుము. నీకు మేలు జరుగును.
138. నేనుండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో! అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
139. సర్వవ్యాపియైన గురువే దైవం. గురువు యొక్క గొప్పతనము తెలిసినవారు ధన్యులు. ఏమైనా కానీ, గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు. సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో!
140. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన అది వ్యర్థమయిపోవును. గత జన్మలో నీవు ఇచ్చియుంటేనే గానీ నీవిప్పుడు అనుభవించలేవు. కావును ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరియైన మార్గము.
141. మీ దగ్గరకు ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తుపెట్టుకోండి. మీకు వారితో గల కర్మసంబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు.
142. నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాలపాటు కూర్చున్నాను. నేను ఎక్కడున్నాసరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవారు, రక్షించేవారు.
143. నావాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను!
144. నిన్ను నువ్వు చూసుకో! అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు! దానికి అనుగుణంగా నడుచుకో! అదే నీ గురువు!
145. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది.
146. అందరియెడలా దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు.
147. కష్టము వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు! భగవంతుని ప్రార్థించు! సద్గ్రంథ పారాయణ చేయి!
148. వృథాగా చింతించకు. నీ దురదృష్టం ఇప్పటినుండి తొలగిపోయింది. నీ మనోభీష్టాన్ని అల్లా నెరవేర్చుతాడు.
149. లభించినదానిని అనుసరించి ప్రవర్తించండి! ఎప్పుడూ తృప్తిగా ఉండండి! లేనిదానికై చింతపడకండి!
150. నా భక్తుల కొరకు నేను బాధపడతాను. నా భక్తుల కష్టములన్నీ నావే! నా భక్తులను నేనెన్నటికీ పతనం కానివ్వను. ఈ విషయంలో సందేహం వద్దు!
151. మంచిగానీ, చెడుగానీ నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకారరహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును.
152. ఋణము, శత్రుత్వము, హత్యచేసిన దోషము చెల్లించియే తీరవలెను. వాటిని తప్పించుకొను మార్గము లేదు.
153. నా గురువు నా నుండి ఇతరమేమియు ఆశించలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలయందు కాపాడేవారు. నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించేవారు.
154. నా యందు అత్యంత ప్రీతిగలవారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్నచోట నేను ఎల్లప్పుడూ తిష్ఠవేసుకుని ఉంటాను.
155. నీవు ధైర్యం వదలకు. ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంటిలో కూర్చో! నిర్భయంగా, నిశ్చింతగా ఉండు! నా మీద విశ్వాసముంచు!
156. దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం. చూడు! నిజంగా నేను ఏమీ చేయనూ లేదు, చేయించనూ లేదు. కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. చేసేవాడూ, చేయించేవాడూ అనంతుడొక్కడే! కృపావంతుడూ ఆయనొక్కడే! నేను దేవుడినీ కాను, ఈశ్వరుడినీ కాను. నేను వారి దీనుడనైన సేవకుడను. ఎల్లప్పుడూ వారిని స్మరిస్తాను.
157. నీవు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో!
158. శిరిడీకి నేనందరినీ పిలుస్తాను. కానీ, రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు.
159. పుస్తకజ్ఞానం ఎందుకూ పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను.
160. గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏదీ, నా దగ్గర కూర్చుని చదువు, చూస్తాను!
161. ప్రతివాడూ, ‘బాబా నీకు తెలియనిదేమున్నది?’ అంటాడే కానీ, చెప్పినట్లు వినేవాడు ఎవడూ లేడు!
162. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనుంటాను. భయం వద్దు.
163. మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచినవాటిని అడగండి. మీ సంశయాలను తీర్చుతాను.
164. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది.
165. మనం ఈరోజు చనిపోయినా, మామూలుగానే మూడవరోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైనవాటివల్ల ఏమిటి ప్రయోజనం?
166. ఇది బ్రాహ్మణ మసీదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన నడిపించి చివరికంటా గమ్యం చేరుస్తాడు.
167. ఈ ఆధ్యాత్మ మార్గము ఎంతో కష్టము. శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే గానీ ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం.
168. నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు. నీ సంగతి నేను చూసుకుంటాను.
169. నా స్థానం ఒక్క శిరిడీలోనే లేదు, నేను దేశకాలాలకు అతీతుణ్ణి.
170. ఎవరి శ్రమభారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. కానీ, ‘ఎవరి శ్రమనూ ఉచితంగా తీసుకోరాదు’ అనే నియమాన్ని పాటించాలి.
171. నేను అంతటా ఉన్నాను. అంతకుమించి అతీతంగానూ నేను ఉన్నాను. నీ దృష్టి ఎక్కడపడితే అక్కడ నేను ఉన్నాను.
172. నా భక్తులను ధనం ఆకర్షించదు. వారు ద్రవ్యప్రలోభంలో చిక్కుకుపోకూడదు.
173. భయపడకు! ఈ మసీదులో కాలుపెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే! ఇక్కడి ఫకీరు దయామయుడు.
174. కొందరెంత దొంగలో! పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనుక వాళ్ళే విమర్శిస్తారు.
175. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు శిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది?
176. ఎంతోకాలం నుండి నాతో కలిసివున్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
177. నన్ను నమ్ముకోమని మీవాడికి చెప్పు! జాతకాలు, జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలను అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను! ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను! తప్పక పాసవుతాడు!
178. గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధనాలు విడిపోతాయి.
179. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను.
180. నా లీలలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును.
181. ఇంద్రియాలతో పనిచేస్తున్నా మనసులో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి.
182. నా మాటల అర్థం నీకు సరిగ్గా బోధపడటం లేదు. నేను చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించి జాగ్రత్తగా ఆచరించు.
183. నేను భగవంతుని సేవకుడను. భగవంతుని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని.
184. నేను ఎవరినుండైనా ఒక్క రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పదిరెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడూ ఏదీ ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూపినవారినుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి, తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు.
185. మీ మీ ప్రదేశాలలో కూర్చుని నన్నడగండి. ఊరికే అరణ్యాలలోనో లేదా ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటమెందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసముంచండి.
186. జ్ఞానమార్గం రామాఫలం వంటిది. భక్తిమార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధురరసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది.
187. ఈ మసీదుమాయి ఎంతో దయాళువు. ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ. కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది?
188. నీవు చూచేదంతా కలిపితే నేను. నేనే దైవాన్ని. నేను సర్వత్రా ఉన్నాను.
189. రాముడు, రహీము ఒక్కరే! వారిలో కించిత్తైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకమెందుకు? భక్తులలో వైరమెందుకు? పసివారిలా మీరెంత అజ్ఞానులు! హిందూ ముసల్మానులను స్నేహబంధంతో కలపండి.
190. మీరు కించిత్తైనా దిగులుపడకండి. ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి. మరణం వరకూ ఏ చింతా పెట్టుకోకండి.
191. ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకుముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా, విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా, చెడు ఆలోచనలకు బద్ధులై ఉన్నారు.
192. ఇతరులన్నవి పట్టించుకోవద్దు. నీ అనుభవాన్నే అంటిపెట్టుకో!
193. ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచనాతరంగాలు శాంతించాయా? విశ్వాసంతో సహనం కలిగివుండేవారిని శ్రీహరి తప్పక రక్షిస్తాడు.
194. రేపు ఒకనాటికి చావబోయేవారు కూడా (ఈరోజు) ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు.
195. పంది మలాన్ని ఎంత ప్రీతిగా తింటోందో చూశావా? సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే! క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక శిరిడీయాత్ర వలన మనకేం ప్రయోజనం?
196. బుద్ధిపుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక, తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదనీ, దానిపై తనకెట్టి అధికారమూ లేదనీ తలచి చేసేదే నిజమైన సేవ. అట్టివాడే నిజమైన శిష్యుడు.
197. నీవు నిత్యమూ సద్గ్రంథ పారాయణ, నామజపము చేయి!
198. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరునియందు మనసు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖపర్యంతమూ అహర్నిశలూ నీ మనసులో నిలుపుకో! నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవక, సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది.
199. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వం, ఋణం – వీటి ఫలితం అనుభవించక తప్పదు.
200. నిన్ను దయతో సప్తసముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు!
201. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ నా ప్రభువు ఇవ్వసాగితే కల్పంతం వరకూ ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క నా ప్రభువే! వారితో ఇతరులెవరు సరితూగగలరు?
202. నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పజెప్పాడు. వాళ్ళ మంచిచెడ్డలు, వాళ్ళ తరింపు నా బాధ్యత.
203. నేను అహర్నిశలూ నా మనుషులను గూర్చి చింతిస్తుంటాను. ఎవరెలా చేసుకుంటే అలా అనుభవిస్తారు.
నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు.
204. నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్యశరణాగతి వేడుము. నీకు మేలు జరుగును.
205. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను.
206. నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెడుతున్నాను. నీకేమి కావాలో కోరుకో!
207. నేనెవరినీ మధ్యలో విడువను. చివరికంటా గమ్యం చేరుస్తాను.
208. ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దు. భోజనం చేసి వెళ్ళండి.
209. బాధపడకు! ప్రతిరోజూ నేను నీ పేరు తలచుకుంటూ ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు బాధపడతావు?
210. ఇక్కడికి (శిరిడీకి) రావడానికి ఎందుకంత ఆరాటపడతావు? మనకు చాలా పనులున్నాయి. నీవు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు. నేను నీ దగ్గరే ఉంటాను.
211. నీకు అసాధ్యమనిపించేది నేను సాధ్యం చేస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను.
212. ప్రాణాయామం ద్వారా సాధనచేసేవారు కూడా చివరికి ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే!
213. వాళ్ళు పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలని అనుకుంటున్నారు. కానీ, ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలను చదవనక్కర లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో! బుద్ధిని మనసును ఏకం చేయి, చాలు!
214. (బాబా తమ దేహాన్ని ఉద్దేశిస్తూ) ఇది నా ఇల్లు, నేనిక్కడలేను. నా ముర్షద్ (గురువు) నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు.
215. నీవెక్కడున్నా నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను.
216. పూచికపుల్లనైనాసరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో అంటిపెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావు.
217. ఇది నీ స్వంత ఇల్లు. నేను మాత్రమే ఇక్కడ ఉంటాను. తరచుగా ఇక్కడికి వస్తూ ఉండు. సరేనా!?
218. నీకేది అవసరమైనా నన్ను అడగటానికి సంశయించకు!
219. నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు. అల్లా భలా కరేగా!
220. భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు. ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు!
221. చెడుమాటలతో ఎవరినైనా బాధపెడితే నన్ను బాధపెట్టినట్లే! కానీ, ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరచినట్లు!
222. ప్రపంచమున మీకు ఇష్టమొచ్చిన చోటుకు పోవుము. నేను మీ చెంతనే ఉంటాను. నేను మీ శరీరంలోనే ఉన్నాను. నా నివాసస్థలము మీ హృదయమునందే కలదు.
223. హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్యశరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. ఇట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు.
224. శిరిడీ నుండి ఎవ్వరూ ఒట్టిచేతులతో తిరిగి వెళ్ళరు.
225. నా భక్తుల కొరకు నేను బాధపడతాను. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తులను నేనెన్నటికీ పతనం కానివ్వను. ఈ విషయంలో సందేహం వద్దు!
226. మీ ఆలోచనలు, మీరు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నేనెప్పుడూ మీ చెంతనే ఉండి పిలచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే!
227. నాకు శరణుపొందండి. మీ భారాన్ని నేను వహిస్తాను. నాకు పగ్గాలు అప్పగించండి, నేను మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను.
228. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను.
229. నా భక్తుల మీద నా అనుగ్రహం తప్ప ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు.
230. నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిది.
231. ఏ విధంగా గోదావరినది తనను చేరిన జలాలను సముద్రానికి చేరుస్తుందో అలాగే నేను మీ నమస్కారాలను నా గురువుకే అందేటట్లు చేస్తాను.
232. నేను నీలోనే ఉంటాను. భయం వద్దు. నిన్ను రక్షించడానికే నేనున్నాను.
233. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టివానిని నీవెల్లప్పడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.
234. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నది సాగరంలో లీనమైనట్లుగా నాలో లీనమవుతారు.
235. నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగ నన్ను శరణుజొచ్చినవారితో నా సమాధి కూడా మాట్లాడును, వారి వెన్నంటే కదులును. నేను మీ వద్ద ఉండనేమోనని మీరు ఆందోళనపడవద్దు. నా ఎముకలు మాట్లాడుచూ మీ క్షేమమును కనుగొనుచుండును.
236. గమ్యాన్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. ఇక్కడ (శిరిడీ) నుండి కూడా ఒక మార్గముంది. ఈ మార్గం ప్రయాసకరమైనది. అయితే మార్గదర్శి (సద్గురువు) తోడుంటే సునాయాసంగా గమ్యాన్ని చేరుకోవచ్చు.
237. నాకు వారసులెవరూ లేరు. నన్ను ఆశ్రయించినవారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను.
238. ప్రేమ, వినయములతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు!
239. రెండువేల పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి.
240. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైనవారి శరీరవ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను.
241. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వం చూడు.
242. నీకింక ఎవ్వరితోనూ పనిలేదు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంతటి చక్కని భవిష్యత్తు మరింకెవ్వరికీ లేదు.
243. నన్ను కనిపెట్టుకుని ఉండు! నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళు. కానీ, రాత్రి ఏదో ఒక వేళలో ఒకసారి వచ్చి నా గురించి విచారించుకుంటూ ఉండు!
244. నిన్ను కాపాడటానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు!
245. నాకు, నా ఫోటోకు భేదం లేదు!
246. నీవేం భయపడవద్దు. నీ చావుచీటీ చింపేశాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది.
247. తండ్రికి తగ్గ బిడ్డలు కండి!
248. నన్ను చూడటానికి ఎందుకు ఇంతదూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను.
249. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నీవు శిరిడీ రావలసిన అవసరం లేదు.
250. భూమి విత్తును ధరిస్తుంది. మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. (అయినా) విత్తనాలు మొలిచినందుకు ఇవేవీ సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవూ అలానే చలించకూడదు. ఇక దుఃఖమెక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి.
251. అల్లామాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా, ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది.
252. నీకు, నాకు మధ్యనున్న గోడను పూర్తిగా పడగొట్టేసేయి. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి
ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది.

253. నీవు మానవుడవు గనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ, అందమైన దేవాలయాలెన్ని లేవు? మనం బాహ్యసౌందర్యాన్ని గాక లోపలనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇదెప్పుడూ మరువకు.
254. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్యాబిడ్డలు వీరి మోహం నుండి బయటపడినవారే నా
చరణాలయందు భక్తి కలిగివుంటారు.
255. కామాన్ని జయించనివాడెవడూ దైవాన్ని చూడనైనాలేడు. ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు
నిలుపు. (అదే ధ్యానం.) అలా చేస్తే గమ్యం చేరుతావు.
256. మీ శక్తికొలదీ మీరు చేస్తూ, ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి.
257. అందరూ భగవదంశలే! అందువల్ల ఎవరూ ఎవరినీ ద్వేషించకూడదు. అందరిలోనూ ఈశ్వరుడు వసిస్తాడు. ఇది మరువవద్దు.
258. నీవెప్పుడూ ఆకలిగొన్నవారికి అన్నం పెడుతూ ఉండు.
259. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఇవ్వవద్దు. కానీ, వారిపై కుక్కలా అరవకు.
260. ఘడియ అయినా వ్యర్థం చేయక హరి యొక్క, గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగివున్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు.
261. ఏం బాధపడకు. బుద్ధిమంతులు కలవరపడరు. శిరిడీలో అడుగుపెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది.
262. లోకులు పలుగాకులు. నీ మానాన నీవుండటం మంచిది.
263. మంత్రంగానీ, మరే ఉపదేశంగానీ ఎవరి వద్ద నుంచీ పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది.
264. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు. నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లా మాత్రమే ఉన్నారు.
265. నేను భగవంతుని బానిసను. సర్వమూ చేసేది, భక్తులను రక్షించేది ఆ భగవంతుడే.
266. నీవు వెళ్ళిన చోట నేను లేనా? నీకు భయమెందుకు?
267. ఎవరైతే ధైర్యంగా నిందను, దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్టులు.
268. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోతుంది. నాయందు పూర్తి విశ్వాసముంచు, నీవు త్వరలో కృతార్థుడవౌతావు.
269. మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి. యోగ్యమైనదానిని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది.
270. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ననుసరించి ఎక్కడైనా, ఎలా అయినా ప్రకటమవుతాను.
271. నా స్మరణ చేసేవారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రంగానీ, రైలుబండిగానీ, విమానంగానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రత్యక్షమవుతాను.
272. నాకు పేరు లేదు, ఊరు లేదు, నేను నిర్గుణుడను. కర్మవశాన ఈ శరీరం ధరించాను. ఇదే నా ఉనికి.
బ్రహ్మ నాకు జన్మనిచ్చినవాడు. మాయ నా తల్లి. వారి సంయోగం వల్ల నాకు ఈ శరీరం ప్రాప్తించింది.
273. నీ ప్రారబ్ధంలో నీకు సంతానమెక్కడిది? నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను.
274. నా ధనాగారం పూర్తిగా నిండివుంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను. కానీ, పుచ్చుకునేవారి తాహతును చూచి వారు స్వీకరించగలిగినంతే ఇస్తాను.
275. నీవేం చేయలేకపోతే ఊరకే కూర్చో! నేను స్వయంగా నీ వెంట ఉండి, టికెట్ తీసిచ్చి, రైలుబండిలో
ఎక్కించి, దారిలో ఏ ఆటంకం లేకుండా చూస్తూ నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
276. కళలను భక్తిప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదు.
277. వస్తా, వస్తా అనుకుంటూ ఇవాళ వచ్చావు. నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు. నీవు కృతార్థుడవు అవుతావు.
278. నీవుండే చోటికి ఎవరైనా వస్తుంటారా? ఎవ్వరూ రాకపోతే పోయిందిలే, నేను వస్తుంటాను.
279. నావైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అట్లాగే చూస్తాను. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో వారు ధన్యులు.
280. నేను అనుగ్రహించేదేదో ఇంతకుముందే అనుగ్రహించాను. ఇక ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేదేముంది?
281. సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదు. ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతమంటే.
282. ఇతరులకు చెప్పడానికి మనమెవరం? దానివలన మనలో అహం బలపడుతుంది.
283. నన్ను మరచినవారిని మాయ శిక్షించును. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగానీ,
బాధగానీ కలుగదు.
284. నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి.
285. నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి పటికబెల్లం వలే అవుతుంది. నీ
మనసులోని కోరికలు, సంశయాలు తీరుతాయి.
286. జీవులన్నీ సమానం. అన్నింటియందూ అహింసాభావం ఉండాలి. పాముగానీ, తేలుగానీ అన్నిటికీ అధిష్ఠానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్నైనా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు.
287. సర్వజీవులలోనూ నన్ను దర్శించేవారే నాకు ప్రీతిపాత్రులని తెలుసుకో!
288. నీవు చాలా ఆతురతగా ఉన్నావు. నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు.
289. నేను అల్లాను ప్రార్థిస్తున్నాను. వారు తప్పక నీ కోరిక తీరుస్తారు.
290. ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు?
291. ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు. కడుపు నిండింది. గొంతువరకు తిన్నాను. ఎంతో వ్యాకులపడుతున్న
ఈ ప్రాణాలను నీవు తృప్తిపరచావు. రోజూ ఇలాగే చేస్తూ ఉండు.
292. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకింకా త్రేనుపులు వస్తున్నాయి.
293. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి. నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలూ ఉండవు.
294. నువ్వేం చింతపడకు. నీకు బోలెడన్ని రూపాయలనిస్తాను. నావద్ద నిశ్చింతగా కూర్చో.
295. నన్ను అనన్యంగా భజించేవారి, నిత్యమూ పవిత్ర మనసుతో నన్ను సేవించువారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం. ఇక్కడ అన్నవస్త్రాలకు కొరత ఉండదు. వానికొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి.
296. ఇతరులన్నవి పట్టించుకోవద్దు. నీ అనుభవాన్నే అంటిపెట్టుకో!
297. ఎవరైనా మన సహాయం అర్థిస్తే తప్పక చేయడంగానీ లేదా చేయించడంగానీ మన ధర్మం.
298. అటువంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టు. నీవేమిటో నాకు పూర్తిగా తెలుసు. నేనెవరో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది. గతంలోనూ, ఇప్పుడు కూడా నేను నీవెంటే ఉన్నాను. మంచిగానీ, చెడుగానీ గతంలో నీవు చేసిన పనులన్నింటికీ నాదే పూర్తి బాధ్యత.
299. ఏమిటి, ఒకటి రెండు రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను పన్నెండు సంవత్సరాలు కేవలం
వేపాకు తిని జీవించాను.
300. రండి! బస్తాలకొద్దీ ఊదీ మోసుకుపోండి! ఈ మసీదుతల్లి భాండాగారాన్ని బండ్లకొద్దీ తీసుకుపోండి!
301. మేము ఎన్నో కష్టాలకు ఓర్చాము. నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము. వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాము. శరీరం శుష్కించి, ఎముకలు కూడా నిలువలేని స్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని కృపవలన
ప్రాణం పోలేదు.
302. నీవు నావాడివి. క్రొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము.
303. నేనంటే కేవలం ఈ దేహమేననుకుంటున్నావు. భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలుపడానికే నిన్నిక్కడకు పంపాను.
304. శిరిడీలో స్థిరపడండి. మీకు ఏ లోటూ రాదు.
305. నీవు అర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి.
306. నీ డబ్బెక్కడికీ పోదు! ప్రశాంతంగా కూర్చో! అదే వస్తుంది.
307. నీవు నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు. నీ సంగతి నేను చూసుకుంటాను.
308. నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ ‘బాబా, బాబా’ అన్న ఇతడి కేకలే!
309. ఒక్క అడుగు నావైపుకేస్తే పది అడుగులు నీవైపుకేస్తాను.
310. నీవు నన్ను గుర్తించలేదు. కానీ, నిన్ను గురించి మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు. గత ఎన్నో సంవత్సరాలుగా నీ గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను.
311. ఎవ్వరి గురించీ తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది.
312. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి.
313. బెదిరించటం వల్ల ప్రయోజనం లేదు. అది మంచిది కాదు. మనమెందుకు బెదిరించటం? భగవంతుని ఉన్నతాధికారులు అంతటా ఉన్నారు. వారు ఎంతో శక్తిమంతులు.
314. ఇతరుల దోషాల గురించి మాట్లాడటంగానీ, ఆ మాటలు వినడంగానీ మంచిది కాదు.
315. అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి. అనుభవించవలసిన కర్మ పూర్తికాకపోతే మరోసారి
జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో! ఆత్మహత్య చేసుకోకు.
316. నువ్వు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు ఋణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి.
317. నేనేం చేసేది? నా దగ్గర ఏముంది? ఎవరూ నేను చెప్పినట్లు వినరు.
318. నాకు కావలసింది నిష్ఠ-సబూరీ. నీవు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకునివుంటే నేను నీవెంటే ఉంటాను.
319. ఏ భయలూ మనసులో పెట్టుకోక నా వద్దకు రా!
320. ఇదే నా హెచ్చరిక! నువ్వు త్రాగుడు మానాలి. లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను!
321. వీడెంత టక్కరి! ఒకవంక భజన చేస్తూనే నా గురించి ఇతరులను అడుగుతాడు. ఏదైనా మనమే చూసి
తెలుసుకోవాలి.
322. ఏమనుకుంటున్నావ్? ఈ ఇంటికి యజమానిని నేనే!
323. నా భక్తులకు ఇహపరశ్రేయస్సు చేకూర్చడానికే నేను వచ్చాను.
324. నీవు వేల మైళ్ళ దూరాన ఉన్నా చివరిక్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను.
325. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవటం మంచిది.
326. చింతించవద్దు! వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో! నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బు వెంటనే
తగ్గిపోతుంది.
327. నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు
కోరుతున్నారు.
328. నీ తల్లిదండ్రుల మాటలు విను! మీ అమ్మకు పనులలో సాయం చేస్తూ ఉండు! ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు!
329. ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది?
330. నువ్వు ఇక్కడ ఉండొద్దు. శిరిడీ వచ్చేయి. శిరిడీలో ఎంతో ఆనందం ఉంది.
331. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నీ లోపల, వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను.
332. నేను మీ తండ్రిని. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాలి.
333. నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడతారు?
334. పారాయణ ప్రారంభించు. ఈ మసీదుతల్లి నీకు తప్పకుండా సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు.
335. హృదయవేదనతో తెచ్చినవాటిని నేను స్వీకరించను.
336. ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా! ఇదే సాక్షాత్కారం! నేనే భగవంతుణ్ణి!
337. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను నా భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమకోసం తపిస్తూ, నా
భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను.
338. ఎవరైతే నా సన్నిధికి వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను.
339. వాదోపవాదాలను, చర్చలను తర్కశాస్త్రానికే విడిచిపెట్టండి. వాటివల్ల ఫలితం శూన్యం. నిష్కళంకమైన
భక్తిమార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు.
340. నా నామస్మరణ చేయువారి చెంతనే నేను ఉంటాను.
341. ప్రపంచ గౌరవము అందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును
నిలుపుము. సమస్త ఇంద్రియములను, మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము.
342. సదా నన్ను గుర్తుంచుకో! హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు! అప్పుడు నీకెంతో మేలు
చేకూరుతుంది!
343. ఏమీ భయపడకు, నేనెప్పుడూ నీ ఇంటికి కాపలా కాస్తూ ఉన్నాను.
344. వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించు. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను.
345. వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం పాపం. ఆచరించిన ధర్మమంతా వృధా అవుతుంది.
346. నా లీలలను రచిస్తే అజ్ఞానదోషం తొలగిపోతుంది. నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై
ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి, ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల
మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి.
347. నీవు కేవలం నిమిత్తమాత్రుడవే! నా లీలలను నేనే వ్రాసుకుంటాను. నా చరిత్రను శ్రవణం, మననం, సంకీర్తనం చేస్తే అవిద్యాదోషం నశిస్తుంది. అజ్ఞానం తొలగిపోతుంది.
348. నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలూ ఉండవు. నన్ను మరచిపోయినవారిని మాయ కొరడాలతో కొడుతుంది.
349. పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితులలోనూ అప్పు చేయవద్దు!
350. నా ఫోటో ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను. నాకు, నా ఫోటోకు భేదం లేదు.
351. ఈ మసీదును ఆశ్రయించినవారి చెడుకాలం అంతరిస్తుంది. ఈ ద్వారకామాయిలో అడుగిడినవారి
జీవితనౌక సురక్షితంగా ఆవలితీరానికి చేరుకుంటుంది. దీన్ని గుర్తుంచుకోండి. ఇక అన్ని చింతలూ మరచిపొండి.
352. నీ అనారోగ్యం గురించి ఎందుకంత భయపడుతున్నావు? పుండ్లు నయమవుతాయి. శిరిడీ వెళ్ళి గ్రంథ పఠనం చెయ్యి!
353. ఏడవకు! నేను ప్రతిరోజూ నీ పేరు తలచుకుంటూ ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు ఏడుస్తావు?
354. ఏడవకు! నేను నీకేమైనా అపకారం చేశానా? నువ్వు నన్నెందుకు విసిగిస్తున్నావు? నేను నీకు ఎన్నో ఇచ్చాను. ఇంకా చాలా ఇస్తాను. అల్లా నీ కోరికలు నెరవేర్చి సప్తమహాసముద్రాల సంపదకు సమానమైన ఆనందాన్ని ఇస్తాడు. నువ్వెందుకు భయపడతావు?
355. ఏం చేస్తాం? కాలిపై బిడ్డ మలవిసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలిని నరుక్కుంటామా? సహించవలసిందే కదా!
356. నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవా? ఇక్కడకు వచ్చి నన్ను చూడాలని ఎందుకంత ఆరాటపడుతున్నావు?
357. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు. లక్షల వెంట పడకు.
358. అమ్మా! నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? నా భావూ వేలమైళ్ళ దూరాన ఉన్నా నేనెన్నడూ అతనిని
మరచిపోను. అతను లేకుండా నేను ఎప్పుడూ ఏదీ తినను. భవిష్యత్తులో కూడా అలా చేయను, నా చిన్ననాటినుండి నేను అతనితో, అతనికి దగ్గరలోనే ఉన్నాను. తన గురించి నువ్వసలు చింతించకు. అల్లా అతని క్షేమాన్ని చూసుకుంటాడు.
359. ఈ మసీదుతల్లి ఎంతో దయాళువు. ఈమెకు తన బిడ్డలపై అత్యంత ప్రేమ. కానీ, బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది?
360. మంచిది, రోజూ వెళ్ళి అందర్నీ ‘భోజనం చేశారా, లేదా?’ అని విచారిస్తూ ఉండు. అలా చేస్తే అల్లా నీకు మేలు చేస్తాడు.
361. ఇతనికి ఎవరినైనా వెంట తీసుకొస్తేగానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు. కానీ వీళ్ళిద్దర్నీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను.
362. నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలు అయింది. నేనెవరికి చెప్పుకోను?
363. నీ భార్య గురించి ఏమీ భయపడకు. ఆమె మరణించదు. నీళ్ళలో ఊదీ కలిపి ఆమెచేత త్రాగించు. ఒక గంటలో ఆమెకు నయమవుతుంది. మిమ్మల్నందరినీ నేను కాపాడుతూ ఉంటాను.
364. నా భావూ పిచ్చివాడైపోయాడు. అతను రాత్రిళ్ళు పడుకోడు, పగటిపూట విశ్రాంతి తీసుకోడు. నేను అతన్ని రక్షించాలి. అతను నా బిడ్డ.
365. నా భావూ అమాయకుడు, కల్లాకపటం లేనివాడు. ప్రజలు అతనిని వేధిస్తున్నారు. అయినా మంచి మనసున్న అతను ఎవరినీ నిందించకుండా, కనీసం ఒక్కమాటైనా మాట్లాడకుండా ఓర్పుగా అన్నీ భరిస్తున్నాడు. ఇవన్నీ నేను ఎంతకాలం చూడాలి? అతను ఇతరులను డబ్బు ఎందుకు అడగాలి? నేను అతనికి డబ్బిస్తాను. కానీ, అతనిప్పుడు నా మాట తప్పక వినాలి.
366. అమ్మా! ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజగది తలుపు తాళం వేసి ఉంది. నేనెలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ భావూ నాకు తినడానికేమీ ఉంచలేదు. నేను ఆకలితో తిరిగి వచ్చాను.
367. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు శిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది?
368. భావూ! రెండు మూడు రోజుల తరువాత ఇక్కడికి రా! కొద్దిసేపు నాతో మాట్లాడి, తర్వాత వెళ్ళు. నువ్విక్కడే ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళు, భయపడవద్దు. అల్లా మాలిక్ హై! నేను నీతోనే ఉన్నాను.
369. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము.
370. భావూ నా భక్తుడు. అతడు అంతటి భారాన్ని మోయలేడని నాకు తెలుసు. మరి అతన్నెందుకు పరీక్షిస్తాను? నేను అతనికి సహాయం చేశాను. ఇది పరీక్ష కాదు. నా భక్తుడి ఆనందం కోసమే నేనిలా చేశాను.
371. భావూ, నేనీరోజు భోజనానికి మీ ఇంటికి వస్తాను.
372. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున ‘నేను వేరు, తక్కిన జీవరాశియంతయు వేరు’ అనే ద్వంద్వభావమును విడిచి నన్ను సేవింపుము.
373. ఓ భగవంతుడా! ఇక వర్షాన్ని చాలించు! నా బిడ్డలు ఇళ్ళకు వెళ్ళాలి. వాళ్ళని సుఖంగా వెళ్ళనీ!
374. నువ్వు కూడా నా బిడ్డవే. నీకు ఏ లోటూ లేకుండా నేను చూసుకుంటాను. నీకు దేనికీ కొరత ఉండదు. ఎప్పుడూ ఉదారస్వభావంతో ఉండు. అప్పుడు అల్లా సంతోషిస్తాడు. అల్లాయే రక్షకుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకంటే మిన్న ఏదీ లేదు.
375. అల్లా అంతా చూసుకుంటారు. ఇలాంటి భర్త లభించినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నా మాటలు గుర్తుంచుకో! ఇతనిని ఎప్పుడూ నొప్పించవద్దు. ఇతను నావాడు.
376. బుద్ధిగా ఉండు. నువ్వు రావద్దు. వచ్చావో, కొడతాను జాగ్రత్త! మాటిమాటికీ ఎందుకిక్కడికి వస్తావు?
నీవెక్కడున్నా నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను. మూర్ఖుడిలా ఉండకు, అర్థంచేసుకో!
377. అన్నం మీద కొంచెం నెయ్యి వేసి, ధునికి కొంత సమర్పించి, మిగిలినది నాకు తీసుకొని రా!
378. లోపల స్వచ్ఛంగా ఉండాలి. కేవలం చర్మాన్ని తడిపితే ఏం ప్రయోజనం?
379. సర్వకర్తయైన దైవాన్ని శరణుపొంది, ఓరిమితో కర్మఫలం అనుభవించు. ఆయనెలా చక్కబెడతారో చూడు!
380. ఎవరైనా దైవసంకల్పితంగా తనకు నిర్దేశింపబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే, దానర్థం వేరెవరినైనా తీసుకోమని కాదు. ఎవరి అదృష్టాన్ని బట్టి వారికది లభించేలా భగవంతుడు ఒక నియమాన్ని ఏర్పరిచాడు. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు భగవంతుని చేత శిక్షింపబడతారు.
381. శిరిడీకి చాలారకాలైన ప్రజలు వస్తారు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం మొదలైన రకరకాలైన
కోరికలను నా నుంచి పొందటం కోసం వస్తారు. నేనెవ్వరినీ నిరాశపరచను. వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడూ కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు.
382. నువ్వెందుకు పారిపోతున్నావు? సరే, ఇలా నా దగ్గరకు రా! వచ్చి, నా వద్ద ప్రశాంతంగా కూర్చో!
383. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు! నీ రాక కోసం ఒకరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
384. మానవుడు మ్రొక్కులను చెల్లించి తీరాలి. లేకుంటే కష్టాలొస్తాయి!
385. నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియనివాడిలా మాట్లాడతావేం? వీరు నన్నేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరంకంటే వంశం నిలవదు. అంతకంటే, కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠను ప్రసాదిస్తాను.
386. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పనిని మనమే పూర్తిచేయాలిగానీ ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా శిరిడీ వస్తుండాలి.
387. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకూ పెరిగినట్లు నన్ను రోజురోజుకూ అధికంగా ఆరాధించేవారు, మనోవృత్తిని, కామక్రోధాది వికారాలను నాకోసం అర్పించినవారు ధన్యులు. దృఢవిశ్వాసంతో తమ గురువును ఆరాధించేవారికి పరమేశ్వరుడు ఋణపడివుంటాడు. అట్టివారిని ఎవరూ చెడుబుద్ధితో చూడరు. అలా ఘడియ అయినా వ్యర్థం చేయక హరియొక్క, గురువుయొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు.
388. నీ భక్తి ఫలిస్తుంది. నీకోసం నేను విమానాన్ని పంపి, దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళ్తాను. నీవు
నిశ్చింతగా ఉండు!
389. ఎందుకు చింతిస్తావు? మీ అమ్మాయి భాగ్యశాలి. గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వరుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు. నా మాట ప్రకారం మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.
390. అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తిచెందుతాడు.
391. ఖురాన్ (గ్రంథం) చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దు.
392. నా భక్తుల సత్సంకల్పాలను నేను నెరవేరుస్తాను.
393. మందిరం పూర్తికాగానే అందులో నేనే ఉంటాను. మనమంతా అక్కడే ఆడుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం.
394. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు?
395. నాకు దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలనిపిస్తే దక్షిణ ఇవ్వు!
396. డబ్బివ్వడం అతనికి శ్రేయస్కరం కాదు. చెబితే వినడు, కనుక అతని మేలు కోసమే నా వద్ద డబ్బు లేదని అబద్ధం చెప్పాను.
397. నీవు మానవుడవు గనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ, అందమైన దేవాలయాలెన్ని లేవు? మనం బాహ్యసౌందర్యాన్ని గాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇదెప్పుడూ మరువకు.
398. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడ కాలుమోపినవారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది
మీకు కూడా అనుభవమవుతుంది. ఇక్కడికి వచ్చి బాగుకాకపోవటం త్రిలోకాల్లో కూడా జరగదు. ఈ మసీదు
మెట్లెక్కినవారి లక్ష్యం నెరవేరినట్లేనని తెలసుకోండి.
399. నీవు పారిపోనక్కరలేదు. నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు.
400. ఆ పొడుగాటివ్యక్తి (సర్పం) తెలుసా? అది భయంకరంగా ఉంటుంది. కానీ అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించేవారి శక్తిముందు చంపేవారి శక్తి ఏపాటిది?
401. నీవు భాగ్యశాలివి. త్వరగా పెళ్ళాడు. భగవంతుని దయవలన నీకు పుత్రుడు పుడతాడు. నీ కోరిక నెరవేరుతుంది. ఇంకేమీ సందేహించవద్దు. భగవంతుడు నీకు అండగా ఉన్నాడు.
402. నేనెవరిమీదా కోపించను. మీరంతా నా బిడ్డలు. నేను ఎవరిమీద కోపించేది? నాకెవరిమీదా ఎప్పుడూ కోపం రాదు! నా గురువు ఎదుట నేనూ మీవంటివాడినే! అసలు ఎవరిమీదనైనా ఎందుకు కోపించాలి?
403. నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకున్న భూ వివాదం పరిష్కారమవుతుంది. నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు!
404. నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను!
405. నీ ప్రయాణమంతా నేను నీతోనే ఉన్నాను. ఇన్ని రోజులూ నేను నిన్ను చాలా సందర్భాలలో రక్షించాను.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo