సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి కాశీబాయి కనీత్కర్



కాశీబాయి 1861వ సంవత్సరంలో సంగ్లీ జిల్లా, అష్టే పట్టణంలోని ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమెకు తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు తనకంటే వయసులో 7 సంవత్సరాలు పెద్దవాడైన గోవింద్ వాసుదేవ్ కనీత్కర్‌తో వివాహమైంది. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా లేని కాశీబాయి తన భర్త ప్రోత్సాహంతో చదవడం, వ్రాయడం నేర్చుకోవడమేకాక అతికొద్దికాలంలోనే మరాఠీ, సంస్కృతం మరియు ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించి గొప్ప రచయిత్రిగా ప్రఖ్యాతిగాంచింది. కాల్పనిక మరియు వాస్తవిక కథనాలతో రచింపబడ్డ ఆమె నవలలకు అనేక ప్రశంసలు లభించాయి. ఆమె రచించిన డాక్టర్ ఆనందీబాయి జోషీ (యునైటెడ్ స్టేట్స్‌లో విద్యాభ్యాసం చేసిన తొలి భారతీయ మహిళా వైద్యురాలు) జీవితచరిత్రను వైద్యనిపుణులు, వైద్యవృత్తిలో రాణించాలనుకొనే విద్యార్థులు నేటికీ అభ్యసిస్తుంటారు. నిజానికి కాశీబాయి కుటుంబంలో ఎవరికీ అంతటి రచనా నైపుణ్యం లేదు. అది కాశీబాయికి భగవంతుడు ప్రసాదించిన వరం. కాశీబాయి పెక్కుమార్లు శిరిడీ దర్శన భాగ్యాన్ని పొందిన అదృష్టవంతురాలు. బాబా ఆమెపై ఎంతగానో ప్రేమను చూపిస్తూ గౌరవించేవారు. ఆమె తన ఆత్మకథలో తరచూ తన శిరిడీ సందర్శనల గురించి వ్రాసుకుంది.

1899లో ఒక ప్రమాదం కారణంగా కాశీబాయి కుమార్తె కృష్ణాబాయి అనారోగ్యం పాలైంది. ఆమె ప్రయాణిస్తున్న ఎద్దులబండి బోల్తాపడి, ఆమె తలకు గాయమైంది. వీలైనంత ఉత్తమ వైద్యం అందించినప్పటికీ ఆ గాయం నయం కాలేదు. ఆ గాయంవల్ల ఆమెకు తరచూ తలనొప్పి, మైకంతో పాటు ఇంకా అనేక ఇతర సమస్యలు వస్తుండేవి. ఇలా కొంతకాలం గడిచాక 1901లో కృష్ణాబాయి అహ్మద్‌నగర్‌లో ఉన్న తన అత్తమామల ఇంటికి తిరిగి చేరుకుంది. అక్కడ కూడా ఆమెకి మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితిలో ఏ మార్పూ లేదు. దాంతో బొంబాయి, పూణే, అలీబాగ్‌లలో కూడా వైద్యం చేయించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో ఒకసారి కృష్ణాబాయిని చూసుకోవటానికి కాశీబాయి, ఆమె కుటుంబం అహ్మద్‌నగర్‌ వెళ్లారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ వారిని కలిసి మాటల సందర్భంలో, “మీరు ఆమెను చికిత్స కోసం ఎన్నో ప్రఖ్యాత ఆసుపత్రులకు తీసుకొని వెళ్లారు. ఎంతోమంది వైద్యులను ప్రయత్నించారు. కానీ మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె ఆరోగ్యం కాస్తైనా మెరుగుపడలేదు సరికదా, రోజురోజుకీ అధ్వాన్నంగా తయారైంది. కాబట్టి నేను చెప్పేది వినండి. కోపర్‌గాఁవ్‌కి సమీపంలో శిరిడీ అనే గ్రామం ఉంది. అక్కడ సాయిబాబా అనే గొప్ప సత్పురుషులు నివసిస్తున్నారు. వారు ప్రసాదించిన ఊదీని కొద్దిగా నేను మీకు ఇస్తాను. బాబా ఊదీ సర్వరోగనివారిణి. ఆ ఊదీని అమ్మాయి నుదుటిపై పెట్టి, కొద్దిగా ఆమె నోటిలో వేయండి. బాబా అనుగ్రహంతో ఖచ్చితంగా ఆమె తాననుభవిస్తున్న కష్టం నుండి విముక్తి పొందుతుంది. అప్పుడు శిరిడీ వెళ్లి, బాబాను దర్శించి, వారికి మీ కృతజ్ఞతలు సమర్పించండి” అని చెప్పాడు. తరువాత బాబా యొక్క దైవత్వం గురించి, బాబా లీలల గురించి అద్భుతంగా వర్ణించాడు. అయితే, కృష్ణాబాయి అత్తమామలుగానీ, కాశీబాయి కుటుంబంగానీ నానాసాహెబ్ చెప్పింది నమ్మలేదు. అందువల్ల వాళ్ళు బాబా ఊదీని ఉపయోగించలేదు, శిరిడీ వెళ్ళలేదు.

కొంతకాలానికి కాశీబాయి భర్త శ్రీగోవింద్ వాసుదేవ్ కనీత్కర్‌కి ధూళేకు బదిలీ అయింది. అక్కడ వాళ్ళు ఒక సంవత్సరంపాటు ఉన్నారు. వాళ్ళు బాబా గురించి పూర్తిగా మరచిపోయారు. ఆ తరువాత కనీత్కర్ కుటుంబం బదిలీపై ముందుగా మాలేగాఁవ్‌కి, తరువాత యేవలాకు వెళ్లారు. అక్కడ తన భర్తను కలవడానికి అహ్మద్‌నగర్ నుండి వచ్చిన న్యాయవాదుల ద్వారా బాబా గురించి మళ్ళీ విన్నది కాశీబాయి. వాళ్ళు బాబా కరుణ గురించి, దైవత్వం గురించి చెప్పి, ‘శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోమ’ని కనీత్కర్‌కి చెప్పారు. కొన్నిరోజుల తరువాత తమ ఇంటిలో ఉన్న ఒక టేబుల్ మీద శ్రీమతి కాశీబాయి కనీత్కర్‌కి బాబా ఫోటో దర్శనమిచ్చింది. దాన్ని తమకెవరూ నేరుగా ఇవ్వడంగానీ, పోస్టు ద్వారా పంపడంగానీ జరగనందున ఆ ఫోటో తమ ఇంటిలోకి ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పటికీ ఆమెకు శిరిడీ వెళ్ళే ఆలోచన రాలేదు.

తరువాత 1906వ సంవత్సరంలో కనీత్కర్ యేవలాలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు తనకు సాధ్యమైనంత ఎక్కువమంది సాధుసత్పురుషులను దర్శించి, వారినుండి సదా ఆధ్యాత్మిక విషయాలపై సలహాలు తీసుకుంటుండేవాడు. అతను అనేక మతగ్రంథాలను చదివి అందులోని విషయాలను తన జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుండేవాడు. కనీత్కర్ తరచూ తన విధినిర్వహణలో భాగంగా కోపర్‌గాఁవ్ వెళ్తుండేవాడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు అతను తనతోపాటు తన కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడ తన సహచరులు కొంతమంది బాబా గురించి, వారి దైవత్వం, కరుణ, లీలల గురించి మాట్లాడుకుంటుండగా విన్న కనీత్కర్ వెంటనే కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లే మరుసటిరోజు అతను తన భార్య, సోదరి, ఆరుగురు పిల్లలతో కలిసి శిరిడీ వెళ్ళాడు. దక్షిణ రూపంలో బాబా తమ భక్తుల వద్దనుండి ధనాన్ని స్వీకరించి, ఆ పైకాన్ని ధునికి అవసరమయ్యే కట్టెలు కొనడానికి ఉపయోగిస్తారని విని ఉన్నందున బాబా దర్శనానికి వెళ్లేముందు శ్రీమతి కాశీబాయి కనీత్కర్ తమ ఆరుగురు పిల్లలకు తలా ఒక నాణేన్ని ఇచ్చింది. తరువాత అందరూ కలిసి బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. శ్రీమతి కాశీబాయి మసీదు మెట్ల దగ్గరకు వెళ్ళగానే బాబా ముందుకొచ్చి ఆమెను తీక్షణంగా చూస్తూ, ఆపై తమ హృదయాన్ని చూపుతూ, "ఇతను బ్రాహ్మణుడు, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. ఇతనికి మంత్రవిద్యలతో ఎలాంటి సంబంధమూ లేదు. ఏ మహమ్మదీయుడు ఇక్కడ అడుగుపెట్టే ధైర్యం చేయగలడు? ఎవడూ అందుకు సాహసించలేడు" అని అన్నారు. మళ్ళీ బాబా తమ హృదయాన్ని చూపుతూ, "ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గంలో గమ్యానికి చేర్చగలడు. ఇది బ్రాహ్మణ మసీదు. నల్లజాతి మహమ్మదీయులెవరి నీడా ఇక్కడ పడటానికి నేను అనుమతించను" అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీమతి కనీత్కర్ బాబా సర్వజ్ఞత్వానికి అబ్బురపడింది. కారణమేమిటంటే, బాబా అద్భుత మహిమల గురించి విన్నప్పుడు, దివ్యజ్ఞాన సమాజస్థులైన ఆమె, ఆమె భర్త తమ సిద్ధాంతాలననుసరించి, 'బాబా నిజమైన సత్పురుషులా, కాదా?' అని చర్చించుకున్నారు. ఆ విషయం గురించే బాబా దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆమె తన మనస్సులో తీవ్రంగా ఆలోచిస్తోంది.

తరువాత వాళ్లంతా బాబా దర్శనం చేసుకొని వారికి ప్రణామాలు అర్పించి, వారి పాదాల చెంత దక్షిణ ఉంచారు. కొంతసేపటికి బాబా వద్ద సెలవు తీసుకొని మసీదుకి సమీపంలో ఉన్న పాత మరాఠీ పాఠశాలలో బసచేసి నాలుగు రోజులు శిరిడీలో ఉన్నారు. అప్పుడొకరోజు రాత్రి బాబా తమ అలవాటు ప్రకారం మహల్సాపతితో కలిసి మసీదు నుండి చావడికి వెళ్లి చావడి ప్రవేశద్వారం వద్ద చీకటిలో కూర్చున్నారు. గోవిందరావు కనీత్కర్ కూడా వెళ్లి అక్కడ కూర్చున్నాడు. అతని కుటుంబం కూడా అక్కడికి కొద్దిదూరంలో ఉంది. బాబా, మహల్సాపతిల మధ్య చక్కటి ఆహ్లాదకరమైన సంభాషణ జరుగుతుండగా బాబా చిలిం వెలిగించి, తాము పీల్చి మహల్సాపతికి అందించారు. తరువాత గోవిందరావుకి కూడా ఇచ్చారు. తరువాత కూడా బాబా, మహల్సాపతిల మధ్య సంభాషణ కొనసాగింది. బాబా మాటల మధ్యలో అప్పుడప్పుడు మహల్సాపతిని, "అంతేకదా భగత్?” అని అడుగుతుండేవారు. అందుకు మహల్సాపతి పదేపదే, “బేషక్, బేషక్” (నిస్సందేహంగా, నిస్సందేహంగా) అని ఒకే పదాన్ని రెండుసార్లు అంటుండేవాడు. అయితే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరూ గ్రహించలేకపోయారు. అంతలో చిలిం మరోసారి వెలిగించాల్సి వచ్చింది. కానీ, చిలిం గొట్టంలో ఉండే చిన్నరాయి ఎక్కడో పడిపోయింది. దాంతో బాబా ఆగ్రహించి తీవ్రమైన పదజాలంతో తిట్టిపోయసాగారు. ఆ మాటలు వినడానికి ఇబ్బందిపడ్డ కనీత్కర్ తన భార్యాబిడ్డలను బసకి పంపించాడు. కొద్దిసేపటికి బాగా పొద్దుపోతుండటంతో అతను కూడా బాబా వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు. ఆ రాత్రి కనీత్కర్ కొంతమంది భక్తులతో మాట్లాడుతూ, “సాయిబాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, కానీ ఆయన భక్తులను డబ్బులు ఎందుకు అడగాలి? ఇది నాకు వింతగా అనిపిస్తోంది. అంతేకాదు, వారు తమ ముందు ఎవరు కూర్చున్నారనే దానితో సంబంధం లేకుండా విచక్షణారహితంగా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. ఆ అపవిత్ర, అసభ్యకర దుర్భాషలను మహిళలు వినడమనే వాస్తవాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను" అని అన్నాడు. అతని ప్రక్కన కూర్చున్న ఒక సాయిభక్తుడు, “ఆత్మజ్ఞానులైన మహాత్ములకు మంచి, చెడు అనే భావన ఉండదు. ఎందుకంటే, వారు వాటికి అతీతంగా ఉంటారు. వారు దేనికీ తగులుకోక సమతాభావంతో జీవనం సాగిస్తారు. మీరు వారిని ప్రశంసించినా, దుర్భాషలాడినా అవి వారిపై ఎలాంటి ప్రభావమూ చూపవు” అని అన్నాడు. కానీ, కనీత్కర్ తన అభిప్రాయాన్ని మార్చుకోక మొండిగా, “నేను మీతో ఏకీభవించను. మేము ఇప్పటివరకు ఇచ్చిన దక్షిణనంతా బాబా మాకు తిరిగి ఇచ్చినట్లయితే గనక వారు సత్పురుషులని విశ్వసిస్తాను” అని అన్నాడు. వాస్తవానికి, అతను బాబాను దర్శించినంత మాత్రానే ఎంతో మనశ్శాంతిని అనుభవించాడు. అయితే బాబా అతనితో ఏ అంశంపైనా మాట్లాడకపోవడం, ఆధ్యాత్మికంగా సలహా ఇవ్వకుండా మౌనంగా ఉండటం అతనిని బాధించింది. అట్టి స్థితిలో, బాబా తమ భక్తులను డబ్బులు అడగటం అనే విషయం అతనిని మరింత కలవరపెట్టగా, 'ఈ సత్పురుషునికి డబ్బు యొక్క అవసరమేమిట'ని ఆందోళన చెందాడు.

మరుసటిరోజు కనీత్కర్ కుటుంబం తిరుగు ప్రయాణానికి సిద్ధమై బాబా వద్ద అనుమతి తీసుకోవడానికి మసీదుకి వెళ్లారు. అప్పుడు బాబా అంతవరకూ వాళ్లలో ప్రతి ఒక్కరూ ఇచ్చిన దక్షిణ మొత్తాన్ని ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. అలా ప్రతి ఒక్కరికి ఇస్తూ ముందురోజు రాత్రి కనీత్కర్ మాట్లాడిన అవే మాటలను మళ్ళీ మళ్ళీ అన్నారు. శ్రీమతి కనీత్కర్ ఎంతో బాధపడి, "బాబా! మేము మీకిచ్చిన దక్షిణను మీరెందుకు మాకు తిరిగి ఇచ్చేస్తున్నారు? దయచేసి ఈ ధనాన్ని ధుని కోసం అవసరమయ్యే కట్టెలు కొనడానికి ఉపయోగించండి" అని విన్నవించుకుంది. బాబా మాత్రం ఆమె భర్త మాట్లాడిన, 'వారు సత్పురుషులైతే డబ్బు ఎందుకు అడుగుతారు?' అనే మాటలనే పునరావృతం చేశారు. జరుగుతున్న పరిణామానికి గోవిందరావు కనీత్కర్ చాలా బాధపడ్డాడు, కానీ అతను ఏమి చేయగలడు? ఆ ధనాన్ని తీసుకొని వాళ్లంతా తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. శ్రీమతి కాశీబాయి శిరిడీ దర్శించిన రోజు నుండి తన జీవితాంతమూ బాబాను భక్తిశ్రద్ధలతో ఆరాధించింది. బాబా తమ స్వహస్తాలతో తిరిగిచ్చిన ధనాన్ని ఆమె వారి కానుకగా భావించి, వాటిని పూజామందిరంలో పెట్టుకొని నిత్యమూ పూజించసాగింది. ఒకానొక సమయంలో ఆమె చిన్నకొడుకు అనారోగ్యం పాలై మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆమె తన బిడ్డకు ప్రాణబిక్ష పెట్టమని బాబాను ప్రార్థించి, బాబా తమ స్వహస్తాలతో ఇచ్చిన ఊదీని బిడ్డకు పెట్టింది. వెంటనే, బాబా అనుగ్రహంతో బిడ్డ కోలుకోసాగాడు.

1906లోనే మరోసారి కనీత్కర్ తన కుటుంబంతో యేవలా నుండి శిరిడీ వెళ్తూ రానూపోనూ ఒక టాంగా మాట్లాడుకున్నాడు. శిరిడీ చేరుకున్నాక కనీత్కర్ కుటుంబంతోపాటు షామా, అతని పిల్లలు కూడా బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. బాబా వారిని చూడగానే కనీత్కర్‌తో, “నువ్వు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావు? తెల్లవారుఝామున 2 గంటలకు నువ్వు ఒక్కడివే ఇక్కడినుండి వెళ్తావు” అని అన్నారు. బాబా మాటలతో తాము ఆ రాత్రి అక్కడే బసచేయాల్సి ఉందని శ్రీమతి కనీత్కర్ గ్రహించింది. తరువాత వాళ్ళు వెళ్లి పాత మరాఠీ స్కూలులో బసచేశారు. అర్థరాత్రి యేవలా నుండి ఒక అధికారి ఒక టెలిగ్రామ్ తీసుకొని కనీత్కర్ వద్దకి వచ్చాడు. ఆ టెలిగ్రామ్ అతని సోదరుడు చింటూ వద్దనుండి వచ్చింది. అందులో, తమ తల్లి తీవ్రంగా అనారోగ్యం పాలైందనీ, వెంటనే బయలుదేరి రమ్మనీ అతను పేర్కొన్నాడు. ఆ సమాచారం తెలుసుకున్న కాశీబాయి వెంటనే తన భర్త ప్రయాణానికి బ్యాగు సర్ది ఇచ్చింది. బాబా చెప్పినట్లే సరిగ్గా తెల్లవారుఝామున 2 గంటలకి కనీత్కర్ శిరిడీ నుండి ప్రయాణమయ్యాడు.

మరుసటిరోజు శ్రీమతి కాశీబాయి తన బ్యాగు సర్దుకుని శిరిడీ విడిచి బయలుదేరడానికి సిద్ధమై అనుమతి కోసం బాబా వద్దకు వెళ్ళింది. అయితే, బాబా వాళ్ళ ప్రయాణానికి తమ అనుమతినివ్వలేదు. దాంతో, వాళ్ళు అక్కడే మసీదులో కూర్చున్నారు. అప్పుడు బాబా, “పదేపదే అతను వెళ్లి ఆమెను కలుస్తానని వాగ్దానం చేశాడు. కానీ ప్రతిసారీ వాయిదా వేశాడు. ఇప్పుడు టెలిగ్రాం వచ్చింది. ఎవరో అనారోగ్యంతో ఉన్నారు. కానీ, లక్షణాలు వేరొకరిలో ఉన్నాయి” అని అన్నారు. అంతేకాదు, "అనారోగ్యమెవరికి? లక్షణాలు ఎవరికి?" అని కూడా అన్నారు. బాబా ఏమి చెబుతున్నారో, ఎవరినుద్దేశించి ఎవరికి చెబుతున్నారో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి శ్రీమతి కాశీబాయి తిరిగి తన బసకి వెళ్ళాక బాబా ఆమె కోసం ఒక పళ్ళెం నిండా బర్ఫీలు పంపించారు. నిజానికి ఆరోజు ఏకాదశి. ఆమె ఏకాదశివ్రతంలో ఉంది. ఆమె చేత ఆ వ్రతానికి ఉద్వాసన చెప్పించేందుకే బాబా ఆ బర్ఫీలు పంపారు. కొంతసేపటి తరువాత కాశీబాయి తన కుటుంబసభ్యులతో మళ్ళీ మసీదుకి వెళ్ళింది. అప్పుడు బాబా ‘శీరా’ తయారుచేయడానికి సిద్ధమవుతూ, "ఎవరైనా శీరా తినాలనుకుంటున్నారా?" అని అడిగారు. అది వింటూనే కాశీబాయి మనసులో, “ఒక ముస్లిం తయారుచేసే శీరాని ఎలా తినడం?” అన్న ఆలోచన తలెత్తింది. మరుక్షణం బాబా తమ రెండు చేతులను తమ చెవులపై వేసుకుని, “అరే! నేను ఎవరి మతవిశ్వాసాలనూ అపవిత్రం చేయడానికి ప్రయత్నించడం లేదు. సరే, ఇది బాగుంది, ఎవరైనా ఈ శీరాను తినాలనుకుంటే వాళ్ళు తినవచ్చు” అని అన్నారు. తరువాత బాబా లేచి ప్లేట్లు కడిగి, వాటిని తుడిచి, వేడివేడి శీరాను వాటిలో వడ్డించారు. శ్రీమతి కాశీబాయి సోదరి, పిల్లలతో సహా ఇతర కుటుంబసభ్యులందరూ శీరా తినసాగారు. కొద్దిసేపటి తర్వాత శ్రీమతి కాశీబాయి తాము బయలుదేరడానికి బాబాను అనుమతి అడిగింది. కానీ బాబా మౌనంగా ఉన్నారు. అంతలో దాదాకేల్కర్ మసీదుకు వచ్చాడు. బాబా శ్రీమతి కాశీబాయిని చూపిస్తూ అతనితో, “ఆమె నా తల్లి, చాలాదూరం నుండి ఇక్కడికి వచ్చింది. ఆమె ఏకాదశి ఉపవాసవ్రతాన్ని చేపట్టినందువల్ల ఆమె, ఆమె కుటుంబం ఆకలితో ఉంది. నువ్వు కొన్ని భాక్రీలు(రొట్టెలు) తయారుచేసి ఆమెకి, పిల్లలకి పెట్టలేవా? అలా చేస్తే నీ ఆత్మ సంతృప్తి చెందుతుంది” అని అన్నారు. దాంతో దాదాకేల్కర్ వాళ్ళని తమ ఇంట భోజనానికి రమ్మని ఆహ్వానించి వారందరినీ తనతో తీసుకొని వెళ్ళాడు. తరువాత శ్రీమతి కాశీబాయికి తన భర్త వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. అందులో అతను 'తన తల్లికి ఆరోగ్యం బాగుందనీ, అయితే తన సోదరి గంగూ తీవ్రమైన ప్రసవవేదననుభవించి ఆ రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింద'ని తెలియజేశాడు. దాంతో, "ఎవరో అనారోగ్యంతో ఉన్నారు. కానీ, లక్షణాలు వేరొకరిలో ఉన్నాయి" అన్న బాబా మాటలకర్థం కాశీబాయికి బోధపడింది.

1906లోనే ఇంకోసారి కనీత్కర్ కుటుంబం శిరిడీ దర్శించినప్పుడు మురికిగా, జిడ్డుగా ఉన్న ఒక గుడ్డను బాబా తమ వేలికి చుట్టుకొని ఉన్నారు. అది చూసి శ్రీమతి కాశీబాయి బాబా వేలికి ఏమైందోనని ఆందోళన చెందింది. వెంటనే బాబా, "నా వేలు కాలిపోయింది, అందుకే ఈ కట్టు కట్టుకున్నాను" అంటూ తమ వేలికున్న కట్టును విప్పి కాలిపోయి తెల్లగా ఉన్న తమ వేలిని ఆమెకు చూపించారు. తరువాత శ్రీమతి కాశీబాయి సాటి సాయిభక్తుల ద్వారా 'నాసిక్‌కి చెందిన మాధవనాథ్ మహరాజ్ తమ వేలిని కాల్చుకున్నారనీ, ఆ కాలిన గాయాన్ని బాబా తీసుకున్నార'నీ విని ఆశ్చర్యపోయింది. ఆ సమయంలోనే గ్రామస్థులు వాళ్లతో ఇలా చెప్పారు: "శిరిడీలో ఒక కుక్క ఉంది. దానికి పిచ్చిపట్టడంతో దానిని చంపాలని మేము కర్రలతో వెంబడించాము. అది ప్రాణభయంతో గ్రామమంతా తిరిగి చివరికి మసీదుని ఆశ్రయించి బాబా వెనుక కూర్చుంది. గ్రామస్థులు బాబాతో, “బాబా! ఆ కుక్కను తాకవద్దు. అది పిచ్చికుక్క. మిమ్మల్ని కరుస్తుంది" అని అన్నారు. బాబా ఆగ్రహించి గ్రామస్థులను అక్కడినుండి తరిమేశారు. ఆ కుక్క కొద్దిసేపు బాబా వెనుక విశ్రాంతి తీసుకొని తరువాత వెళ్లిపోయింది. అప్పటినుండి దాని పిచ్చిలక్షణాలు పోయి గ్రామంలో యథేచ్ఛగా తిరుగుతోంది. అది ఎవరిపైనా దాడి చేయడంగానీ, కరవడంగానీ జరగలేదు".

ఒకసారి కనీత్కర్ చిన్నకూతురు అనూబాయి తమ ఇంటి బాల్కనీలో కూర్చుని ఇంటి గేటు వద్ద విధినిర్వహణలో ఉన్న కాపలాదారుని చూస్తూ ఉంది. అంతలో ఒక ఫకీరు భిక్షకోసం గేటు వద్దకు వచ్చాడు. ఆ ఫకీరు పొడవుగానూ, చూడటానికి బాబావలే తన తలకి ఒక తెల్లని వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. అతని కుడిభుజంపై ఒక చిన్న ఆకుపచ్చరంగు రుమాలు ఉంది. అతను భిక్ష ఇవ్వమని కాపలాదారుని అడిగాడు. అందుకు ఆ కాపలాదారుడు ఒక డబ్బాని చూపిస్తూ, "ఈ డబ్బాలోని జొన్నలు నిండుకున్నాయి. యజమాని ఇంకా డబ్బాను నింపలేద"ని చెప్పి, "కొద్దిసేపటి తరువాత రమ్మ"ని ఆ ఫకీరుతో చెప్పాడు. ఆ ఫకీరు నవ్వుతూ వెళ్లిపోయాడు. సుమారు 20 నిమిషాల తరువాత ఆ ఫకీరు మళ్ళీ వచ్చి భిక్ష అడిగాడు. “డబ్బా ఖాళీగా ఉంద”ని మునపటి సమాధానమే చెప్పాడు కాపలాదారుడు. అప్పుడు ఆ ఫకీరు, "డబ్బాలో నాలుగైదు గింజలన్నా ఉంటాయి, వాటినే భిక్షగా ఇవ్వు" అని అడిగాడు. దాంతో కాపలాదారుడు ఆ డబ్బాను చేతిలోకి తీసుకొని ఫకీరు వద్ద ఉన్న ఆకుపచ్చ రుమాలులో ఆ డబ్బాను బోర్లించాడు. ఫకీరు తన రుమాలులో పడ్డ కొన్ని జొన్నగింజలను చూస్తూ, "ఇవి పుష్కలంగా ఉన్నాయి" అని, వాటిని తన అరచేతిలో పెట్టుకొని మరోచేతితో రుమాలు అంచులను లోపలున్న గింజలు కనపడకుండా మడిచాడు. కొన్ని క్షణాల తరువాత అతను ఆ రుమాలును తెరిచాడు. అందులో జొన్నలు నిండుగా ఉన్నాయి. అది చూసి కాపలాదారుడు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ ఫకీరు నవ్వుతూ వెనుతిరిగి కొన్ని అడుగులు వేసి అదృశ్యమయ్యాడు. ఇదంతా చూస్తున్న అనూబాయి పరుగున క్రిందికి దిగి అప్పుడే జరిగిన ఆ అద్భుతం గురించి అందరికీ చెప్పింది. అది విన్న శ్రీమతి కాశీబాయి ‘ఆ ఫకీరు వేరెవరో కాదు, బాబానే’ అని గుర్తించి వెంటనే కాపలాదారుని పిలిచి ఫకీరుని వెతకమని పంపింది. కానీ ఆ ఫకీరు కనిపించలేదు. ఒక సంవత్సరం తరువాత కాశీబాయి శిరిడీ వెళ్లి బాబాను దర్శించినప్పుడు బాబా ఆమెతో, "నేను మీ ఇంటికి వచ్చాను" అని చెప్పారు. ఆమె ఎంతో సంతోషించి, శిరస్సు వంచి బాబాకు నమస్కరించింది. అలా కాశీబాయి, ఆమె కుటుంబం తమకు వీలైనప్పుడల్లా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు. ఆమె భర్త గోవిందరావు కనీత్కర్ పదవీవిరమణ చేశాక 1909లో వాళ్ళు పూణే వెళ్లిపోయారు. దురదృష్టంకొద్దీ వాళ్ళు మళ్ళీ శిరిడీ వెళ్లలేకపోయారు. అయినప్పటికీ బాబా ఆశీస్సులు, ఆయన తమ స్వహస్తాలతో ఇచ్చిన ఊదీ వారి జీవితంలో ఏర్పడ్డ కష్టనష్టాల నుండి వాళ్ళను బయటపడేశాయి. 

రెఫ్: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 2008,
శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, వాల్యూమ్ 12, నం 3, దీపావళి సంచిక 2012.
మూలం: బాబాస్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.

4 comments:

  1. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo