ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి భగవానుని లీలలు ఊహించగలం!
2. ప్రార్థన విన్న బాబా
3. సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది?
సాయి భగవానుని లీలలు ఊహించగలం!
శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సమర్థ సద్గురు సాయి భగవాన్‌కి, శ్రీభరద్వాజ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా పాప పెండ్లి విషయంలో చాలా విముక్తి చూపేది. 'అప్పుడే పెళ్లి ఎందుకు? నేను ఇంకా చదువుకోవాలి' అని అంటుండేది. అందువల్ల నేను చాలా కలత చెంది ఆందోళనతో, "పాప మనసు మార్చి మంచి వ్యక్తితో పెండ్లి జరిపించమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను ప్రతినిత్యం మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం చదువుతుంటాను. నేను రోజూ పూజ చేసి సాయిలీలామృతం తెరవగానే 'బొంబాయి' అని కనపడుతుండేది. ఎప్పుడు తీసినా అదే పేజీ వచ్చేది. నేను ప్రతిదినం అలవాటుగా తీయడం వల్ల ఆ పేజీ వస్తుందని భావించేదాన్ని. అలా ఉండగా ఒకరోజు మా బాబు నాతో, "అక్కకు ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయమవుతుందని నాకు కల వచ్చింది. ఖచ్చితంగా అవుతుంది, దిగులుపడకు" అని అన్నాడు. అది బాబా సంకల్పం. తరువాత హఠాత్తుగా పాపకి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు బాబా భక్తులవడం ఒక విశేషం. వాళ్ళకి ఎన్నో దివ్య అనుభవాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ముంబయి(బొంబాయి)లో ఉద్యోగం చేస్తున్నాడు. అందువల్ల ఆ సంబంధం బాబా నిర్ధారించిందని మేము భావించి 2025, ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసి ఏప్రిల్ నెలలో ఘనంగా వివాహం జరిపించాము. పెండ్లికి వచ్చిన అందరూ పెళ్లి బాగా జరిగిందని సంతోషంగా చెప్పారు. నా ఆరోగ్య సమస్య గాని, ఆఫీసులో సెలవులు గాని, పెళ్లి ఖర్చులు గాని ఆలోచన లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. సాయి భగవానుని లీలలు మనం ఊహించగలం! వివాహం అయిన వెంటనే మా రెండు కుటుంబాలు తిరుపతి, శిరిడీ దర్శించాము. బాబాకు ఎల్లవేళలా మా కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన నామస్మరణ మా శ్వాసగా ఉండాలని ఆయన్ని ప్రార్ధిస్తూ ఆయన పాదపద్మములకు నమస్కారాలు.
ప్రార్థన విన్న బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మేము బెంగళూరులో ఉంటాము. మా పెద్దబ్బాయి ఈ సంవత్సరం(2025) 10వ తరగతి పరీక్షలు వ్రాసాడు. బాబా దయవల్ల తను 99.2% మార్కులు తెచ్చుకున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీ దయ ఎప్పుడూ మా అందరిపైన ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను". ఇకపోతే, మా అబ్బాయి ఇంటర్లో చేరడానికి మా ఇంటి నుండి చాలా దూరంలో ఉండే కాలేజీ ఎంచుకున్నాడు. ఎందుకంటే, ఆ కాలేజీలో చదువుకున్నవాళ్ళ ఫలితాలు బాగా వచ్చాయి. అక్కడ చదివినవాళ్ళు కాలేజీ బాగుందని అన్నారు. అందుకని మా బాబు అక్కడే చదువుతానని అన్నాడు. సరే ఇంకేం చేస్తామని ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకి తీసుకుందామని అనుకున్నాం. కానీ ఆ కాలేజీ ఉండేది కొంచెం కాస్టలీ ఏరియా. మేము ఉంటున్న ప్రాంతంలో అంత ఇంటి అద్దెలు లేవు. ఏదేమైనా పిల్లల చదువు ముఖ్యం కదా అని నేను బాబాని ఒకటే అడిగాను: "మాకు ఎంత అద్దె వస్తుందో అదే అద్దెలో కాలేజీకి దగ్గర్లో మంచి ఇల్లు దొరికేలా చూడండి" అని. బాబా నా ప్రార్థన విన్నారు. మాకు ఎంత అద్దె వస్తుందో అంతే అద్దెకు మంచి ఇల్లు దొరికేలా చేసారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. పిల్లల చదువుకోసం ఇక్కడికి వచ్చాము సాయి. మాకు తోడుగా ఉండి పిల్లలిద్దరూ బాగా చదువుకునేలా చూడు సాయి".
సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది?
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. నా భార్యకు 6 నెలల నుంచి నెలసరి వచ్చిన తరువాత 6వ రోజు నుంచి 10వ రోజు వరకు వైట్ డిశ్చార్జ్‌లో కొద్దిగా రక్తం వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్ళకి క్యాన్సర్ అని భయపెడుతున్నారు. ఆ కారణంగా నా భార్య భయపడింది. నేను, "నా భార్యకి ఏమీ కాకుండా చూడమ"ని బాబాకి చెప్పుకొని, నా భార్యను హాస్పిటల్‌కి తీసుకెళ్లి టెస్టులు చేయించాను. సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది? బాబా దయవలన రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "ధన్యవాదాలు సాయి".
