సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తాత్యాకోతేపాటిల్ - మూడవ భాగం..



మొదట్లో తాత్యా శ్రావణ సోమవారాలు, ఏకాదశి, మహాశివరాత్రి వంటి రోజులలో ఉపవాసముండేవాడు. అతను బాబాతో కలిసి మశీదులో నిద్రించనారంభించిన తరువాత ఆయా రోజులలో బాబా, "అరే, ఏం సోమవారం, ఏం ఏకాదశి, ఏం శివరాత్రి చేస్తావు? ఇది తిను, ఇది తిను" అంటూ అతని చేత భోజనం (మాంసం, పళ్ళు, కొలంబాలోని ఇతర ఆహారపదార్థాలు) తినిపించేవారు. ఒక శివరాత్రినాడు తాత్యా బాబాతో, "బాబా! దయచేసి ఈ శివరాత్రినాడైనా నా చేత ఏమీ తినిపించకండి" అని అన్నాడు. అప్పుడు బాబా, "తినరా! తిను! ఏం శివరాత్రి?" అని అన్నారు. అక్కడే వున్న దాదాకేల్కర్ తాత్యాతో, "ఉపవాసం ఉండలేకపోతున్నానని నిరాశ చెందక బాబా చెప్పినట్లు చెయ్యి" అని అన్నాడు. దాదాకేల్కర్ సూచనమేరకు తాత్యా బాబా ఆదేశాన్ననుసరించి అంతటితో తన ఉపవాసాన్ని విరమించి భోజనం చేశాడు. అంతేకాదు, ఆనాటినుండి మరెప్పుడూ సోమవారం, ఏకాదశి, శివరాత్రి మొదలైన ఏ రోజుల్లోనూ తాత్యా ఉపవాసం ఉండలేదు. ఉపవాసం వల్ల ఇటు ఐహికంగాగానీ, అటు ఆధ్యాత్మికంగాగానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. అందుకే బాబా తమ భక్తులను ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు.

తాత్యా నలుగురికీ సహాయపడే మంచి స్వభావంతో గ్రామస్థులకు గొప్ప పరోపకారిగా ఉండేవాడు. తగాదాల పరిష్కారానికి ఎందరో అతని వద్దకు మధ్యస్థం చేయమని వచ్చేవారు. ఉరుసు ఉత్సవం చేయాలనుకున్నప్పుడు ఆమోదముద్ర వేసింది మొదలు ఆ ఉత్సవం రామనవమిగా రూపాంతరం చెందిన తరువాత కూడా ఉత్సవానికి సంబంధించి అన్ని పనులూ తాత్యా స్వయంగా చూసుకునేవాడు. ఇంకా మసీదు, చావడి వద్ద ఏర్పాట్లన్నీ అతనే చూసుకొనేవాడు. బాబాకు కావలసిన సరుకులను కూడా అతనే రహతా నుండి తెచ్చేవాడు. ఒకరోజు బాబా తాత్యాకు 4 రూపాయలిచ్చి రహతా బజారు నుండి కొన్ని సరుకులతోపాటు తమలపాకులు, రేగుపళ్ళు కొని తీసుకురమ్మని చెప్పారు. వెంటనే తాత్యా రహతా బజారుకి వెళ్లి అన్ని సరుకులూ తీసుకొన్న తరువాత మంచి రేగుపళ్ళను ఏరి తీసుకొచ్చాడు. వాటిని బాబా ముందుంచి, "బాబా! మీరు రేగుపళ్ళు తెమ్మని చెప్పారు కదా, ఇవిగో తెచ్చాను" అని అన్నాడు. బాబా వాటిని తాత్యాకి, మహల్సాపతికి ఇవ్వనారంభించారు. అప్పుడు తాత్యా, "బాబా! మీరు కనీసం ఒకట్రెండు రేగుపళ్ళు తింటే నేను తింటాను" అని అన్నాడు. అందుకు బాబా, "నేను ఇప్పుడు తినను. మీరు తినండి" అని అన్నారు. అప్పుడు తాత్యా, "అయితే, నేను కూడా తినను" అని అన్నాడు. ఈవిధంగా కాసేపు వారివురి మధ్య సంవాదం నడిచింది. బాబా ఎంతకీ రేగుపళ్ళు తినకపోవడంతో తాత్యా ఆ రేగుపళ్లన్నీ రుమాలులో చుట్టి తన ఇంటికి తీసుకొనిపోయాడు. ఎప్పటిలాగే ఆరోజు రాత్రి బాబాకోసం రొట్టెలు తీసుకొస్తూ వాటితోపాటు రేగుపళ్ళు కూడా తీసుకొని వెళ్లి బాబా ముందుంచి, "ఇప్పుడైనా వీటిని తినండి బాబా" అని అన్నాడు. అందుకు బాబా, "నువ్వు తిను" అన్నారు. వారివురి మధ్య మధ్యాహ్నం మాదిరే మళ్ళీ వాదన ప్రారంభమైంది. చివరికి తాత్యాకు చాలా కోపమొచ్చి, ఆ రేగుపళ్ళన్నీ మశీదు ప్రాంగణంలో విసిరేసి, ఆ సమయంలో చావడి వద్ద ప్రదర్శింపబడుతున్న నాటకం చూడటానికి వెళ్ళిపోయాడు. బాబా, మహల్సాపతి కలిసి తాత్యా విసిరేసిన రేగుపళ్ళన్నీ ఏరారు. తరువాత మహల్సాపతి తాత్యాను పిలవడానికి వెళ్ళాడు. కానీ తాత్యా రాలేదు. అలా రెండు, మూడుసార్లు పిలిచిన తరువాత చివరికి తాత్యా మసీదుకు వెళ్లి బాబా వద్ద కూర్చున్నాడు. బాబా మళ్ళీ కొన్ని రేగుపళ్ళు మహల్సాపతికిచ్చి, కొన్ని తాత్యాకి ఇవ్వబోయారు. "మీరు తింటే, నేను తింటాను" అన్నాడు తాత్యా. అందుకు బాబా, "నేను చెప్తున్నాను, తిను" అన్నారు. దాంతో తాత్యాకు మళ్ళీ కోపమొచ్చి అక్కడినుండి లేచి నాటక ప్రదర్శన చూడటానికి వెళ్ళిపోయాడు. ఈసారి అతనిని పిలవడానికి దగడూభావ్, కొండాజీ వెళ్లారు. కానీ తాత్యా రాలేదు. అప్పుడు మహల్సాపతి తాత్యా వద్దకు వెళ్లి, "పద! బాబా ఆందోళన చెందుతున్నారు. నన్ను నిద్రపోనివ్వడం లేదు" అని అన్నాడు. అప్పుడు తాత్యా తన పంతాన్ని కాస్త తగ్గించుకుని మశీదుకు వెళ్ళాడు. కానీ కాస్త కోపంగానే ఉన్నాడు. బాబా ఒకటి, రెండు రేగుపళ్ళు తమ నోట్లో వేసుకొని, కొన్ని మహల్సాపతికిచ్చి, "నువ్వు తిని, అతనిని తినమని చెప్పు" అన్నారు. అప్పుడు తాత్యా రేగుపళ్ళు తిన్నాడు. కానీ బాబా మాత్రం అతనితో మాట్లాడలేదు. తరువాత అందరూ నిద్రపోయారు.

బాబా ఏ సంవత్సరం నుండి ఒకరోజు మసీదులో, ఒకరోజు చావడిలో నిద్రించడం ప్రారంభించారో స్పష్టంగా తెలియడంలేదుగానీ, 1909వ సంవత్సరం నుండి భక్తులు ఆయనను ఊరేగింపుగా చావడికి తీసుకొని వెళ్లడం ప్రారంభించారు. బాబా చావడికి వెళ్లేరోజు ముందుగా భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిరతలు, మృదంగం, కంజీర మొదలైన వాద్యాలతో కొంతసేపు భజన చేసేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసికోట, ఎదురుగా బాబా, మధ్యలో భక్తబృందమూ వుండేవారు. కొందరు భక్తులు మసీదు గేటువద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే, కొందరు పల్లకీని అందంగా అలంకరించేవారు. దండధారులైన కొందరు భక్తులు, "సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై" అని జయజయధ్వానాలు చేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ, రంగురంగుల తోరణాలతోనూ కళకళలాడుతుండేది. మసీదు ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ(గుఱ్ఱం) నిలబడేది. అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళేవాడు. కానీ బాబా మాత్రం కూర్చున్న చోటునుండి కదలక తాత్యా వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేవారు. తాత్యా వచ్చి చేయి పట్టుకొని లేపితేనే బాబా లేచి నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలింగొట్టం, పొగాకూ తీసుకుని, భుజానికొక పాతగుడ్డ వేసుకుని చావడికి బయలుదేరేవారు. అప్పుడు తాత్యా ఒక బంగారు జరీశాలువాను బాబా భుజాలపై కప్పేవాడు. మహల్సాపతి బాబా కుడిచేతిని పట్టుకోగా తాత్యా ఒక చేత్తో బాబా ఎడమచేతిని, మరో చేతితో లాంతరు పట్టుకొని బాబాను ముందుకు నడిపించేవారు. బాబా చావడి చేరగానే ముందుగా తాత్యా లోపలికి వెళ్లి బాబాకు ఆసనము, అనుకోవడానికి చెక్క అమర్చి, బాబాను ఆ ఆసనంపై కూర్చోబెట్టి, అందమైన కోటు తొడిగేవాడు. కాసేపటికి శ్యామా చిలింను వెలిగించి తాత్యాకిచ్చేవాడు. తాత్యా ఆ చిలింను పీల్చి బాగా రాజుకునేలా చేసి బాబాకు ఇచ్చేవాడు. బాబా పొగపీల్చి మహల్సాపతికి, మిగిలిన భక్తులకు అందించేవారు. చివరికి మంగళవాద్యాలతో బాబాకు శేజారతి ఇచ్చిన తరువాత ఒక్కొక్కరే బాబా వద్ద సెలవు తీసుకొని ఇళ్ళకు వెళ్ళేవారు. తాత్యా కూడా చిలిం, అత్తరు, రోజ్‌వాటర్ బాబాకు ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి అనుమతి అడిగేవాడు. అప్పుడు బాబా ప్రేమగా అతనితో, "నన్ను కనిపెట్టుకొని ఉండు. నువ్వు వెళ్తానంటే వెళ్ళు. కానీ రాత్రి అప్పుడప్పుడు నా గురించి విచారిస్తుండు" అని అనేవారు. తాత్యా అలాగేనని వారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళేవాడు. వారివురి మధ్య అంతటి ప్రేమ. బాబా తమ అనుమతి లేకుండా తాత్యాను ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. అయితే బాబాతో తనకున్న చనువు వల్ల తాత్యా అప్పుడప్పుడు ఆయన మాటలకివ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవాడు.

ఒకసారి తాత్యాకోతేపాటిల్ కోపర్‌గాఁవ్‌లో వారానికోసారి జరిగే సంతకు బయలుదేరి మసీదు వద్ద టాంగా ఆపి, లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. తరువాత అతను బాబాకు పాదనమస్కారం చేసుకొనే నెపంతో బయలుదేరడానికి బాబా అనుమతి అడుగుతున్నట్లు నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు కానీ, బాబాకి సమయాసమయాలు తెలుసు. తాత్యా తొందరపాటును చూసిన బాబా అతనితో, "ఎందుకంత తొందర? కొంచెం ఆగు. సంత సంగతి అలా వుంచు. ఈరోజు మాత్రం శిరిడీ విడిచి వెళ్లకు" అన్నారు. కానీ, తనకు సంతలో చాలా అవసరమైన పని ఉందనీ, తప్పకుండా వెళ్ళాల్సిందేననీ తాత్యా పట్టుబట్టాడు. తాత్యా మొండిపట్టు చూసి, "సరే, నీకు తోడుగా షామాను తీసుకొని వెళ్ళు" అని అన్నారు బాబా. కానీ తాత్యా, ‘కోపర్‌గాఁవ్‌ సంతకు షామాను తోడు తీసుకొని వెళ్లాల్సిన అవసరమేముంద’ని భావించి బాబా ఆదేశాన్ని పట్టించుకోకుండా వెళ్లి టాంగాలో కూర్చొని సంతకి బయల్దేరాడు. టాంగాకు కట్టివున్న రెండు గుర్రాల్లో ఒకటి చాలా చురుకైనది, విసుగన్నది లేనిది, మూడువందల రూపాయలు పెట్టి కొన్నది. ఆ గుర్రం సావుల్‌విహిర్ గ్రామం వద్దకు రాగానే వేగంగా దౌడుతీసి కాలు మడతబడి కూలబడింది. దాంతో టాంగా బోల్తాపడి తాత్యా క్రిందపడ్డాడు. బాబా దయవల్ల పెద్దగా దెబ్బలు తగల్లేదుగానీ, నడుం పట్టేసింది. ఇక ఎక్కడి సంత? తాత్యాకు సాయిమాత గుర్తొచ్చి, ‘సమయానికి బాబా మాట వినివుంటే ఈ కష్టం వచ్చేది కాదు, అయినా జరిగిపోయిన దానిగురించి ఇప్పుడు బాధపడి ఏం లాభం?’ అని అనుకున్నాడు. 

మరోసారి తాత్యా కోల్హార్ గ్రామానికి బయల్దేరాడు. టాంగా సిద్ధం చేసుకొని బాబాను అనుమతి అడగటానికని మసీదుకు వెళ్లి, బాబా చరణాలకు వందనం చేసి, "వెళ్లొస్తాన"ని అన్నాడు. బాబా అనుమతి పూర్తిగా లభించకముందే తాత్యా అక్కడినుండి బయల్దేరాడు. టాంగాకున్న గుఱ్ఱం అదుపు లేకుండా దారితెన్ను, మిట్టపల్లాలు చూడకుండా అతివేగంగా పరుగెత్తడంతో అతని ప్రాణం మీదకు వచ్చింది. చివరికి టాంగా తుమ్మచెట్టుకు గ్రుద్దుకొని ఆగిపోయింది. అక్కడినుండి తాత్యా వెనుతిరిగి వచ్చాడు. ఆ విధంగా సాయిబాబా దయవలన అతను ఆ అపాయం నుండి బయటపడ్డాడు.

ఇంకోసారి తాత్యా, "బాబా, శివరాత్రికి టాంగాలో జజూరీ వెళ్ళివస్తాను" అని అన్నాడు. బాబా, "ఎందుకంత బాధ?" అన్నారు. అతడు "నీవెప్పుడూ ఇంతే బాబా! అడ్డుపుల్ల వేస్తావు" అన్నాడు. అందుకు బాబా చికాకుగా, “సరే, పో!" అన్నారు. తాత్యా బయల్దేరిన కొద్దిసేపట్లోనే టాంగా బోల్తాకొట్టింది! అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే బాబా అతనిని చూచి నవ్వి, "చెబితే బుద్ధి వుండక్కర్లా? అడగడమెందుకు? వద్దంటే వెళ్ళడమెందుకు?" అన్నారు.

సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

సాయిభక్తుల అనుభవమాలిక 944వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనారోగ్యసమస్య - మార్గనిర్దేశం - సాయి సేవకు అంకురార్పణ
2. అసంభవం అనుకున్నది సంభవం చేసి చూపిన బాబా

అనారోగ్యసమస్య - మార్గనిర్దేశం - సాయి సేవకు అంకురార్పణ


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆధునిక సాయి సచ్చరిత్రకు వేదికగా ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను చక్కటి కూర్పుతో ప్రచురిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తున్న సాయికి మరియు వారి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు దేవి. మాది గజపతినగరం. బాబా కృపతో నేను ఇంతకుముందు మూడు అనుభవాలను మన బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ఈమధ్య నాకు ప్రసాదించిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ అద్భుతం చేస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకు మొక్కుకున్నాను.


మా ఆడపడుచుకి పెళ్ళైన 20 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆమె బాబాపై పూర్తి నమ్మకముంచి బాబా చరిత్ర పారాయణ చేసింది. ఫలితంగా సంవత్సరంన్నర క్రితం ఆమెకు కవలలు (పాప, బాబు) పుట్టారు. ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు అయినందున సాయి వరప్రసాదమైన పిల్లల సంరక్షణ నిమిత్తం మా అత్తయ్య, మావయ్యలు ఆమె దగ్గరే ఉంటున్నారు. 2021, వినాయకచవితి పండగ తరువాత సెప్టెంబర్ 11వ తారీఖున మా ఆడపడుచు ఫోన్ చేసి, 'మా మావయ్యగారికి చాలా ఆయాసంగా ఉందని, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుందని, వాళ్ళ ఊరిలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పించామ'ని ఏడుస్తూ చెప్పింది. హుటాహుటిన మావారు బయలుదేరి హాస్పిటల్‍కి వెళ్లారు. అప్పటికే మా మావయ్యగారి పరిస్థితిని, అతని టెస్టు రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు, "పరిస్థితి విషమంగా ఉంది. గుండె ఉండవలసిన పరిమాణం కంటే పెద్దగా ఉంది(heart enlarge అయ్యింది), రెండు, మూడు రోజులు కంటే బతకడం కష్టం. ముందైతే ఆక్సిజన్ పెడదామ"ని ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. డాక్టర్లు చెప్పిన మాటలు మా మావయ్య, అత్తయ్యలకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ మావారు, ఆడపడుచు తమలోతామే అంతులేని ఆవేదనను అనుభవిస్తూ మాకు కూడా విషయం స్పష్టంగా చెప్పలేదు. మాకు చెపితే మేమెక్కడ హాస్పిటల్‍కి వెళ్తామో! మమ్మల్ని చూసి మావయ్య ఎక్కడ కంగారు పడిపోతారోనని వాళ్ళ భయం. కానీ నేను ఫోన్లో మావారి మాటల వెనక దుఃఖాన్ని గుర్తించి, సమస్య పెద్దదై ఉంటుందని ఊహించి గట్టిగా గదమాయించి అడిగితే, అసలు విషయం చెప్పారు. దాంతో ఒక్కసారిగా నా కాళ్ళుచేతులు ఆడలేదు. వెంటనే బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి నాయనా ఇదంతా?" అని అడిగి, ఆపై జరగబోయే పరిస్థితులన్నింటినీ ఊహించుకుని తట్టుకోలేకపోయాను. "బాబా! ఏ విషయమైనా ముందుగా తెలియజేసే మీరు ఇప్పుడీ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు?" అని బాబాను అడిగాను. ఇంకా, "చావుపుట్టుకలు సర్వసాధారణమని తెలుసు బాబా. కానీ, చిన్నప్పటినుండీ కొన్ని కారణాల వలన తల్లిదండ్రుల దగ్గర పెరగని మావారు, ఆడపడుచు ఇప్పుడైనా అమ్మానాన్నలతో కలిసి ఉందామనుకున్నారు. వారి ఆశను నీరుకార్చొద్దు బాబా" అని బాబాను ప్రార్ధించి, 'బాబా ప్రశ్నలు-సమాధానాలు' అన్న పుస్తకం తీసి చూసాను. అక్కడ, "ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పూజ చేయవద్దని శాస్త్రాలు, మహాత్ములు తెలిపారు. ఇవి ప్రాపంచిక వ్యక్తులకే కానీ బ్రహ్మజ్ఞాన సాధకులకు కాదు" అని బాబా ఇచ్చిన సమాధానాన్ని చూసి ఒక్కసారిగా నేను అదిరిపడ్డాను. ఇక అప్పటినుండీ ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఒకటే ఆందోళన, కంగారు. అలా ఆ రాత్రి ఆందోళనతో గడిచింది. మరుసటిరోజు మా పాపని తీసుకుని, అమ్మ, అన్నయ్య అందరమూ కలిసి హాస్పిటల్‍కి వెళ్ళాము. మనసులో బాబా నామాన్ని తలుచుకుంటూ వెళ్లి మా మావయ్యగారిని చూసాను. ఒక పక్క మామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే, మరోపక్క నేను నా మనస్సులో 'బాబా ఇచ్చిన సమాధానం, డాక్టర్ల మాటల ఆధారంగా' ఇప్పుడిలా కనిపిస్తున్న మావయ్య రెండురోజుల తరవాత ఎలా ఉంటారోనన్న తలంపుని జీర్ణించుకోలేక నాలో నేనే చాలా మధనపడిపోయాను. ఏమి చేయాలో తెలియక వెంటనే నా ఫోన్‍లో 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసేసరికి అందులో 'మరణం నుండి తప్పించిన బాబా', 'పెద్ద ఆపద నుండి కాపాడిన బాబా' అనే శీర్షికలతో కూడిన ఒక భక్తురాలి అనుభవం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాను. నాలో మళ్ళీ ఆశలు చిగురించాయి. వెంటనే నేను నాతోపాటు తీసుకెళ్లిన బాబా ఊదీ మావయ్యగారి ఛాతీపై రాసి, నుదుట బొట్టుపెట్టి, "భక్తితో బాబాను  మనసులో ప్రార్ధించకోమ"ని మామయ్యతో చెప్పాను. నేను కూడా, "మావయ్య త్వరగా కోలుకుంటే, మరుసటివారంలో ఇదేరోజున ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను.


తరువాత బాబా నాలో కల్పించిన ఆశలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి మా వదినతో జరిగిన విషయం చెప్పాను. అందుకు మా వదిన తనకు అప్పుడే వచ్చిన ఒక ఆలోచనను ఆచరణలో పెడితే బాగుంటుందని, దాన్ని బాబాయే నాకు చెప్తున్నట్టు తోస్తుందని అన్నది. అదేమిటంటే, 'మావయ్యగారి పేరు మీద సాయి సంకల్ప పారాయణ పెట్టిస్తే, ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంద'ని. కానీ ఎలా చేయాలనేది మాత్రం మీరే ఆలోచించండని మా వదిన చెప్పింది. నాకు అది చాలా బాగుందనిపించి వెంటనే కవిత అనే నా సహోపాధ్యాయురాలిని ఆ విషయమై సంప్రదించాను. తను నాకు ధైర్యాన్ని చెపుతూ, "మన మహిళల స్కూల్ గ్రూపులో ఉన్న వారంతా చాలా గొప్పవారు. ముందుగా విషయం చెప్పకుండా చదవమని సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలు కేటాయించినా పారాయణ చేసే గొప్ప వ్యక్తిత్వం, మానవత్వం, దేవునియందు అమితమైన భక్తి ఉన్నవారు వాళ్ళందరూ. కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఆ పని చేయమ"ని చెప్పింది. అంతటితో నేను అది బాబా ఆజ్ఞగా తీసుకుని అలాగే చేశాను. వెంటనే పారాయణ చేయవలసిన అధ్యాయాలను ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి, విషయం టైపు చేసి గ్రూపులో పెట్టాను. వెంటనే, "మీకు మేమంతా ఉన్నామ"ని వాళ్ళు స్పందించిన తీరు ఎంతో ప్రసంశనీయం. ఆ క్షణం వాళ్లలో నాకు బాబాయే కనిపించారు. సోమవారంనాడు సంకల్ప పారాయణ దిగ్విజయంగా పూర్తయింది. మరుక్షణం డాక్టర్లు మావయ్యగారు కొంచం కోలుకున్నారని, ఇక ఆక్సిజన్ అవసరం లేదని, రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము, ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. అయితే ఇంట్లో పాటించవలసిన జాగ్రత్తలు మాత్రం కాస్త ఎక్కువగానే చెప్పారు. ఈ వివరాలన్నీ నేను మావారికి ఫోన్ చేస్తే తెలిసాయి. ఆ క్షణాన నేను బాబా చూపిన పరిష్కార మార్గానికి, చేసిన లీలకు పులకించిపోయాను.


అలా మా మావయ్యగారి ఆరోగ్య విషయంగా మొదలైన 'సాయి సంకల్ప పారాయణ'ను ఇంకొంతమంది స్నేహితులను కూడా చేర్చుకుని మొత్తం 37 మందిమి ఒక సమూహంగా ఎవరికీ ఏ సమస్య ఉన్నా వారికోసం (ప్రస్తుతం)మంగళ, శుక్రవారాల్లో అందరి ఆత్మలను ఒకే సాయి పరమాత్మలో లయం చేసే విధంగా పారాయణ చేస్తూ ఆ సాయినాథునిసేవలో తరిస్తున్నామని చెప్పడానికి పొంగిపోతున్నాను. ఇలా సాయి సేవ చేయడానికి ప్రధాన కారణమైన మా మావయ్యగారికి, పారాయణ ఆలోచనను కల్పించిన వదినకి, ప్రోత్సహించిన కవితకి, సాయి సేవలో పాల్గొంటున్న నా స్నేహితులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని బాబాను సవినయంగా ప్రార్ధిస్తున్నాను.


ఇంకా పైన చెప్పిన మా మావయ్యగారి అనారోగ్య పరిస్థితి ద్వారా తమపై చాలా అల్ప విశ్వాసమున్న మా వారిచేత తన తండ్రి ఆరోగ్యం చక్కబడితే, శిరిడీ వస్తానని  మొక్కుకునేలా ప్రేరేపించడమే కాకుండా భక్తివిశ్వాసాలతో క్రమం తప్పకుండా రోజుకి ఒక అధ్యాయం చొప్పున సచ్చరిత్ర పారాయణ చేసే భాగ్యాన్ని మావారికి ప్రసాదించిన మన సద్గురు శ్రీ సాయినాథునికి శతసహస్రకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. పారాయణాల మూలంగా ఈ అనుభవాన్ని వ్రాయడంలో కొద్దిగా ఆలస్యమైనందుకు మీరు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రక్కసిని మీ దృష్టి వీక్షణాలతో పూర్తిగా నిర్మూలన చేసి, ప్రజలందరినీ కాపాడి అందరినీ మీ మార్గంలో నడిపించండి".


శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


అసంభవం అనుకున్నది సంభవం చేసి చూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా అనుభవం విషయానికి వస్తే... ఒక సంవత్సరం క్రితం మాకు, మా బాబాయి వాళ్ళకి మధ్య కొన్ని తగాదాలు ఏర్పడ్డాయి. దానివల్ల మేము మాట్లాడుకోవడం లేదు. ఈ విషయమై నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ఆ సమయములోనే నా స్నేహితురాలు నన్ను ఈ బ్లాగుకు సంబంధించిన 'సాయి భక్తుల అనుభవాల' గ్రూపులో చేర్చింది. తోటి భక్తుల అనుభవాలు చదివిన నేను, "ఎలాగైనా మేము, మా బాబాయి వాళ్ళు మునుపటిలా కలిసిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. అలా మొక్కిన తరువాత చాలారోజులు గడిచాయి కానీ, మా మధ్య ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో మేము కలవడం అసంభవమేమో అనుకున్నాను. తరువాత ఒకరోజు ఇంస్టాగ్రాములో బాబా సందేశాలు చూస్తుంటే, "ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది" అనే మెసేజు చూశాను. అప్పుడు నేను, 'అలా ఏమి జరగదులే! ఎప్పుడూ ఇలానే వస్తాయి' అని మనసులో అనుకున్నాను. సరిగ్గా ఒక గంట తర్వాత మా బాబాయి మా ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే మాతో మంచిగా మాట్లాడారు. అసంభవం అనుకున్న దానిని బాబా సంభవం చేసి చూపించారని నేను చాలా చాలా సంతోషించాను. దాంతో నా మనసులో మిగిలి ఉన్న ఆందోళన పటాపంచలైపోయింది. "బాబా! జీవితాంతం మీకు ఋణపడి ఉండటం తప్ప  ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? అసలు ఇలాంటి అనుభవం నేను పంచుకుంటానని కలలో కూడా అనుకోలేదు. అంతా మీ కృప వలనే జరిగింది. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".


ఒకరోజు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళిన మా చిన్నాన్నగారి అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. మేమంతా చాలా కంగారుపడి అంతటా వెతికాము కానీ, తను ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ దయతో తమ్ముడు కనిపిస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా బాబాకి మొక్కుకున్న కాసేపటికి తన స్నేహితుని ఇంటిలో నుంచి తమ్ముడు బయటకు వచ్చాడు. ఇక మా ఆనందానికి అవధులు లేవు. అంతా బాబా దయ. "బాబా! మా చిన్న తమ్ముడికి నోట్లో అల్సర్స్ అయ్యాయి. తను ఏమీ తినలేకపోతున్నాడు బాబా. ఆ అల్సర్స్ తొందరగా తగ్గిపోయేలా చూడు తండ్రి".



సాయిభక్తుల అనుభవమాలిక 943వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టమేదైనా సరే తీర్చి రక్షణనిచ్చే బాబా
2. జ్వరం తగ్గించిన బాబా
3. బాబాను నమ్మండి, అంతా ఆయనే చూసుకుంటారు

కష్టమేదైనా సరే తీర్చి రక్షణనిచ్చే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

 

ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి  ధన్యవాదాలు. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలను చదువుతూ మేము ఆ సాయినాథునికి మరింత దగ్గరవుతున్నాము. నా పేరు చైతన్య. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్న నేను, ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.


మొదటి అనుభవం: 2021, సెప్టెంబర్ రెండో వారంలో నాకు జ్వరం వచ్చి, హఠాత్తుగా చాలా నీరసంగా అనిపించింది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే ఎంత నీరసంగా ఉంటుందో అంత నీరసంగా ఉండేసరికి నాకు చాలా భయమేసింది. అప్పుడు నేను బాబా ఊదీ పెట్టుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' నామాన్ని అనుకుంటూ, "నాకు తగ్గితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే నాకు పూర్తి ఆరోగ్యం చేకూరింది.


రెండవ అనుభవం:  ఒకరోజు అకస్మాత్తుగా మా చిన్నబాబుకి జలుబు, గొంతునొప్పి వచ్చాయి. అదే సమయంలో దగ్గు, జ్వరం, వాటితోపాటు గొంతునొప్పి కూడా మొదలయ్యాయి. మాకు చాలా భయమేసింది. అప్పుడు నేను మాబాబుతో, "నా అనారోగ్య సమస్యలన్నీ తీరినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకో" అని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను బాబా దగ్గర చెప్పుకుని ఊదీ పెట్టుకున్నాడు. సాయినాథుని దయవల్ల దాదాపు అన్ని సమస్యలు తగ్గాయి కానీ, కొంచెం దగ్గు ఉంది. "అది కూడా తగ్గి, తను ఆరోగ్యంగా ఉండేలా దీవించండి సాయినాథా! ఇలాగే మీ రక్షణ, గురుకృప మా కుటుంబంపై చూపించండి. మాకు కొన్ని సమస్యలున్నాయి తండ్రి. మీరే వాటికి పరిష్కారం చూపాలి సాయి. ఇంకా ఇంటర్ సెకండియర్ చదువుతున్న మా పెద్దబాబుని మంచిగా చదువుకునేలా అనుగ్రహించండి. తను మీ దయవల్ల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసాడు. వాటిలో మంచి మార్కులు వచ్చేలా దీవించండి. అలాగే మావారికున్న గ్యాస్ సమస్య తొలగిపోయేలా అనుగ్రహించండి బాబా".


మూడవ అనుభవం: ఒకసారి రిమోట్ ద్వారా ఆఫ్ చేసి ఉన్న మా టీవిని రిమోట్ తో ఆన్ చేయాలని చూస్తే టివి ఆన్ కాలేదు. అది ఫైర్ స్టిక్ రిమోట్ అయినందువల్ల దానితో ఆన్ చేస్తేనే టీవీ ఆన్ అవుతుంది. కానీ రిమోట్ పని చేయలేదు. అప్పుడు నేను, "టివి ఆన్ అయ్యేలా అనుగ్రహించండి బాబా. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకుని రిమోట్ కి కొంచం బాబా ఊదీ పెట్టి మళ్ళీ ప్రయత్నించాను. కానీ టివి ఆన్ కాలేదు. దాంతో నేను, 'ఫైర్ స్టిక్ రిమోట్ ఎవరి దగ్గరా ఉండదు, ఇప్పుడేమి చేయాల'ని ఆలోచనలో పడ్డాను. కానీ, నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు, "టివి ఎలాగైనా ఆన్ అయ్యేలా చూడండి బాబా" అని మరోసారి బాబాతో చెప్పుకున్నాను. ఇక బాబా అనుగ్రహాన్ని చూడండి. మా పక్కింటి ఆంటీవాళ్ళు హైదరాబాదు వెళ్లి ఉన్నారు. వాళ్ళు వెళ్లేముందు తమ ఇంటి తాళాలు మాకిచ్చి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న అక్వేరియంలోని చేపలకు ఆహారం వెయ్యమని చెప్పారు. ఒకరోజు చేపలకు ఆహరం వేయడానికి వెళ్ళినపుడు ఎప్పుడూ కనబడని ఫైర్ స్టిక్ రిమోట్, ఆరోజు కనబడింది. అది తీసుకొచ్చి టివి ఆన్ చేస్తే ఆన్ అయింది. ఇది బాబా అనుగ్రహమే. అంతవరకు కనబడని రిమోట్ తమకు చెప్పుకున్నంతనే మాకు కనబడేలా చేసి బాబా అద్భుతం చేశారు. తరువాత మాకు, 'ఆంటీవాళ్ళ అబ్బాయి ఆ ఫైర్ స్టిక్ రిమోట్ ని హైదరాబాదు నుండి తెచ్చాడని, కానీ కేబుల్ కనెక్షన్ ఉన్నందువల్ల ఆ ఫైర్ స్టిక్ రిమోట్ వాడట్లేద'ని తెలిసింది. మనకొచ్చిన కష్టం ఏదైనాసరే వెంటనే తీర్చి, ఆ కష్టం నుంచి మనల్ని కాపాడుతారు బాబా. "ధన్యవాదాలు బాబా. శతకోటి వందనాలు తండ్రీ".


జ్వరం తగ్గించిన బాబా


ముందుగా శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. అలాగే సాయిభక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వాహకులకు కూడా నా నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. నేను ఇప్పుడు రెండోసారి నా అనుభవాలు పంచుకుంటున్నాను. ఇటీవల మా అన్నయ్య తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అప్పుడు నేను, "అన్నయ్యకి నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిబాబాకి మొక్కుకున్నాను. తర్వాత బాబా ఊదీ పెట్టుకోమని అన్నయ్యతో చెప్పాను. అన్నయ్య అలాగే చేశాడు. బాబా దయవలన అన్నయ్యకి మూడు రోజులలో జ్వరం తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ సాయినాథా!".


ఇంకో అనుభవం: 2021, సెప్టెంబర్ 25, శనివారంనాడు మా చిన్నబాబుకి జ్వరం వచ్చింది. మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు తనకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. నేను బాబాను ప్రార్థించి, కొద్దిగా ఊదీ నీటిలో వేసి త్రాగమని బాబుకిచ్చాను. ఆపై మరికొంత ఊదీ బాబుకి పెట్టి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని స్మరిస్తూ, 'బాబుకి నయమైతే, ఈ అనుభావాన్ని సాయి బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. తర్వాత బాబుకి జ్వరం సిరప్ వేసి పడుకున్నాను. బాబా దయవలన ఉదయం లేచేసరికి 103 డిగ్రీలు ఉండే జ్వరం 97 డిగ్రీలకు వచ్చింది. "చాలా సంతోషం సాయీ. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.


బాబాను నమ్మండి, అంతా ఆయనే చూసుకుంటారు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను పంచుకున్నాను. ఇక ముందు కూడా బాబా ప్రేమను మీతో పంచుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్నిరోజుల క్రితం మా చిన్నమామయ్యగారికి కరోనా వచ్చింది. అయితే అదివరకే అతను వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండటం వలన ఎవరూ పెద్దగా భయపడలేదు. కానీ ఐదురోజుల తర్వాత అతని ఆక్సిజన్ లెవల్స్ 70కి పడిపోయాయి. దాంతో అందరికీ చాలా భయం వేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామనుకుంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదు. పోనీ అతన్ని హైదరాబాదు తీసుకెళ్దాం అంటే అంత దూరం తీసుకెళ్లేందుకు అతని ఆరోగ్యం సహకరించే స్థితిలో లేదు. ఇంకా మా అత్తయ్య ఒకటే ఏడుపు. నేను డాక్టర్ అవ్వడం వలన వాళ్లంతా నా నిర్ణయం మీదే ఆధారపడ్డారు. అప్పుడు నేను బాబా మీద భారం వేసి, "ముందు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడితే మరో చోటికి మారుద్దామ"ని వాళ్లతో చెప్పడమైతే చెప్పానుగాని, "అతనికి ఏమైనా అయిందంటే, నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంద"ని భయపడుతూనే ఉన్నాను. ఆ క్షణం నుండి నేను బాబానే తలుచుకుంటూ, ఆయన చరిత్ర పారాయణ చేస్తూ, "నీదే భారం బాబా. ఎలాగైనా మామయ్యగారిని ఆరోగ్యంగా ఇంటికి పంపించు" అని వేడుకుంటూ గడిపాను. ఒక వారం రోజుల తర్వాత మామయ్య క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇదంతా కేవలం బాబా దయవల్ల మాత్రమే సాధ్యమైందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. "ధన్యవాదాలు బాబా. మీ ప్రేమానురాగాలు మా మీద ఎప్పటికీ ఇలాగే ఉండనీయండి". చివరిగా బాబా భక్తులందరికీ నేను ఒక విషయాన్ని తెలియ చేయాలనుకుంటున్నాను, 'పూజలు వంటివేమీ చేయనవసరం లేదు. మనస్ఫూర్తిగా బాబాను నమ్మండి. అంతా ఆయనే చూసుకుంటారు'.



సాయిభక్తుల అనుభవమాలిక 942వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి మ్రొక్కుకుంటే, అంతా ఆయన చూసుకుంటారు
2. బాబాను నమ్ముకున్న వారికి ఎటువంటి బాధలు ఉండవు
3. కోరిన కోర్కెలు తీర్చే దైవం సాయినాథుడు

బాబాకి మ్రొక్కుకుంటే, అంతా ఆయన చూసుకుంటారు


శ్రీ సాయినాథునికి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. నేను ఒక సాయి భక్తురాలిని. నా భర్త ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. కరోనా సమయంలో కూడా ఆయన తన విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. ఆ సమయంలో తనకి ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కరోనా తగ్గిపోతే, నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన మా వారికి కరోనా తగ్గిపోయి ఏటువంటి ఇబ్బందులు లేకుండా బాగున్నారు. "ధన్యవాదాలు బాబా".


మా పెద్దబాబు ఒక బహుళ జాతి సంస్థ (MNC)లో ఉద్యోగం చేస్తున్నాడు. తను ఒకసారి ప్రాజెక్ట్ రిలీజ్ విషయంలో చాలా టెన్షన్ పడుతుంటే, "బాబాకి మొక్కుకో, అద్భుతం జరుగుతుంది. బాబా మీద భారం వేసి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆయనే అంతా చూసుకుంటారు" అని బాబుతో చెప్పగా, తను సరేనన్నాడు. ఒక వారంలో ముందుగా అనుకున్నట్లు ప్రాజెక్ట్ లో చిన్న సమస్యలు వచ్చినా చివరికి స్మూత్ గా ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి, టీమ్‍లో అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. "ధన్యవాదాలు సాయి తండ్రి. మీకు చెప్పుకున్నట్టుగానే నా రెండు అనుభవాల్ని ఇంత మంచి ఫ్లాట్ ఫాం ద్వారా నా సహచర సాయిబంధువులతో పంచుకునే అదృష్టం దక్కినందుకు ధన్యవాదాలు తండ్రి. నాకు ఉన్న ఇంకొక కోరిక మీకు తెలుసు. అది కూడా తీర్చి ఆ అనుభవాన్ని కూడా పంచుకునే అదృష్టాన్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పాదాల చెంత ఎప్పటికీ ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తండ్రి".


బాబాను నమ్ముకున్న వారికి ఎటువంటి బాధలు ఉండవు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు మాధవి. నేను ఇంతకు ముందు రెండుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకోబోతున్నాను. 2021, జూలై 7న మేము మద్రాసు నుండి తెనాలి రావాల్సి ఉండగా ఆ సమయంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మాతోపాటు గర్భవతి అయిన మా అమ్మాయి కూడా ఉన్నందున తను క్షేమంగా ఉండాలని సాయినాథుని ప్రార్థించి, 'మీ కృపవలన మేమంతా క్షేమంగా తెనాలి చేరుకున్నట్లయితే మా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో మేము క్షేమముగా ఇంటికి చేరుకున్నాము. ఇంటికి రాగానే ఎదురుగా 'సాయి సచ్చరిత్ర' పుస్తకము నా కంటపడింది. ఆవిధంగా బాబా మాతోనే ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చామని నిదర్శనమిచ్చారు. ఆ సాయినాథుడు తనను నమ్ముకున్న వారిని ఎల్లవేళలా వెన్నంటి ఉండి కాపాడతారు.


మరో అనుభవం: 15 సంవత్సరాల క్రితం నేను కీళ్లనొప్పులతో బాధపడ్డాను. అప్పుడు ఒక డాక్టరుకు చూపించుకుంటే, ఆర్.ఏ టెస్ట్ చేయించమన్నారు. టెస్టు చేయించుకుంటే రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. అప్పుడు డాక్టరు కొన్ని మందులు సూచించారు. ఆ మందులు రెండు సంవత్సరాలు వాడిన తర్వాత కీళ్లనొప్పులు తగ్గిపోయాయి. మళ్లీ ఇంతకాలం తరువాత కీళ్లనొప్పులు ఎక్కువగా ఉండటం వల్ల డాక్టరు దగ్గరకు వెళ్లాను. డాక్టరు మళ్లీ ఆర్.ఏ టెస్ట్ చేయించుకోమన్నారు. అలాగే టెస్ట్ చేయించుకుని, "టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ రావాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. బాబాను నమ్ముకున్న వారికి ఎటువంటి బాధలు ఉండవు. త్వరలోనే నా నొప్పులన్నీ బాబా తగ్గిస్తారని ఆశిస్తున్నాను. ఆ సాయినాథుని కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. "బాబా! నా నొప్పులను తగ్గించండి తండ్రీ. మీ దయ ఉంటే సాధ్యం కానిది లేదు కదా తండ్రి".


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై జై.!!!


కోరిన కోర్కెలు తీర్చే దైవం సాయినాథుడు


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు శ్రీకాంత్. మాది నాగర్ కర్నూల్. ఈ మధ్య ఒకసారి హఠాత్తుగా గ్యాస్ ఫామ్ అయ్యి నా భార్య చాలా ఇబ్బందిపడింది. గ్యాస్ సమస్య, గుండెపోటుకు సంబంధించి లక్షణాలు ఒకేవిధంగా ఉండటం వల్ల నా భార్య తనకి గుండెకు సంబంధించిన సమస్య వచ్చిందేమోనని తీవ్రంగా ఆలోచించింది. దాంతో తలనొప్పి, ఆయాసం కూడా వచ్చాయి. వెంటనే నేను నమ్ముకున్న దైవం అయిన ఆ సాయినాథుని వేడుకుని నా భార్యను డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళాను. డాక్టరు నా భార్యను పరిశీలించి, "ఎలాంటి గుండెజబ్బు లేదు. గ్యాస్ ఫామ్ అవటం వలన తలనొప్పి, ఆయాసం వచ్చాయి. ఒకటి, రెండు నెలలపాటు ఇబ్బంది ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు" అని చెప్పారు. దానితో నేను కాస్త ఊపిరి పీల్చుకుని ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నాను.


నేను ఒక ఉపాధ్యాయ సంఘంలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 2021, సెప్టెంబర్ 22, బుధవారంనాడు సంఘం ఎన్నికలు జరిగాయి. నన్ను నా పదవి నుండి తొలగించి వేరొకరిని నియమిస్తారని నాలో ఆందోళన మొదలైంది. నేను వెంటనే శ్రీసాయినాథుని మనసులో తలుచుకుని, "బాబా! మళ్లీ నా పదవి నాకు వచ్చినట్లయితే మీకు పాల అన్నం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తాన"ని మొక్కుకున్నాను. ఆ సాయినాథుని దివ్య కటాక్షం వలన నేను మళ్లీ నా మునుపటి పదవికి ఎన్నుకోబడ్డాను. దాంతో నా ఆనందానికి అవధులు లేవు. నిజంగా కోరిన కోరికలు తీర్చే నా ఇష్టదైవం శ్రీ సాయినాథునికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను.


శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.!!!




సాయిభక్తుల అనుభవమాలిక 941వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రేమ షరతులు లేనిది!
2. బాబా దయవలన ఆరోగ్యం

బాబా ప్రేమ షరతులు లేనిది!


నా పేరు జి.శ్రీలత. కొన్ని సంవత్సరాల క్రిందట నేను నా కుమారుడు, సోదరి మరియు కొద్దిమంది బంధువులతో కలిసి శిరిడీ దర్శించాను. ఆరోజు చాలా రద్దీగా ఉన్న కారణంగా  సమాధి మందిరంలోని మెయిన్ హాల్లో ఆరతికి హాజరయ్యే అవకాశం మాకు దొరకలేదు. అందువలన మేము టీవీలో వస్తున్న బాబా ఆరతి ప్రత్యక్ష ప్రసారం చూడసాగాము. కానీ నేను బాబాకి సమీపంగా మెయిన్ హాల్లో ఆరతికి హాజరయ్యే అవకాశం దక్కనందుకు చాలా బాధపడి నిరాశతో, "మనం ఇంట్లో కూర్చుని టీవీలో చూడటానికి, ఇక్కడిలా నిలబడి టీవీ చూడటానికి తేడా ఏముంది?" అని నా సోదరితో అన్నాను. ఆరతి పూర్తయిన తర్వాత మేము ముఖదర్శనానికి వెళ్లాము. నేను అక్కడ కూర్చుని కొన్ని సెకన్లపాటు కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాకొక చక్కటి దర్శనమైంది. ఆ దర్శనమందు సమాధి మందిరంలోని విగ్రహం నుండి బాబా బయటకి వెలువడి, నేరుగా నా వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నేను బాబా పాదాలను గట్టిగా పట్టుకుని వారి ఆశీస్సులు తీసుకున్నాను. నేను ఇంకేమీ కోరలేదు. కేవలం వారి ఆశీస్సులతో తృప్తిచెందాను. ఇది కల కాదు, దివ్యదర్శనం. ఆరతికి హాజరు కాలేకపోయానని బాధపడిన నాకు ఇంత అందమైన దర్శనాన్ని ప్రసాదించారు బాబా. ఆయన తన భక్తులను ఎన్నడూ నిరాశపరచరు. నేను చాలా సంతోషించాను. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తుచేసుకున్నా నాకు రోమాంచితం అవుతుంది. 


తరువాత మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మేమున్న క్యూ లైన్ ఆరతి కోసం నిలిపేశారు. కొంతసేపటి తరువాత మమ్మల్ని ఆరతి కోసంగా సమాధి మందిరంలోని ప్రధాన హాల్లోకి పంపించారు. నేను పట్టలేని ఆనందంతో ఆరతిలో పాల్గొన్నాను. ఆరతి పూర్తయిన తర్వాత సమాధి శుభ్రపరిచేందుకుగానూ బాబా మూర్తికి సమీపంలో ఉన్న మొదటి స్తంభం దగ్గర నన్ను సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. అక్కడ నిలబడి నేను సుమారు 15 నిమిషాలపాటు బాబా దర్శనం చేసుకుని అమితానందభరితురాలినయ్యాను. తరువాత మేము బయటకు వస్తూనే నా మేనకోడలు నాతో, "మనమీరోజే వెళ్ళిపోతాం కదా! మరోసారి దర్శనం చేసుకుందామా?" అని అడిగింది. దాంతో నేను మరోసారి దర్శనానికి వెళ్లాను. నేను ఆశ్చర్యపోయేలా ఈసారి కూడా శుభ్రపరిచే నిమిత్తం నన్ను మొదటి స్తంభం దగ్గర ఆపేశారు. మళ్లీ 15 నిమిషాలపాటు నేను బాబాను దర్శించుకున్నాను. ఈవిధంగా బాబా తన భక్తులపై షరతులు లేని ప్రేమను చూపిస్తారు. ఆయన తన భక్తులను నిరాశతో తిరిగి పంపరు. బాబా దివ్యదర్శనాన్ని మరియు సమీప దర్శనాన్ని పొందిన నేను చాలా చాలా అదృష్టవంతురాలిని.


ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. నేను అదివరకు నేరెడ్‌మెట్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసేదాన్ని. 2018లో బదిలీలు అవుతున్న సమయంలో నాకు ఎక్కడికి బదిలీ అవుతుందోనన్న భయంతో తిండి మీద ధ్యాస, నిద్ర కూడా ఉండేది కాదు. బదిలీల జాబితాలో ఉన్న ఏడుగురం శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేయసాగాము. అది చేస్తూ, రోజువారీ చేసే గ్రూపు పారాయణ చేయడం మానేశాను. అలా ఉండగా ఒకరోజు 'ఎక్కడికి బదిలీ అయ్యిందో ఈరోజు లిస్ట్ పెడతార'ని అన్నారు. తరువాత ఫోన్‍లో చూస్తే, 'ఈరోజు కాదు, ఆప్షనల్ సబ్జెక్టులకి సంబంధించిన లిస్ట్ రేపు పెడతార'ని ఉంది. అంతలో మావారు, "నువ్వు ఈమధ్య మన రోజువారీ పారాయణ అస్సలు చదవటం లేదు. చదువు!" అని నా చేతిలో పారాయణ పుస్తకంలోని ఏదో అధ్యాయం తెరిచి నా చేతిలో పెట్టారు. సరేనని, కూర్చుని ఆ అధ్యాయాన్ని చదివాను. చదవడం పూర్తి చేసి, పుస్తకం ప్రక్కన పెట్టేసరికి ట్రాన్స్‌ఫర్ లిస్టు పెట్టారు. బాబా దయవల్ల ఇంటినుండి వెళ్లొచ్చే దూరంలో మేడ్చల్ బాలికల పాఠశాలకు నాకు బదిలీ అయ్యింది. ఇలా ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉండి కాపాడేవారు బాబా. అయితే 2019, ఫిబ్రవరిలో నా భర్త స్వర్గస్తులైనప్పటినుంచి నాపై బాబా కరుణ తగ్గిందనిపిస్తుంది. అది ఎందుకో, మళ్లీ ఆయన కరుణ ఎప్పుడు నాకు ప్రాప్తమవుతుందో తెలియటం లేదు.


కొన్ని సంవత్సరాల క్రితం మా పిన్ని కూతురు మహాలక్ష్మి కుమార్తె మొదటిసారి ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లింది. విదేశాలకు వెళ్లేటప్పుడు తను తనతోపాటు శ్రీసాయిసచ్చరిత్ర వెంట తీసుకెళ్లాలనుకుంది. ఆ రూపంలో బాబా తనతో ఉంటారని తను భావించింది. అయితే మహాలక్ష్మి వద్ద సచ్చరిత్ర పుస్తకం ఒక్కటే ఉంది. దాన్నే ఆమె ప్రతిరోజూ పారాయణ చేస్తుంది. అందువలన ఆమె కుమార్తె తన తల్లి పారాయణ గ్రంథం తీసుకుని వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి వాళ్లిద్దరూ బాబా దర్శనం చేసుకుని, అలాగే సచ్చరిత్ర పుస్తకం తెచ్చుకుందామని దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లారు. అయితే, ఆరోజు ఆ పుస్తకం దొరకడం అసాధ్యమని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే, పుస్తకాల దుకాణం గురువారం మాత్రమే తెరచి ఉంటుంది. అనుకున్నట్లుగానే దుకాణం తెరచిలేదు. దాంతో వాళ్ళు బాబా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరి ఆలయద్వారం వద్దకు రాగానే ఆ ఆలయ వ్యవస్థాపకుడు ఎదురయ్యారు. అతను చాలా పవిత్రమైన వ్యక్తి, చాలా చిన్న వయస్సులోనే సాధువుగా మారారు. మాటల్లో అతను వాళ్ళకి సచ్చరిత్ర పుస్తకం కావాలని తెలుసుకుని, "పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేద"ని చెప్పాడు. మళ్ళీ అంతలోనే అమ్మాయి విదేశాలకు వెళ్తుందని మందిరం లైబ్రరీలో ఉంచిన తన సచ్చరిత్ర ప్రతిని తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. మహాలక్ష్మి, ఆమె కుమార్తె ఇద్దరికీ కన్నీళ్లు వచ్చాయి. మందిరం యొక్క సచ్చరిత్ర ప్రతి పవిత్రమైన వ్యక్తి చేతుల మీదుగా లభించడం గొప్ప ఆశీర్వాదంగా భావించి, 'మన బాబాసాయికి ఏదీ అసాధ్యం కాద'ని వాళ్ళు తమలో తాము అనుకున్నారు. అంతులేని ఆనందంతో వాళ్ళు మందిరం నుండి ఇంటికి బయలుదేరారు. బాబా ప్రేమ షరతులు లేనిది. ఆయన చేసే అద్భుతాలు లెక్కించలేనివి. ఆయన మార్గాలు అగమ్యగోచరం. నిండు ప్రేమతో పిలిచే భక్తుల వద్దకు బాబా పరిగెత్తుకుంటూ వస్తారు - వారి చిన్న చిన్న కోరికలను సైతం తీరుస్తారు.


బోలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా దయవలన ఆరోగ్యం


సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. ఒకసారి మా అత్తయ్యకు పీసీఓడీ సమస్య వచ్చింది. దాని కారణంగా ఓవర్ బ్లీడింగ్ అయి హెచ్.బి 4పాయింట్లకి పడిపోయి కోలుకోలేని పరిస్థితి వచ్చింది. దాంతో నాకు చాలా భయమేసి, "బాబా! అత్తయ్యకు నయం అయితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన అత్తయ్య ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. ఇటీవల నా స్నేహితురాలికి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్లు 75,000 కి పడిపోతే నేను, "బాబా! నా స్నేహితురాలు కోలుకుంటే 21 రూపాయలు ముడుపు కడతాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవలన తను కోలుకుంది. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ. మీకు శతకోటి ధన్యవాదాలు.



సాయిభక్తుల అనుభవమాలిక 940వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చల్లని తండ్రి బాబా చూపిన గొప్ప అద్భుతం
2. తిరుమల దర్శనం టికెట్ల బుకింగ్ లో బాబా సహాయం
3. భక్తునిగా మార్చిన బాబా అనుగ్రహం

చల్లని తండ్రి బాబా చూపిన గొప్ప అద్భుతం


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు లత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. డెంగ్యూ, కరోనా, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈమధ్య నాకు చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. దాంతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, కాళ్ళనొప్పులు, ఒళ్ళునొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. రెండు రోజులపాటు యాంటీబయాటిక్స్‌తో పాటు జ్వరం తగ్గటానికి మందులు వాడినప్పటికీ మూడవరోజుకి కూడా జ్వరం అలాగే కొనసాగింది. పైగా, మూడవరోజు మా చిన్నబాబుకి కూడా విపరీతమైన జలుబుతో తుమ్ములు మొదలయ్యాయి. దాంతో, అది వైరల్ ఫీవరేమోనని నాకు చాలా భయం వేసి, "బాబా! ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకున్నాము. మళ్ళీ ఇంతలోనే మాకు ఈ ఆపద ఏమిటి బాబా?" అని బాబాకి దణ్ణం పెట్టుకుని, నేను, మా బాబు ఊదీ కలిపిన నీళ్ళు త్రాగాము. అద్భుతమేంటంటే, ఊదీనీళ్ళు త్రాగిన వెంటనే నాకు జ్వరం తగ్గి, చాలావరకు మంచిగా అనిపించింది. కానీ మా బాబుకి జలుబు ఇంకా ఎక్కువై నిరంతరాయంగా తుమ్ములు రాసాగాయి. నాకు ఎంతో భయమేసి అదేరోజు సాయంత్రం బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాను. బాబును పరీక్షించిన డాక్టరు, "జలుబు బాగా ఎక్కువగా ఉంది" అని చెప్పి, మూడురోజులకు మందులు ఇచ్చారు. అయితే, అదేరోజు బాబుకి జ్వరం కూడా వచ్చింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. పైగా, "కళ్ళు సరిగా కనిపించడం లేదు" అన్నాడు. దాంతో నాకు మరింత భయమేసి, "బాబా! నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. దయచేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడు దయగల తండ్రీ. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతలోనే బాబు లేచి, "నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి" అన్నాడు. పైగా "కలలో సాయిబాబా కనిపించార"ని అన్నాడు. నిజంగా ఇది గొప్ప అద్భుతం! ‘బాబా బ్లాగులో పంచుకుంటాను’ అని అన్న మరుక్షణంలోనే బాబు ‘నాకు తగ్గిపోయింది’ అని చెప్పాడు. బాబా దయవల్ల ఆ మందులతో మూడు గంటల్లోనే  జ్వరం కూడా తగ్గిపోయి పూర్తిగా నయమైంది. చల్లని తండ్రి బాబా కృపవలనే ఇది సాధ్యమైంది. నిజానికి మాకు వచ్చిన జ్వరానికి నాకు ఎంతో భయం వేసింది. కానీ దయార్ద్రహృదయుడైన నా తండ్రి సాయిబాబా కరుణించి కాపాడారు. చల్లని తండ్రి బాబా దయవల్ల ఇప్పుడు మా ఇంట్లో అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. "బాబా! నేను మీకు ఎంతో ఋణపడివున్నాను. మీ నామస్మరణ చేయడం తప్ప ఇంకేమి చేయగలను సాయీ? సదా మీ నామస్మరణలో ఉండేలా అనుగ్రహించండి సాయీ".


చివరిగా తోటి సాయిభక్తులకు నాదొక విన్నపం: ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. చల్లని తండ్రి దీవెన మనకు ఎప్పుడూ ఉంటుంది. బాబా దయవల్ల అందరూ చల్లగా ఉంటారు. చల్లని తండ్రి బాబా ఉండగా మనకు భయమేల? బాబా దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


తిరుమల దర్శనం టికెట్ల బుకింగ్ లో బాబా సహాయం.


ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు, మీకు బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బాబాను వేడుకుంటున్నాను. అలాగే బాబా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మేము, మా అమ్మవాళ్ళు కలిసి 2021, సెప్టెంబర్ లో స్వామివారి దర్శనానికి తిరుమల వెళదామనుకున్నాము. కాబట్టి దర్శనానికి స్లాట్స్ ఓపెన్ అయ్యే రోజు టికెట్స్ బుక్ చేయడానికి ప్రయత్నించాము. అయితే సర్వర్స్ స్లో గా ఉన్న కారణంగా ఎంతసేపు ప్రయత్నించినా బుకింగ్ పేమెంట్ దగ్గర లేదా ఇంకెక్కడైనా అగిపోతుండేది. సరేనని కాసేపు ఆగి ప్రయత్నిస్తే, సెప్టెంబరులోని  స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయని వచ్చింది. దాంతో ఇక చేసేదిలేక అక్టోబర్ నెలలో వెళ్దామని అనుకున్నాము. అందుకు తగ్గట్టే, అక్టోబర్ నెల స్లాట్స్ ఓపెన్ అయిన రోజు టికెట్స్ బుక్ చేయడానికి ప్రయత్నించాం. అయితే, చాలామంది టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం వల్ల ఈసారి కూడా టికెట్స్ బుక్ చేయడం కష్టం అయ్యింది. దాంతో నాకు ఈసారి కూడా టికెట్స్ బుక్ అవుతాయో, లేదోనని టెన్షన్ గా అనిపించి, "టికెట్స్ బుక్ అయ్యేలా చూడమ"ని బాబాను, వెంకటేశ్వరస్వామిని వేడుకోవడం మొదలుపెట్టాను. "బాబా! ప్లీజ్ బాబా... టికెట్స్ బుక్ అయ్యేలా చూడు బాబా. తిరుమలలో అమ్మ కొన్ని మొక్కులు తీర్చుకోవలసి ఉందని మీకు తెలుసు కదా బాబా. ఇంకా ఆలస్యం కాకుండా చూడు బాబా ప్లీజ్. ఈ అనుభవాన్ని బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే, మేము అనుకున్న తేదీలలో కాకపోయినా బాబా, వెంకటేశ్వరస్వామి నిశ్చయించిన తేదీలో టిక్కెట్లు బుక్ అయ్యాయి. సంతోషంగా నేను మనసులోనే బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ అనుభవాన్నిలా మీతో పంచుకుంటూ బాబా, గోవిందుడి ఆశీస్సులతో తిరుమలకి జాగ్రత్తగా వెళ్లి, అన్ని మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. "బాబా! ఏడుకొండల స్వామి దర్శనం బాగా జరిగేలా, అన్ని వేళల ఆ స్వామి తోడుగా ఉండేలా అనుగ్రహించండి. ఇంకా మేమందరమూ ఏ క్షణానా మీ నామాన్ని మర్చిపోకుండా సదా మీ నామస్మరణ చేస్తూ ఉండేలా ఆశీర్వదించి మీ ప్రేమని అందరి మీద ఎప్పటికీ కురిపించండి బాబా. బాబా కరోనాతోపాటు మా అందరిలో ఉండే ప్రతికూలతను కూడా నిర్మూలించి, అందరమూ మీ మార్గంలో ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి.

సమస్త లోకా సుఖినోభవంతు.


భక్తునిగా మార్చిన బాబా అనుగ్రహం


ముందుగా బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నేను ఇప్పుడు మా నాన్నగారి అనుభవాన్ని, ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ అంతగా లేనందున ఆయన తరుపున నేను మీతో పంచుకుంటున్నాను. మా నాన్నగారు గవర్నమెంట్ టీచరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కొన్నేళ్ల క్రితం నాన్న పదవీ విరమణ చేయడానికి ముందు ఎలక్షన్స్ వచ్చాయి. మామూలుగా అయితే నాన్న 30 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు ఎలక్షన్ డ్యూటీని విజయవంతంగా పూర్తిచేశారు. కానీ ఉద్యోగ విరమణకు చేరువగా ఉన్న తరుణంలో, పైగా కొన్ని ఆరోగ్య సమస్యల వలన నాన్నకి ఎలక్షన్ డ్యూటీకి వెళ్లడం ఇష్టం లేకపోయింది. అందువలన నాన్న మొదటిసారి సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని, "ఎలక్షన్ డ్యూటీ రద్దు అయ్యేలా చూడు బాబా" అని అనుకున్నారు. కానీ నాన్నకి ఎలక్షన్ డ్యూటీ పడింది. దాంతో ఏదో తెలియని ఆందోళన, భయంతో అయిష్టంగానే బట్టలు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. మా అమ్మ ఎదురెళ్లి నాన్నని సాగనంపి ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసుకుంది. ఒక అరగంట తర్వాత మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అమ్మ వెళ్లి తలుపులు తీస్తే, ఎదురుగా నాన్న నిలబడి ఉన్నారు. "ఏమైంది, అప్పుడే తిరిగి వచ్చారు?" అని అడిగితే నాన్న, "చివరి నిమిషంలో ఎలక్షన్ డ్యూటీ రద్దయింద"ని చెప్పారు. అప్పటినుండి నాన్న సాయిబాబా భక్తుడయ్యారు. ప్రతిరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి, ఐదు ప్రదక్షణలు చేయనిదే టిఫిన్ కూడా తినరు నాన్న. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి. నాన్న ఆరోగ్యాన్ని కాపాడండి బాబా. ఆయనకి మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. మేము ఎల్లప్పుడూ శుభ్ర మార్గంలో నడిచేటట్టు, మా మనసు ఎప్పుడూ మంచినే ఆలోచించేటట్లు దీవించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 939వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన ఆనందం
2. సాయికృపకు నిదర్శనంగా స్థలం కొనుగోలు

బాబా ప్రసాదించిన ఆనందం


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఆ సాయినాథుని దయ సర్వవేళలా మనందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు గంగాభవాని. నేను సాయిభక్తురాలిని. ఆ తండ్రి ఎక్కడో ఉండాల్సిన నన్ను ఒక దరికి చేర్చారు. బాబా దయవల్ల నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. 2021, సెప్టెంబరు నెలలో బాబా నాకు ప్రసాదించిన ఆనందాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. బాబా ప్రసాదించిన అనుభవాలను ఇలా బ్లాగులో పంచుకుంటుంటే నేరుగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లుగా ఉంది. మేము గత రెండు, మూడు సంవత్సరాలుగా ఒక సొంతఇంటి కోసం ప్రయత్నిస్తున్నాము. కానీ మా ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరికి బాబా అనుగ్రహించి 2021, సెప్టెంబరు 23న మా పేరిట ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయించారు. ఈరోజు కోసం కొన్ని నెలలుగా నేను ఎదురుచూశాను. బాబా దయవలన అది ఇప్పటికి నెరవేరింది. ఇక తొందరలోనే బాబా నాకు ఒక ఇల్లు కూడా కట్టించి ఇస్తారని నాకు నమ్మకం ఉంది.


2021, సెప్టెంబరు మూడవవారంలో మా అక్కకూతురు వాళ్ళ ఇద్దరి పిల్లలకి జ్వరాలు వచ్చాయి. డాక్టరుకి చూపిస్తే, మందులు వ్రాసి, కోవిడ్ టెస్ట్ కూడా చేయించమన్నారు. 6 నెలలు వయస్సున్న చిన్నపాపకి కోవిడ్ టెస్ట్ చేయించడానికి మాకు భయం వేసింది. అయినా చేసేదేమీ లేక వాళ్ళను మా ఇంటికి తీసుకువచ్చాము. కానీ పిల్లలను చూసి నాకు భయమేసి, "వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకుని, ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ, బాబా ఊదీని పిల్లల నుదుటన పెడుతూ, మరికొంత ఊదీని పిల్లల నోట్లో వేస్తూ వచ్చాము. అలా బాబా మీదే భారం వేశాముగానీ టెస్ట్ మాత్రం చేయించలేదు. బాబా దయవల్ల క్రమంగా రెండు రోజులకి జ్వరం, నీరసం తగ్గాయి. వాళ్ళు ఆరోగ్యంగా సెప్టెంబరు 29న వాళ్ళింటికి తిరిగి వెళ్లారు. "సంతోషం బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు".


సాయిబంధువులారా! బాబా పాదాల మీద నమ్మకం ఉంచండి. తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. పిలిచినంతనే పలికే దైవం మన బాబా. మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తే, క్షణక్షణం ఆయన లీలలు చవిచూస్తాము, ప్రతిదీ ఒక మధురానుభూతిగా మిగులుతుంది. బాబాకు శరణాగతి చేసిన భక్తులు ఇతరులు కష్టంలో ఉంటే చూడలేరు. వాళ్ళ తరఫున, "వాళ్ళ కష్టాన్ని తొలగించమ"ని బాబాను ప్రార్థిస్తారు. అది బాబా తమ భక్తులకిచ్చిన సంస్కారం. ఇతరులు వాళ్ళకోసమే కోరుకుంటారు. చివరిగా మీ అందరికీ నాదో విన్నపం: ప్రతిరోజూ బాబాను ప్రార్థించేటప్పుడు, మనకి తెలిసి ఎవరైనా సమస్యలలో ఉంటే వాళ్లకోసం కూడా బాబాను ప్రార్థిద్దాం. దానివల్ల మనకి పోయేదేమీ లేదు. మహా అయితే 2 నిమిషాల సమయం అంతే. కానీ తరువాత వచ్చే ఫలితాన్ని చూడండి. బాబా దయవల్ల వాళ్ళు సమస్యల నుండి బయటపడి శ్రేయస్సు పొందుతారు. అలాగే బాబా మనల్ని సన్మార్గంలో నడిపించి ఉద్ధరిస్తారు. అందరూ సదా బాబా కృపకు పాత్రులుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


సాయికృపకు నిదర్శనంగా స్థలం కొనుగోలు


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు అనురాధ. మాది వైజాగ్. ఒక ఆరునెలలుగా సొంతిల్లు లేదని నాకు ఎంతో మనోవేదన కలుగుతుండేది. నేను అలా ఉన్న ప్రతిసారీ, "నేను ఉన్నాను. నీకు అన్నింటికంటే ఉత్తమమైనది ఇస్తాను" అని బాబా గ్రూపు నుండి బాబా మెసేజెస్ వస్తుండేవి. కొన్నిరోజులకు నా వద్దనున్న బంగారం బ్యాంకులో పెట్టి చిన్న స్థలం ఏదైనా తీసుకుందామని ఆలోచన చేసి, మా తమ్ముడితో, "ఒక స్థలం చూడమ"ని చెప్పాను. రెండునెలల తరువాత 2021, ఆగస్టు 8న మా తమ్ముడు ఫోన్ చేసి, "ఒక 8 సెంట్లు స్థలం ఉంది. అది కమర్షియల్‌గా కూడా పనికొస్తుంది. నీ జీవితం స్థిరపడిపోతుంది. కాకపోతే స్థలం కొద్దిగా క్రాస్ ఉంది. కానీ తక్కువ ధరకి వస్తుంది. ఆ ఏరియాలో సెంటు పది లక్షల రూపాయలు ఉన్నప్పటికీ మొత్తం 8 సెంట్ల స్థలం కేవలం 35 లక్షల రూపాయలకే వచ్చేస్తుంది" అని చెప్పాడు. నేను తనతో, "ఆ స్థలం వలన ఏమైనా ఇబ్బందివుంటే బాబా నా వరకు రానివ్వరు. మంచిదైతే బాబా నాకు తప్పక కుదురుస్తారు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కదా! ఏం చేయను?" అని అన్నాను. అందుకు తను, "నాన్న ఇచ్చిన 20 సెంట్ల స్థలం ఉంది కదా, దానిలోనుండి ఒక పది సెంట్ల స్థలం అమ్మి, మరికొంత డబ్బు కలిపి కొందామ"ని చెప్పాడు. నేనందుకు అంగీకరించి 2021, ఆగస్టు 19, గురువారంనాడు ఆ స్థలాన్ని చూశాను. తర్వాత 2021 ఆగస్టు 24న తమ్ముడు ఫోన్ చేసి, "ఇద్దరు, ముగ్గురు ఆ స్థలం చూస్తున్నారు. చేజారిపోతుందేమో! మనం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేద్దాం" అన్నాడు. సరేనని 2021, ఆగస్టు 26, గురువారంనాడు గోల్డ్ లోనులో డబ్బులు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చి, "మూడు నెలల తర్వాత మిగిలిన మొత్తం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామ"ని మాట్లాడుకున్నాము. ఆరోజే నేను, "ఏ సమస్యలూ రాకూడద"ని సాయి నవగురువారవ్రతం మొదలుపెట్టాను. కానీ వారంరోజుల తరువాత ఆ స్థలం యజమాని, "నాకు ఎక్కువ డబ్బులిచ్చే మంచి బేరం వచ్చింది. వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థలం వదిలేయండి. మీరిచ్చిన అడ్వాన్స్ డబ్బులకి లక్ష రూపాయలు కలిపి వెనక్కి ఇచ్చేస్తాను. లేదంటే మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి" అని పేచీపెట్టడం మొదలుపెట్టి తమ్ముడిని చాలా ఇబ్బందిపెట్టసాగాడు. మేము అమ్మాలనుకున్న స్థలం విషయంలో ఇంకా బేరం కుదరనందువల్ల ఏం చేయాలో పాలుపోక మా తమ్ముడు నన్ను ‘ఏం చేద్దామ’ని అడిగాడు. నేను బాబాపై భారం వేసి తమ్ముడితో, "వేరే అవకాశం లేదు కదా. అంత ఎక్కువ మొత్తం ఇప్పటికిప్పుడు ఎక్కడనుండి తెస్తాము? సరే వదిలేయ్, ఎందుకు అతన్ని ఇబ్బందిపెట్టి, నువ్వూ ఇబ్బందిపడడం? ఎలా ఉంటే అలా అవుతుంది" అని చెప్పాను. నా మనసులో మాత్రం 'బాబా ఏదో ఒకటి చేస్తార'నే నమ్మకం ఉంది. ఎందుకంటే, ఈ సమస్య రావడానికి ముందే, "నా భావూ(సోదరుడు) ఇతరులను డబ్బు ఎందుకు  అడగాలి? నేను అతనికి డబ్బిస్తాను" అని బాబా సందేశమిచ్చారు. ఆ సమయంలో నాకు అది అర్థం కాలేదుగానీ, సమస్య వచ్చాక బాబా ఏం చెప్తున్నారో అర్థమైంది.


నేను బాబా చాలీసా చదువుతూ, "ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. రెండురోజుల తరువాత మా తమ్ముడు ఫోన్ చేసి, "నా ఫ్రెండ్ రూపాయి వడ్డీకి 20 లక్షల రూపాయలు అప్పుగా ఇస్తానన్నాడు. తిరిగి ఇవ్వడానికి ఒక సంవత్సరం అయినా ఫర్వాలేదు. మన స్థలం అమ్మిన తరువాత తనకి డబ్బు ఇచ్చేయవచ్చు. ఆ స్థలం పోతే మళ్ళీ రాదు" అని చెప్పాడు. దాంతో స్థలం యజమానితో మాట్లాడి 2021, సెప్టెంబరు 23, గురువారం, అంటే నా నవగురవారవ్రతంలోని ఐదవ గురువారంనాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. స్థలం చూడటం, అడ్వాన్స్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్.. ఇలా ఆ స్థలానికి సంబంధించి ప్రతీదీ గురువారం జరగటం, పైగా మొత్తమంతా ఒకటిన్నర నెలలో పూర్తికావడం సాయికృపకు నిదర్శనం. ఆ నెలరోజుల్లో ఎన్నో మలుపులు, టెన్షన్లు. కానీ 'బాబా' అన్న పిలుపు అన్నిటినీ తరిమేసింది. ఈ మొత్తం ప్రక్రియలో మా తమ్ముడు ఒక వాహకం మాత్రమే. తన రూపంలో స్థలం చూడటం, మాట్లాడటం, డబ్బు సమకూర్చడం, రిజిస్ట్రేషన్, మా స్థలం అమ్మటం... అన్నీ బాబానే చేయించారు, చేయిస్తున్నారు. నేను కేవలం ‘సరే’, ‘నీ ఇష్టం’, ‘అలాగే’ అని తల ఊపుతున్నాను. నా జీవితంలో ఇంటి స్థలం, అదీ అంత ఖరీదైన ప్రాంతంలో కొంటానని నేను అస్సలు అనుకోలేదు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే, డబ్బు సహాయం కాదు కదా, మాట సహాయం కూడా చేయని కుటుంబంలో ఒక ఆడమనిషి వల్ల ఇదంతా సాధ్యమవుతుందా? ఇదంతా బాబా కృప. ఆయన నీడలో ఉండబట్టే ఇదంతా సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నా జీవితంలో ఏమున్నా, లేకున్నా, ఎవరున్నా, లేకపోయినా నాకు మీ పాదాల చెంత కొంచెం చోటివ్వండి బాబా. నిరంతరం మీ ధ్యాసలో ఉండేలా అనుగ్రహించు తండ్రీ సాయినాథా. అందరినీ చల్లగా కాపాడు తండ్రీ".



సాయిభక్తుల అనుభవమాలిక 938వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మన నిజమైన అవసరాలేమిటో బాబాకి మాత్రమే తెలుసు
2. ఆపద నుండి రక్షించిన సాయి

మన నిజమైన అవసరాలేమిటో బాబాకి మాత్రమే తెలుసు


బాబాకు నమస్కరిస్తూ, వారి ఆశీస్సులు మనందరికీ సదా ఉండాలని కోరుకుంటూ నా స్వీయ అనుభవమొకటి మీ అందరితో పంచుకుంటున్నాను. 2021, ఆగస్టు 6న నేను, మా తమ్ముడు పనిమీద వైజాగ్ వెళ్ళాం. దారిలో డి-మార్ట్‌లో సరుకులు తీసుకుందామని వెళితే, అక్కడ కారు పార్క్ చేసేందుకు స్థలం లేదు. దాంతో, 'తిరుగు ప్రయాణంలో వద్దాం. అప్పుడు కారు పార్క్ చేసేందుకు బాబా అవకాశం ఇస్తారులే' అనుకొంటూ సిటీలోకి వెళ్లి పని చూసుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ డి-మార్ట్‌కి వచ్చాం. ఈసారి కూడా కారు పార్క్ చేయడానికి ఖాళీ లేదు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు, ‘ఎడమవైపు రెండో వీధిలో పార్క్ చేసుకోమ’ని అన్నాడు. ఇంక చేసేది లేక అతను చెప్పిన చోటికి వెళ్తే, అక్కడ కూడా కారు పార్క్ చేయడానికి సరైన స్థలం కనపడలేదు. దాంతో తిరిగి డి-మార్ట్ వద్దకి వస్తూ, ‘ఈసారైనా పార్క్ చేయడానికి అవకాశం ఉంటుందేమో’నని ఆశపడ్డాం. కానీ నిరాశే ఎదురైంది. బాబా సహాయం చేయలేదని ప్రత్యేకించి అనుకోకపోయినా, మనసుకైతే కాస్త అనిపించింది. సరే, కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక చిన్న వీధిలో కారు పార్క్ చేసొచ్చి డి-మార్ట్ లోపలికి వెళ్ళాము. చకచకా కావలసిన సరుకులను ట్రాలీలో వేసుకున్నాక మా తమ్ముడు బిల్లింగ్ కోసం నన్ను లైనులో ఉండమని చెప్పి, తను ఫస్ట్ ఫ్లోర్‌లో ఐటమ్స్ చూసుకుని వస్తానని వెళ్ళాడు. తను అటు వెళ్ళగానే కౌంటరులో బిల్లింగ్ చేస్తున్న అతను, "ఆ లైనులో కేవలం కార్డు ద్వారా మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంద"ని చెప్పాడు. సాధారణంగా మా తమ్ముడు ఎప్పుడూ కార్డు ద్వారానే క్యాష్ చెల్లిస్తాడు. కాబట్టి నేను ఆ లైనులోనే నిల్చున్నాను. కానీ, కాసేపటిక్రితం రిలయన్స్ ఫ్రెష్‌లో మా తమ్ముడి దగ్గరున్న కార్డు పనిచేయలేదు. అందువల్ల, ‘తన దగ్గర వేరే కార్డు ఉందో, లేదో? ఒకవేళ లేకుంటే కనీసం క్యాష్ అయినా ఉందో, లేదో? లేకపోతే ఏమిటి పరిస్థితి?’ అని ఆలోచిస్తూ టెన్షన్ పడసాగాను. బిల్లింగ్ కోసం నా ముందు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నడవడిని బట్టి వాళ్లంతా ఒకే గ్రూపులా అనిపించింది. వాళ్ళందరి చేతుల్లో ఒకటి, రెండు ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ల బిల్లింగ్ అయిపోయాక వరుసలో నేనే బిల్లింగ్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, మా తమ్ముడు ఇంకా రాలేదు. అందువల్ల నా వెనుకనున్న అతన్ని బిల్లింగ్ చేయించుకోమని చెప్తుండగా మా తమ్ముడు దూరంగా కనిపించాడు. తనని తొందరగా రమ్మని సైగ చేసి పిలిచాను. తను రాగానే, "ఈ కౌంటర్లో కేవలం కార్డు బిల్లింగ్ చేస్తారట. మరి రిలయన్స్ ఫ్రెష్‌లో కార్డు పనిచేయలేదు కదా, వేరే కార్డు ఉందా?" అని అడిగాను. అందుకు తను, "వేరే కార్డు లేదుగానీ, ఉన్న కార్డు పనిచేస్తుందిలే" అన్నాడు. మళ్లీ అంతలోనే, "ఈ సరుకులకు సరిపడా అమౌంట్ కార్డులో లేదు" అని అన్నాడు. 'మరెలా?' అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒకతను మా వద్దకి వచ్చి, మా ట్రాలీని చూపిస్తూ, "ఈ సరుకులు 3,500 రూపాయలు అవుతాయా?" అని అడిగాడు. అతనెందుకు అలా అడిగాడో మాకు అర్థం కాలేదుగానీ, "ఆ, అంతకంటే ఎక్కువే ఉంటాయి" అని అన్నాము. అప్పుడతను, "3,500 రూపాయల సరుకులకు నా కార్డు మీద డబ్బులు పే చేస్తాను. మిగతావి మీరు చేసుకోండి" అని అన్నాడు. అసలే మా కార్డులో డబ్బులు సరిపోవన్న ఆలోచనలో ఉన్న మేము వేరే ఆలోచన ఏమీ చేయక అతను ఇచ్చిన ఆఫర్‌కి అంగీకరించాము. వెంటనే మా ట్రాలీలో ఉన్న సరుకులు బిల్లింగ్ చేయడం మొదలుపెట్టి, సుమారు 4,000 రూపాయలయ్యాక మా తమ్ముడు తన దగ్గర ఉన్న కార్డు ఇచ్చాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ కార్డు పనిచేయలేదు. దాంతో మాకు సహాయం చేస్తానన్నతను ఆ అమౌంటును సుమారు 3,500 రూపాయలకు సెట్ చేయించి, తన కార్డు మీద ఆ డబ్బులు పే చేశాడు. ‘ఇక మిగిలిన సరుకుల విషయం ఏం చేద్దాం?’ అనుకుంటుండగా అతను తనంతట తానే, "అవి కూడా బిల్లింగ్ చేయించండి, వాటికి కూడా నా కార్డు మీద పే చేస్తాను. తరువాత మనం చూసుకుందాం" అని అన్నాడు. సరేనని మిగిలినవి కూడా బిల్లింగ్ చేసి బయటకి వచ్చాము. అతను తనకి ఎంత అమౌంట్ ఇవ్వాలో లెక్కించి చెప్తే, మా తమ్ముడు తన వద్ద ఉన్న క్యాష్ ఇవ్వబోయాడు. అందుకతను, "క్యాష్ అయితే నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్లి అకౌంటులో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్-పే ద్వారా నా అకౌంటుకి పంపించమ"ని అన్నాడు. నాకు అంతా చిత్రంగా అనిపించింది. మా తమ్ముడు ఫోన్-పే, మొబీక్విక్, పేటిఎమ్‌ల ద్వారా ప్రయత్నించినప్పటికీ ఏదో ఎర్రర్ చూపిస్తూ అతని అకౌంటుకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కాలేదు. సమస్య ఏమిటో అర్థం కాలేదుగానీ, అడగకుండానే అంత సహాయం చేసిన అతనికి కావాల్సిన విధంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే బాగుంటుందనిపించి, తెలిసినవాళ్లకి ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాము. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి క్యాష్ రూపంలోనే అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మేము అతనికి మాటల్లో కృతజ్ఞతలను చెప్పినా, మాకు అంత సహాయం చేసిన తనకి నచ్చినట్లు చేసి తనని సంతృప్తిపరచలేకపోయాము.


తరువాత మేము కారులో వస్తూ జరిగినదాని గురించి చర్చించుకుంటుండగా, బాబా మార్క్ స్పష్టంగా అర్థం కాసాగి మాకు చాలా సంతోషంగా అనిపించింది. కాస్త వివరంగా చెప్పాలంటే, అప్పటివరకు మా ముందు లేని ఆ వ్యక్తి ఉన్నట్టుండి మా ముందుకు వచ్చాడు. అతని చేతిలో రెండు మూడు ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. అవి మహా అయితే రెండు, మూడు వందలలోపే ఉంటాయి. తన మానాన తాను తన కార్డు మీద డబ్బులు పే చేసుకుని వెళ్లిపోవచ్చు. మాకు సహాయం చేయాల్సిన అవసరం అతనికి ఎంత మాత్రమూ  లేదు. కానీ తనంతటతానే వచ్చి మాకు సహాయం చేశాడు. అయినా ఈ రోజుల్లో అడిగితేనే ఎవరూ సహాయం చేయరు. అంతెందుకు? అతని స్థానంలో మేమున్నా చేసేవాళ్ళం కాదేమో! మరి అతనెందుకు తనంతట తానే డబ్బులు పే చేస్తానని అన్నాడు? పోనీ, తనకి నగదు రూపంలో డబ్బులు కావాల్సి ఉండి మాకు సహాయం చేసి బదులుగా క్యాష్ తీసుకోవాలని అనుకున్నాడనుకోవడానికీ లేదు. ఎందుకంటే, మేము క్యాష్ ఇస్తే, ‘అలా వద్దు, అకౌంటులోకే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమ’న్నాడు. ఇలా ఎంత ఆలోచించినా అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


నిజానికి మేము పార్కింగ్ విషయంలోనే బాబా సహాయాన్ని ఆశించాము. ఎందుకంటే, కారు దూరంగా ఎక్కడో పెడితే, ట్రాలీని అక్కడివరకు తీసుకువెళ్లే అవకాశం ఉండదు గనుక, ‘అంతదూరం సరుకులు ఎలా తీసుకెళ్తామ’ని భయపడ్డాము. మాకదే అవసరంగా అనిపించిందిగానీ, బిల్లింగ్ దగ్గర మేము మా అవసరాన్ని గుర్తించలేదు, బాబాను తలచుకోలేదు. ఎందుకంటే, మా వద్ద క్యాష్ ఉంది కాబట్టి వేరే కౌంటర్లో బిల్లింగ్ చేసుకోవచ్చు. కానీ అలా జరగడం వెనుక ఏవో పరిణామాలు ఉండే ఉండొచ్చు. అవేమిటో మాకు తెలియకున్నా అందరి అంతరాత్మ తామై, సదా కంటికి రెప్పలా మనల్ని కనిపెట్టుకుని ఉండే బాబాకు తెలుసు కాబట్టి మా అవసరాన్ని గుర్తించి, అడగకనే సహాయం అందించారు. ఈ అనుభవం ద్వారా, నిజంగా మన అవసరాలేమిటో మనకు తెలియవనీ, అందువల్ల బాబాను ఏవేవో అడిగి, అవి నెరవేరకపోతే మనం కోరింది ఆయన ఇవ్వలేదనీ, సహాయం చేయలేదనీ అనుకుంటాంగానీ, మన అవసరాలు మనకన్నా ఎక్కువ బాబాకే తెలుసుననీ, మనం అడగకపోయినా ఊహించని రీతిలో వాటిని సమకూరుస్తారనీ, సహాయం అందిస్తారనీ అర్థమైంది. ఇప్పటికీ ఈ బాబా అనుగ్రహాన్ని నేను మరువలేకపోతున్నాను. ఎప్పుడు తలచుకున్నా ‘బాబా ఎంతలా మనల్ని కనిపెట్టుకుని ఉంటున్నారో’ అనిపిస్తుంది. ఇలా చెప్తూ పోతే బాబా నాపై కురిపించిన అనుగ్రహం గురించి ఎంతైనా చెప్తూపోతానేమో! ఎందుకంటే, అంత అనుగ్రహాన్ని బాబా చూపారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. అమృతానికే తలమానికమైన మీ ప్రేమను నిరంతరం ఆస్వాదిస్తూ మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి బాబా".


ఆపద నుండి రక్షించిన సాయి


సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు కళ్యాణి. నేను ఇప్పుడు బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు నాకు కలలో మరియు ధ్యానంలో మా నాన్నకి ప్రమాదం జరగనున్నట్లు వచ్చింది. దాంతో నాకు చాలా భయం వేసింది. మరుసటిరోజు గురువారం, సాయి దివ్యపూజ చివరిరోజు. బాబా గుడికి వెళ్ళి, బాబాను ప్రార్థించి ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక ధ్యానం చేస్తే, మళ్ళీ నాన్నకి ప్రమాదం జరగనున్నట్లు వచ్చింది. వెంటనే నేను మా అమ్మకి విషయం చెప్పాను. తరువాత నాన్నకి ఫోన్ చేసి, "నేలపై ఉన్న మట్టి/ఇసుకను బాబా ఊదీగా భావించి పెట్టుకోమ"ని చెప్పాను. నాన్న నేను చెప్పినట్లే చేశారు. తరువాత మేము దూఫ్ హారతి చూస్తుండగా ఒక చిన్నపిల్లవాడు మా ఇంటికొచ్చి అరటిపండు అడిగాడు. మేము తనకి ఒక అరటిపండు, రెండు రూపాయలు ఇచ్చి పంపి సాయిని ప్రార్థించాము. కాసేపటికి నాన్న సురక్షితంగా ఇంటికి వచ్చారు. నేను నాన్నను, "ఏమైనా జరిగిందా?" అని అడిగాను. అందుకు నాన్న, "ఏం కాలేదు. కానీ ఓ చోట వాహనం ఆదుపు తప్పింది" అని చెప్పారు. ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటున్న బాబాకి కృతజ్ఞతలు.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo