మొదట్లో తాత్యా శ్రావణ సోమవారాలు, ఏకాదశి, మహాశివరాత్రి వంటి రోజులలో ఉపవాసముండేవాడు. అతను బాబాతో కలిసి మశీదులో నిద్రించనారంభించిన తరువాత ఆయా రోజులలో బాబా, "అరే, ఏం సోమవారం, ఏం ఏకాదశి, ఏం శివరాత్రి చేస్తావు? ఇది తిను, ఇది తిను" అంటూ అతని చేత భోజనం (మాంసం, పళ్ళు, కొలంబాలోని ఇతర ఆహారపదార్థాలు) తినిపించేవారు. ఒక శివరాత్రినాడు తాత్యా బాబాతో, "బాబా! దయచేసి ఈ శివరాత్రినాడైనా నా చేత ఏమీ తినిపించకండి" అని అన్నాడు. అప్పుడు బాబా, "తినరా! తిను! ఏం శివరాత్రి?" అని అన్నారు. అక్కడే వున్న దాదాకేల్కర్ తాత్యాతో, "ఉపవాసం ఉండలేకపోతున్నానని నిరాశ చెందక బాబా చెప్పినట్లు చెయ్యి" అని అన్నాడు. దాదాకేల్కర్ సూచనమేరకు తాత్యా బాబా ఆదేశాన్ననుసరించి అంతటితో తన ఉపవాసాన్ని విరమించి భోజనం చేశాడు. అంతేకాదు, ఆనాటినుండి మరెప్పుడూ సోమవారం, ఏకాదశి, శివరాత్రి మొదలైన ఏ రోజుల్లోనూ తాత్యా ఉపవాసం ఉండలేదు. ఉపవాసం వల్ల ఇటు ఐహికంగాగానీ, అటు ఆధ్యాత్మికంగాగానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. అందుకే బాబా తమ భక్తులను ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు.
తాత్యా నలుగురికీ సహాయపడే మంచి స్వభావంతో గ్రామస్థులకు గొప్ప పరోపకారిగా ఉండేవాడు. తగాదాల పరిష్కారానికి ఎందరో అతని వద్దకు మధ్యస్థం చేయమని వచ్చేవారు. ఉరుసు ఉత్సవం చేయాలనుకున్నప్పుడు ఆమోదముద్ర వేసింది మొదలు ఆ ఉత్సవం రామనవమిగా రూపాంతరం చెందిన తరువాత కూడా ఉత్సవానికి సంబంధించి అన్ని పనులూ తాత్యా స్వయంగా చూసుకునేవాడు. ఇంకా మసీదు, చావడి వద్ద ఏర్పాట్లన్నీ అతనే చూసుకొనేవాడు. బాబాకు కావలసిన సరుకులను కూడా అతనే రహతా నుండి తెచ్చేవాడు. ఒకరోజు బాబా తాత్యాకు 4 రూపాయలిచ్చి రహతా బజారు నుండి కొన్ని సరుకులతోపాటు తమలపాకులు, రేగుపళ్ళు కొని తీసుకురమ్మని చెప్పారు. వెంటనే తాత్యా రహతా బజారుకి వెళ్లి అన్ని సరుకులూ తీసుకొన్న తరువాత మంచి రేగుపళ్ళను ఏరి తీసుకొచ్చాడు. వాటిని బాబా ముందుంచి, "బాబా! మీరు రేగుపళ్ళు తెమ్మని చెప్పారు కదా, ఇవిగో తెచ్చాను" అని అన్నాడు. బాబా వాటిని తాత్యాకి, మహల్సాపతికి ఇవ్వనారంభించారు. అప్పుడు తాత్యా, "బాబా! మీరు కనీసం ఒకట్రెండు రేగుపళ్ళు తింటే నేను తింటాను" అని అన్నాడు. అందుకు బాబా, "నేను ఇప్పుడు తినను. మీరు తినండి" అని అన్నారు. అప్పుడు తాత్యా, "అయితే, నేను కూడా తినను" అని అన్నాడు. ఈవిధంగా కాసేపు వారివురి మధ్య సంవాదం నడిచింది. బాబా ఎంతకీ రేగుపళ్ళు తినకపోవడంతో తాత్యా ఆ రేగుపళ్లన్నీ రుమాలులో చుట్టి తన ఇంటికి తీసుకొనిపోయాడు. ఎప్పటిలాగే ఆరోజు రాత్రి బాబాకోసం రొట్టెలు తీసుకొస్తూ వాటితోపాటు రేగుపళ్ళు కూడా తీసుకొని వెళ్లి బాబా ముందుంచి, "ఇప్పుడైనా వీటిని తినండి బాబా" అని అన్నాడు. అందుకు బాబా, "నువ్వు తిను" అన్నారు. వారివురి మధ్య మధ్యాహ్నం మాదిరే మళ్ళీ వాదన ప్రారంభమైంది. చివరికి తాత్యాకు చాలా కోపమొచ్చి, ఆ రేగుపళ్ళన్నీ మశీదు ప్రాంగణంలో విసిరేసి, ఆ సమయంలో చావడి వద్ద ప్రదర్శింపబడుతున్న నాటకం చూడటానికి వెళ్ళిపోయాడు. బాబా, మహల్సాపతి కలిసి తాత్యా విసిరేసిన రేగుపళ్ళన్నీ ఏరారు. తరువాత మహల్సాపతి తాత్యాను పిలవడానికి వెళ్ళాడు. కానీ తాత్యా రాలేదు. అలా రెండు, మూడుసార్లు పిలిచిన తరువాత చివరికి తాత్యా మసీదుకు వెళ్లి బాబా వద్ద కూర్చున్నాడు. బాబా మళ్ళీ కొన్ని రేగుపళ్ళు మహల్సాపతికిచ్చి, కొన్ని తాత్యాకి ఇవ్వబోయారు. "మీరు తింటే, నేను తింటాను" అన్నాడు తాత్యా. అందుకు బాబా, "నేను చెప్తున్నాను, తిను" అన్నారు. దాంతో తాత్యాకు మళ్ళీ కోపమొచ్చి అక్కడినుండి లేచి నాటక ప్రదర్శన చూడటానికి వెళ్ళిపోయాడు. ఈసారి అతనిని పిలవడానికి దగడూభావ్, కొండాజీ వెళ్లారు. కానీ తాత్యా రాలేదు. అప్పుడు మహల్సాపతి తాత్యా వద్దకు వెళ్లి, "పద! బాబా ఆందోళన చెందుతున్నారు. నన్ను నిద్రపోనివ్వడం లేదు" అని అన్నాడు. అప్పుడు తాత్యా తన పంతాన్ని కాస్త తగ్గించుకుని మశీదుకు వెళ్ళాడు. కానీ కాస్త కోపంగానే ఉన్నాడు. బాబా ఒకటి, రెండు రేగుపళ్ళు తమ నోట్లో వేసుకొని, కొన్ని మహల్సాపతికిచ్చి, "నువ్వు తిని, అతనిని తినమని చెప్పు" అన్నారు. అప్పుడు తాత్యా రేగుపళ్ళు తిన్నాడు. కానీ బాబా మాత్రం అతనితో మాట్లాడలేదు. తరువాత అందరూ నిద్రపోయారు.
బాబా ఏ సంవత్సరం నుండి ఒకరోజు మసీదులో, ఒకరోజు చావడిలో నిద్రించడం ప్రారంభించారో స్పష్టంగా తెలియడంలేదుగానీ, 1909వ సంవత్సరం నుండి భక్తులు ఆయనను ఊరేగింపుగా చావడికి తీసుకొని వెళ్లడం ప్రారంభించారు. బాబా చావడికి వెళ్లేరోజు ముందుగా భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిరతలు, మృదంగం, కంజీర మొదలైన వాద్యాలతో కొంతసేపు భజన చేసేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసికోట, ఎదురుగా బాబా, మధ్యలో భక్తబృందమూ వుండేవారు. కొందరు భక్తులు మసీదు గేటువద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే, కొందరు పల్లకీని అందంగా అలంకరించేవారు. దండధారులైన కొందరు భక్తులు, "సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై" అని జయజయధ్వానాలు చేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ, రంగురంగుల తోరణాలతోనూ కళకళలాడుతుండేది. మసీదు ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ(గుఱ్ఱం) నిలబడేది. అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళేవాడు. కానీ బాబా మాత్రం కూర్చున్న చోటునుండి కదలక తాత్యా వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేవారు. తాత్యా వచ్చి చేయి పట్టుకొని లేపితేనే బాబా లేచి నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలింగొట్టం, పొగాకూ తీసుకుని, భుజానికొక పాతగుడ్డ వేసుకుని చావడికి బయలుదేరేవారు. అప్పుడు తాత్యా ఒక బంగారు జరీశాలువాను బాబా భుజాలపై కప్పేవాడు. మహల్సాపతి బాబా కుడిచేతిని పట్టుకోగా తాత్యా ఒక చేత్తో బాబా ఎడమచేతిని, మరో చేతితో లాంతరు పట్టుకొని బాబాను ముందుకు నడిపించేవారు. బాబా చావడి చేరగానే ముందుగా తాత్యా లోపలికి వెళ్లి బాబాకు ఆసనము, అనుకోవడానికి చెక్క అమర్చి, బాబాను ఆ ఆసనంపై కూర్చోబెట్టి, అందమైన కోటు తొడిగేవాడు. కాసేపటికి శ్యామా చిలింను వెలిగించి తాత్యాకిచ్చేవాడు. తాత్యా ఆ చిలింను పీల్చి బాగా రాజుకునేలా చేసి బాబాకు ఇచ్చేవాడు. బాబా పొగపీల్చి మహల్సాపతికి, మిగిలిన భక్తులకు అందించేవారు. చివరికి మంగళవాద్యాలతో బాబాకు శేజారతి ఇచ్చిన తరువాత ఒక్కొక్కరే బాబా వద్ద సెలవు తీసుకొని ఇళ్ళకు వెళ్ళేవారు. తాత్యా కూడా చిలిం, అత్తరు, రోజ్‌వాటర్ బాబాకు ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి అనుమతి అడిగేవాడు. అప్పుడు బాబా ప్రేమగా అతనితో, "నన్ను కనిపెట్టుకొని ఉండు. నువ్వు వెళ్తానంటే వెళ్ళు. కానీ రాత్రి అప్పుడప్పుడు నా గురించి విచారిస్తుండు" అని అనేవారు. తాత్యా అలాగేనని వారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళేవాడు. వారివురి మధ్య అంతటి ప్రేమ. బాబా తమ అనుమతి లేకుండా తాత్యాను ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. అయితే బాబాతో తనకున్న చనువు వల్ల తాత్యా అప్పుడప్పుడు ఆయన మాటలకివ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవాడు.
ఒకసారి తాత్యాకోతేపాటిల్ కోపర్‌గాఁవ్‌లో వారానికోసారి జరిగే సంతకు బయలుదేరి మసీదు వద్ద టాంగా ఆపి, లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. తరువాత అతను బాబాకు పాదనమస్కారం చేసుకొనే నెపంతో బయలుదేరడానికి బాబా అనుమతి అడుగుతున్నట్లు నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు కానీ, బాబాకి సమయాసమయాలు తెలుసు. తాత్యా తొందరపాటును చూసిన బాబా అతనితో, "ఎందుకంత తొందర? కొంచెం ఆగు. సంత సంగతి అలా వుంచు. ఈరోజు మాత్రం శిరిడీ విడిచి వెళ్లకు" అన్నారు. కానీ, తనకు సంతలో చాలా అవసరమైన పని ఉందనీ, తప్పకుండా వెళ్ళాల్సిందేననీ తాత్యా పట్టుబట్టాడు. తాత్యా మొండిపట్టు చూసి, "సరే, నీకు తోడుగా షామాను తీసుకొని వెళ్ళు" అని అన్నారు బాబా. కానీ తాత్యా, ‘కోపర్‌గాఁవ్ సంతకు షామాను తోడు తీసుకొని వెళ్లాల్సిన అవసరమేముంద’ని భావించి బాబా ఆదేశాన్ని పట్టించుకోకుండా వెళ్లి టాంగాలో కూర్చొని సంతకి బయల్దేరాడు. టాంగాకు కట్టివున్న రెండు గుర్రాల్లో ఒకటి చాలా చురుకైనది, విసుగన్నది లేనిది, మూడువందల రూపాయలు పెట్టి కొన్నది. ఆ గుర్రం సావుల్‌విహిర్ గ్రామం వద్దకు రాగానే వేగంగా దౌడుతీసి కాలు మడతబడి కూలబడింది. దాంతో టాంగా బోల్తాపడి తాత్యా క్రిందపడ్డాడు. బాబా దయవల్ల పెద్దగా దెబ్బలు తగల్లేదుగానీ, నడుం పట్టేసింది. ఇక ఎక్కడి సంత? తాత్యాకు సాయిమాత గుర్తొచ్చి, ‘సమయానికి బాబా మాట వినివుంటే ఈ కష్టం వచ్చేది కాదు, అయినా జరిగిపోయిన దానిగురించి ఇప్పుడు బాధపడి ఏం లాభం?’ అని అనుకున్నాడు.
మరోసారి తాత్యా కోల్హార్ గ్రామానికి బయల్దేరాడు. టాంగా సిద్ధం చేసుకొని బాబాను అనుమతి అడగటానికని మసీదుకు వెళ్లి, బాబా చరణాలకు వందనం చేసి, "వెళ్లొస్తాన"ని అన్నాడు. బాబా అనుమతి పూర్తిగా లభించకముందే తాత్యా అక్కడినుండి బయల్దేరాడు. టాంగాకున్న గుఱ్ఱం అదుపు లేకుండా దారితెన్ను, మిట్టపల్లాలు చూడకుండా అతివేగంగా పరుగెత్తడంతో అతని ప్రాణం మీదకు వచ్చింది. చివరికి టాంగా తుమ్మచెట్టుకు గ్రుద్దుకొని ఆగిపోయింది. అక్కడినుండి తాత్యా వెనుతిరిగి వచ్చాడు. ఆ విధంగా సాయిబాబా దయవలన అతను ఆ అపాయం నుండి బయటపడ్డాడు.
ఇంకోసారి తాత్యా, "బాబా, శివరాత్రికి టాంగాలో జజూరీ వెళ్ళివస్తాను" అని అన్నాడు. బాబా, "ఎందుకంత బాధ?" అన్నారు. అతడు "నీవెప్పుడూ ఇంతే బాబా! అడ్డుపుల్ల వేస్తావు" అన్నాడు. అందుకు బాబా చికాకుగా, “సరే, పో!" అన్నారు. తాత్యా బయల్దేరిన కొద్దిసేపట్లోనే టాంగా బోల్తాకొట్టింది! అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే బాబా అతనిని చూచి నవ్వి, "చెబితే బుద్ధి వుండక్కర్లా? అడగడమెందుకు? వద్దంటే వెళ్ళడమెందుకు?" అన్నారు.
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.
Jai sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete