ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా వల్లే ఏదైనా సాధ్యం
2. బాబా ఉండగా ఏమీ కాదు!
3. కింద పడకుండా కాపాడిన బాబా
బాబా వల్లే ఏదైనా సాధ్యం
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా అమ్మాయికి పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరంకి నెలసరి సమస్య వచ్చింది. డాక్టరుకి చూపిస్తే, మందులు వ్రాసిచ్చి 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. కానీ 3 నెలలయ్యాక నా ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్మాయిని డాక్టర్ దగ్గరకి తీసుకొని పోలేదు. ఒక నెల అమ్మాయి తీవ్రమైన రక్తస్రావంతో ఇబ్బందిపడింది. ఇంతలో 2025, జూన్ 8న మా బావగారి అమ్మాయి పెళ్లి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్లాలని వారం ముందు నేను, మా అమ్మాయి అనుకున్నాము. అప్పటికి మా అమ్మాయి నెలసరి సమస్య తీరిపోయింది. అయినప్పటికీ హఠాత్తుగా పెళ్లికి 4 రోజుల ముందు మా అమ్మాయి ఫోన్ చేసి, మళ్ళీ రక్తస్రావం అవుతుందనీ, వాళ్ళ అత్తగారు పెళ్ళికి పోవద్దనీ, ఒకవేళ వెళ్ళేటట్టైతే ముందుగా డాక్టరుకి చూపించుకోవాలనీ చెప్పారని చెప్పింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచం ఊదీ చేతిలోకి తీసుకొని బాబాను, "తెల్లారేసరికల్లా అమ్మాయికి రక్తస్రావం తగ్గి ఊరికి వచ్చేలా చేయండి బాబా" అని ప్రార్థించి, ఆ ఊదీ నా కడుపుకి రాసుకున్నాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. అమ్మాయికి రక్తస్రావం ఆగి ఊరికి వచ్చింది. పెళ్లి బాగా జరిగింది. పెళ్లి జరిగిన ఒక గంట తర్వాత అమ్మాయికి మళ్ళీ రక్తస్రావం మొదలైంది. తన అత్తగారు ఫోన్ చేసి, "డాక్టరుకి చూపించుకోకుండా ఇంటికి రావద్దు" అన్నారు. ఏమి చేయాలో అర్థంకాక, "బాబా! నువ్వే దిక్కు" అని అనుకొని నాకు తెలిసిన ఒక డాక్టరుకి ఫోన్ చేశాను. ఆయన తన ఫ్రెండ్ ఒకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారని, అక్కడికి వెళ్లి ఆ డాక్టర్ని కలవమన్నారు. అలాగే వెళ్లి కలిసాము. ఆ డాక్టరు చాలా మంచి వ్యక్తి. అమ్మాయిని చూసి, స్కానింగ్, థైరాయిడ్ మొదలగు అన్ని టెస్టులు చేసి, అన్నీ బాగున్నాయి, రిపోర్ట్స్‌లో ఏ సమస్యా లేదు, కొంచం రక్తం తక్కువ అని చెప్పారు. ఇదంతా బాబా వలనే సాధ్యం. "ధన్యవాదాలు బాబా".
బాబా ఉండగా ఏమీ కాదు!
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు సౌజన్య. నేను 2025, మేలో ట్యూబెక్టమీ సర్జరీ చేయించుకోవాలని హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ టెస్ట్ చేయించమన్నారు. నేను భయపడుతూ టెస్టులకు వెళితే, బ్లడ్, థైరాయిడ్ టెస్టులు చేసారు. ఈమధ్య దాదాపు అందరూ థైరాయిడ్ ఉందని చెప్తుండటం విని ఉన్నందువల్ల నాకు ఎక్కడ థైరాయిడ్ ఉందని టెస్టులో వస్తుందో అని చాలా భయపడ్డాను. నేను భయంతో రిపోర్టులు నార్మల్ రావాలని బ్లడ్ ఇచ్చి రిపోర్టులు వచ్చేవారికి బాబా నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఒక 40 నిమిషాల తర్వాత రిపోర్టులు వచ్చాయి. బాబా దయవల్ల థైరాయిడ్ ఐతే లేదు కానీ, హిమోగ్లోబిన్ 7.5 ఉంది. నా స్నేహితులు కొంతమంది "బ్లడ్ తక్కువగా ఉంటే ఆపరేషన్ చేయర"ని చెప్పారు. నేను బాబాని తలుచుకొని రిపోర్టులు తీసుకొని వెళ్లి డాక్టర్ని కలిసాను. ఆమె చూసి, "ఏంటమ్మా! బ్లడ్ తక్కువగా ఉంది. బ్లడ్ ఎక్కిద్దామా?" అని నన్ను అడిగింది. నేను సమస్య లేకుంటే అలాగే ఎక్కిద్దాం అని చెప్పాను. బాబా దయవల్ల బ్లడ్ దొరికింది. ఇకపోతే, నాకు ఇంజక్షన్ చేయించుకోవాలంటే భయం. కానీ సర్జరీ చేయాలంటే ఇంజక్షన్ చేయించుకోవాలి. అందువల్ల ఇంజక్షన్ చేసే అంతసేపూ బాబా నామస్మరణ చేసాను. తర్వాత నాకు మత్తు ఎక్కేవరకు కూడా బాబా నామస్మరణ చేస్తూ, "ఎటువంటి సమస్య లేకుండా సర్జరీ జరగాలి బాబా" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల సర్జరీ బాగా జరిగి మరుసటిరోజు ఇంటికి వచ్చాను.
ఒకరోజు హఠాత్తుగా మా బాబు తల ఒక్కటే బాగా వేడిగా అయింది. అంతకుముందే బాబుకి జ్వరం వచ్చి తగ్గింది. అందువల్ల నేను మళ్ళీ జ్వరమొస్తుందేమో, ఏమైనా సమస్య అవుతుందేమోనని భయపడి, "బాబా! బాబుకి జ్వరం రాకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో బాబుకి జ్వరం రాలేదు, వాడు బాగున్నాడు. అనునిత్యం బాబా మన వెంట ఉంటే మనకు ఏమి కాదు కదా! "ధన్యవాదాలు బాబా. నేను ఎన్నో రోజుల నుండి నిన్ను ఒక కోరిక కోరుతున్నాను తండ్రీ. అది నేరవేరేలా చేయండి తండ్రీ. ప్లీజ్ బాబా".
కింద పడకుండా కాపాడిన బాబా
నేనొక సాయి భక్తురాలిని. మాది హైదరాబాద్. ఒకసారి నేను మైదానంలో సైకిల్ తొక్కుతుంటే ఇద్దరు యువకులు నా వెనుక సైకిల్ తొక్కుతూ నా సైకిల్ గుద్దాలని ప్రయత్నించసాగారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళు నా సైకిల్‌కి చాలా దగ్గరగా వచ్చేసారు. ఆ క్షణం నేను కళ్ళు మూసుకొని, "బాబా! నేను ఇంకా కింద పడబోతున్నాను" అని మనసులో అనుకున్నాను. అంతే, నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే, ఆ యువకులిద్దరూ కింద పడి ఉన్నారు. అసలు ఏం జరిగిందో! వాళ్ళు ఎలా కింద పడ్డారో నాకు అర్థం కాలేదు. నేను మాత్రం క్షేమంగా ఉన్నాను. అంతా సాయి దయ. ఆయన కరుణాకటాక్షం వల్లే నేను కింద పడలేదు. ఇలాంటి అందమైన అనుభవం ఇలా మీతో పంచుకోవడం నా అదృష్టం. "ధన్యవాదాలు బాబా".
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDelete