సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1490వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అవధులు లేని సాయితండ్రి అనుగ్రహం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మావారు ఇంట్లో వాడకుండా ఉన్న కొన్ని బరువైన చెక్క బల్లలను సర్దుతుండగా అదుపు తప్పి కొంచెం ఎత్తు నుంచి కింద పడ్డారు. ఆ ఘటన వల్ల మావారి చేతికి దెబ్బ తగిలి కొంచెం వాపు వచ్చి, నొప్పి కూడా ఉండింది. సరిగ్గా ఆ సమయంలోనే మా అత్తగారికి రెండవసారి ఫ్రాక్చర్ అయ్యి ఉన్నందున నాకు భయమేసి "బాబా! మావారి చేతికి ఫ్రాక్చర్ కాకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే, కొన్ని ప్రాథమిక పరీక్షలు చేసి, 'అది ఫ్రాక్చర్ కాదు, కండరానికి తగిలిన దెబ్బ' అని చెప్పి, ఆయిల్, మెడిసిన్స్ వ్రాసిచ్చి, "కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉండమ"ని అన్నారు. అలా చేయగా కొద్ది రోజులకు నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయితండ్రీ".

ఒకసారి మేము పని మీద వేరే వూరు వెళ్ళాము. అక్కడున్న మా బంధువులు తమ ఇంటిని వాడుకోమని ఆ ఇంటి తాలూకు రెండు జతల తాళాలు మాకు ఇచ్చారు. ఒక జత నా దగ్గర, ఇంకొక జత మావారి దగ్గర ఉంచుకున్నాము. తర్వాత నా దగ్గర ఉన్న ఇంటి తాళాలు కనబడలేదు. ఇల్లంతా వెతికానుకానీ ఎక్కడా కనపడలేదు. దాంతో ఆ ముందురోజు బజారుకు వెళ్లి ఉన్న నేను ఆ తాళాలను బయట ఎక్కడైనా పోగొట్టుకున్నానేమో అని అనుకుని, 'ఇప్పుడు మా బంధువులకు ఏమని చెప్పాలి?' అని కొంచెం కంగారుపడ్డాను. వెంటనే బాబాకు దణ్ణం పెట్టుకుని, "ఆ తాళాలు కనబడితే, మీ దయను బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇంకొకసారి ఇల్లంతా వెతికితే తాళాలు దొరికాయి. "ధన్యవాదాలు బాబా".

ఒకసారి నేను, మా అమ్మాయి హైదరాబాదు వెళ్లి తిరిగి బెంగళూరు వస్తుండగా సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో మా అమ్మాయికి విరేచనాలు మొదలయ్యాయి. ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, మేము ఉదయం 7:30కి కానీ మా ఇల్లు చేరుకోలేము. ఆ ఎనిమిది గంటలసేపు ప్రయాణంలో విరేచనాలు అవుతుంటే కష్టం కదా! అదీగాక మరుసటిరోజు మా అమ్మాయికి నవగురువార పూజ కూడా ఉంది. ఆ పూజకు కూడా ఆటంకమవుతుందని కంగారుపడ్డాను. వెంటనే బాబాను స్మరించుకొని, "విరేచనాలు తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకొని ఒక గంటసేపు బాబా నామస్మరణ చేస్తూ కూర్చున్నాను. బాబా నా మొర ఆలకించారు. మా అమ్మాయికి విరేచనాలు ఆగిపోయాయి. మరుసటిరోజు తన పూజ కూడా బాగా జరిగింది. 

అలానే ఇంకొకసారి నేను, మా అమ్మాయి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మేము కూర్చున్న బోగీలో మూడు సీట్లలో తప్ప అందరూ మగవాళ్లే ఉన్నారు. వాళ్లంతా మంచివాళ్లే. వాళ్ళ వల్ల మాకు ఏ విధమైన ఇబ్బందీ లేదు. కాకపోతే ఆడవాళ్లుగానీ, కుటుంబాలుగానీ ఉంటే మాట్లాడుకోవచ్చు అని, అంతే. ఇదే విషయం గురించి నేను నా మనసులో యథాలాపంగా బాబాతో మాట్లాడుకున్నాను. ఆశ్చర్యం! పక్క స్టేషన్లో ఒక ఫ్యామిలీ ఎక్కింది. వాళ్లలో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఒకసారి మా అత్తగారు కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు, మా మామగారికి, మా మరిదికి, మాకు మధ్య ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. అది చిలికి చిలికి గాలివానై పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది. అందులో ఎవరి తప్పూ లేదు. (కొన్ని కారణాల వల్ల విషయాన్ని వివరంగా వ్రాయలేకపోతున్నందుకు మన్నించండి.) కానీ మా అత్తగారు కోపంతో మా మరిదివాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న ఆమె అలా మనసు కష్టపెట్టుకొని వెళ్లడం వల్ల నాకు బాధగా అనిపించింది. వెంటనే నేను, "ఆమె తిరిగి రావాల"ని బాబాతో చెప్పుకున్నాను. నాలుగు రోజుల తర్వాత మా అత్తగారు మా దగ్గరకి తిరిగి వచ్చారు. ఇప్పుడు అందరమూ బాగున్నాము. ఆమె ఆరోగ్యం బాగుంది.

ఒకసారి మా చెల్లెలు తన అత్తగారి పాత నగలు కరిగించి కొత్తవి తీసుకోవాలని అనుకుంది. అయితే తనకి బంగారం కొనుగోలు విషయంలో తగినంత అనుభవం లేనందున నన్ను కూడా తనతో రమ్మంది. నేను ఆ నగలు బాబా పాదాల దగ్గర పెట్టి, "బాబా! నేను నిన్ను నమ్ముకుని వెళ్తున్నాను. అంతా నీదే భారం" అని చెప్పుకున్నాను. తరువాత ఇద్దరమూ కలిసి బయటకి వెళ్ళాము. ముందు రెండు ప్రముఖ షాపులలో అడిగితే, 'ఆ నగలలో ప్యూరిటీ తక్కువగా ఉన్నందున తీసుకోము' అని చెప్పారు. ఇంకొక షాపులో అడిగితే వాళ్ళు, "నగలు కరిగించిన తర్వాత చూసిగానీ ఏమి చెప్పలేము" అని అన్నారు. అప్పుడు మా చెల్లి బాబాకి నమస్కరించుకొని, "ప్యూరిటీ బాగా ఉందని వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుంది. బాబా దయవల్ల నగలు కరిగించిన తర్వాత 72% ప్యూరిటీ ఉందని వచ్చింది. ఆ నగలు ఇచ్చేసి వేరే నగలు తీసుకున్నాము. ఆ షాపువాళ్ళు అక్కడున్న బాబా ఫోటోకి ఆ కొత్త నగలు తాకించి, బాబాకి పెట్టిన పువ్వులు వాటిపై వేసి మాకిచ్చారు. మేము వాటిని బాబా ప్రసాదంగా తీసుకొని చాలా సంతోషించాము.

ఒకసారి మా చెల్లి ఒక ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తన బంగారు నెక్లెస్ తీసి హ్యాండ్‌బ్యాగులో వేసుకుంది. తర్వాత ఆ బ్యాగు తీసుకుని షాపింగ్‌కి వెళ్ళింది. రెండు రోజుల తర్వాత నెక్లెస్ కోసం వెతికితే అది బ్యాగులో కనిపించలేదు. వెంటనే తను బాబాను స్మరించి, "నెక్లెస్ దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకొని మరలా అన్ని బ్యాగులు వెతికితే ఆ నెక్లెస్ వేరే బ్యాగులో దొరికింది. సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా 'బాబా' అని స్మరించిన వెంటనే చేయి పట్టుకుని నడిపిస్తున్న మన సాయితండ్రి అవధులు లేని అనుగ్రహాన్ని, కరుణని గురించి ఏమని చెప్పగలం? "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా మీద ఇలాగే ఉండనీ బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1489వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబా దయతో దేనినైనా అధిగమించవచ్చు
2. నమ్మకాన్ని నిలబెట్టిన బాబా

సాయిబాబా దయతో దేనినైనా అధిగమించవచ్చు

ముందుగా సాయి కుటుంబీకులకు నా నమస్కారాలు. బాబా ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు కిషోర్. నేను ఇదివరకు 'సాయిభక్తుల అనుభవమాలిక 1275వ భాగం'లో బాబా నన్ను అసిస్టెంట్ నుంచి అసోసియేటర్ ప్రొఫెసర్‌గా ఎలా ప్రమోట్ చేశారో పంచుకున్నాను. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీవాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్‌కు పెట్టే టార్గెట్‍ను పూర్తి చేయడంలో బాబా ఎలా సహాయం చేసిందీ పంచుకుంటాను. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందినవారు ప్రమోషన్ పొందిన రోజు నుండి ఆరు నెలల లోపు ఒక ప్రాజెక్టు ప్రపోజల్ ఏదో ఒక ప్రభుత్వ ఏజెన్సీకి పంపవలసి ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఆర్టికల్ కూడా ప్రచురింపబడాలి. లేనియెడల జీతం నిలిపివేయబడుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఒకరోజు సాయిబాబా నా స్నేహితుని ద్వారా ఒక ప్రభుత్వ సంస్థవారు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారని తెలియజేశారు. అయితే ప్రపోజల్ పంపడానికి అదే ఆఖరిరోజు అని తెలిసి నేను కుమిలిపోయాను. "ఆఖరి తేదీ పొడిగించమ"ని బాబాని ఆర్తిగా వేడుకున్నాను. మర్నాడు ఉదయం నిద్రలేచి వెబ్సైట్ చూస్తే, ప్రభుత్వం పదిరోజులు పొడిగించినట్లు ఉంది. అది చూసి నా ఆనందానికి అవధులు లేవు. బాబాకు ధన్యవాదాలు తెలుపుకొని నా పని ముగించాను.

ఇక నా రీసెర్చ్ ఆర్టికల్ ప్రచురణ విషయానికి వస్తే.. నేను ఇదివరకు 'అనుభవమాలిక 1029వ భాగం'లో రీసెర్చ్ ఆర్టికల్ ప్రచురణలో బాబా నాకు ఎలా సాయం చేశారో వివరించాను. అలాంటి అనుభవమే బాబా నాకు మళ్ళీ ప్రసాదించారు. నా కేడర్‌లో ఉన్నవాళ్ళు సంవత్సరంలో కనీసం మూడు, ఆరు నెలల్లో కనీసం ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయాలి. సాయిబాబా దయవల్ల గత ఏడాది నావి నాలుగు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అయితే నాలుగవది అదే సంవత్సరంలో ఆన్లైన్‍లోకి రావడం వల్ల నాకు ఉపయోగం లేకుండా పోతుంది. అదే మరుసటి సంవత్సరం, అంటే 2023లో అది ఆన్లైన్‍లోకి వస్తే నాకు కొంత శ్రమ తగ్గుతుంది. అందుకని నేను బాబాను, "నాలుగవ ఆర్టికల్ 2023లో ఆన్లైన్లోకి వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకొని రోజూ బాబా నామస్మరణ చేస్తుండేవాడిని. బాబా నా మొర ఆలకించారు. నా 4వ ఆర్టికల్ 2023లో ఆన్లైన్లోకి వచ్చేలా అనుగ్రహించారు. ఈ విధంగా యూనివర్సిటీవారు నాకు పెట్టిన టార్గెట్‍లను నేను సాయిబాబా దయతో పూర్తిచేశాను. "వేల కృతజ్ఞతలు బాబా".

ఈమధ్యకాలంలో తీవ్రమైన శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిడి వల్ల నా ఆరోగ్యం బాగా క్షీణించి నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దానికి తోడు, నా క్రింద మాస్టర్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళు మాస్టర్ డిగ్రీ పొందాలంటే కెమికల్ లేబరేటరీలో జాగ్రత్తగా పనిచేసి, ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయవలసి ఉంటుంది. నేనున్న అనారోగ్య పరిస్థితుల్లో అవన్నీ ఆలోచిస్తే తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యేవాడిని. దానినుంచి బయటపడడానికి సాయిబాబా నామం చేయడం, ప్రతి గురువారం దగ్గర్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి పల్లకి సేవ చేయడం, సాయి దివ్యపూజ చేయడం వంటివి చేస్తుండేవాడిని. బాబా దయవల్ల సుమారు నెల రోజుల తర్వాత నేను ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాను. ప్రస్తుతం నా ఆరోగ్యం, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం, మాస్టర్ స్టూడెంట్స్ రీసెర్చ్ అంతా సజావుగా సాగుతున్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ప్రతి ఒక్కరి కష్టం తీర్చండి. కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని అందరికీ ప్రసాదించండి సాయినాథా".

నమ్మకాన్ని నిలబెట్టిన బాబా

ఓం నమో సాయినాథాయ!!! నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు నా తీర్థయాత్రలోని సాయి అనుగ్రహాన్ని పంచుకోబోతున్నాను. నేను ఈమధ్య అనుకోకుండా వరుసగా కొన్ని టూర్‌లకి వెళ్ళవలసి వచ్చింది. ముందుగా 2023, జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో మా కుటుంబం, మా తమ్ముళ్ళ కుటుంబాలు కేరళ టూర్ ప్లాన్ చేసుకున్నాము. అది నిర్ధారణ అయిన తరువాత మావారి స్నేహితులు 2023, ఫిబ్రవరి 20న 10 రోజుల కాశీ టూర్ ప్లాన్ చేసి, 'వస్తారా?' అని అడిగారు. మేము ఎప్పుడూ సౌత్ ఇండియాలోని గుళ్లకే తప్ప నార్త్ ఇండియా వెళ్ళలేదు. కాబట్టి 'మనకి ఎలాగూ అవన్నీ తెలియదు. అందరితోపాటు వెళ్తే అన్నీ చూసి రావచ్చు' అని వాళ్లతో సరేనని చెప్పాము. ఈ రెండు టూర్లు కాక, మధ్యలో 2023, ఫిబ్రవరి 12 నుండి 16 వరకు మా ఫ్రెండ్‌తో మంత్రాలయం వెళ్లాల్సి వచ్చింది. ఈ టూర్‌లన్నీ ఒక 2 నెలల ముందుగానే ప్లాన్ అయ్యాయి. అయితే నెలసరి సమస్య వల్ల ఆడవాళ్ళు ఏదైనా గుడికి వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ నాకు ఈమధ్య ఒక 5, 6 రోజులు ముందుగానే నెలసరి వస్తుంది. కానీ బాబా దయవల్ల నాకు ఎప్పుడూ ఏ కార్యక్రమానికీ నెలసరి అడ్డు రాదు. ఈసారి కూడా అదే ధైర్యంతో ముందడుగు వేశాను. ఆయన దయవల్ల జనవరిలో మా టూర్ అయిపోయి ఇంటికి వచ్చాక 20వ తేదీన నాకు నెలసరి వచ్చింది. మరుసటి నెల సరిగ్గా 20వ తేదీనే మేము కాశీకి ప్రయాణమయ్యేది. అదివరకు జరుగుతున్నట్లు నెలసరి ముందుగా వస్తే మంత్రాలయం వెళ్ళడానికి, కరెక్ట్‌గా వస్తే కాశీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పోనీ టాబ్లెట్లు వేద్దామంటే అన్ని(ఎక్కువ) రోజులు వేయలేను. అయినా నేను పెద్దగా టెన్షన్ పడకుండా ఎప్పట్లాగే సాయికి చెప్పుకొని ధైర్యంగా మంత్రాలయం వెళ్ళాను. సాయి దయతో అక్కడ అంతా చాలా బాగా జరిగింది. అక్కడినుండి తిరుగు ప్రయాణమైనప్పటి నుండి నెలసరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. అయితే ఒక 2 రోజుల వరకు రాకపోయేసరికి కొంచెం టెన్షన్‌గా అనిపించి బాబాను ప్రార్థించాను. అంతే, నాకు నెలసరి వచ్చింది. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా రెండు ప్రయాణాలకు మధ్యలో నెలసరి రావడంతో మా కాశీయాత్ర ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా సాగింది. గీత గీసినట్టుగా రెండు యాత్రలకు ఇబ్బంది కలగకుండా ఉండడం ఖచ్చితంగా బాబా అనుగ్రహమేగానీ కాకతాళీయం కాదని నేను చెప్పగలను. ఎందుకంటే, అది నా మనసుకు తెలుస్తుంది. గొప్ప చెప్పుకోడం కాదుగానీ, బాబాపై నాకున్న నమ్మకానికి నేను కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను. 'ఇటువంటి అనుభవాలు కూడా రాయాలా?' అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదే కదా! "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1488వ భాగం..


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి చెప్పుకుంటే పని అయిపోతుంది
2. నిజంగా బాబా ఉన్నారు

బాబాకి చెప్పుకుంటే పని అయిపోతుంది

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ!!! ముందుగా సాయి భక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదవడం వల్ల బాబాపట్ల భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నా పేరు తిలోత్తమ. మాది ఒరిస్సా. మా ఆయన టీచరుగా పని చేస్తున్నారు. ఆయన డిప్యూటేషన్ మీద మా ఊరికి దగ్గరలో ఉన్న స్కూల్లో పని చేస్తుండగా ఆయనకు గ్రేడ్ 4 ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అదే సమయంలో డిప్యూటేషన్ మీద ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు అదే స్కూల్లో కొనసాగొచ్చు అని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మావారికి బదిలీ అయిన కొత్త చోటు మా ఊరికి చాలా దూరంగా ఉన్నందు వల్ల అదివరకు పని చేస్తున్న స్కూలులోనే కొనసాగాలని మావారు అనుకున్నారు. కానీ వాళ్ల హెచ్ఎం దానికి ఒప్పుకోక ప్రమోషన్ మీద వచ్చిన స్కూల్లోనే జాయిన్ అవ్వమని చెప్పారు. ఎవరు చెప్పినా ఆమె వినలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! మా ఆయన ముందు పనిచేసే స్కూల్లోనే జాయిన్ అయ్యేలాగా చేయండి. అలా జరిగితే మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత ఫోన్‍లో బాబా సందేశం కోసం చూస్తే, "భయపడకు నువ్వు వున్న చోటనే పని చేస్తావు. నేనుండగా భయం ఎందుకు?" అని వచ్చింది. దాంతో నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆ తరువాత ఒక బుధవారం రోజున మావారి స్కూలు హెచ్ఎం కాల్ చేసి, "రేపు రండి సార్. మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను" అని చెప్పింది. అది విని మాకు చాలా సంతోషం కలిగింది. మరుసటిరోజు గురువారం మావారు వెళ్లి ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు.

ఈమధ్య మా అమ్మ ఒక పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కాలు జారి పడిపోయింది. రెండు రోజుల వరకు నొప్పి తగ్గకపోతే ఎక్స్ రే తీయించాము. రిపోర్టులో కొంచెం పగులు ఉందని చెప్పి కట్టువేశారు. నేను, "బాబా! మీ దయతో ఆ పగులు త్వరగా కలిసిపోతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. నెలరోజుల తర్వాత ఎక్స్ రే తీసి, "పగులు కలిసిపోయింద"ని కట్టు తీసేసారు.

నేను ఇదివరకు బాబా చల్లని దీవెనలతో  గర్భవతినయ్యానని మీతో పంచుకున్నాను. ఆ విషయంలో బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్న తక్కువే. ఇకపోతే, ఐదవ నెలలో డాక్టర్, "స్కాన్ చేయించమ"ని చెప్పినప్పుడు నేను, "బాబా! రిపోర్ట్ నార్మల్ వచ్చేలా చేయండి, అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయతో స్కాన్ రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పుకోగానే మా ఒక్కొక్క సమస్య తీరిపోతుంది. మీకు మాటిచ్చినట్టు ఈ అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. దయతో సుఖ ప్రసవమయ్యేలా ఆశీర్వదించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

నిజంగా బాబా ఉన్నారు

నా పేరు అజయ్. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదు, సమాజంలో గౌరవం లేదు, నేను ప్రేమించిన అమ్మాయికి నేను అంటే ఇష్టం లేదు. అలాంటి సమయంలో నేను అనుకోకుండా 'గురుపౌర్ణమి' అనే సాయిబాబా సినిమా చూసి, 'నాకు ఉద్యోగం వచ్చి, నేను ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమిస్తే నువ్వు నిజంగా ఉన్నావ'ని నమ్ముతానని అనుకున్నాను. ఆశ్చర్యం! అద్బుతం! అప్పటివరకు ఇంటి వద్ద ఉన్న నేను ఏదో కారణం చేత హైదరాబాద్ వెళ్లి ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుందామని ఇన్స్టిట్యూట్‍లో జాయినయ్యాను. నాతో జాయిన్ అయిన వాళ్లందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ నాకు రావటానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నేను నా మనసులో ఒక వైపు 'ఏంటి బాబా ఇలా చేస్తున్నారు?' అన్న బాధ, మరోవైపు 'ఆయనే దారి చూపుతారు' అన్న నమ్మకం ఉండేవి. అదే సమయంలో నేను ఈ బ్లాగుని చూశాను. అప్పుడు "బాబా! నాకు ఉద్యోగం వస్తే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత ఒక ఇంటర్వ్యూ జరిగి నాకు ఒక ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగం పూణేలో. భాష రాదు, పైగా అంత దూరమని మళ్ళీ బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యం! 10 రోజుల్లో హైదరాబాద్‍కి చెందిన వేరే కంపెనీలో నాకు ఇంకొక ఆఫర్ వచ్చింది. ఇంగ్లీష్ కూడా రాని నేను ఇప్పుడు MNC కంపెనీలో పని చేస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఇది నూటికి నూరుపాళ్ళు బాబా దయవల్లనే. ఆయనని ప్రార్ధించడం వల్ల నా జీవితాన్నే మార్చేశారు. నిజంగా బాబా ఉన్నారు. నమ్మకంతో మొక్కితే ఎంత పెద్ద సమస్య అయిన తీరుస్తారు నా తండ్రి. "ధన్యవాదాలు బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1487వ భాగం..


ఈ భాగంలో అనుభవాలు:

1. తండ్రిలా సదా రక్షించే సాయిబాబా
2. చాలారోజుల నుండి బాబా చూపుతున్న దయ

తండ్రిలా సదా రక్షించే సాయిబాబా

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్సుమాంజలి. నా పేరు వి.శ్రీనివాసరావు. నేనొక ఉద్యోగస్తుడిని. మా కొడుకు మా కోడలితో హైదరాబాదులో ఉన్న తన అత్తగారింట్లో ఉంటూ వేరే కాపురం పెట్టేందుకు అద్దె ఇల్లుకోసం వెతికాడు. ఎంత తిరిగినా వాళ్లకు మంచి ఇల్లు దొరకక ఒక వారం తర్వాత మూఢం(మంచి రోజులు లేవు) వస్తుందని వాళ్ళు చాలా కంగారుపడ్డారు. అప్పుడు మేము నా తండ్రి సాయిని, "మా కొడుకుకి ఒక మంచి కిరాయి ఇల్లు చూపెట్టమ"ని వేడుకున్నాము. మా విన్నపం విన్న మా సాయి రెండు రోజుల్లోనే కొత్తగా నిర్మించిన ఒక ఇల్లు చూపెట్టడం, గురువారంనాడు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగిపోయాయి.

మా కోడలు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండేది. ఆ క్రమంలో ఒక ఉద్యోగం దగ్గర వరకు వచ్చి పోవడంతో, ఆ విషయం మాతో చెప్పుకొని బాధపడింది. అప్పుడు మేము, "మన సాయి మనకు అండగా ఉండగా నువ్వు ఎందుకు బాధపడతావు? దిగులుపడవద్దు" అని చెప్పి, "నువ్వు సాయిని మనస్పూర్తిగా వేడుకుంటే, తప్పకుండా నీకు జాబు వస్తుంద"ని ధైర్యం చెప్పాము. ఆ తర్వాత వారం రోజులకి క్యాప్ జెమినీలో జాబ్స్ పడ్డాయని, మా కోడలు ఆన్లైన్ పరీక్ష వ్రాసి, బాగానే స్కోర్ చేసింది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్లొచ్చి, ఇంటర్వ్యూ బాగానే చేశానని మాకు ఫోన్‌లో చెప్పింది. అయితే టెక్నికల్ ఎగ్జామ్‍లో తనకంటే వేరే అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ ఫీల్ అయింది. అప్పుడు నా భార్య, 'మా ఊరు నుండి) ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరికల సాయిబాబా గుడి/ఆశ్రమంకి నడిచి వస్తాన'ని మొక్కుకుంది. తరువాత నా భార్య మా కోడలికి ఫోన్ చేసి, "నేను సాయికి చెప్పుకున్నాను. నువ్వు నీ ఉద్యోగం గురించి టెన్షన్ పడకు. నీకు తప్పకుండా ఆఫర్ లెటర్ వస్తుంద"ని ధైర్యం చెప్పింది. తను చెప్పినట్లుగానే రెండు రోజుల్లో 'ఉద్యోగంలో జాయిన్ అవమ'ని మా కోడలికి ఆఫర్ లెటర్ రావడం, గురువారంనాడే ఆ ఉద్యోగంలో చేరటం జరిగాయి.

ఒకరోజు నేను, నా భార్య మా ఊరు నుండి సారపాక వెళ్ళాము. ఉదయం పూట ప్రయాణం. పైగా చలికాలం. అందువల్ల నీళ్లు త్రాగి బస్సు ప్రయాణం చేస్తే వాష్ రూమ్(మూత్ర విసర్జన)కి వెళ్లాల్సిన ఇబ్బంది ఉంటుందని నా భార్య టిఫిన్ చేసి, కొంచం నీళ్లే త్రాగింది. బస్సు కుకునూరు దాటాక నా భార్య ఎందుకో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించి, "ఏంటి అలా అసౌకర్యంగా ఉన్నావ"ని అడిగాను. అందుకు తను, "కడుపు ఉబ్బిపోయింది. వాష్‍రూమ్‍కి వెళ్లాల"ని చెప్పింది. ఆడవాళ్ల వాష్‍రూమ్ కోసం మధ్యలో బస్సు ఆపమని చెప్పడం ఇబ్బందికరమైన పరిస్థితి అయినందున సాయిని, "బాబా! ఈ సమస్యను పరిష్కరించు స్వామి" అని వేడుకున్నాను. నేను అలా అనుకున్న తర్వాత బస్సు కుకునూరు దాటి కివ్వాక చెరువు కట్ట మీదకు వెళ్ళగానే డ్రైవర్ హఠాత్తుగా బస్సు ఆపి కిందకి దిగి పక్కకు వెళ్ళాడు. అంతే, వాష్‍రూమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వారి పనులు కానిచ్చారు. చూసారా! నా బాబాని ఇలా తలుచుకోగానే అలా సహాయం చేశారు.

ఈమధ్య మా పిన్ని మనవడి పెళ్లికి చర్ల వెళ్లి 2023, ఫిబ్రవరి 26 సాయంత్రం సారపాక వచ్చాము. వచ్చిన దగ్గర నుండి నా ఎడమ చేయి, కాలు, దవడ బాగా నొప్పి పెట్టసాగాయి. అలాగే చెస్ట్ దగ్గర, వెనక వీపు భాగంలో కూడా నొప్పి వస్తుండేది. మనసులో ఆందోళనగా ఉన్నా పైకి మాత్రం ఏమీ లేనట్లే ఉండి గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను. కానీ ఏమాత్రం తగ్గలేదు. 2023, ఫిబ్రవరి 27 సాయంత్రం సారపాక నుండి మా ఊరు వచ్చాము. అప్పటికీ నొప్పితో ఇబ్బందిపడుతూనే ఉన్న నేను అవి గుండెపోటు లక్షణాలుగా అనిపించాయి. మనసులో టెన్షన్ పడుతూనే నా తండ్రి సాయిని, "సాయీ! నాకున్న ఈ నొప్పులను తగ్గించు స్వామి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. అంతే, తెల్లవారేసరికల్లా నొప్పి తగ్గి, ఆందోళన నుండి బయటపడ్డాను. ఈ విధంగా మన సాయిబాబా తండ్రిలా మన మొరలు ఆలకించి ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉన్నారు. "సాయీ! మీకు వేలవేల వందనాలు తండ్రి".

చాలారోజుల నుండి బాబా చూపుతున్న దయ

ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను చాలా సంవత్సరాల నుండి బాబాను నమ్ముకున్నాను. ఇప్పుడు నేను చాలారోజుల నుండి బాబా నాపై ఎలా దయ చూపుతున్నారో మీ అందరితో పంచుకుంటున్నాను. ఒక సంవత్సరం క్రితం డైయాబెటిస్ కంట్రోల్ ఉండని కారణంగా మా నాన్నగారి కాళ్ళపై అల్సర్స్ వచ్చాయి. డాక్టరు దగ్గరకి వెళితే, "ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ చేసి పాదం మొత్తం తీసేయాల"ని చెప్పారు. ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాము. నేను బాబాను వేడుకున్నాను. ఆయన కృపవల్ల డాక్టరు నాన్న పాదంలో ఇన్ఫెక్ట్ అయిన కొంత భాగమే తొలగించారు. అలా పూర్తిగా నడవలేని పరిస్థితి రాకుండా కాపాడిన బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అయితే ఇటీవల మూడు, నాలుగు నెలల క్రితం నాన్న కాలికి మళ్ళీ అల్సర్ వచ్చింది. నాకు ఏం చేయలో అర్దంకాక బాబా మీద భారమేసి ఎప్పుడూ చూపించే డాక్టర్ దగ్గరకి కాకుండా వేరే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాను. బాబా దయవల్ల నాన్నకు చాలావరకు నయం అయింది. కానీ కొన్ని రోజులకి మళ్ళీ సమస్య మొదలయ్యింది. అప్పుడు కూడా నేను బాబాను వేడుకొని ఊదీ నా కాళ్ళకి  పెట్టుకున్నాను(నాన్న కాళ్ళకి కట్టు ఉండటం వల్ల). బాబా దయవల్ల ప్రస్తుతం నాన్నకు కాస్త బాగానే వుంది. "ధన్యవాదాలు బాబా. చాలా ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. నాకు ఇదివరకు పని చేసిన చోటు నుండి వేరే ఆఫీసుకి బదిలీ అయినప్పుడు నేను మిమ్మల్ని, 'పాత చోటే వుంచమ'ని ప్రార్థించాను. కానీ నేను కోరుకుంది జరగలేదు. ఇప్పుడున్న చోట నా ఇబ్బందులు మీకు తెలుసు బాబా. మీరే నాకు ఒక దారి చూపి నన్ను ముందుకు నడిపించాలి. ఎల్లప్పుడూ మా అందరిపై కరుణ చూపుతూ చల్లగా చూడు తండ్రి".

శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1486వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రార్ధించినంతనే కరుణించే బాబా
2. బాబా కృప

ప్రార్ధించినంతనే కరుణించే బాబా

ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళై మూడు సంవత్సరాలైంది. కాలేజీలో టాపర్‍నైన నేను పెళ్లైయ్యాక కరోనా మరియు ప్రెగ్నన్సీ కారణంగా ఉద్యోగ విషయంలో ఏ ప్రయత్నాలు చేయక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ 'ఏదో ఒక ఉద్యోగం చేయాలి, నా భర్తకి తోడుగా ఉంటుంద'ని అనుకునేదాన్ని కానీ, కుదిరేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు మావారు, "నీకు టాలెంట్ ఉంది. పై చదువులు చదవాలంటే చదువుకో" అని అన్నారు. మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల "ఎమ్.ఎస్.సి మ్యాథమెటిక్స్ చదవాలనుంద"ని మావారితో చెప్పి ఆ కోర్సుకి సంబంధించిన కాలేజీలకు కాల్ చేయడం మొదలుపెట్టాను. ఒక్క కాలేజీవాళ్ళు కూడా నా కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాబాతో, "ఏ కాలేజీ వాళ్ళైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే, మీ అనుగ్రహాన్ని సాయి బంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. అలా అనుకోని నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి మావారు, "ఉస్మానియా యూనివర్సిటీవాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి, అప్లికేషన్ ఫారం డీటెయిల్స్ చెప్పారు" అని చెప్పారు. నిజంగా ఇది బాబా లీల. "ధన్యవాదాలు బాబా".

పుట్టుకతోనే మా పాపకున్న ఒక అనారోగ్య సమస్య వల్ల దొగడటం, నడక, ఆహారం తీసుకోవడం మొదలైన అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. తనకి 15 నెలలప్పుడు నేను బాబాను, "బాబా! నా పాపకి మంచిగా నడక వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అద్భుతం! బాబాకి చెప్పుకున్న కొద్దిరోజులకే పాప నడవడం మొదలుపెట్టింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఒకసారి మా పాపకి బాగా విరోచనలై చాలా నీరసించిపోయింది. వెంటనే నేను పాపకి బాబా ఊదీ పెట్టి, "పాపకి విరోచనాలు తగ్గి ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, ఆ క్షణం నుండి పాప ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే నా బిడ్డ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేట్టు ఆశీర్వదించండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంతలో  మా మామయ్యగారికి బాగా విరోచనాలై ఆయన కూడా చాలా నీరసించిపోయారు. నాకు పెళ్ళైన తర్వాత ఈ మూడేళ్లలో ఆయన అనారోగ్యం పాలైంది లేదు. ఎప్పుడూ ఉత్సాహంగా తన పని తను చేసుకుంటూ సరదాగా ఉండేవారు. అలాంటి ఆయన అలా అనారోగ్యంతో బాధపడుతుంటే, చూసి నాకు చాలా బాధేసి, "బాబా! మా మామయ్యగారి ఆరోగ్యం బాగైతే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న కొన్ని నిమిషాలలోనే మా మామయ్యగారి ఆరోగ్యం కుదుటపడింది. అయితే రెండు రోజుల తరవాత నా భర్తకి విరోచనాలై చాలా డల్ అయిపోయారు. ఆ స్థితిలో కూడా వర్క్ ఇంపార్టెంట్ అని ఆయన ఆఫీసుకి వెళ్ళారు. నేను, 'మావారికి ఆరోగ్యం బాగుంటే, నా అనుభవం పంచుకుoటాను' అని అనుకున్నాను. దయతో నా బాబా మావారిని కాపాడారు. తరువాత రెండురోజులకి మా అమ్మ అనారోగ్యం పాలై మూడు రోజులు జ్వరం, నీరసం, కడుపునొప్పితో చాలా బాధపడింది. అప్పుడు కూడా నేను, 'అమ్మ అనారోగ్యం తగ్గితే, నా అనుభవాన్ని పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల అమ్మ కోలుకుంది. పైన చెప్పిన అన్నీ సందర్భాలలో మావాళ్ల ఆరోగ్యం గురించి బాబాను వేడుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ ఉంటే, మందులతో బాబా దయవల్ల అందరికీ నయమై ఇప్పుడు అందరూ బాగున్నారు. "ప్రార్ధించినంతనే కరుణించినందుకు చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే నా కుటుంబాన్ని సదా కాపాడండి బాబా".

మా అత్తయ్యగారు తన పుట్టినరోజునాడు మా మామయ్యగారు తనని విష్ చెయ్యలేదని బాగా ఏడ్చి రచ్చరచ్చ చేసారు. ఆయన్ని తిడుతూ మధ్యలో నన్ను, మావారిని కూడా తిట్టారు. మేమేమో కేకు తేవాలి, గుడికి తీసుకెళ్లాలి అని అనుకుంటుంటే ఎంతసేపటికి ఆమె కోపం తగ్గలేదు. దాంతో మా మూడ్ అంత పాడైపోయింది. మాములుగా మా అత్తయ్యగారు మంచివారు. కాకపోతే ఆమె గతంలో చాలా పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఒక కొడుకుని పోగొట్టుకున్నారు. ఇంట్లో ఎవరి సహకారం లేకపోగా ఆమెని తిట్టేవాళ్ళు. ఇప్పుడు మారారు అనుకోండి. అవన్నీ గుర్తొచ్చి అప్పుడప్పుడు ఆమె అలా ప్రవర్తిస్తుంటారు. సరే నేను, "బాబా! మా అత్తయ్యగారు శాంతపడి కేకు కట్ చేయడానికి రావాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా అద్భుతం చేసారు. మూడు గంటలపాటు ఎంతో కోపంగా ఉన్న అత్తయ్య శాంతించి కేకు కట్ చేసారు, గుడికీ వచ్చారు. ఇదంతా బాబా దయ. ఇకపోతే, అత్తయ్య పదవీ విరమణ చేసే రోజున నేను ఆమె మూడ్ ఎలా ఉంటుందో అన్న భయంతో, 'ఆమె పదవి విరమణ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా, ప్రశాంతంగా, ఆనందంగా జరిగితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా యవల్ల కార్యక్రమం చాలా చక్కగా జరిగింది, అందరూ సంతృప్తి చెందారు. "ధన్యవాదాలు బాబా. ఏదన్నా తప్పుగా వ్రాసున్నా, ఏవైనా  అనుభవాలు పంచుకోవడం మర్చిపోయినా క్షమించండి బాబా. నన్ను, నా భర్తని, నాబిడ్డని సదా కాపాడండి బాబా. ఈమధ్య నా ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదు. ప్లీజ్! నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా".

ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!

బాబా కృప

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు శ్రీనివాస్. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం. నేను ఒక సాయి భక్తుడ్ని. నేనిప్పుడు నా మొదటి అనుభవం మీతో పంచుకోబోతున్నాను. మా అబ్బాయి వర్షిత్ ఐదవ తరగతి చదువుతున్నప్పుడు నవోదయ పరీక్షకు అప్లై చేసి, నాలుగు నెలలు కోచింగ్ కోసం కోచింగ్ సెంటర్ వాళ్లతో మాట్లాడి డబ్బులు కూడా కట్టాను. అయితే కరోనా కారణంగా కోచింగ్ రెండు, మూడు నెలలు మాత్రమే నడించింది. 2021, ఏప్రిల్ 30న బాబు నవోదయ పరీక్ష వ్రాసాడు. ఇంటికి వచ్చాక ప్రశ్నాపత్రం చూసుకుంటే గణితంలో మార్కులు తక్కువ వస్తాయని తెలిసి, 'బాబుకు నవోదయలో సీటు వస్తుందా, లేదా' అని కంగారుపడ్డాము. మనసులోనే బాబాకి, "మా బాబుకు నవోదయ సీటు వస్తే, మా ఊర్లో జరుగుతున్న మీ మందిర నిర్మాణానికి నా వంతు చందా ఇస్తాను" అని మ్రొక్కుకున్నాను. అయితే నవోదయ సీటు విషయం గురించి ఎవర్ని అడిగినా "సీటు రావడం కొద్దిగా అనుమానమే" అన్నారు. దానికి తగ్గట్టు ఆ సంవత్సరం నవోదయ పరీక్ష ఫలితాలు రావడం ఆలస్యం కావడం మమ్మల్ని మరింత కంగారుకు గురిచేసింది. ఎట్టకేలకు జూలై నెల రెండో వారంలో నవోదయ ఫలితాలు ఆన్లైన్లో విడుదలయ్యాయి. మనసులో బాబాను తలుచుకొని రిజల్ట్స్ చూస్తే, మా బాబు నవోదయాకి ఎంపిక అయ్యాడు. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మా ఇంట్లోని వాళ్లంతా చాలా సంతోషపడ్డారు. మరుసటిరోజు బాబా గుడికి వెళ్లి బాబాకి మొక్కుకున్నట్లుగా గుడి నిర్మాణానికి నా వంతుగా 5,000 వేల రూపాయలు చందాగా ఇచ్చాను. "కృతజ్ఞతలు బాబా".

ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1485వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏది అనుకుంటే అది చేస్తారు బాబా
2. టెన్షన్ తీర్చిన బాబా 

ఏది అనుకుంటే అది చేస్తారు బాబా

సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు హరిత. 2023, ఫిబ్రవరిలో మేము అంతర్వేది తీర్థ దర్శనానికి వెళ్ళాము. అది సరిగ్గా నా నెలసరి సమయం కావడంతో నేను చాలా భయపడి, "సాయీ! స్వామి దర్శనం, మరుసటిరోజు రథయాత్ర కూడా అయిన తర్వాత నాకు నెలసరి వచ్చేలా చూడు. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా ఎంతో దయ చూపారు. అలా రథయాత్ర అవుతూనే నాకు నెలసరి వచ్చింది. స్వామి దర్శనం, రథయాత్ర అన్ని అయిన తర్వాత నెలసరి వచ్చేలా అనుగ్రహించిన బాబా దయకు నాకు చాలా చాలా సంతోషమేసింది. ఇకపోతే అక్కడ ఉండగా నాకు ఒక రోజు ఒకటే తలనొప్పి, జ్వరం వచ్చాయి. "సాయీ! ఈ జ్వరం కూడా టాబ్లెట్స్‌తో నయమై సాయంత్రం లోపు తగ్గిపోతే ఈ రెండు అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఇంకేముంది? మనం ఏది అనుకుంటే అది చేస్తారుగా బాబా. జ్వరం, తలనొప్పి తగ్గిపోయాయి. "సదా అన్నివేళలా ఇలానే రక్షించు సాయి"

ఇకపోతే, నా స్నేహితురాలు ఒకామె యుఎస్ఏ నుండి ఇండియా వచ్చి నన్ను కలవడానికి మా ఇంటికి వస్తానని చెప్పింది. సరిగ్గా అదే సమయంలో నేను అంతర్వేది వెళ్లాల్సి ఉండటంతో తనని కలిసే అవకాశం నాకు లేకుండా పోయింది. దాంతో, 'అయ్యో.. తను నా దగ్గరకి వస్తానని చెప్పినా నేను తనని కలవకుండా ఊరు(అంతర్వేది) వచ్చాను. తను ఇండియాలో నెల రోజులు ఉంటుంది. తిరిగి యుఎస్ఏ వెళ్తే మళ్ళీ ఏ మూడు సంవత్సరాలకోగాని రాదు. తనని కలవడానికి కుదురుతుందో, లేదో' అని బాధపడ్డాను. నేను ఊరు నుండి తిరిగి వచ్చాక నా మరో స్నేహితురాలికి(మేము ముగ్గురం మంచి స్నేహితులం) ఫోన్ చేసి, "సింధు మా ఇంటికి వస్తానని చెప్పింది. కానీ నాకు కుదరలేదు, కలవలేకపోయాను" అని చెప్పాను. అప్పుడు తను, "సరే, మనం ముగ్గురం కలుద్దాం. నువ్వు ట్రైన్‍లో ఖమ్మం రా. ఇక్కడినుండి నువ్వు, నేను కలిసి హైదరాబాద్ వెళ్లి తనని కలుద్దాం" అని చెప్పింది. నేను, "అంత దూర ప్రయాణమంటే మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. నాకు ఆ విషయం తెలుసు" అని అన్నాను. అందుకు తను, "సరే, నువ్వు ఫోన్ పెట్టెయ్. నేను మీ అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతాను" అని కాల్ కట్ చేసింది. నేను, "ఎలా అయినా అన్నయ్య ఓకే చెప్పేట్టు చేయి సాయి. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. అంతలోనే అన్నయ్య ఫోన్ చేసి, "వెళ్ళు" అని చెప్పాడు. అన్నయ్య ఆ మాట చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ప్రయాణంలో బాబా దర్శనమైంది. ఆయన దయతో మా ప్రయాణం అంతా చాలా సంతోషంగా జరిగింది. మేము హైదరాబాద్ చేరుకొని మా స్నేహితురాలిని కలుసుకొని చాలా ఆనందంగా గడిపాము. తరువాత నేను, నా స్నేహితురాలు కలిసి ఖమ్మం వచ్చాము. మరుసటిరోజు నా తిరుగు ప్రయాణానికి టికెట్ ఉండగా ముందురోజు రాత్రి నా స్నేహితురాలు, "నీకు బాబా అంటే ఇష్టం కదా! ఈ ఊరిలో బాబా, నరసింహస్వాముల టెంపుల్స్ చాలా ఫేమస్. నిన్ను తీసుకెళదామనుకున్నాను. కానీ పిల్లలికి జ్వరం వల్ల కుదరలేదు. ఇంకోరోజు ఉంటే తీసుకెళ్తాన"ని చెప్పింది. నేను, "సరేలే. ఏం చేస్తాం? ఏదైనా బాబా అనుకోవాలి, మనం కాదు" అని అన్నాను. తరువాత మేము కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాం. ఉదయం 10 గంటలకు 'ట్రైన్ 5 గంటలు ఆలస్యమ'ని ఫోన్ వచ్చింది. 'ఇంకా ఆ ట్రైన్‍కి వెళ్లడం కుదరదు. వేరే ట్రైన్‍కి వెళదామంటే ట్రైన్‍లన్నీ రాత్రికి ఉన్నాయి. కానీ ఆరోజు నేను తప్పకుండా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంది. పోనీ బస్సుకి వెళదామంటే, బస్సులు లేవు. సరేనని రిజర్వేషన్ చేయించిన ఆ ట్రైన్‍నే ట్రాక్ చేస్తూ గడిపాను. సాయంత్రం నా స్నేహితురాలు నన్ను బాబా గుడికి తీసుకెళ్లింది. అంత పెద్ద బాబా గుడి చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. బాబా దర్శనం చేసుకుని ఇంటికొచ్చి డిన్నర్ చేసి, స్టేషన్‍కి వెళితే మధ్యాహ్నం ఒంటి గంటకి రావాల్సిన ట్రైన్ 12 గంటలు ఆలస్యంగా అర్థరాత్రి 1.30కి వచ్చింది. అది కూడా శిరిడీ నుండి. బాబా 'నా దర్శనం చేసుకుని వెళ్ళు' అని ట్రైన్  అంత ఆలస్యమయ్యేలా చేసి తమ దర్శనంతోపాటు నా స్నేహితురాలితో ఇంకాస్త సమయం గడిపేలా అనుగ్రహించారు. బాబా దయవల్ల ప్రయాణం సాఫీగా సాగి నేను క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాను. "ధన్యవాదాలు బాబా".

టెన్షన్ తీర్చిన బాబా 

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

నా పేరు రాఘవ. నేను విజయవాడ నివాసిని. నేను చాలాకాలం తర్వాత బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, సెప్టెంబర్ నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నా మిత్రుడు ఒకతను, "మీ స్కూటీ ఇస్తే, పని చూసుకొని రెండు, మూడు రోజుల్లో తెచ్చిస్తాను" అని అడిగితే, నా స్కూటీ ఇచ్చాను. అయితే వారం, పది రోజులైన అతను నా బండి తిరిగి తీసుకొని రాలేదు. నేను ఫోన్ చేస్తే తీసేవాడు కాదు. ఒకవేళ తీసినా, "ఈరోజు తెస్తాను, రేపు తెస్తాను" అని అంటుండేవాడు. నేను 15 రోజులు చూసిన తరవాత అతని స్నేహితులకి ఫోన్ చేసి విచారిస్తే, 'అతను తాగి బండి నడుపుతుంటే పోలీసులు పట్టుకొని బండి పోలీసు స్టేషన్‍లో పెట్టార'ని తెలిసింది. అప్పటివరకు ధైర్యంగా ఉన్న నాకు చాలా భయమేసింది. ఒక పక్క నేను చాలా టెన్షన్ పడుతుంటే ఇంట్లోవాళ్లు, "నువ్వు ఎవరు ఏం అడిగినా ఇచ్చేస్తావు. ఇప్పుడు చూడు! వాడెవడో ఇలా చేశాడు" అని మాటలు అంటుండేవారు. నేను బాబాని, "బాబా! నా బండి నా దగ్గరకి వచ్చేలా చేయి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. రెండు, మూడు రోజులకి అతని బంధువు ఒకతను నాకు ఫోన్ చేసి, "సార్! మీ బండి నేను తీసుకొస్తాను. మీరు ఏం బాధపడకండి" అని చెప్పి రెండు రోజులలో నా బండి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇది బాబా దయవల్లే జరిగింది. కానీ నేను ఈ విషయం బ్లాగుకి పంపడంలో ఆలస్యమైంది. "నన్ను క్షమించు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1484వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. గొంతునొప్పి, దగ్గు, జలుబు నయం చేసిన సాయి మహారాజ్

బాబా కృప

సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరిలో మా అమ్మగారికి బాగా ఆయాసం, గుండె దడ ఉంటుండేవి. మేము మాకు తెలిసిన ఆర్ఎమ్‍పి డాక్టరుకి అమ్మని చూపించాము. ఆ డాక్టరు మూడు రోజులు ఇంజక్షన్ చేసారు. అయితే ఇంజక్షన్ చేసినప్పుడు అమ్మకి ఆయాసం, దడ తగ్గి మళ్ళీ వచ్చింది. ఒక నెల తరువాత మాములుగా అమ్మని చూసే జనరల్ ఫిజీషియన్‍కి చూపించాము. ఆయన ఈసీజీ, ఎక్స్ రే తీయించి, రక్తపరీక్షలు కూడా చేయించి, "ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది. అవిరి పట్టించండి" అని చెప్పారు. దాంతో ఒక 15 రోజులు అమ్మకి ఆవిరి పట్టించాము. ఆయాసం తగ్గిందికానీ దేనికైనా మంచిదని టీబీ&చెస్ట్ డాక్టర్ దగ్గర చెక్ చేయిద్దామని ఒక రోజు హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టరు ఎక్స్ రే, ఈసీజీ తీసి "హార్ట్ బీట్ 250 పైన వుంది. కార్డియాలజీ డాక్టర్‍కి చూపించమ"ని అన్నారు. సరేనని కార్డియాలజీ డాక్టరుకి చూపిస్తే, అయన ఎకో టెస్టు చేసి, "గుండె ఎన్లార్జ్ అయింది. హార్ట్ బీట్ రేటు, బీపీ ఎక్కువగా ఉన్నాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి" అని అడ్మిట్ చేసుకొని అమ్మని రెండురోజులు ఐసియులో ఉంచారు. అప్పుడు నేను, "బాబా! మా అమ్మకి ఏమి కాకుండా తగ్గిపోయి క్షేమంగా ఇంటికి వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రి. అలాగే దయతో హాస్పిటల్ బిల్లు తక్కువగా వచ్చేటట్లు చూడు తండ్రి. మా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి" అని బాబాను వేడుకున్నాను. అయితే  హాస్పిటల్ బిల్లు ఎక్కువైంది. కానీ బాబా దయవల్ల మంచి చికిత్స అంది అమ్మ క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి, ఇప్పుడు బాగుంది. "ధన్యవాదాలు సాయి. అమ్మ ఆరోగ్యంగా బాగుండేలా చూడు తండ్రి".

నేను ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్నాను. ఒక రోజు మా ప్రిన్సిపల్ నాకు ఒక ముఖ్యమైన లెటర్ ఇచ్చి మా HOD(హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్)కి ఇమ్మని చేప్పారు. నేను ఆ లెటర్ వేరే డిపార్ట్మెంట్‍లో పెట్టి మర్చిపోయాను. తరువాత గుర్తొచ్చి వెళ్లి చూస్తే ఆ లెటర్ అక్కడ లేదు. బీరువాల క్రింద, టేబుల్స్ క్రింద, ఇంకా ఆ గదంతా వెతికినా లెటర్ దొరకలేదు. ఆఫీసులో మరల అడిగితే, "మీకు ఇచ్చింది ఒరిజినల్, జిరాక్స్ లేదు" అన్నారు. దాంతో సార్ ఏమైనా అంటారేమోనని భయపడి, "బాబా! ఆ లెటర్ దొరికితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. తరువాత మరోసారి వెతికితే వేరే సెల్ఫ్ల క్రింద ఆ లెటర్ దొరికింది. నేను చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా".

ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పి, అలసట వల్ల నాకు అసౌకర్యంగా అనిపించింది. నాకు షుగర్ వ్యాధి ఉన్నందున షుగర్ డౌన్ అయిందేమోనని బోజనం చేసాను. అలాగే గ్యాస్ టాబ్లెట్ కూడా వేసుకొని పడుకున్నాను. ఉదయం నిద్ర లేచేసరికి కాళ్ల నొప్పులు, ఒళ్లునొప్పులతోపాటు నీరసంగా ఉంది. ఒక టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళాను. కానీ అక్కడ వుండలేక మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాను. అదేరోజు పుట్టింట్లో ఉన్న నా భార్య ఫోన్ చేసి, "జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నాయి" అని చెప్పింది. తను బాలింతరాలు. బాబా దయవల్ల మాకు బాబు పుట్టి 4వ నెల నడుస్తుంది. బాబు చిన్నోడు. ఆ సమయంలో తను టాబ్లెట్ వేసుకోవచ్చో, లేదో అని భయమేసినప్పటికీ 'డోలో' టాబ్లెట్ వేసుకోమని నా భార్యతో చెప్పి, "బాబా! రేపు ఉదయానికల్లా నాకు, నా బార్యకి ఏ ఇబ్బంది లేకుండా నయమైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఉదయాన నిద్రలేచి నా బార్యకి ఫోన్ చేస్తే, "తగ్గింది" అని చెప్పింది. నాకు కూడా తగ్గింది. "ధన్యవాదాలు సాయి".

గొంతునొప్పి, దగ్గు, జలుబు నయం చేసిన సాయి మహారాజ్

సాయినాథ్ మహారాజ్ కీ జై!!! ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి సేవకులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. మాది చీడిగ. నాకు 2023, జనవరి 8న విపరీతంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు వచ్చాయి. డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా బాబా తగ్గిస్తారని అలానే ఉండిపోయాను. అయితే రెండు నెలల వరకు తగ్గలేదు. మందుల షాపు నుండి మందులు తెప్పించుకుని వేసుకుంటున్నా తగ్గక చాలా బాధపడ్డాను. విపరీతమైన గొంతునొప్పి వల్ల ఏమీ తినలేక, మాట్లాడలేకపోయేదాన్ని. చివరికి అది కరోనా ఏమో అని భయమేసి బాబా ఊదీ నోట్లో వేసుకొని, దీపపు ప్రమిదలోని నూనె గొంతుకు రాసుకుంటూ, "దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గితే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను తండ్రి" అని బాబాను వేడుకున్నాను. రెండు రోజులకు గొంతునొప్పి, జలుబు తగ్గాయి. సాయితండ్రి దయవల్ల నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు నయం చేసిన సాయి మహరాజుకు శతకోటి ధన్యవాదాలు.

సాయిభక్తుల అనుభవమాలిక 1483వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని మహిమ అద్భుతం!
2. కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే బాబా ఆశీర్వదించారేమో!

సాయినాథుని మహిమ అద్భుతం!

నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు అలేఖ్య. నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా సాయి భక్తురాలు. నేను, ఆమె ఎప్పుడూ బాబా గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. నా పరీక్షల సమయంలో ఆమె ప్రతిరోజు ఉదయం నన్ను నిద్రలేపేది. ఆమెతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఒకసారి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆంటీ వయసు 75 సంవత్సరాలు. తనకి ఏమైందో ఏమోనని నాకు చాలా భయమేసి మళ్లీమళ్లీ ఫోన్ చేస్తుంటే చివరికి ఆమె కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి, "ఆంటీ కింద పడిపోయారు. హాస్పిటల్లో జాయిన్ చేసాము" అని చెప్పింది. నేను వెంటనే హాస్పిటల్‍కి వెళ్లాను. ఆంటీ స్పృహలో లేరు. ఆమెకి బ్రెయిన్ సమస్య అని ఐసియులో ఉంచారు. నేను అంటీకి బాబా ఊదీ పెట్టి, ఇంటికి వచ్చి ఆ రాత్రంతా కన్నీళ్ళతో, "బాబా! ఆంటీకి ఏమీ కాకూడదు" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నా రోజువారీ అలవాటు ప్రకారం 'సాయి మారాజ్ సన్నిధి' బ్లాగు చూస్తే, అక్కడ 33వ అధ్యాయంలోని బాబా తాయత్తు గురించిన వివరణ ఉంది. అది ఆంటీ విషయంలో బాబా నాకిచ్చిన పరిష్కారం అనిపించింది. బాబాకి మనస్ఫూర్తిగా పూజచేసి ఊదీ, అక్షింతలు, పూలరెక్కలు అన్ని కలిపి ఒక యంత్రంలా చేసి బాబాకి మ్రొక్కుకొని హాస్పిటల్‍కి వెళ్లి ఆంటీ దిండు కింద ఆ యంత్రం పెట్టి ఇంటికి వచ్చాను. సాయినాథుని మహిమ అద్భుతం! ఆ రాత్రి ఆంటీలో కదలిక మొదలై ఉదయానికి కళ్ళు తెరిచారు. రెండు రోజుల్లో నార్మల్ వార్డుకి మార్చారు. ఆంటీ ఇప్పుడు మాములుగా బాబా పూజ చేస్తూ, మునుపటిలా రోజూ నాతో మాట్లాడుతున్నారు. అంతా బాబా దయ. ఇకపోతే మా నాన్నగారు చెకప్‍కి వెళ్ళినప్పుడు నార్మల్ రిపోర్ట్స్ రావాలని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల అలానే వచ్చాయి. ఇంకా మా బాబుకి ఏ కాస్త జ్వరం, దగ్గు ఉన్నా 'ఆయన మహిమలు పంచుకుంటాన'ని సాయిని వేడుకుంటే అన్ని ఆయనే చూసుకుంటున్నారు. మా కుటుంబ భారం సాయిదే. ఆయనే మా కుటుంబ యజమాని. కర్త, కర్మ, క్రియ అన్ని బాబానే. "సాయినాథా! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. మీ దయ, కరుణ, ఆశీర్వాదాలు వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాము. మీకు అనంతవేల కృతఙ్ఞతలు బాబా".

కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే బాబా ఆశీర్వదించారేమో!

నా తండ్రి సాయినాథునికి నమస్కారం. నా పేరు దీపిక. మాది హనుమాన్ జంక్షన్. నేను గత 26 సంవత్సరాల నుండి సాయినాథుని నమ్ముకుంటున్నాను. మా అమ్మ సచ్చరిత్ర పారాయణ చేయడం నాకు అలవాటు చేసింది. నేను రోజూ ఆ పుస్తకం తీసి 'సాయి నాకు ఈరోజు ఏమి మెసేజ్ ఇస్తున్నార'ని చూసుకుంటూ ఉంటాను. అలా చేయడం వల్ల సాయి నాతో మాట్లాడుతూ సలహాలు ఇస్తున్నట్లు ఉంటుంది. నాకు మొదటి పాప పుట్టింది. నాలుగేళ్ళ తర్వాత బాబు పుట్టాడు. తను పుట్టడం మా జీవితంలో ఒక అద్భుతం. బాబు పుట్టక ముందు మేము హైదరాబాద్‍లోని మా బ్రదర్ నిశ్చితార్థానికి హాజరై, అక్కడినుండి శిరిడీ వెళ్లాలని అనుకున్నాము. మా ప్రయాణానికి మూడు రోజుల ముందు నాకు నెలసరి వచ్చింది. సరే వచ్చేసింది, ఇబ్బంది లేదులే అనుకున్నాను. కానీ బ్లీడింగ్ అవ్వడం తగ్గలేదు. అయినప్పటికీ నిశ్చితార్థానికి హాజరై శిరిడీకి ప్రయాణమయ్యే సమయానికి ఐదు రోజులు అయిపోవడంతో 'వెళ్ళొచ్చులే' అని వెళ్ళాము. అయితే బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, దుర్వాసన రావటం జరుగుతుండేది. అయినా అదేదీ పట్టించుకోక సంతోషంగా సాయి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు పూజారి తమ చేయితో సాయి పాదాల తాకి, ఆ చేయిని నాపై, మా పాప తలపై పెట్టి ఆశీర్వదించారు. నాకు ఏదో తెలియాని ఆనందానుభూతి కలిగింది. అంతకుముందు ఎన్నోసార్లు శిరిడీ వెళ్ళాము కానీ, అలా ఆశీర్వాదం లభించడం అదే మొదటిసారి. మాములుగా పూజారులు మనల్ని అలా ఆశీర్వదించారు కదా! కాబట్టి ఆ పూజారి రూపంలో సాయే మమ్మల్ని ఆశీర్వదించారని అనుకున్నాను. తరువాత బస్సులో హైదరాబాద్‍కి తిరుగు ప్రయాణమయ్యాము. రాత్రి మధ్యలో డిన్నర్ కోసం ఓ చోట బస్సు ఆపితే నా భర్త పాపని తీసుకొని కిందకి దిగారు. నేను వాళ్లతో వెళ్లకుండా నీరసంగా ఉందని కళ్ళు మూసుకున్నాను. అప్పుడొక కల వచ్చింది. ఆ కలలో నా భర్త ఒక చిన్న సాయిబాబా విగ్రహం నాకు కానుకగా ఇస్తున్నట్లు కనిపించింది. ఇంటికి వచ్చిన తరువాత కూడా బ్లీడింగ్ అవ్వడం, దుర్వాసన రావడం, నీరసంగా ఉండటం వల్ల సుమారు వారం తరువాత హాస్పిటల్‌‌కి వెళితే, "ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యిందేమో! ఒకసారి హార్ట్ బీట్ స్కాన్ చేయించండి" అని అన్నారు. స్కాన్ చేయిస్తే హర్ట్ బీట్ వినిపిస్తుంది. అంటే కడుపులో బేబీ ఉంది. రెండో నెల అన్నారు. మేము అది అస్సలు ఊహించలేదు. అప్పుడు నాకు అనిపించింది, 'నా కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే శిరిడీలో బాబా ఆశీర్వదించారేమో!' అని. ఎందుకంటే, డాక్టర్ కనిపించిన లక్షణాల బట్టి నాకు అబార్షన్ అయుంటుందనే అన్నారు. ఇప్పుడు మా బాబుకి 13 ఏళ్ళు. ఇదంతా బాబా దయ. ఆయన అనుగ్రహం లేనిదే నా దినచర్య గడవదు.

సాయిభక్తుల అనుభవమాలిక 1482వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏదడిగినా ప్రసాదిస్తుంటారు బాబా 
2. బాబా చల్లని చూపు

ఏదడిగినా ప్రసాదిస్తుంటారు బాబా 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు అమర్నాథ్. ముందుగా నన్ను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతున్న సాయితండ్రికి శతకోటి వందనాలు. నేను కేరళలోని మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. కేరళలో ఏ పని చేయాలన్నా చాలా ఆటంకాలు వస్తుంటాయి. స్థానికులు ఏ పనిని సాఫీగా జరగనివ్వరు. నేను కేరళకి వచ్చేటప్పుడు, "బాబా! నాకు ఏ ఇబ్బంది కలిగినా, కష్టం వచ్చినా ఎల్లప్పుడూ నాతోనే ఉండి నా ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగేలా ఆశీర్వదించండి" అని బాబాను వేడుకున్నాను. కేరళలో అన్ని అనుమతులు తీసుకొని ఒక గ్రామ పరిసర ప్రాంతంలో కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్, HM ప్లాంట్, WMM ప్లాంట్, పకోన ప్లాంట్ల నిర్మాణం చేసాము. అంతా చాలా సవ్యంగా జరిగి సాయి ఆశీస్సులతో అన్ని ప్లాంట్స్ వర్కింగ్‍లోకి వచ్చాయి. అయితే ఒక నెల తర్వాత స్థానిక వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ఆడవాళ్లు ముందుండి పగలూరాత్రీ కంపెనీలోకి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. మా మేనేజ్మెంట్ మాత్రం పని ఆపవద్దు, అన్ని ప్లాంట్స్ రన్ చేయండి అని అంటుండేవారు. అలా చేస్తే స్థానిక ప్రజలు కొడతారు. ఆ పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపమని బాబాను వేడుకున్నాను. ఎమ్మెల్యే, ఎంపీలు కూడా చేయలేని పనిని ఆ గ్రామ పెద్ద ఎంతో చాకచక్యంగా అందర్ని ఒప్పించి, అన్ని ఆటంకాలు తొలగించి మరల ప్లాంట్స్ స్టార్ట్ చేసుకునేలా చేశారు. బాబాని వేడుకున్న తర్వాతనే సమస్య ఆ విధంగా పరిష్కారమైంది. ఇప్పుడు చాలా చక్కగా పని జరుగుతుంది. ఇంకో విషయం ప్రాజెక్టు సైట్లో కొత్తగా వచ్చిన ఒక సూపర్వైజర్ నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటే, నేను బాబాను వేడుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు నుండి అతను చాలా సౌమ్యంగా నాతో మాట్లాడుతున్నారు.

తరువాత మా అమ్మాయికి మార్చి 5న నీట్ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండగా బాబాని, 'పాపకి ఆ ఎగ్జామ్‍లో మంచి ర్యాంకు ప్రసాదించమని, కుటుంబసమేతంగా శిరిడీ వచ్చి త్వరలో మీ దర్శనం చేసుకుంటామమ'ని వేడుకున్నాను. బాబా దయవల్ల పాప పరీక్ష చాలా బాగా వ్రాసింది. నిజానికి పరీక్షకి ఐదు రోజుల ముందు నుండి పాప జ్వరం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‍తో చాలా బాధపడింది. ఆ విషయం నాకు తెలీదు. నేను మూమూలుగానే రోజూ బాబాని, "మా పాపకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని నమస్కరించుకుంటూ ఉంటాను. ఆ తండ్రి దయతో పరీక్ష ముందురోజు పాపకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగించి పరీక్ష బాగా వ్రాసేలా అనుగ్రహించారు. ఎల్లప్పుడూ బాబా మనం ఏదడిగినా ప్రసాదిస్తుంటారనడానికి ఇంతకంటే ఋజువు ఏం కావాలి? "బాబా! మీకు శతకోటి ప్రణామాలు. పాపకు మంచి ర్యాంకు ప్రసాదించి, మంచి యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసే అవకాశం కల్పించు బాబా. ఎల్లుప్పుడూ నాతోనే ఉండి నన్ను నడిపించు బాబా".

బాబా చల్లని చూపు

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు జగదీశ్వర్. నేను నా గత అనుభవం(అనుభవమాలిక 1418వ భాగం)లో శిరిడీ వెళ్ళేటప్పుడు మా మనవరాలికి జ్వరం వచ్చిందని, బాబాకి మొక్కుకున్న తర్వాత తగ్గిందని పంచుకున్నాను. అయితే రెండు నెలల పూర్తికాకముందే మా అమ్మాయి, మనవరాలు కరీంనగర్‌‌లోని మా ఇంట్లో ఉంటుండగా 2023, జనవరి 25న మనవరాలికి మళ్ళీ హై ఫీవర్ వచ్చింది. దాంతోపాటు  వణుకు ఉండేసరికి పాపకి బాబా ఊదీ పెట్టి ఆ రాత్రి హాస్పిటల్‌‌కి తీసుకెళ్ళాము. డాక్టరు ఇచ్చిన మందులు వేస్తూ, తడి గుడ్డతో తుడిస్తే జ్వరం తగ్గినట్లే తగ్గి, మళ్ళీ వస్తుండేది. లా దాదాపు వారం రోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి డాక్టర్ బ్లడ్ టెస్టు చేసి 'బాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింద'ని హాస్పిటల్‍లో అడ్మిట్ అవ్వమన్నారు. సరేనని పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే రెండు రోజులు ఇంట్రా వెయిన్ ద్వారా అంటిబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చి మూడోరోజు డిశ్చార్జ్ చేసారు. కానీ మరో రెండు రోజులు ఉదయం, రాత్రి పాపని హాస్పిటల్‍కి తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించుకోమన్నారు. మేము అలాగే చేసాము. దాంతోపాటు ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టడం కూడా మేము మరువలేదు. అలా దాదాపు పది రోజుల ఇంజెక్షన్ల కోర్స్ అయ్యాక మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే నార్మల్ వచ్చింది. కానీ రెండు రోజుల తర్వాత పాపకి మళ్లీ జ్వరం వచ్చింది. దాంతో మేము టెన్షన్ పడి మాకు తెలిసిన వేరే డాక్టరుకి పాపని చూపించాము. ఆ డాక్టర్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. బ్లడ్ టెస్ట్ కోసం కొద్ది దూరంలో ఉన్న ల్యాబ్‍కని వెళ్ళి కారు దిగి రోడ్డు క్రాస్ చేస్తుంటే, మధ్యలో ఉన్న ఎత్తుపల్లం కనిపించక మా మనవరాలిని ఎత్తుకొని ఉన్న నా భార్య పాపతో సహా రోడ్డు మీద బొక్క బోర్లా పడిపోయింది. అది చూసిన వారు అరవడంతో నేను ఏమైందని వెనక్కు తిరిగి చూస్తే, నా భార్య, మనవరాలు రోడ్డు మీద పడి ఉన్నారు. బాబా చల్లని చూపు వల్ల నా భార్యకి మోకాలు వద్ద కొద్దిగా గీరుకు పోవడం తప్ప ఇద్దరికీ ఏమి కాలేదు. బాబాకి మనసులో దణ్ణం పెట్టుకొని బ్లడ్ టెస్ట్ సెంటర్‍కి వెళ్లి పాపకి బ్లడ్ టెస్టు చేయించాం. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు రిపోర్ట్ రావడంతో డాక్టర్ మళ్ళీ ఐదు రోజులకి ఓరల్ సిరప్, అంటిబయోటిక్స్ వ్రాసిచ్చారు. అవి వాడిన తర్వాత మా మనవరాలికి పూర్తిగా జ్వరం తగ్గింది. ఇప్పటికీ(ఈ అనుభవం వ్రాసే సమయానికి) 15 రోజులు అవుతుంది. మా మనవరాలు పూర్తి ఆరోగ్యంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల మా మనవరాలు పూర్తిగా కోలుకుంది. మాపై దయ ఉంచండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1481వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయుంటే శ్రమ ఉండదు - అంతా సవ్యంగా జరిగిపోతుంది
2. ఇంట్లో అద్దెకు దిగేలా అనుగ్రహించిన బాబా

బాబా దయుంటే శ్రమ ఉండదు - అంతా సవ్యంగా జరిగిపోతుంది

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకి నా ధాన్యవాదాలు. నా పేరు మంగతాయారు. ఆ పరాత్పరుని కరుణాకటాక్షాల వల్లనే మనం ఆయన పాదాల చెంతకు చేరి ఆయన ప్రసాదించిన అనుభవాలను పొందుతున్నాము. నేనిప్పుడు ఇటీవల నాకు జరిగిన మూడు చిన్న అనుభవాలను పంచుకుంటున్నాను. 2022, జూన్ 18న 80 సంవత్సరాల మా మేనత్తని చూసొద్దమని మా కుటుంబమంతా హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరాము. కారులో ఉన్న పెట్రోల్ 100 కిలోమీటర్లు దూరం వరకే సరిపోతుందని పెట్రోలు పోయిద్దామని చూస్తే, బంకులన్నీ మూసేసి ఉన్నాయి. కారణం ఆరోజు దేనికో సమ్మె చేస్తున్నారు. సిటీ దాటే వరకు చూసి బంకు లేవీ తెరిచి లేకపోతే తిరిగి వెళ్లిపోదామనుకున్నాము. అంతలో హఠాత్తుగా ఎందుకో కారులో ఉన్న సాయి ఫోటోకేసి చూసిన నేను, "పెట్రోల్ దొరికితే, బ్లాగులో మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకొని చూసేసరికి ఒక పక్కగా ఉన్న పెట్రోల్ బంకు క్లోజ్ చేయడానికి సిద్ధమవుతూ కనిపించింది. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, మాకు కారులో పెట్రోలు పోసేసి, బంకు క్లోజ్ చేసేశారు. అది సాయి దయ.

USAలో ఉన్న మా మనవరాలు 7వ తరగతికి వచ్చి స్కూలు మారింది. కొత్త స్కూలులో పాపకి జనరల్ మ్యాథ్స్ ఇచ్చారు. కానీ పాప నన్ను నాకు కంపోజిట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలని ఒకటే గొడవ. స్కూలువాళ్ళను అడిగితే, "పరీక్ష వ్రాస్తే, దానిలో వచ్చిన మార్కులు ఆధారంగా ఇస్తామ"ని అన్నారు. అప్పుడు నేను, "పాపని కంపోజిట్ మ్యాథ్స్ గ్రూపులో వేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. ఆ స్వామి దయ చూడండి. పాపకి పరీక్ష పెట్టకుండానే కంపోజిట్ మాథ్స్ గ్రూపులో వేశారు. మనకి ఎప్పుడు, ఏమి ఇవ్వాలో ఆ స్వామికి తెలుసు. ఆయన మీద పూర్తి నమ్మకం ఉంటే చాలు, ఆయనే చూసుకుంటారు.

మేము 2023, ఫిబ్రవరి 11న ఒక గెట్-టుగెదర్(ఆత్మీయ సమ్మేళనం) ప్లాన్ చేసి, అందుకోసం ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి, అందులో మా కులానికి చెందిన 500 కుటుంబాలను యాడ్ చేసి, ఎవరైనా, ఎక్కడున్నా ఆత్మీయ సమ్మేళనానికి రావొచ్చని ఆహ్వానించాము. ఆ సందర్భంగా భాగవత ప్రచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు తదితర అన్నీ చేయాలనుకున్నాము. కానీ ఎలా జరుగుతుందో ఏమోనని నాకు భయమేసి, "ఏ ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలి సాయి" అని సాయితో చెప్పుకున్నాను. అలా భారం ఆయన మీద వేసాక ఎందుకో అంత సవ్యంగా జరుగుతుందని నాకు నమ్మకం కలిగింది. ఆ బాబా దయ ఉంటే ఎటువంటి పనైనా శ్రమ తెలియకుండా సాఫీగా జరిగిపోతుంది. అలాగే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఆ స్వామి దయ నా మీద, నా కుటుంబం మీద ఉందని తెలిసి చాలా చాలా సంతోషపడుతున్నాను. ఎప్పుడూ ఇలాగే ఆయన ప్రేమకు పాత్రురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".

ఇంట్లో అద్దెకు దిగేలా అనుగ్రహించిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!

'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి, సాయి భక్తులకు నమస్కారాలు. నా పేరు మంగారావు. 1993 నుంచి శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్న భాగ్యం నాకు లభించింది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. కొన్ని రోజులు ముందు నా ఫ్రెండు ఈ బ్లాగు గురించి నాకు తెలియపరిచి, తర్కడ్ కుటుంబ అనుభవాలు మరియు కొందరు భక్తులు అనుభవాలు వాట్సప్ ద్వారా షేర్ చేసారు. నేను వాటిని ప్రతిరోజూ చదువుతుండగా అందులో కొందరు భక్తులు తమ కోరికలను, కష్టాలను, బాధలను తీరిస్తే ఈ బ్లాగు ద్వారా తమ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటామని బాబాను ప్రార్థించి, ఆ కష్టాల నుంచి బయటపడినట్లు చదివాను. అవి చదివిన నేను అప్పటికే ఒక సంవత్సర కాలంగా ఎవరూ అద్దెకు రాక ఖాళీగా ఉంటున్న మా ఇంటి గురించి బాబాను ప్రార్ధించి, "వెంటనే మా ఇల్లు ఎవరైనా అద్దెకు తీసుకుంటే, ఈ బ్లాగు ద్వారా నా అనుభవం అందరికీ తెలియపరుస్తాను" అని బాబాకు చెప్పుకున్నాను. కొన్నిరోజుల తరువాత 2023, ఫిబ్రవరి 26న నేను ఒక సత్సంగంలో ఉండగా నాకు తెలిసినవాళ్ళు ఫోన్ చేసారు. వాళ్ళు మా ఇల్లు చూసి 2023, ఫిబ్రవరి 27న మా ఇంటిని అద్దెకు తీసుకొని షాపు పెట్టుకుంటామని నిర్ధారణ చేశారు. అలాగే మార్చి 3న వాళ్ళు మా ఇంటిలో దిగారు. అనుకున్న దానికంటే అద్దె కొంచం అటుఇటుగా ఉన్నా బాబా దయవల్ల మా సమస్య తీరింది. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1480వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి దయవల్ల దొరికిన పోయిన బండి
2. సమస్యలు తీర్చి నమ్మకం కుదిర్చిన బాబా

సాయి దయవల్ల దొరికిన పోయిన బండి

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు మంజుల. మాది గుంటూరు. నేను సాయిబాబాను తల్లిగా, తండ్రిగా, ఇంకా సర్వము ఆయనే అన్న భావనతో కొలుస్తాను. నాకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఆ తండ్రే. నేను ఆయన్నే తలుస్తాను, జపిస్తాను, నమ్ముతాను. 2023, ఫిబ్రవరి 18న శివరాత్రి. ఆరోజు పొద్దున్నే నేను, మావారు నిద్రలేచి శివరాత్రి కదా తొందరగా గుడికి వెళ్ళొద్దామని బయలుదేరాము. తీరా బయటకొచ్చి చూస్తే మా ఇంటి ముందు ఉండాల్సిన స్కూటర్ కనపడలేదు. మావారు ఒక అడ్వకేట్. నేను ఒక ప్రైవేటు ఉద్యోగిని. మాకు ఒక అమ్మాయి. తను పీజీ చేసేందుకు ప్రిపేరవుతుంది. మావారు రోజూ ఉదయం నన్ను, మా పాపని దించి తన కోర్టుకు వెళ్లి, సాయంత్రం మళ్లీ మిమ్మల్ని ఇంట్లో దింపి, మళ్ళీ ఆఫీసుకు వెళ్లి రాత్రి ఇంటికొస్తారు. మాకు బండి లేకపోతే క్షణం గడవదు. అలాంటి మా బండి పోయేసరికి మా మనసంతా వికలమైపోయింది. ఎలాగో ఇద్దరం శివాలయానికి వెళ్లి దర్శనము, అభిషేకం చేసుకుని వచ్చాం. కానీ ఏదో బాధగా అనిపించి, "సాయిరామ్ తండ్రీ! అసలే పిల్ల పెళ్ళి ఖర్చులకి డబ్బులు సరిపోతాయో, లేదోనని మదనపడుతుంటే ఇప్పుడు ఈ విపత్తు ఏమిటి తండ్రి" అని బాధపడ్డాము. అన్నట్టు మా పాపకి పెళ్లి నిశ్చయమైంది. అది కూడా ఆ నాయనా అనుగ్రహమే. మంచి కుటుంబం, మంచి అబ్బాయి.

నేను బాబాను నమ్ముతాను. అందుకే సమస్యను ఆయనకే వదిలేసి, "మా బండి మాకు దొరికితే, 108 ప్రదక్షిణలు చేసి, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ రోజంతా మేమందరం అన్యమనస్కంగానే ఉన్నాము. మరుసటిరోజు ఫిబ్రవరి 19 ఉదయానికి కూడా అలాగే ఉన్నాము. ఆరోజు మధ్యాహ్నం మావారు 'మన బండి దొరకద'ని ఎవరో అన్నారంటే, "నేను బాబాను నమ్ముతానండి. ఆయనే చూసుకుంటార"ని చెప్పాను. అలాగే నా తండ్రి మమ్మల్ని అనుగ్రహించారు. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆరోజు రాత్రి 8:30కి మావారు ఫోన్ చేసి మన బండి దొరికింది అని చెప్పగానే నా ప్రాణం లేచి వచ్చింది. అసలు విషయమేమిటంటే, మావారి ఆఫీసు కింద ఉండే అబ్బాయి ఇంటి దగ్గర ఎవరో బండి అమ్ముతామని అంటే వెళ్లి చూశాడు. ఆ అబ్బాయి ఆ బండి స్టోరేజ్ బాక్సులో ఉన్న మావారి విజిటింగ్ కార్డు చూసి, "ఇది మా లాయరుగారి బండి, నువ్వు అమ్ముతున్నానంటావేంటి? నువ్వు ఎవరు?" అని అడిగేసరికి ఆ వ్యక్తి కంగారుపడి బండి వదిలేసి అక్కడినుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మావారికి ఫోన్ చేసి, "లాయరుగారు మీ బండి మా ఇంటి దగ్గర ఉంది. దానిలో పెట్రోల్ లేదు" అని చెప్పాడు. మావారు వెళితే అతను జరిగిందంతా చెప్పి మా బండిని మాకు అప్పగించాడు. ఇదంతా నా తండ్రి దయకాక మరేమిటి? ఈవిధంగానే ఆ తండ్రి మా వెన్నంటే ఉండి మా బిడ్డ కళ్యాణం నిర్విఘ్నంగా, సంతోషంగా జరిగేలా, అలాగే మా పాపకు మంచి కాలేజీలో మంచి బ్రాంచిలో పీజీ ఫ్రీ సీట్ వచ్చేలా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఆయన నా కోరికను నెరవేరుస్తురన్న నమ్మకంతో మళ్ళీ నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటానని ఆశిస్తున్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్ఫణమస్తు!!!

సమస్యలు తీర్చి నమ్మకం కుదిర్చిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్నవారికి మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి. నేను ఒక సామాన్య సాయి భక్తురాలని. అలాంటి నాకు సాయిబాబాపై మరింత నమ్మకం కలిగేలా చేసింది మా మేడం అంజలి. ఆమె నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు నా గురించి సాయిబాబాకి ప్రార్థన పెట్టించింది. ఆయన దయతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మా మేడం నన్ను పారాయణ గ్రూపులో జాయిన్ చేసింది. నేను ఇప్పుడు ప్రతి గురువారం బాబా జీవితచరిత్ర చదువుతున్నాను. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒక రెండు నెలలు నాకు, మా చిన్నపాపకి నెలసరి రాలేదు. ఇక డాక్టర్ దగ్గరకి వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు గురువారం. "బాబా! మాకు నెలసరిగా సవ్యంగా రావాలి. అలా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత రెండు రోజులకి మా పాపకి నెలసరి వచ్చింది. మరో రెండు రోజులకి నాకు కూడా నెలసరి వచ్చింది. అలా బాబా దయవల్ల డాక్టర్ దగ్గరకి వెళ్లకుండానే మా సమస్య తీరింది. "కృతజ్ఞతలు బాబా".

2023, ఫిబ్రవరి 18, మహాశివరాత్రి నాడు మా పెద్దపాపకి కొంచెం కడుపునొప్పి వస్తుంటే హాస్పిటల్‍కి తీసుకెళ్ళాను. డాక్టర్ చూసి స్కానింగ్ తీయాలి అన్నారు. రిపోర్టు ఎలా వస్తుందో అని భయపడి, "బాబా! రిపోర్టు నార్మల్‍గా వస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపటికి రిపోర్టు వచ్చింది. డాక్టర్ చూసి, "సమస్య ఏమీ లేదు" అని చెప్పింది. ఇలా ఎన్నోసార్లు బాబా దయవల్ల చిన్న చిన్న సమస్యలు తీరాయి. బాబా ఎప్పటికీ నాయందు ఉంటారని నమ్మకం నాకు కుదిరింది. "ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీసాయినాథర్ఫణమస్తు!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1479వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు - భయము అవసరం లేదు
2. ఏ సమస్య వచ్చినా సాయితండ్రి తీరుస్తారు

బాబా ఉన్నారు - భయము అవసరం లేదు

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి భక్తులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి వేల కృతజ్ఞతలు. నిజానికి ఈ బ్లాగు నడిపించేది మనందరి సాయేనని నా ప్రగాఢ విశ్వాసము. నా పేరు ఉమ. మాది నిజమాబాద్ జిల్లా. నేను ఒక సాయి భక్తురాలిని. ఏ చిన్న సమస్య వచ్చినా 'మనకు సాయి ఉన్నార'నే ధైర్యం సాయి భక్తులందరినీ ముందుకు నడిపిస్తుంది. ఆయన ఈమధ్య నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. మా అక్కవాళ్ళ అబ్బాయికి 17 సంవత్సరాల వయస్సు. 2022, నవంబర్ నెలలో తన గొంతు దగ్గర గడ్డల్లా కనిపించాయి. డాక్టరు దగ్గరకి వెళితే, 'థైరాయిడ్' అని చెప్పి మందులిచ్చారు. ఒక నెల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు డాక్టరు, "ఈ గడ్డలు చూస్తుంటే అనుమానంగా ఉంది. వేరే డాక్టర్ దగ్గర చూపించండి" అని అన్నారు. దాంతో ఇంకో డాక్టరు దగ్గర చూపిస్తే, వాళ్ళు స్కానింగ్, టెస్టులు అంటూ చాలా చేసారు. ఆ రిపోర్ట్స్ చాలారోజుల వరకు రాలేదు. మా అక్క భయపడుతూ ఉంటే, "అక్కా! బాబా ఉన్నారు. భయము అవసరం లేదు. బాబాకి మనస్ఫూర్తిగా ఏదైనా వేడుకో. అంతా బాబా చూసుకుంటారు" అని చెప్పాను. తను 'సాయి దివ్యపూజ' చేస్తాననుకొని చేసింది. బాబా దయవల్ల రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చి, సమస్య  థైరాయిడ్ అని తేలింది. అప్పుడు అందరం ఊపిరి పీల్చుకొని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

2022, డిసెంబరులో మా బావగారికి హఠాత్తుగా ఛాతిలో నొప్పి వస్తే హైదరాబాదులోని హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్స్ పరీశిలించి యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి, చేశారు. రిపోర్ట్ ఏమొస్తుందో అని భయపడుతూ నేను, మావారు, మా అక్క హైదరాబాద్‌కి  బస్సులో బయలుదేరాము. నేను దారిలో, "బాబా! బావగారి రిపోర్ట్స్ నార్మల్ వస్తే, నేను మీ గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తాన"ని బాబాకి మొక్కుకున్నాను. అప్పటికే మా కుటుంబసభ్యులు 12 మందిమి 2023, జనవరి 9న శిరిడీ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. అందులో మా బావగారు కూడా ఉన్నారు. ఒకవేళ రిపోర్టులో ఏమైనా వస్తే, మా శిరిడీ ప్రయాణం రద్దు అయిపోతుంది. ఆ విషయం గురించి కూడా నేను ఒకటే టెన్షన్ పడుతూ, "అలా ఏమీ జరగకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత మేము దిగాల్సిన చోటు రాగానే బస్సు దిగాము. బస్సు దిగుతూనే మా అక్క, నా చెవి చూసి, "చెవికమ్మ ఏమైంది?" అని అడిగింది. అప్పుడు నేను నా చెవి తడుముకొని, "అయ్యో అక్కా! బస్సులో పడిపోయినట్లుంది, నేను చూసుకోలేదు" అని బాధపడ్డాను. అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. మావారు, "బస్సు టికెట్ తీయి, అందులో ఉన్న హెల్ప్ లైన్‌కి ఫోన్ చేద్దామ"ని అన్నారు. నేను టికెట్ చూసి, దాని మీద ఉన్న హెల్ప్ లైన్ నెంబరుకి కాల్ చేశాను. వాళ్ళు ఆ బస్సు డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. నేను ఆ నెంబరుకి ఒకటే కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు. చివరికి ఒక గంట తర్వాత లిఫ్ట్ చేసినా రాంగ్ నెంబర్ అన్నారు. నేను నిరాశ చెందకుండా మనసులో 'బాబా ఉన్నారు. ప్రతి ప్రాణిలో ఉన్నది తామే అన్నారు కదా! అదే నిజమైతే బాబా నా చెవికమ్మ నాకు దొరికేలా అనుగ్రహిస్తారు' అని అనుకొని మళ్ళీ హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసి, "ఆ నెంబర్ రాంగ్ నెంబర్ అంటున్నారు" అని చెప్తే, మరో నెంబర్ ఇచ్చారు. మావారు ఆ నెంబరుకి కాల్ చేసి, జరిగింది చెప్పి, నా సీటు నెంబర్ కూడా చెప్పారు. ఆ డ్రైవర్ వెంటనే బస్సు పక్కకు తీసి ఆపి, ఆ సీటు దగ్గర చూసి, చెవికమ్మ దొరికిందని చెప్పారు. సాయికి కృతజ్ఞతలు చెప్పి, వెళ్లి ఆ చెవికమ్మను తీసుకున్నాము. మేము ఆ బస్సు దిగి గంటపైనే అయింది. మేము దిగిన తరువాత ఆ బస్సు బస్టాండ్‌కి వెళ్లి, ప్రయాణికులను ఎక్కుంచుకోని తిరిగి నిర్మల్ వెళ్తుంది. ఆయినా నా కమ్మ ఎవరి కంటా పడకుండా అక్కడే ఉందంటే ఆ సాయినాథుని దయే కదా! ఒకవేళ అది దొరికినా కూడా ఆ డ్రైవర్ మాకు ఇవ్వాలని లేదు, 'దొరకలేద'ని చెప్పొచ్చు. కానీ అలా జరగలేదు. మన సాయి ఎక్కడో లేరు. అలాంటి మంచి మనుషుల రూపంలోనే ఉన్నారు నా బాబా.

ఇకపోతే, నా సాయి దయవల్ల మా బావగారి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. మేమంతా చాలా సంతోషించి శిరిడీ వెళ్లి అనంతకోటి బ్రహ్మాండనాయకుడైన సాయి మహరాజ్‌ని కనులారా దర్శించుకొని తిరిగి క్షేమముగా మా ఇంటికి చేరుకున్నాము.

శ్రీసాయినాథార్పణమస్తు!!!

ఏ సమస్య వచ్చినా సాయితండ్రి తీరుస్తారు

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నా పేరు మహేశ్వరి. నేను ఈ మధ్యకాలంలోనే 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపులో చేరాను. 2023, జనవరి నుండి ఒక నెల రోజులు మా పది నెలల మనవరాలికి విపరీతమైన జ్వరం వస్తుండేది. హాస్పటల్లో చూపిస్తుంటే తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుండేది. ఇలా ఉండగా మా అక్కకొడుకు పెళ్లి వచ్చింది. సొంత అక్క కొడుకు పెళ్లి అయినందున వెళ్లక తప్ప లేదు. వెళ్లేటప్పుడు మనవరాలికి ఏమీ లేదు, బాగానే ఉంది. కానీ విడిది ఇంటి దగ్గరకి వెళ్లేసరికి హఠాత్తుగా పాప ఒక పక్క ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది. మరుసటిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే బ్లడ్ వచ్చింది. మేము చాలా కంగారుపడ్డాం కానీ, తర్వాత రోజు నుంచి బ్లడ్ రాలేదు. జ్వరం మాత్రం విపరీతంగా వచ్చి రాత్రుళ్ళు నిద్రపోకుండా పాప ఏడుస్తూనే ఉండేది. ఎంత సముదాయించిన ఒకటే ఏడుపు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే టెంపరేచర్ 104 డిగ్రీలు ఉంది. డాక్టరు రక్తపరీక్షలు చేయాలని చెప్పారు. నేనప్పుడు, "బాబా! బ్లడ్ రిపోర్టులో ఏ సమస్య లేకుండా అంతా నార్మల్ అని ఉంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి భక్తులందరితో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా పాపకి ఏ ప్రాబ్లం లేకుండా చూసి నార్మల్ ఫీవర్ అనేలా చేసారు. ఆ రాత్రి నేను బాబాను, "చిన్న పాప బాబా. తనకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి" అని బాగా వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజు ఫిబ్రవరి 19, ఆదివారం సాయంత్రం నుండి పాపకి జ్వరం రాలేదు, చక్కగా ఆడుకుంది. నాకు ఏ సమస్య వచ్చినా నా సాయితండ్రి ఇలానే తీరుస్తారు. "ధన్యవాదాలు సాయిబాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo