ఈ భాగంలో అనుభవాలు:
1. ఏది అనుకుంటే అది చేస్తారు బాబా2. టెన్షన్ తీర్చిన బాబా
ఏది అనుకుంటే అది చేస్తారు బాబా
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు హరిత. 2023, ఫిబ్రవరిలో మేము అంతర్వేది తీర్థ దర్శనానికి వెళ్ళాము. అది సరిగ్గా నా నెలసరి సమయం కావడంతో నేను చాలా భయపడి, "సాయీ! స్వామి దర్శనం, మరుసటిరోజు రథయాత్ర కూడా అయిన తర్వాత నాకు నెలసరి వచ్చేలా చూడు. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా ఎంతో దయ చూపారు. అలా రథయాత్ర అవుతూనే నాకు నెలసరి వచ్చింది. స్వామి దర్శనం, రథయాత్ర అన్ని అయిన తర్వాత నెలసరి వచ్చేలా అనుగ్రహించిన బాబా దయకు నాకు చాలా చాలా సంతోషమేసింది. ఇకపోతే అక్కడ ఉండగా నాకు ఒక రోజు ఒకటే తలనొప్పి, జ్వరం వచ్చాయి. "సాయీ! ఈ జ్వరం కూడా టాబ్లెట్స్‌తో నయమై సాయంత్రం లోపు తగ్గిపోతే ఈ రెండు అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఇంకేముంది? మనం ఏది అనుకుంటే అది చేస్తారుగా బాబా. జ్వరం, తలనొప్పి తగ్గిపోయాయి. "సదా అన్నివేళలా ఇలానే రక్షించు సాయి"
ఇకపోతే, నా స్నేహితురాలు ఒకామె యుఎస్ఏ నుండి ఇండియా వచ్చి నన్ను కలవడానికి మా ఇంటికి వస్తానని చెప్పింది. సరిగ్గా అదే సమయంలో నేను అంతర్వేది వెళ్లాల్సి ఉండటంతో తనని కలిసే అవకాశం నాకు లేకుండా పోయింది. దాంతో, 'అయ్యో.. తను నా దగ్గరకి వస్తానని చెప్పినా నేను తనని కలవకుండా ఊరు(అంతర్వేది) వచ్చాను. తను ఇండియాలో నెల రోజులు ఉంటుంది. తిరిగి యుఎస్ఏ వెళ్తే మళ్ళీ ఏ మూడు సంవత్సరాలకోగాని రాదు. తనని కలవడానికి కుదురుతుందో, లేదో' అని బాధపడ్డాను. నేను ఊరు నుండి తిరిగి వచ్చాక నా మరో స్నేహితురాలికి(మేము ముగ్గురం మంచి స్నేహితులం) ఫోన్ చేసి, "సింధు మా ఇంటికి వస్తానని చెప్పింది. కానీ నాకు కుదరలేదు, కలవలేకపోయాను" అని చెప్పాను. అప్పుడు తను, "సరే, మనం ముగ్గురం కలుద్దాం. నువ్వు ట్రైన్‍లో ఖమ్మం రా. ఇక్కడినుండి నువ్వు, నేను కలిసి హైదరాబాద్ వెళ్లి తనని కలుద్దాం" అని చెప్పింది. నేను, "అంత దూర ప్రయాణమంటే మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. నాకు ఆ విషయం తెలుసు" అని అన్నాను. అందుకు తను, "సరే, నువ్వు ఫోన్ పెట్టెయ్. నేను మీ అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతాను" అని కాల్ కట్ చేసింది. నేను, "ఎలా అయినా అన్నయ్య ఓకే చెప్పేట్టు చేయి సాయి. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. అంతలోనే అన్నయ్య ఫోన్ చేసి, "వెళ్ళు" అని చెప్పాడు. అన్నయ్య ఆ మాట చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ప్రయాణంలో బాబా దర్శనమైంది. ఆయన దయతో మా ప్రయాణం అంతా చాలా సంతోషంగా జరిగింది. మేము హైదరాబాద్ చేరుకొని మా స్నేహితురాలిని కలుసుకొని చాలా ఆనందంగా గడిపాము. తరువాత నేను, నా స్నేహితురాలు కలిసి ఖమ్మం వచ్చాము. మరుసటిరోజు నా తిరుగు ప్రయాణానికి టికెట్ ఉండగా ముందురోజు రాత్రి నా స్నేహితురాలు, "నీకు బాబా అంటే ఇష్టం కదా! ఈ ఊరిలో బాబా, నరసింహస్వాముల టెంపుల్స్ చాలా ఫేమస్. నిన్ను తీసుకెళదామనుకున్నాను. కానీ పిల్లలికి జ్వరం వల్ల కుదరలేదు. ఇంకోరోజు ఉంటే తీసుకెళ్తాన"ని చెప్పింది. నేను, "సరేలే. ఏం చేస్తాం? ఏదైనా బాబా అనుకోవాలి, మనం కాదు" అని అన్నాను. తరువాత మేము కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాం. ఉదయం 10 గంటలకు 'ట్రైన్ 5 గంటలు ఆలస్యమ'ని ఫోన్ వచ్చింది. 'ఇంకా ఆ ట్రైన్‍కి వెళ్లడం కుదరదు. వేరే ట్రైన్‍కి వెళదామంటే ట్రైన్‍లన్నీ రాత్రికి ఉన్నాయి. కానీ ఆరోజు నేను తప్పకుండా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంది. పోనీ బస్సుకి వెళదామంటే, బస్సులు లేవు. సరేనని రిజర్వేషన్ చేయించిన ఆ ట్రైన్‍నే ట్రాక్ చేస్తూ గడిపాను. సాయంత్రం నా స్నేహితురాలు నన్ను బాబా గుడికి తీసుకెళ్లింది. అంత పెద్ద బాబా గుడి చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. బాబా దర్శనం చేసుకుని ఇంటికొచ్చి డిన్నర్ చేసి, స్టేషన్‍కి వెళితే మధ్యాహ్నం ఒంటి గంటకి రావాల్సిన ట్రైన్ 12 గంటలు ఆలస్యంగా అర్థరాత్రి 1.30కి వచ్చింది. అది కూడా శిరిడీ నుండి. బాబా 'నా దర్శనం చేసుకుని వెళ్ళు' అని ట్రైన్ అంత ఆలస్యమయ్యేలా చేసి తమ దర్శనంతోపాటు నా స్నేహితురాలితో ఇంకాస్త సమయం గడిపేలా అనుగ్రహించారు. బాబా దయవల్ల ప్రయాణం సాఫీగా సాగి నేను క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
టెన్షన్ తీర్చిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
నా పేరు రాఘవ. నేను విజయవాడ నివాసిని. నేను చాలాకాలం తర్వాత బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, సెప్టెంబర్ నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నా మిత్రుడు ఒకతను, "మీ స్కూటీ ఇస్తే, పని చూసుకొని రెండు, మూడు రోజుల్లో తెచ్చిస్తాను" అని అడిగితే, నా స్కూటీ ఇచ్చాను. అయితే వారం, పది రోజులైన అతను నా బండి తిరిగి తీసుకొని రాలేదు. నేను ఫోన్ చేస్తే తీసేవాడు కాదు. ఒకవేళ తీసినా, "ఈరోజు తెస్తాను, రేపు తెస్తాను" అని అంటుండేవాడు. నేను 15 రోజులు చూసిన తరవాత అతని స్నేహితులకి ఫోన్ చేసి విచారిస్తే, 'అతను తాగి బండి నడుపుతుంటే పోలీసులు పట్టుకొని బండి పోలీసు స్టేషన్‍లో పెట్టార'ని తెలిసింది. అప్పటివరకు ధైర్యంగా ఉన్న నాకు చాలా భయమేసింది. ఒక పక్క నేను చాలా టెన్షన్ పడుతుంటే ఇంట్లోవాళ్లు, "నువ్వు ఎవరు ఏం అడిగినా ఇచ్చేస్తావు. ఇప్పుడు చూడు! వాడెవడో ఇలా చేశాడు" అని మాటలు అంటుండేవారు. నేను బాబాని, "బాబా! నా బండి నా దగ్గరకి వచ్చేలా చేయి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. రెండు, మూడు రోజులకి అతని బంధువు ఒకతను నాకు ఫోన్ చేసి, "సార్! మీ బండి నేను తీసుకొస్తాను. మీరు ఏం బాధపడకండి" అని చెప్పి రెండు రోజులలో నా బండి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇది బాబా దయవల్లే జరిగింది. కానీ నేను ఈ విషయం బ్లాగుకి పంపడంలో ఆలస్యమైంది. "నన్ను క్షమించు బాబా".
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha