ఈ భాగంలో అనుభవాలు:
1. ఆపదేదైనా గట్టెక్కిస్తారు బాబా
2. అన్నివేళలా అండగా ఉండే తండ్రి సాయి
ఆపదేదైనా గట్టెక్కిస్తారు బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు ప్రసూన. మాది హైదరాబాద్. సాయి అనుగ్రహం చేత నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య మా కుటుంబంలో సాయి అనుగ్రహం వల్ల జరిగిన రెండు అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను. ఒక రోజు మా చెల్లి ఫోన్ చేసి, "మా అత్తగారికి బాగాలేదు. హాస్పిటల్‍కి తీసుకెళతాం" అని చెప్పింది. ఆవిడకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తాయి. మేమంతా అదే అనుకున్నాము. కానీ డాక్టరు MRI రిపోర్టు చూసి 'బ్రెయిన్ హేమరేజ్' అని, "ఒక రోజు వేచి చూసాక CT స్కాన్ తీసి సర్జరీ చేయాలా, వద్దా అని డిసైడ్ చేస్తాం" అన్నారు. '76 సంవత్సరాల వయస్సులో ఆవిడ సర్జరీ ఎలా తట్టుకుంటారు?, సర్జరీ తరువాత కూడా చాలా కష్టం, మా చెల్లి, మరిదిగారు కూడా డయాబెటిక్ పేషెంట్స్' అని అందరం చాలా టెన్షన్ పడ్డాము. ఇలాంటి పరిస్థితుల్లో మాకు సాయి అనుగ్రహం తప్ప వేరే మార్గం లేదని తలచి వెంటనే మన తండ్రి ముందు బాధ చెప్పుకుని, "మార్గం సుగమం చేయమ"ని వేడుకున్నాము. ఆయన అసాధారణ రీతిలో పరిస్థితిని గట్టెక్కించారు. ఆయన దయవల్ల మరుసటిరోజు CT స్కాన్ రిపోర్టులో బ్రెయిన్ హేమరేజ్ మునుపటిలాగే ఉందని, ఏ మాత్రమూ పెరగలేదని వచ్చింది. డాక్టర్లు, "ప్రస్తుతానికి మందులు వాడదాం. ఇప్పుడే సర్జరీ అవసరం లేదు" అని అన్నారు. అప్పుడు మా అందరికీ కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. సాయి అనుగ్రహం మనపై ఉందనటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఉందా?
2023, మార్చి 14న మా అత్తగారి తిథి అనగా రెండురోజుల ముందు నుంచి మావారు విపరీతమైన జ్వరంతో బాధపడ్డారు. కార్యక్రమానికి సంబంధించి ఇంట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంటే మావారి పరిస్థితి ఆరోజు అసలు లేవగలరా అన్నట్లుంది. కార్యక్రమాన్ని వాయిదా వేసే వీలు లేదు. అట్టి స్థితిలో సాయితండ్రికి చెప్పుకోవటం ఒకటే మార్గమని, ఆయనే ఈ ఆపదను గట్టెక్కించగలరని, "ఎలా అయినా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాల"ని సాయికి విన్నవించుకున్నాము. ఇక బాబా అనుగ్రహం వల్ల కార్యక్రమానికి ముందురోజు మావారికి జ్వరం కొంచెం తగ్గింది. ఆయన మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు తెచ్చారు. మరునాటికి ఇంకాస్త ఓపిక వచ్చి ఆ రోజు కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసారు. ఇదంతా సాయినాథుని కృపాకటాక్షం. ఆయన అనుగ్రహం అపారం. ప్రతిక్షణం మనతో ఉంటూ మన ప్రతి కష్టంలో మార్గనిర్దేశం చేస్తూ, మన ప్రతి సమస్యకి పరిష్కారం చూపే సాయితండ్రి ఋణం ఏవిధంగా తీర్చుకోగలం? ఆయన మన సర్వసం. ప్రతిక్షణం మన మనసు సాయి స్మరణతో నిండిపోవాలి. ఆయన నామస్మరణ, ధ్యానంలతో ఈ జీవితం తరించిపోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ బాబా అనుగ్రహం పంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ సాయి బంధువులకు నమస్కారం.
అన్నివేళలా అండగా ఉండే తండ్రి సాయి
ఓం శ్రీసాయినాథాయ నమః!!!. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు సౌదామిని. 2023, జనవరి 28వ తేదీన నాకు గొంతు రాపు సమస్య వచ్చింది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ, 15 రోజుల చాలా బాధపడ్డాను. ఎందుకంటే, ఆ గొంతు ఇబ్బందితో పాటుగా రెండు రోజులు 101 లేదా 103 డిగ్రీల జ్వరం, రెండురోజులు విపరీతమైన దగ్గు ఉండేవి. అది చాలాదన్నట్లు తలనొప్పి, పన్ను, దవడలు అంతా నరాలు లాగుతున్న నొప్పి చాలా బాధపెడుతుండేది. డాక్టర్ దగ్గరకి వెళ్తే, కొన్ని మందులు వ్రాసి, "తగ్గకపోతే పరీక్షలు చేయిద్దాం" అన్నారు. మూడు రోజులు తర్వాత రాత్రి 8 గంటలకు స్నానం చేసిన మరుక్షణంలో నా వెన్నులో విపరీతమైన వణుకు, 103 డిగ్రీలు జ్వరం వచ్చాయి. మళ్ళీ డాక్టరుని సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసారు. ఆ సమయంలో నేను నా సాయి తండ్రి ఆశీస్సులు నాకు అండగా ఉండగా నాకు ఏమీ కాదు అనుకున్నాను. అనుకున్నదే ఆలస్యం నా పక్కనుండి నాకు రవ్వంత కష్టం కలగకుండా నన్ను రక్షించారు బాబా. ఆయన దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. కానీ డాక్టర్ వైరల్ ఫీవర్ అని చెప్పి మందులిచ్చారు. ఆ మందులు ఒకరోజు వేసుకోగానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నేను నీరసించిపోయాను. ఏమి తిన్నా విపరీతమైన వాంతులు, నరాలు చీట్లుపోతున్న తలనొప్పి ఉండేవి. ఆ తలనొప్పి రావడానికి ముందే భయంతో నేను ఒత్తిడికి గురయ్యేదాన్ని. ఆ భయంలో ఏ మాత్రం నీరసంగా ఉన్నా 'నాకు షుగర్ వచ్చిందేమో!, ఇంత తలనొప్పి ఎందుకు వస్తుంది? మెదడులో ఏమైనా సమస్య ఉందా, ఏమిటి?, ఏం తిన్నా వాంతులు అవుతుంటే 'కడుపులో ఏమైనా సమస్య ఉందా, ఏమిటి?' నీరసం వల్ల నడుము నొప్పి వచ్చినా, కిడ్నీలలో ఏమైనా సమస్య వస్తుందా?' అని ఒకటి కాదు ఎన్నో రకాలుగా కంగారు పడిపోయేదాన్ని. పరిస్థితి అలా ఉన్నా 'నా తండ్రికి నేను చెప్పేది ఏముంది? ఆయనకు అన్నీ తెలుసు' అని ఆయన మీద భారమేసి నేను నిత్యం వాడే హోమియో మందులను మా డాక్టరు అరుణ సలహా మీద మూడు రోజులు వేసుకొని, "నా తలనొప్పి తగ్గాల"ని బాబాకి చెప్పుకున్నాను. నెమ్మదిగా తలనొప్పి రావడం ఆగిపోయింది, వాంతులు కూడా ఆగిపోయాయి. "ధన్యవాదాలు సాయినాథ. మీరుండగా నీ బిడ్డలకు ఏమీ కాదని ఎప్పుడూ నిరూపిస్తావు తండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me