సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1465వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి కటాక్షం వర్ణించలేము - భక్తులు బాధపడితే బాబా చూడలేరు
2. మనసులో అనుకున్నదానికి తక్షణమే బదులిచ్చిన బాబా

సాయి కటాక్షం వర్ణించలేము - భక్తులు బాధపడితే బాబా చూడలేరు

ఓం నమో సాయినాథాయ!!! ముందుగా ఎంతో శ్రమకోర్చి బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈరోజు మా పాప పేరుమీద తీసుకున్న సైట్ విషయంలో బాబా అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022లో మా కజిన్ బ్రదర్ అభివృద్ధిపరిచిన లేఅవుట్‌లో మేము ఒక స్థలం తీసుకోవాలని అనుకున్నాము. నాకంటే ముందు మా తమ్ముళ్లు, బంధువులు చాలామంది కూడా ఆ లేఅవుట్‌లో స్థలాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ దగ్గరగా ఉంటామనే ఉద్దేశంతో ధర ఎక్కువైనా బాబానే మాకు కూడా ఆ సైట్ ఇప్పిస్తున్నారని నేను అనుకున్నాను. 2023, సంక్రాంతి సమయంలో మా కుటుంబమంతా ఒక టూర్‌లో ఉండగా మా కజిన్ బ్రదర్ ఫాిన్ చేసి, "కొన్ని కారణాల వల్ల వెంటనే అందరికీ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాను. మీరు టూర్ నుంచి నేరుగా ఊరు వచ్చేయండి" అని చెప్పాడు. డబ్బులకి సంబంధించిన లావాదేవీలన్నీ ముందే అయిపోవడం వల్ల అప్పటికప్పుడు డబ్బు చూసుకోవాల్సిన ఇబ్బంది అయితే లేదు. పైగా తను రిజిస్ట్రేషన్ చేస్తానన్నరోజు గురువారం కావడం వల్ల మనసుకు సంతోషంగా అనిపించింది. కానీ టూర్ నుండి నేరుగా అక్కడికి వెళితే కావలసిన డాక్యుమెంట్లన్నీ సమకురుతాయో, లేదోనన్న చిన్న అనుమానంతో చీటీల ద్వారా బాబాను అడిగితే, 'గురువారం కాదు. మరుసటి సోమవారం చేయించుకోమ'ని వచ్చింది. నేను ఆ విషయం మా కజిన్‌తో చెప్పి, "రిజిస్ట్రేషన్ సోమవారం పెట్టుకుందాం" అని అన్నాను. తను సరేనన్నాడు. అయితే అన్నీ సిద్ధమవుతుండగా చివరి నిమిషంలో తను ఫోన్ చేసి, 'కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కుదరడం లేదని, ఒక పది రోజుల తరువాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం' అని, ఒక డేట్ చెప్పాడు. చూస్తే, తను చెప్పినరోజు గురువారం. నేను ఎంతో సంతోషించి ఆ తేదీకి ఒక వారం ముందుగా సప్తాహపారాయణ ప్రారంభించి బుధవారం ఊరెళ్ళి మా కజిన్‌ని కలిశాను. తను చాలా సమస్యలలో, ఒత్తిడిలో ఉన్నాడు. వాటి గురించి మాట్లాడుకున్నాం. కానీ, మాటల్లో ఎక్కడా ఆ మరునాడు నాకు రిజిస్ట్రేషన్ చేస్తానన్న ప్రస్తావన తన నుండి రాలేదు. దగ్గరలో అందరి రిజిస్ట్రేషన్స్ అయిపోతాయని తను చెప్పిన మాటలను బట్టి నాది కూడా వాయిదాపడినట్టే అనుకొని ఆ సాయంత్రం దగ్గరలో ఉన్న మా అమ్మగారి ఊరుకి వెళ్దామని అనుకున్నాను. కానీ ఏవో పనులతో ఆలస్యమవడం వల్ల మర్నాడు ఉదయం వెళ్ళొచ్చులే అని మా సొంత తమ్ముడి ఇంట్లో ఉండిపోయాను. ఆ రాత్రి ఏదో విషయంగా మా కజిన్ ఫోన్ చేసి మాటల్లో, "మీ రిజిస్ట్రేషన్ రేపే. నువ్వు గురువారం కావాలని అడిగావు కదా!" అని అన్నాడు. బాబా నన్ను అందుకే ఊరికి వెళ్లకుండా ఆపారని సంతోషంగా సరే అన్నాను. కానీ ఇక్కడే బాబా నిర్ణయానికి విరుద్ధంగా చిన్న పని చేయాల్సి వచ్చింది. అదేమిటంటే, నేను ఎంచుకున్న సైట్ కాకుండా ఆ పక్క సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని మా కజిన్ నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఆ విషయం గురించి తను గతంలో కూడా ఒకసారి అడిగాడు. అప్పుడు నేను బాబాను అడిగితే, నేను మొదట అనుకున్న సైటే తీసుకోమన్నారు బాబా. అందువల్ల నేను, 'నాకు పక్క సైట్ వద్దు, ముందు అనుకున్న సైటే కావాలి' అన్నాను. అందుకు మా కజిన్ సరేనన్నాడు. అయితే నేను ఎంచుకున్న సైట్‌కి అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి సైట్లు ఎవరూ తీసుకోకుండా ఉండిపోయాయి. చివరి క్షణంలో మా కజిన్ ఆ విషయం చెప్పి, "ఒక పార్టీ తమకు రెండూ పక్కపక్క సైట్లు అడుగుతున్నారు. నువ్వు పక్క సైట్ తీసుకుంటే, ఆ రెండూ ఆ పార్టీకి ఇవ్వడానికి వీలుగా వుంటుంది" అని కొంచెం ప్రాధేయపడుతూ అడిగేసరికి నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. తను అసలే అవతలివాళ్ళ వల్ల చాలా ఇబ్బందుల్లో సతమతమవుతున్నాడు. అందువల్ల నేను మొండిగా నాకు అదే సైట్ కావాలని అనలేను. అలా అంటే తనకి నష్టం కలిగించినదాన్ని అవుతాను. పరిస్థితి అలా వచ్చేసరికి నాకేం చేయాలో అర్థంకాక బాబాని తలచుకుని, "బాబా! 'లభించినదానిని అనుసరించి ప్రవర్తించు' అని ఎన్నోసార్లు నువ్వు సందేశం ఇస్తుంటావు కదా! ఏది మంచిదైతే అదే జరిగేలా చేయి" అనుకొని, విషయం ఉన్నది ఉన్నట్లు మా కజిన్‌కి చెప్పి, "బాబా చెప్పారని నేను ఆ సైట్ కావాలన్నాను. అంతకంటే వేరే ఏ కారణం లేదు. సరే, నీ ఇష్టం" అని చెప్పేశాను. ఇంక తను మర్నాడు గురువారం రిజిస్ట్రేషన్ చేయడానికి ముందనుకున్న సైట్ కాకుండా పక్క సైటుకే డాక్యుమెంట్ తయారుచేయించాడు. అందరం రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లాం. కానీ నా మనసులో ఎక్కడో అపరాధభావం తొలుస్తూ, 'బాబా మాటకి విరుద్ధంగా వెళ్తున్నాను, ఏదైనా సమస్య వస్తుందేమో'ననిపించి, "బాబా! నేను చేసేది మంచిదే అయితే, అందుకు నీ అనుమతి ఉంటే వెంటనే నాకు దర్శనమివ్వు" అని అనుకుంటూ బయట ఉన్న వాహనాలను, షాపుల బోర్డులను చూడసాగాను. దేవతలందరి ఫోటోలు కనిపిస్తున్నాయి కానీ, బాబా ఎక్కడా కనిపించట్లేదు. దాంతో నాలో టెన్షన్ పెరిగిపోయింది, ఏడుపొక్కటే తక్కువ. ఈలోపు మావాళ్ళు నన్ను లోపలికి రమ్మనీ, ఏవో పేపర్స్ ఇమ్మనీ కంగారుపెట్టారు. నేను ఇంకా ఆరాటంగా బాబా కోసం అటూ ఇటూ చూశాను కానీ, స్వామి దర్శనం జరగలేదు.

ఇక మనసులో, 'ఈ విషయంలో నీ అనుమతి లేకుంటే ఏదో ఒకటి చేసి, ఇప్పుడైనా సరే ఈ రిజిస్ట్రేషన్ ఆపేయి బాబా' అని అనుకున్నాను. అలా అనుకుంటూ ఎదురుగా చూస్తుంటే ఒక ఫ్లెక్సీ బోర్డ్ మీద 'సాయి' అనే అక్షరాలు కనిపించాయి. 'ఫోటో రూపంలో కాకుండా టెక్స్ట్ రూపంలో కనిపించావా సాయీ?' అని కొంచెం ఊరటగా ఫీల్ అవుతూ అటువైపే చూస్తుంటే ఆ 'సాయి' అనే అక్షరాలపైన కాలుపై కాలు వేసుకుని రాయిపై కూర్చున్న చిన్న సాయిబాబా ఫోటో దర్శనమిచ్చింది. బాబాను చూడగానే నాకు ఎంత ఉపశమనం కలిగివుంటుందో మీరు ఊహించగలరనుకుంటున్నాను. అప్పుడు పట్టరాని సంతోషంతో, కుదుటపడిన మనసుతో వెళ్లి మిగతా ఫార్మాలిటీస్ పూర్తిచేసి విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. లేదు, బాబా చేయించారు. నేను ఆశపడ్డ గురువారంనాడు, అదికూడా సప్తాహపారాయణ పూర్తైన గురువారం. సాయి కటాక్షం వర్ణించలేము. మనం బాధపడితే ఆయన చూడలేరు. "ధన్యవాదాలు సాయీ. మిగతావాళ్ళందరి రిజిస్ట్రేషన్స్ కూడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా పూర్తిచేయించు స్వామీ. నా మనసులో ఉన్న మరో చికాకును కూడా పూర్తిగా తొలగించి, టెన్షన్ లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్టు, మనసా వాచా కర్మణా ఎవరినీ బాధపెట్టకుండా ఉండేటట్టు, సైట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేటట్టు చూడు సాయీ. నా మనసులో ఉన్న అసలైన కోరిక విషయంలో కూడా నీ అనుగ్రహాన్ని వర్షించి నీకు సంపూర్ణ శరణాగతి పొందేలా చూడు సాయీ".

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

మనసులో అనుకున్నదానికి తక్షణమే బదులిచ్చిన బాబా

నా పేరు శ్రీనివాసరావు. మాది నెల్లూరు. ఇటీవల బాబా సన్నిధిలో నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరి 15, సంక్రాంతి సందర్భంగా మేము, మా శిరిడీసాయి సేవా సమితికి చెందిన 150 మంది సభ్యులు కలిసి శిరిడీ వెళ్ళాం. 18వ తేదీన నేను దర్శనానికి క్యూలైన్లో నిలబడి ఉండగా ఆరతి కోసం క్యూ ఆపేశారు. ఆరతి అయిన తరువాత క్యూలైన్ కదిలినప్పుడు ఒక పదిమంది గ్రూపు వేగంగా నన్ను దాటుకొని ముందుకు వెళ్లిపోయారు. నేను నా మనసులో, "ఏంటి బాబా, నేను లైన్లో క్రమపద్ధతిలో వెళ్తున్నాను. కానీ వీళ్ళు ముందుకు నెట్టుకొని వెళ్లిపోతున్నారు" అని బాధతో అనుకున్నాను. అంతే! వాళ్ళలో ఒకామె తన ముందున్న అతనికి నన్ను చూపిస్తూ, 'ఇతను మన మధ్య దూరుతున్నాడు' అని అంది. అప్పుడతను, "లేదు, అతనిని దాటుకొని మనమే ముందుకొచ్చాము" అని చెప్పి నన్ను ముందుకు పంపించాడు. 'బాబా మన తండ్రి, మన వెన్నంటి ఉంటారు. ఎల్లవేళలా కాపాడతార'ని నాకనిపించింది.


2 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo