సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1467వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయవల్ల ఇబ్బందులు దూరం
2. పుష్కలంగా నీళ్లుపడేలా అనుగ్రహించిన బాబా

బాబా దయవల్ల ఇబ్బందులు దూరం

ముందుగా బ్లాగ్ నిర్వహకులకు, తోటి సాయిభక్తులకు నా నమస్కారములు. నేను సాయిభక్తురాలిని. ఎన్నో సమస్యలలో, బాధలలో, కష్టాలలో బాబా నాకు తోడుగా నిలిచారు. ఆయన ప్రతి విషయంలో నాతోనే వుంటూ నా ప్రతిరోజునూ చక్కగా మలుస్తున్నారు. బాబాని నేను చాలా కోరాను, అవన్నీ ఆయన తీర్చారు. కానీ నేనే నా అనుభవాలను పంచుకోవడం ఆలస్యం చేశాను. అందుకు నన్ను క్షమించమని బాబాను అడుగుతున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. నాకు బస్సు ప్రయాణం అస్సలు పడదు. అలాంటి నాకు ఒకసారి చాలా దూరప్రయాణం చేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో చేసేదేమీలేక ప్రయాణానికి సిద్దమయ్యాను. బస్సు ఎక్కాక బాబాని తలచుకొని, "నాకు వాంతులు కాకుండా క్షేమంగా గమ్యం చేరేలా చూడండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల అక్కడికి వెళ్ళేవరకు నాకు వాంతులు కాలేదు. అక్కడినుండి తిరిగి ఒక్కదాన్నే వస్తున్నందున బస్సులో ఏమైనా సమస్య అవుతుందేమోనని ఏమీ తినకుండా బయలుదేరాలనుకున్నాను. కానీ ఆకలి మొదలయ్యేసరికి, "బాబా! చాలా ఆకలిగా వుంది, తింటాను. నాకు ఏమీ కాకుండా ఇంటికి చేర్చు. మీ అనుగ్రహాన్ని నా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకొని తిన్నాను. కడుపునిండా తినేసి, బస్సులో హాయిగా పడుకున్నాను. బాబా దయవల్ల ఇంటికి వచ్చేవరకు నాకేం సమస్య రాలేదు. మామూలుగా అయితే కొద్దిపాటి దూరప్రయాణానికే నాకు వాంతులు అయిపోతాయి. అలాంటిది కడుపునిండా తిని అంత దూరప్రయాణం చేస్తే, వాంతి వచ్చే ఫీల్ కూడా కలగలేదు. అంతా బాబా వల్లనే. "థాంక్యూ బాబా".

మేము ఒకరికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాము. వాళ్లు ఆ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేటప్పుడు మా బ్యాంక్ అకౌంటులో వేశారు. ఆ డబ్బులు డ్రా చేయడానికని ఏటీఎంకి వెళితే మెషిన్ నుండి డబ్బులు రానప్పటికీ డబ్బులు డ్రా చేసినట్లు మాకు మెసేజ్ వచ్చింది. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుందని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా డబ్బులు రాలేదు. దాంతో చాలా సమయం వేచిచూశాక మళ్ళీ ప్రయత్నించాను. అయితే అప్పుడు కూడా డబ్బులు రాలేదు. అప్పుడు నేను బాబాకి చెప్పుకొని మరోసారి ప్రయత్నించాను. బాబా దయవల్ల డబ్బులు వచ్చాయి. "ధన్యవాదాలు సాయీ".

మా కులంవాళ్ళకి ప్రభుత్వం ద్వారా 10,000 రూపాయలు వస్తాయి. ఈమధ్య ఆ డబ్బులు మా అకౌంట్లో పడినట్లు మాకు మెసేజ్ వచ్చింది. కానీ బ్యాంకుకి వెళ్లి అడిగితే, ‘అకౌంటులో డబ్బులు లేవ’న్నారు. అసలు ఆ డబ్బులు ఎందులో పడ్డాయో చెక్ చేయమంటే, వేరే అకౌంటులో పడ్డాయని తెలిసింది. “అది మా అకౌంటు కాదు, అందులో ఎందుకు పడతాయి?” అని అడిగాక, 'ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు జీరో అకౌంట్ చేసేవాళ్ళు వస్తే మా నాన్నగారు ఆ అకౌంటు చేయించుకున్నార'ని తెలిసింది. అయితే ఆ అకౌంటుకి సంబధించిన పాస్‌బుక్ మా దగ్గర లేదు. ఏటీఎం ఉన్నప్పటికీ డబ్బులు వస్తాయో, లేదో చెప్పలేమన్నారు. అప్పుడు నేను సమస్యను బాబాకి చెప్పుకుంటే కొంచెం ఆలస్యమైనా మా డబ్బులు మాకు వచ్చాయి. ఇదంతా సాయితండ్రి కృపవల్లే జరిగింది. "థాంక్యూ బాబా".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

పుష్కలంగా నీళ్లుపడేలా అనుగ్రహించిన బాబా
 
సాయి మహరాజ్‌కు ప్రణామాలు. సాయిబంధువులకు నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు మహేష్. నేను ఈ బ్లాగుకు సుపరిచితుడనే. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2023, ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన మరో అనుభవాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన బాబాకి వేలవేల నమస్కారాలు తెలుపుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఒక సంవత్సరం క్రితం కొంత వ్యవసాయ భూమిని కొన్నాను. అప్పటినుండి అందులో ఏదైనా ఫామ్‌హౌస్ లాంటిది నిర్మించాలని అనుకున్నాను. కానీ, ఇప్పటివరకు అది కుదరలేదు. చివరికి ఈ సంవత్సరం నేను అనుకున్నట్లు చేయాలని ముందుగా ఆ భూమి అంతా శుభ్రం చేయించాను. తదుపరి బోర్ వేయాలనుకుంటే, 'ఇక్కడ నీరు పడదు' అన్న అనుమానాన్ని కొందరు నాలో కలిగించారు. అయినా నేను బాబాపై నమ్మకంతో, నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పే నిపుణుడు చూపించిన చోట 2023, ఫిబ్రవరి 2, గురువారంనాడు బోర్ వేసే పని మొదలుపెట్టించాను. 60 అడుగుల లోతు వెళ్లేసరికి బండరాయి అడ్డం వచ్చింది. నేను మనసులో బాబాని వేడుకుంటూ పైకి(ఆకాశం వైపు) చూశాను. అప్పుడు చంద్రుడిలో బాబా ముఖం నవ్వుతూ నాకు దర్శనమిచ్చింది. బాబాను చూడగానే ధైర్యంగా పని కొనసాగించమన్నాను. 75 అడుగుల లోతు వెళ్లేసరికి నీళ్లు రావడం మొదలైంది. మొత్తం 330 అడుగుల వరకు బోరు వేయించాము. బాబా దయవల్ల నీరు పుష్కలంగా వచ్చింది. ఆ నీటిని చూసి నాకు చాలా సంతోషమేసింది. 'ఎవరు ఎన్ని మాటలన్నా మనం నమ్ముకున్న బాబా ఉండగా మనకు భయం ఎందుకు? అంతా బాబా చూసుకుంటారు' అని నాకు అర్థమైంది. "సాయీ! మీకు ధన్యవాదాలు. సదా నా వెన్నంటే ఉండి ఫామ్ డెవలప్ చేయడంలో నన్ను ముందుకు నడిపించండి సాయీ".
 
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

2 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo