సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాధాకృష్ణమాయి - మొదటి భాగం...



ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో కాలానుగుణంగా ఎందరో మహాత్ములు ఉద్భవించారు, సద్గురువులుగా కొలవబడ్డారు. వారిలో కొంతమంది ఆయాకాలాలకే పరిమితమైతే, మరికొంతమంది ప్రభావం ఈనాటికీ ఉన్నది. అయితే, శ్రీసాయిబాబాకు దక్కిన కీర్తి, వైభవం ఏ మహాత్మునికీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాలలో సాయిబాబా మందిరాలు ఎన్నో వెలిశాయి, వెలుస్తున్నాయి. ఆయా మందిరాలలో బాబాకు ఆరతులు, పల్లకీ ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. హంగు, ఆర్భాటాలు, సరికొత్త అలంకారాలతో బాబా పూజింపబడుతున్నారు. ఈ వైభవానికి మూలకారణం బాబా మహిమే అయినప్పటికీ అందుకు ఎంతగానో కృషి చేసిన పరమ భక్తురాలు రాధాకృష్ణమాయి. తన సద్గురువైన శ్రీసాయిబాబా 'మహారాజు'లా కొలవబడాలని ఆమె కలలుగన్నది. అందుకోసం అహోరాత్రులు శ్రమపడింది. శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ శ్రీసాయిసచ్చరిత్రకు వ్రాసిన ఉపోద్ఘాతంలో...

".. తొందరలోనే శిరిడీ ఒక సంస్థాన్‌గా రూపుదిద్దుకుంది. అన్నిరకాల రాజలాంఛనాలు, ఆడంబరాలతో ఉత్సవంలా సాయిమహరాజ్‌కు ఆరతి ఇవ్వడం ప్రారంభమైంది. బాబా చావడికి వెళ్ళేటప్పుడు సంగీత వాయిద్యాల ఘోష, గుర్రం, పల్లకీ, పతాకాలు వంటి అన్ని హంగులు, ప్రత్యేక దుస్తులు ధరించి ముందు నడిచే దండధారులు, భజన బృందాలు వారిని అనుసరించడం మొదలవడంతో అది ఒక ఉత్సవంలా రూపుదిద్దుకుంది. చావడిని అద్దాలు మొదలైనవాటితో అలంకరించేవారు. మశీదు, చావడిలను రాతిపలకలతో చదును చేశారు. వీటన్నింటికీ కారకురాలు కీ.శే.సుందరీబాయి క్షీరసాగర్(రాధాకృష్ణమాయి). ఈమె ప్రేమభక్తికి ఆచార్యురాలు. ఈ ప్రేమమయి, భక్తిలో నిష్ణాతురాలు. ఈమె వద్ద ధనం లేదు, కానీ తన తనువు మనసులను సాయిమహరాజుకు సమర్పించింది. సాయిభక్తుల చేత అనేక రకాల వస్తువులు తెప్పించి శిరిడీ సంస్థాన్‌ను గొప్పగా, అందంగా మలిచింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె త్వరగానే, అంటే తన 35వ సంవత్సరాల వయస్సులోనే కన్నుమూసింది. ఆమె ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు మాత్రమే శిరిడీలో ఉంది. అయినప్పటికీ ఆ తక్కువ వ్యవధిలోనే ఆమె సాధించినదాన్ని, చేసినదాన్ని ఇతరులు 25 ఏళ్ళలో కూడా చేయలేరు. ఈమె కృషి వలననే సాయిమహరాజుకు చావడిలో రాత్రిపూట శేజారతి, తెల్లవారుఝామున కాకడఆరతి ప్రారంభమయ్యాయి. రాధాకృష్ణమాయి తాను శ్రద్ధగా భక్తి ప్రేమలతో సేవ చేయడమేగాక ఇతర సాయిభక్తులతో కూడా సేవ చేయించేది. రాళ్ళు మోయడం, నేలను ఊడవటం, నేలను త్రవ్వి నడకమార్గంలో ఉన్న గుంటలను పూడ్చటం, మొక్కలు నాటడం, (ధునికోసం) కట్టెలు కొట్టడం, మశీదు శుభ్రపరచడం, ముగ్గులు పెట్టడం, పాత్రలను శుభ్రపరచడం, కాగితపు పువ్వులు తయారుచేయడం, వింజామరలను, పతాకాలను కుట్టటం మొదలగు అన్నిరకాల పనులు చేయడానికి ఎంతోమంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు. పెద్దింటి కులస్త్రీలు కూడా సంతోషంగా ఆ పనులలో పాలుపంచుకొనేవారు. వారంతా అది తమ అదృష్టంగా భావించేవారు” అని రాధాకృష్ణమాయికి నివాళులర్పించిన తీరు శిరిడీ రూపురేఖలు మార్చడంలో ఆమె పాత్రను స్పష్టంగా తెలియపరుస్తుంది. దీక్షిత్ వివరించినట్లు, ఆమె ‘ప్రేమభక్తికి ఆచార్యురాలు'. అంతేకాదు, ఆమెను ‘భక్తికి సజీవరూపం’ అని చెప్పవచ్చు. ఆ పరమ భక్తురాలికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం.

రాధాకృష్ణమాయి అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఆమె 1882లో జన్మించింది. ఆమె తల్లి పేరు శకుంతలాబాయి క్షీరసాగర్. ఆమె తండ్రి గురించిన వివరాలు తెలియలేదు. ఆమె తాత అహ్మద్‌నగర్‌లో పేరుమోసిన న్యాయవాది. సుందరీబాయి విద్యాభ్యాసం అహ్మద్‌నగర్‌లోనే జరిగింది. సంస్కృతం మరియు సంగీతంలో ఆమె మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఆ ప్రావీణ్యం ఆ తరువాతి కాలంలో ఆమె చేపట్టిన బ్రహ్మచర్య దీక్షకు, ఆమె జ్ఞానానికి ఎంతో తోడ్పడింది. 1899లో ఆమెకు 17 సంవత్సరాల వయసొచ్చాక పెద్దలు థానే జిల్లాలోని పేరుప్రఖ్యాతులున్న దహితాన్కర్ కుటుంబంలోని అబ్బాయితో వివాహం జరిపించారు. సాంప్రదాయం ప్రకారం వివాహమైన మరుసటిరోజు ఆమెను పుట్టింటికి తీసుకొచ్చారు. విధివశాత్తూ ఆమె తిరిగి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి ముందు ఎనిమిదవ రోజున ఆమె భర్త మరణించాడు. దాంతో క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి ముందే అంతా ముగిసిపోయి సుందరీబాయి ఒంటరిగా మిగిలిపోయింది. భర్త హఠాన్మరణంతో మానసికంగా ఆమె ఎంతగానో కృంగిపోయింది. తుకారామ్ అభంగాలు, జ్ఞానేశ్వరి పట్ల ఉన్న ఆసక్తి కూడా భర్త మరణం వలన కలిగిన దుఃఖం నుండి ఆమెను బయటకు తీసుకురావడంలో సహాయపడలేదు. కాలం ఆమె మనసుకైన గాయాన్ని నయంచేయడానికి బదులు ఆమె మనసును మరింతగా కృంగదీసింది. అటువంటి పరిస్థితుల్లో మార్పుకోసం ఆమెను తన మేనమామ విశ్వనాథ్ దేశ్‌పాండే ఇంటికి పంపాలని బంధువులు నిర్ణయించి సుందరీబాయిని అక్కడికి పంపారు. అక్కడికి వెళ్ళిన తరువాత నెమ్మదిగా ఆమె మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఆమె రోజంతా ఒక గదిలో ఏకాంతవాసం చేస్తూ జ్ఞానేశ్వరి తదితర మతగ్రంథాల అధ్యయనం చేస్తుండేది. తుకారాం అభంగాలను కంఠోపాఠం చేసి, పరిస్థితి ఏదైనా ఆ సందర్భానికి అన్వయించుకొని అప్పటికప్పుడే భజన గీతాలను స్వరపరుచుకొని పాడటం ప్రారంభించేది. పలు సందర్భాలలో ఆమె సితార్ వాయిస్తూ భజన గీతాలు ఆలపించడంలో లీనమైపోయేది. అయితే ఆ తన్మయత్వంలో కూడా ఆమె నియంత్రణను కోల్పోయి అప్పుడప్పుడు, "ఇంత తొందరగా నన్ను ఒంటరిదాన్ని చేసేటట్లయితే, మీరు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారు? ఇక నేను వేరెవ్వరినీ వివాహం చేసుకోను" అని అరవసాగేది. ఆ విధంగా మూడేళ్లు గడిచాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో జీవితాన్ని పూర్తిగా మలుపు త్రిప్పి జీవితానికి అర్థాన్ని చేకూర్చే క్షణం ఒకటి వస్తుంది. ఆ క్షణం ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తుంది. సుందరీబాయి విషయంలో కూడా అదే జరిగింది. 1902వ సంవత్సరంలో ఒకరోజు రాత్రి ఆమెకు ఒక దివ్యదర్శనమైంది. ఆ వివరాలను ఆమె స్వయంగా శరణానంద అనే భక్తునితో చెప్పగా, అతను తన అనుభవాలలో ఈ విధంగా వ్రాసుకున్నాడు: "ఒకరాత్రి నాకు స్వప్నంలో ఏదో కనిపించి నాలో వైరాగ్యం మేలుకొంది. నిద్రలేస్తూనే ఒంటిమీద ఉన్న ఆభరణాలు తీసి దూరంగా విసిరేశాను. అలాగే ఇల్లొదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అందరూ వద్దని నాకు ఎంతగానో నచ్చజెప్పినా నేను నా నిర్ణయం మీదనే దృఢంగా ఉన్నాను. కట్టుబట్టలతో నేను ఇల్లు వదిలి బయటకొచ్చాను. అయాచితవ్రతాన్ని (ఎవరినీ ఏమీ అడగకుండటం, ధనాన్ని తాకకపోవడం, దేన్నీ సమకూర్చుకోకపోవడం, నిల్వ చేసుకోకపోవడం) పాటిస్తూ ‘చార్‌ ధామ్’ యాత్రను చేశాను. కొన్ని సమయాల్లో తినటానికేమీ లభించకపోతే పేడను తిని నా మనసును తృప్తిపరచేదాన్ని. డబ్బును ముట్టేదాన్ని కాదు. ఎవరైనా దానం చేయబోతే ఆ వ్యక్తితో కేవలం నా ప్రయాణానికి అవసరమైన టికెట్టు కొనివ్వమనేదాన్ని".

సుందరీబాయి, 'తనకు స్వప్నంలో ఏదో కనిపించి తనలో వైరాగ్యం మేలుకొంది' అని చాలా సాదాసీదాగా చెప్పినప్పటికీ ఆ దర్శనంతో ఆమెను అంత తీవ్రమైన వైరాగ్యం ఆవరించిందంటే అది ఎంతటి గొప్ప దివ్యదర్శనమై ఉంటుందో! ఎందుకంటే, ఎవరు ఎంతగా వారించినా లక్ష్యపెట్టక తన నిర్ణయానికి కట్టుబడి కట్టుబట్టలతో ఇల్లు విడిచిపెట్టడం కేవలం ఒక సాధారణ స్వప్నదర్శనంతో సాధ్యమయ్యే పని కాదు. ఇకపోతే, ఎప్పటికీ తిరిగి రాకూడదనే ఉద్దేశ్యంతో ఇంటిని విడిచిపెట్టిన సుందరీబాయి దృఢచిత్తంతో హిమాలయాల వైపుగా ప్రయాణం సాగించింది. ఆమె ఆహారం గురించి పట్టించుకోక ఏదైనా ఆహారం లభిస్తే తినడం, ఏమీ దొరకకుంటే మట్టి, ఆకులు, జంతువుల పేడ తింటూ, ఎవరైనా టికెట్ కొనిస్తే రైలులో ప్రయాణించడం, లేకుంటే కాలినడకన గ్రామాలు, పంటపొలాలు, అడవులు, కొండలు, లోయలు, నదులు దాటుకుంటూ ఏవి అడ్డువచ్చినా లెక్కచేయక ముందుకు సాగిపోయేది. అలా ఐదేళ్లపాటు సాగిన ప్రయాణంలో ఆమె ‘చార్‌ ధామ్’ మొదలుకొని అనేక తీర్థక్షేత్రాలను దర్శించి, వందలాదిమంది సాధుసత్పురుషులను దర్శించింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానం, ధ్యానపద్ధతి నేర్చింది. ఎన్నో సిద్ధులను సంపాదించింది.

తరువాత సుందరీబాయి తన జీవితాన్ని తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని సేవలో గడపాలని భావించి తిరిగి పండరీపురం చేరుకొని అక్కడ వకీలుగా పనిచేస్తున్న తన మామగారింట్లో ఉండసాగింది. ధార్మిక గ్రంథాలను చదువుతూ తన సమయాన్నంతా భజన, పూజల కోసం వినియోగిస్తుండేది. మధ్యాహ్నవేళ జనసంచారం తక్కువగా ఉన్నప్పుడు దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్తుండేది. ఆ విధంగా, శ్రీసాయిబాబా గురించి వినేంతవరకు ఆమె పండరీపురంలో పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపింది. ఒక శుభసమయాన శ్రీనానాసాహెబ్ చందోర్కర్‌ ద్వారా ఆమె మొట్టమొదటిసారి శ్రీసాయిబాబా గురించి విన్నది. "బాబా పేరు విని ఆయనపట్ల భక్తిని పెంచుకోవటం ప్రారంభించాను. ఆ రోజుల్లో నేను అన్నం ఎక్కువగా తినేదాన్ని. కడుపు బాగా నిండిపోయి నొప్పి పుట్టినప్పుడు, 'సాయిబాబా, సాయిబాబా' అంటూ అరచి నేలపై పడుకునేదాన్ని" అని ఆమె స్వయంగా శరణానందతో చెప్పింది. కొంతకాలానికి ఆమె 25 సంవత్సరాల వయస్సులో 1907వ సంవత్సరంలో మొట్టమొదటిసారి శిరిడీ చేరి బాబా పాదాలను ఆశ్రయించింది.

source: శ్రీ సాయి సచ్చరిత్ర, దేవుడున్నాడు లేదంటావేం?

 



 

 


తరువాయి భాగం
కోసం
బాబా పాదాలు
తాకండి.

8 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🙏🕉😊

    ReplyDelete
  3. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  4. JAI SAIRAM
    THANK YOU VERY MUCH , I HAVE BEEN WAITING TO HEAR HER STRORY....

    ReplyDelete
  5. ❤🌺🙌🙏🌺💕🙏🙏🙏

    ReplyDelete
  6. Om sai ram baba kapadu thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo