సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 846వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు

1. వెన్నంటే ఉండి రక్షణనిస్తారు బాబా
2. చావు దరి చేరకుండా కాపలా ఉండి కాపాడిన బాబా
3. పెద్ద నష్టం రాకుండా కాపాడిన బాబా

వెన్నంటే ఉండి రక్షణనిస్తారు బాబా


నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో  పంచుకుంటున్నాను. ముందుగా సాయిభక్తులకు తమ అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన బ్లాగువారికి నా కృతజ్ఞతలు. సాయిభక్తులందరికీ నా వినయపూర్వకమైన ప్రణామాలు. 2021, జూన్ 16న 80 సంవత్సరాల వయస్సున్న మా అమ్మ తన కడుపు ప్రాంతంలో నొప్పిగా ఉందని చెప్పింది. నిజానికి వారం రోజులుగా ఆమెకి ఆ నొప్పి ఉంది. కోవిడ్ సమయంలో ఇలాంటి సమస్యలు మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. హాస్పిటల్‌కి వెళ్ళడమంటే రిస్క్ తీసుకోవడమే. అందువలన నేను, "బాబా! వీలైనంత తొందరగా అమ్మకున్న నొప్పిని తగ్గించండి. నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మన సర్వశక్తిమంతుడైన సాయిని ప్రార్థించాను. తరువాత అమ్మ బాబాను ప్రార్థించి బాబా ఊదీని పెట్టుకుంది. మరుసటిరోజు అమ్మ నాతో, "మెల్లగా నొప్పి తగ్గుతోంది" అని  చెప్పింది. అది విన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".


మరో అనుభవం: ఐదేళ్ల క్రితం మా అబ్బాయికి తీవ్రమైన వెన్నునొప్పి వచ్చి, శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల ఒకరోజు మా అబ్బాయి 'తనకు వెన్నునొప్పిగా ఉంద'ని చెప్పాడు. కిడ్నీ ఉండే ప్రాంతంలో కొద్దిగా వాపు కూడా వచ్చింది. దాంతో మేము కలత చెంది, "బాబా! ఎలాంటి సమస్యలు లేకుండా అబ్బాయికి వచ్చిన సమస్య నుండి తనకు ఉపశమనం ప్రసాదించండి. ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని ప్రార్థించాము. తరువాత తనకి నొప్పి ఉన్న చోట బాబా ఊదీని రాశాము. బాబా దయవలన రెండు రోజుల్లో మా అబ్బాయి ఆ నొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందాడు. మనకు ఏ సమస్య వచ్చినా బాబా మన వెన్నంటే ఉండి రక్షణనిస్తారు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ప్రణామాలు సాయీ". బాబాకు మాటిచ్చినట్లు మీ అందరితో నా అనుభవాలను పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


చావు దరి చేరకుండా కాపలా ఉండి కాపాడిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 


నేనొక సాయిభక్తురాలిని. ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవడం ఇదే మొదటిసారి. నాకు 2021, ఏప్రిల్ నెలలో కడుపులో చాలా తీవ్రంగా నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ నన్ను పరీక్షించి, ‘చిన్న సర్జరీ చేయాల’ని చెప్పారు. అది విని నాకు చాలా భయమేసి మనసులోనే బాబాతో, “బాబా, ఏమిటిది? సర్జరీ చేయాలంటున్నారు. నా పరిస్థితి మీకు తెలుసు కదా బాబా. నాకు మీరు తప్ప ఎవరూ లేరు, మీరే చూసుకోండి” అని చెప్పుకున్నాను. సర్జరీకి ఒక వారం రోజులు టైం ఇచ్చారు. హాస్పిటల్ నుండి బయటికి రాగానే బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. బాబాను చూడగానే ధైర్యంగా అనిపించి, ‘బాబా దయతో నాకు ఏమీ కాదు, అంతా బాబానే చూసుకుంటారు’ అనుకున్నాను. తరువాత ఒక వారం రోజుల్లోపల మళ్ళీ తీవ్రంగా కడుపునొప్పి వచ్చేసరికి హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ నన్ను అడ్మిట్ చేసుకుని, ‘రేపు సర్జరీ చేస్తాము’ అని చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్ నన్ను ఐసియులో ఉంచి అన్ని పరీక్షలూ చేశారు. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా వచ్చాయి. దానితో డాక్టర్ మావాళ్ళను పిలిచి, “ఈ అమ్మాయి బ్రతకడం కష్టం, తనను హైదరాబాద్ తీసుకెళ్ళండి” అని చెప్పేసరికి, అర్థరాత్రి ఒంటిగంట సమయంలో నాకు ఆక్సిజన్ అమర్చి అంబులెన్సులో హైదరాబాద్ తీసుకొచ్చారు. ‘బాబా, మీరే చూసుకోండి’ అని ప్రార్థించడం తప్ప నేనేమీ చేసే పరిస్థితిలో లేను. అలా అని కడుపునొప్పి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం తప్ప వేరే సమస్యలేమీ నాకు లేవు. “బాబా, నాకేమైనా అయితే నా బిడ్డను మీ బిడ్డలాగా చూసుకోండి” అని బాబాను వేడుకున్నాను. హైదరాబాదులో ఒక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ డాక్టర్లు నన్ను పరీక్షించి, ‘ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయ’ని చాలా టెన్షన్‌తో నన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. అంతకుముందు ఒకరోజు ఉదయం నాకు వచ్చిన బాబా మెసేజ్‌లో, “నీవు మరణం అంచుల వరకు వెళ్తావు, కానీ నేను ఉన్నాను” అని బాబా సూచించారు. బాబా చెప్పినట్లే ఇక్కడ కూడా డాక్టర్లు, ‘రేపు ఉదయం వరకు బ్రతకడం కష్టం’ అని చెప్పారు. అయితే, బాబా దయవల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఒక వారం రోజుల ట్రీట్‌మెంట్‌ తరువాత నేను కోలుకున్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరోజు బాబా నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. అది: “నీ చావు నీ దగ్గరికి రాకుండా ద్వారంలోనే కాపలాగా ఉన్నాను” అని. నేను కోలుకున్న తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ గేటులో బాబా ఆశీర్వదించినట్టుగా దర్శనమిచ్చారు. బాబాను చూడగానే, “బాబా, ఇంకా మీరు నాకోసం ఇక్కడే ఉన్నారా?” అనుకున్నాను. “బాబా! నాకు మీ ప్రేమ, సహాయం, ఆశీస్సులు కావాలి. ఏమైనా తప్పులుంటే మీరే సరిచేయండి బాబా. మీ ఆశీస్సులతో మీ (మా) కూతురికి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగంలో తనకు సహాయం చేయండి. బాబా, మా పరిస్థితి ఏమిటో మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నా మనసులో బాధ కూడా మీకే తెలుసు. నా మనసులో ఉన్నది నెరవేరితే మళ్ళీ మీ భక్తులకు తెలియజేస్తాను. బాబా, మీ ఆశీర్వాదాలు కావాలి”.


పెద్ద నష్టం రాకుండా కాపాడిన బాబా


అందరికీ నమస్తే. నేను సాయిభక్తుడిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మాకు తెనాలిలో ఒక సొంతిల్లు ఉంది. దాన్ని మేము 2010లో కొన్నాము. ఉద్యోగరీత్యా మేము వేరే ఊరిలో ఉండవలసిన పరిస్థితి అయినందువల్ల ఆ ఇంట్లో ఉండటానికి మాకు అసలు కుదరలేదు. అందువలన ఆ ఇల్లు కొన్న దగ్గరనుండి దాన్ని అద్దెకు ఇస్తూ వచ్చాము. అప్పుడప్పుడు ఆ ఇంటికి మరమత్తులు చేయాల్సి రావడం, చేయిస్తూ ఉండటం జరుగుతూ ఉండేది. ఇటీవల దాని లైఫ్ టైం తగ్గుతోందని భావించి, అమ్మడానికి నిర్ణయించుకుని, ఇంటిని బేరానికి పెట్టి, మధ్యవర్తులకు చెప్పాము. ఆ మధ్యవర్తులు మా ఇంటి ప్రక్కనున్న వాళ్లతో కుమ్మక్కై, తక్కువ ధరకు వాళ్ళకు ఇప్పించాలని వచ్చిన బేరాలను చెడగొడుతూ ఉండేవారు. అలా సుమారు మూడు, నాలుగు నెలలు బేరాలు రాకుండా చేశారు. విషయం తెలిశాక నాకు చాలా బాధేసి, "మిమ్మల్ని నమ్మితే ఇలా చేస్తారా?" అని వాళ్ళను అడిగాను. తరువాత నేను నమ్మిన నా తండ్రి, నన్ను ఎప్పటికీ రక్షించే నా ఆపద్బాంధవుడు అయిన సాయినాథ్ మహరాజ్‌కి దణ్ణం పెట్టుకుని, "నా ఇల్లు బేరం కుదిరేలా సహాయం చేయండి" అని ప్రార్థించాను. సాయి నా మొర ఆలకించి, గతంలో వచ్చినవాళ్లే మా ఇల్లు కొనేటట్లు అనుగ్రహించారు. అయితే వారితో వ్రాసుకున్న కాంట్రాక్టులో, వాళ్లపై ఉన్న భరోసాతో తెలిసి కూడా అగ్రిమెంట్ మీద సంతకం చేసి నేను ఒక పెద్ద తప్పు చేశాను. దానివలన నాకు దాదాపు 10,00,000/- రూపాయల నష్టం (పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాను) వచ్చే పెద్ద ప్రమాదం ఏర్పడింది. నేను చేసిన ఆ పొరపాటు వలన నాకు భారీ నష్టం వస్తుందన్న ఆలోచనతో మనస్సు నిలకడగా ఉండేది కాదు, రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. అప్పుడే నేను నమ్మిన నా తండ్రి, నా ఉన్నతస్థితికి కారణమైన నా పెద్దాయన సాయితండ్రిని నమస్కరించుకుని, "కాంట్రాక్టులో నేను చేసిన తప్పుకు నష్టం రాకుండా చేయి తండ్రీ" అని ప్రార్థించసాగాను. "నీకు నేను ఉన్నాను. నీ పనిని నేను నెరవేరుస్తా" అని ఈ బ్లాగులోని సందేశాల ద్వారా బాబా నాకు అభయం ఇస్తుండేవారు. చెప్పినట్లుగానే, 2021, జూన్ 19, శనివారం నేను అమ్మిన ఇంటికి సంబంధించిన సొమ్ము అంతా నాకు అందేటట్లు చేశారు బాబా. ఇది పూర్తిగా నా సాయితండ్రి దయే. ఎందుకంటే, నేను చేసిన కాంట్రాక్టు ప్రకారం కొన్నవారు ఏదైనా చేయడానికి పూర్తి అవకాశం ఉంది. కానీ నా సాయితండ్రి నా మొరను ఆలకించి నాకు ఎటువంటి నష్టం లేకుండా నన్ను కాపాడి పెద్ద అద్భుతం చూపించారు. "సాయిదేవా! చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే నీ చల్లని చూపు నాపై, నా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండేటట్లు, నా పిల్లల భవిష్యత్తు బాగుండేటట్లు, వారు బాగా చదివేటట్లు, ఇద్దరూ PG కంప్లీట్ చేసేటట్లు, వారికి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా మంచిగా ఉంటూ పదిమందికి సహాయకారులుగా ఉండేటట్లు, మా అందరి ఆరోగ్యం బాగుండేటట్లు కరుణ చూపు తండ్రీ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!


8 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  5. Baba amma nail infection taggipovali thandri

    ReplyDelete
  6. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  7. 🌷🙏🙏🙏OMSRISAIRAM 🙏🙏🌷

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo