సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 848వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ‘సాయిభక్తుడు’
2. పరీక్షలు విజయవంతంగా వ్రాయించిన బాబా
3. బాబా ఊదీ మహిమ

‘సాయిభక్తుడు’


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ ద్వారా పాఠకులలో బాబాపట్ల భక్తివిశ్వాసాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఈ బ్లాగును ప్రారంభించి చక్కగా నిర్వహిస్తున్నవారు బాగుండాలనీ, వారికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో ఒక అనుభవాన్ని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేనొక బాబా భక్తుడిని. మొదట్లో నాకు బాబా గురించి ఏమీ తెలియదు. నా క్లోజ్‌ఫ్రెండ్, నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రక్కప్రక్కనే కూర్చుని చదువుకున్నాం. తన కుటుంబంలోని వారంతా బాబాను ఆరాధిస్తారు. ప్రతి గురువారంనాడు సాయంకాలం తనకు తోడుగా బాబా గుడికి రమ్మని తను నన్ను పిలిచేవాడు. నేను తనతో వెళ్లేవాణ్ణి. గురువారం కావటంవల్ల భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉండేది. మేము మోకాళ్ల మీద కూర్చుని బాబా పాదుకలకు మ్రొక్కేవాళ్ళం. కనీసం 100 సార్లయినా బాబా పాదాలను పట్టుకొని వుంటాను. కానీ అప్పుడు కూడా నాకు బాబా గురించి ఏమీ తెలియదు. స్నేహితునితో కలిసి ఏదో సరదాగా గుడికి వెళ్ళి వస్తున్నాను, అంతే. ఒక గురువారంనాడు బాబా గుడికి వెళదామని నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. తను రెడీ అవుతుండగా వాళ్ళ అత్త నన్నడిగింది, “ఎక్కడికి వెళుతున్నావయ్యా?” అని. “సాయిబాబా గుడికి” అని చెప్పాను. ఆవిడ వెంటనే, “వెళ్లు, బాబా నీకు మంచి, చెడు చెప్తారు, నీ మనసు బాగా అర్థం చేసుకుంటారు” అన్నది. నాకప్పుడు 16, 17 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ మాటలు విని, ‘గుడిలో ఉండే బొమ్మ మంచి, చెడు చెబుతుందా?’ అని మనసులోనే నవ్వుకున్నాను. కానీ ఆవిడ దగ్గర ఏం మాట్లాడకుండా, సరేనని తలాడించి స్నేహితునితో కలిసి గుడికి వెళ్ళాను. అలా చాలా గురువారాలు మేమిద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాము. ఆ తరువాత కొంతకాలానికి ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా నా స్నేహితుడు చెన్నైకి వెళ్ళాడు. నేను లోకల్‌గా ఒక కంపెనీలో ఉద్యోగంలో సెటిలయ్యాను. తరువాత వివాహం చేసుకున్నాను. బాబాను పూర్తిగా మరచిపోయాను.


అసలు కథ అప్పుడే మొదలైంది. నాకు ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడల్లా బాబా నుంచి సందేశం రావడం స్పష్టంగా గమనించాను. అది మెసేజ్ రూపంలో గానీ, పుస్తకం ద్వారా గానీ, ఎలా అయినా కావచ్చు, మన సమస్యకు సరైన సందేశమిస్తారు బాబా. నేను పనిచేస్తున్న కంపెనీలో 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న తరువాత ఒక సమస్య వలన తీవ్రమైన వేదన అనుభవించాను. ఆ వేదన నుండి బయటపడగలిగేవాణ్ణి కాదు. ఉద్యోగం మానుకోవాలని కూడా అనుకునేవాణ్ణి. అలాంటి సమయంలోనే ఒక స్నేహితుడు మాటల సందర్భంలో నాతో, ‘నీకు ఒక మూవీ యాప్ పంపిస్తాను’ అన్నాడు. ‘సరే, పంపమ’న్నాను.  ఇంటికి వెళ్లిన తరువాత స్నానం చేసి ఆ యాప్ ఓపెన్ చేశాను. ఆశ్చర్యంగా, ‘శ్రీసాయిసచ్చరిత్ర’ వచ్చింది. చదివాను. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు సరియైన సమాధానం అందులో దొరికింది. ‘ఇలాంటి పుస్తకం ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవలేదు?’ అనుకున్నాను. బాబా అనుగ్రహంతో నా సమస్య నుంచి నిలదొక్కుకున్నాను. తరువాత ఆ యాప్ పంపిన స్నేహితుడితో, “నువ్వు పంపిన పుస్తకం చాలా బాగుంది” అని చెబితే, “ఆ పుస్తకం నేను చూడలేదు” అన్నాడు. “సరేలే, ఏదయినా కానీ మంచి మాత్రమే జరిగింది” అనుకున్నాను. 


నా జీవితంలో ఏవైనా మంచిపనులు గానీ, సమస్యలకు పరిష్కారాలు గానీ గురువారంనాడే జరగడం గమనించాను. నాకు కొడుకు పుట్టింది కూడా గురువారంనాడే. బాబుకి ‘సాయి’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను బాబాను చూడనిరోజు లేదు, బాబాను తలవనిరోజు కూడా లేదు


ఈమధ్యకాలంలో నేను ఇంటినిర్మాణం మొదలుపెట్టాను. అందుకోసం పి.యఫ్ లోన్‌కి అప్లై చేశాను. సిస్టమ్‌లో జాయినింగ్ డేట్ లింక్ అవలేదు. ఇప్పుడు లింక్ చేసుకుందామనుకుంటే, “అందుకు టైం పడుతుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల స్టాఫ్ సగంమందే ఉన్నారు, పనిపూర్తవడానికి లేటవుతుంది” అన్నారు సంబంధిత అధికారులు. దాంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, నాకు డబ్బు చాలా అవసరం. పాత ఇంటిని చదరం చేసి ఫ్యామిలీ మొత్తం బాడుగ ఇంటికి మారాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా పి.యఫ్ రాకపోతే నాకు ఎంత భయమేస్తుందో కదా. చాలా బాధపడేవాణ్ణి. “పిలిస్తే పలుకుతానంటావు. ఇప్పుడు ఎందుకు పలకవు? ఏమీ తెలియనప్పుడు కొంచెం కొంచెంగా నీ మార్గంలోకి లాక్కున్నావు. మరి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నావు? నువ్వు చెప్పే పద్ధతులు ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నాను కదా, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?” అని బాబాను నిందించేవాణ్ణి. కళ్లలో నీళ్లు తిరిగేవి, కానీ ఏడ్చేవాణ్ణి కాదు. ఒక వారంరోజులపాటు బాబాను ఎంతో గాఢంగా ప్రార్థించాను. “ఆధ్యాత్మికతను బలంగా నమ్మాను, నా నమ్మకాన్ని వమ్ముచేయకు బాబా. నాకున్న ఒకే వ్యసనం ఖైనీ (తంబాకు). దాన్ని కూడా నీకు దక్షిణగా సమర్పించుకుంటాను (వదులుకుంటాను)” అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం అయింది


గురువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. గురువుకు కేవలం నమస్కారం చేస్తే సరిపోదు. మనం ఆయన అడుగుజాడలను అనుసరించాలి. సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ, ఏదయినా తేడా వస్తే, “నేనేం చేయగలను? ఏదో చెప్పాను, అంతే!” అనేస్తారు. మనిషికి సాటిమనిషి సహాయం చేయగలడు, కానీ అది కొంతవరకే. ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో కచ్చితంగా మనకు సహాయపడగలవారు గురువు మాత్రమే! స్వార్థం నిండిన ప్రస్తుత పరిస్థితుల్లో దైవాన్ని నమ్మడం అత్యావశ్యకం. 


నేను ఇదివరకటిలా లేను, చాలా మారాను. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిరోజూ పూజ చేయనిదే ఏమీ తినటం లేదు. “తినేముందు అన్నం సమృద్ధిగా బయట విడచిరా!” అని బాబా చెప్పినట్లుగా, తినేముందు కొంత అన్నం బయట విడిచిపెట్టి తరువాత తింటున్నాను. స్వార్థం, అసూయ పూర్తిగా వదిలేశాను. ‘ఇవ్వడంలో ఆనందం ఉంద’నే బాబా వాక్కును బలంగా నమ్ముతున్నాను. నేను ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నానంటే అది బాబా గురించి అందరికీ తెలియజేయడానికే. బాబా లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికానో తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం బాబా లేకుండా ఒక్కరోజు కాదుకదా, ఒక్కక్షణం కూడా బ్రతకలేను. బాబా కళ్లల్లోకి చూస్తూ రోజులు, సంవత్సరాల తరబడి ఆనందంగా ఉండిపోగలను. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఇంటికి 'సాయి నిలయం' అని పేరు పెడతాను. ఆరోజున బాబాను ‘ఒక బొమ్మ’ అన్నాను, ఈరోజున ‘నాకున్న బలమైన ఆస్తి సాయిబాబా మాత్రమే’ అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. సమస్యలు ఎదుర్కొన్న తరువాతే మనలో బలమైన మార్పు వస్తుంది, సమస్యల వలనే మన గురువు ఎవరో, మన గమ్యమేమిటో మనం తెలుసుకోగలం. సమస్యలకు మనం కృతజ్ఞత కలిగివుండాలి. ఆధ్యాత్మికతను మరింత బలంగా ఆచరించే శక్తిని ఇవ్వమని బాబాను ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా జీవితాన్ని బాబాకు సమర్పణ చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో నాకు తెలియదు, కానీ బాబా కచ్చితంగా తెలియజేస్తారని బలంగా నమ్ముతున్నాను. నా పేరు నాకు అవసరం లేదు, నాకు ‘సాయిభక్తుడు’ అన్న పేరే కావాలి. నేను గురువుకు తగ్గ శిష్యుడిగా బ్రతకాలి.


పరీక్షలు విజయవంతంగా వ్రాయించిన బాబా


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నేను సాయిభక్తుడిని. నేను పి.జి రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఈసారి పరీక్షల సమయంలో నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. నేను సాధ్యమైనంతవరకు మందులు వాడకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే, ఈసారి ఎందుకోగానీ ఏం చేసినా తలనొప్పి తగ్గలేదు. మా అమ్మగారు నా తలనొప్పి తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో నేను పరీక్షలు వ్రాయలేనేమో అనుకున్నాను. అలా ఉండగా ఒకరోజు (పరీక్షకు రెండురోజుల ముందు) నేను బాబా గుడికి వెళ్లాను. ఆరోజు ఏకాదశి. బాబాకు మధ్యాహ్న ఆరతి ఇస్తున్నారు. నిజానికి నాలుగు రోజుల ముందు నేను బాబా ఆరతికి వెళ్లాలనుకున్నాను. కానీ తలనొప్పి వల్ల వెళ్ళలేకపోయాను. ఆ సంగతి గుర్తుకు వచ్చి, 'బాబా నన్ను సరిగ్గా ఆరతి సమయానికి రప్పించుకున్నార'ని చాలా సంతోషించాను. ఆరతి పూర్తయ్యేవరకూ ఉండి, ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాను. అద్భుతమేమిటంటే, అప్పటికి సుమారు వారం రోజులుగా ఏమి చేసినా తగ్గని తలనొప్పి చాలావరకు తగ్గిపోయింది. దాంతో పరీక్షలకు కొద్దిగా చదవగలిగాను. కానీ పరీక్ష జరిగేరోజున మళ్లీ తలనొప్పి రావటంతో ఒక గంటసేపు పరీక్ష వ్రాశాక, పేపర్లు ఇచ్చేసి వచ్చేద్దామనుకున్నాను. కానీ బాబాపై భారం వేసి ఎలాగో పూర్తిగా వ్రాశాను. అది కూడా బాబా దయవలన బాగా వ్రాయగలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా అండగా ఉండగా ఏ సమస్యా మన దరి చేరదు. "ధన్యవాదాలు బాబా! అందరినీ ఎల్లప్పుడూ చల్లగా చూడండి, అందరినీ రక్షించండి బాబా". బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలు ఇంకోసారి పంచుకుంటాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఊదీ మహిమ


ప్రతి భక్తునికీ ఈ బ్లాగ్ ఒక 'ఆధునిక సచ్చరిత్ర' వంటిది. ఈ అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు శిరీష. 2021, జూన్ మొదటి వారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆరోజు ఉదయాన్నే నా ఎడమచేతి మణికట్టు చాలా నొప్పిగా అనిపించింది. స్నానం చేసి పూజ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా బాబా ఊదీని నా మణికట్టుకి రాసి, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవలన అప్పటినుండి నొప్పి క్రమంగా తగ్గుతూ మరుసటిరోజుకి పూర్తిగా అదృశ్యమైంది. "బాబా! మీకు ధన్యవాదాలు".


9 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJuly 27, 2021 at 9:58 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼❤😊

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri sainatha

    ReplyDelete
  7. Baba santosh ki koduku puttali thandri

    ReplyDelete
  8. 🌺🌼🌺🙏🙏🙏🌺🌼🌺 Om Sri Sairam

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo