సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 832వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆరోగ్యప్రదాత
2. ఆఫీసు పనిలో బాబా సహాయం
3. కాపాడింది బాబానే
4. రోగం ఏదైనా బాబా అనుగ్రహమే అసలైన ఔషధం

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్ర. గతంలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగులో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. 


1. బాబా ఆరోగ్యప్రదాత


కొన్నిరోజులపాటు నా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో (గొంతు గరగర, ఛాతీనొప్పి) కోవిడ్ ఏమోనని నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. బాబాను ప్రార్థించి, క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైటులో బాబాను అడిగితే, "అనవసరంగా ఆందోళన చెందవద్దు" అని సందేశం వచ్చింది. అయినా భయంతో నేను డాక్టరు దగ్గరకు వెళ్లగా కొన్ని టెస్టులు చేసి, "అంతా నార్మల్‌గా ఉంద"ని అన్నారు. కానీ ఆ మరుసటిరోజు (బుధవారం) నేను బాగా ఇబ్బందిపడ్డాను. పైగా ఆరోజు సాయంత్రం ఆక్సీమీటరులో చూస్తే, రీడింగ్ 94 చూపించింది. అది చూసి బాగా భయపడి బాబాను శరణువేడాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ ఉగాదినాడు ఒక పంచాంగం ప్రకారం నా రాశివారు మే నెలలో మృత్యువు అంచులకు వెళ్తారని చెప్పారు. అది గుర్తుకు వచ్చి, నాకు చాలా భయం, ఆందోళన కలిగాయి. అయితే కరుణాసాగరుడైన మన సాయి దయవలన మరుసటిరోజు (గురువారం) ఉదయం నుంచి నాకున్న ఇబ్బంది తగ్గిపోయి ఆరోగ్యం కుదుటపడింది. ఆరోజు మన బ్లాగులో "నీవేమీ భయపడవద్దు. నీ చావు చీటీ చింపివేశాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది" అని బాబా సందేశం వచ్చింది. అది చూసి చాలా సంతోషం, ధైర్యం కలిగాయి. "శతకోటి ధన్యవాదాలు బాబా".


2. ఆఫీసు పనిలో బాబా సహాయం


ఈమధ్య ఆఫీసులో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఒక ఫైలును అతి తక్కువ సమయంలో సిద్ధం చేయవలసి వచ్చింది. దాంతో నాలో ఆందోళన మొదలై బాబాను ప్రార్థించాను. ఆరోజు మన బ్లాగులో "నేనుండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో! అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను" అని బాబా సందేశం వచ్చింది. బాబా దయతో ఆయన చెప్పినట్లే ఆ పని అత్యంత సులభంగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సరైన సమయానికి విజయవంతంగా పూర్తయింది. "థాంక్యూ బాబా. కాస్త ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు నన్ను మన్నించండి బాబా". 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


కాపాడింది బాబానే


ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ బ్లాగును వీక్షిస్తున్న సాయిభక్తులకు నా శతకోటి నమస్కారాలు. నేను ఇదివరకు నా అనుభవాలనెన్నో ఈ బ్లాగ్ ద్వారా పంచుకున్నాను. కరోనా సోకిన నేను బాబా దయవల్ల క్షేమంగా బయటపడితే నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటానని అనుకుని ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను.


నా పేరు కె.లక్ష్మీనారాయణ. నేను విశాఖపట్నం వాసిని. నేను ఉద్యోగరీత్యా ప్రతిరోజూ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణిస్తుంటాను. గత సంవత్సరం మే నెల 21న లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటినుంచి తగు జాగ్రత్తలు పాటిస్తూ విధి నిర్వహణ చేశాను. ఈ సంవత్సరం మే 31న నా పదవీవిరమణ. ‘ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే ఇకపై ఇంట్లోనే ఉండవచ్చు’ అనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. మే నెల 2వ తారీఖు రాత్రి నాకు కొద్దిగా జ్వరం వచ్చింది. సీజన్ మారితే నాకు దగ్గు, జ్వరం రావడం సాధారణంగా జరిగేదే. కానీ, ఎందుకైనా మంచిదని జ్వరం తగ్గటానికి రెండు రోజుల పాటు మందులు వాడాను. మూడవ రోజున జ్వరం తగ్గింది. అయినా, ఎందుకైనా మంచిదని హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టర్ నన్ను కరోనా టెస్ట్ చేయించుకోమన్నారు. వెంటనే టెస్ట్ చేయించుకున్నాను. జ్వరం తగ్గిపోయి నేను నార్మల్‌గా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రిపోర్టులో నెగిటివ్ వస్తుందని నా నమ్మకం. కానీ టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. మే నెలలో కరోనా చాలా ఉధృతంగా ఉంది. కానీ, నేను భయపడకుండా బాబా మీదనే భారం వేశాను. డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చి, నన్ను హోమ్ క్వారంటైన్లో ఉండమన్నారు. మూడు రోజుల పాటు తీవ్రమైన వెన్నునొప్పితో నరకయాతన అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు గడిపాను. డాక్టరిచ్చిన మందులు వాడుతూ బాబా నామస్మరణతో కాలం గడిపాను. కోర్స్ పూర్తవగానే మరలా డాక్టర్ని కలిశాను. ఆయన నాకు బ్లడ్ టెస్ట్ చేసి, ఆ రిపోర్ట్ వచ్చిన తరువాత సంతృప్తి చెంది, నీరసం తగ్గడానికి మరలా మందులు వ్రాసి, “14 రోజుల తరువాత సాధారణ జీవితం గడపవచ్చు” అని అన్నారు. జూన్ 3వ తేదీకి నెలరోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను అనారోగ్యం నుంచి బయటపడ్డాను. నన్ను కాపాడింది మందులో, డాక్టర్లో కాదు. కేవలం బాబా దయవల్ల మాత్రమే నేను కరోనా నుండి బయటపడ్డాను. ఈ కష్టసమయంలో ప్రతిక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడిన నా భార్యాపిల్లలకు, నాకు ప్రతిరోజూ ఫోన్ చేసి తగిన ధైర్యం కల్పించిన సన్నిహితులు, హితులు, బంధువులు అందరికీ నా శతసహస్ర వందనములు. 


నా జీవితంలో బాబా ఎన్నో నిదర్శనాలు చూపించారు. అనుక్షణం నన్ను, నా కుటుంబాన్ని బాబానే సంరక్షిస్తున్నారు. ‘సాయీ’ అంటే ‘ఓయీ’ అని పలుకుతూ అడుగడుగునా కాపాడుతున్నారు. లేచింది మొదలు బాబాను కోరేదొక్కటే, ‘ఈ మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడమ’ని. ఆరోజు కలరా నుంచి ప్రజలను కాపాడినట్లు బాబా ఇప్పుడు కూడా కాపాడగలరు, కానీ ఎందుకనో  మౌనం వహించారు. “ఇక చాలు బాబా, ఈ టెన్షన్ మేము భరించలేము. ఏ పక్షులకూ, జంతువులకూ లేని కరోనా మాకెందుకు పెట్టావయ్యా? ఇకనైనా ఈ నరమేధాన్ని ఆపండి బాబా. మూసిన శిరిడీ తలుపులు తెరిపించి మాకు మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించండి బాబా!” 


సద్గురుం భజే సాయినాథ్ మహరాజ్ కీ జై! 

సర్వం శ్రీ సాయినాథ చరణారవింద సమర్పణమస్తు!


రోగం ఏదైనా బాబా అనుగ్రహమే అసలైన ఔషధం


నేను సాయిభక్తురాలిని. దయాదాక్షిణ్యమూర్తియగు సాయినాథుడు నన్ను ఎన్నో విధాల ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన కురిపించిన ఆశీర్వాదాల గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, మే నెలలో మా కుటుంబంలోని అందరమూ ఒకేసారి జ్వరం, దగ్గు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాము. హాస్పిటల్‌కి వెళ్ళినా నయంకాక చాలా బాధపడ్డాము. అప్పుడు నేను, "మేమంతా ఈ అనారోగ్యం నుండి బయటపడితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. ఇంక అప్పటినుండి రెండురోజుల్లో మేమంతా కోలుకున్నాము. బాబా దయవలన ఇప్పుడు అంతా క్షేమంగా ఉన్నాము. "బాబా! నీ మహిమలు చెప్పనలవి కాదు తండ్రీ. ఎన్నో విధాల మమ్మల్ని కాపాడుతున్నావు. సాయినాథా! నువ్వే మాకు దిక్కు తండ్రీ".


మరో అనుభవం: ఒకసారి నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి దద్దుర్లు లేచి చాలా చికాకుపెడుతుండేవి. ఆ కారణంగా నాకు రాత్రంతా నిద్రపట్టక చాలా ఇబ్బందిగా ఉంటుండేది. డాక్టర్ ఇచ్చిన మందులకు ఏ మాత్రమూ తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! ఇక నువ్వే దిక్కు తండ్రీ. నీ ఊదీయే నన్ను కాపాడగలదు" అని వేడుకుని ప్రతిరోజూ నీళ్లలో ఊదీ కలుపుకుని త్రాగడం మొదలుపెట్టాను. ఊదీ వాడటం మొదలుపెట్టినంతనే ఇన్ఫెక్షన్ తగ్గడం ప్రారంభించింది. నెమ్మదిగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దయగల తండ్రి శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


6 comments:

  1. Sai please cure infection of icing I also suffering this problem.i used many medicine but no use. With your blessings this problem must cure. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. OM SAMARDHA SADGURU SREE SAI NADHAYA NAMAHA 😊🕉🙏❤😀

    ReplyDelete
  4. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo