సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 845వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ‘బాబాను మించిన పెద్ద డాక్టర్, డైరెక్టర్ ఇంకెవరుంటారు?’ - ఆయనే అన్నీ చక్కబరుస్తారు
2. ఆరతి పళ్ళెంలో బాబా ఆకృతి

‘బాబాను మించిన పెద్ద డాక్టర్, డైరెక్టర్ ఇంకెవరుంటారు?’ - ఆయనే అన్నీ చక్కబరుస్తారు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇంతకుముందు కూడా ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పటివరకు మా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేసిన బాబా కొద్దిరోజుల క్రితం మా అమ్మగారి ఆరోగ్యం విషయంలో చూపించిన ఒక లీలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.


కొద్దిరోజుల క్రితం మా అమ్మగారికి ఉన్నట్టుండి విరేచనాలు, ఆ తర్వాత దగ్గు మొదలయ్యాయి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల గురించి తనకు అవగాహన లేకపోవటంతో ఆవిడ ఈ లక్షణాలను పెద్దగా పట్టించుకోలేదు, నాతో చెప్పలేదు. నీరసంగా ఉన్న తనను గమనించి, ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అని తరచి తరచి అడిగితే, “ఎందుకో అలా వస్తోంది, రాత్రి నిద్రలో కూడా బాగా దగ్గు వచ్చింది. జ్వరం ఏదైనా ఉందేమో, రాత్రి కొంచెం చలిగా అనిపించింది. కాసేపటికి మళ్లీ చెమటలు పట్టాయి. నేను బాగానే ఉన్నానులే, వేడి చేసి ఉంటుంది” అంటూ చాలా యథాలాపంగా చెప్పడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. ఈ లక్షణాలు చాలు మనం భయపడటానికి, ఏ డాక్టరైనా మనను భయపెట్టడానికి. ఇక వెంటనే పల్స్ ఆక్సిమీటర్‌లో చెక్ చేయగానే ఇంకొక షాక్. ఎప్పుడూ 99%-98% ఉండే ఆక్సిజన్ లెవెల్స్ నెమ్మదిగా 97 కంటే క్రిందకు క్రిందకు వెళ్లిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ రీడింగ్స్ నోట్ చేసి చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. 96, 95, 94, 93, 92 వరకు వెళ్లి మళ్ళీ 94 దగ్గరకు రావటం జరుగుతోంది. ఆ హెచ్చుతగ్గులు చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దావిడ.. ఏదైనా గట్టిగా చెప్తే భయపడిపోతారు. అది ఇంకా ఎక్కువ ప్రమాదకరం. ‘ఆకలి లేదు’ అని ముందురోజు ఏమీ తినకపోవడం వల్లా, 3 రోజులుగా విరేచనాల వల్లా అమ్మకు చాలా నీరసంగా ఉంది. ఆరోజు ఉదయం కూడా, ‘నాకు ఏమీ తాగాలనిగానీ, తినాలనిగానీ అనిపించడం లేదు, నాకు ఏమీ వద్దు’ అని గట్టిగా భీష్మించుకుని కూర్చుంది. కాఫీ కూడా త్రాగకపోవడంతో ఎప్పటిలానే రాగిజావలో కొద్దిగా మజ్జిగ కలిపి ఇచ్చాను. అది త్రాగిన కాసేపటికి దగ్గు పెరిగిపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాక మళ్లీ ఆక్సిజన్ లెవెల్స్ చూసి భయపడి ‘ఇక హాస్పిటల్‌కు వెళ్లాలేమో, రెడీగా ఉండు’ అని అమ్మతో చెప్పి, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక డాక్టరుకు ఫోన్ చేసి మాట్లాడాను. “మళ్లీ 3, 4 సార్లు రీడింగ్స్ చూసి నోట్ చేసి చెప్పండి, అప్పుడు టెస్టులు చేయిద్దాం” అని ఆ డాక్టర్ అనేసరికి అమ్మకు చాలా కోపం వచ్చి, “నేను ఎక్కడికీ రాను. నన్ను ఎక్కడికీ తీసుకువెళ్ళటానికి నేను ఒప్పుకోను. నేను బాగానే ఉన్నాను. కాస్త వేడి చేసి ఉంటుంది. కొద్దిగా దగ్గు వస్తుంటే నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్లి లేనిపోనివి నాకు అంటించి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు మీరంతా?” అని చాలా గట్టిగా మాట్లాడేసరికి అమ్మకు ఎలా నచ్చజెప్పాలో నాకు అర్థం కాలేదు. “అమ్మా, మనం ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. శాంపిల్ తీసుకోవడానికి వాళ్ళను ఇక్కడికే రమ్మంటాను. ఇది కరోనా కాదని నిర్ధారించుకుంటే ధైర్యంగా ఉంటుంది కదమ్మా. ప్లీజ్, కొంచెం అర్థం చేస్కో. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. మనం ఏదైనా మొదట్లోనే జాగ్రత్తపడితే అంత ప్రమాదం ఉండదు” అని నచ్చజెప్పే ప్రయత్నం చేసేసరికి ఆవిడ కోపం తారాస్థాయికి చేరిపోయింది. “నేను ఒప్పుకోను. నువ్వు ఇచ్చిన జావ వల్లనే దగ్గు వచ్చింది, బలవంతంగా నువ్వే త్రాగించావు” అని ఆ బాణాన్ని నా వైపే తిప్పింది. ఇక మళ్లీ డాక్టర్ ఫ్రెండుకి ఫోన్ చేసి పరిష్కారం అడిగితే, “సాయంత్రం వరకు తనను పరిశీలిస్తూ ఉండండి, అప్పుడు ఏం చేయాలో చూద్దాం” అని చెప్పారు. అమ్మ మాత్రం, "నాకు నిద్ర వస్తోంది. మళ్లీ ఆ మిషన్లు, ఈ మిషన్లు పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకు" అని వార్నింగ్ ఇచ్చి వెళ్లి పడుకుంది. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. సమయానికి మావారూ దూరంగా ఉన్నారు. లాక్‌డౌన్ వల్ల ఎవరూ ప్రయాణం చేసే పరిస్థితులు లేవు, మావాళ్లకు చెప్పినా ప్రయోజనం లేదు. ఇక నన్ను భరించే నా బాబా తప్ప నా పరిస్థితిని ఎవరూ అర్థం చేస్కోలేరు. దిక్కుతోచక బాబానే కన్నీళ్లతో వేడుకున్నాను. “చాలా భయంగా ఉంది బాబా. ఏదైనా పరిస్థితిలో బయటికి వెళ్ళాల్సి వస్తే పెద్దవయసులో అనారోగ్యంతో ఉన్న నాన్నగారిని, చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలి. దగ్గర్లో కూడా ఎవరూ లేరు, ఎటువంటి సహాయమూ లేదు. ఎలా బాబా? ఇది కరోనా మాత్రం కాకూడదు, టెస్టులు చేయించుకోవటానికి అమ్మ ఒప్పుకోదు. ఇప్పుడు మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మీరే ఏదో ఒక విధంగా ఇది కరోనా కాకుండా చూడండి బాబా” అని రకరకాల భయాలతో, కన్నీళ్లతో బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. రెండు గంటల పాటు అమ్మ నిద్రపోతూనే ఉంది. తను విశ్రాంతి తీసుకుంటోందో లేదా ఆహారం లేక నీరసంతో అలా నిద్రపోతోందో నాకు అర్థం కావడం లేదు. క్షణ క్షణం అమ్మ ఎలా ఉందోనని తన గదిలోకి తొంగి చూస్తూ, సాయి నామజపం చేసుకుంటూ వంట పూర్తి చేసి తనను నిద్ర లేపడానికి వెళ్ళేసరికి అప్పుడే లేచి కూర్చుంది అమ్మ. ‘బాగా నీరసంగా ఉంది, ఏదైనా తింటే కానీ ఓపిక రాదు’ అని ఎలాగో సముదాయించి అమ్మకు రెండు ముద్దలు తినిపించాను. కాసేపు కూర్చోపెట్టి మాట్లాడిస్తూ మనసులో బాబాను ప్రార్థిస్తూ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తే 97% ఉంది. కొంచెం ధైర్యం వచ్చింది.


‘మరో 2, 3 సార్లు రీడింగ్ చూస్తే తప్ప ఏమీ డిసైడ్ అవలేము’ అని మళ్ళీ మళ్ళీ బాబాను ప్రార్థిస్తూ టెస్ట్ చేయసాగాను. ఇలా ఆరోజు సాయంత్రానికి 98% రీడింగ్ స్థిరంగా నిలబడింది. దగ్గు కూడా కొంచెం కొంచెంగా తగ్గింది. ఎప్పటికప్పుడు అమ్మ ఆక్సిజన్ లెవెల్స్‌లో మెరుగుదల గురించి డాక్టరుకు చెప్తూ ఉండటంతో ఆయన కూడా, ‘భయపడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. మూడు రోజుల నుండి ఈ తెల్లవారుఝాము వరకు అవుతూనే ఉన్న విరేచనాలు మళ్లీ కాలేదు. ఆ రెండు గంటలలోనే ఏదో జరిగింది. అది ‘బాబా అద్భుత చర్య’ అని మాత్రం తెలుస్తోంది. ఈ విధంగా బాబా నా ఆందోళనను దూరం చేసినందుకు, నాపై చూపించిన దయకు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా బాబాకు కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాను.


మర్నాడు కూడా బాబా దయవల్ల అమ్మ ఆక్సిజన్ లెవెల్స్ 98%-99% మెయింటెయిన్ అవుతూనే ఉన్నాయి. అసలు 92, 93, 94% కి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఎందుకు పడిపోయాయో తెలీదు, మెషిన్ సమస్య గానీ, నేను రీడింగ్ తీయడంలో గానీ ఎటువంటి పొరపాటూ లేనే లేదు. అమ్మలో ఏదో అనారోగ్యం ఉంది, కానీ అదేమిటో మాత్రం తెలియదు. “మీరే అందరికీ పెద్ద డాక్టర్, మీరు మాత్రమే ఈ పరిస్థితి నుండి ఆందోళన నుండి నన్ను బయటపడేయాలి బాబా” అని ఆర్తిగా బాబాను వేడుకోవటం ఒక్కటే నాకు తెలుసు. అప్పటికే రెండు మూడు రోజుల నుండి ఉదయాన్నే నాకు బాబా నుండి "భయపడకు, నేనున్నాను" అనే అర్థంతో ఇంగ్లీషులో ఒక సందేశం, "నేను నీ చుట్టూ, నీ వెంటే ఉన్నాను. నన్ను నువ్వు గమనించకపోతే అది నీ లోపం" అని ఒక సందేశం వచ్చాయి. ఆరోజు ఉదయం కూడా, "నీవు ధైర్యంగా ఉండు, చింతపడకు, దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు, స్థిరంగా ఇంటిలో కూర్చో! నిర్భయంగా, నిశ్చింతగా ఉండు, నా మీద విశ్వాసముంచు" అన్న బాబా సందేశం వచ్చింది. అవన్నీ తర్వాత ఆలోచించుకుంటే అర్థం అయింది, ‘బాబా మనకు ఏదో ఒక రూపంలో సూచన ఇస్తూనే ఉంటారు. మనమే అర్థం చేసుకోలేం’ అని. అలాంటి బాబా సూచనలు చూసినప్పుడు కూడా, "ఈ మట్టిబుర్రకి ఏం అర్థం కాదు బాబా. మమ్మల్నందరినీ సర్వకాల సర్వావస్థల్లోనూ మీరే కనిపెట్టుకుని ఉండాలి" అని ఆ భారం కూడా ఆయన మీదే వేసేసే సోమరిని నేను. అటువంటి నా మీద బాబా అపారమైన కరుణ కురిపించారు


అమ్మ నెమ్మదిగా కోలుకోవడం, కొద్దిపాటి నీరసం తప్ప వేరే ఏ ఇబ్బందీ లేకపోవడంతో తన పని తానే చేస్కోవడం చూసి, “బాగానే ఉన్న మనిషిని పట్టుకుని హాస్పిటల్‌కి టెస్టులు పేరుతో బయటికి తీసుకువెళ్తానన్నావు. నీకు బాగా కంగారు, చాదస్తం ఎక్కువయింది. ముందు వార్తలు చూడటం మానెయ్యి” అని అందరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. కళ్ళముందు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే మనిషిని రక్షించుకోవటానికి మనం చేయాల్సిన మొదటి ప్రయత్నం డాక్టర్ సహాయం తీసుకోవడం. అప్పుడు నా పరిస్థితి కేవలం బాబాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అందరూ నన్ను అలా అంటుంటే నాకు అస్సలు కోపం రాలేదు, నవ్వు మాత్రమే వచ్చింది. రహస్యం ఏమిటో నాకు, నా బాబాకు మాత్రమే తెలుసు. ‘బాబాను మించిన పెద్ద డాక్టర్, డైరెక్టర్ ఇంకెవరుంటారు?బాబానే పరిస్థితిని ట్రీట్ చేసేశారు!!


మర్నాడు ఉదయం నిద్రలేచి బాబాకు దణ్ణం పెట్టుకుంటుండగా నాకు వచ్చిన బాబా సందేశం ఇది: "ఒకరు నిరంతరం నా గురించి ఆలోచిస్తూ నన్ను తన ఏకైక ఆశ్రయంగా భావిస్తే నేను అటువంటివారికి ఋణగ్రస్థుడను అవుతాను. వారిని రక్షించడం కోసం నా తలనైనా ఇస్తాను" అని!! ఇంతకన్నా బాబా గురించి మాటల్లో చెప్పడానికి నాకు తెలిసిన భాష సరిపోదు, కేవలం ఆ పాదాల దగ్గర సర్వస్య శరణాగతి చెందడం తప్ప!!


అలాగే.. ఈ సంఘటనకు మూడు వారాల ముందు కూడా నాన్నగారి విషయంలో ఈ విధంగానే జరిగింది. ఆరోజు నాన్నగారు తలనొప్పి అనీ, కళ్ళు మంటలు అనీ ఇబ్బందిపడుతూనే ఉన్నారు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కరోనా విషయంలో డాక్టర్స్ మనలను హెచ్చరిస్తూ ఉన్న లక్షణాలే. ఆరోజు అర్థరాత్రి నాన్నగారు మంచినీళ్లు తాగటానికి లేచినట్టున్నారు. అదే సమయంలో ఉన్నట్టుండి నన్ను ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించి మెలకువ వచ్చి గది బయట చూసేసరికి నాన్నగారు లేవలేక దూరంగా నీరసంగా కూర్చుని ఉండటం కనిపించింది. (గతంలో కూడా ఇలా ఎన్నో విపత్కర పరిస్థితులలో ఇలానే ఎవరో తట్టి లేపినట్టు లేవడం, అక్కడ నా అవసరం ఉండటం చూస్తే, ‘నేను మొద్దునిద్రలో ఉన్నానని బాబా నన్ను ఇలా లేపారేమో’ అనిపించేది. అంటే, బాబా తనవాళ్ళని ఎలా కనిపెట్టుకుని ఉంటారో ఇటువంటి చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా చూపిస్తారు). తన ఆరోగ్యం ఎలా ఉందోనని టెంపరేచర్ చూస్తే 99.6, ఆ పైన, వందలోపు ఉంది. అసలే కరోనా సమయం. ఇప్పుడు నాన్నగారికి జ్వరంగా ఉండేసరికి గుండె గుభేలుమంది. ఇంక ఏం అర్థంకాక నాన్నగారికి డోలో టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టాను. కానీ నేను మాత్రం తెల్లవార్లూ జాగరణ చేస్తూ, నా అనుమానాలతో, భయాలతో ఎప్పటిలానే బాబాను ఉక్కిరిబిక్కిరి చేసేశాను. ‘అసలు మేము గుమ్మం దాటి ఎక్కడికీ వెళ్ళట్లేదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. తెల్లవారాక డాక్టరుకి ఏమని చెప్పాలి? ఇప్పుడు టెస్టులు చేయించటానికి తీసుకువెళ్లమంటారేమో, ఎలా? అసలే వింటున్న దుర్వార్తలకు భయం గుప్పిట్లో బతుకుతున్నాం’ అని ఎన్నో ఆలోచనలతో బాబాను వేడుకుంటూనే ఉండగానే తెల్లవారింది.


ఎప్పుడూ తన ప్రపంచంలో తాను ఉంటూ మౌనంగా ఉండే నాన్నగారు ఎందుకో నన్ను పిలిచి మాట్లాడుతూ, మాటల మధ్యలో తనకున్న గ్యాస్ట్రిసిస్, అల్సర్, యూరాలజీకి సంబంధించిన సమస్యల గురించి చెప్పారు. అంతేకాదు, గత నాలుగురోజులుగా తాను పంచామృతాలు తీర్థంగా తీసుకుంటున్నట్లు, ఆ ముందురోజున కాకరకాయ కూర వంటి తనకు పడని పదార్థాలు ఏవో తిన్నట్టు, తలస్నానం చేస్తున్న సమయంలో చెవిలో నీళ్లు పడి చెవిపోటు వస్తున్నట్టు చెప్పారు. అప్పుడు నాకు అర్థం అయింది, నాన్నగారి అనారోగ్యానికి కారణం. 4, 5 సమస్యలు ముడిపడి ఉన్నాయి, ప్రతి సమస్యకు కారణం చూపించేశారు బాబా. కొద్దిగా ఉపశమనంగా అనిపించినా కూడా ఒకప్రక్క అనుమానం. డాక్టర్ ధృవీకరిస్తే తప్ప ధైర్యం రాదు. దాంతో డాక్టరుకి ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పగానే, “ఇవన్నీ ఆయనకు ఎప్పటినుండో ఉన్న మెడికల్ ప్రాబ్లెమ్స్‌కు సంబంధించిన లక్షణాలే. కానీ ఈ పరిస్థితుల్లో సేఫ్ సైడ్‌గా ఒక 5 రోజులు ఆయనను అబ్జర్వ్ చేయాలి” అన్నారు డాక్టర్. కానీ మేము భయపడినట్లుగా నాన్నగారికి మళ్లీ జ్వరం రాలేదు, డాక్టర్ చెప్పిన ఎటువంటి లక్షణాలూ మళ్లీ కనిపించలేదు. బాబా అనుగ్రహంతో నాన్నగారు వెంటనే కోలుకున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో “బాబా మీరే దిక్కు” అని ప్రార్థించగానే, సరైన ఆలోచన కలిగించి దారిచూపే ఆ సమర్థ సద్గురువు శ్రీ సాయినాథునికి ఎన్ని జన్మలెత్తి ఋణం తీర్చుకోగలము? ఎప్పటికీ తననే నమ్ముకుని తన మీదే భారం వేసి బ్రతుకుతున్నవారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా వమ్ము చేయరు. ప్రతిసారీ అదే అనుభూతిని కలిగించి, “నేనున్నానుగా, నీకు భయం దేనికి?” అని నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించే నా/మన సాయినాథునికి శతకోటి సాష్టాంగ నమస్కారాలు.


అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై! 


- మీనాక్షి.


ఆరతి పళ్ళెంలో బాబా ఆకృతి


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. మా ఇంట జరిగిన మరో బాబా లీలను మీతో పంచుకుంటున్నాను. అప్పట్లో హైదరాబాద్, లంగర్ హౌస్ ప్రాంతంలో నరసింహ అంకుల్ (ప్రస్తుతం బాబాలో ఐక్యం చెందారు) ఆధ్వర్యంలో మాకంటూ ఒక సాయి భజనబృందం ఉండేది. 2017, ఫిబ్రవరి 5, ఆదివారం మా ఇంట్లో భజన ఏర్పాటు చేశాము. భజన జరుగుతుండగా బాబా చిత్రపటం మీద ఉన్న పువ్వు రెండుసార్లు జారి క్రిందపడింది. అలా ఏ భజనలో అయినా జరిగితే దానిని శుభసూచకంగా, బాబా అక్కడ ఉన్నారని మేము భావిస్తాం. అలా బాబా అనుగ్రహాన్ని పొందిన మేము సంతోషంగా ఆరోజు భజన పూర్తిగావించి, బాబాకు ఆరతి ఇచ్చాము. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. దీపాలు కొండెక్కిన తర్వాత మేము పూజ చేసిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంటే, బాబాకు ఆరతి ఇచ్చిన పళ్ళెంలో బాబా రూపాన్ని పోలిన ఆకృతి కనిపించింది. అది చూసి ఒక్కసారిగా నా ఒళ్ళు జలదరించింది. "నమ్మి కొలిచిన నీ భక్తుల ఇంట కొలువై ఉంటావు అన్నదానికి నిదర్శనమిదే కదా బాబా" అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాం. దానికి సంబంధించిన ఫోటో క్రింద ఇస్తున్నాను చూడండి.


9 comments:

  1. Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Today is Guru purnima i completed my maha parayan.Guru saves his devotees.no doubt.Baba appeared in harati plate it is miracle.nice to see that sai leela on Guru purnima day. Om sai ram���� and

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundela chudu thandri pleaseeee

    ReplyDelete
  4. Baba santosh health bagundali thandri

    ReplyDelete
  5. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri pleaseeee

    ReplyDelete
  7. Baba ma rendu kutubalanu challaga chudu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo