బాబా తొలి దర్శనం
1907వ సంవత్సరంలో ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో శిరిడీ గ్రామస్థులు వారి వారి పనులు ముగించుకొని తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. పశువులు తమ గూటికి చేరుకుంటున్నాయి. బాబా లెండీబాగ్ నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చొని, తమ ప్రక్కనున్న అడ్డచెక్కపై చేయి ఆనించి విశ్రాంతి తీసుకుంటున్నారు. దూరాన తెల్లని వస్త్రాలు ధరించి, మసీదు వైపుగా వస్తున్న వ్యక్తిపై బాబా దృష్టి పడింది. ఆ వ్యక్తికోసమే ఎదురుచూస్తున్నట్లు బాబా తదేకంగా అటువైపే చూడసాగారు. సమీపంలోకి వస్తున్న కొద్దీ ఆ వ్యక్తి ఒక స్త్రీ అని అందరికీ రూఢి అయింది. అయితే, ‘ఆమె గృహిణా? లేక సన్యాసినా?’ అన్నది ఇంకా అస్పష్టంగా ఉంది. తెల్లచీర ధరించిన ఆమె భుజానికి ఒక జోలె వ్రేలాడుతోంది. ఒక చేతిలో సితార్, మరో చేతిలో తాళాలు ఉన్నాయి. ఆమె నుదుటిపై మాధవ సాంప్రదాయానుసారం తెల్లని తిలకం ఉంది. తులసి పూసలతో చేయబడిన కంకణాలు ఆమె రెండు చేతులకు అలంకరించబడి ఉన్నాయి. మెడలో తులసి పూసల హారం ధరింపబడి ఉంది. ఆమె శిరోజాలు మోకాళ్ళ వరకు వ్రేలాడుతున్నాయి. ఆమె పూర్తి రూపం ఇంకా స్పష్టంగా కానరాకపోయినప్పటికీ, ఆమె స్వరూపం విస్మయం కలిగించేదిగా ఉంది. ఆమె ధరించిన వస్త్రాలు సొంపుగా లేకపోయినప్పటికీ ఆమె ముఖంలోని తేజస్సు చూసేవాళ్ళలో ఆమెపట్ల గౌరవభావాన్ని కలిగించేదిగా వుంది. కొద్దిసేపట్లో ఆమె మసీదుని సమీపించి మెట్లెక్కకుండా క్రిందనే నిలబడి తన భుజానికున్న సంచీని, సంగీత వాయిద్యాలను క్రిందపెట్టి, తన శిరస్సును శిరిడీ పుణ్యభూమికి తాకించి, తరువాత తన చేతులు జోడించి బాబాకు గౌరవవందనం చేసింది. ఆపై ఆమె తన సంచిలో నుండి ఇత్తడితో చేసిన తొమ్మిది అంగుళాల పరిమాణంలో ఉన్న అందమైన రాధాకృష్ణుల విగ్రహాన్ని బయటకు తీసి, రెండు ఇటుకలు తీసుకొని, వాటిపై ఒక శుభ్రమైన వస్త్రాన్ని వేసి దానిపై ఆ విగ్రహాన్ని ఉంచింది. ఆ తరువాత అక్కడే కూర్చొని, సంగీత వాయిద్యాలను చేతిలోకి తీసుకొని,
'రామ్ నామ్ మేరే మన్ బసియో, రసియో రామ్ రిఝావూఁ ఏ మాయ్|
మై మంద్‌భాగణ్, పరమ్ అభాగణ్ కీరత్ కైసే గావూఁ ఏ మాయ్||
విరహ్ పింజర్ కీ బాడ్ సఖీ రీఉఠకర్ జీ హులసావూ ఏ మాయ్|
మన్‌కూ మార్ సజూఁ సత్‌గుర్‌సూఁ దుర్మత్ దూర్ గమావూఁ ఏ మాయ్||
డంకో నామ్ సురత్ కీ డోరీ కడియాఁ ప్రేమ్ చఢావూఁ ఏ మాయ్|
ప్రేమ్ కో ఢోల్ బన్యో అతి భారీ మగన్ హయ్ గుణ గావూఁ ఏ మాయ్||
తన్ కరూఁ తాల్ మన్ కరూఁ ఢఫ్‌లీ సోతీ సురతి జగావూఁ ఏ మాయ్|
నిరత్ కరూఁ మై ప్రీతం ఆగే తో ప్రీతం పద్ పావూఁ ఏ మాయ్||
మో అబలాపర్ కృపా కిజియో గుణ గోవింద్ కా గావూఁ ఏ మాయ్|
మీరా కే ప్రభు గిరధర్ నగర్ రజ్ చరణన్ కీ పావూఁ ఏ మాయ్||'
(“రామనామమే నా మనసున ఉన్నది. ఓ మాయీ (సాయీ)! నేను ఆ రాముని ఎలా మెప్పించగలను? కర్మానుసారం బలహీనురాలినైన నేను ఆ భగవంతుని మహిమను ఎలా గానం చేయగలను ఓ మాయీ (సాయీ)?”) … అని మీరాబాయి స్వరపరచిన భజన గీతాన్ని ఆలపించింది. ఆర్తితో కూడుకున్న ఆమె స్వరం నుండి అనేక రకాల భావోద్వేగాలు జాలువారసాగాయి. తమ తమ ఇళ్లకు వెళ్తున్న గ్రామస్థులు ఆమె గానానికి మోహితులై మసీదు ప్రాంగణానికి చేరుకొని బాగా ప్రొద్దుపోయేవరకు ఆ గానాన్ని వింటూ కూర్చున్నారు. ఆమె ద్వారా వెలువడుతున్న సంగీతం, సాహిత్యం వాళ్ళను మంత్రముగ్ధులను చేసి భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. ఆ భక్తిపారవశ్యంలో అందరూ తమ రోజువారీ సమస్యలను, కాలగమనాన్ని మరచిపోయారు. బాబా కూడా తమ ఆసనంపై ఉన్న బాలీసునానుకొని ఆమె గానాన్ని వింటూ ఉన్నారు. మహల్సాపతి, తాత్యాకోతేపాటిల్ కూడా తదేక శ్రద్ధతో వింటున్నారు. సుందరీబాయి గానం చేస్తూ చేస్తూ భక్తి పారవశ్యంలో సమాధిస్థితిలోకి వెళ్ళింది. అప్పటివరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిన తీయని స్వరం, సితార్ మీద కదలాడుతున్న ఆమె వేళ్ల కదలిక ఆగిపోయాయి. కానీ ఆమె స్వరం శ్రోతల చెవులలో చాలాసేపటివరకు ప్రతిధ్వనిస్తూనే ఉంది. బాగా ప్రొద్దుపోయాక ఆమె సమాధిస్థితి నుండి బయటకు వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి, ఎదురుగా కనిపిస్తున్న కుటీరాన్ని చూపిస్తూ, "చూడు! ఆ శాల ఖాళీగా ఉంది. అందులో నివాసముండు" అని అన్నారు.
నిజానికి సుందరీబాయి తొలి దర్శనంలోనే సాయిబాబా అనే 5½ అడుగుల మానవాకృతి మాటున దాగియున్న అనంత విశ్వశక్తిని గుర్తించి, ‘శిరిడీయే తన నిజవాసమనీ, శ్రీసాయిబాబాయే తన శ్రీకృష్ణుడనీ, సద్గురువనీ’ భావించింది. రెండవ ఆలోచన లేకుండా శిరిడీనే తన నివాసంగా చేసుకోవాలని అనుకుంది. అంతటి దృఢనిశ్చయం ఆమెకు కలిగిందంటే, బాబా ఆమెకు ఎంత గొప్ప అనుభూతిని ప్రసాదించి ఉంటారో! లేకుంటే, బ్రాహ్మణకులంలో జన్మించిన ఆచారవంతురాలు, కృష్ణభక్తురాలు అయిన సుందరీబాయి అందరూ ముస్లిం అని తలచే సాయి సన్నిధిలో, సాయి సేవలో జీవిత శేషమంతా గడపాలన్న నిశ్చయానికి ఎలా రాగలదు? తన మనోనిశ్చయానికి తగ్గట్టే బాబా ఆదేశం లభించడంతో ఆమె ఆనందంగా బాబా చూపిన ఆ కుటీరంలో తన నివాసాన్ని ఏర్పరుచుకుంది. అందరూ ఆ కుటీరాన్ని ‘శాల’ అనీ, ‘బృందావనం’ అనీ పిలిచేవారు. బాబా శిరిడీ వచ్చిన కొన్నాళ్ళకు (మసీదుకి, చావడికి మధ్యలో) మసీదుకి ఎదురుగా ఖాళీగా ఉన్న ఆ కుటీరంలో గ్రామంలోని పిల్లలు చదువుకొనేవారు. మాధవరావు దేశ్‌పాండే (షామా) ఆ పాఠశాలలోనే పిల్లలకు పాఠాలు చెపుతూ బాబాకు ఆకర్షితుడై ఆయనతో కలిసి చిలుం త్రాగడానికి తరచూ మసీదుకి వెళ్తూ క్రమంగా ఆయనకు అంకిత భక్తుడయ్యాడు. తరువాత ఆ పాఠశాల మరో ప్రదేశానికి మార్చబడింది. అయినప్పటికీ కొన్నాళ్ళ పాటు ఆ కుటీరం బాలికల పాఠశాలగా కొనసాగింది. కొన్నాళ్ళకి అది కూడా మూసివేయబడింది. అందుకే సుందరీబాయి కుటీరాన్ని అందరూ ‘శాల’ అని పిలిచేవారు.
సుందరీబాయికి రాధాకృష్ణులపై ఉన్న భక్తి, ప్రేమలు అంతులేనివి. శిరిడీ చేరుకున్న తొలిరోజుల్లో ఆమె నిరంతరం ‘రాధాకృష్ణ’ అనే పవిత్ర నామాన్ని స్మరిస్తూ, ఆ రాధాకృష్ణుల విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఉంటుండేది. అందువల్ల ప్రజలు ఆమెను ‘రాధాకృష్ణ(మా)ఆయీ’ అని పిలవడం ప్రారంభించారు. ‘ఆయీ’ అంటే తల్లి. క్రమంగా సుందరీబాయి క్షీరసాగర్ అన్న ఆమె అసలు పేరు మరుగునపడి, 'రాధాకృష్ణఆయీ' అన్న పేరే శాశ్వతంగా నిలిచిపోయింది. బాబా మాత్రం ఆమెను "రామకృష్ణీ" అని పిలిచేవారు. తొలిదర్శనంలోనే ఆమె తనని తాను "మాండ్ అభాగన్, పరమ్ అభాగన్" అని సంబోధించుకుంది. కాబట్టి బాబా ఆమెను కొన్ని సందర్భాలలో "అవదశ" అని కూడా పిలిచేవారు(అర్థం - పరిస్థితి మంచిగా లేని ఆడది).
రాధాకృష్ణమాయి రోజంతా సితార్ వాయిస్తూ భజన గీతాలు ఆలపిస్తూ భగవంతుని సాన్నిహిత్యంలో ఉంటుండేది. అర్థరాత్రి వరకు ఆమె సితార్ మ్రోగుతూనే ఉండేది. ఆవిధంగా శిరిడీ గ్రామ ప్రజలు రోజంతా ఆమె శ్రావ్యమైన స్వరాన్ని వింటుండేవారు. ఆమె ఎల్లప్పుడూ మందపాటి బట్టతో తయారుచేయబడిన వస్త్రాలు ధరించేది. వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకొనేది. ఆమె చాలావరకు తన జుట్టు వదులుగా వదిలివేసేది, చాలా అరుదుగా మాత్రమే ముడివేసుకొనేది. ఆమె సామాన్యంగా ఎవరి ఎదుటకూ వచ్చేది కాదు. తప్పనిసరై ఇంటినుండి బయటకు వెళ్ళాల్సి వస్తే ముఖం నిండా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్ళేది. ఒకసారి బాబా అకస్మాత్తుగా నీంగాఁవ్‌కు బయలుదేరుతుంటే, త్వరత్వరగా వెళ్ళి బాబాకు నమస్కరించుకొన్నప్పుడు మాత్రమే ఆ తొందరలో ఆమె ముసుగు వేసుకొనడం మరచిపోయింది. ఎన్నో మాసాలు శిరిడీలో గడిపిన ఖపర్డే ‘ముసుగులేకుండా ఆమెను చూడడం అదే’నని తన డైరీలో వ్రాసుకున్నాడు. రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళినరోజు సాయంత్రం ఆమె విధిగా స్నానం చేసి, తెల్లని చీర కట్టుకొని, ముఖానికి ముసుగు వేసుకొని మసీదుకి వెళ్లి ప్రమిదలలో ఐదు వత్తులు వేసి, దీపాలు వెలిగించి, మసీదు మెట్టుపై ఉంచేది. ఆమె ఏనాడూ ముసుగు లేకుండా బాబాకు ఎదురుపడేది కాదు, ఆయన ఉండగా మసీదు మెట్లు ఎక్కేది కాదు. అది ఆమెకు బాబాపట్ల ఉన్న గౌరవం. ఆమె 'పూర్వజన్మలో బాబా తన భర్త' అని భావించేది. ఒకసారి బాబా, "నా పూర్వజన్మలో ఈ ఆయీ నాకు సన్నిహితురాలు. కానీ నాకు ఆమెతో భౌతిక సంబంధం లేదు" అని తనతో చెప్పారని షామా చెప్పినట్లు బి.వి.దేవ్ సాయిలీల పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
రాధాకృష్ణమాయి కుటీరంలో చెక్కతో చేసిన చిన్ని మందిరంలో ఒక రాధాకృష్ణుల విగ్రహం, దానికి ఇరువైపులా రెండు బాబా చిత్రపటాలు (ఒకటి రాతి మీద కూర్చున్నది, మరొకటి నేలపై కూర్చున్నది) ఉండేవి. వాటిని ఆమె తన స్వహస్తాలతో అల్లిన పూలమాలలతో అందంగా అలంకరించేది. ఆ మందిరానికి రెండు చివర్లలో చక్కగా అల్లికపని చేసిన దిండ్లు అమర్చబడి ఉండేవి. ఆ రెండు బాబా చిత్రపటాలే కాక ఆమె వద్ద మరో బాబా చిత్రపటం కూడా ఉండేది. ఆ పటంలో బాబా గోడకు అనుకొని, ఒక చేత్తో కఫ్నీ కొద్దిగా పైకి లాగి పట్టుకొని ఉన్నట్లు నిలబడి ఉంటారు. అవేకాక ఇంకా ఎన్నో బాబా చిత్రపటాలు ఆమె కుటీరంలో ఉండేవి. వాటిలో, బాబా నిల్చుని ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న పటమొకటి కూడా ఉండేది. ఒకసారి ధుమాల్ ఆ చిత్రపటాన్ని తనకు ఇవ్వమని ఆయీని బ్రతిమాలి తీసుకొన్నాడు. అతను ఆ పటాన్ని తీసుకొని ఆయీ ఇంటినుండి మసీదు ముందుగా వెళుతున్నప్పుడు బాబా అతనిని లోపలికి పిలిచి, అతని చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ "ఏమిటిది?" అని అడిగారు. అందుకతను, “ఇందులో మీరున్నారు” అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "ఏదీ, ఇటివ్వు" అంటూ ఆ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కొద్దిసేపు తమవద్ద ఉంచుకుని, దానికేసి తదేకంగా చూశారు. తర్వాత దానిని వెనుకకు త్రిప్పిచూసి, 'దీనిని నీ దగ్గరుంచుకో!' అని అతనికిచ్చేశారు. నిజానికి ఆ పటాన్ని బాబా స్పృశించి ఇవ్వాలని ధుమాల్ తన మనసులో తలచాడు. ఆ చిత్రపటాన్ని చూసినప్పుడల్లా అతనికి, "భావూ, రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నాను, నేను నిద్రపోనేలేదు" అని బాబా తనతో అన్న మాటలే గుర్తుకొచ్చేవి. బాబా స్పృశించి ఇచ్చిన ఆ చిత్రపటాన్ని అతడు ప్రాణసమానంగా చూసుకునేవాడు.
Very nice story.she was blessed by baba.she was dedicated to baba.her life was pain full after her husband death.om sai ram❤❤❤❤
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteOm sairam
ReplyDeleteOm sairam
Om sairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 😊❤😀🕉🙏
ReplyDeleteOm sai ram baba rakshinchu thandri please
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete🙏
ReplyDelete