1. తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించిన సాయి
2. మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు
తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించిన సాయి
ఈ సాయిబాబా బ్లాగును ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న సాయిబృందానికి మరియు ఎంతో ప్రేమతో తమ అనుభవాలను పంచుకుంటున్న సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
బాబా అంటారు కదా, "నా వద్దకు మొదట అందరూ లౌకికమైన కోర్కెలతోనే వస్తారు. కష్టాలు, కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ననుసరించి సన్మార్గానికి వస్తారు" అని. అదే విధంగా బాబా నన్ను అనుగ్రహిస్తున్నారని నాకనిపిస్తుంది. నా పేరు దేవి. మాది గజపతినగరం. పిల్లలకు నైతిక విలువలను బోధించి, వాళ్ళను ఉన్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించడంలో బాబా అడుగడుగునా నాకు ఎలా అండగా నిలిచి సహాయం అందించారో నేనిప్పుడు కాస్త వివరంగా పంచుకుంటాను.
బి.కామ్ డిగ్రీ పూర్తి చేశాక ఆగిన నా చదువుని, వివాహమైన ఏడు సంవత్సరాలకి మా బంధువులలో వరుసకి తమ్ముడి సహాయంతో కొనసాగించి నేను ఎమ్.ఏ.(తెలుగు) చదివేలా, ఒకవైపు అది చదువుతూనే మా ఆడపడుచు ప్రోద్బలంతో ఆమె సేకరించిన పుస్తకాల ఆధారంగా బి.ఎడ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా అనుగ్రహించారు బాబా. అంతేకాదు, వారిద్దరి రూపంలో నన్ను నడిపించింది తామేనని నాకు తెలియజేయటానికి తమ పేరుతో ఉన్న (సాయి సిద్ధార్థ) కాలేజీలో నాకు సీటు వచ్చేటట్టు చేశారు బాబా. ఇలా బాబా తమ అస్థిత్వాన్ని ఋజువుపరచడమే కాకుండా, తమ భక్తులైన మాధవి, పావనిల రూపంలో నాతోనే ఉంటూ, వాళ్ళ విశేష ప్రవర్తన ద్వారా తమ బోధనలను తెలియపరుస్తూ నన్ను తమ మార్గంలోకి నడిపించారు.
నేను నా గత అనుభవంలో, నా స్నేహితురాలు మాధవి నాకు ఒక సాయి విగ్రహాన్ని, సాయిలీలామృతం పుస్తకాన్ని ఇచ్చినట్లు చెప్పాను. ఇక అప్పటినుండి నేను బాబాను నిత్యం పూజిస్తూ, సాయిలీలామృతం పారాయణ చేస్తూ, మా ఇంటికి అతి చేరువలో ఉన్న సద్గురు సాయినాథుని కోవెలకు తరచూ వెళ్తూ, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడ 108 ప్రదక్షిణలు చేస్తుండేదాన్ని. అప్పుడప్పుడు బాబా కోవెల తుడవడం, కడగడం, గురుపౌర్ణమి పర్వదినాన కోవెలలో జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరికీ అన్నప్రసాదాల వడ్డన చేయడం వంటివి చేస్తుండేదాన్ని. ఆ విధంగా తమను సేవించుకునే అవకాశాన్ని బాబా నాకు ప్రసాదించారు. క్షణం కూడా తీరిక లేకుండా బాబా సేవలోనే గడిపిన మరచిపోలేని రోజులవి. అలా బాబా సేవ చేసుకుంటూనే ఒకప్రక్క ఇంట్లో పనులు చూసుకుంటూ, మరోప్రక్క చదువుకుంటూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో నా బి.ఈడి పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేదని బాధపడుతున్న తరుణంలో ఆ పరీక్షలను 3 నెలలు వాయిదాపడేలా చేసి బాబా నన్ను ఆశ్చర్యపరిచారు. 'ఇది నేను నీకు ఇస్తున్న సమయం, బాగా చదువుకో!' అనేలా చదువుకోవడానికి నాకొక మంచి అవకాశాన్ని కల్పించి పరీక్షలు బాగా వ్రాసేలా ఆశీర్వదించారు బాబా.
ఆ వెంటనే టెట్ పరీక్షలు ఉంటాయని పేపరులో వెలువడింది. అయితే టెట్‌కి ఎలా చదవాలో, ఏమేమి ప్రిపేర్ కావాలో ఏ మాత్రమూ అవగాహన లేని నాకు అండగా నేనున్నానంటూ 2012, సెప్టెంబరులో జరగాల్సిన పరీక్షలను దఫదఫాలుగా వాయిదా పడేలా చేస్తూ 2013, మార్చిలో జరిగేలా చేశారు బాబా. ఆలోగా నేను టెట్‌లో భాగమైన తెలుగు, ఆంగ్ల వ్యాకరణాంశాలను సునాయాసంగా బోధించగలిగే ఇద్దరు ఉపాధ్యాయులను నాకు పరిచయం చేసి, వాళ్ళ ద్వారా ఎన్నో మెళకువలు నేర్పించారు బాబా. ‘బాబానే వారి రూపంలో సహాయమందించారు’ అని నేను ఇంత దృఢంగా చెప్పడానికి కారణం, వారిలో ఒకరు సత్యసాయి భక్తులు కావడమే. ఇంకొకరు అతని బంధువు. అలాగే, మిగిలిన సబ్జెక్టులను కూడా చక్కగా నేర్చుకునేలా అనుగ్రహించారు. ఇంతలో నా బి.ఈడి ఫలితాలు వెలువడ్డాయి. నా జీవితంలోనే అప్పటివరకు నేనెన్నడూ సాధించని విజయాన్ని బాబా నాకు అందించారు. కాలేజీకే ఫస్ట్ వచ్చాను నేను. ఆ విజయానికి ఎనలేని ఆనందాన్ని పొందిన నేను బాబా పాదాల వద్ద మ్రోకరిల్లి ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
బాబా ఆశీస్సులతో ఇంకా నా చదువు కొనసాగుతోంది. నా ముఖ్య లక్ష్యమైన డి.ఎస్.సి పరీక్షల స్థాయికి చేరుకోవాలంటే ముందుగా టెట్ క్వాలిఫై అవ్వడం అత్యంత ఆవశ్యకం. కానీ మేము OC కేటగిరీకి చెందినందువల్ల తప్పనిసరిగా 150 మార్కులకు 90 మార్కులు తెచ్చుకోవలసిందే. అప్పుడే నేను నా లక్ష్యం చేరుకుంటాను. అటువంటి కఠిన పరిస్థితుల్లో నేను బాగా కష్టపడి 118 మార్కులు తెచ్చుకునేలా బాబా అనుగ్రహించారు. ఆ క్షణాన నా ఆనందం మిన్నంటింది అంటే అతిశయోక్తి కాదేమో! బాబాపై నాకున్న భక్తిని, చదువుపై నాకున్న శ్రద్ధను చూసి, మా ఎదురింటిలో ఉండే 'సాయి ఆంటీ' నాకు 'సాయి స్తవనమంజరి' పుస్తకాన్ని సంవత్సరంపాటు పారాయణ చేయమని ఇచ్చింది. అప్పటినుండి నేను దాన్ని కూడా ప్రతిరోజూ ఇతర సాయి గ్రంథాలతోపాటు పారాయణ చేయడం మొదలుపెట్టాను.
అంతలో డి.ఎస్.సి నోటిఫికేషన్ వెలువడటానికి సిద్ధంగా ఉందనీ, నోటిఫికేషన్ వెలువడిన మూడు నెలల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తారనీ తెలిసింది. హఠాత్తుగా ఆ విషయం తెలిసేసరికి చదవవలసిన సిలబస్ ఎంతో ఉందని టెన్షన్ మొదలైంది. బాబా ఉన్నారని తెలిసినా నా మీద నాకే ఒక రకమైన అపనమ్మకం. అయితే, దీనికి కూడా బాబా ఏదో ఒక దారి చూపించక మానరనుకున్నాను. అలాగే చూపించారు కూడా! ప్రతిరోజూ బాబాను తలచుకుని, న్యూస్ పేపరులో నా దృష్టి పడిన చోట ఉన్న వాక్యాన్ని బాబా సందేశంగా తీసుకోవడం నాకు అలవాటు. అలాగే ఆరోజు కూడా బాబాను బాగా ప్రార్థించిన తరువాత నా దృష్టి ఈనాడు పేపరులోని 'హాయ్ బుజ్జీ' ఎడిషన్లో 'Guarantee' అనే ఆంగ్ల పదానికి 'అభయం' అనే తెలుగు అర్థం ఉన్న చోట పడింది. నా ఆలోచనలకి, లక్ష్యానికి తగ్గ సమాధానం కనిపించేసరికి నాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా అదే సమయంలో నేను ఎప్పటినుండో కలలుగంటున్న శిరిడీ ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లు తీసుకొచ్చి అకస్మాత్తుగా మా అన్నయ్య నా చేతిలో పెట్టాడు. ఆ టిక్కెట్లను తనివితీరా చూసుకుని త్వరలో బాబా దర్శనం కలుగబోతున్నందుకు ఎంతో మురిసిపోయాను. ఆ టికెట్ల ద్వారా బాబా మరోసారి తమ అభయహస్తాన్ని అందిస్తున్న అనుభూతి పొందాను. సాయి కృపతో మునుపటిలాగే ఈ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. అది బాబా నాకిచ్చిన సువర్ణావకాశంగా భావించాను. నా కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతో మంచి కోచింగ్ సెంటరును ఎంపిక చేసుకుని, చదవడం మొదలుపెట్టాను. ఇక్కడ ఒక విషయం గూర్చి చెప్పుకోవాలి. అదేమిటంటే, ఏ అత్తవారింటిలోనూ ఏ కోడలికీ అందని ఆప్యాయతను, సహకారాన్ని మా అత్తగారు నాకు అందించారు. ఇది అన్నిటికంటే గొప్ప అదృష్టంగా నేను భావించాను. ఇంకా, మా ఆడపడుచు, మా ప్రక్కింటివాళ్ళ సూచనలు, సలహాలతో పరీక్షలకు సిద్ధమయ్యాను. అంతలో పరీక్షలు జరిగే తేదీ కూడా నిర్ధారణ అయింది. అప్పటినుండీ ఒకటే కంగారు. అయితే, నా హాల్ టికెట్లో 'BESIDE SAIBABA TEMPLE' అనే వాక్యంతో బాబా నాపై అపారమైన అనుగ్రహాన్ని చూపి నాలో ధైర్యాన్ని నింపారు. వారి అశీస్సులతో నేను పరీక్షలు బాగా వ్రాశాను. "నా చరిత్రను చదవండి. మిమ్ము చరితార్థులను చేస్తాను" అని చెప్పినట్టుగానే బాబా నా జీవితంలో నేనెన్నడూ ఊహించని విధంగా నాకు జిల్లాలోనే 4వ స్థానాన్ని ప్రసాదించి (జిల్లా మొత్తంలో OC కేటగిరీకి ఉన్నవి కేవలం 7 పోస్టులు) తన అనుగ్రహాన్ని నాపై కురిపించారు. వ్రాసిన మూడు పరీక్షల్లో నేను ఊహించని అధిక గ్రేడ్ ఉన్న ఉద్యోగాన్ని నాకు బాబా ప్రసాదించారు. తుప్పుపట్టిన మా జీవితాలను బంగారుమయం చేయడంలో బాబా మాపై చూపిన ప్రేమను తలచుకుంటుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు. ఆ కరుణాంతరంగునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ...
- మీ భక్తురాలు.
జై బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు
అందరికీ నమస్తే! ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నా అనుభవాన్ని పంచుకుంటాను.
నా పేరు అరుణ. ఒక సంవత్సరం క్రిందట మా నాన్నగారు మాకున్న ఒక భూమిని అమ్మారు. అయితే, డాక్యుమెంటేషన్‌లో లోటుపాట్లు ఉండటం వల్ల మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకుండా ఆగిపోయాయి. అది ఎంతో పెద్ద మొత్తం. దానివల్ల మా నాన్నగారు తీవ్ర ఒత్తిడికి లోనై చాలా ఆందోళనపడుతూ ఉండేవారు. మేమంతా ఒక సంవత్సరం రోజులుగా ఆ పని ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నాము. 2021, జూన్ 24 ఉదయం నిద్రలేవగానే మా అమ్మ ఆ విషయం గురించే మాట్లాడుతూ, "మీ నాన్నగారు అదే పనిమీద తిరుగుతున్నారు. సాయిబాబా ఎప్పుడు కరుణిస్తారో!" అంది. అది వింటూనే, 'ఈరోజు గురువారం కదా! పూజ చేసేటప్పుడు ఈ విషయం గురించి మనస్ఫూర్తిగా బాబాకు విన్నవించుకుని, ఈ పని ఈరోజే పూర్తయితే వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని చెప్పుకుందామ'ని అనుకున్నాను. అనుకున్నట్లే బాబాకు పూజ చేసేటప్పుడు ఎంతో ఆర్తిగా వేడుకున్నాను. తరువాత సుమారు గం.11:30ని.లకి నాన్న ఫోన్ చేసి, "రిజిస్టర్ ఆఫీసులో ఉన్నానమ్మా. దాదాపు పని పూర్తయినట్లే" అని అన్నారు. ఇక చూడండి, నా ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంలో, "బాబా! నాన్న మాకోసం ఈ విషయంలో ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని మీరు అర్థం చేసుకుని పని పూర్తిచేయించారు. నేను మీకు సదా కృతజ్ఞురాలినై ఉంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. 'బాబాను ప్రార్థించిన నాలుగు గంటల్లోనే మీ పని జరిగిపోయిందా?' అని మీకు అనిపించవచ్చు. అయితే, నేను ఎప్పుడూ ఆ విషయం గురించి బాబాను మామూలుగా ప్రార్థించేదాన్ని. కానీ, ఆరోజు పూజలో కూర్చున్నప్పుడు, "బాబా! మీరు ఉన్నారని నాతోపాటు నాన్నకి కూడా అర్థం అయ్యేటట్టు ఈరోజు పని పూర్తి అయిపోవాలి" అని కోరుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టారు బాబా. ప్రతి సాయిభక్తుడు పూర్తి నమ్మకంతో బాబాను అడగాలి. బాబా తప్పకుండా నెరవేరుస్తారు. 2020, నవంబరులో నేను ఈ గ్రూపులో చేరాను. ఎన్నో అనుభవాలు పంచుకున్నాను. బాబాతో నాకు ఉన్న అనుబంధం ఎంతో పెరిగింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, 'బాబా లేకపోతే నేను ఎలా ఉండేదాన్నో!' అని. "బాబా! నా ప్రతి చిన్న విషయంలో కూడా మీ జోక్యం ఉండాలి. మీ ఆశీస్సులు సదా నాపై ఉండాలి బాబా".
మా బాబుకి ఇప్పుడు మూడు నెలల వయస్సు. పుట్టినప్పటినుంచి వాడికి విరేచనానికి సంబంధించిన సమస్య ఉంది. రోజూ కొంచెంగా విరేచనానికి వెళ్తుంటాడు. దానివల్ల వాడికి రాషెస్ వచ్చి విపరీతంగా ఏడుస్తూ ఉండేవాడు. ఈ మూడు నెలల్లో తనను చాలాసార్లు డాక్టరుకి చూపించి, ఎన్నో మందులు వాడాము. కానీ తనకు నయం కాలేదు. ఈ విషయం గురించి నేను ఎప్పుడూ బాబాను అడగలేదుగానీ, రోజూ బాబా ఊదీని వాడికి పెడుతూ ఉండేదాన్ని. అయితే 2021, జూన్ మూడవ వారంలో అనుకోకుండా బాబా ఊదీని బాబు నాలుకపై అంటించడం మొదలుపెట్టాను. ఒక్క నాలుగు రోజుల్లో వాడి విరేచనం సమస్య పూర్తిగా నయమైపోయింది. ఎన్నో మందులకు తగ్గని సమస్య బాబా ఊదీ వలన తగ్గింది. మనం మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు. ఇలాంటి ఎన్నో ఎన్నో అనుభవాలతో మళ్ళీ మళ్ళీ నేను మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram❤❤❤
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏❤😊🌼
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always Be With Me
809 days
ReplyDeletesairam
🌷🌼🌺🙏🙏🙏🙏🌼🌺🌷Om Sri Sairam🌺🌷🌼🌷🌼🌺
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh ki putra santanam kaliginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid normal levels ravali sai
ReplyDelete