సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 850వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నాతోనే ఉన్నట్లుగా నిరూపణ ఇచ్చిన బాబా
2. మేలు చేసే కోరికలన్నీ తీరుస్తున్న బాబా
3. బాబాను ప్రార్థించడం ద్వారా తీరిన ఇబ్బందులు

నాతోనే ఉన్నట్లుగా నిరూపణ ఇచ్చిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. మనం ప్రారబ్ధరీత్యా ఏదైనా కర్మను అనుభవించాల్సి ఉన్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా భగవంతుడు ముందే చేస్తారని నేను నమ్ముతాను. అందులో భాగంగానే రెండు, మూడు నెలల ముందు వరకు ఈ బ్లాగ్ గురించి తెలియని నాకు, బ్లాగ్ గురించి తెలిసేలా చేసి రోజూ చదివేలా చేశారు బాబా. అంతేకాదు, రెండవసారి నా అనుభవాన్ని బ్లాగులో పంచుకునే అవకాశం కూడా ఇచ్చారు బాబా. ఇక నా అనుభవానికి వస్తే ... 


2021, మే నెల అంతా మా కుటుంబానికి ఒక భయానక పీడకలలా గడిచింది. మా అమ్మావాళ్ళ కుటుంబంలో అందరూ, అంటే అమ్మ, నాన్న, తమ్ముళ్లు, మరదలు, వాళ్ళ పిల్లలు కోవిడ్ బారినపడి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు జీవితంలో ఎప్పుడూ అంతటి మానసిక ఆందోళనను అనుభవించలేదు. అయితే బాబా దయవల్ల 'ఎవరికి ఏది మంచిదో అది అనుగ్రహించమ'ని ప్రార్థించే పరిణతి కలిగివున్న నేను అదేవిధంగా బాబాను ప్రార్థించాను. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండని, ఉండలేని ఆదర్శదంపతులైన నా తల్లిదండ్రులను 70 సంవత్సరాల వయసులో బాబా తమలో ఐక్యం చేసుకున్నప్పటికీ, ఎంతో సీరియస్ కండిషన్‌లో ఉన్న ఒక తమ్ముడిని మరియు ఇంకో తమ్ముడిని, వాళ్ళ భార్యాబిడ్డలను (బాబా దయవల్ల వీళ్ళ పరిస్థితి అంత సీరియస్ కాలేదు) కాపాడి మాపై కృప చూపారు. "బాబా! అమ్మానాన్నలిద్దరూ ఇప్పుడు నీతోనే ఉన్నారనీ, వారి ఆశీస్సులు మాపై ఇంకా ఎక్కువగా వర్షిస్తాయనీ నమ్ముతున్నాను. తమ్ముళ్లను కాపాడినందుకు ధన్యవాదాలు బాబా".


బాబా దయతో మా తమ్ముడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన తరువాత ఒక రాత్రి ఖాళీగా ఉన్న బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆరోజు ఏసీ ఆన్ చేసిన తరువాత కాసేపటికి ఆఫ్ చేద్దామని చూస్తే, ఎంత వెతికినా అప్పుడే తీసిన రిమోట్ కనిపించలేదు. అంతటా వెతికి చివరికి నేను బాబాపై భారం వేశాను. రిమోట్ గురించి కాదుగానీ, అప్పటివరకు జరిగిన చెడు పరిణామాల వల్ల బాబా దయ మాపై ఉందో, లేదోనని మనసులో చిన్న అనుమాన బీజం మొలకెత్తినందువల్ల నేను నా మనసులో ఇలా అనుకున్నాను: "ఏం జరుగుతున్నా గానీ, నీవు మాతోనే ఉన్నట్లయితే గనక ఇప్పుడు రిమోట్ దొరికేలా చేయండి. లేదంటే, అది దొరక్కుండా చేయండి బాబా" అని. బాబా అనుగ్రహాన్ని ఒక రకంగా ఆ రిమోట్ వంకగా పెట్టి పరీక్షించాను. కాసేపట్లోనే రిమోట్ దొరికేలా చేసి నాతోనే ఉన్నానని బాబా సందేశమిచ్చారు. "సాయీ! మీరు తప్ప మాకు వేరే దిక్కులేదు. మిగిలిన సమస్యల నుంచి కూడా మమ్మల్ని బయటపడేయండి స్వామీ. మేము ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వు తండ్రీ. నీ మాట ప్రకారమే నడచుకునే స్థిరత్వాన్ని మాకు ప్రసాదించండి బాబా".


ఇలా అనుభవాలు వ్రాసుకుంటూ వెళితే, అన్నీ వ్రాయడం మనవల్ల కాదు. ఎందుకంటే, ప్రతిరోజూ బాబా ఎన్నో సందేశాలు, అనుభవాలు ప్రసాదిస్తూనే ఉన్నారు. అందులో కొన్ని మాత్రమే వ్రాసి పంచుకోగలం. ఈరోజు (జూన్ 24న) కూడా నా ముందు ఒక సమస్య ఉంది. ఆ విషయంలో బాబా చూపిన అనుగ్రహాన్ని చూడండి. ఇది మా అమ్మాయికి సంబంధించినది. ఈరోజు తెల్లవారుఝామునుండి తనకు బాగా విరోచనాలు అవుతున్నందువల్ల ఉదయం 10 గంటలయ్యేసరికి తను బాగా నీరసించిపోయింది. దానికి తోడు కొద్దిపాటి దగ్గు కూడా ఉంది. అప్పటివరకు మా కుటుంబంలో జరిగిన అనుభవాల దృష్ట్యా నేను బాగా కంగారుపడ్డాను. భయమేసి కోవిడ్ టెస్ట్ చెయ్యడానికి రమ్మని పిలిస్తే, వాళ్ళు ఒంటిగంటకి వస్తామని అన్నారు. నేను బాబాను, "రిపోర్టు నెగెటివ్ రావాలి" అని గట్టిగా ప్రార్థిస్తూ బాబా ఊదీని అమ్మాయి నుదుటన పెట్టి, మరికొంత తన నోట్లో వేసి టెన్షన్‌గా టెస్టు చేసేవాళ్ళ కోసం ఎదురుచూడసాగాను. బాబా దయవల్ల సరిగ్గా ఒంటిగంటకి టెస్ట్ చేసే అబ్బాయి వచ్చి, టెస్ట్ చేసి, నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చాడు. "థాంక్యూ వెరీ మచ్ సాయీ. నువ్వు నాతోనే ఉన్నావు".


మేలు చేసే కోరికలన్నీ తీరుస్తున్న బాబా


నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. బాబాకు మాటిచ్చిన ప్రకారం ఈరోజు నేను నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను. నేనొక ఉపాధ్యాయుడిని. ఈ ఉద్యోగం నాకు బాబా కృపవలనే వచ్చింది. నిరంతరం చేసిన ఆయన నామస్మరణ వల్లనే నేను ఆ ఉద్యోగాన్ని పొందగలిగాను. నిజానికి 'ఉద్యోగం వస్తే చాలు, ఏమీ అడగను' అని బాబాతో అన్నాను. కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. అయినా బాబా నాకు మేలు చేసే అన్ని కోరికలూ తీరుస్తున్నారు. అందుకు బాబాకు శతకోటి నమస్కారాలు. 


ఒకసారి నేనొక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నంతనే అదేరోజు నాకు ఆ బాధ నుండి ఉపశమనం కలిగించారు బాబా. ఇప్పటికీ బాబా చూపిన కృపను నేను మరచిపోలేకున్నాను.


ఇటీవల మా అక్క, బావ కరోనా బారినపడి ఆర్థిక భారాన్ని భరించే స్థోమతలేక హాస్పిటల్లో చేరకపోతే, నేను బాబా మీద భారం వేసి, వాళ్ళను మా ఇంట్లో ఉంచుకుని కేవలం టాబ్లెట్స్ ఇచ్చి చికిత్స అందించాను. బాబా దయవలన కేవలం వారం రోజుల్లో వాళ్ళకు కరోనా నెగటివ్ వచ్చి కోలుకున్నారు. అంత త్వరగా తమ ఇంటికి వెళ్లడాన్ని వాళ్లే నమ్మలేకపోయారు. సాయికి అసాధ్యమైనదేదీ లేదు.


ఇక చివరగా, నాకు ఉన్న ఆర్థిక సమస్యలెన్నింటినో బాబా తీరుస్తున్నారు. మనం మన తాహతుకు మించి అప్పులు చేస్తే, దాని ఫలితం అనుభవించి తీరాలి. సాయి చెప్పేది కూడా అదే. ఈ విషయం మరచి మనం అప్పులు చేసి, వాటిని తీర్చలేక సాయిని వేడుకుంటాం. అయితే మన తప్పును తెలుసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే సాయి తప్పక సహాయం చేస్తారు. సాయి మాట వింటే మనం అడగకపోయినా సాయి మన కోరికలు తప్పక తీరుస్తారు. ఇది నా అనుభవం. దయచేసి ఈ విషయం గుర్తుంచుకుని ‘అనవసరమైన అప్పులు చెయ్యవద్దు’ అని సాయి మాటగా చెబుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగువారికి నా ధన్యవాదాలు. శ్రీ సాయినాథునికి నమస్కారాలు.


బాబాను ప్రార్థించడం ద్వారా తీరిన ఇబ్బందులు


నేను సాయిభక్తురాలిని. సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ, తమ భక్తులపై బాబా చూపించే ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాను. తమను నమ్ముకున్నవారి వెంట బాబా ఎల్లప్పుడూ ఉంటారు, వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తొందరగానే దాన్ని తొలగిస్తారు. ఒకరోజు సాయంత్రం నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి, తల తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు నేను, "సాయీ! నా తలనొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సాయిపై నమ్మకంతో టాబ్లెట్ కూడా వేసుకోకుండా పడుకున్నాను. ఉదయానికల్లా నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబా కరుణాకటాక్షాలు మనపై ఉంటే మనం దేన్నైనా జయించగలం. "థాంక్యూ బాబా. తొందరగా ఈ కరోనా మహమ్మారిని ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి ప్రజలందరినీ కాపాడు తండ్రీ!"


ఇంకోరోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నా కడుపు కండరాలు పట్టేసినట్టుగా అయి చాలా ఇబ్బందిపడ్డాను. వెంటనే నేను బాబాను ప్రార్థించి, "నా సమస్య తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నా ఇబ్బంది తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రీ సాయినాథా!"


11 comments:

  1. Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼😊❤

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  7. Baba eroju ma tammudu birthday please bless cheyandi baba

    ReplyDelete
  8. Baba santosh life happy ga vundali thandri

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo