సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 827వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్నట్లే నాన్నకి సునాయాస మరణాన్ని ప్రసాదించిన బాబా
2. సాయి దయవల్ల మావారికి తగ్గిన కరోనా
3. బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకే తగ్గిన జ్వరం

కోరుకున్నట్లే నాన్నకి సునాయాస మరణాన్ని ప్రసాదించిన బాబా

నేను ఒక సాధారణ సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. ఈ బ్లాగ్ గురించి నాకు తెలిసి మూడు నెలలు అయింది. అప్పటినుండి నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలను చదువుతున్నాను. నేను రెండు కోరికలు అనుకుని, అవి నెరవేరితే ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో నా అనుభవాలు పంచుకోవాలనుకున్నాను. కానీ అంతలోనే నాకు ఒక అనుభవం జరిగింది. దాన్నే నేను ఇప్పుడు పంచుకుంటాను. 2021, మే నెలలో మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. మే నెల 3వ తేదీన మా అమ్మ ఫోన్ చేసి, ‘నాన్న ఆహారం తీసుకోలేకపోతున్నారనీ, కేవలం ద్రవపదార్థాలనే తీసుకుంటున్నార’నీ చెప్పింది. వెంటనే మేము అమ్మావాళ్ళింటికి వెళ్లి కొద్దిసేపు నాన్న దగ్గర ఉండి తిరిగి వచ్చాము. ఆ తర్వాత మా అన్నయ్య నాన్నని డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే అక్కడ నాన్నకి గ్లూకోజ్ ఎక్కించారు. దాంతో నాన్నకి బాగుందని అన్నారు. ఎందుకో నాకు మా నాన్నని ఒకసారి చూసి రావాలని అనిపించింది. ఆ విషయం మావారితో చెపితే, ‘సరే, వెళదాము’ అన్నారు. తర్వాత మే నెల 12న మావారు నాతో, ‘వెళ్ళొద్దాం పద!’ అన్నారు. అయితే నేను ‘రేపు వెళ్దాం’ అన్నాను. కానీ కొద్దిసేపటికి, 'రేపు ఎందుకు? ఇప్పుడే వెళ్ళు!' అని నా మనసు చెప్తున్నట్లు అనిపించింది. దాంతో అప్పటికప్పుడు నేను, మావారు, మా పాప బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వెళ్లేసరికి మా నాన్న చాలా బాధపడుతున్నట్లు కనిపించారు. మేము వెళ్ళిన వెంటనే నన్ను, మా పాపని చూసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు, కానీ ఏమీ చెప్పలేకపోయారు. ఆయన పడుతున్న బాధ చూసి జ్వరం ఎక్కువగా ఉందేమోనని కొబ్బరినీళ్లలో టాబ్లెట్ వేసి ఆయన చేత త్రాగించాము. కొద్దిసేపటికి నాన్న అలాగే పడుకున్నారు. మేము కొద్దిసేపు చూసి, వెళ్ళొస్తామని చెప్పడానికి నాన్నని లేపితే ఆయన మేల్కోలేదు. ‘సరేలే, మంచి నిద్రలో ఉన్నట్లున్నారు, మరొక రోజు వస్తామ’ని మేము తిరిగి మా ఇంటికి వచ్చేశాం. ఒక గంట తరువాత అమ్మ ఫోన్ చేసి, "నాన్న చనిపోయారు" అని చెప్పింది. అది విన్న నాకు ఒకప్రక్క నాన్న లేరనే బాధ, మరోప్రక్క ఎవరినీ కష్టపెట్టకుండా నాన్న వెళ్లిపోయారనే సంతోషం కలిగాయి. ఎందుకంటే, నేను రోజూ బాబాని, "మా నాన్న ఎవరికీ బరువు కాకుండా వెళ్లిపోవాలి" అని కోరుకుంటూ ఉండేదాన్ని. అలాగే నాన్న వెళ్లిపోయారు. మరుసటిరోజు వెళదామన్న నా మనసుకి ‘ఇప్పుడే వెళ్ళు’ అనే ప్రేరణనిచ్చి సరైన సమయానికి బాబానే నన్ను మా నాన్న దగ్గరికి పంపించారు. పాపం, నా కోసమే ఎదురుచూస్తున్న నాన్న కొబ్బరినీళ్లు త్రాగి కనులు మూస్తే, మేము ఆయన నిద్రపోతున్నారని అనుకున్నాం. కానీ నిద్రలోనే నాన్న సాయి వద్దకు చేరుకున్నారని తరువాత మాకు తెలిసి వచ్చింది. ఏదేమైనా నేను కోరుకున్నట్లే ఎవరినీ బాధపెట్టకుండా నాన్న వెళ్ళిపోయినందుకు సర్వదా నేను సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.

ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి దయవల్ల మావారికి తగ్గిన కరోనా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు శశికళ. ఈమధ్య జరిగిన ఒక సంఘటనని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, మే నెల మొదటి వారంలో మావారికి కరోనా నిర్ధారణ అయింది. రోజూ టీవీలో వస్తున్న వార్తలు చూసి భయపడిపోయిన నేను మావారికి కరోనా సోకిందంటే నమ్మలేక భయంతో వణికిపోయాను. నేనే కాదు, ఇంట్లో అందరూ చాలా భయపడ్డారు. నాకు తెలిసిన ఒక డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆవిడ, "గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే, మందుల కిట్ ఇస్తార"ని చెప్పింది. దాంతో మావారికి ఆరోజు చాలా నీరసంగా ఉన్నప్పటికీ గబగబా ఆటో మాట్లాడి ఆయనని హాస్పిటల్‌కి పంపాము. ఆయన పాపం ఎండలో రెండు గంటల సేపు నిల్చుని మందుల కిట్ తీసుకుని ఇంటికి వచ్చారు. ఆయన భోజనం చేసిన తర్వాత మందులు వాడడం ప్రారంభించారు. ఆరోజు నుంచి నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. నిరంతరం బాబా నామజపం చేసుకుంటూ, "మావారికి కరోనా తగ్గినట్లయితే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. రాత్రులు నిద్రపట్టక నిరంతరం 'శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే నామాన్ని తలుచుకుంటూ పడుకునేదాన్ని. బాబా దయవల్ల ఐదు రోజులకి మావారికి తగ్గినట్లు అనిపించింది. మేమందరం గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నాము. కానీ అంతలోనే ఆయనకి తలనొప్పి తీవ్రంగా వచ్చింది. డాక్టరుకి ఫోన్ చేసి అడిగితే, "స్టెరాయిడ్స్ వాడాలి" అని చెప్పారు. ఆ టాబ్లెట్లు తెప్పించి మరో నాలుగు రోజులు వాడాము. వాటి ప్రభావంతో 3 రోజులలో మావారికి గుణం కనపడింది. బాబా దయవల్ల ఆయన నెమ్మదిగా కోలుకున్నారు. అయితే నీరసంగా ఉండడం వల్ల మరో పదిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ పదిరోజులు నేను పడ్డ శ్రమ బాబా దయవల్ల ఇట్టే దూరమైంది. నిజంగా బాబా దయ ఎంతో అపారమైనది, అందుకే మావారు ఇంత త్వరగా కోలుకున్నారు. ‘బాబా తమ భక్తుల కష్టాలను దూరం చేసి వారిని ఆదుకుంటారు’ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తొందరగా ఈ ప్రపంచాన్ని వదిలిపోవాలి తండ్రీ. అందరినీ కాపాడండి బాబా".


జై సద్గురునాథ్! జై సాయినాథ్!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకే తగ్గిన జ్వరం


ప్రియమైన సాయిభక్తులందరికీ అనేక ప్రణామాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు. ఇటువంటి అద్భుతమైన 'ఆధునిక సాయిసచ్చరిత్ర'ను నిర్వహిస్తున్న వారి కృషిని, అంకితభావాన్ని మనం లెక్కకట్టలేము. నేను ఒక సాయిభక్తుడిని. మా అబ్బాయి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తను ఉద్యోగం చేస్తున్న సంస్థ ఇంటినుండి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. దాంతో మా అబ్బాయి 2021, మార్చి నెలలో ఇంటికి వచ్చాడు. తన వయస్సు 22 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం తనకు లేదు. అందువలన తను తప్ప మా ఇంట్లోవాళ్ళందరం (నేను, నా భార్య, నా తల్లిదండ్రులు) వ్యాక్సిన్ వేయించుకున్నాము. తరువాత నేను మా అబ్బాయికి కూడా వ్యాక్సిన్ వేయించాలని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే, తను తిరిగి బెంగళూరు వెళ్ళాక హాస్టల్లో ఉండాలి, పైగా తను చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తను వ్యాక్సిన్ వేయించుకోవడం అవసరం. అందువల్ల నేను కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లను సంప్రదించి, మొత్తానికి బాబా దయవల్ల కొంత డబ్బు కట్టి ఒక గురువారంరోజును వ్యాక్సినేషన్ కోసం బుక్ చేశాను. అయితే, భారీ జనసందోహం వలన వ్యాక్సిన్ వేయించుకునేందుకు తను చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు ఆ రోజంతా వేచి ఉన్నాక బాబా దయవలన మా అబ్బాయి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మరుసటిరోజు వేకువఝామున తనకు జ్వరం వచ్చింది. అది వ్యాక్సిన్ వేయించుకున్నాక సాధారణంగా వచ్చే జ్వరమేనని భావించి మేము తనకు డోలో టాబ్లెట్ ఇచ్చాము. కానీ జ్వరం 102 డిగ్రీల వరకు పెరిగింది. కాసేపటికి 103 డిగ్రీలు కూడా అయింది. కొన్ని గంటల వ్యవధిలో మేము డోలో టాబ్లెట్లు చాలా ఇచ్చినప్పటికీ తనకు జ్వరం తగ్గలేదు. తనతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొడుకులు, కూతుళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మా అబ్బాయికి తప్ప ఇంకెవరికీ అంత జ్వరం రాలేదు. రెండవ రోజు కూడా జ్వరం కొనసాగింది. దాంతో నాకు చాలా భయమేసి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. మా అబ్బాయికి బాబా ఊదీనీళ్లు ఇచ్చి, తన నుదుటిపై ఊదీ పెట్టాను. "జ్వరం తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం వలన మరుసటిరోజుకి జ్వరం తగ్గి మా అబ్బాయి సాధారణ స్థితికి వచ్చాడు. ఆనందంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆయన దయవలన ఇప్పుడు నా కొడుకు చాలా బాగున్నాడు. చివరగా నేను భక్తులందరికీ ఒకమాట చెప్తున్నాను: "బాబాపై విశ్వాసం ఉంచండి. ఈ మహమ్మారి పరిస్థితి నుండి మనల్ని రక్షించే కో-వ్యాక్సిన్, కోవిషీల్డ్ బాబా ఊదీయే".



7 comments:

  1. ఓం సా౦ుు బాబా నమస్కారము నీ వున్న తప్ప మాకు వేరే మార్గం లేదు. మమ్ము లను కాపాడు తండ్రి ఓం సా౦ుు నాదాయ నమః. ఓం సా౦ుు బాబా నమస్కారము🙌🙌 ❤❤💕

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadhuru Sai Nadhaya Namaha ❤🕉🙏😊

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  5. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  6. Sai tandri, Naa bidda life bangundela chudu tandri
    Nee Sevakuralu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo