సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 834వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనకోసం పది అడుగులు ముందే ఉంటారు
2. అనుగ్రహించిన బాబా
3. దయామయుడైన సాయితండ్రి కృప

బాబా మనకోసం పది అడుగులు ముందే ఉంటారు


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కరిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. మేము గుంటూరు జిల్లాలో నివసిస్తున్నాము. నేను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు నేను నాలుగు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. బాబా నా జీవితంలో చేసిన మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను. అందులో మొదటిది, ‘సాయిబాబా నాకు ఏ విధంగా ఉద్యోగాన్ని ప్రసాదించారు’ అని. నేను కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్షలు వ్రాసిన మరుసటిరోజు పేపర్లో జవాబులు చూసుకున్నాను. నేను పరీక్షల్లో వ్రాసిన ప్రకారం నాకు 115 మార్కులు వచ్చాయి. అయితే కొంతమంది పోలీసులను కనుక్కోగా వాళ్ళు, “118 మార్కులు వస్తే ఉద్యోగం రావచ్చు” అని చెప్పారు. అప్పటికి నాకు బాబా ఎవరో, బాబా చరిత్ర ఏమిటో తెలియదు. అసలు నేను బాబా గుడికి కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లి ఉన్నాను. అదికూడా, గతంలో అయ్యప్పస్వామి మాల వేసుకుని ఉండగా అన్ని గుళ్లకు వెళుతూ సాయిబాబా గుడికి వెళ్లాను. అదేవిధంగా, గతంలో మా బంధువుల మధ్య ఒక స్థలం విషయంలో సమస్య ఎదురైనప్పుడు నాకు తెలియకుండానే, “ఈ సమస్య పరిష్కారం అయితే శిరిడీ వస్తాను” అని మనసులోనే బాబాతో చెప్పుకున్నాను. తర్వాత ఆ సమస్య నాకు అనుకూలంగా పరిష్కారమైంది. కానీ మానవ సహజంగా నేను శిరిడీ వెళ్లకుండా వాయిదా వేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు, ‘ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి నాకు వచ్చే మార్కులు సరిపోవు’ అని తలచి బాధపడుతూ ఉండగా ఒకరోజు రాత్రి నాకు కలలో బాబా కనిపించి, “ఒక గుడిలో అన్నదానం జరుగుతోంది, వచ్చి తింటావా?” అని అడిగారు. నేను ‘తింటాను’ అని చెప్పాను. బాబా నన్ను ఆ గుడిలోకి తీసుకుని వెళ్లారు. గుడిలోకి వెళుతూ ఉండగా, గుడిలో అటువైపు ఇటువైపు చిరిగిన వస్త్రాలలో పేదలు, భిక్షాటన చేసేవారు, కొంతమంది రోగగ్రస్తులు కూర్చుని అప్పటికే భోజనం చేస్తుండటం గమనించాను. నేను వారిని చూస్తూ, “ఏంటి, ఈయన వీరి మధ్యలో నన్ను కూర్చోమంటున్నాడు?” అని అసహ్యించుకుంటూనే వారితో పాటు అక్కడ కూర్చున్నాను. తరువాత బాబా నాకు భోజనం పెట్టారు. నేనేమో భోజనం అంటే అన్నం, కూర, పప్పు ఇలాంటివి పెడతారని అనుకున్నాను. కానీ బాబా నాకు మజ్జిగన్నం మాత్రమే పెట్టారు. నేను, “ఈ మజ్జిగన్నం పెట్టారేంటి?” అనుకుంటూ, ఇష్టం లేకుండానే నోట్లో పెట్టుకోగా అది అమృతంలాగా ఎంతో రుచిగా ఉన్నది. నా కడుపు నిండిపోయింది. నేను మనసులో, “నాకు కడుపునిండా అన్నం పెట్టారు, నేను వీరికి ఋణపడి ఉంటాను” అని అనుకున్నాను. తరువాత బాబా నాతో, “నా గుడికి వెళ్తావా?” అని అన్నారు. “మీ గుడి ఎక్కడో చెప్తే వెళ్తాను” అన్నాను నేను. అప్పుడు బాబా తన వ్రేలితో ఒకవైపు చూపుతూ,అదిగో నా గుడి, చూడు” అని చెప్పారు. నేను అటువైపు చూడగానే నాకు మూడు శిఖరాలున్న ఒక పాత గుడి కనిపించింది. వెంటనే నేను, నా ఫ్రెండు కలిసి ఆ గుడికి వెళ్ళాము. అంతలో కల చెదిరిపోయింది. నేను వెంటనే బాబాపై నమ్మకంతో, “బాబా! నువ్వే నాకు ఉద్యోగం ఇప్పించాలి. అందుకోసం నేను ముందుగానే నీ శిరిడీకి వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాను” అని బాబాకు చెప్పుకుని, మరుసటిరోజే నా ఫ్రెండుతో కలిసి బయలుదేరి శిరిడీ వెళ్ళి బాబాను కనులారా దర్శించుకున్నాను. తరువాతి నెలలో ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల రిజల్ట్స్ ప్రకటించారు. నేను బాబాను తలచుకుంటూ మార్కులు చూసుకొంటే, నాకు 118 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 117 మార్కులకు కటాఫ్ పెట్టారు. నేను బాబాను నమ్మి ముందుగానే శిరిడీ వెళ్లి వచ్చినందుకు బాబా ఎంతో కరుణతో మూడు మార్కులు కలిపి నాకు ఉద్యోగాన్ని ప్రసాదించారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. 


రెండవ అనుభవం:


2021, మే 21వ తేదీన నాకు ఒళ్ళునొప్పులు, తలనొప్పి వచ్చాయి. మా బాబుకి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఇద్దరం రక్తపరీక్ష చేయించుకోగా మా బాబుకి, నాకు టైఫాయిడ్ అని వచ్చింది. టైఫాయిడ్ చికిత్సలో భాగంగా మేమిద్దరం ఇంజక్షన్లు చేయించుకున్నాము. మా బాబుకి టైఫాయిడ్ తగ్గిపోయింది. కానీ, నాకు 27 తేదీన తల తిరుగుతూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకున్నాను. 93 పాయింట్లు ఉన్నాయి. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా, నాకు పాజిటివ్ అని వచ్చింది. నేను వెంటనే మా బాబుకి, ఇంట్లోవారికి కోవిడ్ టెస్ట్ చేయించగా వారందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే ఉండి సాయిని ప్రార్థించి యూట్యూబ్ చూడగా, అందులో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి Methylprednisolone 4mg Tablet అనే ఒక టాబ్లెట్ పేరు చెప్పారు. నేను వెంటనే ఆ టాబ్లెట్ తెప్పించుకుని వేసుకున్నాను. ఒక్క అరగంటలోనే నా ఆక్సిజన్ లెవెల్స్ 98కి పెరిగాయి. ఆ టాబ్లెట్ వేసుకుంటే హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే నా ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడూ 98 ఉన్నాయి. ఇంకా నేను రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ecosprin75mg tablet అనే టాబ్లెట్ వేసుకున్నాను. ఈ రెండు టాబ్లెట్స్ వాడి నేను కరోనా నుంచి కోలుకున్నాను. బాబా ఆ విధంగా నన్ను రక్షించారు


కరోనా తగ్గిన తరువాత నా ఎడమకాలిలో బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తక్కువగా ఉన్నట్లు కాలు లాగుతున్నట్లు అనిపించగా నేను బాబాకు చెప్పుకుని, d-daimar రక్తపరీక్ష చేయించి, ‘రిజల్ట్స్ నార్మల్‌గా వచ్చేటట్లు చెయ్యమ’ని పరిపరివిధాల బాబాను ప్రార్థించాను. “ప్రతి గురువారం కనీసం ఒకరికి భోజనం పెడతాను” అని మ్రొక్కుకొని, “ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాతో చెప్పుకున్నాను. బాబాను నమ్ముకున్న తరువాత మనం భయపడాల్సిన పనిలేదు. ఆవుదూడ కోసం ఆవు పరిగెత్తుకొని వచ్చినట్లు బాబా మనకోసం పది అడుగులు ముందే ఉంటారు. బాబా దయవల్ల ఆ రిపోర్ట్స్ నార్మల్‌గా వచ్చాయి. సాయిబాబాకు, ఈ ‘సాయి నూతన సచ్చరిత్ర’ చదువుతున్న సాయిబంధువులకు మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.


అనుగ్రహించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. సాటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను నా గత అనుభవంలో నా కుటుంబసభ్యుల ఆరోగ్య నిమిత్తం 11 వారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టానని చెప్పాను. బాబా దయవలన నా కుటుంబసభ్యులకు ఆరోగ్యం చేకూరి ఇప్పుడు అందరూ బాగున్నారు. అయితే, నా 11 వారాల పూజలో భాగంగా 2021, జూన్ 3న 6వ గురువారం పూజ చేయాల్సి ఉండగా, ఆరోజు ఉదయం కళ్ళుతిరగడం, ఒళ్ళునొప్పులతో నేను కాస్త అనారోగ్యం పాలయ్యాను. ఆ స్థితిలో బాబా పూజ చేయలేనని చాలా బాధేసి, "బాబా! నువ్వే కాపాడు. ఎలాగైనా పూజ చేయించుకో తండ్రీ" అని బాబాను వేడుకుంటూ పడుకున్నాను. బాబా అపారమైన దయ చూపించారు. కేవలం 10 నిమిషాల్లో నాకు కాస్త మెరుగ్గా అనిపించింది. దాంతో ఆనందంగా ఆరవవారం దివ్యపూజ పూర్తి చేసి, బాబాకి ఇష్టమైన కిచిడీ చేసి, ఆయనకి నివేదించాను. తరువాత 'అదేరోజు బ్లాగులో నా అనుభవాలు పబ్లిష్ అయ్యాయి' అన్న మెసేజ్ చూసి చాలా సంతోషపడ్డాను. "శతకోటి నమస్కారాలు బాబా. సాటి సాయిభక్తుల అనుభవాలను చదువుకోవడానికి, అలాగే మా అనుభవాలను అందరితో పంచుకోవడానికి చక్కని బ్లాగును మాకిచ్చారు. అందుకు చాలా ఆనందంగా ఉంది బాబా".


మరో అనుభవం:


ఈమధ్య మా అక్క, బావ, వాళ్ళ అబ్బాయి కరోనా బారినపడ్డారు. మా అక్క, బావ వయసు 80కి పైనే. మా కుటుంబంలోని అందరమూ చాలా భయపడ్డాము. వాళ్ళుండేది ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం. ఎవరమూ వెళ్లలేని పరిస్థితి అయినందున బాబా చూసుకుంటారనే ధైర్యంతో రోజూ వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ దైర్యం చెప్తుండేవాళ్ళం. అయితే ఒకరోజు సుమారు ఐదారు గంటల పాటు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అక్కడ పరిస్థితి ఏంటో అర్థంకాక మేమంతా చాలా ఆందోళన చెందాము. చివరికి, అక్కడికి దగ్గరలో ఉండే వాళ్ళ పెద్దబ్బాయి ధైర్యం చేసి, బాబా నామస్మరణ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. మనసులో "ఫోన్ లిఫ్ట్ చేయాలి బాబా" అని అనుకుంటూ, మరోప్రక్క వాళ్ళకి ఫోన్ చేస్తూ ఇంటి గేటు దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, "మేము క్షేమంగా ఉన్నామ"ని చెప్పారు. సుమారు ఐదారు గంటలపాటు పడ్డ టెన్షన్ చివరి రెండు నిమిషాల్లో బాబా దయవల్ల పోయింది. ఇప్పుడు వాళ్లందరికీ కరోనా తగ్గి క్షేమంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా! మిమ్మల్నే నమ్ముకున్నాము. ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండి నడిపించండి".


దయామయుడైన సాయితండ్రి కృప


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు లలిత. ఆ చల్లని తండ్రి దయ ఎప్పటికీ మనందరికీ రక్షగా ఉండాలని కోరుకుంటూ బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, జూన్ 6, ఆదివారంనాడు నాకు చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. నాకు మామూలుగానే సైనస్ ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి అందుకు సంబంధించి తలనొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకున్నాను. అయితే సాయంత్రానికి జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చేశాయి. అసలే కరోనా సమయం కావడంతో నాకు చాలా భయమేసింది. బాబా నామస్మరణ చేసుకుంటూ బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. తరువాత, "బాబా! నాకు తొందరగా తగ్గిపోయేలా చేయండి" అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. కానీ మా పిల్లలు కరోనా భయంతో నాకు కరోనా టెస్టు చేయించారు. నేను, "బాబా! మీరే నన్ను కాపాడాలి. రిపోర్ట్ నెగిటివ్ వచ్చేలా చేయండి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. దయామయుడైన నా సాయితండ్రి నన్ను కాపాడారు. రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. ఆరోజే జ్వరం, తలనొప్పి పూర్తిగా తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీ బిడ్డలందరినీ ఇలాగే కాపాడండి బాబా".


11 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😀😊🙏🕉

    ReplyDelete
  2. Om sai ram today's experiences are nice. Sai baba increased marks that sai leela i liked very much.he takes care of all devotees.no worry sai is there to save us. Om sai baba❤❤❤

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Kothakonda SrinivasJuly 13, 2021 at 11:56 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  5. ⚘🌺🌷🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌷🌺⚘ 🌺🌺Om Sri SaiRam 🌺🌺

    ReplyDelete
  6. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  7. Om sai ram baba Amma arogyam bagundali thandri please

    ReplyDelete
  8. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  9. Baba santosh Carrier bagundali thandri

    ReplyDelete
  10. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo