సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1125వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినా కాపాడిన బాబా
2. చల్లగా కరుణించిన బాబా
3. బాబాని తలచుకుంటే చాలు

అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినా కాపాడిన బాబా


నా పేరు హరిప్రియ. నాకు మరలా మన బ్లాగులో అనుభవం పంచుకునే అవకాశం కల్పించిన మన తండ్రి సద్గురు బాబాకి అనేక శతకోటి వందనాలు. ఈమధ్య, అంటే 2022, ఫిబ్రవరి - మార్చి ప్రాంతంలో ఒక నెలరోజులపాటు బాబా నాకు, 'ఆందోళన చెందకు', 'నా నామస్మరణ చేయి', 'పారాయణ చేయి', 'బిడ్డలు తప్పుచేస్తే మనమే సరిదిద్దాలి' వంటి సందేశాలు ఇస్తుండేవారు. నేను గత కొద్దికాలంగా మా కుటుంబంలో జరుగుతున్న కొన్ని గొడవల వలన బాబా అలాంటి సందేశాలు ఇస్తున్నారేమో అనుకున్నాను. అయితే అనూహ్యంగా మా అమ్మాయి కొన్ని ఇబ్బందులలో ఇరుక్కుంది. ఆ విషయం తను కూడా గ్రహించలేదు. అసలు విషయమేమిటంటే, క్రిస్మస్ సందర్భంగా మా అమ్మాయి తన ఫోటోలను, తన కుటుంబం ఫోటోలను మరియు మా మనవడి ఫోటోలను తన కాలేజీ స్నేహితులందరూ ఉండే ఒక గ్రూపులో పోస్ట్ చేసింది. ఆ గ్రూపులోని ఒక అబ్బాయి ఆ ఫొటోలలో నుండి మా అమ్మాయి విడిగా ఉన్న ఫొటోలని మార్చి అసభ్యంగా ఎడిట్ చేసి తన స్నేహితులకి పంపి, తనని ఇష్టపడుతున్నట్టు చెప్పాడట. ఈ సంగతులేవీ ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఎవరికీ తెలియవు. ఆరోజు గ్రూపులో ఒకరి ద్వారా మా పాపకి విషయం తెలిసింది. అది కేవలం బాబా దయవల్లనే. అదేరోజు నాకు ఆ విషయం తెలిసింది. వెంటనే నేను, "బాబా! ఏమి జరిగినా ఆడపిల్లనే అంటారు. అసలే ప్రేమపెళ్ళని అందరూ తనని వదిలేశారు. ప్రభువైనా, నువ్వైనా ఒకటే కదా. తన కష్టం తీర్చు బాబా" అని బాబాను ప్రార్థించసాగాను. మా అల్లుడు, మా బాబు వారంరోజులపాటు తీవ్రంగా ప్రయత్నించి ఆ పని చేసినవాడిని పట్టుకున్నారు. కానీ వాడి ఫోన్లో ఫోటోలు వంటివేమీ లేకపోవడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేశారు. ఏ గొడవ లేకుండా కష్టం తీరిపోయిందని అనుకున్నాను నేను. కానీ మార్చి 4వ తేదీన ఆ వెధవపని చేసినవాడి స్నేహితుని దగ్గర కొన్ని ఫోటోలు దొరికాయి. మా అల్లుడు ఆ విషయం మా వరకు రానివ్వకుండా ఒక రాజకీయ నాయకుని కొడుకు ద్వారా వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇప్పించి వాటిని డిలీట్ చేయించారు. కానీ ఇంకెంతమంది దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయో తెలియదు. ఆ బాధతో మా అమ్మాయి నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో మింగేసింది. ఇవేమీ నాకు తెలియవు. ఆరోజు రాత్రి 10.30కి మా అమ్మాయి నాతో మాట్లాడింది. 11 గంటలకి నేను నిద్రపోయాను. ఎందుకంటే, నేను అప్పటికి రెండురోజుల ముందునుంచి టెస్టులకోసం ఎయిమ్స్ హాస్పిటల్‍కి తిరుగుతున్నాను. ఇకపోతే, నిద్రలో ఉన్న నాకు గుండెనొప్పి వచ్చినట్టు, బాబా నాతో, "ఈ సమయం వెళ్ళిపోతుంది. మంచి సమయం వస్తుందని నిరంతరం అనుకో" అని అన్నారు. నిద్రలో నేను ఆ మాటలనే అనుకుంటున్నాను. అంతలో 11.30కి నాకు ఫోన్ వచ్చి విషయం తెలిసింది. కానీ అప్పటికే బాబా నన్ను సిద్ధం చేసి ఉన్నందువల్ల నేను పె‍ద్దగా భయపడలేదు. 12 నుండి 13 నిద్రమాత్రలు మింగిన మా అమ్మాయిని బాబా కాపాడారు. నిద్రమాత్రలు మింగినా కేసు వంటివి లేకుండా మరుసటిరోజు సాయంత్రం అమ్మాయి ఇంటికి వచ్చింది. తనిప్పుడు సురక్షితంగా ఉంది. అలానే, ఒకటిన్నర సంవత్సరం వయసున్న తన చిన్నబాబుని కూడా బాబా ఆరోజు రోడ్డు మీద వెళ్తుంటే బండిమీద నుండి పడిపోకుండా కాపాడారు. బాబా దయవలన ఈరోజు నేను సంతోషం అనే దానికంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే, అంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా బాబాడాడీ నా కంటి నుంచి ఒక చుక్క నీటిని రానివ్వకుండా నాకు ధైర్యం ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. నా బిడ్డలాంటి అందరికీ ధైర్యం ఇవ్వండి బాబా"


అసలు ఈ అనుభవం ఎందుకు పంచుకున్నానంటే, ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. నా బిడ్డలాంటి ఎందరో ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. అందరికీ ఈ అనుభవం ద్వారా బాబా ఇచ్చే సందేశమే ఇది - 'ఈ సమయం వెళ్ళిపోతుంది. మంచి సమయం వస్తుంది. చెడ్డవాళ్ళు వేరేగా ఉండరు. మన స్నేహితులు, చుట్టాలు, తెలిసినవాళ్ళలా మనతోనే ఉంటారు. చెడు జరిగితే భయపడి ఇంకో తప్పు చేసి బిడ్డలను, కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. మీరు నమ్మిన దైవానుగ్రహం మీకు తోడు వస్తుంది. సమస్యని ధైర్యంగా ఎదుర్కోండి. బాబా అనుగ్రహం అందరిపైనా సమంగా ఉంటుంది. స్టేటస్‍లోనూ మరియు ఫ్రెండ్స్ గ్రూపులోనూ ఫోటోలు పెట్టేముందు ఒకసారి ఆలోచించండి'.


చల్లగా కరుణించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారిపై బాబా అనుగ్రహం వర్షించాలని కోరుకుంటున్నాను. రోజూ ఈ బ్లాగులో ప్రచురితమవుతున్న అనుభవాలు చదువుతుంటే సాయితో ఉన్నట్టే అనిపిస్తుంది. నేను ఇంతకుముందు రెండు అనుభవాలు పంచుకున్నాను. ఇది మూడవ అనుభవం. 2021, ఏప్రిల్ నుంచి 2022, మార్చి 16 వరకు నేను యు.ఎస్.ఏలోని డెట్రాయిట్‍లో ఉన్నాను. మేము 2021, నవంబర్, డిసెంబర్ నెలలో ట్రిప్‍కి వెళ్లాలని అనుకున్నాము. కానీ కరోనా వల్ల చాలా భయపడి 'అందరి ఆరోగ్యాలు బాగుండాలని, ఎవరికీ ఏమీ కాకుండా చూడమ'ని బాబాతో చెప్పుకుని సాయి దివ్యపూజ చేసుకుని ట్రిప్‍కి వెళ్ళాము. ముందుగా 2021, నవంబరులో మా అమ్మాయి, అల్లుడు, పిల్లలు, ఇంకా నేను దారిలో పలు ఇతర ప్రదేశాలు చూసుకుంటూ వెళ్లొచ్చని కారులో డల్లాస్‍కి బయలుదేరాము. అక్కడ మా బావగారి అబ్బాయి ఉంటున్నాడు. దారిలో కొన్ని హోటల్స్‌లో ఉన్నాము. కరోనా పరిస్థితుల వల్ల భయమేసినా బాబా ఉన్నారని ఆయన మీదే భారం వేశాము. తరువాత డిసెంబరులో ఫిలడెల్ఫియా, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలని వెళ్ళాము. అప్పుడు కూడా సాయినే నమ్ముకున్నాము. చివరిగా పిట్స్‌బర్గ్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము. సాయి కృపవల్ల మా ట్రిప్ అంతా జాలీగా గడిచిపోయింది. పిలిస్తే పలికే దైవం సాయి. మమ్మల్ని చల్లగా కరుణించారు. 2022, మార్చి 16న మేము ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యాము. ప్రయాణంలో నేను సాయిసచ్చరిత్ర, సాయిభక్తుల అనుభవాలు చదువుకున్నాను. ఫ్లైట్ జర్నీలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సాయి చూసుకున్నారు. మేము యు.ఎస్.ఏలో మొత్తం ఒక సంవత్సరం ఉన్నాము. ఈ సంవత్సరకాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇండియాకి తిరిగి వస్తే శిరిడీ దర్శనం చేసుకుంటానని అనుకున్న నేను ప్రస్తుతం ఆయన దర్శనం కోసం ఎదురుచూస్తున్నాను.


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబాని తలచుకుంటే చాలు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈమధ్య మాకు తెలిసిన ఒక పంతులుగారు మా అమ్మాయి విషయంలో ఉన్న దోషనివారణార్థం "కర్ణాటకలో ఉన్న శ్రీకొక్కె సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి, అమ్మాయి చేత పూజ చేయించమ"ని చెప్పారు. 500 కిలోమీటర్ల దూరం నేను, నా కూతురే పోవాలంటే ఎలా అనిపించి బాబాతో, "మాకు ఎవరినైనా తోడు పంపించండి బాబా, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. తరువాత మనసులో బాబాను తలచుకుంటూ, తిరుపతిలో ఉన్న మా మరిదికి ఫోన్ చేసి, విషయం చెప్పి "మాకు తోడుగా రమ్మ"ని అడిగాను. అతను వెంటనే, "సరే వదినా" అని చెప్పి, తన పనులన్నీ పక్కన పెట్టి మాకు తోడుగా వచ్చారు. బాబా దయవల్ల పూజ పూర్తి చేసుకుని, మా యాత్ర జయప్రదంగా ముగించుకుని ఇంటికి వచ్చాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను సాయికోటి రాస్తున్నందువల్ల ఇన్నిరోజులూ నా అనుభవాన్ని పంచుకోలేకపోయాను. ఆలస్యమైనందుకు క్షమించండి బాబా.  మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే బాబా. నా కొడుకుకి అన్ని విషయాలలో తోడుగా ఉండండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1124వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదు
2. బాబా దయవల్ల విజయవంతమైన కంటి ఆపరేషన్
3. గొంతు సరిచేసి మనసారా తమని కీర్తించే భాగ్యాన్నిచ్చిన బాబా

సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదు


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. బ్లాగు ద్వారా బాబా మాకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను తోటి భక్తులందరితో పంచుకునే చక్కటి అవకాశం ఏర్పరిచిన బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇదివరకు బ్లాగులో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య జరిగిన మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణం జరిగే సమయానికి మా కుటుంబమంతా అక్కడికి వెళ్లి కొన్నిరోజులు ఉంటుంటాము. అలాగే ఈ సంవత్సరం(2022) ఫిబ్రవరిలో వెళ్ళాము. ప్రయాణానికి ముందు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "ప్రయాణమంతా సంతోషంగా, సౌఖ్యంగా సాగి స్వామి దర్శనం బాగా జరగాలి బాబా. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలి. అలాగే మేమందరమూ క్షేమముగా తిరిగి ఇంటికి చేరుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా ప్రయాణం సౌకర్యవంతంగా సాగింది. స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయము ఉండదు.


తరువాత ఒకరోజు నేను బయటకి వెళ్తుంటే ఎంత ప్రయత్నించినా నా హ్యాండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ అవలేదు. అప్పుడు నేను నా మనసులో, 'బ్లాగులో అందరూ తమకి జరిగిన ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు గురించి  పంచుకుంటుంటారు కదా సాయి' అని అనుకుంటూ ప్రయత్నిస్తే జిప్ ఓపెన్ అయింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్నిసార్లు అలా తలుచుకోగానే పనులు జరిగేలా చేసేస్తారు సాయి.


అదేరోజు మేము మా పెద్దమ్మవాళ్ళింటికి వెళ్తుంటే, నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, పెద్దమ్మవాళ్లు ఉండే వీధిలో కుక్కలు ఎక్కువగా ఉంటాయి. అవి రాత్రి వేళల్లో ఒక్కోసారి బయటవాళ్లని కరుస్తుంటాయి. అందువల్ల నేను, "పెద్దమ్మ వాళ్ళింటికి చేరుకునే వరకు అక్కడ కుక్కలు లేకుండా చూడండి బాబా" అని అనుకుంటూ వెళ్ళాను. బాబా దయవల్ల ఆరోజు అక్కడ కుక్కలు లేవు. మేము సురక్షితంగా పెద్దమ్మవాళ్ళింటికి చేరుకున్నాము. ఇప్పుడే కాదు, బయటకి వెళ్ళిన ప్రతిసారీ(ట్రాఫిక్‍లో) బాబాని తలుచుకుంటే ఏటువంటి ఇబ్బంది రానివ్వరు.


శివరాత్రి రోజున మేము పట్టిసీమ వెళ్ళాము. వెళ్ళేముందు ఇంట్లో నేను, "సాయీ! దర్శనం బాగా అయ్యేట్లు చూడు" అనుకున్నాను. నిజంగా ఎంత బాగా దర్శనం జరిగిందంటే, మాటల్లో చెప్పలేను. మాకు తెలిసినవాళ్ళు చాలామంది దర్శనం చేసుకోకుండానే తిరిగి వచ్చేసినా బాబా దయవలన మాకు మాత్రం చక్కటి దర్శనం జరిగింది. "బాబా! ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు నన్ను క్షమించండి. ఎప్పటికీ నాకు రక్షగా ఉండి ముందుకి నడిపించు తండ్రి. తొందరలో నా ముందున్న జీవితానికి సంబంధించిన సమస్యను తొలగించి ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకునేలా ఆశీర్వదించండి తండ్రి".


బాబా దయవల్ల విజయవంతమైన కంటి ఆపరేషన్


నా పేరు లక్ష్మి. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. బాబా పాదాలకి నమస్కరిస్తూ ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. అయితే చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇంకా సాయి భక్తుల అనుభవాలను ప్రచురిస్తున్న సాయికి ధన్యవాదాలు. కరోనాకు ముందు నా కళ్ళు చెక్ చేయించుకుంటే నార్మల్ గానే ఉన్నాయి. ఆరునెలల తేడాలో మళ్ళీ చూపించుకుంటే, "ఆపరేషన్ చేయాల"ని అన్నారు. నేను ఇంజక్షన్‍కి కూడా భయపడతాను. అలాంటిది ఏకంగా ఆపరేషన్ అనేసరికి నేను ఇంకా భయపడిపోయాను. ఆ భయం వలన 2020, ఆగస్టులో ఆపరేషన్ చేయాలని చెప్తే, 2021, డిసెంబరు వరకు ఆపరేషన్ చేయించుకోడానికి నేను సిద్ధపడలేదు. చివరికి బాబా మీద భారమేసి, ఆయన్నే తలుచుకుంటూ ఆపరేషన్ చేయించుకుంటే ఆయన దయవల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. అస్సలు నొప్పి తెలియలేదు. ఇంకో విషయం ఆపరేషన్‌కి ముందు "చూపు వస్తుందన్న గ్యారంటీ ఇవ్వలేము" అని చెప్పిన డాక్టరు, సర్జరీ అయ్యాక నా భర్తతో "ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆవిడ బాగా కో-ఆపరేట్ చేశారు" అని చెప్పారు. అంతా బాబా దయ. బాబానే దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. పదవరోజున చెకప్‌కి వెళ్తే, పూర్తిగా కనిపించలేదు. దాంతో నేను, మావారు, డాక్టరు చాలా భయపడ్డాము. అప్పుడు, "బాబా! నా కన్ను నార్మల్ అయితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మళ్లీ వారానికి నా కన్ను నార్మల్ అయి స్పష్టంగా కనిపించసాగింది. బాబా అండ ఉంటే, మనకి భయం ఏముంటుంది? బాబా మనందరికీ తోడు-నీడలా ఉంటూ కాపాడాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా"..


గొంతు సరిచేసి మనసారా తమని కీర్తించే భాగ్యాన్నిచ్చిన బాబా.


సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా అందరినీ బాబాకు ఎంతో దగ్గర చేస్తున్న సాయికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు అరుణలక్ష్మీ. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం నాసాయి తండ్రి. నేను రోజూ నా దినచర్యలో జరిగేవన్నీ బాబా చిత్రపటం వద్ద  చెప్పుకుంటాను. నా ప్రతిమాట బాబా వింటూ ఉంటారని భావిస్తాను. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఈ బ్లాగు ద్వారా నా అనుభవం మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు బాబా భజనలలో పాడడం అంటే చాలా ఇష్టం. అయితే కొన్ని నెలల క్రితం నాకు బాగా ఎక్కువగా దగ్గు వచ్చేది. అవి కరోనా రోజులు కావడం వలన నాకు చాలా భయమేసింది. డాక్టరుకి చూపించుకుని మందులు వాడాను. బాబా దయవలన దగ్గు తగ్గిందికాని, తీవ్రమైన దగ్గువల్ల గొంతు దెబ్బతింది. అందువల్ల దగ్గు తగ్గినా నేను పాటలు పాడలేకపోయేదాన్ని. నాకు చాలా బాధ కలిగి, "బాబా! మిమ్మల్ని పాటల ద్వారా కీర్తించడం నాకు అలవాటు. నా గొంతు సరిచేసి మీ పాటలు పాడే అవకాశం నాకివ్వు తండ్రి" అని బాబాను దీనంగా వేడుకున్నాను. అద్భుతం! కొద్ది రోజులకే నా గొంతు బాగైంది. ఇప్పుడు మనసారా బాబాను గానంతో స్మరించుకుంటున్నాను. "సాయిబాబా మీ కృపకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నేను మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను తండ్రి".






సాయిభక్తుల అనుభవమాలిక 1123వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతిక్షణం తోడుండే బాబా
2. నాన్న ఆరోగ్యం విషయంలో బాబా చేసిన సహాయం
3. బాబా దయ

ప్రతిక్షణం తోడుండే బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిక్షణం తోడుగా ఉండి మన బాధలను తీర్చే సాయికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకరోజు నేను రోడ్డు మీద ప్రయాణిస్తూ మన 'సాయి మహారాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో ఈ క్రింది ఆర్టికల్ చదివాను. 


భక్తుడు: బాబా అనుగ్రహం వలన మనం సహాయం పొందినప్పుడు, బాబానే మనకు సహాయపడ్డారని మనకెలా తెలుస్తుంది?


🌹గురువుగారు: బాబా ఆ విషయం మీకు స్పష్టంగా తెలిసేటట్లు చేస్తారు. అది బాబా పద్ధతి. ఆయన మీకు ఏదైనా ఇవ్వడమే కాదు, అది తామే ఇచ్చామని మీకు తెలిసేటట్లు చేస్తారు కూడా! బాబా ఇచ్చే అనుభవాలు ఎంతో స్పష్టంగానూ మీరు మరోరకంగా అనుకోవడానికి వీలు లేకుండానూ ఉంటాయి. ఈ దృష్ట్యా బాబా ఇచ్చే అనుభవాలు అద్వితీయమైనవి. మీరు బాబాను ఏదైనా అడిగినప్పుడు, అది బాబానే ఇచ్చారు అనే విషయం మీకు ఎలాగోలా తెలుస్తుంది. ఎవరో ఒకతనికి  ఒక ప్రమాదం జరుగుతుంది. కారు పల్టీలు కొట్టినప్పటికీ లోపల ఉన్న అతను ఎటువంటి దెబ్బలూ  తగలకుండా బయటపడతాడు. వెంటనే అతనికి ప్రక్కన పోతున్న వేరే కారు కనిపిస్తుంది. దాని మీద అతనికి బాబా ఫోటో కనిపిస్తుంది  "నేను నీ వెనుకనే ఉన్నాను, నేను నిన్ను రక్షించాను" అని అభయమిస్తున్నట్లుగా!  ప్రమాదం జరిగిన తరువాత అతను చూసిన తొలి వాహనమది. ఆ కారు తనదారిన తాను వెళ్ళిపోయింది. కానీ, ఇతను బాబా ఫోటోను చూశాడు. బాబా ఆ విషయం నీకు తెలిసేటట్లు చేస్తారు. ఈ విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు! 


source:  శరశ్చంద్రికలు.


అది చదివిన తర్వాత నా మనసులో, "బాబా! మీరు నిజంగా నా బాధలు వింటుంటే, నేను చెప్పింది మీకు తెలుస్తుంటే ఇప్పుడే ఒక ఐదు నిమిషాల్లో ఏదో ఒక రూపంలో మీరు నాకు కనిపించండి. అదే జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లో నాకు ఒక బాబా మందిరం కనిపించింది. నిజానికి ఎన్నోసార్లు నేను ఆ మార్గంలో వెళ్లి ఉన్నాను. కానీ అక్కడొక మందిరం ఉందని నాకు గుర్తు కూడా లేదు. అలాంటిది ఎప్పటికీ గుర్తు ఉండిపోయాలా నేను కోరుకున్న వెంటనే బాబా నాకు దర్శనం ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు నా పక్కనే ఉండి  నా బాధను వింటారన్న ధైర్యం నాకిచ్చారు తండ్రి. నేను ఒక సమస్యతో బాధపడుతున్నాను. ఆ విషయం మీకు తప్ప ఎవరికీ చెప్పుకోలేను. ఆ విషయంలో నేను అనుకున్నట్లు చేసి జీవితంలో నాకు మనశ్శాంతిని ఇవ్వు తండ్రి. ఏం చేసి మీ ఋణం తీర్చుకోవాలో నాకు తెలియదు బాబా. జన్మజన్మలకు మీకు ఋణపడి ఉంటాను తండ్రి. ఐ లవ్ యు సో మచ్ బాబా".


నాన్న ఆరోగ్యం విషయంలో బాబా చేసిన సహాయం


నా పేరు పెద్దారావు. నేను ఒక సాయి భక్తుడిని. నా జీవితంలో బాబా నాకోసం ఎన్నో చేశారు. వాటిలో నుండి ఒక సంఘటనను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మా నాన్నగారు చాలా అనారోగ్యం పాలయ్యారు. డాక్టర్లు స్కాన్ చేసి కూడా సమస్యను గుర్తించలేకపోయారు. చివరికి డాక్టర్లు నాన్న కడుపు ఓపెన్ చేసి పెద్దప్రేగుల్లో సుమారు 1.5 కిలోల క్యాన్సర్ తిత్తి ఉందని గుర్తించారు. 6 గంటలపాటు కొలోస్టోమీ శస్త్రచికిత్స చేసి అంత పెద్ద తిత్తిని విజయవంతంగా తొలగించారు. అయితే అది క్యాన్సర్ తిత్తి అయినందున పెద్దప్రేగును తిరిగి కడుపులో పెట్టకుండా నాన్న శరీరంలో ఏడమవైపున ఛాతీకి కొంచం దిగువగా బయటే ఉంచి దానికి ఒక బ్యాగు పెట్టారు. దాని ద్వారా మలవిసర్జన జరుగుతుంది. కొన్నిసార్లు నాన్న ఆహారం తీసుకునేటప్పుడే మలవిసర్జన జరిగేది. ఇదంతా నాన్నకి చాలా అసౌకర్యంగా ఉండేది. ఆయన దానితో 8 నెలలకు పైగా చాలా కష్టాన్ని అనుభవించారు. పెద్దప్రేగును కడుపులో అమరిస్తేనే మలవిసర్జన చేయడం నాన్నకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ అలా చేయాలంటే శరీరంలోని ఏ భాగంలోనూ క్యాన్సర్ లేదన్న ఋజువు డాక్టరుకి కావాలి. కారణం, ఏవైనా కాన్సర్ కణాలుంటే అవి శరీర భాగాలన్నిటిపై ప్రభావం చూపుతాయి. అందుచేత నాన్న శరీరంలో ఏవైనా కాన్సర్ కారక కణాలున్నాయేమో అని తెలుసుకోవడానికి మేము పీ.ఈ.టీ స్కాన్‍కి వెళ్లాము. అప్పుడు నేను నాన్న శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయేమోనని అనుమానించి, "ఏదైనా అద్భుతం చేసి మాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన పి.ఈ.టి స్కాన్ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. తరువాత డాక్టరు పెద్ద ఆపరేషన్ చేయాలని సూచించారు. దానికి  దాదాపు 4.5 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ సమయంలో బాబా మరో అద్భుతమైన సహాయం చేసారు. ఆయన మరొక డాక్టరు రూపంలో వేరే హాస్పిటల్‍కి వెళ్ళమని, అక్కడ సర్జరీ ఉచితంగా చేస్తారని నాతో చెప్పారు. ఇంకా ఆయనే మమ్మల్ని ఆ ఆసుపత్రికి తీసుకెళ్లారు, సర్జరీ విజయవంతమయ్యేలా చేసారు. అంతేకాదు హాస్పిటల్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా చేర్చారు. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన సాధారణ స్థితికి వచ్చారు. ఆ సమయంలో ఆటోడ్రైవర్, నర్సులు, డాక్టర్లు, ఇంకా అనేక ఇతర రూపాల్లో కూడా బాబా మాకు సహాయం చేసారు. నాకోసం ఇంత చేసిన బాబాకు నేను ఋణపడి ఉంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా దయ

 

నా పేరు అలేఖ్య. బాబాకి అనంతవేల కోట్ల కృతజ్ఞతలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి చాలా ధన్యవాదాలు. నేను ఇదివరకు కొన్ని బాబా లీలలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2022, మార్చి 1,  శివరాత్రి రోజు రాత్రి మా బాబు ఎందుకో బాగా ఏడ్చాడు. నిజానికి వాడు ఎప్పుడూ ఏడవడు. అలాంటి వాడు అలా ఏడుస్తుండేసరికి నాకు చాలా బాధేసింది, టెన్షన్‍గా అనిపించింది. అప్పుడు నా కొడుకుకి బాబా ఊదీ పెట్టి, "బాబా! నా కొడుకు ఏడవడం ఆపేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఏలూరి శాంకరి అమ్మవారి తత్వమాల పారాయణ చేశాను. అంతే, బాబా దయవల్ల బాబు ఏడుపు ఆపేసి యాక్టివ్ అయ్యాడు. అలాగే తత్వమాల పారాయణతో బాబా దయవల్ల మా అమ్మకి దగ్గు తగ్గింది. "ధన్యవాదాలు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1122వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం
2. సాయి స్మరణతో సమస్య లేకుండా పోయింది
3. బాబా దయవల్ల నార్మల్ వచ్చిన స్కానింగ్ రిపోర్ట్

బాబా అనుగ్రహం


ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, మార్చి 7వ తారీఖున మా పాప ఎందుకో తెలీదు చాలా ఏడ్చింది. నాలుగో నెల నడుస్తున్న తనకి కడుపులో నొప్పో, తలనొప్పో, ఇంకేమైనా నొప్పో తెలియక నాకు చాలా చాలా టెన్షన్‍గా అనిపించింది. వెంటనే బాబా ఊదీ పాపకి పెట్టి, 'పాప ఏడుపు ఆపితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను' అని అనుకుని పాపకి మందులు వేసాను. కాసేపటికి బాబా దయవల్ల పాప ఏడుపు ఆపి పడుకుంది. అయితే కాసేపటికే మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇంకో మందు వేసి పడుకోబెట్టాము. "థాంక్యూ బాబా. కానీ ఎందుకో నా మనసు ఏమీ బాగోవట్లేదు? ఎందుకో తెలీదు, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆవహించినట్లు నాకున్న భక్తి రోజురోజుకీ తగ్గుతుంది. మిమ్మల్ని ఎంతగానో పూజించే నేనెందుకు ఇంతకుముందులా మిమ్మల్ని పూజించుకోలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు. నా బిడ్డకున్న గుండె సమస్య పూర్తిగా నయమయ్యేంతవరకు ఇలాగే మీ మీద భక్తి తగ్గుతూ ఉంటుందా?  ప్లీజ్ బాబా, మీ మీద భక్తి పెరిగేలా నన్ను ఆశీర్వదించండి. నా బిడ్డను కాపాడండి. నా కుటుంబ బాధ్యత మీదే బాబా".


ఇకపోతే, ఆరోజు నేను ఎంతో బాధగా, బలవంతంగా సచ్చరిత్ర ఒక అధ్యాయం పూర్తి చేసుకున్నాను. ఎందుకో బాబా నాతో, 'పాపకి నయమయ్యేవరకు నీకు బాగా ఇష్టమైనదేదో ఒకటి వదిలేయమ'ని చెప్తున్నట్లు అనిపించింది. అందువలన బాగా ఆలోచించి, నాకు చాలా ఇష్టమైన కాఫీని నేను వదిలేద్దామనుకున్నాను. ఎందుకంటే, కాఫీ అంటే నాకు ప్రాణం. అది లేకుండా నాకు రోజు గడవదు. "బాబా! ఈ రోజు నుండి నా బిడ్డకున్న గుండె సమస్య నయమై తను ఆరోగ్యవంతురాలయ్యేవరకు నేను కాఫీని తాగడం మానేస్తున్నాని మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇంకా పాపకి నయమయ్యేంతవరకు అరటిపండు మీకు, సూర్యదేవునికి వదిలేస్తున్నాను. దయచేసి నా బిడ్డని కాపాడండి బాబా".


మా నాన్నవాళ్ళు వాళ్ళ ఇల్లు అమ్మాలని ఎన్నాళ్ళనుండో అనుకుంటున్నారు. ఇల్లు అమ్మగా వచ్చే డబ్బు నా తల్లిదండ్రులకు ఎంతో అవసరం. అందువల్ల ఈమధ్య నేను బాబాతో, "మా అమ్మవాళ్ల ఇల్లు త్వరగా అమ్ముడుపోతే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న మూడునెలలకే బాబా దయవల్ల ఆ ఇల్లు కొనడానికి ఒక బేరం వచ్చి సెటిల్ అయింది. మిగతా పనులు కూడా మంచిగా జరిగిపోవాలని బాబాని ప్రార్థిస్తున్నాను. "థాంక్యూ బాబా".


కొన్నిరోజుల ముందు నా భర్త భుజం మీద కురుపుల్లా వచ్చాయి. అది 'సర్పి' అని అనుమానం. సాధారణంగా సర్పికి ఏదో మంత్రం వేస్తారు, దాంతో అది తగ్గిపోతుంది అంటారు. కానీ మావారు, "మంత్రాలు వంటివి పాతకాలపు పద్ధతులు. అప్పట్లో మందులు  ఉండేవి కాదు కాబట్టి, అలా చేసేవాళ్ళు. ఈ జనరేషన్‍లో ఇంగ్లీష్ మందులు మీద ఆధారపడాల"ని చెప్పి హాస్పిటల్‍కి వెళ్లి మందులు తెచ్చుకున్నారు. నేను, "బాబా! మా వారికి త్వరగా నయం అయ్యేలా చేయండి. ఆయనకి బాగైతే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల పదిరోజుల్లో మా వారికి తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా. నా భర్తని క్షమించండి బాబా. ఆయన ఎక్కువగా వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలైన దేవతలను ప్రార్థిస్తారు. అలా అని మీరు లేరనరు, మిమ్మల్ని కూడా నమ్ముతారు. అయితే మా పాపకి గుండె సమస్య ఉందని తెలిసిన తర్వాత ఒకసారి కోపమో, బాధో ఏమోగాని, 'బాబా బాబా అని రోజంతా అంటుంటావు. అంతలా అడిక్ట్ అవ్వకు. ఏదైనా లిమిట్‍లో ఉండాలి. అతిగా చేయొద్దు, అయినా సమాధి అవన్నీ ఏంటి?' అని సమాధి అనే పదాన్ని కొంచెం వెటకారంగా అన్నారు. ఆయన అన్నంతనే నాకు చాలా బాధేసింది. నిజానికి మావారు చాలా మంచివారు. ఒకరి గురించి పట్టించుకోరు. మీ దయవల్లే ఆయనకి ఉద్యోగం వచ్చింది(నా మొదటి అనుభవంలో ఆ వివరాలు పంచుకున్నాను). అప్పుడు సంతోషంగా మీకు ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు. అలాంటిది పాప ఆరోగ్యం గురించి తెలిసి కోపంలో, బాధలో మీ గురించి అలా నెగిటివ్‍గా మాట్లాడారు. నేను మావారి చేత మీకు క్షమాపణలు కూడా చెప్పించాను. దయచేసి మావారిని క్షమించండి బాబా. ఆయన పేరులో కూడా మీ పేరు 'సాయి' ఉంది. మీ బిడ్డని క్షమించి, తన వెంటే ఉండి తనకి మీ మీద భక్తి పెరిగేలా అనుగ్రహించండి బాబా. ఆలస్యంగా నా అనుభవాలను పంచుకున్నందుకు, అలాగే ఏదైనా తప్పుగా వ్రాసి ఉన్నా క్షమించండి. థాంక్యూ బాబా".


ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


సాయి స్మరణతో సమస్య లేకుండా పోయింది


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! శ్రీ సాయినాథుని పాదపద్మములకు శతకోటి వందనాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు  నేను ఒక సాయి భక్తురాలిని. నాకు సాయి తండ్రి మీద చాలా చాలా నమ్మకం. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను షుగర్ పేషెంట్‍ని. బాబా దయవల్ల నార్మల్‍గానే ఉన్నప్పటికీ నేను 3నెలలకు ఒకసారి చెకప్‍‍కి వెళుతుంటాను. అలాగే 2022, మార్చి 6న కూడా వెళ్ళాను. అప్పుడు ఈ.సి.జీ తీసి, "కొద్దిగా సమస్య ఉంది. హార్ట్ స్పెషలిస్ట్ ‍‍ను కలవండి" అని చెప్పారు. అది విని మావారు, మాపాప చాలా భయపడిపోయారు. కానీ నేను అంతగా భయపడలేదు. ఎందుకంటే, సాయిబాబా నన్ను చాలాసార్లు అనేక గండాల నుండి గట్టెంక్కించారు. మరుసటిరోజు మేము హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకి వెళితే, "కొన్ని టెస్టులు చేయాలి" అని చెప్పారు. నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని మనసులో అనుకుంటూ కూర్చుని, "నాకు ఏ సమస్య లేకపోయినట్లైతే బ్లాగులో పంచుకుంటాను" అని సాయికి మొక్కుకున్నాను. మొదట ఒక టెస్టు చేసి, "ఏ సమస్య లేద"ని చెప్పి మరో టెస్టు అన్నారు. అప్పుడు కూడా నేను సాయి నామం చేసుకుంటూ కూర్చున్నాను. ఆ టెస్టులో కూడ ఏమి లేదని, మందులు కూడా అవసరం లేదని చెప్పారు. నేను ఇదంతా సాయి మహిమ అంటే మావారు, పాప ఎంతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


బాబా దయవల్ల నార్మల్ వచ్చిన స్కానింగ్ రిపోర్ట్


అందరికీ నమస్తే. నా పేరు నాగవేణి. ముందుగా బాబాకు శతకోటి ప్రణామాలు. సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నా తమ్ముడికి కడుపునొప్పి వచ్చి చాలా ఇబ్బందిపెట్టింది. హాస్పిటల్‍కి వెళితే స్కానింగ్ చేసారు. అప్పుడు నేను బాబాను తలచుకుని, "బాబా! స్కానింగ్ రిపోర్టు నార్మల్ వచ్చి నా తమ్ముడికి కడుపునొప్పి తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది. తమ్ముడికి కడుపునొప్పి కూడా తగ్గింది. "ధన్యవాదాలు బాబా. నాకు వివాహమై 4 సంవత్సరాలవుతున్నా సంతానం కలగలేదు తండ్రి. మీ దయతో నాకు పుత్ర సంతానం కలిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1121వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రేమను ఎంతని చెప్పగలం?
2. బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని చూసుకుంటారు
3. బాబా ఊదీ సర్వరోగనివారిణి

బాబా ప్రేమను ఎంతని చెప్పగలం?


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంధ్య. గతంలో నేను 'బ్లాగు నిలువెత్తు బాబా రూపానికి సజీవ సాక్ష్యం' అనే శీర్షికతో నా అనుభవాలను పంచుకున్నాను. నిజంగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు బాబా భక్తులకు ఒక పెద్ద భాండాగారం, మార్గనిర్దేశం చేసే ఒక వేదిక, ఒక సత్సంగం, సాయి కుటుంబం, ఆత్మపరమాత్మల బంధం ఇలా ఎంతని చెప్పను? ఒక్కమాటలో చెప్పాలంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు సాయి తమ భక్తులకు అనుగ్రహించిన గొప్ప కానుక. బాబా ఈ బ్లాగు ద్వారా పారమార్థికంగా, ప్రాపంచికంగా నాకు ఎంతో సహాయం చేసారు. 'సాయి సచ్చరిత్ర' ఒకటి ఉందని, సాయి దివ్యపూజ, సాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్, సాయి మహాపారాయణ వంటివి ఉన్నాయని, ఇంకా చాలా విషయాలు నేను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారానే తెలుసుకున్నాను. "సాయీ! మీకు వేలవేల కృతజ్ఞతలు". ఇక నా అనుభవానికి వస్తాను. ముందుగా నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాకు క్షమాపణలు కోరుతున్నాను.


కొన్నిరోజుల క్రితం మేము భూమి కొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టి, "సాయిశ్వరా! మా ప్రయత్నానికి మీ సహాయం కావాలి. మాకు తోడుగా ఉండి మాకున్న బడ్జెట్‌లో క్లియర్ టైటిల్ ఉన్న భూమిని ప్రసాదించండి" అని సాయి గురుదేవులను ప్రార్థించాము. ఆపై 'బాబా ఉన్నారు. తప్పక సహాయం చేస్తార'నే విశ్వాసంతో నేను 'నవగురువార వ్రతం' ప్రారంభించాను. బాబా దయతో దీపావళి(2021) రోజున 'నవగురువార వ్రతం' ఉద్వాసన చేసుకోగలిగాను. ఆరోజు సాయంత్రం బాబా గుడిలో దీపాలు వెలిగించే అదృష్టం నాకు, మా పాపకు దక్కడంతో ఎంతో సంతోషంగా, "బాబా! భూమి కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాము. దారి చూపండి బాబా" అని మరోసారి బాబాకు చెప్పుకున్నాను. అలాగే బాబా సహాయం కోరుతూ 'సచ్చరిత్ర' పారాయణ మొదలుపెట్టాను. తరువాత ఒకసారి నిస్సహాయస్థితిలో బాబాను సహాయం కోరుతూ 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో చూస్తే, "కలలో మీకు మార్గనిర్దేశం చేయబడుతుంది" అని వచ్చింది. దాంతో ధైర్యంగా ఉండసాగాను. ఎందుకంటే, గతంలో మేము భూమి అమ్మేటప్పుడు కూడా 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో వచ్చిన బాబా సందేశాలు మాకు మార్గనిర్దేశం చేసాయి. అందువల్ల 'సమయం వచ్చినపుడు బాబా సహాయం అందుతుంది. మనం శ్రద్ధ, సబూరీలతో ఉండాల'ని నేను సచ్చరిత్ర పారాయణ కొనసాగించాను. నేను పారాయణ చేస్తున్న సమయంలో మావారు కొన్ని భూములు చూసి వచ్చారు. పారాయణ పూర్తయిన మరుసటి గురువారం మావారు తను చూసిన భూములను నాకు కూడా చూపించారు. వాటిలో రెండు, మూడు సైట్ల విషయంగా చీటీలు ద్వారా 'తీసుకోవాలా, వద్దా' అని బాబాను అడిగాను. బాబా తీసుకోమన్నారు. తీసుకోనున్న సైట్లలో ఏది తీసుకోవాలన్న ఆలోచనలో ఉండగా ఒకరోజు బ్రహ్మముహూర్తంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా మేము చూసిన ఒక పొలంలో తమ చేతిలో నిధితో నిండి ఉన్న పాత్ర(బిందె) పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ అద్భుత దృశ్యం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంది. ఆ భూమినే మమ్మల్ని తీసుకోమని బాబా మార్గనిర్దేశం చేసారని భావించి ఆ భూమినే కొనుగోలు చేయదలచి 2022, ఫిబ్రవరి మొదటివారంలో భూమి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. ఆరోజు భూమి అమ్మేవాళ్ళు చాలా ఆలస్యంగా వచ్చారు. ఆలోగా 'వాళ్లెందుకు ఆలస్యం చేస్తున్నార'ని బాబాని అడుగుతూ 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో చూస్తే, "క్షణాలలో విజయం సాధిస్తారు. సాయిబాబాకు శరణాగతి పొందండి" అని వచ్చింది. బాబా చెప్పినట్లే కొద్దిసేపట్లో భూమి అమ్మకందారులు వచ్చి, భూమి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసారు. "ధన్యవాదాలు సాయితండ్రి".


ఇకపోతే అప్పటికే భోజన సమయం దాటిపోయింది. మాకు బాగా ఆకలేస్తుంది. కానీ ఆ ప్రాంతంలో హోటల్స్ సరిగా లేవు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మాకు భూమి అమ్మినవాళ్ళు మమ్మల్ని చూసి, "మా ఇంట్లో భోజనం చేయండి" అని పదేపదే ఒత్తిడి చేసి తమ ఇంటికి తీసుకుని వెళ్లి మాకు భోజనం పెట్టారు. కానీ నేను 'తినాలా, వద్దా' అని సంకోచించాను. అప్పుడు సాయి సచ్చరిత్రలోని బాబాతో సహా నలుగురు వ్యక్తులు బ్రహ్మమును వెతుకుతూ అడవులలో తిరుగుతుంటే ఒక బంజారా వాళ్లకు భోజనం పెట్టడం, ముగ్గురు ఆ భోజనాన్ని తిరస్కరించి వెళ్ళిపోతే బాబా మాత్రం ఆ భోజనాన్ని స్వీకరించడం గుర్తొచ్చింది. దాంతో మాకు భోజన ఏర్పాటు బాబానే చేయించారనిపించి సంతోషంగా భోజనం చేయడానికి సిద్ధమయ్యాము. వాళ్ళు మాకు చాలా మంచి కొనుగోలుదారులు దొరికారని చాలా సంతోషంగా, ఎంతో ఆప్యాయంగా మాకు భోజనం పెట్టి పసుపు, కుంకుమలతో బట్టలు కూడా పెట్టారు. ఇదంతా బాబా ఏర్పాటు చేసినదేకదా! వారి ప్రేమే కదా! ఆరోజు రాత్రి పడుకునే ముందు బాబా ప్రేమను తలచుకుంటూ నిద్రపోయాను. నిద్రలో మృదువైన స్వరంలో "దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా" అనే మంత్రం వినబడింది. నేను ఆ మంత్రం మొదటిసారి విన్నాను. ఎంతటి భాగ్యం!


బాబా దయవల్ల భూమి తాలూకు పట్టాదారు పాసుబుక్‌లు కూడా తొందరగా వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆ భూమిని మాకు ఇప్పించిన ఏజెంట్లు చాలా నమ్మకస్థులు. వాళ్ళు బాబా నియమించిన వ్యక్తులని మా ప్రగాఢ విశ్వాసం. ఇలా అన్నివిధాలా ఆయన భూమి కొనడంలో ముందుండి మమ్మల్ని నడిపించారు. బాబా ప్రేమను ఎంతని చెప్పను? "ధన్యవాదాలు సాయీశ్వరా. మీరెంతటి దయార్థ్రహృదయులు బాబా. మీ ప్రేమకు నేను బానిసను. మీ పాదాలే శరణం సాయితండ్రీ".


ఒకరోజు నేను ఊరికే కాలక్షేపం కోసం 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక నెంబర్ ఇస్తే, "అగ్ని ప్రమాదం నుండి కాపాడతాను" అని వచ్చింది. నేను నిర్ఘాంతపోయి, "ఏంటి బాబా, ఇలా వచ్చింది" అని అనుకున్నాను. అంతేకాదు, 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్ మార్గనిర్ధేశం చేసే బాబా సన్నిధి. పిల్లల ఆటకాదు. ఎప్పుడుపడితే అప్పుడు ఓపెన్ చేయకూడదు. నిస్సహాయస్థితిలో బాబా సహాయం కోరుతూ భక్తితో అడగాలి' అని అనుకుని, "నా పొరపాటును మన్నించమ"ని బాబాను అడిగాను. తరువాత ఒక శుక్రవారంనాటి సాయంత్రం నేను దీపారాధన చేసాను. మరుసటిరోజు శనివారం ఉదయం మావారు పూజగదిలోకి వెళ్లి, "ఏమిటి ఇలా అయ్యింది!" అని ఆశ్చర్యపోతూ నన్ను పిలిచి చూపించారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. పూజగదిలోని దేవుడి పటాలు, విగ్రహాలకు కింద ఉన్న వస్త్రం కాలిపోయి బాగా మసిపట్టి ఉంది. అక్కడ ఉన్న సాయి సచ్చరిత్ర, బాబా దివ్యపూజ ముడుపు, అన్నదానం కోసం ఉంచిన డబ్బులు, దేవుడి పోటోలు - ప్రమిదలు, బాబాకు నేను ప్రేమతో కుట్టిన డ్రెస్, బాబా విగ్రహం అన్నీ చక్కగా ఉన్నాయి. అంటే ఆసనం కోసం వేసిన వస్త్రం మాత్రమే కాలిపోయి మిగితావన్నీ రక్షింపబడ్డాయి. అప్పుడు "అగ్ని ప్రమాదం నుండి కాపాడతాను" అన్న బాబా సందేశం గుర్తుకు వచ్చి బాబా ప్రేమకు ఆనందంతో వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మీ బిడ్డనైన నన్ను క్షమించి నా కుటుంబాన్ని పెద్ద అగ్ని ప్రమాదం నుండి కాపాడావు. ప్రేమించడం తప్ప శిక్షించడం తెలియని ఏకైక దైవమైన మీకు కోటికోటి ప్రణామాలు సాయీశ్వరా".


సద్గురు చరణం భవభయ హరణం సాయినాథా శరణం!!!


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని చూసుకుంటారు


సాయినాథునికి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి కృతజ్ఞతలు. నా పేరు లక్ష్మి. మాది బెంగుళూరు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన చిన్న అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరిలో మా అమ్మాయి వాళ్ళింట్లో అందరికీ జలుబు, జ్వరాలు వస్తే అందరూ బాబా ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగారు. బాబా దయవలన అందరూ కోలుకున్నారు. వెంటనే మా పెద్దబ్బాయి కొడుకు గొంతునొప్పితో బాధపడ్డాడు. టెస్ట్ చేయిస్తే, కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అందరమూ భయపడి ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ వాడిని క్వారంటైన్‌లో ఉంచాము. ఇంకా నేను మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళాను. బాబా దయవలన వారం రోజుల్లో నా మనవడికి కరోనా తగ్గింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మాలో ఎవరికీ కరోనా రాలేదు. బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని ఆయనే చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నా కాలివేళ్ళకు కొంచెం సమస్య ఉంది. అదికాక మా కుటుంబంలో కూడా కొన్ని సమస్యలున్నాయి. మీ దయతో అవన్నీ తొలగిపొతే బ్లాగులో పంచుకుంటాను. మా అల్లుడి స్థలం కూడా అమ్ముడుపోవాలి తండ్రి". 


శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబా ఊదీ సర్వరోగనివారిణి


శ్రీసాయినాథా చరణం శరణం. సాయినాథుని పాదపద్మములకు శతకోటి పాదాభివందనాలు. నేను సాయి బిడ్డను. బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో నేను చాలా భయపడ్డాను. బాబాను ప్రార్థించి పరమపవిత్రమైన ఊదీని ఎలర్జీ ఉన్నచోట రాసి, మరికొంత ఊదీ ప్రసాదంగా తీసుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజులకి ఎలర్జీ తగ్గిపోయి నేను ఆరోగ్యవంతురాలినయ్యాను. ఇలా బాబా నన్ను చాలాసార్లు కాపాడారు. బాబా ఊదీ సర్వరోగనివారిణి. "శతకోటి కృతజ్ఞతలు బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా మీద ఉండాలి తండ్రి".



సాయిభక్తుల అనుభవమాలిక 1120వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణాకటాక్ష వీక్షణాలు
2. చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు
3. బాబా మీద భారం వేసి, ఆయన నామస్మరణ చేస్తుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి

బాబా కరుణాకటాక్ష వీక్షణాలు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఈ ఆధునిక సాయి సచ్చరిత్రను(బ్లాగు) నిర్వహిస్తున్న సాయి బృందానికి, సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుండి మేము బాబాని కొలుస్తున్నాము. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. మేము ఊహించని విధంగా మా అమ్మాయికి మెడిసిన్ కోర్సులో సీటు ప్రసాదించి చాలా గొప్పగా అనుగ్రహించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా 'బాబా' అని మనస్ఫూర్తిగా వేడుకున్నంతనే, వెన్నంటుండి 'నేనుండగా భయమెందుక'ని అభయాన్నిచ్చి చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆ సాయినాథుని లీలలు వర్ణించాలంటే మహాగ్రంథమే అవుతుంది. అయితే ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకి మాటిచ్చాను. వాటినే నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. విదేశాలలో ఉంటున్న మేము ఇటీవల ఇండియా వచ్చాము. ప్రస్తుత కోవిడ్ నిబంధనలననుసరించి ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్ట్ చేయించుకుంటే, బాబా రిపోర్టు నెగటివ్ వచ్చేలా చేసి ఏ సమస్యా లేకుండా అనుగ్రహించారు. తరువాత కారు పార్కింగ్ విషయంలో మెషిన్ తప్పుగా రీడ్ చెయ్యటం వలన పార్కింగ్ చార్జీలు అధికంగా వచ్చాయి. ఆ విషయంలో మా ప్రయత్నమేమీ లేకుండానే వాటిని దయతో బాబా సరిచేశారు


విమాన ప్రయాణం చేసేటప్పుడు నాకు చెవి నొప్పి వస్తుంది. కుడిచెవి విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటాను. ఇయర్ ప్లగ్ వాడినా, చూయింగ్ గమ్ నమిలినా ఏ మాత్రమూ ఉపశమనం ఉండదు. నేను బాబాతో, "బాబా! ఈసారి చెవినొప్పి రాకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఇక బాబా చూపిన అనుగ్రహం చూడండి. ఇప్పటికి పదిసార్లు విమాన ప్రయాణం చేసిన నేను మొట్టమొదటిసారి చెవినొప్పి లేకుండా విమానం దిగాను.


ఇకపోతే ఇండియాలో దిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు యథాలాపంగా కొంతమందిని ఎంపిక చేసి తిరిగి ఆర్.టి.పి.సి.ఆర్ చేస్తారని మాకు తెలిసింది. బాబా దయవలన ఆ సమస్య నుండి కూడా బయటపడ్డాము. ఇండియాకి వచ్చిన వెంటనే వయస్సులో పెద్దవాళ్ళైన నా తల్లిదండ్రులను, ఇతర బంధువులను చూడాలని వెళ్ళాము. వాళ్ళకి, మాకు, మా అమ్మాయికి ప్రస్తుత కరోనా ప్రభావం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా బాబా అనుగ్రహించారు. ఆయన కృపవలన ఈ ప్రయాణంలో కరోనా వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఉన్నాము. "బాబా! మీ చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు, అనుగ్రహం మా కుటుంబం మీద, అందరి మీద ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సదా మీ నామస్మరణ చేస్తూ మీ ధ్యాసలోనే ఉండేలా అనుగ్రహించండి బాబా.


చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు


ఓం శ్రీసాయి ప్రేమమూర్తయే నమః!!! సాయి బంధువులు అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మన సాయి ప్రేమాశీస్సులను మీతో పంచుకోవాలని వచ్చాను. 2021, మే నెలలో మాకు కరోనా వచ్చి తగ్గాక మా తమ్ముడు, 'కొన్నిరోజులు తన దగ్గర ఉండమ"ని అంటే తనతోపాటు బయలుదేరాము. ఎప్పుడు ప్రయాణంలో ఉన్నా బాబా ఫోటోగాని, మధురమైన ఆయన నామంగాని కనిపించాలని చూడటం తెలియకుండానే నాకొక సెంటిమెంట్ అయిపోయింది. చేతిలో బాబా ఫోటో ఉన్నా కూడా బయటకి చూస్తుంటాను. అయితే ఆరోజు నేను గమనించానో లేదో లేక బాబానే కనిపించలేదో కానీ సగం దూరం వెళ్ళేవరకు నేను బాబాను ఎక్కడా చూడలేదు. ఇక అప్పటినుంచి జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాను. అదేం చిత్రమోగానీ కనీసం సాయి అన్న నామం కూడా కనిపించలేదు. 'కోవిడ్ తగ్గాక అదే మొదటి ప్రయాణం. ఎందుకు బాబా కనిపించలేద'ని కొంచెం ఏదోలా అనిపించింది. మొత్తానికి మా ప్రయాణం పూర్తయి కారు తమ్ముడి వాళ్ళ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. తమ్ముడు కారు దిగి గేట్ తీయటానికి వెళ్ళాడు. మేం ఇంకా కారులోనే ఉన్నాం. ఈలోపు అమ్మ, "అటు చూడు" అని ఒక భవనాన్ని చూపించింది. అది రెండు అంతస్తుల భవనం. దానిపై 'ద్వారకామాయి నిలయం' అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇంకా ఆ రెండు అంతస్తుల్లో రెండు పెద్ద పెద్ద 'బాబా ఫొటోలు' ఉన్నాయి. అంతకుముందు కూడా మేము తమ్ముని ఇంటికి వెళ్ళాము. కానీ, అప్పుడెప్పుడూ ఇలా బాబా ఫొటోలు మేము చూడలేదు. అమ్మ కూడా అదే అనింది, 'కొత్తగా పెట్టారు అనుకుంటా' అని. మొత్తానికి నేను కారు దిగేలోపు నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించారు నా సాయి. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంట్లోకి వెళ్ళగానే నాకు ఎంతో ఇష్టమైన నేరేడుపళ్ళతో బాబా స్వాగతం పలికారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీకు అనిపిస్తుంది కదా! కానీ విశేషముంది. కరోనా వచ్చిన సమయంలో నాకు నేరేడుపళ్ళు తినాలని చాలా అనిపించింది. వాటికోసం తమ్ముడు తన స్నేహితుల ద్వారా చాలా ప్రయత్నించాడు కానీ, దొరకలేదు. ఇప్పుడు కూడా తమ్ముడు వాటిని కొనలేదు. మావయ్య వాళ్ళ పొలంలో కాసాయని పంపించారు. మేము వస్తున్నట్లు ఆయనకి తెలియదు. ఆయన అంతకుముందు పుచ్చకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు మొదలైనవి పంపారుకానీ నేరేడుపళ్ళను పంపటం ఇదే మొదటిసారి. ఇదంతా యాధృచ్ఛికంగా జరిగింది అంటారా? చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో కదా! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీలైనప్పుడల్లా ఒక్కొక్కటిగా పంచుకుంటాను. "మీ ప్రేమని పంచుకోవటంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా మీద భారం వేసి, ఆయన నామస్మరణ చేస్తుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి


నా పేరు శ్రీదేవి. మాది గుంటూరు. ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులందరికీ నమస్కారం. మన జీవితాలలో బాబా ప్రసాదించిన అద్భుత లీలలను పంచుకునేందుకు బాబా మనకిచ్చిన అపూర్వమైన అవకాశం ఈ వేదిక(బ్లాగు). ఈ బ్లాగు ద్వారా బాబా అనుగ్రహించిన ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా అమ్మ ఆరోగ్య విషయంలో ప్రతి చిన్న సమస్యను బాబాకు చెప్పుకుంటూ, వారి అనుగ్రహాన్ని ఈ బ్లాగులో పంచుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే... మేము మా అమ్మగారి తల నరాలకి సంబంధించి మందులు వాడుతున్నాము. ఈ మధ్య అమ్మ తనకి 'ఒక కన్ను సరిగ్గా కనపడటం లేదని, ఒక నిమిషం వరకు అంతా చీకటిగా ఉండి, తరువాత మళ్ళీ మామూలుగా ఉంటుంద'ని చెప్పింది. అందుచేత అమ్మని న్యూరాలజీ డాక్టరుకి చూపించాము. అప్పుడు నేను, "బాబా! అమ్మ కంటి నరాలలో ఏ సమస్యా లేదని చెప్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల అమ్మకి చెకప్ చేసిన డాక్టరు, 'అమ్మ కంటి నరాలు బాగున్నాయని, ఆమె ఎక్కువగా ఆలోచిస్తుంద'ని చెప్పి నాలుగు రోజులకి మందులు రాసిచ్చి, "తగ్గకపోతే నాలుగు రోజుల తరువాత కంటి డాక్టరుకి చూపించమ"ని అన్నారు. నా బాబా దయవల్ల అమ్మకి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనం బాబా మీద భారం వేసి ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని నా నమ్మకం. బాబా అనుగ్రహం మన అందరిపై ఉండాలని ఆ తండ్రిని వేడుకుంటూ... 


శ్రీసాయినాథాయ నమః!!!



రావుబహద్దూర్ ఎస్.బి.ధుమాళ్ - రెండవ భాగం...



ధుమాళ్ న్యాయవాద వృత్తికి సంబంధించిన మరో కేసు గురించి తెలుసుకుందాం. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడినవారిలో ఒకరికి ఎముక విరిగి, 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురి తరపున వాదించడానికి ఒప్పుకొని, అప్పీలు మెమో తయారుచేసుకొని ముందుగా జామీను కోసం ప్రయత్నించాడు ధుమాళ్. అయితే, ‘కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలుపడద’ని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (సీనియర్ ఐరోపా అధికారి) చెప్పాడు. ధుమాళ్ ఒక్కసారి బాబాను స్మరించుకొని, జడ్జి వైపు తిరిగి, “ప్రాసిక్యూషన్‌వారు చెప్పేది నమ్మశక్యంగా లేదనీ, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రం, ఏ డిగ్రీలూ, సర్టిఫికెట్లూ లేని ఒక నాటువైద్యుడిచే ఇవ్వబడింద”ని చెప్పాడు. అంతేగాక, నిందితులు ముగ్గురూ రైతులనీ, వ్యవసాయమే వారి జీవనాధారమనీ, వాళ్ళు జైలులో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందనీ చెబుతూ, వారిపై అభియోగం ఋజువైతే అప్పుడు వారిని జైలుకు పంపవచ్చని వాదించాడు. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్దిరోజుల తరువాత కేసు మళ్ళీ విచారణకొచ్చింది. “మీరు వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా? లేక కేవలం క్షమాభిక్ష కోసమా?” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధుమాళ్‍ని అడిగాడు. ‘క్షమాభిక్ష కోసమే అయితే తాను వ్యతిరేకించన’ని కూడా అన్నాడు. కేసు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి, ‘ఖైదీల విడుదల కోసమే వాదిస్తాన’ని సమాధానమిచ్చి, ఒక నాటువైద్యునిచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకొని, ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాడు ధుమాళ్. శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినప్పటికీ చివరికి సాధ్యమైనంతవరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాడు ధుమాళ్. అందుకు న్యాయమూర్తి, “మీరు కోర్టువారి క్షమాభిక్ష కోసం మాత్రమే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది” అని ధుమాళ్‌తో అంటూ, "ఒక నాటువైద్యుడిచ్చిన ధృవపత్రం ఆధారంగా, ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరచారని ఎలా చెబుతున్నావు?” అని ప్రాసిక్యూటర్‌ను అడిగాడు. "ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా!" అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, "నీ వాదన మూడవ తరగతి మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మరిచిపోయావు" అని గద్దించాడు. దీని తరువాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి నిందితులను విడుదల చేశాడు.


ఇక, ప్రభుత్వరంగంలో ధుమాళ్ సేవల గురించి తెలుసుకుందాం. ధుమాళ్ నాశిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాడు. ఈ పదవిని అతను 1.11.1917 నుండి 13.5.1925 వరకు నిర్వహించాడు. ఈ పదవిలో ఉన్నప్పుడు ప్రతిదినం వేలకొలది సంతకాలు స్వయంగా (తన సంతకంతో తయారుచేయబడిన స్టాంపు ఉపయోగించకుండా) పెట్టవలసివచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా తన న్యాయవాదవృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. అతను చెల్లించే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి సున్నాకు పడిపోయిందంటే, అతని సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ, అతని ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో అతనికి "రావుబహద్దూర్" అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికున్నది. బాబాపై భారం వేసి, తన పని నిర్వహించసాగాడు ధుమాళ్. ప్రతిరోజూ జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి ధుమాళ్ టేబుల్‍పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపరుపై ధుమాళ్ సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపరుతో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు ధుమాళ్ ఎప్పటిలాగే సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాడు. ఇంతలో అతనికి బాగా తెలిసిన, అతనెంతో గౌరవించే ఒక వ్యక్తి అతనిని కలవడానికి వచ్చాడు. సంతకాల పనిని మరుసటి ఉదయానికి వాయిదా వేసి, అతనితో అర్థరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాడు ధుమాళ్. తరువాత జవానును భోజనానికి పంపి, అతను నిద్రపోయాడు. మరుసటిరోజు అతనికి ఊరు విడిచి వెళ్ళాల్సిన పని ఉండి, పేపర్లపై సంతకాలు పెట్టకుండానే ఆఫీసుకు పంపాడు. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాడు. యథావిధిగా సంతకాల కార్యక్రమానికి ఉపక్రమించినప్పుడు, ఆరోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందురోజు సంతకాలు నిలిచిపోయిన పేపర్లను తెప్పించి చూస్తే, వాటన్నిటిపై తన సంతకాలుండటం కనిపించింది. తాను చేయకుండానే వేల పేపర్లపై తన సంతకం ఉండడం చూసిన ధుమాళ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని అతను గ్రహించాడు.


అలాగే, బాబా చేసిన మరొక అద్భుత లీల గురించి తప్పక తెలుసుకోవాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ ధుమాళ్ అధీనంలోనే ఉండేవి. ఒకసారి, నెల మొదటివారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు బట్వాడా చేస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖాధికారి అభిప్రాయపడ్డాడు. మొదట ధుమాళ్ ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజుల తరువాత అతడు అదే విషయం తిరిగి ధుమాళ్‌కు గుర్తుచేశాడు. దాంతో ధుమాళ్‌కు కూడా అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసరును సంప్రదించాడు. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరుకాలేదనీ, మంజూరు కాకుండా చెక్కు పంపడం అభ్యంతరకరమనీ అతడు చెప్పాడు. అందువల్ల ధుమాళ్ ఏమీ చేయలేకపోయాడు. మరల విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని ధుమాళ్ ముందుంచడంతో ధుమాళ్ అతని అభిప్రాయంతో ఏకీభవించి దీనిపై బాబా అనుమతి కోరదలచి, రెండు చీటీలు వ్రాసి, వాటిని బాబా పటం ముందుంచి, వాటిలోనుండి ఒక దానిని తీయించాడు. ‘జీతాలు బట్వాడా చేయమ’నే ఆదేశం వచ్చింది. దాంతో ధుమాళ్ వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించాడు. తరువాత టీచర్లందరికీ జీతాల బట్వాడా జరిగింది. దీపావళి పర్వదినానికి ముందు జీతాలిచ్చినందుకు అందరూ సంతోషించి అతనికి కృతజ్ఞతలు చెప్పారు. కానీ అక్కౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళనపడ్డాడు ధుమాళ్. కానీ బాబా దయవలన ఏ సమస్యా రాలేదు. ఆ సంవత్సరాంతం జరిగిన ఆడిట్లో ఈ అభ్యంతరం నమోదు చేయబడింది. అందుకు, "భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది" అని జవాబు వ్రాసి పంపాడు ధుమాళ్. దాంతో ఆ సమస్య అంతటితో సమసిపోయింది.


ధుమాళ్ జీవితంలోని ప్రతి మలుపులోనూ, సందిగ్ధస్థితిలోనూ బాబా అతనికి ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. 1910లో ధుమాళ్ సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటీ అతనికి సహాయం చేయదలచి, అతనిని ఉన్నతవిద్యకై విదేశాలకు (ఇంగ్లండు) పంపదలచాడు. ఇంగ్లండులో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, ధుమాళ్ విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని, బాబా అనుమతి కోసం వారిని దర్శించారు. అప్పుడు షామా వారి తరఫున బాబాతో, “బాబా, భావూను విదేశాలకు (బిలాయత్) పంపించమంటారా?" అని అడిగాడు. "ఎందుకు?" అని అడిగారు బాబా. "ఉన్నతవిద్య (బార్-ఎట్-లా) కోసం" అని సమాధానమిచ్చాడు షామా. అప్పుడు బాబా, "అతని అభిరుచి (ఇలాయత్), దైవేచ్ఛ (విలాయత్), విదేశాలలో (బిలాయత్) లేదు. ఈ దేశంలోనే ఉంది! అతను ఇంగ్లండుకు ఎందుకు వెళ్ళాలి?" అన్నారు. తనకు ఏది శ్రేయోదాయకమో బాబాకు తెలుసు కనుక మరో మాట మాట్లాడకుండా ఇంగ్లండు వెళ్ళాలనుకునే తన ఆలోచనను విడిచిపెట్టాడు ధుమాళ్.


1912లో జె.జె. హాస్పిటల్లో ధుమాళ్‌‌కు ఒక ఆపరేషన్ జరిగింది. అది కష్టమైన ఆపరేషన్. ఆపరేషన్‌కు ముందు అతనికి మత్తు ఇచ్చారు. మత్తులోనికి జారేముందు ధుమాళ్ వెనుకకు తిరిగి చూశాడు. తన తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉండటం అతనికి కనిపించింది. దాంతో, బాబా తన వెంటే ఉన్నారన్న భరోసా అతనికి కలిగింది. ఆ తరువాత బాబా దయవలన ఆ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.


1915లో నాశిక్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ధుమాళ్‌కు ఆహ్వానం పంపింది. తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు రెండు రోజులు గడువు అడిగి, తనను ఆ ఉద్యోగంలో చేరమంటారో, వద్దో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ బాబాకు ఉత్తరం వ్రాశాడు ధుమాళ్. "నీవు చేస్తున్న ఉద్యోగమే మంచిది. కొత్తదాన్ని అంగీకరించవద్దు!" అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. బాబా ఆదేశం మేరకు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాడు ధుమాళ్.

 

1918లో బాబా మహాసమాధికి కొద్దిరోజుల ముందు శిరిడీ, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు (ఇన్‌ఫ్లూయంజా) విజృంభించాయి. పూనాలోనున్న అతని అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని తంతి ద్వారా ధుమాళ్‌కు తెలియజేశారు అతని బంధువులు. ఆ వార్త అందిన వెంటనే అవసరానికి 80 రూపాయలు తీసుకుని తన అన్న దగ్గరికి బయలుదేరాడు ధుమాళ్. నాశిక్ నుండి పూనా వెళ్ళే దారిలోనే శిరిడీ ఉంది కాబట్టి అక్కడ ఆగి, బాబాను దర్శించి, రోగికి ఊదీ, ఆశీర్వాదాలు తీసుకొని వెళదామని తలచాడు ధుమాళ్. వెళ్ళినరోజే బాబా పలుమార్లు అతనిని దక్షిణ అడిగి, అతని దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది అతనికి అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక తన పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా, తనను పూనా వెళ్ళడానికి అనుమతించమని బాబాను కోరాడు ధుమాళ్. బాబా రాచఠీవీతో, "రేపు చూద్దాం (ఉద్యా పాహూ)" అన్నారు. అలా బాబా అతనిని మూడు రోజులు శిరిడీలోనే ఉంచారు. ఇంతలో అతని వదిన చనిపోయినట్లు ధుమాళ్‌కు టెలిగ్రాం వచ్చింది. అప్పుడు బాబా అతనిని పూనాకు వెళ్ళడానికి అనుమతించారు. అతని వదిన చనిపోతుందని, అతను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే అతనిని శిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను ఎవరూ తెలుసుకోలేరు. కానీ ఏ విషయంలోనైనా బాబానే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాడు ధుమాళ్. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్దిరోజుల ముందు జరిగింది. అలా బాబా అతనిని శిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో తమతో గడిపే మహాభాగ్యాన్ని ధుమాళ్‌కు ప్రసాదించారు.

 

ధుమాళ్ డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ, బాబా దయవలన క్రమేణా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాడు. అతను 1.9.1930 నుండి 9.4.1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబరుగానూ, 1932 సంవత్సరాంతము నుండి 1933 ఆగష్టు వరకు సుర్గాన సంస్థానానికి సెక్రటరీగానూ పనిచేశాడు. నాశిక్‌‌‌లో ఉన్నప్పుడు అతను తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే ఉండేవాడు. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. ధుమాళ్ సుర్గాన సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు, బాబా ఎంతో దయతో ఏ విధంగా అతనికి ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం!


ఒకరోజు ధుమాళ్ భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని అతను ఉన్న గదిలోనికి ప్రవేశించాడు. తాను భోజనం చేస్తూ ఉన్నందున అతడిని సగౌరవంగా ఆహ్వానించి, ఉచితాసనంపై కూర్చోపెట్టలేకపోతున్నందుకు తనను క్షమించమని కోరాడు ధుమాళ్. అందుకతడు, ‘పర్వాలేదు’ అంటూ నేరుగా ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి, అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని తదేకంగా కొంతసేపు చూసి తిరిగి ధుమాళ్ ఉన్న చోటికి వచ్చి, "మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. తన జీతాన్ని పెంచమని ధుమాళ్ ఆయనను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే తన ప్రయత్నమేమీ లేకుండానే జీతం పెరగడం కేవలం బాబా అనుగ్రహమేనని ధుమాళ్ గ్రహించాడు. బాబా మనపై చూపుతున్న ప్రేమ, తల్లి తన బిడ్డపై చూపేటటువంటిది అని అతనికి అర్థమయింది (మావులిఁచే చిత్ లేకురాచేఁ హిత్).

 

ధుమాళ్ పూజామందిరంలో బాబా ఫోటోలు కొన్ని ఉండేవి. వాటితో పాటు ఆ తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాడతను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం ఒకటి వాటన్నింటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే అతనికి ఎంతో ఇష్టం. మొదట ఆ పటం రాధాకృష్ణఆయీ దగ్గర ఉండేది. ఈ పటాన్ని తనకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాడు ధుమాళ్. ఆయీ ఇంటినుండి ఆ పటాన్ని తీసుకొని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా అతనిని లోనికి పిలిచి, అతని చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ, "ఏమిటిది?" అని అడిగారు. “ఇందులో మీరున్నారు" అన్నాడు ధుమాళ్. బాబా “ఇటివ్వు” అంటూ ఆ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, దానిని ముందూ వెనుకా తదేకంగా చూసి, తిరిగి ధుమాళ్‌కు ఇచ్చి, “ఉంచు!” అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే అతని కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, ఆ పటాన్ని చూసినప్పుడల్లా, “భావూ! నాకు రాత్రంతా నిద్రలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను!" అని బాబా తనతో అన్న సందర్భం అతనికి గుర్తుకొచ్చేది. బాబా తనకు ప్రసాదించిన కానుకగా భావించి ధుమాళ్ ఆ పటాన్ని భక్తిశ్రద్ధలతో పూజించుకునేవాడు.

 

ఈ ఫోటోలనన్నింటినీ తను ఎక్కడికి వెళితే అక్కడికి తన వెంటే తీసుకుని వెళ్ళేవాడు ధుమాళ్. అతను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాశిక్, దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారీ ఫోటోలను తన వెంట తీసుకెళుతుండటం చూసిన దేవార్లోని అతని వంటవాడు ఒకసారి, “ఫోటోలన్నీ తీసుకొని వెళ్ళడమెందుకు? కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా?” అన్నాడు. తరువాత అదే విషయాన్ని నాశిక్‌లోని అతని సోదరుని కుమారుడు కూడా అడగటంతో, ధుమాళ్ ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి రెండు చీటీలను వ్రాసి బాబా పటం ముందు వేశాడు. బాబా నుండి, ‘ఫోటోలన్నింటినీ తీసుకువెళ్ళమ’నే ఆదేశం వచ్చింది. అతనలాగే చేశాడు. అప్పటినుండి ఫోటోలను తనతో తీసుకెళ్ళే విషయంలో చీటీలు వేసిన ప్రతీసారి ‘ఫోటోలన్నీ తీసుకువెళ్ళమ’నే బాబా ఆదేశం వచ్చేది.

 

ధుమాళ్ ఎంతో పవిత్రంగా భద్రపరచుకోవడానికి బాబా అతనికి కొన్ని వస్తువులను ప్రసాదించారు. ఒకసారి బాబా అతనిని 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని, వాటిని తిరిగి అతనికే ఇచ్చి, "వీటిని భద్రంగా దాచుకో. ఎవరికీ ఇవ్వవద్దు. ఖర్చుపెట్టవద్దు (జపూన్ ఠేవా. కోణాలా దేవూఁ నకో, ఖర్చ్ కరూఁ నకో)" అన్నారు. ఇంకొకసారి ఇలాగే మరో 2 రూపాయలిచ్చి పైవిధంగానే ఆదేశించారు. ఒకసారి ధుమాళ్, బూటీ కలిసి బాబాను దర్శించారు. బాబా బూటీని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా ధుమాళ్‌కు ఇచ్చేశారు. ఇంకొకసారి బూటీ, ధుమాళ్ కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతడు సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయి నాణేలను తమ దోసిలిలోనికి తీసుకొని, దోసిలి మూసి, క్రిందికి పైకి ఆడించి, ఆ నాణేలను తమ రెండు గుప్పెళ్ళలోకి తీసుకొని, ఒక గుప్పెడు ధుమాళ్‌కు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. వారిద్దరూ వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి 15 రూపాయలున్నాయి. వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇవేకాక, మరో సందర్భంలో బాబా ధుమాళ్‌కు 30 రూపాయలు ఇచ్చారు. ఇలా బాబా ధుమాళ్‌కు ఇచ్చిన మొత్తం 69 రూపాయలయింది. వీటిని బాబా తనపై చూపిన ప్రేమకు జ్ఞాపికలుగా మాత్రమేగాక, తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణేలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు ధుమాళ్.


‘బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేది’ అని ఆ తరువాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి బాబా తమ భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసేసుకునేవారు (యస్యానుగ్రహ మిచ్చామి తస్య సర్వ హరామ్యహమ్). ఇలా ధుమాాళ్‌కు కూడా తరచుగా జరిగేది. అలాంటి సమయాలలో అతను ఎలాంటి బాధ, విచారం లేకుండా బాబా అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడు. ఎందుకంటే, ‘మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి, వారు మనకు ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా!’ అన్నది ధుమాళ్ విశ్వాసం. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. అటువంటి రెండు సంఘటనలను చూద్దాం.

 

ధుమాళ్ ఒకసారి శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనిని పలుమార్లు దక్షిణ అడిగి అతని దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్న తరువాత మరలా, "భావూ, నాకు 7 రూపాయలు ఇవ్వు" అని అడిగారు. తన దగ్గర లేవని ధుమాళ్ చెబితే, “ఎవరినైనా అడిగి తీసుకొని ఇవ్వు” అన్నారు బాబా. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసి బాబా తనలోని గర్వాన్ని, అహంకారాన్ని అణచి అణకువగా మెలగుటకై తనకొక పాఠం నేర్పించారని ధుమాళ్ భావించాడు. బాబా నేర్పిన ఈ విషయం అతనిని ఎంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తరువాత అతను శిరిడీ వెళ్ళినప్పుడు, ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ళవద్ద భిక్షచేసేవాడు! బాబా దయవలన తన అహంకారం అణిగిందనీ, లేకుంటే తన అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని కడజాతివారికి దూరంగా ఉండేవాడిననీ భావించాడు ధుమాళ్. 


ఒకసారి బాబా ధుమాళ్ దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, తిరిగి యాభై రూపాయలు అడిగారు. తన దగ్గర పైసా కూడా లేదని చెప్పాడు ధుమాళ్. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు బాబా. ధుమాళ్ వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు చెప్పాడు ధుమాళ్. ఈసారి హెచ్.వి.సాఠే దగ్గరకు వెళ్ళమన్నారు బాబా. ధుమాళ్ వెళ్ళి సాఠేకు బాబా ఆదేశం చెప్పగానే, సంతోషంగా డబ్బు ఇచ్చాడు సాఠే. దానిని తీసుకొని వెళ్ళి బాబాకు సమర్పించాడు ధుమాళ్. సాఠేను బాబా యాభై రూపాయలు దక్షిణ అడగడంలోని అంతరార్థం ధుమాళ్‌కు తరువాత తెలిసింది. సాఠే రిటైరైన తరువాత అతనికి పింఛను మంజూరైంది. అతడు తనకు యాభై రూపాయలు పింఛను అదనంగా రావలసివుందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొన్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. ధుమాళ్‌ను దక్షిణ కొరకు సాఠే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం, అతనికి అదనంగా యాభై రూపాయల పింఛను మంజూరవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరై ఆర్డరు వచ్చిన తేదీ, బాబా సాఠేను యాభై రూపాయలు అడిగిన తేదీ ఒక్కటే కావడం విశేషం!


బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో, ధుమాళ్ అడుగకుండానే వాళ్లు అతనికి 300 రూపాయలు ఫీజు రూపంలో ఇచ్చారు. ధుమాళ్ అహ్మద్‌నగర్ నుండి శిరిడీ వచ్చి మూడురోజులు ఉన్నాడు. ఆ మూడురోజులలో బాబా అతనిని పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయలను తీసేసుకున్నారు. బాబా చేసిన ఈ చర్య ద్వారా, తన గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం తాను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదనీ, ఎందుకంటే, ఆ కేసు గెలిచింది తన ప్రతిభాపాటవాల వల్ల కాదనీ, బాబా అద్భుతరీతిలో మేజిస్ట్రేటు మనస్సును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైందనీ ధుమాళ్ గ్రహించాడు.

 

బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకుందాం. బాబాపై మన నమ్మకం బలపడేందుకు, వారి నిజతత్త్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ ధుమాళ్ ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, బాబా, "దేవుడు, దేవుడు అని ఊరకే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు!" అన్నారు.

 

ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి, బీదలకు, ఆకలిగొన్నవారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు బాబా మసీదు ఆవరణలో పొయ్యిని వెలిగించి దానిపై పెద్దపాత్ర (హండీ) పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారమంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారుచేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడేవారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరీకర్, "బాబా! మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం?" అనడిగాడు. అప్పుడు బాబా, "చంపేవాడే రక్షిస్తాడు. రక్షించేవాడే చంపుతాడు (జో మారీల్ తోచ్ తారీల్, జో తారీల్ తోచ్ మారీల్)" అన్నారు. ఈ మాటలు ‘సృష్టి, స్థితి, లయ కారకుడు భగవంతుడే’ అని చెబుతున్నాయి. అంతేగాక, ‘బాబాలాంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుంది’ అనే నిగూఢ భావం ఇమిడివుంది.


సమాప్తం...
మూలం: అనుభవసంహిత
(డీవోటీస్ ఎక్స్పీరియన్స్ అఫ్ సాయిబాబా బై బి.వి నరసింహస్వామి)

  

 మొదటి భాగం కోసం బాబా పాదాలు తాకండి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo