సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1087వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపించిన దయ
2. బాబా ఆశీస్సులతో సాఫీగా పూర్తయిన రిజిస్ట్రేషన్
3. బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేస్తున్న ఫ్యాట్ బెల్ట్

బాబా చూపించిన దయ

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు అనూరాధ. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. 2021, ఆగస్టులో మా బంధువులందరి సమక్షంలో మా తమ్ముడి వాళ్ళ గృహప్రవేశం చాలా బాగా జరిగింది. వారం రోజుల తర్వాత మా మరదలి తండ్రికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చాలా సీరియస్ అయ్యి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోంచి బయటికి వచ్చిన తరువాత ఆయన పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడటం చేసేవారు. నాకు చాలా బాధ అనిపించి బాబాతో, "బాబా! ఈ మధ్యే అన్ని కుటుంబాల వాళ్ళం సంతోషంగా గృహప్రవేశ వేడుకలో ఆనందంగా కలుసుకున్నాం. ఇంతలోనే ఆయనకి ఇలా అయ్యింది. ఆయనకి ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేలా అనుగ్రహించండి" అని చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల 15 రోజులు తర్వాత ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి బాగానే ఉన్నారు.

2022లో ఒకరోజు ఇంట్లో నేను షుగర్ టెస్టు చేసుకుంటే 380 వచ్చింది. ఎప్పుడూ 98, 104 అలా వచ్చేది కాస్త అంత ఎక్కువ వచ్చేసరికి నాకు భయమేసింది. వెంటనే, "బాబా! ఇంత త్వరగా నాకు షుగర్ వ్యాధి రాకుండా కాపాడండి. షుగర్ ఎప్పటిలానే మామూలుగా ఉండేలా చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. రెండు రోజుల తర్వాత మళ్లీ చెక్ చేసుకుంటే మునుపటిలా నార్మల్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా! మీరు చూపించే దయకు ఎంతో ఋణపడిపోతున్నాం తండ్రీ".

ఓం శ్రీసచ్చిదానంద సాయినాథాయ నమః!!!

బాబా ఆశీస్సులతో సాఫీగా పూర్తయిన రిజిస్ట్రేషన్


అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. మేము కొద్ది రోజుల క్రితం చాలా విలువైన స్థలమొకటి కొన్నాము. ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసే సమయానికి దాన్ని అమ్మిన వ్యక్తి నుండి మాకు చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. అతను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడంటే, రిజిస్ట్రేషన్ ముందురోజు సగం డబ్బులు తీసుకుని కూడా మరుసటిరోజు రిజిస్ట్రేషన్ సమయానికి కొత్త నింబంధనలు పెట్టి చాలా విసిగించాడు. చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం అయినందువల్ల ఇంట్లో అందరమూ చాలా టెన్షన్ పడ్డాము. అందరూ బాగా భయపడ్డారు. నేను మాత్రం బాబా మీద భారం వేసి, 'శ్రీసాయి సులభ దుర్లభాయ నమః' అనే మంత్రాన్ని చెప్పుకోసాగాను. అలాగే "సాయంత్రంలోపు ఈ సమస్య పరిష్కారమయ్యేల చూడమ"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిజిస్ట్రేషన్ ఎంతో సాఫీగా జరిగి మా సమస్య తీరిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్ముకున్న భక్తులను మీరు ఎప్పుడూ నిరాశపరచరు తండ్రి. ఈ మధ్యకాలంలో నా మనసు ప్రశాంతంగా ఉండట్లేదు. దయచేసి నాకు మానసిక ప్రశాంతతని ప్రసాదించండి బాబా. నేను ఒక ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నాను. మీ దయతో అది కూడా పూర్తిగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నా మ్రొక్కుల విషయంలో ఏమైనా లోటుపాట్లు చేస్తే మన్నించండి బాబా. మీ ఆశీస్సులు మా అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేస్తున్న ఫ్యాట్ బెల్ట్

భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి నేను ఆన్లైన్‍లో ఒక ఫ్యాట్ బర్నింగ్ బెల్ట్ ఆర్డరు చేసీ తెప్పించుకున్నాను. దాన్ని ఒక వారం వాడిన తరువాత ఏ సమస్య వచ్చిందో తెలీదుగానీ పని చేయడం మానేసింది. ఆన్లైన్‍లో తెచ్చుకునే వస్తువులు ఇలాగే ఉంటాయని దాని మీద ఆశలు వదిలేసి పక్కన పడేసాను. నేను రోజూ చదివే ఈ బ్లాగులో చాలామంది భక్తులు తమ వస్తువులు ఏవైనా పని చేయకపోతే, వాటికి బాబా ఊదీ పెట్టి బాబాని తలుచుకోగానే అవి పనిచేశాయని పంచుకోవడం చదివి ఆ బెల్ట్ తీసి దానికి బాబా ఊదీ పెట్టి, "బాబా! ఇది పని చేసేలా చూడండి" అని అనుకుంటూ బెల్ట్ ఆన్ చేశాను. బాబా దయవల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బెల్టు పని చేస్తుంది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo