1. బాబా చూపిన కరుణ
2. ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు
3. పిలిస్తే పలుకుతారు బాబా
బాబా చూపిన కరుణ
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. నేనిప్పుడు బాబా మాపైన చూపిన కరుణను మీతో చెప్పబోతున్నాను. నేను నా కిందటి అనుభవంలో గర్భవతిగా ఉన్న నా భార్యకి స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు సిస్ట్ ఉందని చెప్పాను. ఆ కరుణామూర్తి దయవల్ల 2022, ఫిబ్రవరి రెండోవారంలో డాక్టరు మళ్ళీ స్కాన్ చేసి, "ఇప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉంది, సిస్ట్ చాలావరకు నయమైంది. ఇంజెక్షన్‍తో పూర్తిగా తగ్గిపోతుంది" అని చెప్పారు.
మొదటిసారి నా భార్య గర్భం దాల్చినప్పుడు మూడవ నెలలో గర్భం పోయింది. అందుకే రెండోసారి గర్భం దాల్చినప్పుడు మూడవ నెల రాగానే అంటే ఫిబ్రవరి మూడోవారంలో బాబా మీద నమ్మకం ఉంచి NT స్కాన్ చేయించడానికి హాస్పిటల్‍కి వెళ్ళాం. స్కానింగ్ చేసేటప్పుడు బిడ్డ పొజిషన్ గురించి ఏమీ తెలియట్లేదని డాక్టరు చెప్పారు. రెండు, మూడుసార్లు స్కాన్ చేసినా బిడ్డ పొజిషన్ తెలియకపోవడంతో డాక్టరు, "రాత్రి 8 గంటలకి మళ్ళీ రమ్మ"ని అన్నారు. వెంటనే మేము బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఈసారి స్కానింగ్ బాగా వచ్చేలా అనుగ్రహించండి" అని అనుకున్నాం. రాత్రి మళ్ళీ బాబాకి దణ్ణం పెట్టుకుని స్కానింగ్‍కి వెళ్ళాం. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ కరుణామూర్తి అనుగ్రహం వల్ల స్కానింగ్ ప్రక్రియ మొదటి ప్రయత్నంలోనే బిడ్డ కదులుతూ కనిపించింది. డాక్టరు, "తల, కాళ్ళు ఏర్పడ్డాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంది" అని చెప్పడంతో హమ్మయ్య అనుకున్నాం. "మిమ్మల్ని శరణు వేడిన వారిని ఎల్లప్పుడూ కరుణిస్తూ ఉంటావు సాయినాథా. ఇలానే మా బిడ్డని కాపాడుతూ చక్కగా ప్రసవమై బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చూడు తండ్రి". ఇకపోతే అదే సమయంలో చేసిన బ్లడ్ టెస్టు రిపోర్టు వారం తరువాత వచ్చింది. అందులో ఆల్ఫా మరియు బీటా వాల్యూస్ మారుతున్నట్లు ఉంది. డాక్టరు, "ఈసారి వచ్చినప్పుడు మరోసారి చెక్ చేద్దాం" అని అన్నారు. ఆ బాబా దయవల్ల ఈసారి చెకప్‍కి వెళ్ళినపుడు బ్లడ్ టెస్టు రిపోర్టు నార్మల్ రావాలని కోరుకుంటున్నాను. "ఆ రిపోర్టు నార్మల్ వచ్చేలా చూడండి. మీ కరుణాకటాక్షాలు ఎప్పుడూ మీ భక్తులపై చూపుతూ ఉండండి తండ్రి".
మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తే 2022, ఫిబ్రవరి మొదటి వారంలో ఆమెను డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాము. డాక్టరు, "కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది. మందులు వాడి చూడాలి" అన్నారు. దాంతో నేను రెండో వారంలో నా భార్యని చూపించే డాక్టరు దగ్గరకి నా భార్యతోపాటు అమ్మను కూడా తీసుకుని వెళ్ళాను. అప్పుడు, "ఏ సమస్యా లేకుండా దయ చూపమ"ని బాబాకి చెప్పుకుని మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరిస్తూ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. ఆ బాబా ఆశీర్వాదం వల్ల అమ్మని చూసిన డాక్టరు, "పెద్దగా సమస్య ఏమీ లేదు. కొన్నిరోజుల్లో నయం అయిపోతుంది" అని అన్నారు.
ఒకసారి నేను దాచిపెట్టుకున్న నా డబ్బుల నుండి 30,000 రూపాయలతో ఒక వన్ ప్లస్ మొబైల్ కొన్నాను. కొన్నిరోజులు బాగానే పనిచేసిన తరువాత హఠాత్తుగా ఒకరోజు మొబైల్ డిస్ప్లే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా డిస్ప్లే ఆన్ అవ్వలేదు. అప్పుడు సాయినాథుని తలుచుకుని ప్రయత్నిస్తే, వెంటనే ఆన్ అయ్యింది. అప్పుడు నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాను. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ, నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పెద్ద విషయం. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు
సాయి బంధువులందరికీ నమస్కారం. నాపేరు మహేష్. శ్రీసాయినాథునికి, మా ఇంటి దైవం కొమురవెల్లి శ్రీ మల్లన్నస్వామికి నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య మా పక్కింటివారితో కొంచెం స్థలం విషయంగా ఒక సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఎలాంటి గొడవ, ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కామవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయతో ఆ సమస్యను ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించారు. "ధన్యవాదాలు సాయినాథా". ఈమధ్య ఒకరోజు మా అక్క మెట్లు దిగుతుండగా కాలుజారి పాదం చాలా నొప్పి పెట్టింది. నేను ఆయింట్మెంట్ రాసి, ఆపై బాబా ఊదీ కూడా రాసాను. తరువాత, "బాబా! అక్కకి నొప్పి తగ్గి ఎలాంటి సమస్య లేకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి నొప్పి కొంతవరకు తగ్గింది. ఇలా ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు. "మీకు శతకోటి వందనాలు బాబా. అక్కకి పాదం నొప్పి పూర్తిగా తగ్గించండి. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది బాబా. మమ్మల్ని ఆదుకోండి. మంచిరోజులు వచ్చేటట్లు చెయ్యండి బాబా. నాకు ఒక బ్రతుకుదెరువు చూపించండి బాబా. చాలారోజులు నుండి శ్రద్ధ, సబూరిలతో ఎదురుచూస్తున్నాను బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
పిలిస్తే పలుకుతారు బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. నేను చిన్నప్పటినుండి సాయి భక్తురాలిని. నాకు అన్ని ఆయనే. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. 2022, ఫిబ్రవరి 12 రాత్రి ఎందుకోగాని మా మనవరాలు(అక్క కూతురు) విపరీతంగా ఏడుస్తూ అస్సలు నిద్రపోలేదు. టానిక్ పట్టినా ఏడుపు ఆపలేదు. తను అంతలా ఏడుస్తుంటే నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు బాబా ఊదీ పెట్టి, "పాప ఏడుపు ఆపేయాలి" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల పాప కాసేపటికి ఏడుపు ఆపింది. నేను కాస్త నెయ్యి వెచ్చబెట్టి పాపకి తినిపించాను. పాప హాయిగా పడుకుంది. అంతా బాబా దయ. ఆయన పిలిస్తే పలుకుతారు. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. "ధన్యవాదాలు బాబా. మీ కరుణాకటాక్షవీక్షణాలతో అందరినీ చల్లగా చూడు తండ్రి".

