సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1095వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా బాబా అనుగ్రహం లభిస్తుంది. 
2. బాబా ప్రసాదించిన ఆనందం

మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా బాబా అనుగ్రహం లభిస్తుంది.


నేను సాయిభక్తురాలిని. నేను ఎప్పుడూ బాబాకే అన్నీ  చెప్పుకుంటాను. ఎందుకంటే, దేవుడు మాత్రమే నా బాధని విని తీరుస్తాడని నేను గట్టిగా నమ్ముతాను. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఈమధ్యకాలంలో మా ఇంట్లోవాళ్ళు నాకు ఒక పెళ్లిసంబంధం చూశారు. వాళ్ళు పెళ్ళిచూపులకి కూడా వస్తామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల నాకు ఆ సంబంధం నచ్చలేదు. కానీ అది ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో అర్ధంకాక నాలో నేనే నలిగిపోతుండేదాన్ని. చాలా భయంగానూ, బాధగానూ ఉండేది. అన్నీ తెలిసిన బాబా ఏదో ఒకటి చేస్తారని దృఢమైన నమ్మకం ఉన్నప్పటికీ టెన్షన్‍లో, "ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు?" అని కోపంతో బాబాని ఏదేదో అనేదాన్ని. మళ్లీ అంతలోనే, "నువ్వే నాకు దిక్కు" అని అనుకునేదాన్ని. ఒకరోజు నాకు బాగా ఏడుపొచ్చి, "బాబా! ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? అన్నీ నువ్వే చేసి ఇప్పుడిలా నన్ను బాధపెడుతున్నావు. నువ్వు తప్ప నా బాధ ఎవరు వింటారు? నాపై దయచూపు తండ్రీ" అని బాగా బాధపడ్డాను. బాబా దయచూపారు. నిజంగా నేను ఊహించని అద్భుతమది. పెళ్ళిచూపులకి వస్తామన్న వాళ్ళే కాల్ చేసి, "ఇప్పుడు మాకు రావడానికి కుదరదు" అని చెప్పారు. నా బాధను విన్న బాబా మాత్రమే ఇది చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు నా మీద చూపించే ప్రేమకి, చేసిన సహాయానికి నేను సదా మీకు ఋణపడి ఉంటాను. ఆ సంబంధం ఎలాగైనా క్యాన్సిల్ అయ్యేలా చేయండి బాబా. నా మనసులో ఉన్నది, నేను కోరుకునేది మీకు తెలుసు. అది జరిగేలా చేయండి బాబా. నాకు అన్నీ మీరే బాబా".


ఇటీవల నాకు ఒక కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చింది. వాళ్ళు ఫలానా తేదీన జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ విడుదల చేశారు. అయితే, నేను ఆ తేదీని మరో తేదీకి మార్చమని ఆ కంపెనీ హెచ్.ఆర్‍ ని అడగాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అడిగితే ఒప్పుకుంటారో, లేదోనని నాకు  చాలా భయమేసింది. అప్పుడు బాబాని తలచుకుని, "బాబా! హెచ్.ఆర్ ఏమీ అనకుండా నా అభ్యర్థనకు ఒప్పుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుని హెచ్.ఆర్‍ కి కాల్ చేశాను. తను నేను చెప్పింది విని సింపుల్‍గా సరేనని చెప్పి, జాయినింగ్ తేదీ మార్చి కొత్త ఆఫర్ లెటర్ పంపించారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు చేసిన సహాయం వల్లే ఇది సాధ్యమైంది".


కొత్త కంపెనీలో ఉద్యోగం వచ్చిన తరువాత అదివరకు పాత కంపెనీలో నాతో కలిసి చాలాకాలం పనిచేసిన నా ఫ్రెండ్‍కి కూడా కొత్త కంపెనీలో ఉద్యోగం రావాలని తలచి తన రెజ్యూమ్ కొత్త కంపెనీవాళ్ళకి రిఫర్ చేశాను. వెంటనే కంపెనీ హెచ్.ఆర్. నా ఫ్రెండ్‍కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నారు. అయితే నా ఫ్రెండ్‍కి జీతం కొంచెం ఎక్కువగా ఉన్నందువల్లనో లేక మరే ఇతర కారణంగానో తెలీదుగానీ చాలారోజుల వరకు కంపెనీవాళ్ల నుంచి ఏ స్పందనా రాలేదు. నా ఫ్రెండ్‍కి కాల్ చేస్తే తను, "నేను కాల్ చేస్తే, హెచ్.ఆర్‍ పర్సన్‌కి కోవిడ్ వచ్చి సెలవులో ఉంటూ ఏమీ గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు" అని చెప్పింది. అది విని నాకు చాలా బాధగా అనిపించింది. కానీ బాబా మీద దృఢమైన నమ్మకముంచి నా ఫ్రెండ్‍తో, "బాబా ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆయనపై నమ్మకముంచు, చాలు" అని చెప్పి హెచ్.ఆర్‍ కాల్ చేస్తుందని వేచి చూశాను. తరువాత ఒకరోజు మావైపు నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిదనిపించి హెచ్.ఆర్‍.కి కాల్ చేసి విషయం గుర్తుచేశాను. తను వెంటనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. ఎటువంటి ఆశా లేకున్నా బాబా సహాయం చేస్తారన్న నా నమ్మకం వల్లే ఇది సాధ్యమైందనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఇంటర్వ్యూ బాగా జరిగి తనకి ఉద్యోగం రావాలి" అని బాబాను చాలా వేడుకున్నాను. తరువాత నా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో కూడా నేను బాబాను తలచుకున్నాను. ఒక గంటసేపు ఇంటర్వ్యూ జరిగింది. వెంటనే నా ఫ్రెండ్ కాల్ చేసి, "ఇంటర్వ్యూలో నాకు అనుభవంలేని వాటిపై కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను చెప్పలేకపోయాను. నేను ఉద్యోగానికి ఎంపిక అవుతానో, లేదో" అని అంది. దానికి తోడు ఇంటర్వ్యూ స్టేటస్ గురించి అడుగుదామని కంపెనీవాళ్ళకి కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఎటువంటి సమాధానమూ ఉండేది కాదు. నాకు చాలా బాధగా అనిపించి బాబా ఏం చెప్తారో చూద్దామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ కింది మెసేజెస్ వచ్చాయి.

'రేపు నీకు పరిష్కారం లభిస్తుంది. భయానికి కారణం లేదు. సన్మానం పొందేరోజు దగ్గరలో ఉంది. మీకు విజయం, కీర్తి, గౌరవం లభిస్తాయి'.

'దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనను విశ్వసిస్తే! అల్లా (దేవుడు) అత్యున్నత శక్తివంతుడు.. చనిపోయిన మనిషిని సైతం ఆయన బతికించగలడు. బిడ్డా! ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనపై నమ్మకముంచు'.

'ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది.... నీకు శుభవార్త అందుతుంది... సంతోషకరమైన రోజులు చూడటానికి సిద్ధంగా ఉండు... నేను నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను..'


అప్పుడు నేను, 'బాబా దయవల్ల మొదటి రౌండ్ ఫలితం మంచిగా వస్తే గురువారం గుడికి వెళ్ళి ఉపవాసం ఉందామ'ని అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. అయినా నా మనసుకి 'ఏదీ బాగోనప్పుడు కూడా దేవుడి మీద నమ్మకముంటే, అదే నిజమైన నమ్మకం' అనిపించి, "బాబా! ఏది ఎలా జరిగినా మీరు మంచి చేస్తారు. నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యేలా మీరు చేస్తారు" అని చెప్పుకుని నమ్మకంతో బాబా గుడికి వెళ్ళాను. అక్కడ బాబాతో, "బాబా! మీరు మెసేజ్ ద్వారా నాకు మాటిచ్చారు. అది ఖచ్చితంగా మీరు చేస్తారు. మీరు మాట తప్పరు" అని అనుకున్నాను. తరువాత గుడినుంచి ఇంటికి వచ్చి సచ్చరిత్ర పారాయణ చేశాను. ఆ సమయంలో చాలా బాధనిపించి, "ఎందుకు బాబా ఇంతలా పరీక్షిస్తున్నావు? నా భక్తి నిజం కాదా? నాకు భక్తి లేదా? నా భక్తి మీకు కనిపించట్లేదా? మీరు నా మాటలు వింటున్నారా బాబా? శిరిడీ వద్దామనుకుంటే, నేను అనుకున్నది ఎందుకు జరిగేలా చేయట్లేదు? నేనంటే నీకు ఇష్టం లేదా?" అని బాబా ఫోటో ముందు కాసేపు కోపంగా ఏదేదో అన్నాను. తరువాత నేను 'పారాయణ పూర్తయ్యేలోపు కంపెనీ నుంచి నాకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది' అని అనుకున్నాను. కానీ ఏ మెసేజ్ రాలేదు. దాంతో నేనే ఒకసారి అడుగుదామని హెచ్.ఆర్‍.కి మెసేజ్ చేశాను. తరువాత దానిగురించి మర్చిపోయాను. కాసేపటి తర్వాత ఫోన్ చూస్తే, హెచ్.ఆర్. రిప్లై ఉంది. విషయమేమిటంటే, 'నా ఫ్రెండ్ మొదటి రౌండ్ విజయవంతంగా పూర్తిచేసింది. మరుసటిరోజు తనకి రెండో రౌండ్ ఇంటర్వ్యూ ఉంది'. ఆ మెసేజ్ చూశాక నా బాబా నాకోసం ఇదంతా చేశారనిపించి నాకు కలిగిన సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఓపికతో వేచివుంటే అన్నీ బాబా చూసుకుంటారని ఇంకోసారి నిరూపించారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా. ఇంతకుమించి నేనేం చెప్పగలను? రెండో రౌండ్ ఇంటర్వ్యూ మంచిగా అయ్యేలా చూడు తండ్రీ. దయతో నా ఫ్రెండ్‍కి ఎలాగైనా ఆఫర్ వచ్చేలా చేయండి తండ్రీ. మీరు చేస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకముంది. తనకి ఉద్యోగమొస్తే మళ్లీ నేను ఈ బ్లాగులో పంచుకుంటాను. శిరిడీ వచ్చేందుకు నాకు మార్గం సుగమం చేశావు. త్వరలోనే వస్తాను బాబా".


నా అనుభవంతో ప్రతి ఒక్కరికీ చెప్పేది ఒక్కటే, 'ఎటువంటి ఆశా కనిపించని స్థితిలో కూడా బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన ఖచ్చితంగా దారి చూపిస్తారు. అన్నీ బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా దేవుడ్ని నమ్ముతారు. కానీ ఏదీ బాగోనప్పుడు, ఏ ఆశా లేనప్పుడు కూడా బాబా మీద నమ్మకముంటే అదే నిజమైన నమ్మకం. అటువంటి నమ్మకముంటే మీరు ఆశ్చర్యపోయేలా బాబా తామున్నామని నిరూపిస్తారు. "బాబా! మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. నా జీవితంలో ప్రతిక్షణం, ప్రతి విషయంలో నువ్వు ఉన్నావని నిరూపిస్తున్నావు బాబా. టెన్షన్ పెడతావు, మీ మీద నమ్మకంతో మేము వేచి ఉంటామా, లేదా అని చూస్తావు, మాకు ఓపికను నేర్పిస్తావు, మీ లీలలు మాకు అర్థం కావు తండ్రీ. కానీ నేను ఎప్పుడూ మిమ్మల్నే నమ్ముకున్నానయ్యా".


బాబా ప్రసాదించిన ఆనందం


సాయిబంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈ బ్లాగును ఈమధ్యకాలంలోనే చూశాను. అప్పటినుండి నేను క్రమంతప్పకుండా ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. మీ అందరి అనుభవాలు చదవడం వల్ల మూడు సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలకుంటున్నాను. అప్పట్లో మేము ఒక సొంత ఇల్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు ఒకరోజు రాత్రి గం.8.30నిమిషాలకు మేము బాబా గుడికి వెళ్ళాము. గుడిలో ఉండగా నాకు సచ్చరిత్రలోని భక్తుడు చోల్కరు కథనం గుర్తుకువచ్చి, "బాబా! మీరు మాకు ఒక సొంత ఇల్లు ఇచ్చేవరకు నాకు చాలా ఇష్టమైన పులిహోర తినను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతలో పూజారి పులిహోర ప్రసాదంగా ఇచ్చారు. అప్పుడు నేను, "బాబా! పూజారిగారు ఇంకాస్త పులిహోర పెడితే బాగుండు. ఎందుకంటే, మీరు అనుగ్రహించేవరకు నేను మళ్ళీ పులిహోర తినను కదా!" అని అనుకుని బయటకు వచ్చాను. కాస్త ముందుకు వెళ్ళగానే వెనుకనుండి పూజారిగారు నన్ను పిలిచి, "కొంచెం పులిహోర ఇస్తాను, తీసుకుని వెళ్ళండి" అని అన్నారు. నాకు ఎంత ఆనందమేసిందో నేను చెప్పలేను. ఆ బాబా అనుగ్రహాన్ని గుర్తుచేసుకున్న ప్రతిసారీ నాకు అంతే ఆనందంగా ఉంటుంది. అయితే బాబా మాకు ఇంకా సొంత ఇంటిని అనుగ్రహించలేదు. బాబా మమ్మల్ని అనుగ్రహించగానే మీతో తప్పకుండా పంచుకుంటాను.


ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటాను. ఈమధ్య నేను బ్లాగులో బాబా తనచేత సప్తశనివారవ్రతం ఎలా పూర్తి చేయించారనే ఒక భక్తురాలి అనుభవం చూశాను. అది చదివినంతనే నాకు కూడా ఆ వ్రతం చేయాలనిపించి సప్తశనివారవ్రతం చేశాను. ఆ పూజలో ఉపయోగించిన వెండి ఇల్లు అలాగే మా ఇంట్లో కొన్నిరోజులు ఉండిపోయింది. దానిని 'మా ఇంటి దగ్గరున్న వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవ్వాల'ని నేను, 'లేదు, తిరుపతిలో ఇవ్వాల'ని మావారు. అలా అనుకుంటూనే 3, 4 నెలలు గడిచాయి. అప్పుడు నేను, "బాబా! వీలైనంత త్వరగా ఆ వెండి ఇల్లు స్వామివారి గుడికి చేర్చితే, నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల 15 రోజులలో మావారికి తిరుపతి దర్శనానికి టికెట్ దొరికింది. దాంతో మావారు తిరుపతి వెళ్ళి వచ్చారు. నేను బాబా ప్రసాదించిన అనుగ్రహానికి ఆనందంలో మునిగిపోయాను. అందుకే వెంటనే ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇలా ఎన్నో విషయాల్లో బాబా నాకు సహాయం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ నచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram ��

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌Baba manikanta evala tour ki velladu.. Evala guruvaram.. Vadu yepudu mamalini vadili velaledu.. Vadini mirey chusukovaali sai PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo