సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1072వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నవాళ్ళ వెంట ఉండి రక్షించే సాయినాథుడు
2. ప్రార్థించినంతనే అడ్డంకులు తొలగించిన బాబా
3. బాబా దయవల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత

నమ్ముకున్నవాళ్ళ వెంట ఉండి రక్షించే సాయినాథుడు


శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలలను భక్తులకు అందజేస్తున్న బ్లాగు నిర్వాహక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇప్పుడు నా భార్య ఆరోగ్య విషయంలో బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను. నేను నా గత అనుభవంలో బాబా దయవల్ల నా భార్య గర్భం దాల్చిందని తెలియజేశాను. తరువాత మొదటి స్కానింగ్‍లో "బేబీ గ్రోత్ తక్కువగా ఉంది. థైరాయిడ్ ఉందని అనుమానంగా ఉంది, ఒకసారి థైరాయిడ్ టెస్టు చేయించండి" అని డాక్టరు చెప్పారు. డాక్టరు సలహా మేరకు మేము ఆ టెస్టు చేయించుకుంటే మరుసటిరోజు టెస్టు రిపోర్టు ఇస్తామని అన్నారు. అప్పుడు నేను బాబాని హృదయపూర్వకంగా ప్రార్థించి, "రిపోర్టు నార్మల్‌గా రావాల"ని కోరుకున్నాను. తమని ప్రార్థించినవాళ్ళకి ఆ సాయినాథుడు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన ఆశీర్వాదం వల్ల రిపోర్టు నార్మల్ అని వచ్చింది.


ఒక వారం తరువాత నా భార్యకి విపరీతమైన జలుబు, జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. డాక్టరు కడుపుతో ఉన్నప్పుడు అలా రాకూడదని, అందుకు మందులు కూడా వాడకూడదని చెప్పారు. ఆ సమయంలో నేను బాబానే నమ్ముకుని రోజూ ఊదీ నా భార్య నుదుటన పెట్టి, మరికొంత ఊదీ తన నోట్లో వేసేవాడిని. ఒకసారి ఊదీ నీళ్లలో కలిపి నా భార్యచేత త్రాగించి, "జలుబు తగ్గితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. దయానిధి అయిన సాయినాథుని ఆశీర్వాదం వల్ల మరుసటిరోజుకు నా భార్యకు చాలావరకు నయం అయింది. ఇంకా ఉన్న ఆ కాస్త కూడా బాబా దయవల్ల తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. ఆ సాయినాథుడు నమ్ముకున్నవాళ్ళ వెంట ఉండి సదా రక్షిస్తారు.


ఇప్పుడు ఆ సాయినాథుని కృపవల్ల తగ్గిన గుండెనొప్పి గురించి చెప్తాను. ఇటీవల నాకు మూడురోజులుగా గుండెలో చాలా నొప్పి వస్తుంటే, 'ఎందుకు వస్తుందో' అర్థంకాక నేను చాలా భయపడ్డాను. ఇంకా ఆ సాయినాథుని వేడుకుని ఊదీ పెట్టుకుని, మరి కొంచెం ఊదీ నోటిలో వేసుకుంటుండేవాడిని. 2022, జనవరి 26న ఆ నొప్పి మరింత పెరిగింది. దాంతో నాకు చాలా కంగారుగా అనిపించి, "బాబా! రేపు ఉదయానికి ఈ నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి'లో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించి నిద్రపోయాను. ఆ తండ్రి దయవల్ల ఉదయానికి నొప్పి చాలావరకు తగ్గిపోయింది. నమ్మినవాళ్లను ఎప్పుడు కాపాడేదైవం ఆ సాయినాథుడు మిగతా నొప్పిని కూడా తొందరలో తగ్గిస్తారని ఆశిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ప్రార్థించినంతనే అడ్డంకులు తొలగించిన బాబా


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ప్రియమైన సాయి భక్తులారా! నాపేరు సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. నేను ఇంతకుముందు అనేక అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2022, జనవరి 26న బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుత అనుభవాన్ని ఆయనకి మాటిచ్చినట్లు వెంటనే మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరి 25న ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ప్రచురితమైన 'సాయిభక్తుల అనుభవమాలిక 1030వ భాగం'లో ఒక భక్తురాలు బాబా అనుగ్రహంతో తన కూతురు, అల్లుడు, మనవడు స్వీడన్ నుండి ఇండియాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన అనుభవం గురించి పంచుకున్నారు. ఆ అనుభవం చదువుతూనే నేను కూడా, "మా అమ్మాయి, అల్లుడు, మనవళ్ళు యు.ఎస్.ఏ నుండి ఇండియాకి రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించమ"ని బాబాను కోరుకున్నాను. కారణం అదివరకే మా అమ్మాయి, "మేము  ఇండియా రావడానికి ప్రయత్నిస్తుంటే చాలా సమస్యలు వస్తున్నాయి. అందుచేత మేము బాబాను ప్రార్థిస్తున్నాము, మీరు కూడా ప్రార్థించండి" అని నన్ను అడిగింది. అందువలన నేను బాబాను పైవిధంగా కోరుకుని, "దయతో అడ్డంకులు లేవనే వార్త వచ్చేలా చేయండి బాబా. ఆ వార్త రాగానే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మాటిచ్చి పడుకున్నాను. అద్భుతం! 2022, జనవరి 26న ఉదయం 7 గంటలకు యు.ఎస్. నుండి మా అమ్మాయి ఫోన్ చేసి, "నాన్నా, మా వీసా ఆమోదంపబడింది. పైగా మరో మూడు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా బాబా చేసారు. మేము 2022, ఫిబ్రవరి 16 తరువాత ఇండియా వస్తాము. రాగానే బాబాకి మ్రొక్కుకున్న విధంగా హైదరాబాదులోని పంజాగుట్ట బాబా గుడిలో కోవా పంచుకుంటాను. మీరు వెంటనే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోండి" అని చెప్పింది. నేను ఆలస్యం చేయకుండా మరుసటిరోజు అంటే 2022, జనవరి 27, గురువారంనాడు బాబా ముందు కూర్చుని ఈ అనుభవం వ్రాసాను. "ధన్యవాదాలు బాబా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా దయవల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత


ఓం శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు రవీందర్. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా బాబు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు కరోనా కారణంగా క్లాసులు సరిగా జరగలేదు. ఆ కారణంగా తను ఫైనల్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మేము ఎంతో బాధపడి, "సాయీ! పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉంటే సంవత్సరం వృధా కాకుండా బాబు ఎంబీఏ చేసుకునేవాడు కదా తండ్రీ" అని మా కష్టం చెప్పుకున్నాము. బాబా దయవల్ల తొందరగానే సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలు వ్రాసి బాబా అనుగ్రహంతో మా అబ్బాయి ఉత్తీర్ణుడయ్యాడు. బాబా కృపవలన మా పాప కూడా మంచి మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాస్ అయ్యింది. "ధన్యవాదాలు బాబా".             


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



4 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me to pass my MBA exam .jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo