సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాశీనాథ్ ఖండేరావ్ గార్డే



సాయిభక్తుడు కాశీనాథ్ ఖండేరావ్ గార్డే సబ్‍జడ్జిగా పనిచేసి పదవీవిరమణ చేశాడు. ఇతను నాగపూర్(మహారాష్ట్ర)లోని కాంగ్రెస్‍నగర్ నివాసి. తమ వంశగురువు శ్రీరామచంద్ర టికొకర్ అయినప్పటికీ కాశీనాథ్ స్వయంగా శ్రీరామదాస్ బీడ్కర్ మహరాజ్ అనే వేరొక గురువును ఆశ్రయించాడు. వారు గొప్ప జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. ఆయన కాశీనాథ్‌కు ఉపదేశమిచ్చిన తరువాత, తాము అదివరకు యాత్రలలో దర్శించిన కొందరు సాధుసత్పురుషుల గురించి చెప్పి, కాశీనాథ్‌ను కూడా వారిని దర్శించి, వారి ఆశీస్సులు తీసుకోమని సూచించి, ఆయా సత్పురుషుల పేర్లు కూడా చెప్పారు. అంతేకాదు, ఆ మహాత్ములంతా ఒకే కుటుంబంలా మెలుగుతారనీ, వారిని దర్శించినప్పుడు అతన్ని వారికి సంబంధించినవాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారనీ, అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహాత్మ్యం అతనికి అవగతం కాగలవనీ అన్నారు. అంతేకాదు, తాము దర్శించిన మహాత్ములలో శిరిడీ సాయిబాబా ఒకరనీ, వారిని 25 సంవత్సరాల క్రిందట, అనగా 1873 ప్రాంతంలో స్వయంగా దర్శించామని కూడా చెప్పారు. 

అయితే, 1898లోనే తన గురువు శ్రీసాయిబాబాను దర్శించమని ఆదేశించినప్పటికీ కాశీనాథ్‌కు చాలాకాలంపాటు శిరిడీ వెళ్లేందుకు సమయం కలిసి రాలేదు. 1912-13లో అతను ఖంగాఁవ్‌లో సబ్‍జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే నెల సెలవుల్లో అతనికి శిరిడీ వెళ్లి బాబాను దర్శించే సమయం వచ్చింది. అతను శిరిడీ వెళ్ళడానికి ముందు పూణే వెళ్లి, అక్కడ ‘రే’ మార్కెట్‌లో బాబాకు సమర్పించేందుకుగానూ మేలురకం 'పయరీ' మామిడిపండ్లు మూడు కొని శిరిడీ ప్రయాణమయ్యాడు. అతను శిరిడీ చేరుకున్న వెంటనే బాబా దర్శనానికి మశీదుకు వెళ్ళాడు. అతను మశీదులో అడుగుపెట్టగానే, ఎటువంటి పరిచయం లేకుండానే బాబా అతన్ని, "రావయ్యా రామదాస్" అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ‘రామదాస్’ అనేది అతని పేరు కాకపోయినప్పటికీ తన గురువైన శ్రీరామదాస్ బీడ్కర్ చెప్పినట్లు తనకు హృదయపూర్వకమైన స్వాగతం లభించిందనీ, 'రామదాస్' అనేది తన గురువు ప్రస్తావనగానీ, తన వంశగురువు రామచంద్ర ప్రస్తావనగానీ అయివుంటుందని కాశీనాథ్ భావించాడు.

తరువాత కాశీనాథ్ తనతో తీసుకొని వెళ్లిన మామడిపండ్లను బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించి, సంతోషంగా వాటిని చూస్తూ, "చూసేందుకు చాలా బాగున్నాయి" అని అన్నారు. తరువాత వాటిని కోసి తెమ్మన్నారు. పండ్లు కోసేలోపు బాబా అక్కడున్న భక్తులతో, "ఇదిగో! ఈ పండ్లను ఇతను నాకోసం మార్కెట్లో కొని, రుచి చూడకుండా, తీసుకొచ్చిన పండ్లన్నీ నాకు సమర్పించాడు. ఇది ఆరోజు పండిట్ చేసిన దానికి వ్యతిరేకం. ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్ కొన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేదారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలై కొన్ని లడ్డూలు తిని మిగిలినవి తెచ్చి నాకు సమర్పించాడు. వాటివలె ఈ పండ్లు శేషభాగం(మిగిలిన) కాదు" అని అన్నారు. ఆ విషయం గురించి కాశీనాథ్ ఇలా చెప్పాడు: "బాబా తమ మాటల ద్వారా భక్తులమైన మనకు గురువు పట్ల ఉండాల్సిన స్వచ్ఛమైన, దృఢమైన భక్తిని మెచ్చుకున్నారనీ, శేషపదార్థాలను సమర్పించే కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని వీడాలనీ, శిరిడీకి ఎంతో దూరాన జరిగే విషయాలన్నీ బాబా ఎఱుకలోనివేననీ మనకు తెలియజేయడం ద్వారా మనకు ఆయనపై, మన గురువుపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తారనీ గ్రహించాను. అంతేకాదు, బాబా మాటలు, వారి చర్యల వలన నా గురువుపై, వారి బోధనలపై నాకున్న విశ్వాసం మరింత దృఢపడింది". 
     
అంతలో మామిడిపండ్లను కోసి ముక్కలు తీసుకొచ్చారు. వాటిలోనుండి బాబా ఒక ముక్క తీసుకొని, మిగిలినవి ప్రసాదంగా అందరికీ పంచారు. ఆ తరువాత, బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి శిరిడీలోనే నివాసముంటున్న తన కాలేజీ(డక్కన్ కాలేజీ) స్నేహితుడైన బాలభాటే ఇంట్లో బసచేశాడు కాశీనాథ్. అతను తన తిరుగు ప్రయాణానికి ప్రయత్నించిన ప్రతిసారీ బాబా అతనితో, "రేపటి వరకు ఆగు" అని అంటుండేవారు. దాంతో కాశీనాథ్ ప్రయాణం వాయిదాపడుతూ ఉండేది. అతను తన తిరుగు ప్రయాణ ఖర్చులకోసం 6, 7 రూపాయలు ఉంచుకున్నాడు. బాబా మొదటిరోజు 2 రూపాయలు, తర్వాత నాలుగురోజులు రోజుకొక రూపాయి చొప్పున దక్షిణ అడిగి తీసుకున్నారు. చివరిరోజున కాశీనాథ్ వద్ద కేవలం మూడు అణాల ఆరు పైసలు మాత్రమే మిగిలివున్నాయి. అంతర్‌జ్ఞాని అయిన బాబాకు ఆ విషయం తెలుసు. ఆయన తమంతట తామే అతనితో, "ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకుంచుకున్నావు? వాటిని కూడా నాకు దక్షిణగా ఇచ్చేయ్! భగవంతుడు నీకు సమృద్ధిగా ప్రసాదిస్తాడు" అని అన్నారు. దాంతో కాశీనాథ్ తన దగ్గరున్నదంతా బాబాకు ఇచ్చేశాడు. సరిగ్గా ఎనిమిదవరోజు అతని తిరుగు ప్రయాణానికి బాబా వద్ద నుండి అనుమతి లభించింది. దాంతో భాటే దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఇంటికి బయలుదేరాడు కాశీనాథ్.

సోర్స్: డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాయిబాబా బై బి.వి.నరసింహస్వామి.


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo