సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 791వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సంశయాన్ని తీర్చిన బాబా
  2. ఎదురొచ్చి అనుగ్రహించిన బాబా
  3. బాబా ఆశీస్సులతో కోవిడ్ నుండి విముక్తి

సంశయాన్ని తీర్చిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి మహరాజ్ సన్నిధి నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు అనుభవంలో, “నేను సాయిభక్తురాలిని కాను, నాకు సాయిభక్తులకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటీ లేవు” అని చెప్పాను. కానీ బాబా ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులకు ఉండవలసిన లక్షణాలను రోజూ కొద్దికొద్దిగా నాకు నేర్పుతున్నారు. నా కోరికలు తీరకపోతే బాబాను నిందించే అల్పమైన స్థాయి నుండి, “మీ ఇష్టం బాబా, మీ ఇష్టప్రకారమే కానివ్వండి” అనే స్థాయికి బాబా దయవల్ల వచ్చాను. నాలో వచ్చిన ఈ మార్పుని చూసి నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఇంకా మారాలి. ఇంకా ఇంకా బాబా ప్రేమను పొందాలి, బాబాకు ఇంకా దగ్గరవ్వాలి అని కోరుకుంటున్నాను. “ప్లీజ్ బాబా! మీకు ఇష్టం వచ్చినట్టు నన్ను మలచండి బాబా!”  ఇక నాకు బాబా ప్రసాదించిన అనుభవాలకు వస్తే...


మొదటి అనుభవం: ఒకసారి నేను, “పనిచేయని ల్యాప్‌టాప్‌కి ఊదీ రాసి ‘ఈ బ్లాగులో పంచుకుంటాను’ అని మ్రొక్కుకుంటే సమస్య తీరింది” అని ఒక సాయిబంధువు పంచుకున్న అనుభవాన్ని ఈ బ్లాగులో చదివాను. అది చదివి, “నిజంగా అలా జరుగుతుందా?” అని నేను కొంచెం సంశయించాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సంశయాన్ని నివృత్తి చేసే అనుభవం ఒకటి నాకు కలిగింది. దాదాపు 3, 5 నెలల పాటు నా ల్యాప్‌టాప్‌ని వాడని కారణంగా అది సరిగా పనిచేసేది కాదు. గంటలో చేయాల్సిన పనికి దాదాపు 3,4 గంటల సమయం పట్టేది. ఛార్జింగ్ పూర్తిగా పెట్టినా కూడా గంటలోపే ల్యాప్‌టాప్‌ ఆఫ్ అయిపోయేది. ‘ల్యాప్‌టాప్‌ కొని 6 సంవత్సరాలు అయింది కదా, బ్యాటరీ పాడయివుంటుంది’ అనుకున్నాను. ల్యాప్‌టాప్‌ తీసుకుని కంప్యూటర్ రిపేర్ షాపుకి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. దాంతో, 3,500 రూపాయలు పెట్టి క్రొత్త బ్యాటరీ వేయించి, సంతోషంతో ఇంటికి వచ్చి ఛార్జింగ్ పూర్తిగా పెట్టి ల్యాప్‌టాప్‌ ఆన్ చేశాను. కానీ పాత సమస్యే పునరావృతమైంది. అప్పుడు బ్లాగులో చదివిన ఆ సాయిబంధువు అనుభవం గుర్తుకువచ్చి, నేను కూడా బాబాను తలచుకుని, ల్యాప్‌టాప్‌కి ఊదీ రాసి, ‘ల్యాప్‌టాప్‌ సరిగా పనిచేస్తే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన’ని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ మరుసటిరోజు నుంచి నా ల్యాప్‌టాప్‌ ఏ సమస్యా లేకుండా పనిచేయసాగింది. “థాంక్యూ బాబా!”


రెండవ అనుభవం: పై అనుభవం బాబా ప్రసాదించిన తరువాత కూడా ఈ బ్లాగులో అనుభవాన్ని పంచుకోవడం గురించి నాలో ఇంకా సంశయ స్వభావం కొంచెం అలాగే ఉండిపోయింది. దాన్ని పోగొట్టడానికి ఈసారి బాబా అద్భుతమే చేశారు. నేను 2017లో Ph.D లో చేరాను. అప్పటినుండి నాకు రీసెర్చ్ వర్క్ ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియక అంతా అయోమయంగా ఉండేది. నా రీసెర్చ్ వర్కులో సహాయం చేయమని మా మేడంగారిని అడిగితే, ఆవిడ కొంతవరకు చెప్పి, మా సీనియర్ మేడంని అడగమనేవారు. కానీ, ఎంత అడిగినా ఆమె నాకు స్పష్టంగా చెప్పేవారు కాదు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. రీసెర్చ్ వర్కులో నాకు మార్గనిర్దేశం చేయమని నేను చాలామంది సార్‌లను, మేడంలను సంప్రదించాను. కానీ వారంతా సహాయం చేస్తామని చెప్పేవారేగానీ ఎవరూ నాకు సహాయం చేసేవారు కాదు. ఇక లాభంలేదు అనుకుని, 2021, జనవరిలో, ‘నేను చేస్తున్న ఉద్యోగం మానేసి Ph.D పైనే దృష్టిపెట్టాలి’ అనుకున్నాను. అనుకున్నట్టే ఉద్యోగం మానేశాను కూడా. తరువాత ధైర్యం చేసి మళ్ళీ మా మేడంగారిని రీసెర్చ్ వర్క్ కోసం సంప్రదిస్తే, మళ్ళీ ఆవిడ కొన్ని మెథడ్స్, ప్రొసీజర్స్ కోసం మా సీనియర్ మేడంని అడగమన్నారు. ‘మళ్ళీ అడిగినా ఆవిడ చెప్పదు, ఇక ఇంతే’ అనుకున్నాను. అప్పుడు నేను బాబాను స్మరించుకుని, “బాబా! ఇన్ని సంవత్సరాలు నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో మీకు తెలుసు. (నిజానికి ఇన్ని సంవత్సరాలూ Ph.D కోసం సాయం చేయమని నేను బాబాను అడగలేదు.) సీనియర్ మేడం గనుక ఈసారి సరిగ్గా రెస్పాండ్ అయి, నాకు మెథడ్స్, ప్రొసీజర్స్ చెప్తే నా అనుభవాన్ని ఖచ్చితంగా సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో వెంటనే పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. మ్రొక్కుకున్నాగానీ, 100% నమ్మకంతో కాదు. ‘ఈమె ఎలాగూ చెప్పదు’ అనే ఎక్కువ శాతం అనిపించేది. కానీ ఆశ్చర్యంగా, నేను ఆమెకు కాల్ చేసి, “మేడంగారు మిమ్మల్ని అడగమన్నారు” అని చెప్పగానే, ‘కొన్ని ప్రొసీజర్స్, మెథడ్స్ నీ మెయిల్‌కి పంపిస్తాను’ అని చాలా సానుకూలంగా స్పందించారు. నిజానికి ఇంతకుముందు ఎన్నోసార్లు నాకు సహాయం చేయమని ఆమెని అడిగేదాన్ని. మేడంగారు అడగమన్నారని చెప్పినా ఆమె నాకు ఏమీ చెప్పేది కాదు. నన్ను చాలా చులకనగా చూసేవారు. ఎంతో ఏడ్చేదాన్ని. కానీ ఈసారి ఆమె సానుకూలంగా రెస్పాండ్ అవటం చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. బాబా చూపిన కరుణకు ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ విధంగా బాబా నాకు గుణపాఠం చెప్పి మిగిలిన సంశయాన్ని కూడా తీర్చారు.


సాయిబంధువులారా! నాలాగా మీకు కూడా ‘ఈ బ్లాగులో మ్రొక్కుకుంటే పని అవుతుందా, లేదా’ అనో, ‘భక్తుల అనుభవాలు చదివి నిజమా, కాదా’ అనో సంశయించవద్దు. బాబా ఊదీని, ఈ బ్లాగ్ మహత్యాన్ని పరీక్షించదలచి నేను ఓడిపోయాను. తగిన గుణపాఠం నేర్చుకున్నాను. “నన్ను క్షమించండి బాబా. నాలోని ఈ చంచల మనస్తత్వాన్ని, ఇలా ప్రతి విషయాన్ని సంశయించే గుణాన్ని, అహంకారాన్ని పూర్తిగా తొలగించి, మీపై భక్తి, విశాసం, ప్రేమ పెంపొందేలా ఆశీర్వదించండి బాబా. వెంటనే ఈ అనుభవాన్ని పంచుకుంటానని చెప్పి సుమారు 2 నెలలు పైగా పంచుకోకుండా వాయిదా వేశాను. అందుకు నన్ను మన్నించండి బాబా. నా Ph.D లో మీరే గైడుగా ఉండి నాకు సహాయం చెయ్యండి బాబా. నాకు అంతా అయోమయంగా ఉంటోంది. ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటున్నాను బాబా. నా ఈ పరిస్థితిని తొలగించండి. మీరే మీకు ఇష్టమైన మార్గాన్ని నాకు చూపించండి బాబా ప్లీజ్”.


మూడవ అనుభవం: నెల రోజుల వయసున్న మా అక్కావాళ్ళ బాబుకి కంటిసమస్య ఎదురైనప్పుడు కూడా, “అంతా సరిచేయండి బాబా, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అనుకున్నాను. దానిని కూడా నేను వాయిదా వేశాను. “నన్ను క్షమించండి బాబా. బాబుకి ఇంకొకసారి టెస్ట్ చేయించమన్నారు. ప్లీజ్ బాబా, అది కూడా సరిచేసి, బాబు ఆరోగ్యంగా, ఆనందంగా, మీ నీడలో పెరిగే అవకాశాన్ని కల్పించండి బాబా”. 


“బాబా! కొన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న మానసికవ్యధ మీకు తెలుసు. ఎటూ నిర్ణయం తీసుకోలేక నడిసముద్రంలో ఉన్న పడవలాగా ఉంది నా జీవితం. నా జీవితాన్ని మీకు ఇష్టమైన ఒడ్డుకు చేర్చండి, ప్లీజ్ బాబా. నాలో ఉన్న ప్రతికూల ఆలోచనలను, బద్ధకాన్ని పోగొట్టండి బాబా. నన్ను మీ బిడ్డలా సగర్వంగా జీవించేలా చేయండి బాబా. నాకు ఉన్న ఆ సమస్యను కూడా మీకు ఇష్టమైన రీతిలో త్వరగా పరిష్కరించండి బాబా. నా సమస్య తీరాక ఆ అనుభవాన్ని మళ్ళీ ఇదే బ్లాగులో మన సాయిబంధువులతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బాబా. త్వరగా పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఎదురుచూస్తుంటాను బాబా”. 


ఓం శ్రీ సాయినాథాయ నమః


ఎదురొచ్చి అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నా అనుభవాలను బ్లాగులో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్.ఎస్. చదువు కోసం మా అమ్మాయిని అమెరికా పంపే నిమిత్తం ఎస్.బి.ఐ లో లోన్‌కి అప్లై చేయడానికి వెళ్తున్నపుడు బ్యాంకుకి సమీపంలో కొంతమంది బాబా ఫోటోతో నాకు ఎదురువచ్చారు. అది నాకు శుభసూచకంగా అనిపించింది. కానీ లోన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు నేను, "బాబా! నువ్వే ఎదురొచ్చావు. అంతా సవ్యంగా జరిగేలా నువ్వే చూడాలి. భారమంతా నీదే" అని బాబాను ప్రార్థించాను. కరుణామయుడైన బాబా సమస్యలన్నీ దాటిస్తూ, సమయానికి లోన్ వచ్చేలా చేశారు. ఈ కరోనా కాలంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా బాబా ఊదీ పెట్టుకుని, ఆయననే ప్రార్థిస్తూ అన్నింటినీ అధిగమిస్తున్నాము. "ధన్యవాదాలు బాబా. మా అమ్మాయిలిద్దరినీ చల్లగా చూడండి బాబా. నేను మిమ్మల్ని కోరిన కోరిక  ఏమిటో మీకు తెలుసు. ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు జరిగేటట్లు చూడు తండ్రీ, సాయినాథా!"


బాబా ఆశీస్సులతో కోవిడ్ నుండి విముక్తి


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను 1912 నుండి సాయిభక్తురాలిని. నేను అప్పటినుండి ఇంగ్లీష్ బ్లాగు అనుసరిస్తున్నాను. ప్రస్తుతం ఈ తెలుగు బ్లాగును అనుసరిస్తున్నాను. ఇది ఎంతో చక్కని బ్లాగు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. రెండు నెలల క్రితం మా అమ్మాయికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను ఎంతో బాధతో 'మా అమ్మాయికి ఆరోగ్యాన్ని ప్రసాదించమ'ని బాబాను వేడుకొని, ఆయన ఆశీర్వాదంతో మా అమ్మాయికి నయమవుతుందని నమ్మకముంచాను. డాక్టరైన మా అబ్బాయి మా అమ్మాయికి చికిత్స మొదలుపెట్టాడు. మా అమ్మాయి 14 రోజులు గృహనిర్బంధంలో ఉంటూ మా అబ్బాయి ఇచ్చిన మందులు వాడింది. బాబా ఆశీస్సులతో తనకు నయమైంది. బాబా తనని కాపాడారు. బాబా దయవల్ల ఇప్పుడు మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు తండ్రి. మీ అమృతహస్తంతో మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరు మాతో ఉండండి. ఐ లవ్ యు బాబా. ప్రస్తుతం భారతదేశమంతా కరోనా మహమ్మారి వలన అల్లాడిపోతోంది. మేము ఎంతో భయాందోళనలకు గురవుతున్నాము. ప్రజలందరినీ మీరే రక్షించాలి బాబా. దయచేసి రోగులందరికీ అండగా ఉండి వారిని కాపాడండి. మీ భక్తులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి".



ఆర్.సి.కపాడి



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించుకున్న అదృష్టవంతులలో షోలాపూర్ నివాసియైన ఆర్.సి.కపాడి ఒకరు. అతను తన జీవితంలో ఒక్కసారి మాత్రమే శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. తన మదిలో నిక్షిప్తం చేసుకున్న ఆ మధురానుభూతిని అతనిలా తెలియజేశాడు: 

"చిన్నవయస్సులో ఉన్నప్పుడు నాకు సాధుసత్పురుషుల పట్ల అత్యంత ఆసక్తి ఉండేది. ఆ వయస్సులో నేను హుబ్లీకి చెందిన శ్రీసిద్ధారూఢస్వామి అనుగ్రహాన్ని పొందాను. 1917లో నేను పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు మా అన్నయ్య సఖారామ్ తన స్నేహితుడు రామ్‌భావు దేశ్‌పాండేతో కలిసి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత అద్భుతమైన బాబా దైవత్వం గురించి, అక్కడ వారు పొందిన అనుభవాల గురించి ఎంతో ఆనందంగా, రమణీయంగా వర్ణించారు. అవి నాపై చెరగనిముద్ర వేశాయి. దాంతో, ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్లి బాబాను దర్శిస్తానా అని ఆరాటపడసాగాను. అదలా ఉంచితే, దురదృష్టవశాత్తూ శిరిడీ నుండి వచ్చిన కొద్దిరోజులకే మా అన్నయ్య ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి బారినపడ్డాడు. అయితే తను బాబాను దర్శించి, వారి దివ్య సన్నిధిలో మూడురోజులు గడిపిన అదృష్టవంతుడు.

కొన్ని నెలల తరువాత నాకు శిరిడీ సందర్శించే అవకాశం వచ్చింది. మా కజిన్ (సోదరుడు) బాబా దర్శనానికి వెళ్లదలచి, "నాతో పాటు వస్తావా?" అని నన్ను అడిగాడు. నేను సంతోషంగా వెంటనే నా అంగీకారాన్ని తెలిపాను. ఆ రోజుల్లో రైలులో కోపర్‌గాఁవ్‌ వరకు వెళ్లి, అక్కడినుండి ఎడ్లబండిలో శిరిడీ చేరుకోవాల్సి ఉండేది. అలాగే మేము శిరిడీ చేరుకొని, వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వారి ముందు సాష్టాంగపడ్డాము. అప్పుడు ఆయన మమ్మల్ని దక్షిణేమీ అడగలేదు. కానీ, తరువాత మేము శిరిడీలో బసచేసిన రెండురోజుల్లో బాబా మమ్మల్ని తరచూ దక్షిణ అడుగుతూ ఉండేవారు. మా తిరుగు ప్రయాణం విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటారని మాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆయన కోరింది ఆయనకివ్వడానికి మేము చాలా సంతోషించాము. అందువలన మేము శిరిడీ నుండి బయలుదేరే సమయానికి మా జేబులు ఖాళీ అయిపోయాయి.

మేము శిరిడీ వెళ్లిన మరుసటిరోజు ఉదయం 8 గంటలకు బాబా లెండీకి వెళ్తున్నపుడు సాఠేవాడా సమీపంలో వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. నేను, నా సోదరుడు కూడా అక్కడికి వెళ్లి, ఇద్దరమూ పదేపదే వారి పాదాలకు నమస్కరించసాగాము. చివరికి బాబా, "అరే! ఎందుకు మీరు నా పాదాలకు పదేపదే నమస్కరిస్తున్నారు? మీరు ఇప్పటికే పదిహేడుసార్లు నమస్కరించారు. భక్తితో ఒకసారి నమస్కరించడానికి, పదిహేడుసార్లు నమస్కరించడానికి తేడా ఏమిటి?" అని అడిగారు. 

ఆరోజు సాయంత్రం మేము దివ్యమైన బాబా చావడి ఉత్సవానికి హాజరై, చావడిలో బాబాకు ఆరతి ఇవ్వడం చూశాము. తరువాత బాబా ఒకసారి చిలిం పీల్చి, అక్కడ కూర్చున్న భక్తులకు అందించారు. వాళ్లంతా ఆ చిలిం పీల్చి ఆధ్యాత్మికానందాన్ని అనుభవించారు.

చివరిరోజున మేము మసీదుకు వెళ్లి బాబా ముందు సాష్టాంగపడ్డాము. మేము బయలుదేరడానికి ప్రత్యేకంగా బాబాను అనుమతి అడగలేదు. కానీ మనసులోనే మేము బయలుదేరుతున్నామని వారితో చెప్పాము. తరువాత బయలుదేరి మా వద్ద డబ్బు లేనందున కాలినడకన కోపర్గాఁవ్ చేరుకున్నాము. మా తిరుగు ప్రయాణానికి అదివరకే మా దగ్గర టికెట్లు ఉన్నందున రైలు ఎక్కాము. నాసిక్‌లో దిగి కాలినడకన వివిధ పవిత్ర స్థలాలను దర్శించి, రాత్రి కాగానే మా తదుపరి ప్రయాణం కొనసాగించడానికి తిరిగి స్టేషనుకి చేరుకున్నాము. అప్పటికే మేము చాలా ఆకలితో ఉన్నాము. ఇద్దరమూ మా జేబులు తడుముకున్నాము. మా కజిన్‌కి తన జేబులో రెండణాల నాణేలు నాలుగు దొరికాయి. వాటితో తను మరమరాలు కొని తెచ్చాడు. వాటిని తిని ఏదో విధంగా మేము ఇంటికి చేరుకున్నాము. ఈ సంఘటన ద్వారా, 'బాబా అనుమతి తీసుకొన్న తరువాతే శిరిడీ వదలి రావాల'నే పాఠాన్ని మేము నేర్చుకున్నాము. శిరిడీలో నేను గడిపిన ఆ మూడురోజులు నా స్మృతిఫలకంపై చిరస్మరణీయంగా చెక్కబడ్డాయి. అవి నా జీవితంలో మరపురాని రోజులు".
రెఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక 1994.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 790వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. అడుగడుగునా మమ్ము కాపాడే చల్లని తండ్రీ!

  2. ఎటువంటి బాధా లేకుండా కోవిడ్ నుండి బయటపడేసిన బాబా


అడుగడుగునా మమ్ము కాపాడే చల్లని తండ్రీ!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకున్నారు.


రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహరాజుకి నా కోటానుకోట్ల పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులైన సాయికి, బాబా భక్తులందరికీ నా నమస్కారములు. ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలు చదివి బాబా పట్ల భక్తిని, నమ్మకాన్ని వేయింతలు పెంచుకొనేలా, నిరంతరం బాబా పాదపద్మాలను స్మరించేలా చేస్తున్న ఈ బ్లాగుకి నిరంతరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు బాబా చూపించిన మహిమలు కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటాను. 


నేను సాయి భక్తురాలిని. ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నేను 2021, ఫిబ్రవరి నుండి వరుసగా కొన్ని రోజుల పాటు ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. వెళ్లిన ప్రతిచోటా ఏ ఇబ్బందీ కలుగకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు నా సాయితండ్రి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అవలీలగా విధులు నిర్వర్తించానంటే అది బాబా నాకు తోడుగా ఉండబట్టే. అంతేకాదు, కోవిడ్ ఇంత తీవ్రంగా ఉన్నరోజుల్లో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ఎన్నికలలో డ్యూటీ చేసినప్పటికీ కోవిడ్ బారినపడకుండా నన్ను రక్షించారు బాబా.


ఒకరోజు నేను పంచాయతీ ఎన్నికల్లో P.O (ప్రిసైడింగ్ ఆఫీసర్) గా పనిచేసి, పోలింగ్ పూర్తయిన తరువాత అన్నీ డిపాజిట్ చేసేటప్పటికి రాత్రి 12 అయింది. అసలు అప్పటికే నేను ‘ఇంటికి ఎలా వెళ్ళాలా’ అని ఆందోళనపడుతున్నాను. ఆరోజు సాయంత్రం ప్రక్కనున్న పోలింగ్ బూత్‌లో విధులు నిర్వర్తిస్తున్న P.O. మేడమ్‌తో మాట్లాడుతూ, “మీతో కలిసి వైజాగ్ రావడానికి మీ కారులో నాకోసం ఖాళీ ఉంటుందా?” అని రిక్వెస్ట్ చేశాను. కానీ, డ్యూటీకి వచ్చేటప్పుడు ఆ కారులో నలుగురు టీచర్లు కలసి వచ్చారు కాబట్టి కారులో ఇంక ఖాళీ లేదన్నారు. కానీ, రాత్రి 12 గంటలకు ఆ టీచరుగారే నన్ను పిలిచి, ‘తనతో వచ్చినవారు వారి పని త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్లిపోయారనీ, తమ కారులో ఖాళీ ఉంద’నీ చెప్పి నన్ను తమ కారులో ఎక్కించుకుని వైజాగ్ తీసుకొచ్చారు. దాదాపు 80-90 కిలోమీటర్ల దూరం హాయిగా కారులో ప్రయాణం చేసిన తరువాత వారు నన్ను ఒకచోట డ్రాప్ చేశారు. మావారు అక్కడికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. నన్ను డ్రాప్ చేసిన చోట సాయినాథుని దేవాలయం ఉంది. అది చూసి, “నేనుండ భయమేల?” అంటూ సాయినాథుడు నాకు అభయమిస్తున్నట్లుగా అనిపించి ఎంతో ఆనందంతో బాబాకు నమస్కరించుకున్నాను. కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా, ‘ఇంత రాత్రివేళ నన్ను భద్రంగా తీసుకొస్తున్నది నా సాయితండ్రే’ అనుకుంటూ, మనస్సులోనే బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.


మరో అనుభవం: ఈ కోవిడ్ కాలంలో మా పాపకి, మా చెల్లి బాబుకి జ్వరం వచ్చింది. నేను మనసులోనే బాబాకు నమస్కరించి, “బాబా! మీ దయతో పిల్లలిద్దరికీ త్వరగా జ్వరం తగ్గిపోవాలి. వారికి వచ్చిన జ్వరం కోవిడ్‌కి సంబంధించినది కాకుండా చూడండి. మీ అనుగ్రహంతో పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మరీ మరీ ప్రార్థించి, పిల్లలిద్దరికీ బాబా ఊదీ పెట్టి, నోట్లో కొంచెం ఊదీ వేసి బాబాపైన భారం వేశాను. ఆ చల్లని తండ్రి ఎంతో దయతో పిల్లలిద్దరికీ నయం చేశారు. బాబా అనుగ్రహంతో ఇద్దరూ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.


ఒక్కోరోజు నేను బాబా కోసం అనుకున్న విషయాలు, ఆయన కోసం చేసిన పనులు వేరేవారి అనుభవాలుగా ఆ మరుసటిరోజే బ్లాగులో రావడం చాలా ఆనందంగా, విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు, కొద్దిరోజుల క్రితం నేను ‘మా కుటుంబాలు బాగుండాలనీ, గృహనిర్మాణం పూర్తవ్వాలని, గృహప్రవేశం చక్కగా జరిపించాలని’ బాబాను మరీ మరీ ప్రార్థించి 9 రూపాయలు ముడుపు కట్టాను. ఆ మరుసటి ఉదయం సాయిభక్తుల అనుభవాలు చదువుదామని బ్లాగ్ ఓపెన్ చేస్తే, ఒక సాయిభక్తుడు తమ ఇంటి పునర్నిర్మాణం జరిపించి, గృహప్రవేశం, హోమం చేసుకొని, నవగురువారవ్రతం చేయ సంకల్పించి మరచిపోవడం, బాబా ఆయనకు కలలో కనిపించి “నాకు తొమ్మిది నాణేలు కావాలి” అని తన మ్రొక్కును గుర్తుచేయడం, వెంటనే ఆయన 9 రూపాయలు ముడుపు కట్టి పూజలు ప్రారంభించడం జరిగిందని తన అనుభవాన్ని పంచుకోవడం కనిపించింది. ఇది నాకు బాబా ఇచ్చిన అభయంగా భావిస్తున్నాను. “మీ తల్లిగారి ఇంటినిర్మాణము, గృహప్రవేశము నిర్విఘ్నంగా జరుగుతుంది” అని బాబా చెప్పినట్లు నేను భావిస్తున్నాను. అదేవిధంగా, ఆ భక్తుని అనుభవం ద్వారా ‘9 గురువారాల వ్రతం చేయమ’ని బాబా నన్ను ఆదేశించినట్లు భావిస్తూ, బాబా ఆజ్ఞను శిరసావహించాలని సంకల్పించాను. అలాగే, ఒకరోజు మేము రొట్టెలు చేసుకుంటూ మా రోడ్డులో ఉండే ఒక కుక్క కోసం కూడా ఒక రొట్టె చేశాను. పాపం, ఆ కుక్క ఆకలితో ఉంటుందని ఎందుకో నాకు అనిపించింది. వెనువెంటనే ఆ మరుసటిదినమే బాబా తన సందేశంలో, “నీవు పెట్టిన భోజనంతో నాకు ఎంతో తృప్తి కలిగింది. ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండు” అనే సందేశం రావడం నన్ను ఆశ్చర్యచకితురాలిని చేసింది. ఇటువంటి అనుభవాల ద్వారా బాబా పట్ల భక్తివిశ్వాసాలు నాలో రోజురోజుకీ మరింతగా పెంపొందుతున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను.


బాబాను నేను కొన్నిసార్లు మూర్ఖంగా ప్రశ్నించేదాన్ని. ఒకసారి నా స్నేహితులలో కొంతమందికి ప్రమోషన్ వచ్చి, నాకు రానప్పుడు, అందులో నా అశ్రద్ధ వున్నప్పటికీ, “మీరెందుకు నన్ను సరైన దారిలో పెట్టి నాకు ప్రమోషన్ వచ్చేలా చూడలేదు?” అంటూ బాబాపై అలిగి ఏడ్చేశాను. బాబా ఎంతో కరుణతో ఆ తరువాతి విడత కౌన్సెలింగుకి నన్ను పీజీ డిగ్రీతో సిద్ధం చేశారు. కానీ అప్పటికింకా పరీక్షా ఫలితాలు రాలేదు. ఇంతలో టీచర్స్ ప్రమోషన్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు. దాంతో ఈసారి కూడా నాకు ప్రమోషన్ రాదేమోనని బాధపడుతూ బాబాకు చెప్పుకుని, “అయ్యో, ఇప్పుడు కూడా ప్రమోషన్ ఇవ్వవా తండ్రీ” అంటూ భోరుమన్నాను. ఇక చూడండి బాబా లీలలు. అకస్మాత్తుగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ప్రమోషన్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. ఈలోపు నా పీజీ పరీక్షా ఫలితాలు రావడం, సర్టిఫికెట్లు తెచ్చుకోవడం, సీనియారిటీ జాబితాలో నా పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వెనువెంటనే ప్రమోషన్ ఇచ్చి చక్కని అనుకూలమైన స్కూలులో నాకు పోస్టింగ్ ఇచ్చి భక్తుల పట్ల తమ వాత్సల్యాన్ని చాటారు బాబా. నాకన్నా ముందు ప్రమోట్ చేసిన స్నేహితుల కన్నా ఎక్కువ పే స్కేల్‌లో నా జీతం నిర్ణయించబడింది. ఇది బాబా లీల కాక మరి ఇంకేంటి?


ఇటీవల ఒకరోజు మా అమ్మకి జ్వరం వచ్చింది. తన వయసు డెబ్భై నాలుగు సంవత్సరాలు. జ్వరంతో ఆమె విపరీతంగా నీరసించిపోయారు. భోజనం కూడా మానేశారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అమ్మను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళడానికి భయమేసి, నేను డాక్టర్ వద్దకు వెళ్లి అమ్మకు వచ్చిన జ్వరం లక్షణాలు చెప్పి మందులు రాసివ్వమని అడిగితే, ఆయన కోవిడ్ టెస్టుతో పాటు మరికొన్ని టెస్టులు చేయించమని చెప్పారు. అది విని విపరీతమైన ఆందోళనతో బాబాకు నమస్కరించుకుని, అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడమని ప్రార్థించి, ‘కోవిడ్ టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని మ్రొక్కుకున్నాను. ఆ తరువాత, ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ మంత్రం పఠించుకుంటూ అమ్మకు కోవిడ్ టెస్ట్ చేయించాను. బాబా దయవల్ల అందులో అమ్మకు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఇది ముమ్మాటికీ బాబా అనుగ్రహమే. “నా చల్లని తండ్రీ! అందరూ బాగుండాలి. అందరం క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మిమ్ము మరీ మరీ వేడుకుంటున్నాను. బాబా! నూతన గృహ నిర్మాణం పూర్తయి, గృహప్రవేశం చేసి, క్రొత్త ఇంట్లో అందరం ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి. మా అమ్మకి దెబ్బ తగిలి నడవలేకపోతే తనని మీరే తిరిగి నడిచేలా చేశారు. తనకి ఆరోగ్యం బాగుండేలా ఆశీర్వదించండి. నా అనారోగ్య సమస్యలు కూడా తగ్గించు బాబా. అందరూ బాగుండాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి. ఇంటికి చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నాను. నన్ను కరుణించి ఇంటికి దగ్గరలో మంచి స్కూల్లో నాకు పోస్టింగ్ ఇప్పించండి సాయినాథా! అడుగడుగునా మమ్ము కాపాడండి చల్లని తండ్రీ!”


 ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఎటువంటి బాధా లేకుండా కోవిడ్ నుండి బయటపడేసిన బాబా

 

నేను సాయిభక్తురాలిని. నా భర్త పనిచేసే కార్యాలయంలో ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. అలా ఒకసారి కోవిడ్ పరీక్షలు చేసినప్పుడు నా భర్తకి పాజిటివ్ అని తెలిసింది. నిజానికి ఆయనకి కోవిడ్ లక్షణాలు ఏవీ లేవు. తరువాత ఎందుకైనా మంచిదని నేను, మా బాబు కూడా కోవిడ్ పరీక్ష చేయించుకున్నాము. నాకు కొద్దిపాటి లక్షణాలతో పాజిటివ్ వచ్చినప్పటికీ బాబా దయవల్ల మా బాబుకి నెగెటివ్ వచ్చింది. అప్పుడు నేను బాబాను తలచుకుని, "ఎటువంటి బాధా లేకుండా మేము ఈ కష్టం నుండి బయటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. నేను, మావారు హోమ్ క్వారంటైన్‌లో ఉండి, 14 రోజుల తరువాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటే, బాబా కృపవలన మా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. మేము ఎటువంటి బాధా లేకుండా కోవిడ్ నుండి బయటపడ్డామంటే అది కేవలం బాబా దయవలనే సాధ్యమైంది. నేను నా భావాలను సరిగా వ్యక్తపరచలేకపోయాను. కానీ బాబా పట్ల నాకున్న ప్రేమ అనంతం. "థాంక్యూ సో మచ్ బాబా. మీ అనుగ్రహం మీ భక్తులందరిపై సదా ఉండాలి తండ్రీ!"


సాయిభక్తుల అనుభవమాలిక 789వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా చేసిన మేలు
  2. విశ్వాసం కోల్పోకుండా బలపరిచిన బాబా
  3. మనస్ఫూర్తిగా వేడితే ఏదైనా సరే బాబా తీరుస్తారు
  4. మనకోసమే కాదు, ఎవరికోసం ప్రార్థించినా బాబా వెంటనే స్పందిస్తారు

బాబా చేసిన మేలు


ముందుగా సాయిబాబాకు నా నమస్కారాలు. ఈ అవకాశమిచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు ప్రమోద. బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా భర్త ఆంధ్రా బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన వైజాగ్‌లో తన సిస్టర్ ఇంటిలో ఉంటూ ప్రతి వారాంతంలో మా ఇంటికి వస్తుంటారు. ఆయనకు తన వృత్తిరీత్యా ప్రతిరోజూ ప్రజలతో ముఖాముఖీ కలవడం, మాట్లాడటం తప్పనిసరి. ఆ కారణంగా 2020, సెప్టెంబర్ 25న ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండమని సూచించారు. అయితే సరిగ్గా అదే సమయంలో మేముంటున్న ఇంటికి చెదపురుగుల నివారణ నిమిత్తం క్రిమిసంహారక మిశ్రమాన్ని స్ప్రే చేయించినందున నేను ఇంట్లో సామానంతా మా ఎదురింట్లో పెట్టాను. అందువలన ఇంట్లో ఏమీ లేవు, ఇల్లంతా ఖాళీగా ఉంది. నా భర్త నాకు ఫోన్ చేసి "హోం క్వారంటైన్‌లో ఉండటం కోసం ఇంటికి వస్తున్నాన"ని చెప్పారు. ఆయనకి కరోనా అని తెలిసి పనిమనిషితో సహా నాకెవరూ సహాయం చేయడానికి ఆసక్తి  చూపలేదు. ఒంటరిగా ఏమి చేయడానికీ నా బుర్ర పనిచేయలేదు. నాకు చాలా భయమేసి సాయి నామస్మరణ మొదలుపెట్టాను. వెంటనే బాబా దయవల్ల నాతో పాటు కాలేజీలో పనిచేసే ఒక లెక్చరర్ ఫోన్ చేసి, తాను సహాయం చేస్తానని చెప్పారు. అతని సహాయంతో నా భర్త వచ్చేలోపు ఆయన కోసం ఒక గదిని ఏర్పాటు చేశాను. ఇంతటితో కథ ముగిసిపోలేదు. వారం రోజుల్లో నాక్కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరోవైపు నా భర్త షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు అవసాగాయి. అనారోగ్యంతో నేను ఆయనకి సహాయం చేయలేకపోయాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దాంతో ఇద్దరమూ వెళ్లి GIMSR హాస్పిటల్లో చేరాం. హాస్పిటల్లో చేరాక, నా శరీరానికి ఎంతో అవసరమైన విశ్రాంతిని బాబా ఈవిధంగా ఇచ్చారని గ్రహించాను. అసలు విషయమేమిటంటే, మా అమ్మ అనారోగ్యం, ఆమె మరణం, వడ్రంగి పని, ఇంట్లోని సామాను ఎదురింటికి తరలించడం మొదలైన వాటివల్ల దాదాపు నాలుగు నెలల పాటు నాకు నిద్ర అనేది తక్కువయింది. ఆవిధంగా హాస్పిటల్లో నేను విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేసి బాబా నాకు చాలా మేలు చేశారు. ఆ సమయమంతా నేను సాయి స్మరణ విడువలేదు. నేను బాబానే నమ్ముకుని, హాస్పిటల్లో సచ్చరిత్ర మూడు పారాయణలు పూర్తి చేశాను. ఆ పారాయణ, నామస్మరణలే మమ్మల్ని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి చేర్చాయి. "ధన్యవాదాలు బాబా".


విశ్వాసం కోల్పోకుండా బలపరిచిన బాబా:


మా అమ్మాయి వైజాగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఒకరోజు నేను ఇంటికి వచ్చే సమయానికి మా అమ్మాయి, తన తోటి విద్యార్థి ఆందోళనగా కనిపించారు. ఏమైందని అడిగితే, అతను తన బెడ్ రూమ్ తాళాలు పోగొట్టుకున్నాని చెప్పాడు. డోర్‌లో అంతర్నిర్మితమైన లాక్ సిస్టమ్ అయినందువల్ల కనీసం తాళం పగలగొట్టే అవకాశం కూడా లేదు. పైగా అతను ఉండేది తన అంకుల్ ఇంట్లో. అందువల్ల అతను చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో నాకెందుకు బాబా ప్రేరణనిచ్చారో తెలియదుగానీ, నేను అతనితో, "తాళాలు దొరికినట్లయితే పాల అన్నం, పెరుగు అన్నం సాయికి సమర్పిస్తానని మ్రొక్కుకో" అని చెప్పాను. అతను అలాగే చేశాడు. తర్వాత అతను మళ్లీ తాళాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అంతకుముందు తన స్నేహితులను కలిసిన బీచ్‌కి వెళ్లి, అక్కడంతా వెతికాడు. కానీ తాళాలు కనిపించలేదు. అతను తిరిగి వచ్చి, "తాళాలు దొరకలేద"ని చెప్పాడు. తాళాలు దొరకకపోతే అతను సాయిపట్ల విశ్వాసాన్ని కోల్పోతాడని నేను ఆందోళన చెందాను. అనవసరంగా అతని చేత బాబాకి ప్రమాణం చేయించానని పశ్చాత్తాపపడ్డాను. అంతలో ఏదో తెలియని ఆశ 'అతని బైక్ పార్క్ చేసిన చోటుకి వెళ్ళమ'ని ప్రేరణ కలిగించింది. వెంటనే ముగ్గురం వెళ్లి అక్కడంతా క్షుణ్ణంగా వెతికాం. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏం చేయాలో తెలియక ముగ్గురం అక్కడే నిలబడి చర్చించుకుంటూ ఉన్నాం. హఠాత్తుగా నేను నిరాశతో బైక్ సీటు మీద పిడికిలితో గుద్దాను. అద్భుతం! 'టింగ్' మంటూ తాళాలగుత్తి నేలను తాకింది. కనిపించకుండా పోయిన బెడ్ రూమ్ తాళాలు అవే! నా వెన్నులో చల్లగా అనుభూతి కలిగింది. ఆ అద్భుతం జరగకుంటే పిల్లలిద్దరూ బాబాపై విశ్వాసం కోల్పోయేవారు. అందుకు నేను జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఈవిధంగా సాయి మాలో విశ్వాసాన్ని బలపరిచారు. "ధన్యవాదాలు బాబా".


జయం జయం సాయినాథా!


మనస్ఫూర్తిగా వేడితే ఏదైనా సరే బాబా తీరుస్తారు


ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా అభినందనలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇప్పటికి రెండుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొకసారి ఈమధ్య జరిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రిందట నాకు మెడ, కుడివైపు భుజం కండరాలు చాలా నొప్పిగా అనిపించాయి. వెంటనే నొప్పి తగ్గటానికి నా దగ్గరున్న హోమియో మందు వేసుకున్నాను. కానీ కొంచెం కూడా నొప్పి తగ్గలేదు. నొప్పి ఉన్నచోట నూనె రాసి వేడినీళ్ళు పోస్తే నొప్పి తగ్గుతుందని మావారు నూనె రాశారు. నూనె రాయటం వలన నొప్పులు తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువయ్యాయి. మరుసటిరోజు నా సొంత పనులు కూడా చేసుకోలేకపోయాను. దాంతో మావారు మెడికల్ షాపుకి వెళ్ళి నొప్పి తగ్గటానికి టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చారు. అవి వాడినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. అలా వరుసగా నాలుగు రోజుల పాటు నొప్పితో చాలా ఇబ్బందిపడుతూనే ఉన్నాను. చివరికి నొప్పి భరించలేక బాబాకు నమస్కరించుకుని, “నొప్పిని తగ్గించమ”ని వేడుకుని, ‘వెంటనే నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను’ అని అనుకున్నాను. అప్పటినుంచి ఇక మందులేమీ వేసుకోలేదు. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయానికల్లా 80% నొప్పి తగ్గింది. నా పనులతో పాటు ఇంటిపనులు కూడా చేయగలిగాను. మరో రెండు రోజులకు 99% శాతం నొప్పి తగ్గిపోయింది. నా మీద బాబా చాలా దయ చూపించారు. బాబా చూపిన కరుణకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నిజంగా మనం బాబాను మనస్ఫూర్తిగా వేడితే ఎటువంటి బాధైనా, ఇబ్బందైనా, ఏదైనా సరే బాబా తప్పకుండా వెంటనే తీరుస్తారు. “సాయీ! నీ ప్రేమను, రక్షణను ఎల్లప్పుడూ మాకు ప్రసాదించు తండ్రీ. మాలో నీ పట్ల భక్తి, శ్రద్ధ నిరంతరం ఉండేలా చూడు స్వామీ”.


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనకోసమే కాదు, ఎవరికోసం ప్రార్థించినా బాబా వెంటనే స్పందిస్తారు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్, వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే బాబాకు సంబంధించిన విషయాలను చూడనిదే నాకు రోజు గడవదు. ఉదయాన్నే సాయితండ్రికి శుభోదయం చెప్పి, వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు చూస్తేనే నా మనసుకు హాయిగా ఉంటుంది. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మా  అమ్మకు సంబంధించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను.


మా అమ్మకు ఆస్తమా ఉంది. అప్పుడప్పుడు ఆమె దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటుంది. ఈమధ్య ఒకసారి అమ్మ విపరీతమైన దగ్గుతో బాధపడుతూ, "దగ్గు అస్సలు తగ్గడం లేదమ్మా, ఈ బాధను భరించలేకపోతున్నాను. దీనివల్ల నిద్ర ఉండటం లేదు" అని నాకు ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు నేను, "అమ్మా! తగ్గుతుందిలే అమ్మా, ధైర్యంగా ఉండు" అని చెప్పాను. అలా అమ్మకి చెప్పాక నేను సాయినాథునితో, "బాబా! అమ్మకి దగ్గు తగ్గిపోవాలి" అని చెప్పుకుని, కొద్దిగా ఊదీ తీసుకుని నా నోట్లో వేసుకుని, నుదుటన ధరించాను. తరువాత, "బాబా! నిన్ను శరణువేడిన ఎవరినీ నువ్వు వదిలిపెట్టవు. తప్పకుండా రక్షిస్తావు. అలాగే అమ్మని కూడా ఆ దగ్గు సమస్య నుండి రక్షించు" అని బాబాకి మొరపెట్టుకున్నాను. మరుసటిరోజు ఉదయం అమ్మకి ఫోన్ చేసి, "ఎలా ఉందమ్మా?" అని అడిగాను. అమ్మ, "పర్వాలేదమ్మా, దగ్గు కొంచెం తగ్గింది. మందులు వాడుతున్నాను" అని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా దయవల్ల అమ్మకి క్రమక్రమంగా దగ్గు తగ్గింది. ఇప్పుడు బాగానే ఉంది. అమ్మకి దగ్గు తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిచ్చిన ప్రకారం మీ అందరితో పంచుకున్నాను. మనం మనకోసమే కాదు, ఎవరికోసం ప్రార్థించినా బాబా వెంటనే స్పందిస్తారు. "చాలా కృతజ్ఞతలు తండ్రీ. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! నువ్వెప్పుడూ ఇలాగే మా కుటుంబాన్ని, అమ్మావాళ్ల కుటుంబాన్ని, ఇంకా అందరినీ కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను".


సాయిభక్తుల అనుభవమాలిక 788వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రారబ్ధానుసారం ఏమి జరిగినా రక్షణ కవచమై బాబా కాపాడతారు

  2. మన నమ్మకాన్ని బాబా ఎప్పుడూ వృధా పోనివ్వరు
  3. ఊదీ మహిమ - బాబా దయతో దొరికిన పట్టీలు

ప్రారబ్ధానుసారం ఏమి జరిగినా రక్షణ కవచమై బాబా కాపాడతారు


నా పేరు సుమన్. మాది తెనాలి దగ్గర ఒక చిన్న గ్రామం. 2021, మే 1న బాబా నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడారు, ఒక్క మాటలో చెప్పాలంటే నాకు జీవితాన్ని ప్రసాదించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు ఎప్పటిలాగే నేను పనిచేస్తున్న ప్లాంట్‌కి వెళ్లాను. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పనివాళ్ళు సరిగా చేస్తున్నారో, లేదో అని నేను పరిశీలిస్తున్నాను. హఠాత్తుగా పనివాళ్ళు ఒకవైపుకి చూపిస్తూ, "అక్కడ పొగ వస్తోందేమిటి?" అని అన్నారు. వెంటనే నేను అక్కడికి వెళ్లి చూస్తే, పైన జరుగుతున్న వెల్డింగ్ వర్క్ తాలూకు నిప్పురవ్వలు క్రిందనున్న బబుల్ షీట్స్ మీద పడటంతో మంటలు చెలరేగుతున్నాయి. వెంటనే అందరం కలిసి మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టాము. అక్కడ కొన్ని కరెంట్ వైర్లు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకుంటే ప్రమాదమని భావించి వాటిని ప్రక్కకు జరుపుదామని నేను ఒక వైరు పట్టుకున్నాను. అంతే! నేను వైరు పట్టుకున్న వెంటనే అది పేలి నాకు తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టింది. దాంతో నేను 'గురువుగారూ.. గురువుగారూ' (నేను బాబాను ‘గురువుగారు’ అని పిలుచుకుంటాను) అంటూ నా చేతిలో ఉన్న వైరును గట్టిగా విదిలించేశాను. రెప్పపాటుకాలంలో జరిగిన ఆ విపత్కర పరిస్థితిలో నేను బాబాను తలచుకున్నానన్నా, వైరును గట్టిగా విదిలించానన్నా అదంతా బాబా దయే. లేకుంటే నాకేమి జరిగివుండేదో అని ఊహించుకుంటేనే నాలో వణుకుపుడుతోంది. ఆ వైర్లలో 3 ఫేజ్ విద్యుత్తు ప్రసరిస్తున్నందున అది ఎంత పెద్ద ప్రమాదమో దానిగురించి అవగాహన ఉన్నవారికి ఇట్టే అర్థమవుతుంది. మొత్తానికి బాబా నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడారు.


అయితే, జరిగిన ప్రమాదం వల్ల నా కుడి అరచేయి బాగా కాలిపోయింది. ఆ మంటకి తట్టుకోలేక నేను ఒకటే అరుస్తూ గెంతులు వేయసాగాను. వెంటనే అక్కడున్న పనివాళ్ళు, నా సహోద్యోగులు నన్ను కూర్చోబెట్టి కాలిన చేయిపై నీళ్లు పోశారు. ఆ చల్లదనానికి కొద్దిగా ఉపశమనం కలిగినా చాలా బాధగా ఉంది. కరెంట్ షాక్ నా శరీరంలోని ఇతర భాగాలపై ఏమైనా ప్రభావం చూపిందేమోనని, నా సహోద్యోగి ఒకరు వెంటనే హాస్పిటల్‌కి వెళదామని నన్ను తన కారు ఎక్కమన్నారు. ఇద్దరం కలిసి తన కారులో హాస్పిటల్‌కి బయలుదేరాము. నిజానికి కొంతకాలంగా నేను నా పనులలో పడి బాబాకి సమయం అస్సలు కేటాయించలేకపోతున్నాను. అయినా బాబా నాపై ఇంత ప్రేమ చూపారని తలచుకుంటూ ఆయన ప్రేమకు కరిగిపోయాను. అంతలోనే, ‘హాస్పిటల్లో కరోనా పేషంట్లు ఎక్కువగా ఉంటున్న ఈ సమయంలో తప్పనిసరై హాస్పిటల్‌కి వెళ్తున్నాను. ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడినే కాదు, ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు కూడా బాధపడాల్సి వస్తుంద’ని చాలా ఆందోళన చెందాను. కానీ, ఆ హాస్పిటల్లోనే మా సార్ వాళ్ళు చూపించుకుంటుంటారు కాబట్టి అక్కడ నాకు మంచి వైద్యం అందుతుందని అనుకున్నాను. అయినా భయంభయంగానే బాబాను తలచుకుంటూ, "గురువుగారూ! ఒక్కసారి కనిపించండయ్యా! ఇక్కడ నాకు సరైన చికిత్స అందుతుందని ధైర్యంగా ఉంటుంది" అని బాబాను అడిగాను. కానీ బాబా దర్శనమివ్వలేదు. విపరీతమైన భయంతోనే హాస్పిటల్‌కి చేరుకున్నాను. అయితే, అక్కడ కరోనా పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని మమ్మల్ని వేరే హాస్పిటల్‌కి వెళ్లమన్నారు. సరేనని మేము వేరే హాస్పిటల్‌కి బయలుదేరాము. నేను "గురువుగారూ, గురువుగారూ! ఇప్పుడైనా కనపడండి" అని బాబాను పిలుస్తూనే ఉన్నాను. చివరికి హాస్పిటల్‌కి చేరుకోబోయే సమయంలో బాబా ఒక బండి మీద దర్శనమిచ్చారు. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. "హమ్మయ్య, వచ్చారా బాబా! మీరు తోడుంటే చాలు, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది" అనుకున్నాను. అప్పటికి నా చేతి మంట, నొప్పి చాలావరకు తగ్గాయి. దానికి సంతోషించాలో, బాధపడాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే, భక్తులపై ప్రేమతో వారి బాధలను తామే భరించే భక్తవత్సలుడు నా గురుదేవుడు. నా బాధను ఆయన స్వీకరించి, అనుభవిస్తున్నారేమోననే ఆలోచనతో నాకు దుఃఖం ఆగలేదు. కళ్ళనుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. హాస్పిటల్లో దాదాపు రెండుగంటలపాటు నా లివర్, హార్ట్ మొదలైన అన్ని ముఖ్యమైన శరీరావయవాలను ఈసీజీ తదితర పరీక్షలు చేసి క్షుణ్ణంగా పరీక్షించారు. చివరికి బాబా దయవల్ల “అంతా బాగుంది” అని చెప్పారు. అయితే ఆ పరీక్షలు జరుగుతున్నంతసేపూ నేను ఎమర్జెన్సీ వార్డులోనే ఉన్నాను. ఎంతమంది కరోనా పేషెంట్లకు అక్కడ వైద్యం చేశారో ఏమిటో? ఒకవేళ అది నాపై ప్రభావం చూపుతుందేమోనన్న భయం నా గుండెలు పిండేస్తోంది. ఆ భయంతో నాకు మళ్ళీ దర్శనం ప్రసాదించమని బాబాను ప్రార్థించాను. నేను హాస్పిటల్ నుండి బయటకి వస్తూనే బాబా "నేను ఉన్నాను" అంటూ ఎదురుగా ఉన్న ఒక షాపుపై దర్శనం ఇచ్చారు. బాబాను చూడగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నేనూ మామూలు మనిషినేగా! ఇప్పటికీ కరోనా భయం నా నుండి పోలేదు.


ప్రస్తుతం నేను తట్టుకొనేంత నొప్పి మాత్రమే నాకు తెలిసేలా ఉంచారు బాబా. బాబా దయవల్ల నాకిప్పుడు బాగానే ఉంది. అయితే బాబా ప్రేమపూర్వకమైన రక్షణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. తద్వారా ఆయన మనల్ని ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో అవగతమవుతుంది. నిజానికి కొన్నిరోజుల ముందునుండి నేను పనిచేసే చోట వాతావరణం నచ్చక ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను. ఆ విషయం గురించి ఈమధ్యనే బాబాను అడిగితే, "ఉద్యోగం వదిలేయమ"ని ఆయన నుండి సానుకూలమైన సమాధానం వచ్చింది. దాంతో ఏప్రిల్ 30వ తేదీ నుండి ఉద్యోగం మానేద్దామని అనుకున్నాను. కానీ మన ప్రారబ్ధం అనేది ఒకటి ఉంటుంది కదా! మనం ఎంత వద్దనుకున్నా అది మనల్ని తనవైపు లాగుతుంది. బహుశా అందువలనేనేమో, "నేను ఉద్యోగంలోకి రాలేను" అని నా యజమానితో చెప్పలేక మే 1న విధులకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. అదే నేను నా గురువాజ్ఞను పాటించి ఉంటే, ఆ ప్రారబ్ధం తొలగిపోయేది. సరే, అదలా ఉంచితే, తమ ఆజ్ఞను పాటించలేదని బాబా మనల్ని వదిలేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఆయన ఎంతో శ్రద్ధగా మనల్ని ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉంటారు, రానున్న విపత్తు నుండి మనల్ని కాపాడటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఆ వివరాలలోకి వెళితే..


గత కొద్ది రోజులుగా మా అమ్మ శనివారంనాడు ఏదో పూజ చేస్తోంది. ఆ రోజున తను పొంగలి చేసి భగవంతునికి నివేదిస్తుంది. నాకు ప్రమాదం జరిగినరోజు కూడా శనివారం. ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు అమ్మ భగవంతునికి పొంగలి నివేదించి కొంతసేపు బాబా నామం చేసుకుందట. తనకు చక్కగా మనసు నిలిచి నామం బాగా జరిగిందని చెప్పింది. అది కేవలం బాబా అనుగ్రహం వల్లే సాధ్యం కదా! భగవంతుని స్మరణ వల్ల మనసు యొక్క సహజ గుణమైన చంచలత్వం తగ్గి నిశ్చలత ఏర్పడుతుంది. ఆ స్థితి కొంతసేపైనా కొనసాగుతుంది. బహుశా కొద్దిసేపట్లో జరగబోయే ఈ ప్రమాదాన్ని విని తట్టుకోగలిగేలా బాబా ఆ విధంగా అనుగ్రహించారేమో! అంతేకాదు, నా సహోద్యోగి ఒకరు నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారని చెప్పాను కదా! నిజానికి అతను కరోనా బారినపడి గత రెండు, మూడు వారాలుగా ప్లాంట్‌కి రావడం లేదు. కొన్ని వారాలుగా అమ్మ చేస్తున్న పూజాఫలమో, ఇంకొకటో గానీ సరిగ్గా నేను ప్రమాదానికి గురైనరోజే అతను తిరిగి తన విధులకు హాజరయ్యాడు. కాదు, బాబా నా కోసమే అతనిని తీసుకొచ్చారు. కరోనా నుండి కోలుకున్నవారికి చాలా నీరసంగా ఉంటుంది. వాళ్ళు సమయానికి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అలాంటిది అతను నన్ను దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోవాళ్ళు తనకు ఫోన్ చేసి భోజనం చేయలేదని తనను కోప్పడుతున్నా, నేను కూడా తనను వెళ్లి భోజనం చేయమని చెప్తున్నా వినకుండా అతను చివరివరకు నాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా మా ఇంటి వద్ద దించాడు. అదీ, బాబా మనపై చూపే ప్రేమ. అవధులు లేని ఆ ప్రేమకు అనన్య శరణం. "బాబా! మీకు శతకోటి ధన్యవాదాలు తండ్రీ!"


మన నమ్మకాన్ని బాబా ఎప్పుడూ వృధా పోనివ్వరు


నా పేరు సరిత. నేను చిన్నప్పటినుండి సాయిభక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా నేను బాబాతో చెప్పుకుంటాను. వెంటనే బాబా నాకు ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపిస్తారు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈమధ్య నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను బాబాను తలచుకుని, "నా ఆరోగ్యం బాగైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా ఎంతో ప్రేమతో నాకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు. 14 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఇదంతా బాబా దయ నాపై ఉండటం వలనే సాధ్యమైంది.


తరువాత, ఏప్రిల్ నెల చివరి వారంలో విపరీతమైన విరోచనాల కారణంగా నేను రెండురోజుల పాటు చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాను తలచుకుని, "నా బాధ్యతంతా మీకే అప్పగిస్తున్నాను, ఇక మీ దయ. నాకు నయమైతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన మూడవ రోజుకి నాకు విరోచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా బాబా ఎల్లప్పుడూ నా మీద కరుణ చూపుతున్నారు. బాబాను నమ్మితే మన నమ్మకాన్ని ఆయనెప్పుడూ వృధా పోనివ్వరు. "ధన్యవాదాలు బాబా. సదా మీ అనుగ్రహం నాపై, మా కుటుంబంపై వర్షించు తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఊదీ మహిమ - బాబా దయతో దొరికిన పట్టీలు

సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వీణ. బాబా అంటే నాకు చాలా నమ్మకం. మాకు ఏ సమస్య వచ్చినా ‘బాబా ఉన్నారు, ఆయనే చూసుకుంటారు’ అని అనుకుంటాను. నేను ప్రతిరోజూ మా పిల్లల నుదుటన బాబా ఊదీ పెట్టి, కొంచెం ఊదీని నోట్లో వేస్తాను. ఇప్పుడు నేను బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలు పంచుకుంటాను.


మొదటి అనుభవం:- ఇటీవల ఒకరోజు మా తొమ్మిది సంవత్సరాల బాబుని తీసుకుని ఊరికి వెళ్ళొచ్చాము. వచ్చినప్పటినుండి తనకు జ్వరంతో ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు నేను మూమూలుగా ఇంట్లో ఉండే జ్వరం సిరప్ బాబుకి ఇచ్చాను. కానీ దాంతో బాబుకి జ్వరం తగ్గలేదు, పైగా వాంతులు మొదలయ్యాయి. అయినప్పటికీ నేను ‘బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు’ అనే విశ్వాసంతో బాబా ఊదీ తీసుకుని బాబు నుదుటిపై పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి బాబు చేత త్రాగించాను. బాబా దయవలన మరుసటిరోజుకి బాబు కోలుకున్నాడు. చిత్రమేమిటంటే, మామూలుగా మా బాబుకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది. డాక్టర్ ఇచ్చిన సిరప్ వలన ముందు తగ్గి, మళ్లీ వస్తుంటుంది. అలాంటిది, నమ్మకంతో బాబా ఊదీ ఇస్తే మరుసటిరోజుకే బాబుకి పూర్తిగా నయమైపోయింది. నిజానికి ఊదీ మహిమ గురించి ఈ బ్లాగులో చదివే నేను కూడా నమ్మకంతో ఊదీ వాడటం మొదలుపెట్టాను. సచ్చరిత్రలో కూడా ఊదీ మహిమను చదివాను. "ధన్యవాదాలు బాబా". 


మరొక అనుభవం: ఒకసారి పండుగకి మా పెళ్లిలో పెట్టిన వెండిపట్టీలు పెట్టుకుందామని బీరువాలో వెతికాను. కానీ అవి దొరకలేదు. దాంతో ఇతర అన్నిచోట్లా వెతికాను. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఒక్కసారిగా నాకు భయం వేసి, "బాబా! మీరే ఎలాగైనా పట్టీలు కనిపించేలా చేయండి" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. ఇంకా, "పట్టీలు దొరికినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని కూడా బాబాతో చెప్పుకున్నాను. తరువాత మనసులో బాబా నామస్మరణ చేస్తూ మళ్ళీ పట్టీల కోసం వెతికాను. బాబా దయవల్ల అవి బీరువాలోనే దొరికాయి. ఈ అనుభవం ద్వారా మనం బాబాను ధర్మమైనది ఏదైనా అడిగితే ఇస్తారని నాకు నమ్మకం కలిగింది. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 787వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎలాంటి కోరికనైనా బాబా మాత్రమే తీర్చగలరు
  2. వెన్నంటే ఉండి కాపాడే సాయి
  3. జ్వరం తగ్గించి కాపాడిన బాబా

ఎలాంటి కోరికనైనా బాబా మాత్రమే తీర్చగలరు


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు అరుణ. వృత్తిరీత్యా నేనొక డాక్టర్ని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి కొన్నింటిని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. 


మొదటి అనుభవం: ఈ మధ్యకాలంలో ఒకసారి నేను అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి, నాలుగు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యం చేకూరిన తరువాత ఇంటికి వచ్చాను. కానీ 20 రోజుల తరువాత మళ్ళీ ఆరోగ్య సమస్య మొదలైంది. ఈ కరోనా సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాలంటే చాలా భయమేసింది. అందుకని నేను బాబాకు నమస్కరించుకుని, "నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమ"ని మనస్ఫూర్తిగా వేడుకుని, ‘నా ఆరోగ్య సమస్య రేపటిలోగా తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను’ అని మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన 24 గంటల లోపే నా ఆరోగ్యం మెరుగుపడింది. నేను హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేదు. కేవలం బాబాను ప్రార్థించి, నీళ్ళలో బాబా ఊదీ వేసుకుని త్రాగాను, అంతే. ఎలాంటి సమస్యైనా బాబాకు చెప్పుకుంటే బాబా వెంటనే తీరుస్తారు. “బాబా! మీ ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఇలానే ఉండాలి. నాకు విపరీతమైన కోపం వస్తోంది బాబా. ఆ కోపాన్ని తగ్గించండి. నాకు అన్నివేళలా మీరే దిక్కు. మీ అనుగ్రహం వల్లనే ఈరోజు నేను ఇలా ఉన్నాను”. 


రెండవ అనుభవం: ఇటీవల ఒకరోజు రాత్రి మా ఆడపడుచువాళ్ళ అత్తయ్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంతకుముందు ఒక వారం ఇంట్లోవాళ్ళందరూ ఆవిడతో సన్నిహితంగా మెలిగారు. అంతేకాకుండా, మా ఆడపడుచు పిల్లలిద్దరూ ఆవిడతోనే పడుకున్నారు. అందువలన ఆవిడకి పాజిటివ్ అని తెలిసి మేమంతా చాలా టెన్షన్ పడ్డాము. తరువాత రోజు ఇంట్లో అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందరూ రిజల్ట్ ఎలా వస్తుందోనని టెన్షన్‌ పడుతుంటే నేను మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా వాళ్ళందరికీ నెగెటివ్ అని రిపోర్టు వస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. నా బాబా నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు. అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో అందరం రిలాక్స్ అయ్యాము. “థాంక్యూ బాబా! మీ ఆశీస్సులు మాపై ఇలానే ఉండనివ్వండి బాబా. లవ్ యు బాబా! ప్లేగు వ్యాధిని అంతమొందించినట్లే ఈ కరోనాని కూడా తొందరగా అంతమొందించండి బాబా! ఇది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యం బాబా.”


మూడవ అనుభవం: ఎన్నో సంవత్సరాలనాటి నా కోరిక ఇటీవల నెరవేరింది. అది పూర్తిగా బాబా దయవల్ల మాత్రమే జరిగింది. ఆ అనుభవాన్నే ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఈమధ్య జరిగిన సాయి అనుభవాలలో ఇది చాలా ముఖ్యమైన అనుభవం. మా తల్లిదండ్రులకి మేము ముగ్గురు ఆడపిల్లలం. అందరికీ వివాహాలయ్యాయి. మా అక్కలిద్దరికీ అమ్మాయిలే పుట్టారు. నాకు కూడా మొదటి కాన్పులో పాప పుట్టింది. పాపకిప్పుడు 5 సంవత్సరాలు. ‘అందరికీ అమ్మాయిలే’ అని మా అమ్మగారు బాధపడనిరోజు లేదు. నేను రెండవసారి గర్భం దాల్చినప్పుడు, ‘ఈసారి అబ్బాయే పుడతాడు’ అని అందరూ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అమ్మాయి పుడుతుందో, అబ్బాయి పుడతాడో మనం చెప్పలేము కదా. అందువల్ల, ఈసారైనా అమ్మానాన్నల కోరిక తీర్చగలనో లేదో అనే భయంతో నా ప్రెగ్నెన్సీ సమయంలో నేను ఆనందంగా ఉండలేకపోయేదాన్ని. మనసంతా ఎప్పుడూ ఇవే ఆలోచనలతో నిండివుండేది, నిద్రపట్టేది కాదు. ఇలాంటి సమయంలో మావారు నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. ‘ఎవరు పుట్టినా పరవాలేదు, ఎక్కువ ఆలోచించకు’ అని ఎంతగానో సర్దిచెప్పేవారు. కానీ నా మనసు కుదుటపడేది కాదు. నాకు మూడవ నెల రాగానే స్కానింగ్ చేయించాము. అందులో బేబీ హార్ట్ బీట్ 150 వచ్చింది. నాకున్న మెడికల్ నాలెడ్జ్‌లో, ‘హార్ట్ బీట్ 145 కంటే ఎక్కువ ఉంటే అమ్మాయి పుట్టే అవకాశాలు ఎక్కువ’ అని తెలుసు. అందువల్ల ఆ స్కానింగ్ రిపోర్టు చూసి చాలా భయం వేసింది. కానీ నాకున్న ఒకే ఒక్క ధైర్యం నా బాబా మాత్రమే. ఎందుకంటే, ఇంతకుముందు ఎన్నో విషయాలలో బాబా నాకు అండగా ఉన్నారు. ‘రిపోర్టు ఎలా వున్నా బాబా చూసుకుంటారు’ అని అనుకున్నాను. 


కొంతకాలం తరువాత మళ్ళీ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈరోజు హాస్పిటల్‌కి వెళుతున్నాను, మీరు నాకు తోడుగా ఉన్నారని నాకేదైనా నిదర్శనం ఇవ్వండి” అని ప్రార్థించి, హాస్పిటల్‌కి బయలుదేరాము. హాస్పిటల్లో డాక్టర్ నన్ను పరీక్షించి, స్కానింగ్ చేయించుకోమన్నారు. స్కానింగ్ కోసం హాస్పిటల్ నుండి బయటికి రాగానే, సాయిబాబాను తీసుకుని అన్ని ఊర్లూ తిరిగే వాహనం నా ముందు వచ్చి నిలబడింది. బాబాను చూడగానే అవధులు లేని ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాను. వెంటనే బాబాకు నమస్కరించుకుని, 11 రూపాయలు దక్షిణ సమర్పించి, స్కానింగ్ సెంటరుకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక స్కానింగ్ రూములో పెద్ద ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. ఆ ఫోటోలోంచి బాబా నా వైపే చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను. ఇలా ఒకేరోజు బాబా నాకు రెండుసార్లు దర్శనమిచ్చారు. ఈసారి కూడా నా స్కానింగులో బేబీ హార్ట్ బీట్ 152 ఉంది. కాస్త భయం వేసినప్పటికీ బాబా మీదే భారం వేశాను. 5వ సారి స్కానింగ్ చేయించుకుంటున్నప్పుడు, నేను కూడా డాక్టర్ని కావడం వల్ల అక్కడ స్కానింగ్ చేసే డాక్టర్ నాతో ‘పుట్టబోయేది పాప’ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. (లింగనిర్ధారణ పరీక్షలను మన దేశంలో అనుమతించరు కదా!) అది విన్న తరువాత ఒక్కసారిగా నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇంక ‘నాకు ఎవరు రాసిపెడితే వాళ్ళే పుడతారు’ అని మనసుకి సర్దిచెప్పుకునేదాన్ని. అప్పటినుంచి ప్రతిరోజూ బాబాకు నమస్కరించుకుని, “మీరు తలచుకుంటే ఏదైనా సాధ్యమే కదా బాబా! నా కడుపులో బిడ్డను కూడా నేను కోరుకునేలా మార్చండి బాబా” అని మ్రొక్కుకుని, బాబా ఊదీ పెట్టుకుని, నీళ్ళలో కాస్త ఊదీ కలుపుకుని త్రాగేదాన్ని. నేను పుట్టబోయే బిడ్డ గురించి క్వశ్చన్ & ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే ప్రతిసారీ నాకు అనుకూలమైన సమాధానాలే వచ్చాయి. అలాగే, శిరిడీ నుండి బాబా దర్శనం ప్రత్యక్ష ప్రసారం చూసే సమయంలో ముందుగానే ‘బాబా ఫలానా డ్రెస్సులో ఈరోజు కనిపిస్తారు’ అనుకుంటే బాబా నాకు అలానే కనిపించేవారు. అలా దాదాపు ఒక 15 సార్లు నేను అనుకున్న డ్రెస్సులో బాబా దర్శనం ఇచ్చారు. దాంతో, నాకు పుట్టబోయే బిడ్డ విషయంలో పూర్తిగా బాబా మీదనే భారం వేశాను. నెలలు నిండాయి. బాబా అద్భుతం చేశారు. ఏప్రిల్ నెలలో బాబా అనుగ్రహంతో నాకు పండంటి బాబు పుట్టాడు. బాబును చూడగానే బాబా మాపై చూపిన అపార కరుణకు అంతులేని ఆనందంతో, కృతజ్ఞత నిండిన హృదయంతో బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబు పుట్టాడని తెలియగానే కుటుంబసభ్యులంతా అంతులేని ఆనందంలో మునిగిపోయారు. మెడికల్ రిపోర్టులలో ఏదీ నాకు అనుకూలంగా రానప్పటికీ, నా కోరికని గ్రహించిన బాబా ఎంతో ప్రేమతో అన్నీ నాకు అనుకూలంగా మార్చేశారు.


సాయిభక్తులందరికీ నా మనవి ఏమిటంటే, ఎలాంటి కోరికైనా సరే మీ భారమంతా బాబా మీద వేయండి, ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. ఎలాంటి కోరికనైనా బాబా మాత్రమే తీర్చగలరు. మనకు ఉండాల్సిందల్లా శ్రద్ధ, సబూరి. దానికి నా అనుభవాలే నిదర్శనం. నాకు అనుభవాలు సరిగా రాయటం రాదు. బాబా ఇచ్చిన ఆనందాన్ని అనుభవించగలనే గానీ ఆ ఆనందాన్ని మాత్రం మాటల్లో చెప్పలేను. “బాబా! నీ కరుణ నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇలాగే నేను మరిన్ని అనుభవాలు పంచుకోవాలి. నేను మీ విషయంలో ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించండి బాబా”.


వెన్నంటే ఉండి కాపాడే సాయి


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు యామిని. మేము హైదరాబాదులో ఉంటున్నాము. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుంచి సాయిభక్తురాలిని. అప్పటినుంచి బాబా నన్ను ప్రతి ఆపద నుంచి కాపాడుతూ వస్తున్నారు. ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్కూల్స్ మూతపడటంతో 2021, మార్చి నెలలో మేము మా ఊరికి వచ్చాము. నన్ను, పిల్లల్ని మా పుట్టింట్లో వదిలిపెట్టి మావారు మా అత్తయ్య దగ్గరకు వెళ్ళారు. అప్పటికే తనకు జలుబుగా ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అది తెలిసి మేము చాలా కంగారుపడ్డాము. దానికి తోడు మరుసటిరోజు నుంచి నాకు, మా చిన్నమ్మాయికి కూడా కొంచెంగా కరోనా లక్షణాలు కనపడుతూ వచ్చాయి. ఇంట్లో మాతోపాటు మా అమ్మా, నాన్న కూడా ఉన్నారు. అందువల్ల నాకు చాలా భయమేసి, 'సాయీ, సాయీ' అని సాయిని ప్రార్థిస్తూ, మమ్మల్నందరినీ కాపాడమని ఆర్తిగా వేడుకున్నాను. బాబా దయవల్ల మరో రెండు రోజులకల్లా మాకు కరోనా లక్షణాలు తగ్గిపోయాయి. తరువాత మావారు కూడా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారు. బాబా అనుగ్రహంతో ఈసారి తనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అదీ గురువారం రోజున. బాబా ఎంతో కరుణతో మమ్మల్నందరినీ కాపాడారు. శ్రద్ధ, సబూరిలను నమ్ముకుంటే సాయి మన వెన్నంటే ఉండి అందరినీ కాపాడుతారని నమ్మండి. “ఓ సద్గురు సాయీ! మీ దయ మా పైన, సాయిభక్తులందరి పైనా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను”.


జ్వరం తగ్గించి కాపాడిన బాబా


ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నమస్కారములు. నా పేరు యశోదమ్మ. మాది అనంతపురం. నాకు బాబాతో దాదాపు నలభై సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఈ బ్లాగ్ గురించి రెండు నెలల క్రిందటే నాకు తెలిసింది. ఇటీవల నాకు వచ్చిన ఒక సమస్యను బాబా తీర్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 27వ తేదీన నేను కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ వేయించుకున్నాను. రెండు రోజుల తర్వాత నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అసలే కరోనా సమయమైనందున నాకు చాలా భయం వేసింది. వెంటనే బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, "బాబా! మీ అనుగ్రహంతో రేపు ఉదయానికల్లా జ్వరం తగ్గిపోతే నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరుసటి ఉదయానికల్లా జ్వరం తగ్గింది. నాకు ఏ కష్టం లేకుండా బాబా నన్ను రక్షించారు. అందుకే వెంటనే ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. "ధన్యవాదాలు సాయి తండ్రీ!"



సాయిభక్తుల అనుభవమాలిక 786వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహంతో గృహప్రవేశం - అందరూ క్షేమం
  2. శరీరానికి, మనసుకి కావల్సిన శక్తినిచ్చి కరోనా నుండి బయటపడేసిన సాయి స్మరణం
  3. పాదుకల రూపంలో మా ఇంటికొచ్చి ఆటంకాలు తొలగించిన బాబా

బాబా అనుగ్రహంతో గృహప్రవేశం - అందరూ క్షేమం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


నేను గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను.


అనుకున్న సమయానికి గృహప్రవేశ వేడుక జరిపించిన బాబా:


బాబా కృపతో మేము ఒక ఇల్లు కొన్నామనే విషయం నా మునుపటి అనుభవంలో మీతో పంచుకున్నాను. 2020, అక్టోబరులో ఆ ఇంటి రిజిస్ట్రేషన్, గృహప్రవేశం చేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ డబ్బు సర్దుబాటు కాకపోవటం వలన అనుకున్న సమయానికి మేము గృహప్రవేశం చేసుకోలేకపోయాము. ఆ విషయమై నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 5 వారాల సాయిబాబా పూజను రెండుసార్లు చేశాను. బాబా ఆశీస్సులతో అనుకోకుండా నేను, నా సోదరి, సోదరుడు ముగ్గురం కలిసి కొన్న ఒక స్థలానికి మంచి ధర వచ్చింది, దాన్ని అమ్మడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఆ స్థలం అమ్మడం ద్వారా నాకు 7 లక్షల రూపాయలు వచ్చాయి. అంతేకాదు, మా అమ్మ ఆస్తిలో వాటాగా నా సోదరుడు దాదాపు 8 లక్షల రూపాయలు నాకు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని నేను ఇంటి యజమానికి ఇచ్చి, 2021 ఫిబ్రవరి 7న రిజిస్ట్రేషన్, ఫిబ్రవరి 13న గృహప్రవేశం పెట్టుకుందామని అనుకున్నాను. కానీ కొన్ని పత్రాల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయాము. అయినప్పటికీ ఇంట్లో పూజ, హోమం వాయిదావేయడం ఇష్టం లేక దాని గురించి నేను పంతులుతో చర్చించి, "పూజ, హోమం చేసుకోవచ్చా?" అని అడిగాను. అతను 'చేసుకోవచ్చ'ని అన్నారు. అందుకు కారణమేమిటంటే, మేము గత 4 సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నాము. అయితే ఒక వారం వ్యవధిలో పెయింటింగ్ పని, వడ్రంగి పని మరియు ఇతర చిన్న చిన్న ప్లంబింగ్ పనులు పూర్తి చేయించాలి. ఆ పనులన్నీ 13వ తేదీకల్లా అవుతాయా, లేదా అని నేను ఆందోళన చెందాను. కానీ బాబా దయవలన ఇరుగుపొరుగు సహాయంతో పెయింటింగ్, ప్లంబింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి వడ్రంగి పనులు కూడా పూర్తయ్యాయి. నేను అనుకున్నట్లే 13వ తేదీన గృహప్రవేశ కార్యక్రమాన్ని బాబా బాగా జరిపించారు. హైదరాబాద్ నుండి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధిర నుండి పంతులుగారు వచ్చారు. అతనితో మా కుటుంబానికి స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది. అయితే చాలా రోజులుగా కాంటాక్ట్‌లో లేరు. అకస్మాత్తుగా 7 సంవత్సరాల తరువాత అతను మాతో సంప్రదించి, కేవలం నా కోసమే పూజలు నిర్వహించడానికి సొంత కారులో అంతదూరం నుండి హైదరాబాదులోని మా ఇంటికి వచ్చారు. అంతా బాబా దయ. మేము 13వ తేదీన సామాజిక దూరాన్ని పాటిస్తూ కొద్దిమందితో ఆనందంగా పూజ జరిపించాము. కానీ కరోనా వలన నా మనసులో అనేక సందేహాలు, భయాలు ఉండటంతో, "మా ఇంటి శుభకార్యానికి వచ్చినవారికి, అలాగే మా కుటుంబానికి ఏమీ కాకూడద"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.


మరో అనుభవం: నవంబరులో మా అమ్మాయి పుట్టినరోజు, మార్చిలో మా అబ్బాయి పుట్టినరోజు వచ్చాయి. ఆ వేడుకలను 20, 25 మందితో చిన్నగా జరుపుకున్నాము. ఆ రెండు సందర్భాలలో కూడా నేను మా కుటుంబానికి, ఆ వేడుకలలో పాల్గొన్నవారికి ఏమీ కాకూడదని, అందరూ బాగుండాలని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అందరూ సురక్షితంగా ఉన్నారు.


ఇంకో అనుభవం: మేము అమ్మిన ఆస్తి విషయంగా రిజిస్టర్ కార్యాలయంలో పత్రాలపై సంతకం చేయడానికి నేను 2021, మార్చి 1న మహబూబాబాద్‌ వెళ్లాల్సి ఉండి రైలు టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే తిరుగు ప్రయాణానికి మధ్యాహ్నం 3 లేదా 6 గంటలకు 2 రైళ్లు మాత్రమే ఉన్నాయి. నేను ఆ విషయమై మా ఆస్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తులతో మాట్లాడితే, "మధ్యాహ్నం 3 గంటల రైలుకు టికెట్ బుక్ చేసుకోండి. ఆ సమయం కన్నా ముందే పనిపూర్తయ్యేలా చూస్తామ"ని చెప్పారు. నేను అలాగే మధ్యాహ్నం 3 గంటల రైలుకి బుక్ చేసుకున్నాను. కానీ వాళ్ళు చెప్పినట్లు జరగలేదు. మాకు టోకెన్ నంబర్ 34 వచ్చింది. అంటే మధ్యాహ్నం 3 తర్వాత మమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. దాంతో నేను చాలా టెన్షన్ పడి, "బాబా! నేను 3 గంటల రైలును మిస్ కాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే, వెంటనే 6 గంటల రైలుకి నేను టికెట్ పొందలేను" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం వలన మాకన్నా ముందున్న టోకెన్ సభ్యులు కొందరు  హాజరు కాకపోవటంతో మా నెంబరును ముందుగానే పిలిచారు. దాంతో పని పూర్తయి నేను, నా సోదరి మధ్యాహ్నం 3 గంటల రైలు అందుకోగలిగాము. అయితే రైలులో చాలా రద్దీగా ఉంది. కొంతమంది వ్యక్తులు సామాజిక దూరాన్ని అస్సలు పాటించడంలేదు, పైగా గుట్కా వంటివి నములుతున్నారు. అందువలన నేను, నా సోదరి కరోనా దృష్ట్యా చాలా ఆందోళనపడ్డాము. "నాకు, నా సోదరికి ఏమీ జరగకూడద"ని నేను బాబాను ప్రార్థించాను. సాయి దయవల్ల మేము ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నాం. త్వరలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఇంతలా మాపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తున్న బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.. సెలవు.


శరీరానికి, మనసుకి కావల్సిన శక్తినిచ్చి కరోనా నుండి బయటపడేసిన సాయి స్మరణం


సాయి కీర్తనం శుభకరం!
సాయి నామం మధురం!
సాయి స్మరణం అభయం!
సాయి ధ్యానం మోక్షం!

నా పేరు టి.కిరణ్మయి. సాయిభక్తుల అనుభవమాలికలో ఎన్నో ఎన్నెన్నో భక్తకుసుమాలు తమ తమ అనుభూతుల పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆ దివ్యలీలల్ని ఆస్వాదిస్తూ బాబా ప్రేమవాహినిలో నిండా మునకలేస్తూ ఆనందపరవశులమవుతున్నాము. బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడం వల్ల ఎంత అనుభూతి పొందుతామో, తోటి సాయిభక్తుల అనుభవాలు చదివేటప్పుడు అంతకుమించిన అభయం, ఆనందం అవలీలగా పొందుతాము. కష్టకాలంలో సాయిభక్తుల అనుభవాలు చదివే అవకాశం బాబా నాకు కల్పించినందువల్లే నేను మానసికంగా కోలుకోగలిగాను. ఇటీవల నాకు, మా కుటుంబసభ్యులందరికీ కరోనా వచ్చింది. ఇంట్లో అందరికీ కరోనా రావడంతో నాకు మానసిక ఆందోళన ఎక్కువై ఇంటి పనులు చేసుకోవడం చాలా కష్టతరమైంది. ఇటువంటి సమయంలో సాయి స్మరణం నా శరీరానికి, నా మనసుకీ కావలసిన శక్తిని అందించింది. ప్రతిరోజూ బాబా ఊదీని గోరువెచ్చని నీటిలో కలిపి, ఆ నీటిని సేవించడం వల్ల మాకు కరోనా తగ్గిపోయింది. సాయికృప వల్ల కరోనా టెస్ట్ చేయించుకుంటే, మా అందరికీ నెగెటివ్ అని రిజల్ట్స్ వచ్చాయి. నా తండ్రి సాయినాథుడు అందించిన శక్తి వల్లే ఈనాడు నేను, మావారు, మా బాబు, మా మామయ్య కరోనా మహమ్మారి నుండి బయటపడ్డాము. ఇదంతా కేవలం సాయి కరుణాకటాక్షముల వల్లే సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


పాదుకల రూపంలో మా ఇంటికొచ్చి ఆటంకాలు తొలగించిన బాబా


సాయిభక్తురాలు శ్రీమతి అరుణదేవి తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ‘సాయి మహరాజ్ సన్నిధి’ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయి భక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు అరుణదేవి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి మేము క్రొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుని పని ప్రారంభించాము. అయితే, ఇంటిపని మొదలుపెట్టిన దగ్గరనుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ మమ్మల్ని మానసికంగా వేదనకు గురిచేస్తుండేవి. దానివల్ల కుటుంబంలో మనశ్శాంతి లేదు. దాంతో ఒక గురువారంరోజున మావారు బాబా గుడికి వెళ్ళి, తన వేదనంతా బాబాకు చెప్పుకుని, “మీరు రండి బాబా!” అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నారు. ఆ సమయంలోనే ఎవరో భక్తులు బాబా పాదాలు (పాదుకలు) గుడిలో సమర్పించుకున్నారు. ఆశ్చర్యకరంగా పూజారిగారు ఆ పాదాలు మావారికి ఇచ్చి, “తీసుకువెళ్ళి ఇంటిలో పెట్టుకో!” అన్నారట. ఆ విధంగా ఆ పాదాల రూపంలో బాబా మా దగ్గరకు వచ్చారు. ఆ పాదాలను మేము కట్టుకునే ఇంటి దగ్గర పెట్టుకున్నాము. బాబా దయవల్ల అప్పటినుంచి ఇంక ఏ ఇబ్బందీ లేకుండా ఇంటిపని జరుగుతోంది. బాబా మాపై చూపించిన ప్రేమకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతం నేను కోవిడ్‌తో బాధపడుతున్నాను. బాబా త్వరలోనే నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. “బాబా! తల్లిలా మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ, మా మీద దయ చూపిస్తున్నారు. మేము ఏ విధంగా మీ ఋణం తీర్చుకోవాలి తండ్రీ! మీకు శతకోటి వందనాలు బాబా!”




సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo