సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కృష్ణారావు జగేశ్వర్ భీష్మ


శ్రీసాయి ఆరాధనలో ప్రధానమైనవి నాలుగు వేళల్లో నిర్వహించే హారతులు. ఆ ఆరతుల పుస్తకం 'సాయినాథ సగుణోపాసన' రూపకర్త అయిన సాయిభక్తుడు భీష్మ గురించిన కొంత సమాచారం సాయి ఆశీస్సులతో ఈరోజు నుండి మీకందించే ప్రయత్నం చేస్తున్నాము.
పరమపూజ్య శ్రీభీష్మ గొప్ప వ్యక్తిత్వం గలవారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసు. ఇతడు నాగపూర్ జిల్లాలోని బూటిబోరి (ఒక పారిశ్రామిక శివారు) గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూములను కలిగిఉన్న గొప్ప ఆసాముల కుటుంబంలో 16 ఆగష్టు, 1854న జన్మించాడు. దేవుని దయవలన అతను చిన్నవయస్సులోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాన్ని చేయడం మొదలుపెట్టాడు. వివాహమైన కొద్దిరోజులలోనే మొదటి భార్య చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్నాడు. 

ఆ దంపతులకు నలుగురు సంతానం(ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుర్లు). అతనిలో దేశభక్తి, విప్లవాత్మక భావాలు మెండుగా ఉండేవి. సామాజికసేవ చేయాలనే తపనతో తన పూర్తి జీవితాన్ని అందుకు అంకితం చేయాలనుకున్నాడు. నాడు బ్రిటిష్ పాలననుండి స్వేచ్ఛకోసం దేశంలో పోరాటాలు, రహస్య సమావేశాలు జరుగుతుండేవి. వాటిలో భీష్మ చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు. అటువంటి సమయంలో అతని రెండవ భార్య మరణించింది. భార్య అకాల మరణంతో భీష్మ హృదయం వికలమై ఉద్యోగం వదిలిపెట్టాడు. అతని మనస్సు ఏకాంతంగా ఉండటం వైపు మళ్ళింది. అందువల్ల భీష్మ కీర్తనలు, భజనలు, పూజలలో నిమగ్నమవుతూనే దేశప్రజలకు దేశభక్తిని బోధిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో, అతను యథార్థ రామాయణం, శ్రీ భగవద్గీత, శ్రీసత్యనారాయణ కథలోని అధ్యాయాలు, రామాయణ కాలం నాటి జీవనవిధానం, భౌగోళిక పరిస్థితులు మరియు పరిపాలన, ఛత్రపతి శివాజీ మహరాజ్ మొదలైన వాటి ఆధారంగా అనేక చారిత్రక ప్రాముఖ్యతలను గురించి పద్యాలు రచించాడు. ఆ చారిత్రాత్మక కవితలు మరియు ఉపన్యాసాల ద్వారా దేశ ప్రజల మనస్సులలో దేశభక్తిని నాటడంలో అతడు సఫలీకృతుడయ్యాడు. 

శ్రీభీష్మ గురించి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అతను సమర్థుడైన వైద్యుడు. తన ఖాళీ సమయాలలో ప్రజలకు చికిత్స చేస్తుండేవాడు. ఈ విధంగా శ్రీభీష్మ తన సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుండేవాడు. ఒకసారి, "అస్పృశ్యత నివారణ్ పరిషత్" (అస్పృశ్యత నిర్మూలన సంస్థ) కార్యక్రమం మొహప్ప గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ కార్యక్రమంలో శ్రీభీష్మ మాట్లాడుతూ ‘అంటరాని వ్యక్తితో కలిసి ఆహారం తీసుకోవడం’ అనే విషయంపై ఒక శక్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగంతో ప్రజలు అతనిని జాతీయనాయకుడిగా చూడటం మొదలుపెట్టారు. ఇక ఈ వివరాలు చాలించి అసలు వివరాలలోకి వద్దాం.   

1908వ సంవత్సరం శ్రావణమాసంలోని పౌర్ణమినాటి రాత్రి అతనికొక కల వచ్చింది. ఆ కలలో అతను నుదిటిమీద త్రిపుండ్ర రేఖలతో, ముదురురంగు ఛాయ(నల్లని వర్ణంలో) కలిగిఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతని శరీరానికి కుంకుపువ్వుతో కలిపిన గంధం పూయబడి ఉంది. అతని పాదాలకు పూజ చేయబడినట్లు పాదాల చెంత పువ్వులు ఉన్నాయి. అతను భీష్మకు ఒక వార్తాపత్రికను ఇచ్చాడు. భీష్మ అతనిని "మీరు ఎవరు?' అని అడిగాడు. అతను ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ వార్తాపత్రికలో "సత్-చిత్-ఆనంద(సచ్చిదానంద)" అని పెద్ద అక్షరాలలో ప్రచురించిన పదాలను చూపించి, వాటిని పఠించమని భీష్మకు సూచించాడు. భీష్మ వార్తాపత్రికను చూస్తుండగా అందులో "మంత్ర్ వా శిఖావా"("మంత్రం నేర్చుకో") అనే అక్షరాలు కనపడ్డాయి. భీష్మ కుతూహలంగా ఇదేమిటని అతనిని ప్రశ్నించబోయాడు కానీ అంతలో ఆ వ్యక్తి, వార్తాపత్రిక రెండూ అదృశ్యమయ్యాయి. అదే సమయంలో తలుపు తట్టిన శబ్దం వినపడి భీష్మ కల చెదిరింది. ఆ తరువాత అతను తన కలను గురించి చాలాకాలం ఆలోచించాడు కానీ, అందులోని రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. 

కొన్నిరోజుల తర్వాత గణేష్ భక్తుడైన ఒక సాధువు బోరి గ్రామానికి వచ్చాడు. భీష్మ ఆ సాధువును కలిసి, తన కల గురించి వివరించాడు. ఆ సాధువు "సత్-చిత్-ఆనంద(సచ్చిందానంద) స్వామి" అనునది అతని గురునామం అని, ఆయనే అలా స్వప్నదర్శనమిచ్చి "వా శిఖావా" అనే మంత్రముపదేశించి ఉండవచ్చని చెప్పాడు.

కొంతకాలానికి భీష్మ అమరావతి సందర్శించాడు. అక్కడ దాదాసాహెబ్ ఖపర్డే కలిసి అతనితో, “కలిసివెళ్దాం, శిరిడీ వస్తారా?” అని అడిగాడు. అందుకతను అంగీకరించి ఖపర్డేతో కలిసి మొదటిసారి శిరిడీ వెళ్ళాడు(ఖపర్డే రెండవసారి 1911, డిసెంబర్ 6న శిరిడీ వచ్చి దీర్ఘకాలం గడిపినప్పటి ఖపర్డే డైరీలో భీష్మ గురించి ప్రస్తావించబడి ఉంది). సాయిబాబా దర్శనానికి భీష్మ మశీదుకు వెళ్ళిన వెంటనే, సాయిబాబా తమ చేతులు జోడించి, "జై సత్-చిత్-ఆనంద!" అని అన్నారు. భీష్మ ఒక్కసారిగా ఆ మాట విని కలవరపడి తన మనసులో “కలలో కనిపించిన సాధుసత్పురుషులు సాయిబాబా కాదు కదా!” అని అనుకున్నాడు. “కాని ఆ సాధువు వైష్ణవుడు కదా! సాయిబాబా ఒక ముస్లింలా ఉన్నారు. మరి ‘సత్-చిత్-ఆనంద’ అనే మాటలు ఎందుకు సాయిబాబా పలికారు?” అని సంశయంలో పడ్డాడు.

భీష్మకి హిందూ-ముస్లిం భేదభావం దృఢంగా ఉండేది. అందువలన అతడు బ్రాహ్మణ భక్తులు కూడా సాయిబాబా పాదతీర్థాన్ని తీసుకోవడం చూస్తున్నప్పటికీ, తను మాత్రం స్వీకరించేవాడు కాదు. సాయిబాబా చిలుము పీల్చేటప్పుడు పక్కనున్న కొంతమంది భక్తులకు చిలుము అందించేవారు. అది గమనించిన అతడు ముస్లిం పెదవులచే కలుషితమైన ధూమపానం చేయాల్సి వస్తుందని భయపడ్డాడు. కానీ, అతని మనసెరిగిన బాబా తొలిరోజుల్లో అతడు పక్కనే ఉన్నప్పటికీ చిలుము అతడికి ఇచ్చేవారు కాదు.

బాబా వద్ద ఎప్పుడూ ఒక పాత చింకి గోనెగుడ్డ ఉండేది. దానినే బాబా ఎప్పుడూ ఆసనంగా ఉపయోగించేవారు. ఒకరోజు ఆ పాత గోనెను తొలగించి కొత్త గోనెను భర్తీ చేయమని భక్తులు భీష్మను కోరారు. అందుకతను సరేనని, భక్తులందరూ ఆరతికి వచ్చేవరకు నిరీక్షించి, అప్పుడు గోనెను మార్చడం గురించి సైగలతో బాబాని అడిగాడు. బాబా సరేనని సంకేతం ఇచ్చారు. వెంటనే అతడు దాదాసాహెబుతో చెప్పి, పాతదాన్ని తీసి క్రొత్త గోనె వేసాడు. ఆరతి తర్వాత బాబా నిశ్శబ్దంగా కూర్చున్నారు. భక్తులు ఆయనను సేవిస్తూ ఉన్నారు. అంతలో ఒక భక్తుడు చిలుము సిద్ధం చేసి బాబా చేతికి అందించాడు. బాబా ఒకసారి పీల్చిన తర్వాత భీష్మకు అందించి, చిలుము పీల్చమని చెప్పారు. భీష్మ ఏ సంకోచం లేకుండా ఒకసారి చిలుము పీల్చి, సాయిబాబాకు తిరిగి ఇచ్చాడు. సాయిబాబా దానిని తీసుకుని, "మేము ప్రతిచోటా సంచరిస్తున్నాము. బాంబే, పూణే, సతారా, నాగపూర్ మొదలైన అన్ని ప్రాంతాలు రామమయమే మిత్రమా!" అన్నారు. తరువాత మళ్ళీ ఆయన హఠాత్తుగా భీష్మతో, "సరే, నాకు ఒక్క ముక్కైనా ఇవ్వకుండా నువ్వు ఎందుకు లడ్డూలు తింటావు? కనీసం ఇప్పుడైనా నాకు ఐదు లడ్డూలు ఇవ్వు" అని అన్నారు. బాబా మాటలు మరియు బాబా చిలుము భీష్మ మీద తీవ్రమైన ప్రభావం చూపి, అతని మనో దృక్పథంలో మార్పు తీసుకొచ్చాయి. అంతవరకు ఉన్న సనాతన భావాలు మాయమయ్యాయి. కలలో కనిపించిన వైష్ణవ సన్యాసి, సాయిబాబా వేరు అన్న భేదభావం కనుమరుగైంది. బాబాయే వైష్ణవసన్యాసి రూపంలో దర్శనమిచ్చారన్న నమ్మకం కలిగింది. వెంటనే అతను బాబా సేవకుల వద్ద నుండి సాయిబాబా పాదతీర్థాన్ని అడిగి తీసుకుని, మనసారా స్వీకరించి, సాయిబాబా పాదాల వద్ద తన శిరస్సునుంచాడు. అప్పడు రెండునిముషాలపాటు సాయిబాబా అతని తలపై తమ చేయిని ఉంచి ఆశీర్వదించారు. ఆ స్పర్శతో అతడు మాటలకందని దివ్య పారవశ్యంలో మునిగిపోయాడు.

తర్వాత భీష్మ తన వసతికి వచ్చి, “ఈ క్రొత్త ప్రదేశంలో నేనే ఒక అతిథిగా ఉన్నాను. అలాంటప్పుడు ఎవరి సహాయం లేకుండా నేనెలా లడ్డూలను తయారు చేయగలను?” అని చింతలో పడ్డాడు. “ఒకవేళ నేను ఎవరి సహాయమైనా తీసుకుంటే అది బాబా తెలుసుకుంటారు. అసలు నన్నెందుకు ఐదు లడ్డూలు అడిగారు? అదికూడా ప్రత్యేకంగా లడ్దూలే ఎందుకు అడిగారు?” అనే ఆలోచనలతో రోజంతా గడిపి, చివరికి అదే చింతతో నిద్రపోయాడు. ఉదయం మేల్కొంటూనే అతనిలో కవితాభావం ఉప్పొంగి ఒక పద్యం వ్రాయడానికి సిద్ధమయ్యాడు. ఒకటి వ్రాయడం పూర్తిచేసి రెండవది వ్రాయడానికి సిద్ధపడుతుండగా బాబా దర్శనం కోసం వెళ్తున్న దీక్షిత్ ఆగి ఆ కవితను చూసాడు. తరువాత భీష్మ స్నానంచేసి, సాయిమహారాజు దర్శనం కోసం మశీదుకు వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే "లడ్డూలేవి?" అని అడిగారు. అతడికి ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. కానీ దీక్షిత్, ''లడ్డూలు సిద్ధమవుతున్నాయి బాబా” అన్నాడు. అది విని బాబా మౌనంగా ఉన్నారు.

మరుసటిరోజుకి భీష్మ ఐదు పద్యాలు వ్రాసాడు, కాని తర్వాత ఎంత ప్రయత్నించినా వ్రాయలేకపోయాడు. వాటిని తీసుకుని వెళ్ళి బాబా చేతిలో పెట్టాడు. బాబా వాటిని చూసి, "చదివి వినిపించమ"ని అడిగారు. వెంటనే అతడు చదవడం మొదలుపెట్టి, చదువుతుండగా బాబా అతని తలమీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు. “ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని వర్ణించేందుకు సాధ్యంకాదు” అని అతడు చెప్పాడు. ఆ తర్వాత అతను తాను వ్రాసిన ప్రతి పద్యాన్ని చదివి బాబా పాదాలకు సమర్పించుకున్నాడు. తరువాత కొంతకాలానికి మరో నాలుగు పాటలు వ్రాసారు భీష్మ. అలా మొత్తం అతడు తొమ్మిది ఆరతిపాటలు వ్రాసాడు. 

భీష్ముని రాకకు పూర్వం మాధవ్ అడ్కర్, దాసగణు వ్రాసిన పాటలు మాత్రమే బాబాను స్తుతిస్తూ ఉండేవి. వాటితోపాటు మధ్యయుగంలో పండరినాథునిపై రచింపబడిన పాటలను బాబాకిచ్చే అరతిలో పాడుతుండేవారు. శిరిడీలో ఆరతి సంప్రదాయం మొదలైన సంవత్సరానికి భీష్ముని రాకతో మరికొన్ని పాటలు చేరి ఆ సంప్రదాయం కొత్త రూపురేఖలు సంతరించుకుంది.

తరువాతికాలంలో భీష్మ తాను రచించిన పద్యాలకు మరికొన్ని ఆరతి పాటలుచేరి 'సాయినాథ సగుణోపాసన' పుస్తకరూపాన్ని తీసుకొచ్చారు. అందువల్ల శిరిడీ ఆరతి పాటలకు పుస్తక రూపాన్నిచ్చిన ఘనత భీష్మకే దక్కుతుంది. బాబా మహాసమాధి అనంతరం ఈ పుస్తకం సమాధిమందిరంలో “బుక్ ఆఫ్ డైలీ ఆరాధన”గా అధికారికంగా స్వీకరించబడింది. దాదాసాహెబ్ ఖపర్డే 1922 వరకు తన స్వంత వ్యయంతో ఆ పుస్తకాన్ని ప్రచురిస్తూ వచ్చారు. 1923లో శ్రీ సాయిబాబా సంస్థాన్ స్థాపించబడిన తరువాత, భీష్మ సమ్మతితో మరికొన్ని స్వరకల్పనలతో కలిపి సవరించిన సంచికను ప్రచురించారు. ఆ పుస్తకం ద్వారా లభించే ఆదాయం గోసంరక్షణకు ఇవ్వబడేది. ఈ పుస్తకం యొక్క కాపీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

నేడు ఎంతో ఘనంగా శిరిడీలో నిర్వహింపబడుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకు ఆద్యుడు భీష్మనే. 1897లో ప్రారంభమైన ఉరుసు ఉత్సవం 1912 వరకు అలానే కొనసాగింది.  అయితే ఆ సంవత్సరం ఉరుసుతోపాటు శ్రీరామనవమి జరుపుకోవాలనే ఆలోచన భీష్మకు వచ్చింది. వెంటనే తన ఆలోచనను కాకా మహాజనికి చెప్పాడు. తరువాత ఇద్దరూ అనుమతికోసం బాబాను సంప్రదించారు. బాబా పండుగ నిర్వహించటానికి అనుమతినిచ్చి పండుగ సందర్భంగా పూజ, భజన మరియు కీర్తనలను ఎవరు చేస్తారని అడిగారు. అందుకు వారిద్దరే పూనుకున్నారు. ఆ విధంగా 1912లో ఉరుసు, శ్రీ రామనవమిలను కలిపి ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ వారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికీ వైభవంగా నిర్వహిస్తున్నారు. అప్పటి రామనవమి ఉత్సవ సందర్భంగా సాయి సమక్షంలో భీష్మ కీర్తన చేసాక అతడు గొప్ప కీర్తనకారుడుగా పేరు పొందారు.

తరువాత కాలంలో అతడు వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మోహపా అనే గ్రామంలో నివసించసాగాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1918వ సంవత్సరంలో బాబా సమాధి చెందినప్పటి నుండి అతడు ప్రతిరోజూ ఆహారం తీసుకోవడం మానివేసి, ఏడాదికి ఒకసారి అంటే సచ్చిదానందస్వామి పండుగ రోజైన మార్గశిరమాసంలోని ద్వాదశిరోజు మాత్రమే ఆహారం తీసుకునేవాడు. మిగతారోజులలో అతను కేవలం పండ్లు, పాలు తీసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ కఠినమైన జీవన విధానం 17 సంవత్సరాలపాటు కొనసాగించాడు. తను సమాధి చెందడానికి ఒక సంవత్సరం ముందు నుండి పండ్లు కూడా మానేసి కేవలం పాలు మాత్రమే సేవిస్తుండేవాడు. అలా భీష్మ ఒక గొప్ప యోగిలా జీవితాన్ని గడిపాడు.

ఒకసారి భీష్మ ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఉమ్రేడ్ కు వెళ్లారు. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక నదిని దాటవలసి ఉంది. కాని ఆ నది భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. బండిని లాగుతున్న ఎద్దులు నదిలోకి ప్రవేశించడానికి నిరాకరించాయి. భీష్మ కళ్ళు మూసుకుని ఆ పరిస్థితి నుండి బయటపడవేయమని బాబాను ప్రార్థించాడు. వెంటనే ఎద్దులు నదిలోకి దిగి, వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం ప్రారంభించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు. భీష్మ కళ్ళు తెరిచి చూస్తే, తన ముందు సాయిబాబా నిలబడి ఉన్నారు. భీష్మ బండి పై నుండి క్రిందకి దిగి బాబాకు ప్రణామం చేసాడు. అదంతా చూస్తున్న వారికి భీష్మ ఎదురుగా ఎవరూ కనిపించకపోవడంతో అతనెవరికి వందనం చేస్తున్నాడో అర్ధంకాక ఆశ్చర్యంతో వింతగా చూస్తూ ఉండిపోయారు.

భీష్మ 1930లో రామేశ్వరం నుండి కాశీ వరకు, మళ్ళీ కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్రకు వెళ్లాడు. చివరికి అతడు ఆ యాత్రను ముంగించుకుని 1933లో మోహపాకు తిరిగి వచ్చాక ప్రజలు అతనిని ఒక సిద్ధపురుషునిగా చూడటం మొదలుపెట్టారు. అతను నిరంతరాయంగా సామజికసేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవాడు. 1934వ సంవత్సరం నుండి అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆ స్థితిలో కూడా అతడు రామాయణంపై పరిశోధన చేస్తుండేవాడు. 1935లో పవిత్రమైన నాగపంచమి నాటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కానీ, అతనికున్న అద్భుతమైన సంకల్పశక్తి కారణంగా మాత్రమే అతడు జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని కోడలు "రాముని పిలుపు వచ్చిందా?" అని అడిగినప్పుడు, భీష్మ తన మరణం గురించి అప్పటికే తెలిసి, ఆమెతో, "ఈ ప్రపంచంలో నుండి విడుదలవడానికి నా సమయం వచ్చింది, దయచేసి సచ్చిదానందస్వామి యొక్క పవిత్ర తీర్ధం ఇవ్వమ"ని చెప్పాడు. వెంటనే ఆమె ఆ పవిత్ర తీర్ధాన్ని అతని చేత త్రాగించింది. అతను "రామ్-రామ్" అని జపిస్తూ, పవిత్రతీర్థాన్ని స్వీకరించి, ఆగస్టు 8, 1935 శనివారం తన తుదిశ్వాసను విడిచాడు. ఒక ప్రకాశవంతమైన కాంతి అతని శరీరం నుండి బయటకు వెలువడి పంచభూతాలలో విలీనమయ్యింది. అతడు ఒక సాధుసత్పురుషునిలా జీవనం సాగించినందువలన అంత్యక్రియలలో అతని శరీరం కూర్చున్న స్థితిలో ఉంచబడింది.

మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తాలూకాలోని మోహపా గ్రామంలో శ్రీకృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ సమాధి ఉన్నది. నాగపూర్ నుండి కల్మేశ్వర్ రోడ్డుకు 35 కిలోమీటర్ల దూరంలో మోహపా ఉంది. అతని మునిమనవడు శ్రీప్రమోద్ భీష్మ తన ముత్తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

భీష్మ అనుభవం ద్వారా మనం తెలుసుకోవలసిన సూక్ష్మాలు కొన్ని అవగతమవుతాయి. స్వప్నంలో మహాత్ముల దర్శనమైతే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలవుతాయి. అవెన్నటికీ వ్యర్థంకావు. మంత్రయోగ సంప్రదాయం ప్రకారం గూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరముండదు.

1921 జూలై 11న వేదశాస్త్రి కృష్ణశాస్త్రిభీష్మ, సాయిలీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం. అందులో 1918కి ముందు జరిగిన కొన్ని బాబా లీలలు ఉన్నాయి.

సాయిమహరాజుతో నా అనుభవాలు నా సన్నిహితులకు బాగా తెలుసు. అందువలన, ఈ లేఖలో ప్రత్యేకమైన విషయమేమీ లేదు. భక్తులకు ఇప్పటికే తెలిసిన, లేదా చదివిన అనుభవాలను ప్రచురించవద్దు.

సాయినాథ్ మహరాజు అతీంద్రియశక్తులు కలిగి ఉన్నారు. సాయినాథుల వారు దేహాన్ని విడిచినప్పటికీ, నాకు మాత్రం వారు అమరులు. వారు ఎప్పుడూ ఉంటారు. సాయిమహరాజు ఎప్పటికప్పుడు నాకు తమ దర్శనాలను ఇస్తూ, తాము సంకల్పించిన కార్యాలు చేయటంలో నాకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు.

ఒక సాయంత్రం మేము సాయినాథునితో కూర్చుని గడిపిన తరువాత చివరి ఆరతి అంటే శేజారతి కూడా చేసాము. మరుసటిరోజు మేము ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు సాయి, "నిన్న సాయంత్రం నేను బయటికి వెళ్ళాను" అని అన్నారు. మేము ఆ మాటలు నమ్మలేకపోయము. ఎందుకంటే, సాయంత్రం నుండి శేజారతి ముగిసేవరకు ఆయన మాతోనే ఉన్నారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత శిరిడీకి దక్షిణాన ఉన్న ఒక గ్రామం నుండి ఒకవ్యక్తి వచ్చి, "నిన్న సాయంత్రం సాయిమహరాజ్ మా గ్రామంలో ఉన్నారు" అని చెప్పాడు. అప్పుడు సాయిమహారాజుకు అతీంద్రియ శక్తులున్నాయని, కాబట్టి ఒకే సమయంలో రెండుచోట్ల ఉన్నారని మాకు అర్థమయ్యింది.

ఒకసారి ఖపర్డే కొడుకు బల్వంతరావు ఇంటిలో నిద్రిస్తున్నప్పుడు సాయి కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా అతనితో కలిసి భోజనం చేసి, తాంబూలం వేసుకుని, కాసేపు ఊగుతూ కూర్చుని వెళ్ళిపోయారు. వెంటనే బల్వంతరావు మేల్కొన్నాడు. ఉదయం అతడు నాతో తనకి వచ్చిన కల గురించి చెప్పాడు. నేను అతనితో, "ఈ కల విషయం ఎవరికీ చెప్పకుండా నేరుగా సాయిమహారాజు వద్దకు వెళ్ళు. సాయే నీకు ఆ దర్శనాన్ని ఇచ్చినట్లయితే, ఆయన నీకు ఏదైనా సూచన ఇస్తారు. లేదు, ఒక సాధారణ కల అయితే సాయి ఆ కల విషయమై ఒక్కమాట కూడా మాట్లాడరు'' అన్నాను. వెంటనే బల్వంతరావు నేను చెప్పినట్లుగా సాయిమహారాజు వద్దకు వెళ్ళాడు. అప్పుడు సాయి "నిన్న రాత్రి నువ్వు నాకు భోజనం పెట్టావుగాని, దక్షిణ ఇవ్వలేదు'' అన్నారు. ఆ మాట విని అతడు ఆశ్చర్యపోయాడు. వెంటనే, "ఎంత దక్షిణ ఇవ్వమంటారు బాబా?" అని అడిగాడు. అందుకు బాబా 'రూ.25/-' అని చెప్పారు. వెంటనే అతడు వాడాకు వెళ్లి డబ్బులు తెచ్చి బాబాకు సమర్పించాడు. ఇవన్నీ బాబా యొక్క అతీంద్రియ శక్తులకు నిదర్శనాలు.

కొందరు ఈ కథలు అబద్ధాలు అనుకోవచ్చు. కానీ మిస్టర్ యశ్వంత్ వెంకటేష్ కొల్హాత్కర్, బి.ఎ, ఎల్.ఎల్.బి. గారి పుస్తకం 'శ్రీమద్భగవత్ దర్శన్' ఆత్మ శాశ్వతమైనదని, అనేక అద్భుతాలు చేయగలదని నిరూపిస్తుంది. అందువలన మేలుకుని ఉన్నా లేదా కలలోనైనా తమ దర్శనాన్ని ప్రసాదించడం బాబాకు అసాధ్యమెలా అవుతుంది? ''జాగత్ రామ, సోవత్ రామ, సప్నే మే దేఖో రామా హీ రామ,'' అని సంత్ ఏకనాథ్ మహరాజ్ చెప్పారు. తదనుగుణంగా బాబా ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారు. 

చాందోగ్యోపనిషత్తు వాల్యూం 2 అధ్యాయం VIII, 4 వ వచనంలో, "కొన్నిసందర్భాలలో పరమానందాన్ని అనుభవించే ఆత్మ, శరీరాన్ని విడిచిపెట్టి, జ్ఞానాన్ని పొంది, పరమాత్మలో లీనమై ఏకత్వాన్ని అనుభవిస్తుంది. ఆ పరిస్థితిలో కూడా ఆత్మ శరీరాన్ని అపస్మారకస్థితిలో వదలాల్సిన అవసరం లేదు'' అని చెప్పబడింది. సాయిమహరాజు తమ భావాలను, కోరికలను పూర్తి నియంత్రణలో ఉంచి సదా పరమాత్మలో ఐక్యమై మౌనంగా ఉండేవారు.

ఒక్కోసారి తాను నిద్రించే చావడి నుండి మసీదుకు వెళుతున్నప్పుడు బాబా తమ చేత ధరించే సటకాను ఊపుతూ భయంకరంగా తిడుతూ ఉండేవారు. అటువంటి సమయాలలో ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. బాబా ఉచ్ఛస్వరంలో బయటకు చాలాచెడ్డగా తిడుతునప్పటికీ, ప్రజలు "అల్లాహ్ తేరా భలా కరేగా" అని ఆయన పలికిన మృదుమధుర పదాలు కూడా వినగలిగేవారు. కోపంతో ఉన్నప్పుడు ఎవరు ఆశీర్వాదాలు ఇస్తారు? అందువల్ల నా అభిప్రాయంలో బాబా కోపం కేవలం ఒక ప్రదర్శన మాత్రమేకానీ, ఆయన మనస్సు నిండా దయ, ప్రశాంతత ఉండేవి.

‘తుకారామ్ గాథ’ లో 4274వ వచనంలో, దేవుడు తన భక్తుల భారం మోస్తూ ఎల్లప్పుడూ వారికి దగ్గరగా ఉంటాడు అని చెప్పబడి ఉంది. ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో మేమంతా సాయిమహరాజ్ ప్రక్కన కూర్చుని ఉన్నాము. నాటి ఆచారం ప్రకారం బాపూసాహెబ్ జోగ్ ఆరతికి సిద్ధం చేస్తున్నాడు. కానీ హఠాత్తుగా, ఏ విధమైన కారణం లేకుండా మహరాజు నరసింహ అవతారాన్ని ధరించారు. ఆయన ఆరతి సామగ్రిని, ప్రసాదాలను విసిరేసి, సటకాతో బెదిరిస్తూ భక్తులను బయటకు తరిమేసారు. తర్వాత అయన తమ స్థానం విడిచి బయట వరండాలో వచ్చి కూర్చున్నారు. నాడు మధ్యాహ్నం 3గంటల వరకు ఆరతి మొదలు కాలేదు. భక్తులందరూ ఎంతో ఆకలితో ఉన్నారు. కొందరు బాబా కూర్చునే ఆసనానికి ఆరతి ఇవ్వమని సూచించారు. కానీ, దాదాసాహెబ్ ఖపర్డే అందుకు అంగీకరించక, బాబాకి మాత్రమే ఆరతి చేయాలని అన్నారు. అయితే బాపూసాహెబ్ చేతుల మీదుగా కాకుండా వాఘ్యా చేతులతో చేయాలని అన్నారు. ఆ సూచనను అనుసరించి ఆరతి పళ్ళాన్ని వాఘ్యా చేతికి ఇచ్చారు. అంతలో అకస్మాత్తుగా బాబా తమ ఆసనంపై వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆరతి జరిగింది. కానీ బాబా కోపం ఎవరికీ అర్థం కాలేదు. 

మరుసటిరోజు కోపర్గాఁవ్ కి చెందిన ఒక న్యాయవాది వచ్చి ఇలా చెప్పాడు, ''ఒక బాబా భక్తునికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసు పెట్టబడింది". నేను అక్కడకు చేరుకునేసరికే, కోర్టు అతనికి శిక్ష విధించింది. ఆ భక్తుని తరపున కేసు నేను తీసుకుని కోర్టులో అప్పీలు వేశాను. ఆశ్చర్యకరంగా కోర్టు నిందితుడి ప్రవర్తన గురించి నన్ను ప్రశ్నించింది. అతని మంచి ప్రవర్తన మరియు అమాయకత్వం గురించి నేను హామీ ఇవ్వడంతో, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ భక్తుడు బాబా గురించి చెప్పి, "కేవలం బాబా అనుగ్రహం వల్లనే నేను విడుదలయ్యాన"ని నాతో చెప్పాడు. "ఈ అద్భుతం ఎలా జరిగిందో బాబాను అడిగి తెలుసుకోవాలని, బాబా దర్శనం చేసుకోవాలని నేను శిరిడీ వచ్చాను" అని. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆరతిలో విశ్వమంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పబడింది. సాయి ఆ భావానికి అనుగుణంగా ప్రవర్తించేవారు.

బాబా వద్ద ఎప్పుడూ పాత చింకి గోనెగుడ్డ ఉండేది. అది బాబాకు చాలా ప్రియమైనది. దానినే బాబా ఎప్పుడూ ఆసనంగా ఉపయోగించేవారు. ఒకసారి బాబా బయటకు వెళ్ళినప్పుడు, ఒక భక్తుడు ఆ గోనెగుడ్డను తీసివేసి, దాని స్థానంలో పట్టుపరుపును పెట్టాడు. బాబా తిరిగి వచ్చి, అతను పెట్టిన కొత్త పరుపును చూసిన వెంటనే మండిపడి తిట్టడం మొదలుపెట్టారు. ఆయన ఆ పరుపును విసిరేసి, ధునిని కూడా చెదరగొట్టారు. పాత గోనెగుడ్డ తెచ్చి యథాస్థానంలో పెట్టిన తర్వాతే ఆయన శాంతించారు.

''ధీరో నా సోచతి'' అని కఠోపనిషత్తు చెప్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన ధైర్యవంతులైన వారు ఎన్నటికీ దుఃఖానికి గురికారు. ఒకవేళ విచారంతో బాధపడుతున్నప్పటికీ, వారు ఆ దుఃఖం నుండి తేరుకోవడానికి ఇతర ప్రజల సలహాలు అవసరం లేదు. వారు తమకి తాముగా బయటపడతారు. 

మేఘ అనే గుజరాతీ బ్రాహ్మణుడు సాయిమహరాజును అమితంగా ప్రేమించే భక్తుడు. మొదట అతడు తన యజమాని అయిన సాఠే చెప్పడం వలన బాబా దర్శనార్ధం వచ్చాడు. కానీ ఒకరోజు తన మనస్సులో, 'నేను ముస్లింను ఎందుకు సేవించాలి?' అనుకున్నాడు. అందువల్ల అతను శిరిడీ విడిచి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్నిరోజులకి అతడు ఆ అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత శివాలయాన్ని సందర్శించాడు. అక్కడ శివలింగం ఉండే స్థానంలో అతడు సాయిమహారాజును చూశాడు. వెంటనే శిరిడీకి తిరిగి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు తొలగించడానికి బాబా అతనితో, "కొన్నిసార్లు గాయత్రీ మంత్రజపం చేయమ"ని చెప్పారు. అతడు అది పూర్తిచేసాక బాబా అతనిని ఆశీర్వదించారు. అతడు మరణించినప్పుడు, బాబా స్వయంగా తమ చేతులతో అతని దేహమంతా నిమురుతూ ఐదునిముషాలపాటు హృదయవిదారకంగా శోకించారు. తరువాత, “ఎందుకంత రోదిస్తావు?” అని తమను తామే ఓదార్చుకుంటూ, ఉపశమనం చెందారు(కఠోపనిషత్తులో చెప్పినట్లుగా, ''ధీరో నా సోచతి''). తరువాత తుది ఆచారాలకు అనుమతి ఇచ్చారు.

సాయిభక్తుల ప్రయోజనం కోసం శ్రీకృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ యొక్క మునిమనుమడు శ్రీప్రమోద్ భీష్మ యొక్క సంప్రదింపు వివరాలను క్రింద ఇస్తున్నాము:

Shri.Pramod Bhishma
C/o.Shri Sadguru Sainatha Sagunopasana Rachayita
Krishna Jageshwar Bhishma Pratishtana, Nagpur,
Trust Reg No.2818 (Nagpur) 2014,
Advaith Residency, Flat No.33,
Plot No.203, Kher Town,
Dhamarampet,
Nagpur - 440 010,
Maharashtra,India
Contact Numbers: 0712 255 2196/ 94218 07013
Email: pramodbhishmasai@gmail.com

Sources: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri. Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015.

3 comments:

  1. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. చాలా విషయాలను తెలుకోగలిగాము భీష్మ గురించి.బావుంది.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo