సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 197వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా కృపతో గర్భసంచి క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది
  2. అడిగినంతనే అనుగ్రహించారు బాబా

సాయిభక్తుడు బుసిరెడ్డి రఘునాథరెడ్డిగారు తమకు ఇటీవల జరిగిన రెండు అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

బాబా కృపతో గర్భసంచి క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది

జై సాయిరాం!

అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటినుండి సాయిబాబా భక్తుడిని. నా పేరు రఘు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మ మా తమ్ముడి దగ్గర వేరే ఊరిలో ఉంటుంది. నేను సంవత్సరానికి ఒకసారి ఆమెకు హెల్త్ చెకప్ చేయిస్తాను. ఆమె జులై నెలలో హెల్త్ చెకప్ కోసం హైదరాబాదు వస్తే, నేను అన్ని పరీక్షలు చేయించాను. మరుసటిరోజు ఆ రిపోర్టులు తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళాము. డాక్టర్ రిపోర్టులన్నీ పరీక్షగా చూసి, "అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క కొలెస్ట్రాల్ మాత్రమే ఎక్కువగా ఉంది. మందులు వాడుతూ, తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే సరిపోతుంది" అని చెప్పారు. తరువాత డాక్టర్ పాప్ స్మియర్ టెస్ట్(గర్భసంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్) గురించి అడిగారు. నేను, "ఆ టెస్ట్ చేయించలేదు, మరిచిపోయాన"ని చెప్పి, "ఇప్పుడు చేయిస్తాన"ని చెప్పాను. కానీ డాక్టర్, "కంగారేమీ లేదు. నెల తరువాత అయినా చేయించుకోండి" అని చెప్పారు. అమ్మ కూడా, "తరువాత చేయించుకుంటాన"ని చెప్పడంతో మేము ఇంటికి వచ్చేశాము. కానీ నా మనస్సులో ఆ పరీక్ష చేయించలేదనే ఫీలింగ్ ఉండిపోయింది. వారం తరువాత అమ్మ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది.

ఒకరోజు అమ్మ ఫోన్ చేసి, "మా బంధువులలో ఒకరికి గర్భసంచి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది" అని చెప్పింది. దాంతో నాకు చాలా భయమేసి అమ్మతో, "ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటాన"ని చెప్పమన్నాను. అందుకు అమ్మ సరేనని డాక్టర్ని సంప్రదించింది. డాక్టర్ శాంపిల్ తీసుకుని టెస్ట్ సెంటర్ కి పంపించి, "రిపోర్టులు ఒక వారంలో వస్తాయ"ని చెప్పారు. ఆ వారంరోజులు టెన్షన్  టెన్షన్ గా గడిపాను. తీరా రిపోర్టు వచ్చాక గర్భసంచి క్యాన్సర్ ఉందో, లేదో స్పష్టంగా చెప్పకుండా, 'బయాప్సీ టెస్ట్ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది' అని చెప్పారు. నేను ఏదో తేడా ఉన్నట్లుందన్న భయంతో చాలా బాధపడ్డాను. డాక్టర్ని అడిగితే, "రేపు రండి, బయాప్సీ టెస్ట్ చేద్దాం" అన్నారు. మరుసటిరోజు వెళితే, "మత్తు ఇవ్వాలి. కాబట్టి ముందుగా వెళ్లి బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్ చేయించుకుని రండి" అని చెప్పారు. ఆ పరీక్షలు చేయిస్తే, బీపీ ఎక్కువ ఉందని తెలిసింది. లేడీ డాక్టర్, "డ్యూటీలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. బీపీ ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేను. మీరు హైదరాబాదులో చేయించుకోవడం మంచిది" అని సూచించారు.

నేను అమ్మని హైదరాబాదు తీసుకుని వచ్చి డాక్టర్ని సంప్రదించాను. డాక్టర్ మళ్ళీ పాప్ స్మియర్ టెస్ట్ చేయమన్నారు. నేను, "బాబా! నాకు సహాయం చేయండి. ఈసారి రిపోర్టులో 'నార్మల్' అని వస్తే, నేను శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. అలాగే నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. రిపోర్టు 'నార్మల్' అని వచ్చింది. నేను మనసులోనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తరువాత నేను, అమ్మ హాస్పిటల్లోనే ఉన్న సాయిబాబా మందిరంలోకి వెళ్లి బాబాకి నమస్కరించుకున్నాము. తరువాత హార్ట్ స్పెషలిస్టుకి చూపిస్తే మందులిచ్చి వాడమన్నారు. "బాబా! అమ్మని దీవించి, ఆమె కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేసి, ఎటువంటి సమస్యా లేకుండా ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటూ రక్షణనివ్వండి". నేను భక్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నమ్ముకున్నవారిని బాబా ఎప్పుడూ వదిలివేయరు. కాబట్టి  దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కలత చెంది ఆశను కోల్పోకండి. కష్టసమయాలందు తప్పకుండా బాబా సహాయం లభిస్తుంది. మన జీవితాలలో జరిగే ప్రతి సంఘటన ద్వారా ఆయన మనకు ఏదో ఒకటి బోధిస్తూ ఉంటారు. ఆయన మననుండి ప్రేమ, ఆప్యాయతలను మాత్రమే కోరుకుంటారు. శ్రద్ధ, సబూరీ ఎంతో శక్తివంతమైన ఆయుధాలు. వాటిని వృద్ధి చేసుకోండి. "ధన్యవాదాలు బాబా!"

సాయినాథ్ మహరాజ్ కీ జై!

అడిగినంతనే అనుగ్రహించారు బాబా

జై సాయిరాం!

ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటాను. నేను ఈ సంవత్సరం ఆరంభంలో, అంటే 2019, ఫిబ్రవరి 19న ఒక ఇంటిని కొనుగోలు చేశాను. బాబా దయవల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా లోన్, రిజిస్ట్రేషన్ అన్నీ సమయానికి పూర్తయ్యాయి. రెండు అంతస్థుల బిల్డింగులో క్రింద డబుల్ బెడ్‌రూమ్, పైన సింగిల్ బెడ్‌రూమ్ ఉన్నాయి. సింగిల్ బెడ్‌రూమ్ ఇంటిలో అద్దెకు త్వరగానే చేరారు. కానీ క్రింద ఫ్లోర్ లోకి ఎవరూ కుదరలేదు. మూడు నెలలపాటు 'టు-లెట్' బోర్డు అలాగే ఉంది. వచ్చినవాళ్లంతా ఇంటిని ఇష్టపడుతున్నారుగానీ అద్దె తగ్గించమని అడుగుతున్నారు. నేను లోన్ కోసం ఇ.ఎం.ఐ అధికమొత్తం కడుతున్నాను. కాబట్టి అద్దె తగ్గిస్తే నాకు కష్టం అవుతుంది. నేను అనుకున్న స్థాయిలో ఉంటేనే నాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేను, "నా ఇంటిలో అద్దెకు ఎవరైనా కుదిరితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను, అలాగే వెయ్యిరూపాయలు బాబా ట్రస్టుకి చెల్లిస్తాన"ని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. నేను బాబాను ప్రార్థించిన మరుసటిరోజే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాకు ఫోన్ చేసి అడ్వాన్స్ ఇచ్చాడు. అది కూడా నేను అనుకున్న మొత్తానికే! అంతా బాబా కృప, అడిగినంతనే అనుగ్రహించారు. "వందనాలు సాయిబాబా. ఎల్లప్పుడూ మీరు నా ఇంటి విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా సహాయం చేయండి. నాకు, నా కుటుంబానికి సదా రక్షణనివ్వండి సాయినాథా!"

మరొక విషయం, నేను సాయిబాబా అద్భుతాల గురించి బ్లాగులో చదువుతున్నప్పటినుంచి "అందరూ చిన్న చిన్న విషయాలకి బాబాని ప్రార్థిస్తారేమిటి?" అని అనుకునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థం అయింది - చిన్నదైనా, పెద్దదైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాబా సహాయం మనకి కావాలి.

సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

3 comments:

  1. Om Sai Ram om Sai Ram om Sai Ram.i like your blog.i have experiences to write.

    ReplyDelete
  2. Sri sachchidananda sadguru sainath maharajuki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo