సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 200వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • పుణ్యతిథి సమయంలో బాబా చూపిన ప్రేమ, ఆప్యాయత

సాయిరామ్! నా పేరు శిరీష. ఇదివరకు కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు నేను మీతో ఇటీవల జరిగిన కొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2001లో మొదటిసారి శిరిడీ వెళ్ళాను. దాదాపు 18 ఏళ్ళ తరువాత  బాబా నా శిరిడీ పర్యటనను ఎలా ప్లాన్ చేశారు? ఆ పర్యటనలో ఏమి జరిగింది? అనే విషయాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2018లో నేను అనుకోకుండా 'సాయిమహారాజ్ సన్నిధి ఫేస్‌బుక్ పేజీ' చూశాను. అప్పటినుండి క్రమంతప్పకుండా నేను ఆ పేజీని అనుసరిస్తున్నాను. దాని ద్వారానే నేను సాయి సచ్చరిత్ర గురించి, ఆరతుల గురించి, ఇంకా మరెన్నో బాబాకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నాను. అందుకు ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు.

గత సంవత్సరం నుండి శిరిడీ రమ్మనే బాబా పిలుపుకోసం నేను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. నాలుగు నెలల క్రితం నేను నా తల్లిదండ్రులు ఉండే పట్టణంలోని బాబా మందిరానికి వెళ్ళాను. అప్పుడొక టీనేజ్ అమ్మాయి 'సాయి దివ్యపూజ' పుస్తకాన్ని నాకు ఇచ్చింది. (అదివరకే నేను ఈ పూజ గురించి 'సాయిమహారాజ్ సన్నిధి ఫేస్‌బుక్ పేజీ'లో వచ్చే భక్తుల అనుభవాలలో చదివి ఉన్నాను.) బాబా నన్ను ఆ పూజ చేయమని సూచిస్తున్నారని నాకనిపించింది. నిజానికి నేనెప్పుడూ పూజలు, వ్రతాలు చేయలేదు. అయితే మా అబ్బాయి విషయంలో నాకొక కోరిక ఉంది. ఆ విషయంగా 11 వారాలు ఆ పూజను చేయాలనుకుని 2019, జులై 11న పూజ మొదలుపెట్టాను. కానీ నేను పూజ ప్రారంభించేటప్పుడు మా అబ్బాయి విషయం బాబాని అడగడానికి బదులుగా, "బాబా! మీరెప్పుడూ మాతో ఉండండి. మాకేది మంచిదో మాకంటే మీకే బాగా తెలుసు" అని మాత్రమే చెప్పుకున్నాను. పూజ మొదలుపెట్టిన తరువాత నెలరోజులపాటు చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ సాయిపై నేనెప్పుడూ ఆశను కోల్పోలేదు. నేను ఒక్కటే అనుకున్నాను, 'ఈ సమస్యలు మా మంచికోసమే' అని.

సాయి దివ్యపూజ పుస్తకంలో, "పూజ పూర్తిచేశాక శిరిడీ వెళ్లి బాబాకి దక్షిణ సమర్పించుకోవాలి" అని ఉంది. అలా చేద్దామంటే నా కుటుంబసభ్యులు దేవుణ్ణి నమ్మరు. వారు దేవాలయానికి రావటానికి కూడా ఇష్టపడరు. కాబట్టి అదెలా సాధ్యమవుతుందో అనుకున్నాను. కానీ బాబా అద్భుతం చూపించారు. 2019, అక్టోబర్ 11కి నా పూజ పూర్తికావచ్చని అంచనా వేసి సెప్టెంబర్ 2వ వారంలో నేను మావారిని, "పండుగ సెలవుల్లో శిరిడీ వెళదామా?" అని అడిగాను. నేను ఆశ్చర్యపోయేలా మావారు వెంటనే అంగీకరించారు, పిల్లలు కూడా సరేనన్నారు. నిజంగా ఇది నాకు పెద్ద అద్భుతం.

నేను చేస్తున్న పూజ గురించి తెలియని నా భర్త, పిల్లలకి సెలవురోజులనే ఉద్దేశ్యంతో అక్టోబరు 7న శిరిడీ వెళ్లి, తిరిగి 9న రావడానికి టిక్కెట్లు బుక్ చేశారు. అయితే నెలసరి సమస్య కారణంగా ఆలోపు నేను పూజ పూర్తి చేయలేకపోవచ్చని నాకనిపించింది. కానీ ఏదైనా బాబా చూసుకుంటారని సమస్యను నేను ఆయనకే వదిలేశాను. ఆయన ఏ ఆటంకం లేకుండా అక్టోబర్ 3తో నా పూజ పూర్తి చేసేలా చేశారు. తరువాత మావారు, "విజయదశమిరోజున శిరిడీ సమీపంలోని ప్రదేశాలకు వెళదామ"ని అన్నారు. నేను, "ఆరోజు మందిరంలోనే ఉండాలనుకుంటున్నాన"ని చెప్పాను. కానీ అందుకాయన అంగీకరించలేదు. దాంతో నేను కాస్త కలత చెందాను. అయితే బాబా అద్భుతం చూపించారు! మా అమ్మాయి, "10వ తేదీన స్కూల్ తిరిగి ఓపెన్ అవుతుంది. కాబట్టి 8వ తేదీన శిరిడీ నుండి తిరుగు ప్రయాణమైతే ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చ"ని చెప్పింది. దాంతో మావారు మునుపటి టికెట్లను రద్దుచేసి 8వ తేదీకి బుక్ చేశారు. నేను ఆరతులకు వెళ్లాలని ఆశపడి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేయడానికి ప్రయత్నించాను. కానీ 7,8,9,10 తేదీలలో 'నాట్ అప్లికబుల్' అని వచ్చింది. ఇక చేసేదిలేక ఊరుకున్నాను.

మొత్తానికి బాబా కృపవలన మేము 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శిరిడీ విమానాశ్రయంలో దిగాము. దిగుతూనే రాత్రి 7 గంటల సమయంలో దర్శనానికి వెళ్లేందుకు బుక్ చేసుకున్నాము. తరువాత వాళ్ళని ఆరతి టిక్కెట్ల గురించి కూడా నేను అడిగాను. వాళ్ళు "పి.ఆర్.ఓ. కార్యాలయంలో సంప్రదించమ"ని చెప్పారు. అక్కడినుండి మేము హోటల్ కి వెళ్లి, సాయంత్రం 5 గంటలకు భోజనాలు చేశాము. తరువాత మేము మందిరానికి వెళ్లి పి.ఆర్.ఓ. ఆఫీసుకు వెళ్ళాము. వాళ్ళు టిక్కెట్లు లేవని, సాధారణ క్యూలో వెళ్ళమని చెప్పారు. నేను చాలా నిరాశపడ్డాను. అంతలో మావారు, "ముందు దర్శనానికి వెళ్దాం పదండి" అని అన్నారు. మేము లోపలికి వెళ్తున్నప్పుడు కాస్త నెమ్మదిగా వెళితే సాయంత్రం ఆరతికి లోపలే ఉండే అవకాశం వస్తుందేమోనని నేను ఆశపడ్డాను. కానీ ఆ అవకాశం లేకపోయింది. దర్శనం చేసుకుని గం.5.40ని. కల్లా బయటకు వచ్చేశాము. నేను హుండీలో కొంత డబ్బు వేద్దామనుకుంటే మావారు, "అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో కట్టి, రసీదు తీసుకోమ"ని చెప్పారు. నేను, "రేపు కడతాన"ని చెప్పాను. కానీ మావారు అప్పుడే కట్టమని పట్టుబట్టారు. దాంతో మేము అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి వెళ్లి, కొంత డబ్బు విరాళంగా కట్టాము. అక్కడ ఉన్న ఆఫీసర్, "రసీదు తీసుకుని సంధ్య ఆరతికి వెళ్ళమ"ని చెప్పాడు. ఇలా బాబా నా మనసులోని కోరికను తీరుస్తున్నారని చాలా సంతోషించాను. తరువాత అతను రశీదుతోపాటు ఆరతికి వెళ్ళడానికి మాకు పాసులు కూడా ఇచ్చి, మాతోపాటు మందిరం లోపలకి రావడానికి బయలుదేరాడు. నేను అతనితో, "నేను నాలుగు ఆరతులకు హాజరు కావాలని ఆశపడుతున్నాన"ని చెప్పాను. అందుకతను మరోమాట లేకుండా వెంటనే నాలుగు ఆరతులకు పాసులు ఇచ్చాడు. బాబా చూపిన ప్రేమకు, ఆప్యాయతకు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. హృదయపూర్వకంగా నాలుగు ఆరతులకు హాజరు కావాలని కోరుకున్న నా కోరికను ఆయన నెరవేర్చారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆ పట్టలేని ఆనందంతో ఆరోజు సంధ్య ఆరతికి, శేజారతికి హాజరయ్యాను. ఆరోజు పల్లకీ ఉత్సవం కూడా చూశాను. మరుసటిరోజు విశేషమైన బాబా పుణ్యతిథినాడు కాకడ ఆరతికి, మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాము. కాకడ ఆరతి కోసం వేచివున్న సమయంలో, బాబా సమక్షంలో పారాయణ కూడా చేసుకున్నాను. ఎంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను. ఆరతులేకాక రెండు దర్శనాలు కూడా అయ్యాయి. నాకిప్పటికీ ఆరతులు అన్నింటికి హాజరయ్యానంటే నమ్మశక్యంగా లేదు.

అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు శిరిడీ నుండి మా తిరుగుప్రయాణం ఉంది. మేము హోటల్ నుండి బయలుదేరేముందు నా శిరీడీ ప్రయాణానికి గుర్తుగా ఏదైనా తీసుకుందామని షాపుకి వెళ్లి ఒక పెద్ద పాలరాతి బాబా విగ్రహాన్ని తీసుకున్నాను. నిజానికి బాబా విగ్రహం తీసుకుందామన్న ఆలోచనే నాకు లేదు. ఎందుకంటే మా ఇంట్లో అప్పటికే ఒక చిన్న బాబా విగ్రహం, ఫోటో ఉన్నాయి. కానీ మరచిపోలేని మధుర జ్ఞాపకంగా బాబా శిరిడీ నుండి నాతో మా ఇంటికి వచ్చారు. నా ఈ శిరిడీ పర్యటన మొత్తం బాబా ఎంతో చక్కగా ప్లాన్ చేసి నన్ను చాలా ఆనందపరిచారు. చాలా రద్దీగా ఉండే పుణ్యతిథినాడు కేవలం 24 గంటల్లో మాకు 4 ఆరతులకు హాజరయ్యే అవకాశమిచ్చి ఆయన తన ప్రేమను, ఆప్యాయతను చూపించారు.


7 comments:

  1. మీ అనుభవం తో నాకు చాలా సంతోషం కలిగించింది. కృతజ్ఞతలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి.
    ఓం శ్రీ సాయిరాం జీ🙏🙏🙏

    ReplyDelete
  2. Omsaisri Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Maku yemlkavalo meeku thelusu thandri🙏
    Maa baadhalu theerchi sainaadha🙏

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo