సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 189వ భాగం.


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. హృదయపూర్వక ప్రార్థనలను సాయి వింటారు
  2. సాయిబాబా లీలాకేళి

హృదయపూర్వక ప్రార్థనలను సాయి వింటారు

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయి కుటుంబసభ్యులందరికీ నా నమస్కారములు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సాయిపై సంపూర్ణ విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, ఆయన మన ప్రార్థనలను తప్పక వింటారు. నేనిప్పుడు చెప్పబోయేది కొంతమందికి చిన్న అనుభవంగా కనిపించవచ్చుగానీ,నాకు మాత్రం సాయి చూపిన అద్భుతం.

ఒకరోజు నా ల్యాప్‌టాప్ ఆన్ కాలేదు. ఆన్ అవుతుంది కానీ స్క్రీన్ పూర్తి బ్లాంక్ గా ఉండిపోతుంది. బ్యాటరీ అయిపోయిందేమోనని ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసినా కూడా స్క్రీన్ బ్లాంక్ గా ఉండిపోయింది. ముందురోజు రాత్రి బాగా పనిచేసింది. అంతలోనే ఇలా కావడంతో నాకేమీ అర్థం కాలేదు. అది ఈమధ్యే తీసుకున్న క్రొత్త ల్యాప్‌టాప్, పైగా ఖరీదైనది. అన్నింటికంటే నాకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంది. అందువలన నేను చాలా కలత చెందాను. మరుసటిరోజు ఆన్ చేసినా అదే పరిస్థితి. నేను ఆ విషయం గురించి అమ్మతో చెప్తే తను, "ఆందోళనపడకు, అది మళ్ళీ పనిచేస్తుందిలే" అని చెప్పారు. నేను మనసులో, "సాయీ! దయచేసి అది నార్మల్ గా పనిచేసేలా చేయండి. అలా జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి సచ్చరిత్ర, సాయిభవాని, సాయివచన్ చదివాను. తరువాత అమ్మ, "ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి కొంతసేపు అలా వదిలేయమ"ని చెప్పారు. నేను అలాగే చేశాను. కొంతసేపటి తరువాత ఆన్ చేస్తే చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. నేను నమ్మలేకపోయాను. 'ఛార్జింగ్ లేకపోవడమే సమస్య' అని కొంతమంది అనుకుంటారని నాకు తెలుసు. కానీ విషయం అది కాదు. నేను మొదట్లోనే ఛార్జింగ్ పెట్టాను, కానీ అది పనిచేయలేదు. అంతా నా సాయి చేసిన అద్భుతమే తప్ప మరొకటి కాదు. "సాయీ! మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. మాకు మీరు ఎంత అవసరమో మీకు తెలుసు. దయచేసి ఎల్లప్పుడూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి. శ్రద్ధ, సబూరీ కలిగి ఉండటానికి దయచేసి మాకు మరింత బలాన్నివ్వండి".

సాయిబాబా లీలాకేళి

ఈమధ్యనే మీరు 'సాయి అనుగ్రహసుమాలు' శీర్షికలో వస్తున్న తర్ఖడ్ కుటుంబం అనుభవాలు చదివే ఉంటారు. అందులో విఠలుడు భక్తురాలికోసం క్రిందికి దిగివస్తే, ఇప్పుడు మీరు చదవబోయే అనుభవంలో భక్తురాలినే దేవి తన చెంతకు రప్పించుకుంటుంది. ఆ సాయి లీలావిలాసాన్ని చదివి ఆనందించండి.

ఈ అనుభవం ఒక గొప్ప సాయిభక్తురాలికి సంబంధించినది. ఉత్తర భారతదేశంలో ఆమెను అందరూ 'సాయిభక్త దీదీ(అక్క)' అని పిలుస్తారు. ఆమె అనుభవాలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ అనుభవం కూడా అందులోనిదే. 2008లో ఒకరోజు ఆమె వేరే ఊరిలో ఉన్న తన కొడుకు యొక్క అత్తమామల ఇంటికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో దేవీ 'మహామాయ' కొలువైయున్న రత్నపూర్ అనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వారంతా ఆగినప్పుడు తన కొడుకు మామగారు ఆ క్షేత్రం యొక్క విశిష్టత గురించి వివరించారు. అది చాలా ప్రసిద్ధ క్షేత్రమని, ప్రతిరోజూ చాలామంది భక్తులు సందర్శిస్తుంటారని చెప్పారు. మొదట్లో దీదీకి ఆ క్షేత్రాన్ని సందర్శించాలని ఆసక్తి లేకపోయినప్పటికీ క్షేత్రం యొక్క కీర్తి విన్నాక దేవీ దర్శనం చేసుకోవాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. వెంటనే ఆలయానికి వెళ్ళేందుకు నిశ్చయించుకున్నారు. "ఈరోజు నేను నా సాయిదేవుడిని 'మహామాయ' రూపంలో దర్శించుకోబోతున్నాన"న్న ఆలోచనలతో ఆమె దర్శనానికి చాలా ఉత్సాహపడ్డారు. కానీ ఆలయ ప్రాంగణానికి వెళ్లాక చాలా పొడవుగా ఉన్న భక్తుల క్యూని చూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయినా వెళ్లి క్యూలో నిల్చున్నారు. వాళ్ళు దాదాపు ఆ క్యూ చివరలో ఉన్నారు. దూరంనుండి పుణ్యక్షేత్ర దర్శనమవుతున్నా గర్భగుడి లోపలకి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం కనపడలేదు. దర్శనం లభించకపోవచ్చనే సందేహాలు ఆమెను చుట్టుముట్టాయి. దానితో ఆమె తన ప్రియమైన సాయిని ప్రార్థించడం ప్రారంభించింది. మదిలో మాత్రం, "ఈరోజు నేను సాయిని మహామాయ రూపంలో చూడలేకపోవచ్చు, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు" అని కలతచెందుతూ ఉంది. కొంతసేపటికి ఆరతి  ప్రారంభమైంది. దూరంనుండి పూజారి ఆరతి చేయడం వాళ్ళు చూడగలిగారు. ఇక ఈరోజు దర్శనం తప్పిపోయినట్లేనన్న ఆలోచనలతో ఆమె మనసు చంచలంగా అయిపోయింది. కొద్దిసేపటి తరువాత పూజారి క్యూలో ఉన్నవారికేసి చేయి ఊపుతున్నట్లు వాళ్ళు గమనించారు. అయితే పూజారి ఎవరినుద్దేశించి అలా సంకేతాలిస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. వెనుక ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ళు వెనక్కి తిరిగారు కానీ, ఎవరూ లేరు. పూజారి వ్యక్తిగతంగా వాళ్లకు తెలియకపోవడంతో వాళ్ళకేమీ అర్థంకాక ఉన్నచోటనే నిలబడి చూస్తున్నారు. అంతలో పూజారి తన చేతిలో ఉన్న ఆరతి పళ్ళాన్ని మరో పూజారికిచ్చి క్రిందకు దిగి నేరుగా క్యూ చివరివరకు వచ్చి దీదీ వైపు చూస్తూ, తనతో రమ్మని పిలిచారు. ఆమె బిత్తరపోతూ అతన్ని అనుసరిస్తూ ఆరతి జరుగుతున్న గర్భగుడి వద్దకు చేరుకుంది. అక్కడ నిలుచుని ఆరతి వీక్షించమని పూజారి చెప్పారు. తరువాత మహామాయకు అర్పించడానికి కొన్ని పువ్వులు కూడా ఆమెకు ఇచ్చారా పూజారి.

అప్పటి అనుభూతి గురించి దీదీ ఇలా చెప్పారు: "పూజారి ఆహ్వానంతో నా మనసులోని అలజడినంతా మర్చిపోయాను. దేవి సమీపానికి వెళ్ళేందుకు నేను సరైన వస్త్రధారణలో ఉన్నానా, లేదా వంటి ఆలోచనల స్మృతేలేదు. ఆ ఆనందకరమైన క్షణంలో నేను పూర్తిగా బాహ్యస్మృతి కోల్పోయాను. అన్నీ మరచి నా హృదయం తృప్తిపడేలా అమ్మ దర్శనం చేసుకున్నాను. నా మనసులోని అలజడిని గ్రహించిన అమ్మ నన్ను పైకి రమ్మని పిలిచిందని మనస్సు ఉప్పొంగిపోయింది".


అయితే పూజారి తన వద్దకు ఎందుకు వచ్చాడనే విషయం గురించి ఆమె పెద్దగా చెప్పలేదు. కానీ మనం ఊహించగలం. అది మన సాయిబాబా లీలాకేళి. ఆయన తన భక్తుని స్వచ్ఛమైన హృదయంలో వచ్చే ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి కొన్నిసార్లు దైవాన్నే క్రిందకి దింపగలరు, కొన్నిసార్లు మనల్నే పైకి ఆహ్వానించగలరు.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo