సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 201వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. వ్యసనానికి ముగింపు - నెలల చిన్నారికి ఆరోగ్యం - అంతా బాబా లీల
  2. బాబా పాదస్పర్శతో ఎక్కిళ్ళు మాయం!

వ్యసనానికి ముగింపు - నెలల చిన్నారికి ఆరోగ్యం - అంతా బాబా లీల

ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలను మా బంధువు ఒకాయన పంపిస్తూ ఉంటే చదివి, నేను కూడా నా అనుభవాన్ని, అంటే నాకున్న వ్యసనాన్ని బాబా మాన్పించిన  వైనాన్ని సాయిభక్తులతో పంచుకోవాలని మీ ముందుకు వస్తున్నాను. ముందుగా ఈ అవకాశం కల్పించిన సాయిబాబాకు నా పాదాభివందనం. కోటానుకోట్ల సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు.

నా పేరు శ్రీదేవి. మాది విశాఖపట్నం. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మా అమ్మాయి సాధనకు ఘనంగా పెళ్లిచేసి అమెరికా పంపించాము. అల్లుడుగారు భరత్ అమెరికాలో ఇంజనీర్. నాకు చిన్నప్పటినుండి పేకాట అంటే అమిత ఇష్టం. అయితే పండుగ సమయాలలో, అది కూడా మా బంధువులతో మాత్రమే ఆడుతుంటాను. 

ఇక విషయానికి వస్తే, మా అమ్మాయి మొదటి పురుడు అమెరికాలోనే పోసుకుందామని అనుకుంది. అందువలన తనకి సహాయంగా ఉండేందుకు నేను, మావారు అమెరికా వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఇక నాలుగురోజుల్లో ప్రయాణమనగా, విధి వక్రించి మా అమ్మాయి మామగారి హఠాన్మరణంతో మా అమ్మాయి, అల్లుడు ఇండియా రావలసి వచ్చింది. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత మా అల్లుడు అమెరికాకు వెళ్లిపోయారు. మా అమ్మాయి మాత్రం ఇక్కడే ఉండి పురుడు పోసుకుంది. బాబా ఆశీస్సులతో మాకు మనవడు పుట్టాడు. బారసాల చేసి అమ్మాయిని, మనవడిని అల్లుడికి అప్పజెప్పాలని అనుకున్నాము. బంధువులందరినీ పిలుచుకున్నాము. ఆరోజు శ్రావణపౌర్ణమి(2019, ఆగష్టు 15న). మధ్యాహ్నం నుంచి హఠాత్తుగా మా మనవడికి వాంతులు మొదలయ్యాయి. ఇంటిని బంధువులకు అప్పగించి హుటాహుటిన ఎనిమిది నెలల బాబును తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాము. వ్యాధి ఏమిటో డాక్టర్లకు అంతుబట్టలేదు. మూడురోజులు గడిచిపోయాయి. డాక్టర్లు ఏమీ చెప్పలేకపోతున్నారు. అసలు బాబు బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితి. బంధువులు వస్తున్నారు, వెళుతున్నారు. అందరిలోనూ ఒకటే కోరిక, 'ఆ చిన్నారికి ఏమీ కాకూడద'ని. చివరికి డాక్టర్ పెదవి విరిచేయడంతో, "వెంటనే బయలుదేరిరమ్మ"ని అల్లుడికి ఫోన్ చేసి చెప్పాము. ఆయన హుటాహుటిన అమెరికా నుంచి బయలుదేరారు. సుమారు 17 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అలానే ఉంది. అందరూ ఆందోళనపడుతూ దిగులుగా ఉన్నారు. నా మనస్సంతా ఆవేదనతో నిండిపోగా బాబాని తలచుకుని, "మీదే భారం బాబా" అని చెప్పుకున్నాను.

తిండితిప్పలు, నిద్రాహారాలు లేకుండా అందరం ఆసుపత్రి అరుగుల మీదే పడిగాపులు కాచాము. అప్పుడు, 'ఇష్టమైనదేదైనా బాబాకు వదిలేయాలి' అని నాకు తోచింది. కానీ ఏమి వదిలేయాలి? పండ్లు, పదార్థాలు, కూరలు, స్వీట్లు... ఏమీ అర్థం కావడం లేదు. ఆఖరికి నాకు గుర్తుకు వచ్చింది, నా పేకాట వ్యసనం. అంతే! వెంటనే బాబాని తలచుకుని, "నా మనవడు క్షేమంగా ఇంటికి వస్తే, నా వ్యసనాన్ని వదిలేస్తాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా లీలలు ఆనంతం, అద్భుతం. ఆ రాత్రే బాబు చికిత్సకు స్పందించాడు. డాక్టర్లు 'డెంగ్యూ' అని గుర్తించారు. తరువాత, "ప్లేట్లెట్స్ తగ్గాయి, వెంటనే తీసుకునిరండి, మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఎక్కించాలి" అని చెప్పారు. ప్లేట్లెట్స్ ఇచ్చేందుకు బంధువులందరూ ముందుకు వచ్చారు. కానీ ఎవరి రక్తం మ్యాచ్ కాలేదు. ఒక్క తండ్రి రక్తం మాత్రమే బాబుకి సరిపోయింది. అయితే రక్తం నుంచి ప్లేట్లెట్స్ విడగొట్టడానికి సుమారు మూడుగంటలు సమయం పడుతుందన్నారు. అప్పటికే సమయం 5 గంటలు అయ్యింది. ఆలస్యమవుతున్నందుకు అందరిలోనూ ఒకటే ఆందోళన. ఎట్టకేలకు రాత్రి ఏడుగంటలకు ప్లేట్లెట్స్ ఎక్కించడం ప్రారంభించారు. ఉదయానికి బాబు బెడ్ మీద ఆడుకోవడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇది వైద్యచరిత్రలోనే అద్భుతమన్నారు. లక్షలమందిలో కేవలం ఒకరికి మాత్రమే ఇది సాధ్యమని, రెండురోజుల్లో బాబుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని చెప్పారు. అలాగే రెండురోజుల్లో బాబుని ఇంటికి తీసుకొచ్చేశాము. అల్లుడుగారు హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు డాక్టర్లకు, ఇతర సిబ్బందికి ఆనందంతో స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఇది కేవలం బాబా లీల మాత్రమే!

వెంటనే అమెరికాకు టిక్కెట్లు దొరకడంతో అమ్మాయిని, బాబుని అల్లుడుగారికి క్షేమంగా అప్పగించాము. బంధువులందరం కలిసి వారిని అమెరికా ఫ్లైట్ ఎక్కించి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుంటే దూరంగా ఉన్న బాబా గుడి నుండి, "అందరిలోనూ సాయే, బోసినవ్వులలోనూ సాయే" అని పాట వినిపిస్తోంది. ఆ విధంగా అంతా తమ అనుగ్రహమేనని బాబా సూచించారు. తరువాత బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని 2019 ఆగస్టు 29న బంధువులందరితో కలిసి శిరిడీ వెళ్ళాము. తనివితీరా బాబా దర్శనం చేసుకుని, హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మొత్తం మూడుసార్లు బాబా దర్శనం చేసుకుని, ఆరతిలో కూడ పాల్గొని నిన్ననే(2019, అక్టోబర్ 10న) ఇంటికి తిరిగివచ్చాము. 

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురుసాయికి ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న ఆ సాయినాథునికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

సర్వం శ్రీసాయినాథుని దివ్య చరణారవిందార్పణమస్తు!

బాబా పాదస్పర్శతో ఎక్కిళ్ళు మాయం!

2019, అక్టోబర్ 14 ఉదయం నేను(సాయి సురేష్) బట్టలు ఉతుకుతుంటే హఠాత్తుగా ఎక్కిళ్ళు మొదలయ్యాయి. నాకెప్పుడు ఎక్కిళ్ళు వచ్చినా అంత తొందరగా తగ్గవు, చాలాసేపటివరకు ఉంటాయి. సాధారణంగా అందరికీ నీళ్లు త్రాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి, కానీ నాకెందుకో తగ్గవు. సరేనని అలాగే పని చేసుకుని, స్నానం చేసి పూజగదికి వెళ్ళాను. అప్పుడు బాబా నామం తలుచుకుంటూ ఉంటే ఎక్కిళ్ళ శబ్దం చాలా బిగ్గరగా వచ్చింది. అక్కడే పూజ చేస్తూ ఉన్న మా తమ్ముడు, 'నీళ్లు త్రాగొచ్చు కదా!' అన్నాడు. నేను, "నీళ్లు త్రాగినా నాకు ఎక్కిళ్ళు తగ్గవు" అన్నాను. ఆ మరుక్షణంలో బాబా ముందర క్రింద కూర్చుని, ఆయనకు నమస్కరించుకుంటూ ఆయన పాదానికి(కాలిపై కాలు వేసుకుని కూర్చునే బాబా విగ్రహం యొక్క పైపాదం) నా శిరస్సు ఆనించాను. అంతే, ఎక్కిళ్ళు మాయం! బాబాను అడగను కూడా లేదు. కానీ ఆయన ప్రేమతో నా ఇబ్బందిని ఇట్టే తీసేశారు. ఆ క్షణాన నాకనిపించింది, "ఇంత చిన్న విషయాన్ని కూడా అడగకుండానే తీర్చేసే బాబా, పెద్ద పెద్ద సమస్యల్లో చిక్కుకుని అల్లాడుతూవుంటే సహాయం చేయకుండా ఉంటారా? మనమే ఆయన పట్టించుకోవడంలేదని బాధలో ఏదేదో అనుకుంటూ వుంటాం గాని, ఆయన చేసేది మనకెలా అర్థమవుతుంది?" అని. అడిగితేగాని అమ్మైనా పెట్టదంటారు. కానీ అడగకుండానే అన్నీ ఇచ్చే అమృతమూర్తి బాబా. ఆయన ప్రేమముందు అమృతం కూడా దిగదుడుపే! 

5 comments:

  1. OM SAI RAM . nothing is impossible to our sai

    ReplyDelete
  2. Excellent two Leelas are beautiful.i felt happy to read this leela.om Sai Ram om Sai Baba.i love you with my heart.

    ReplyDelete
  3. Excellent two Leelas are beautiful.i felt happy to read this leela.om Sai Ram om Sai Baba.i love you with my heart.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo