సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 206వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • ప్రభుత్వ ఉద్యోగిగా చేయడంలో వివిధ దశలలో బాబా చూపిన అనుగ్రహం

సాయిసోదరి మౌనిక తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! ముందుగా, "బాబా! మీకు నా కృతజ్ఞతలు. మీ దయవల్లనే నవగురువార వ్రతం పూర్తయి, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. థాంక్యూ సో మచ్ బాబా! మీ బిడ్డలమైన మా అందరికీ సదా మీ ఆశీస్సులు అందజేయండి". 

నా పేరు మౌనిక. నేను నెల్లూరు నివాసిని. నేను ఒక కాలేజీలో పని చేస్తున్నాను. గతంలో నేను ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. సాయినాథుని దయతో నేనిప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని అయ్యాను. పరీక్షకు దరఖాస్తు చేయడం మొదలుకుని ట్రైనింగ్ వరకు బాబా నాకు తోడుగా ఉండి నన్ను నడిపిన విధానాన్ని నేనిప్పుడు సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నేను ప్రతిక్షణం బాబా ప్రేమను, ఆశీస్సులను అనుభూతి చెందాను. ఆ ప్రేమను మీకు కూడా పంచాలని అనుకుంటున్నాను. 

1. నేను 2019, జూన్ 20న నవగురువార వ్రతం మొదలుపెట్టాను. జులై నెల చివరిలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దానికి దరఖాస్తు చేయాలన్న ఆసక్తి నాకస్సలు లేదు. నేను దరఖాస్తు చేయనని మా HOD(హెడ్ అఫ్ ది డిపార్ట్‌మెంట్) సార్ కి చెప్పాను. కానీ సార్ ఒప్పుకోలేదు. అందువలన నేను ఆలోచనలో పడ్డాను. ఏ విషయంలో అయినా నేను బాబాని ప్రార్థించినప్పుడు ఈ సార్ ద్వారానే బాబా నాకు పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. అది నా గట్టి నమ్మకం. ఎందుకంటే, అది చాలాసార్లు ఋజువైంది. దరఖాస్తు చేయమని మా సార్, మా బ్రదర్ పలుమార్లు చెప్పడంతో కాదనడానికి వేరే కారణం లేక దరఖాస్తు చేయడానికి ఒప్పుకుని నాకు ఇష్టమైన పోస్టుకి దరఖాస్తు చేసుకుందామనుకున్నాను. కానీ నేను ఏదైతే పోస్టుకి దరఖాస్తు చేయాలనుకున్నానో దానికి నేను అర్హురాలిని కాదని తెలిసింది. ఇక ఇష్టంలేకపోయినా వేరే పోస్టుకి దరఖాస్తు చేశాను. అదంతా బాబా లీల. నేను కోరుకున్న పోస్టు నాకు సరైనదికాదని సర్వజ్ఞుడైన బాబాకి తెలిసి ఇలా నాకు వేరే మంచి అవకాశాన్నిచ్చారు.

2. తరువాత పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న సమయంలో నాపై పని ఒత్తిడి చాలా పడింది. దానితో నేను సరిగ్గా పరీక్షకు సన్నద్ధం కాలేకపోయాను. అయినప్పటికీ ఎందుకో తెలీదుగానీ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలినయ్యేలా బాబా చేయిస్తారని చాలా దృఢంగా అనిపించింది. పరీక్ష రెండురోజుల్లో వున్నదనగా నేను చేస్తున్న నవగురువార వ్రతం పూర్తయింది. బాబా దయవలన నేను పరీక్ష బాగానే వ్రాశాను. కాదు, బాబానే వ్రాయించారని చెప్పాలి.

3. తరువాత పరీక్షకు సంబంధించిన ఒక 'కీ' విడుదల చేశారు. నాకు ఎన్ని మార్కులు వస్తాయో అని పరిశీలించుకుంటే కటాఫ్ మార్కుకి కేవలం '0.1' మార్కు తక్కువగా వస్తుంది. అప్పుడు నేను, "బాబా! ఇన్ని మార్కులు ఇచ్చారు, కేవలం 0.1 మార్కుతో నేను అనర్హురాలిని కాకూడదు. దయచేసి OMR షీటులో ఒక్క సమాధానం మార్పు చెయ్యొచ్చు కదా! మీకు వీలుకానిది ఏమీ లేదు కదా!" అని కొంచెం పిచ్చిగానే అడిగాను. తరువాత ఫైనల్ 'కీ' విడుదలైంది. అద్భుతం! నిజంగానే బాబా ఒక ప్రశ్నకు నేను పెట్టిన సమాధానాన్ని మార్పు చేశారు. అది చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. నేను ఏదో మాములుగా అడిగినా బాబా నాకోసం సమాధానాన్ని మార్పు చేశారు. తీరా ఫలితాలు వచ్చేసరికి మొత్తం 4 మార్కులు అధికంగా వచ్చేలా చేసి నన్ను కటాఫ్ దాటేలా సాయి ఆశీర్వదించారు. నిజానికి నేను జనరల్ కేటగిరీ కాబట్టి కటాఫ్ మార్కు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకేనేమో నాకు ఉద్యోగం రావడానికి ఎంత అవసరమో అంత అనుగ్రహించారు.

4. నేను దరఖాస్తు చేసింది నాలుగు పోస్టులకి. కానీ వాటన్నిటికీ అదొక్కటే పరీక్ష. ఆ నాలుగు పోస్టుల్లో నేను ఏదో ఒక్కదానికే ఎంపిక కాగలను. నాకు వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు వస్తే బాగుంటుందని నేను ఆశపడ్డాను. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ నాకు ఆ పోస్టురావటం కష్టం అన్నారు. అందుకు సంబంధించిన ఫలితాలు ఒక శుక్రవారం ఉదయం విడుదల చేస్తారనగా ఆ ముందురోజురాత్రి, అంటే గురువారం రాత్రి నేను, "బాబా!  దయచేసి నేను వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుకి ఎంపికయ్యేలా చేయండి. మీకు ఇది అసాధ్యం కాదు" అని బాబాని వేడుకున్నాను. ఆశ్చర్యం! ఉదయం వెలువడిన ఫలితాలు చూస్తే, బాబా దయవలన నేను కోరుకున్నట్లుగానే వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుకి ఎంపికయ్యాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

5. తరువాత దశలో నేను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి హాజరు కావాలి. అక్కడికి వెళ్ళడానికి ముందు నేను సర్టిఫికెట్స్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి, తిరిగి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా చేయడం వలన నా హాల్‌టికెట్ నెంబర్ ఆ సర్టిఫికెట్స్ మీద ప్రింటయి వస్తుంది. ఆ అప్లోడ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ హాల్‌టికెట్ నెంబర్ ప్రింట్ అవుతుందనే విషయం నాకు తెలియక నేను కాలేజీలోనే అప్లోడ్ చేయించేశాను. అప్పటికీ మా HOD సార్, "ఇంటర్నెట్ సెంటరులో చేయించు" అని అన్నారు. నేను వినిపించుకోకుండా అప్లోడ్ చేసి, మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంటే హాల్‌టికెట్ నెంబర్ పూర్తిగా రావడం లేదు. అయినా కూడా నేను ఏం కాదులే అని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. హఠాత్తుగా నెట్‌వర్క్ డిస్కనెక్ట్ అయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ కనెక్ట్ కాలేదు. అందరూ అనుకోవచ్చు, నెట్‌వర్క్ డిస్కనెక్ట్ అవటం మాములు విషయమే అని. కానీ కాలేజీలో డిస్కనెక్ట్ అవటం సాధారణంగా జరగదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక అప్లోడింగ్, పేమెంట్స్ చేస్తుంటారు. ఒక్కరోజు ఆలస్యమైనా చాలా సమస్య ఎదుర్కోవలసివుంటుంది. కాబట్టి నెట్‌వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఈసారి ఎంత ప్రయత్నించినా, చివరికి నెట్‌వర్క్ సంబంధిత నిపుణులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక చేసేదిలేక ఇంటర్నెట్ సెంటరుకి వెళ్ళాను. అప్పుడు తెలిసింది, నేను అప్లోడ్ చేసిన పద్ధతి సరైంది కాదని. మళ్ళీ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి చూసుకుంటే హాల్‌టికెట్ నెంబర్ సరిగా ప్రింట్ అయింది. నెట్‌వర్క్ డిస్కనెక్ట్ కాకపోతే నేను హాల్‌టికెట్ నెంబర్ ప్రింట్ అవని సర్టిఫికెట్లనే వెరిఫికేషన్‌కి తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు నేను ఖచ్చితంగా తిరస్కరింపబడేదాన్ని. బాబానే సమయానికి పరిస్థితులను నియంత్రిస్తూ నేను ఏ ఇబ్బందీ ఎదుర్కోకుండా చేశారు. "థాంక్యూ సాయీ!"

6. ఇప్పుడు నేను చెప్పబోయేది జీవితంలో నేనెప్పుడూ మర్చిపోలేని సంఘటన. నేను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి వెళ్ళాను. తీరా అక్కడకి వెళ్ళాక ఇంకా ఇతర సర్టిఫికెట్లు కూడా జతపరచాలని అన్నారు. సమయానికి నా దగ్గర జిరాక్సులు కూడా లేకపోవడంతో నాకు ఏమి చేయాలో తోచలేదు. హెల్ప్ డెస్క్ వాళ్ళని అడిగితే, "జిరాక్స్ మీరే ఏర్పాటు చేసుకోండి, మాకు ఏ సంబంధం లేదు" అన్నారు. ఒక్కదాన్నే బయటకి వెళ్లి జిరాక్స్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియలేదు. దిక్కుతోచక ఆలోచిస్తూ ఉన్నాను. హఠాత్తుగా నాకు తెలియని ఒక వ్యక్తి నేను ఉన్నచోటుకి వచ్చి, "ఇక్కడ ఎవరో జిరాక్స్ గురించి అడిగారు, ఎవరది?" అని అడుగుతున్నారు. 'నేనే' అని చెప్పాను. అతను వెంటనే తన మొబైల్‌లో నా సర్టిఫికెట్లు ఫోటో తీసుకుని అఫీషియల్ మెయిల్ కి పంపించి, తరువాత ప్రింట్ తీసి ఇచ్చారు. నేను 'ఇతను ఎంతో మంచి వ్యక్తిలా ఉన్నారు' అనుకుంటూ ఒక వైపుకు చూస్తే చాలా పెద్ద బాబా ఫోటో మరియు వెంకయ్యస్వామి ఫోటో ఉన్నాయి. నేను, "బాబా! మీరెప్పుడూ నాతోనే ఉన్నారు. థాంక్యూ బాబా!" అని అనుకుని నాకు సహాయం చేసిన వ్యక్తి వైపు చూశాను. అతను రెండుసార్లు అటు ఇటు తిరిగి, ఎవరినీ ఏమీ అడగకుండా ఒక ప్రక్కనుంచి వెళ్లిపోయారు. ఆ రూపంలో వచ్చింది బాబానే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, అతనెవరో నాకు తెలియదు, నేను అతనిని సహాయం అడగలేదు, మరి నాకు జిరాక్స్ కావాలని అతనికెలా తెలుసు? ఒకవేళ హెల్ప్ డెస్కుకి సంబంధించిన వ్యక్తి అనుకుందామంటే, అందరికీ సహాయం చేయాలి కదా?! అతను ఎవరినీ ఏమీ అడగలేదు, కేవలం నాకు మాత్రమే సహాయం చేసి వెళ్లిపోయారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!"

7. ఇక పోస్టింగ్ ఎక్కడ ఇస్తారన్న విషయంలో నేను ఒక చోటు అనుకుని, దాదాపు అక్కడే నాకు పోస్టింగ్ వస్తుందని ఊహించాను. కానీ అనుకోకుండా నా ముందున్న వాళ్ళకి ఆ చోట పోస్టింగ్ ఇచ్చారు. మా HOD సార్ కి కాల్ చేసి, "ఇప్పుడేమి చేయాలి?" అని అడిగి మిగిలివున్న ఊర్ల పేర్లు చెప్తుంటే, వాళ్ళ సొంత ఊరు కూడా అందులో ఉండటంతో దాన్ని ఎంపిక చేసుకోమని చెప్పారు. చివరినిమిషం వరకు ఎవరూ ఊహించలేదు, మా సార్ వాళ్ళ ఊరికే నేను పోస్టింగ్ అవుతానని. అసలు నాకు అప్పటివరకు మా సార్ సొంత ఊరు అది అని కూడా తెలియదు. అందుకే మేమంతా ఇప్పటికీ ఆ విషయంలో ఆశ్చర్యపోతుంటాము. ఒక విషయం చెప్పాలి - ఆరోజు ఉదయం నేను, "బాబా! నన్ను మీ సంరక్షణలో ఉంచుకోండి. అది నాకు తెలిసేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. మొదట్లోనే చెప్పాను కదా, నాకు బాబా నుంచి వచ్చే సమాధానాలు మా HOD సార్ ద్వారా వస్తాయని. బాబా మా సార్ ఊరిలోనే పోస్టింగ్ ఇచ్చి నన్ను ఆయన సంరక్షణలోనే ఉంచానని తెలియజేశారు. "థాంక్యూ సో మచ్ సాయీ! దయచేసి ఎప్పుడూ నా చేయి విడువకండి".

8. నేను ట్రైనింగులో ఉన్నప్పుడు అంటే 2019, అక్టోబర్ 16న నేనొక ప్రెజెంటేషన్(ఒక విషయంపై వివరణ) ఇచ్చాను. అది ఇవ్వడానికి ముందు భయంతో నేను, "బాబా! నాకంతా క్రొత్తగా ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆయన కృపతో వీలైనంతవరకు బాగా ప్రెజెంట్ చేయగలిగాను. తరువాత రోజు మా టీం మెంబర్ ఒకరు, "నువ్వు చాలా బాగా ప్రెజెంట్ చేశావు" అని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా!".

మొన్న సోమవారంనాడు(2019, అక్టోబర్ 21) నేను క్రొత్త ఉద్యోగంలో చేరాను. ఈ ఉద్యోగ విషయంలో ఇంకా ఎన్నో అనుభవాలిచ్చారు సాయి. ఎక్కువవుతుందని కొన్ని వదిలేశాను. "క్షమించండి సాయీ! దయచేసి ఎప్పుడూ ఇలానే నాకు సహాయం చేస్తూ, అంతా ప్రశాంతంగా సాగేలా చూడండి. సాయీ! మీరు మాకు చేస్తున్న సహాయానికి, మాపై కురిపిస్తున్న ప్రేమకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీ వల్లనే అమ్మానాన్నకి ఒక గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మీరు లేకుండా నేను లేను బాబా. మీ ప్రేమతోనే నేను జీవించగలను".

4 comments:

  1. Very nice to hear from you.if we listen these type of real life experience then our believe will be more towards baba.baba please don't leave who believe you.i love you baba

    ReplyDelete
  2. Sainath bagavanki jai please bless me baba

    ReplyDelete
  3. Please bless me with govt job baba

    ReplyDelete
  4. My daughter got the job with baba blessings
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo