సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బడేమియా



1917లో బడేమియా అను ముస్లిం భక్తుడు బాబాను దర్శించాడు. 1942లో శాంతారామ్ డి.థెట్తే అనునతడు బడేమియాను కలిసి, బాబాతో అతనికున్న అనుబంధం గురించి, ముఖ్యంగా బాబా యొక్క దైవత్వం గురించి తెలుపమని కోరాడు. అప్పుడు బడేమియా ఇలా చెప్పాడు: 

బాబా గొప్ప వైలీ (ముస్లిం మహాత్ములు). వారు మహాసముద్రం వంటివారు. నాలాంటి ఒక గృహస్థుడు ఆ మహాసముద్రం యొక్క లోతును మీకెలా చెప్పగలడు? అయినా నా అనుభవం గురించి చెప్తాను. ఒకప్పుడు నా వద్ద డబ్బు లేనందున నా కూతురి వివాహ విషయమై నేను చాలా ఆందోళనచెందాను. ఆ సమయంలో నేను బాబా గొప్పతనం, వారి దాతృత్వం గురించి విని మరాఠ్వాడ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం నుండి శిరిడీ ప్రయాణమయ్యాను. శిరిడీ చేరుకున్నాక నేను నేరుగా మసీదుకి వెళ్ళాను. బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ కొద్దిమంది భక్తులు ఉన్నారు. నేను ఆయన ముందు సాష్టాంగపడి మౌనంగా కూర్చున్నాను. అప్పుడే ఆ గ్రామానికి చెందిన ఒక పాటిల్ వచ్చి, బాబా ముందు మూడు రూపాయలుంచి కూర్చున్నాడు. బాబా అతని వైపు చూసి, “నువ్వు, నీ కుటుంబంలో అందరూ బాగున్నారా?” అని అడిగారు. అతను, “బాబా! నా కూతురి పెళ్లి త్వరలో జరగనుంది. అందుకు అవసరమైన డబ్బు నా వద్ద లేదు. నేను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను. ఇప్పుడు పెళ్లికోసంగా మళ్ళీ డబ్బు అప్పుగా తీసుకుంటే, నేను దానిని తిరిగి చెల్లించలేను. మరోవైపు పెళ్లి ఘనంగా చేయించకపోతే నేను గ్రామంలో నవ్వులపాలవుతాను. అలా జరగకుండా ఉండాలంటే, నాకు 3,000 రూపాయలు చాలా అవసరం” అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, “నువ్వెందుకు అంతగా ఆందోళన చెందుతున్నావు? దేవుడు నీ పనిని చేస్తాడు. నీ అన్ని చింతలను, భారాన్ని సర్వశక్తిమంతుడైన దేవునిపై వేసి, ఏ చింతా లేకుండా నిశ్చలంగా కూర్చుని ఆయన అభీష్టమేమిటో చూడు! ఆయన కోరుకుంటే నీ కోరికను నెరవేరుస్తాడు, అలా కాకుంటే నీ పని జరగదు. ఏదేమైనా ఆయన ఉంచినట్లు నువ్వు సంతృప్తిగా ఉండాలి” అని చెప్పారు. అందుకు పాటిల్, “బాబా! మీరు చెప్పేది నిజమే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో నేనొక గృహస్థునిగా, ఈ గ్రామానికి పాటిల్‌గా జీవిస్తున్నాను. మరి మీరు చెప్పేదాన్ని నేను ఎలా అంగీకరించగలను?” అని అన్నాడు. అందుకు బాబా, “నువ్వెందుకు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు? ఆ మొత్తాన్ని నేను నీకిస్తాను. దాంతో నీ చింత తొలగిపోతుంది” అని అన్నారు.

ఆ సంభాషణ అంతా వింటున్న నేను పాటిల్‌కి అవసరమైన ఆ పెద్ద మొత్తాన్ని బాబా ఎలా ఇవ్వబోతారా అని ఆశ్చర్యపోతూ బాబా ధరించిన చిరిగిన తెల్లని కఫ్నీ, వారి తలకు చుట్టుకున్న మాసిన గుడ్డను చూడసాగాను. అంత పెద్ద మొత్తాన్ని ఆయన దాచిపెట్టేందుకు ఒక పెట్టెగానీ, అల్మరాగానీ అక్కడ లేవు. మరి ఈ ఫకీరు ఆ పాటిల్‌కి ఏమి ఇవ్వగలరని సందేహాస్పదంగా నేను ఆయన వైపే చూస్తున్నాను. అంతలో బాబా తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి కొన్ని రూపాయి నాణేలు తీసి పాటిల్‌కు ఇచ్చి, “వీటినిప్పుడు ఇక్కడే లెక్కపెట్టు” అని అన్నారు. అతను అలానే చేశాడు. అవి సరిగ్గా 3,000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు బాబా, “ఇక వెళ్లి నీ కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకో” అని అన్నారు. పాటిల్ బాబా ముందు సాష్టాంగపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. నేను అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి బాబా వద్ద సెలవు తీసుకొని నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను.

ఆ రాత్రి నా కంటి మీద కునుకు వాలలేదు. నా కళ్ళముందు మసీదులో జరిగిన సంఘటనే పదేపదే మెదలసాగింది. నాకూ పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. త్వరలో తనకి పెళ్లి చేయాలి. అందుకోసం ఎలా లేదన్నా కనీసం ఒక వెయ్యి రూపాయలు నాకవసరమవుతాయి. ‘పేదవాడినైన నాకు కూడా పాటిల్‌కి చేసినట్లే బాబా సహాయం చేస్తారా?’ అని పరిపరివిధాల ఆలోచించి, మరునాడే శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే శిరిడీ ప్రయాణమయ్యాను.

నేను తెల్లవారుఝామునే బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళాను. బాబా ముందు సాష్టాంగపడి, ఆయన పాదాలచెంత ఒక రూపాయి ఉంచి, “బాబా! నేను నా కూతురి పెళ్లి చేయాలి. అందుకు నాకు వెయ్యి రూపాయలు కావాలి” అని బాబాతో విన్నవించుకున్నాను. అప్పుడు బాబా, “అది నిజమే!” అంటూ తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి, పిడికిలినిండా నాణేలు బయటకు తీసి, “కండువా పట్టు” అని అన్నారు. నేను అలాగే చేశాను. అప్పుడు ఆయన ఆ నాణేలను ఆ కండువాలో పోశారు. కండువాలో పడుతున్న నాణేల గలగల నేను విన్నాను. బాబా నాతో, “ఇక ఇంటికి వెళ్ళు. ఇల్లు చేరాక ఈ నాణేలను లెక్కపెట్టుకో!” అని ఆదేశించారు. వెంటనే నేను తిరుగు ప్రయాణమయ్యాను. ఇల్లు చేరిన వెంటనే ఆతృతగా బాబా ఇచ్చిన నాణేలను నేలపై వేసి లెక్కపెట్టడం మొదలుపెట్టాను. మొత్తం అరవైఎనిమిది రాగినాణేలున్నాయి. దాంతో, బాబా నాతో పరాచికమాడారని తలచి వెంటనే బయలుదేరి శిరిడీ చేరుకున్నాను.

మసీదుకు వెళ్ళి బాబాకు ఎదురుగా నిలబడి, “పాటిల్ గొప్పవాడు కాబట్టి అతను మీకు మూడు రూపాయలు దక్షిణ ఇచ్చాడు. అందుకు బదులుగా మీరు అతనికి మూడువేల రూపాయలు ఇచ్చారు. కానీ నేను బీదవాడిని. ఎంతో దూరంలో ఉన్న మరాఠ్వాఢా నుండి కేవలం వెయ్యి రూపాయలు అవసరమై మీ దగ్గరకు వచ్చాను. అది కూడా నా కూతురి పెళ్ళిఖర్చుల కోసం. నేను ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన తర్వాత మీ నుండి నాకు లభించింది అరవై ఎనిమిది పైసలే. నా పేదరికాన్ని మీరిలా అపహాస్యం చేశారు” అని వారిని నిందించాను. బాబా నవ్వుతూ, “నువ్వు నా పాదాల చెంత ఒక రూపాయి దక్షిణ పెట్టినప్పుడే నువ్వు నా నుండి వెయ్యిరూపాయలు ఆశిస్తున్నావని నాకు తెలుసు” అన్నారు. అప్పుడు నేను, “నిజంగానే త్వరలో నా కూతురికి వివాహం చెయ్యాలి” అని అన్నాను. అప్పుడు బాబా, “అరె! నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఇప్పటినుండే కంగారుపడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా నేను చూస్తాను” అని హామీ ఇచ్చారు. దాంతో నేను వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం సాధారణం కంటే నాలుగైదు రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవరిముందూ చెయ్యిచాపకుండా, ఎవరి దగ్గరా అప్పుచేయకుండా నా కూతురి పెళ్లి ఘనంగా జరిపించాను.

సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి
(రెఫ్: సాయి సాగర్ పత్రిక, 2009; దీపావళి సంచిక)

7 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. 🙏💐🙏 ఓం సాయిరాం 🙏💐🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 😊❤🙏🕉

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo