సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 636వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా, గురువుగారి ఆశీస్సులు
  2. ఆపదలో ఆదుకున్న నా సద్గురువు
  3. ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా బాబా చేసిన సహాయం

బాబా, గురువుగారి ఆశీస్సులు


గుంటూరు నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అనంతకోటి సాయిభక్తులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు శతకోటి వందనాలు. ఉదయాన్నే లేవగానే ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాల కొరకు నా కళ్ళు వెతుకుతాయి. వారి అనుభవాలు చదువుతుంటే అవి నా జీవితానికి దగ్గరగా ఉన్నాయన్న ఆనందం కలుగుతుంది. నేను ఈ బ్లాగులో నా అనుభవాలను పంచుకోవటం ఇదే మొదటిసారి. అనారోగ్యంతో బాధపడుతున్న మా పాపకు ఆరోగ్యం చేకూరితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను, గురువుగారిని (శరత్‌బాబూజీ) ప్రార్థించాను. వారి అనుగ్రహంతో మా పాప 10 రోజుల్లోనే కోలుకుంది.


2020, ఆగస్టు 6వ తారీఖున మా పాప హఠాత్తుగా తనకు నొప్పిగా ఉందని ఏడ్చింది. హాస్పిటల్‌కు తీసుకువెళితే టెస్టులన్నీ చేసి, పాపకు ఊపిరితిత్తులలో నెమ్ము ఉందని, తగ్గటానికి కొంత సమయం పడుతుందని, దానికోసం కొన్ని నెలల పాటు మందులు వాడాల్సి వస్తుందని చెప్పారు డాక్టర్లు. దాంతో ఇంట్లో అందరం చాలా ఆందోళనచెందాము. పాపను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళిన దగ్గరనుంచీ టెస్టులు జరుగుతున్నంతసేపూ బాబాను, గురువుగారిని స్మరించుకుంటూనే ఉన్నాను. “సాయితండ్రీ! గురువుగారూ! మీరు మాతోనే ఉండి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీరు నా బిడ్డ ప్రక్కనే ఉండి నా బిడ్డ కోలుకునేవరకు జాగ్రత్తగా చూసుకోండి!” అని వేడుకోని క్షణం లేదు. అలాగే సాయితండ్రి, గురువుగారి అనుగ్రహంతో నా బిడ్డ రోజురోజుకూ మెల్లగా కోలుకుంటూ, కేవలం 10 రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతురాలైంది. డాక్టర్ గొప్పతనం కన్నా సాయితండ్రి, గురువుగారి కృపాకటాక్షాలు ఉన్నాయి కనుకనే మా పాప అంత త్వరగా కోలుకుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము.


రెండవ అనుభవం:


కొంతకాలం క్రితం నాకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టేది కాదు. నిద్రపట్టడం కోసం 3 నెలల పాటు మందులు కూడా వాడాను. నా సమస్యను పరిష్కరించమని సాయితండ్రిని, గురువుగారిని మనస్పూర్తిగా వేడుకున్నాను. క్రమేణా నా సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు నేను మందులేవీ వేసుకోకుండానే ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఇదంతా మా గురుదేవులైన సాయితండ్రి, గురువుగారి అనుగ్రహమే. అందుకే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, యజమాని, స్నేహితుడు అన్నీ బాబా, గురువుగారే. మా కుటుంబ సంరక్షణ బాధ్యతంతా వారిదే. సాయికి శరణాగతి చెందితే మనకు భయమనేది ఉండదు. ఇలాగే బాబా, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. “బాబా, గురువుగారూ! ఎల్లవేళలా మాకు రక్షణనిచ్చే మీకు, మీ మంగళకరమైన దివ్యచరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవటం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి!”


సాయిబాబా! సాయిబాబా! సాయిబాబా! సాయిబాబా!


ఆపదలో ఆదుకున్న నా సద్గురువు


ముందుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం అయిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథునికి నా పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ఎల్లప్పుడూ సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగార్జున. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నిటిని ఇటీవల ఈ బ్లాగులో పంచుకున్నాను. ఎందుకంటే, ఇప్పుడు నా ఈ జన్మ బాబా ప్రసాదించినదే కనుక. మనం బాబాపై నమ్మకముంచి ఓర్పుతో ఉంటే మనకొచ్చే కష్టాలను తన అనుగ్రహంతో సులభంగా తీసివేస్తాడు మన సాయినాథుడు. అటువంటి అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


మాది వ్యవసాయ కుటుంబం. ఒకరోజు పొలంపనుల నిమిత్తం నేను పొలానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా చేతివేలు తెగింది. ఆరోజు ఆశ్వయుజ అమావాస్య కావటంతో అశుభంగా అనిపించింది. ఎందుకంటే, ఇటీవల నన్ను కొన్ని గండాల నుండి తప్పించి బాబా నాకు ఈ పునర్జన్మను ప్రసాదించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా గండం ఏర్పడుతుందేమోనని ఆందోళన కలిగింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి తెగిన చేతివేలికి కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాక, బాబా ముందు నిలబడి నన్ను కాపాడమని కన్నీటితో ప్రార్థించాను. కాసేపట్లోనే ఒక వాట్సాప్ సాయి గ్రూపులో “నేనుండగా భయమెందుకు?” అనే సందేశంతో కూడిన బాబా ఫోటో వచ్చింది. బాబా సందేశం చూశాక బాబా నాతో ఉన్నారని నాకెంతో ఆనందం కలిగి నిశ్చింతగా బాబా స్మరణలో గడపసాగాను. వేలికి గాయమైన మూడు, నాలుగు రోజుల తర్వాత మా ప్రక్కింటివారు శనగపప్పుతో వండిన వంకాయ కూర ఇచ్చారు. (కాదు.. కాదు.. బాబానే పంపారు.) నేను ఆ కూరతో భోజనం చేస్తూ ఉండగా భోజనం చివరలో గుర్తుకు వచ్చింది, నా చేతివేలికి కుట్లు ఉన్నాయన్న సంగతి. శనగపప్పు తినటం వల్ల చేతివేలికి ఉన్న కుట్లు చీము పడతాయేమోనని చాలా భయమేసింది. దాంతో భోజనం చేసిన వెంటనే బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, బాబాకు నమస్కారం చేసుకొని, సచ్చరిత్ర తెరవగా, 118, 119 పేజీలు వచ్చాయి. అందులో, అనేక ఔషధాల రూపంలో బాబా తమ భక్తుల వ్యాధులను నిర్మూలించిన లీలలు ఉన్నాయి. ఆ లీలలు చదివిన నేను, “బాబా! ఈ కూర రూపంలో నాకు ఔషధం పంపించావా తండ్రీ?” అనుకుని ఆనందంతో బాబాకు నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తరువాత ప్రతిరోజూ గాయానికి ఊదీ రాసుకుంటూ ఉన్నాను. బాబా అనుగ్రహంతో నేను తిన్న ఆహారం వల్ల చేతివేలికి ఉన్న కుట్లకు ఎలాంటి హానీ జరగలేదు. అంతేకాదు, నాకు వైద్యం చేసిన డాక్టరు కూడా ఆశ్చర్యపోయేలా పదిరోజుల్లో గాయం పూర్తిగా మానిపోయింది. “బాబా! నీకు శతకోటి వందనాలు తండ్రీ! నాకు ఏమి కావాలో నీకు తెలుసు. నాకు ఎల్లవేళలా తోడునీడగా ఉండు తండ్రీ! అందరికీ రక్షగా ఉండు తండ్రీ!”


ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా బాబా చేసిన సహాయం

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయి భక్తురాలిని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా నా భర్త నెలరోజులుగా ఇంటి నుండి పని చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒకరోజు Wi-Fi కనెక్షన్ పనిచేయడం మానేసింది. అసలే మావారు ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు, ఆయనకి ఇంటర్నెట్ చాలా అవసరం. కానీ ఇంటర్నెట్ లేనందున ఆయన పని ఆగిపోయింది. మేము కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే, వాళ్ళు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దాంతో మావారు మొబైల్ డేటా మీద పని చేస్తూ వచ్చారు. అయితే ఐదు రోజులైనా సమస్య పరిస్కారం కాలేదు. ఈసారి కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ కాల్ కి స్పందించలేదు. అప్పుడు నేను క్వశ్చన్ & ఆన్సర్ సైట్ లో బాబాని అడిగాను. "తప్పు చేసి అంతరాయం కలిగించవద్దు. శ్రీసాయిని గుర్తుంచుకో, సరైన మార్గం చూపబడుతుంది" అని వచ్చింది. నేను సరిగా అర్థం చేసుకోలేక "ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా చేయమ"ని బాబాను ప్రార్థించి, సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని పంచుకుంటానని ఆయనకి మాట ఇచ్చాను.

తరువాత ఏడవ రోజున నేను మళ్ళీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాను. వాళ్ళు ఒకసారి కనెక్షన్స్ తనిఖీ చేయమని చెప్పారు. సరేనని నేను పరిశీలిస్తే DSL వైర్ రాంగ్ పోర్టులో ప్లగ్ ఇన్ చేయబడి ఉంది. అదివరకు సమస్య పరిష్కరించే ప్రయత్నంలో మేమే పొరపాటున ఆ కేబుల్‌ను రాంగ్ పోర్టులో పెట్టాము. దాన్ని సరి చేయడంతో ఇంటర్నెట్ పని చేయడం ప్రారంభించింది. అప్పుడు నాకు బాబా ఇచ్చిన సమాధానం అర్ధమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా, ఐ లవ్ యు. దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించండి".




3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo