- ఊదీలీలలు
- జటిలమైన సమస్యను పరిష్కరించిన బాబా
ఊదీలీలలు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు బాబా ఊదీ ప్రభావంతో తనకు కలిగిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ నేను నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం:
కొన్ని రోజుల క్రితం మా బాబు కడుపునొప్పితో బాధపడ్డాడు. బాబు బాధ చూడలేక, అసలు తనకు కడుపునొప్పి ఎందుకు వస్తోందో, ఎందుకు తగ్గడంలేదోనని చాలా కంగారుపడ్డాను. ఆ సమయంలో బాబా దయవల్ల అంతకుముందు తను బయటి ఆహారం తిన్నాడన్న సంగతి గుర్తుకొచ్చింది. బయటి ఆహారం తినడం వల్లనే తనకు కడుపునొప్పి వచ్చిందని గ్రహించి, తనకు కడుపునొప్పి తగ్గించమని బాబాను ప్రార్థించి, "బాబుకు కడుపునొప్పి తగ్గిన వెంటనే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. తరువాత, బాబానే వైద్యుడుగా, బాబా ఊదీనే ఔషధంగా భావించి ఊదీని మా బాబు నుదుటిపైన, కడుపుపైన రాసి, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలిపి సాయిబాబా తీర్థంగా తనకిచ్చాను. సాయి దయతో మా బాబు కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. “థాంక్యూ బాబా సాయీ!”
రెండవ అనుభవం:
నెలసరి విషయంలో సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది మహిళలలో నేనూ ఒకదాన్ని. నెలసరి సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం, థైరాయిడ్ పంటి సమస్యలతో బాధపడుతున్న సమయంలో, బాబా తన భక్తులను నెలసరి సమస్యలనుండి రక్షించిన అనుభవాలను ఈ బ్లాగులో చదివాను. అవి నాకు ఎంతో ఊరటను, ధైర్యాన్ని ఇచ్చాయి. బాబాకు నమస్కరించుకుని, “అమ్మా, సాయిమాతా! నాకు నెలసరి సరిగా రావడం లేదు. నెలసరి సరిగా రాకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. నాకు భయంగా ఉంది. నాకు నెలసరి సరైన సమయానికి వచ్చేలా చూడు సాయితల్లీ!” అని ఆ సాయిమాతను హృదయపూర్వకంగా ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. బాబా దయవలన మరుసటిరోజే నాకు నెలసరి వచ్చింది. దాంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే, ఎన్నిరోజులకీ నాకు నెలసరి రాకపోవటంతో మా ఇంట్లోని పెద్దవాళ్ళు నాకు ధైర్యం చెప్పకపోగా, నెలసరి ఆగిపోయిందేమోనని అన్నారు. నేను కూడా నెలసరి ఇక రాదేమోనని భయపడ్డాను. కానీ, సాయిమాతను తలచిన వెంటనే నా సమస్య పూర్తిగా తీరిపోయింది. “అమ్మా, సాయిమాతా! ఆపదలలో అక్కున చేర్చుకునే సాయితల్లీ! నీ ప్రేమని ఎంతని చెప్పను!”
మూడవ అనుభవం:
ఇక నాకున్న థైరాయిడ్ సమస్యను కూడా బాబా తొలగించారు. నాకు థైరాయిడ్ ఉందని, అందువలనే బరువు పెరగడం, నెలసరి సరిగా రావడం లేదని నన్ను పరీక్షించిన డాక్టర్ తేల్చిచెప్పి, థైరాయిడ్ కంట్రోల్లో ఉండటానికి మందులు వాడాలని సూచించారు. డాక్టరు చెప్పినట్లు ప్రతిరోజూ ఉదయం పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవటం మొదలుపెట్టాను. కానీ, టాబ్లెట్ వేసుకోవడం వలన మరింత బరువు పెరగడం, నీరసంగా ఉండి ఇంట్లో పనులు సరిగా చేసుకోలేకపోవడం జరిగేది. నా శరీరం బరువుగా ఉండి చురుగ్గా నడవలేకపోయేదాన్ని. టాబ్లెట్ వేసుకోకపోతే చురుగ్గా ఉంటూ తేలిగ్గా ఇంట్లో పనులు చేసుకోగలిగేదాన్ని. దాంతో, ఇక మందులతో విసిగిపోయి నా బాధను బాబాకు చెప్పుకుని, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని సాయిని ప్రార్థించి సాయి తీర్థంగా తీసుకోవడం ప్రారంభించాను. ఇక నెలసరి సమస్యగానీ, థైరాయిడ్ సమస్యగానీ నాకు ఉన్నాయని ఏమాత్రం భయంలేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. చక్కగా ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను. అధిక బరువు అనే సమస్యే లేదు. చాలా తేలికగా ఉన్నాను. అంతా సాయిమాత దయ. ఈమధ్య నెలసరి రావడానికి కాస్త సమయం పట్టింది. సాయిని ప్రార్థించి ఊదీనీళ్ళను తీర్థంగా తీసుకున్నాను, సాయిదయతో నెలసరి సమస్య తీరిపోయింది.
నాలుగవ అనుభవం:
ఒకరోజు ఉదయాన్నే నా చెవిలోకి ఒక చీమ దూరింది. నేను కంగారుపడి చీమ బయటకు రావడానికి చెవిలో నీళ్ళు పోసి, కొన్ని నూనె చుక్కలు కూడా వేశాను. చెవిలో చీమ చేసే అలజడి అంతా ఇంతా కాదు. నేను ‘సాయీ, సాయీ’ అంటూ సాయినామాన్ని జపిస్తూ, ఆ చీమని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాను. నా కంగారు చూసి మా పాప కొద్దిగా బాబా ఊదీ తెచ్చి నా చెవిలో వేసింది. చెవిలో చీమ చేసే అలజడికి, బాధతో ‘సాయీ, సాయీ’ అంటూ ఇయర్ స్టిక్ చెవిలో పెట్టి చీమను బయటకు తీయడానికి ప్రయత్నించాను. ఇయర్ స్టిక్ చెవిలో పెట్టగానే చీమ ఆ ఇయర్ స్టిక్ని ఆసరాగా చేసుకుని బయటకు వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను చెవిలో నీళ్ళు పోశాను, నూనె పోశాను. మా పాప ఊదీ వేసింది. కానీ, ఆ చీమకి ఎలాంటి హానీ కలుగలేదు. చక్కగా ఉంది. నేను పలికిన సాయినామం వలన, ఊదీ ప్రభావం వలన చీమ కూడా రక్షింపబడింది. “సాయితండ్రీ! మీ ప్రేమ అపారమైనది. ‘సాయీ!’ అని ప్రార్థించినంతనే నన్ను, చీమని కాపాడారు. దయగల తండ్రీ, మీకు జయమగుగాక! సాయీ! మీ పాదాలే శరణం!”
జటిలమైన సమస్యను పరిష్కరించిన బాబా
సాయిభక్తుడు శేఖర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ‘సాయి మహరాజ్ సన్నిధి’ వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేసినవారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు మీ అందరితో నా రెండవ అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. కొంతకాలం క్రితం నేను నా స్నేహితులతో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించటం కోసం కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాను. ఆ వ్యాపారం కోసం మేమందరం రెండు నెలల పాటు శ్రమించి, 2020, జనవరి 9వ తేదీన వ్యాపారాన్ని ప్రారంభించాము. రెండు నెలలు గడిచిన తరువాత మా భాగస్వామ్యంలో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అది మార్చి, 2020. అప్పటికి కరోనా సమస్య ప్రబలడం వల్ల అది మా వ్యాపారానికి ఇంకా పెద్ద సమస్యగా మారింది. ఈలోగా షాపు అద్దె, వ్యాపార నిర్వహణ చాలా కష్టంగా మారాయి. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, “బాబా! నేను పెట్టిన పెట్టుబడిలో ఎంతో కొంత నష్టం వచ్చినా పర్లేదు, కానీ నన్ను ఈ సమస్య నుండి కాపాడండి బాబా. మీరు నాకు ఏది చేసినా నేను దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి స్వీకరిస్తాను” అని వేడుకున్నాను. ఇరువర్గాల నుండి రెండు, మూడు ఒప్పందాలు జరిగినా సమస్య తీరలేదు. అయినా నేను నిరాశచెందకుండా బాబాను నిరంతరం ధ్యానించేవాడిని. 5-11-2020 తేదీన ఆ జటిలమైన సమస్యను బాబా పూర్తిగా పరిష్కరించారు. అంతేకాదు, నాకు రావలసిన మొత్తం పెట్టుబడి డబ్బును నాకు ఇప్పించారు. బాబా చూపిన కరుణకు ఎంతో ఆనందంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ సమస్య తీరాక ఇప్పుడు నాకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని జన్మలు ఎత్తి బాబాను పూజించినా ఆయన ఋణం తీర్చలేనిది. ఆ ఋణానుబంధం లేకుండా మనం బాబాకు దగ్గర కాలేమని నా నమ్మకం. త్వరలోనే బాబా మా కుటుంబాన్నంతటినీ శిరిడీ దర్శనానికి ఆహ్వానిస్తారని ఎదురుచూస్తున్నాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Jai sairam
ReplyDeleteJai Sairam! Jaigurudatta!
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
571 days
ReplyDeleteSairam
Om Sai Ram
ReplyDeleteOm sai ram baba amma ki problem cure avali alage santosh health kuda bagundali shift change avali thandri rakshinchu
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sairam
ReplyDelete