సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కేశవ్ భగవాన్ గవాంకర్ - మొదటి భాగం


కేశవ్ భగవాన్ గవాంకర్
(4 ఏప్రిల్, 1906 – 29 జూన్, 1985)

సాయిభక్తుడు డాక్టర్. కేశవ్ భగవాన్ గవాంకర్ ముంబాయికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వసయీలోని ఆర్నాల బెస్తలపల్లెలో (శక సం.1828)1906, ఏప్రిల్ 4, శనివారం, వైశాఖ శుక్లపక్ష పంచమినాడు జన్మించాడు. ఇష్టమైనవారు అతనిని అప్పాసాహెబ్ అని పిలుస్తారు. అతని పూర్వీకులు కూడా ఆర్నాలకు చెందినవారే. అతని తండ్రి భగవాన్ వంటచెరకు, బొగ్గులు అమ్మే కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. ఆ పనిమీద అతనెక్కువగా అడవికి వెళ్తుండేవాడు. అందుచేత ఆయన ఇంటిపట్టున ఎక్కువగా ఉండేవారు కాదు. అయితే వాళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబమైనందున కష్టసుఖాలన్నిటిని అందరూ కలిసి పంచుకుంటూ కలివిడిగా ఉండేవారు. కుటుంబంలోని వారంతా ఎంతో భక్తితత్పరులు. కుటుంబమంతా భక్తిశ్రద్ధలతో గణేశుడిని పూజిస్తుండేవారు, ఆయన అనుగ్రహం వారిపై పుష్కలంగా ఉండేది. పిల్లవాని మేనమామ విఠల్ కాకా గారికి విఠోబా అన్నా పురందరే అనే గొప్ప జ్యోతిష్య పండితునితో బాగా పరిచయం ఉంది. ఆయన కేశవ్ జాతకం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయన పిల్లవాడు మహాపురుషుడుగా ఖ్యాతి వహిస్తాడని చెప్పారు.

తరువాత పిల్లవానికి నామకరణ మహోత్సవంనాడు స్నేహితులు, బంధువులు వచ్చారు. తండ్రి తన కుమారునికి ‘రామ్’ అని నామకరణం చేద్దామన్నాడు. కానీ కుటుంబంలో మరికొందరు ‘మధుకర్’ అని పేరు పెడదామన్నారు.  ఆఖరికి అందరూ కలిసి ‘రామ్’ అని నామకరణం చేయడానికి నిర్ణయించారు. నామకరణం చేయడానికి పిల్లవాడిని ఉయ్యాలలో వేయబోయే సమయానికి పిల్లవాడు హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. వైద్యుడు పరీక్షించి, "పిల్లవానిలో ఎటువంటి అనారోగ్య సూచన కనపడటం లేదు, పిల్లవాడు బాగానే ఉన్నాడ"ని చెప్పాడు. దాంతో పిల్లవాని మేనమామ మళ్ళీ ఒకసారి పిల్లవాడి జాతకం పరిశీలించాడు. అందులో పిల్లవాడికి ‘కే’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని ఉంది. వెంటనే అతను పిల్లవాని చెవిలో నెమ్మదిగా, “నీకు 'కేశవ్’ అని పేరు పెడతాము, సరేనా?” అని అన్నాడు. వెంటనే పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఆవిధంగా పిల్లవానికి ‘కేశవ్’ అని నామకరణం జరిగింది.

ఒకరోజు రాత్రి కేశవ్ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. అర్థరాత్రి దాటాక ఒకసారి పిల్లవాణ్ణి చూడాలని తల్లికి అనిపించింది. ఆమె నిద్రమత్తులోనే లేచి, కటిక చీకటిగా ఉన్నందున లాంతరు వెలిగించబోయింది. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వెలుగుతున్న అగ్గిపుల్ల కేశవ్ పక్కబట్టలమీద పడి మంటలు అంటుకున్నాయి. అతి కష్టం మీద ఆమె మంటలనార్పింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఏమీ కాలేదు, సురక్షితంగా ఉన్నాడు. తల్లిదండ్రులకి కేశవ అంటే పంచప్రాణాలు. అతడే వారి ఆశాజ్యోతి. అతనికి మేనమామ విఠల్ పంత్, మేనత్త తమ్మాబాయి అంటే చాలా ఇష్టం. అతని బాల్యం చాలా ఆనందంగా గడిచింది. ఇతర పిల్లల మాదిరే చుట్టుప్రక్కల పిల్లలతో చక్కగా ఆడుతూ చలాకీగా ఉండేవాడు. ‘శ్రీ గణేశాయనమః, ఓం నమః సిద్ధ’ అనే మంత్రంతో అతని అక్షరాభ్యాసం జరిగింది. ఏడు సంవత్సరాల వయస్సులో అతడు స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాడు.

బాబా అనుగ్రహంతో గవాంకర్‌కి చేకూరిన ఆరోగ్యం

ఏడు సంవత్సరాల వయసులో హఠాత్తుగా ఒకసారి కేశవ్ అనారోగ్యానికి గురై, విపరీతమయిన జ్వరం, దగ్గుతో బాధపడుతుండేవాడు. తల్లి మంచంమీద చక్కగా పక్క వేసి కేశవ్‌ని పడుకోబెట్టింది. కొంతసేపటి తరువాత ఆమె పిల్లవాడి శరీరం మీద చేయి వేస్తే, అతని శరీరం తీవ్రమైన జ్వరంతో కాలిపోతోంది. వెంటనే వైద్యుడిని పిలిపించారు. ఆయన బాగా పరీక్షించి ‘ఎంపియెమా’ అని నిర్ధారణ చేసి, ఛాతీ అంతా పూర్తిగా చీముతో నిండిపోయి ఉందని చెప్పాడు. (ఊపిరితిత్తులు, ఛాతీ లోపలి గోడల మధ్య రసి చేరడమే ‘ఎంపియెమా’. ఆ చీము ఒక ద్రవంలా ఉండి, అందులో రోగనిరోధక కణాలు, మృత కణాలు, బాక్టీరియా అన్నీ ఉంటాయి. న్యుమోనియా తరువాత ఈ స్థితి వస్తుంది. ఇది దగ్గు ద్వారా బయటకు రాదు. నీడిల్ ద్వారా గాని, సర్జరీ ద్వారా గాని బయటకు తీయాల్సి ఉంటుంది.) జబ్బు చాలా తీవ్రంగా ఉండి ప్రతిరోజూ జ్వరతీవ్రత 104 డిగ్రీలు ఉంటుండేది. మందులెన్నో వాడుతున్నప్పటికీ గుణం కనిపించలేదు. ఎంతోమంది వైద్యులు వచ్చి పరీక్షించారు. ఆఖరికి డా.బద్కమ్కర్, ఎమ్.డి., డా.రావు గార్లను పిలిపించారు. వారు పిల్లవాడిని పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. విఠల్ కాకా వైద్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. ఇద్దరు తప్ప అందరూ సర్జరీ చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. అయినా డా.బద్కమ్కర్ సర్జరీకి సమ్మతించమని అడిగినప్పుడు విఠల్ కాకా, "సర్జరీ వల్ల పిల్లవాడికి చాలా బాధ కలుగుతుంది. వాడు తట్టుకోలేడు. అదీకాక సర్జరీ చేసిన తరువాత కోలుకుంటాడనే గ్యారంటీ కూడా లేదు కదా" అని అన్నాడు. అలా మూడు నెలలు గడిచిపోయాయి. ఇక పిల్లవాడు కోలుకుని ఆరోగ్యవంతుడవుతాడనే ఆశ కుటుంబసభ్యులకి పోయింది.

అదే సమయంలో యశ్వంతరావ్ గాల్వంకర్ తన మామగారయిన అన్నాసాహెబ్ దభోల్కర్ గారితో కలిసి శిరిడీ వెళ్లి, తిరిగి బొంబాయికి వచ్చేటప్పుడు బాబా ఊదీ, పాదతీర్థం, ఒక బాబా ఫొటో తీసుకుని వచ్చారు. వెంటనే అతను కేశవ్ ఇంటికి వెళ్ళి శిరిడీ నుండి తెచ్చిన ఊదీ, పాదతీర్థం, బాబా ఫొటోలను విఠల్ కాకాకి ఇస్తూ, “కాకా, ఎప్పటినుండో కేశవ్‌కి ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ వాటివల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. మీరు బాబాని ఎందుకు ఆశ్రయించరాదు? ఏదయినా మొక్కు మొక్కుకోండి. పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే మొక్కు చెల్లించండి” అని చెప్పాడు. సరేనని విఠల్ కాకా భక్తితో బాబా ఫొటోని ఒక బల్లమీద పెట్టి, ఒక పూలమాల వేసి, ధూపదీపాలు అర్పించి, ఆరతిచ్చాడు. తరువాత బాబా పాదాలవద్ద తన శిరసునుంచి “హే సాయినాథా! నేను నిన్నెప్పుడూ చూడలేదు. నీ దయ, కరుణల గురించి మాత్రం విన్నాను. నా మేనల్లుడు కేశవ్ చావుబ్రతుకుల్లో ఉన్నాడు. నా ఈ ప్రార్థనను మన్నించి వాడి వ్యాధిని నివారించమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ కొబ్బరికాయను నీకు సమర్పిస్తున్నాను. పిల్లవానికి ఆరోగ్యం చేకూరగానే నీకు ఐదు సేర్ల పాలకోవా సమర్పించుకుంటాను” అని ప్రార్థించాడు. తరువాత ఊదీ, తీర్థం బాబా పాదాలకు తాకించి, కేశవ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు కేశవ్ స్పృహలో లేడు. ఒక చుక్క తీర్థం అతని నోటిలో వేసి, ఊదీని నుదుటిపై పెట్టి, బాబా ఫోటోని అతని ఛాతీమీద పెట్టాడు.

కేశవ్ మంచంపట్టినప్పటినుండి విఠల్ కాకా, తమ్మాబాయి ఇద్దరూ పిల్లవాని మంచం ప్రక్కనే కూర్చుంటూ ఉండేవారు. అలాగే ఆరోజు కూడా కూర్చొని ఉన్నారు. అర్థరాత్రి దాటాక తమ్మాబాయి నిద్రలో తూలుతూ ఉంది. అప్పుడు ఆమెకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఆమె ఇంటికి వచ్చి, కొబ్బరికాయనిమ్మని అడిగారు. మరుసటిరోజు తమ్మాబాయి బాబా ఫోటోముందు కొబ్బరికాయను ఉంచి, కేశవ్‌కు నయం చేయమని ప్రార్థించింది.

అదేరోజు రాత్రి బాబా మళ్ళీ ఆమెకు కలలో దర్శనమిచ్చారు. బాబా పిల్లవాని దగ్గరకు వెళ్ళి, తమ దివ్య హస్తంతో తలనుండి పాదాలవరకు స్పృశించి, “అల్లా భలా కరేగా” అని ఆశీర్వదించి మరుక్షణంలో అదృశ్యమయ్యారు. అంతటితో కల ముగిసింది. వెంటనే ఆమెకు మెలకువ వచ్చి కేశవ్ మీద చెయ్యి వేసింది. అతని ఒళ్ళు చల్లగా తగిలింది. ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడి పిల్లవాడు చనిపోయాడనుకొని పెద్దగా రోదించసాగింది. ఇంట్లోని వారంతా లేచి ఏమి జరిగిందని కంగారుగా పరుగెత్తుకుని వచ్చారు. మేడ మీద నిద్రపోతున్న డా.గాల్వంకర్ గారు కూడా క్రిందకి దిగి వచ్చి కేశవ్ నాడి పట్టుకుని పరీక్షించారు. నాడి బాగా కొట్టుకుంటోంది, జ్వరం కూడా తగ్గిపోయింది. దాంతో డాక్టరు హాయిగా ఊపిరి పీల్చుకుని శాంతంగా, "ఏమీ ఫరవాలేదు, అంతా బాగానే ఉంది" అని చెప్పడంతో అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రకుపక్రమించారు. 

ఉదయాన్నే డా.గాల్వంకర్ వచ్చి కేశవ్‌ని పరీక్షించారు. కేశవ్ చొక్కా తడిసిపోయి ఛాతీకి గట్టిగా అంటుకునిపోయి ఉంది. చొక్కాని నెమ్మదిగా కత్తిరించి చూస్తే, కేశవ్ కుడి కుచాగ్రం క్రిందుగా చిన్న రంధ్రం కనిపించింది. దానినుండి రసి కారుతూ ఉంది. గాల్వంకర్ గారు దాని చుట్టూ గట్టిగా నొక్కారు. రసితో కూడిన రక్తం బయటకి బాగా కారసాగింది. మొత్తమంతా బయటకు వచ్చేశాక కేశవ్ నెమ్మదిగా కోలుకోసాగాడు. త్వరలోనే పూర్తిగా కోలుకొని స్కూలుకి వెళ్ళనారంభించాడు. మిగతా పిల్లలలాగే పాఠశాలకు వెళ్తూ, తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. కష్టాలు వచ్చినపుడు మానవులు మొక్కులు మొక్కుకోవడం సాధారణమైన విషయం. కానీ మొక్కుకున్న మొక్కులను వెంటనే తీర్చడం ఎప్పుడూ సాధ్యం కాదు. దానికి కారణం, మర్చిపోవడమయినా కావచ్చు లేక పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక్కోసారి వెంటనే తీర్చడం సాధ్యపడకపోవచ్చు. విఠల్ కాకా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది.

సాయిబాబా ప్రథమ దర్శనం.

అయిదు సంవత్సరాల తరువాత కేశవ్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 1918 జనవరిలో అతని చిన్న మేనమామ రామచంద్ర పంత్, మేనత్త తమ్మాబాయిలు మొక్కు తీర్చుకోవడానికి కేశవ్‌ను తీసుకొని శిరిడీయాత్రకు బయలుదేరారు. శిరిడీ చేరుకున్నాక వాళ్ళంతా సాయిబాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళారు. ఆ సమయంలో చాలామంది భక్తులు బాబా ముందు నిలబడి ఉన్నారు. అందుచేత కేశవ్, అతని కుటుంబసభ్యులందరూ తమ వంతు కోసం నిరీక్షిస్తూ ఒక ప్రక్కగా నిలబడ్డారు. బాబా కేశవ్ వైపు చూసి తమ వద్దకు రమ్మని సైగ చేశారు. తరువాత బాబా కేశవ్‌ను, “అరే, నా పాలకోవా ఏదీ?” అని అడిగారు. రామచంద్ర పంత్ ముందుకు వెళ్ళి పాలకోవాలు ఉన్న ప్యాకెట్టును కేశవ్‌కి ఇచ్చాడు. వాళ్ళు మొక్కుకున్నది 5 శేర్ల పాలకోవాలే అయినా, కాస్త ఎక్కువగానే తీసుకుని వచ్చారు. బాబా కేశవ్ చేతిలోనుంచి ప్యాకెట్ తీసుకుని 4 పాలకోవాలు అతనికిచ్చారు. మిగిలినవన్నీ ఒక్కసారిగా నోటిలో వేసుకుని మ్రింగేశారు. ప్రక్కనే ఉన్న శ్యామా “దేవా! ఏమి చేస్తున్నారు మీరు?” అని బాబాని అడిగాడు. అప్పుడు బాబా, “ఈ పిల్లవాడు నన్ను 5 సంవత్సరాలనుంచి ఆకలితో ఉంచాడు. అందుకనే నేనంత ఆత్రంగా తినేశాను” అని సమాధానమిచ్చారు. ఆవిధంగా అయిదు సంవత్సరాల క్రిందటి విషయాన్ని బాబా గుర్తు చేశారు.

గవాంకర్ పై బాబా కురిపించిన అనుగ్రహం.

వారి శిరిడీ ప్రయాణానికి కాస్త ముందే కేశవ్‌కి ఉపనయనం జరిగి ఉన్నందున ఆ సమయంలో అతడు తల వెనుక పిలక తప్ప, మొత్తమంతా గుండుతో ఉన్నాడు. అకస్మాత్తుగా బాబా ఆ పిలక పట్టుకుని బలంగా అతని తలను ముందుకు లాగి తమ పాదాల వద్ద ఉంచుకున్నారు. బాబా చేసిన ఆ చర్య వల్ల కేశవ్‌కి ప్రకాశవంతమైన వెలుతురు కన్పించింది, వెన్ను మొదలునుంచి చివరివరకు ప్రకంపనలు వచ్చి శరీరమంతా వణకసాగింది. ఆవిధంగా బాబా ఆ బాలుడిని ఆశీర్వదించారు

తరువాత బాబా కేశవ్ కళ్ళలోకి చూస్తూ, రెండు పైసల దక్షిణ అడిగారు. ప్రక్కనే ఉన్న శ్యామా కేశవ్ చేయి పట్టుకుని దక్షిణ ఇస్తున్నట్లుగా ముందుకు చాపించాడు. బాబా కూడా కేశవ్ ఇస్తున్న దక్షిణను స్వీకరించడానికన్నట్లు తమ కుడిచేయిని ముందుకు చాచారు. శ్యామా కేశవ్‌తో, "‘దియా' (సమర్పించాను) అని చెప్పు" అన్నాడు. బాబా దక్షిణను స్వీకరించినట్లుగా నటిస్తూ ‘లియా' (తీసుకున్నాను) అన్నారు. తరువాత ఆ దక్షిణను తన కఫ్నీ జేబులో పెట్టుకుంటున్నట్లు నటించారు బాబా. వెంటనే ఎంతో వేగంగా తన కఫ్నీ తీసి కేశవ్ మీద కప్పారు. ఇది జరుగుతున్నంతసేపు కేశవ్ ఎంతో తన్మయత్వంలో ఉన్నాడు. అతని శరీరంలో ప్రకంపనలు ఇంకా కలుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్నవారంతా బాబా మహాప్రసాదంగా ఇచ్చిన కఫ్నీ ధరించడానికి కేశవ్ చాలా చిన్నవాడని భావించారు. కేశవ్ తరఫున శ్యామా మధ్యలో కల్పించుకుని, “దేవా, కేశవ్‌కి ఇచ్చిన ఈ కఫ్నీని నా దగ్గర భద్రపరుస్తాను. అతను పెద్దవాడయిన తరువాత అతనికి ఇస్తాను” అని అన్నాడు. అందుకు బాబా సమ్మతించారు. శ్యామా ఆ కఫ్నీని తన వద్ద ఉంచుకుని, కేశవ్ పెద్దవాడయిన తరువాత అతనికి ఇచ్చాడు. ఇప్పుడా కఫ్నీ అతని వారసుల వద్ద వుంది. వాళ్ళు దానిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు.

శిరిడీ వెళ్ళిన ఆ మొదటిరోజునే కేశవ్ బాబా దర్శనానికి మరోసారి వెళ్ళినప్పుడు బాబా ఒక అరటిపండు తమ చేతిలోకి తీసుకొని, తొక్క ఒలిచి చిన్నబిడ్డకి తినిపించినట్లుగా కేశవ్‌కి తినిపించారు. అయిదవరోజున సూర్యోదయానికి ముందే కేశవ్ బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా ధుని ముందు కూర్చుని ఉన్నారు. భాగోజీషిండే బాబా చేతికి ఉన్న కట్లు విప్పుతున్నాడు. కేశవ్ అక్కడికి వచ్చి నిలుచొని ఉండటం చూసిన బాబా, వెంటనే తమ వద్దకు రమ్మని అతన్ని పిలిచి, తమ ముందు కూర్చోమన్నారు. కేశవ్ కూర్చున్న వెంటనే బాబా అతని చెంపమీద లాగికొట్టారు. ఆయన ఎంత గట్టిగా కొట్టారంటే ఆ వేగానికి కేశవ్ నెత్తిమీద ఉన్న టోపీ ఎగిరిపడింది.

ఏడవరోజున కేశవ్‌తో అతని కుటుంబసభ్యులు కూడా తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకోవడం కోసం బాబా వద్దకు వెళ్లి, ఆయనకి నమస్కరించుకున్నారు. వాళ్లతోపాటు కేశవ్ కూడా బాబాకి నమస్కారం చేశాడు. బాబా అతని చేయి పట్టుకుని ముందుకు లాగి కూర్చోబెట్టి, అతని ముఖంమీద చాలా గట్టిగా ఒక్క చరుపు చరిచారు. తరువాత అతని గుప్పిటనిండా ఊదీ ఇచ్చి, "ఇక వెళ్ళు, అల్లా భలా కరేగా (దేవుడు నీకు మేలు చేస్తాడు)" అన్నారు. ఆవిధంగా బాబా దీవెనలు అందుకుని అందరూ ఇంటికి తిరిగి వచ్చారు.

బాబా ఆజ్ఞతో మొదలైన శ్రీరామనవమి ఉత్సవాలు.

1938వ సంవత్సరంలో గవాంకర్‌కి ఒక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, "బాలా(అబ్బాయీ)! నా నుంచి నీకేం సహాయం కావాలి?" అని అడిగి, మళ్ళీ వెంటనే, "ఇకనుంచి రామనవమి ఉత్సవాలకి నాకు ఒక ఉయ్యాల కట్టు” అని అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం డాక్టర్ గవాంకర్ ఒక అందమైన ఉయ్యాలను తయారుచేయించాడు. ఇక దానికి తగిన సుందరమైన రాములవారి విగ్రహం సంపాదించడమే మిగిలింది. స్నేహితులు, బంధువులు అందరూ కలిసి రెండునెలలపాటు చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా చాలా విగ్రహాలు చూశారు. కానీ ఆ ఉయ్యాలకి తగిన విగ్రహం మాత్రం దొరకలేదు. ఇక చేసేదేమీలేక రాములవారి చిత్రపటాన్ని ఉయ్యాలలో పెడదామని నిర్ణయించుకొని చిత్రపటాన్ని తీసుకుని వచ్చారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటి రామనవమి ఉత్సవాలు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమయ్యాయి. కానీ గవాంకర్‌కి మాత్రం తృప్తిగా లేదు. అతను బాబా ఫోటో ముందు కూర్చుని, “దేవా! మీరు కోరినట్లుగానే రామనవమి ఉత్సవాన్ని ప్రారంభించాను. కానీ, ఉయ్యాలలో పెట్టడానికి తగిన రాముని విగ్రహం లభించలేదు. ఉయ్యాలలో పెట్టడానికి తగిన రాముని విగ్రహం దొరికేంతవరకు నేను ఎటువంటి ఆహారాన్నీ తీసుకోను” అని కన్నీళ్ళతో ప్రార్థించాడు. అప్పటినుండి మంచినీరు మాత్రమే తీసుకుంటూ, తన రోజువారీ కార్యక్రమాలను ఎప్పటిలాగానే నిర్వహించుకుంటూ ఉన్నాడు.

ఆ సంవత్సరం రామనవమి శనివారం వచ్చింది. గురువారం వరకు విగ్రహం లభ్యం కాలేదు. ఇంక రెండురోజులే మిగిలి ఉన్నాయనగా గవాంకర్ యథాప్రకారంగా తన క్లినిక్ కి వెళ్ళాడు. ఆరోజు పేషెంట్లు చాలామంది ఉన్నారు. అందరూ తమ వంతు కోసం చూస్తూ వరుసలో కూర్చుని ఉన్నారు. వారిలో ఒక క్రొత్త పేషెంటు కూడా ఉన్నాడు. అతనిని అంతకుముందెన్నడూ డాక్టర్ గవాంకర్ చూడలేదు. అతను చొక్కా మీద కోటు ధరించి ఉన్నాడు. తలకు పాతకాలపు తలపాగా, కాళ్ళకు పాతకాలపు బూట్లు ఉన్నాయి. అతను చూడటానికి యశ్వంత్ దేశ్‌పాండేకి సహాయం చేసిన మనిషిలా ఉన్నాడు. గవాంకర్ అతని దగ్గరకు వెళ్ళి ఆరోగ్యం గురించి అడిగాడు. “నా వంతు వచ్చేవరకు నేను వేచి ఉంటాను” అని అతను సమాధానమిచ్చాడు. తరువాత అతని వంతు రాగానే అతడు గవాంకర్ ముందుకు వెళ్లి నిలుచున్నాడు. అతను గవాంకర్ చేతిలో ఒక ప్యాకెట్ పెట్టి, “ఇక వెళ్ళి వస్తాన"ని చెప్పి వెళ్ళిపోయాడు. క్షణకాలంపాటు ఏం జరుగుతోందో అర్థం కాలేదు గవాంకర్‌కి. తరువాత తన చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పి చూశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అది రాములవారి విగ్రహం! అంత సుందరమైన విగ్రహాన్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యాడతను. కానీ, "దేవా! మీరే వచ్చినా, మిమ్మల్ని గుర్తించలేకపోయాను" అని దుఃఖించాడు.

సాయిప్రసాదం ఝుంకా భాకర్

1938వ సంవత్సరంలో బాబా ఆజ్ఞతో గవాంకర్ ఇంటి శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయో ముందు భాగంలో తెలుసుకున్నాము. ఇక అప్పటినుండి కుర్లాలో ఉన్న వారి ఇంటిలో గవాంకర్, అతని కుటుంబసభ్యులు రామనవమి, విజయదశమి ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు. ఈ రెండు ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేస్తుండేవారు. 1939వ సంవత్సరంలో ఆయనకి ఒక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, “భిక్షేచ భాక్రీ లే గోడె(భిక్ష ద్వారా లభించిన భాక్రీ చాలా మధురంగా ఉంటుంది)" అన్నారు. దాంతో గవాంకర్ భిక్ష చేసి జొన్నలు సేకరించారు. అతనికి ఏడు రాశులు అంటే 50 కేజీల జొన్నలు లభ్యమయ్యాయి. వాటితో ఝుంకా భాకర్ తయారుచేశారు (భాక్రీ - జొన్నరొట్టె, ఝుంకా - తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండితో చేయబడే చట్నీ). అన్నదానం ప్రారంభించేముందు 11 ఝుంకా భాక్రీలు బాబాకు నైవేద్యంగా సమర్పించారు. వాటిలో ఒకటి బాబా ఫోటో వద్దనే ఉంచి, మిగిలిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. సుమారు 200 నుండి 300 మంది దాకా కడుపునిండా భోజనం చేశారు. అయితే జరిగిన విచిత్రాలలో కెల్లా విచిత్రం ఏమిటంటే, బాబా ఫోటో ముందు ఉంచిన భాక్రీ(రొట్టె) 35 సంవత్సరాలు గడిచినా కూడా పాడవలేదు, రుచిని కోల్పోలేదు, ఫంగస్ కూడా పట్టలేదు. చివరికి చీమలు కూడా చేరలేదు. ఆ తరువాత కొంతకాలానికి భక్తులు దానిని ‘సాయిప్రసాదం’గా తమ ఇళ్ళకు తీసుకుని వెళ్ళారు. అందుచేతనే డా.సాయినాథ్ గవాంకర్ ఇంట ప్రస్తుతం అది లేదు.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

2 comments:

  1. om sai ram today i finished maha parayan.i am blue group member.my rool no is22.sai blessed me to take a part of it.i am happy.sai i love you.i surrerened to your louts feet.be with me.bless us

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo