సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమాధవరావు అడ్కర్


ప్రముఖ సాయిభక్తులలో ఒకరైన శ్రీమాధవరావు అడ్కర్ తన జీవితకాలంలో ఎక్కువభాగం శ్రీసాయి సన్నిధిలోనే గడిపిన భాగ్యశాలి. ప్రతిరోజూ మధ్యాహ్న, సంధ్య ఆరతులలో వినిపించే "ఆరతి సాయిబాబా - సౌఖ్యదాతార జీవా" అనే సుప్రసిద్ధ ఆరతి గీతం రచించినది ఇతడే. ఈ భక్తుని గురించిన సమాచారం సాయిభక్తుల ముందు ఉంచుతున్నాము.

శ్రీమాధవ్ అడ్కర్ భక్తిప్రపత్తులు కలిగిన ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో  1877, సెప్టెంబర్ 5న జన్మించాడు. ఇతని తండ్రి శ్రీవామనరావు విఠల భక్తుడు. సంవత్సరంలో నాలుగుసార్లు పండరియాత్ర చేస్తుండేవాడు. తల్లి శ్రీమతి గోదావరి. వీళ్లది అహ్మద్‌నగర్ దగ్గరలో ఉన్న ధనోరా గ్రామం. వాళ్ళకి అక్కడ సొంత ఇళ్ళు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇతని పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకనాడు మాధవ్ తాతగారైన త్రయంబకరావు సాలీవిఠల్ మందిరంలో నిద్రిస్తుండగా అర్థరాత్రి 2 గంటల సమయంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో, "లే! భగవంతుని ఆశీస్సులతో నీకు మనవడు పుట్టాడు!!" అన్న మాటలు వినిపించాయి. వెంటనే అతడు లేచి ఇంటికి వెళ్లి చూస్తే, నిజంగానే తన కూతురు ఒక మగబిడ్డకి జన్మనిచ్చివుంది. మందిరంలో వచ్చిన కల సత్యమైనందున ఆ బిడ్డకి 'మాధవ్' అని నామకరణం చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం: ఒకసారి తల్లి మాధవ్‌ని ఆడిస్తూ గాల్లోకి ఎగరవేసింది. తిరిగి ఆమె బిడ్డను పట్టుకోవడంలో విఫలమవ్వడంతో మాధవ్ ఇసుక మీద పడ్డాడు. ఆమె కంగారుగా బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంటే, ఆశ్చర్యంగా బిడ్డ ఏడవకుండా ఆమెను చూస్తూ నవ్వుతున్నాడు.  దాంతో ఆమె 'ఈ బిడ్డలో ఏదో ప్రత్యేకత ఉంది' అనుకుంది. మాధవ్ తరువాత ఆ దంపతులకు మరో ఇద్దరు బిడ్డలు జన్మించారు. మాధవ్ తమ్ముడి పేరు గణేష్, చెల్లెలి పేరు దుర్గ. మాధవ్‌కు తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడు తల్లి మరణించింది. అప్పటినుండి మాధవ్ తాతగారి ఇంట అహ్మద్‌నగర్లో ఉండి మెట్రిక్ వరకు చదువుకున్నాడు.

ఆ సమయంలోనే దాసగణుతో మాధవ్‌కు పరిచయం ఏర్పడింది. అహ్మద్‌నగర్‌కు సమీపంలో ఉన్న ఝాముఖేడలో దాసగణు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండేవాడు. మాధవ్ 8వ తరగతి చదువుతుండేవాడు. ఇరువురి మనోభావాలు, ఆసక్తులు ఒకేలా ఉండటంతో ఇద్దరూ తొందరగానే మంచి స్నేహితులయ్యారు. దాసగణు చాలా చిన్నవయస్సు నుండే లావణీలు (మహారాష్ట్ర జానపద గీతాలు. వీటిని 'తమషా'లని కూడా అంటారు.), పౌడాస్ (చరిత్రలోని సాహసోపేత వ్యక్తుల వీరోచిత పనులను వివరించే పాటలు) వ్రాస్తుండేవాడు. మాధవ్ చిన్నప్పటినుంచి భజనలపట్ల, సాంప్రదాయ సంగీతంపట్ల ఆసక్తి కనబరిచేవాడు. చక్కటి గాత్రం కలిగివుండటంతో దేవాలయాలలోను, వేడుకలలోను పాటలు పాడుతుండేవాడు. ఆ ఆసక్తి వివిధ మతసంబంధిత చారిత్రాత్మక విషయాలపై, పౌరాణిక అంశాలపై లోతైన అధ్యయనం చేసేందుకు దోహదం చేసింది. తాను చదివిన ఆయా విషయాలు తన కీర్తనలలో, భజనలలో, ప్రవచనాలలో ప్రకటమవుతుండేవి. ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడేవారు. అతడు చూడటానికి చక్కగా ఉండి, మంచి నటనా ప్రతిభ కలిగి ఉండేవాడు. ఈ లక్షణాలతో దాసగణు వ్రాసే జానపద రచనలు సాధారణ ప్రజలలో ప్రాచుర్యం పొందటానికి ఒక చక్కటి మాధ్యమం అయ్యాడతడు. ఒకసారి ఆ గ్రామప్రజల అభ్యర్థనమేరకు మృత్యుకటిక నాటకం ప్రదర్శించడానికి దాసగణు నిశ్చయించుకొని, ఆ నాటకంలోని 'చారుదత్త' పాత్రను మాధవ్ కి ఇచ్చాడు. అక్కడి ప్రేక్షకులు అతని నటనకు, గానానికి మైమరిచి ప్రశంసల వర్షం కురిపించారు. మాధవ్ జ్యోతిషశాస్త్రంలో కూడా ప్రవీణుడు. ఖాళీసమయంలో తనను సంప్రదించే వారికోసం అతను జాతకాలు వ్రాస్తుండేవాడు.

1895లో తాత, నానమ్మల మరణంతో మాధవ్ అహ్మద్‌నగర్ వదిలి తన తండ్రి వద్దకు తిరిగి చేరుకున్నాడు. తండ్రి బలవంతంమీద తనకి ఇష్టం లేకపోయినా పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రాపంచిక ఆసక్తి తక్కువగా ఉండి, ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉండే మాధవ్ మనస్సు తెలిసిన దాసగణు సుమారు 1897 ప్రాంతంలో మాధవ్‌ను సాయిబాబా దర్శనానికి తీసుకువెళ్ళాడు. తొలిసారి బాబా దర్శనంతో మాధవ్ ఎంతో మానసిక ప్రశాంతతను పొందాడు. అంతవరకూ తాను వెతుకుతున్న ఆనందాన్ని ఆయన సన్నిధిలో అనుభవించాడు. అప్పటినుండి శిరిడీ ఎక్కువగా వెళ్తుండేవాడు. పూర్వజన్మ పుణ్యంకొద్దీ మాధవ్‌కు శ్రీసాయిబాబా సద్గురువుగా లభించారు.

అతడు తీర్థక్షేత్ర దర్శనాలను, మహాత్ముల సహచర్యాన్ని ఎంతగానో ఇష్టపడేవాడు. అతను శిరిడీతోపాటు కాశీ, రామేశ్వరం, బాలాజీ, గాణ్గాపూర్, నరసోబావాడి, మహూర్, తుల్జాపూర్, పండరిపురం తదితర అనేక పుణ్యక్షేత్రాలను తరచు సందర్శిస్తుండేవాడు. ఆ సమయంలో అతను గజానన్ మహరాజ్, అక్కల్కోటస్వామి, బల్బీమ్ మహరాజ్, సఖయస్వామి దేహుకర్, వాసకర్, వైకట్ స్వామి, వినాయక్ బువా, దాదామహరాజ్ వంటి సాధుసత్పురుషులను దర్శించి, వారి ఆశీస్సులు అందుకుంటుండేవాడు. తనలాగే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కనబరిచే తన స్నేహితులకి ఆ విషయాల గురించి రోజుకు మూడు నాలుగు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. వాళ్లు పంపిన ప్రత్యుత్తరాల ద్వారా మాధవ్ మనసులో ఏర్పడుతున్న ఆధ్యాత్మిక చింతన గురించి తండ్రికి తెలిసి, అతనికి వివాహం చేస్తే కుటుంబ వ్యవహారాలలో పడి అతని మనస్సు మారుతుందని తలచి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. 

మాధవ్ యొక్క సునిశిత పరిజ్ఞానం, చేతివ్రాతలు బాగా నచ్చి షోలాపూర్ జిల్లా కర్మాల తాలూకా సాడే గ్రామ నివాసి అయిన నగల వ్యాపారి రఘోపంత్ కావడే తన కుమార్తె గంగూబాయిని అతనికిచ్చి వివాహం చేయడానికి ఆసక్తి కనబరిచాడు. అలా 1899లో సాడే గ్రామంలో మాధవ్ వివాహం జరిగింది. అప్పటికి మాధవ్ వయస్సు 22 ఏళ్లు. వివాహమైన కొద్దిరోజులకే అతడు కుటుంబసభ్యులకు చెప్పకుండా ఉద్యోగం వదిలి తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. దానితో అందరూ కలత చెందారు, ముఖ్యంగా అతని మామ. రెండునెలల తర్వాత మాధవ్ ఇంటికి రావడంతో అందరూ సంతోషించారు గానీ, మళ్లీ రెండు నెలలు గడిచేసరికి ఒక శుభదినాన తన ఆధ్యాత్మిక పుస్తకాలను, సామానులను సర్దుకొని ఇంటినుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యులంతా అతనికోసం చాలా గాలించారు గానీ అతని ఆచూకీ తెలియలేదు.

ఇంటినుండి వెళ్ళిపోయిన మాధవరావు శిరిడీ చేరుకున్నాడు. నిత్యం బాబా దర్శనం చేసుకుంటూ, ఆయన సన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతూ శిరిడీ గ్రామంలోని పది, పన్నెండుమంది పిల్లలకి పాఠాలు చెబుతూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. సాయిబాబా తనకి ప్రతిక్షణం అండగా ఉంటూ ప్రతిక్షణం తన బాగోగులు చూసుకుంటారని నిశ్చింతగా ఉండేవాడు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులతో బాబా గురించి చెప్తూ సత్సంగం చేస్తుండేవాడు. ఈ సమయంలో అతడెన్నో బాబా లీలలను అనుభూతి చెందాడు. అలా శిరిడీలో ఉన్నప్పుడు, అంటే 1903-04 ప్రాంతంలో ఒకసారి అతని మనస్సు పూర్తిగా బాబా ఆలోచనలతో నిండిపోగా ఎంతో తన్మయత్వానికి లోనయ్యాడు. ఆ స్థితిలో అతని మనస్సునందు  "ఆరతి సాయిబాబా - సౌఖ్యదాతార జీవా" అన్న పద్యం ఊపిరి పోసుకుంది. శ్రీసాయిబాబాపై ఆరతి రూపంలో ఉన్న ఆ పద్యాన్ని చూసిన దాసగణు ఆశ్చర్యచకితుడై ఆనందపరవశుడయ్యాడు. అతడెంతగానో ప్రశంసించినప్పటికీ మాధవ్ తన రచన గురించి పెద్దగా ఏమీ పొంగిపోకుండా ఆ కాగితం ముక్కను మడిచి తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత ఇద్దరూ బాబా వద్దకు వెళ్లారు. తన జేబులో ఉన్న ఆ కాగితాన్ని ఎవరి కంటా పడకుండా మాధవ్ దాచడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన బాబా, ‘‘అరె మాధవ్! ఆ కాగితాన్ని ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తున్నావు? బిగ్గరగా చదువు!’’ అని అన్నారు. దాంతో అతడు ఆ ఆరతి పాటను బాబాకు పాడి వినిపించాడు. అది విన్న బాబా, ‘‘నీ ఆరతి భక్తుల సంక్షేమాన్ని చూస్తుంది’’ అని ఆశీర్వదించారు. ఈనాటికీ బాబా అన్న ఆ మాటలు ఎంత సత్యమో భక్తులు అనుభవిస్తున్నారు. అదే బాబాపై వ్రాయబడ్డ మొట్టమొదటి ఆరతి గీతం.

ఒకసారి బాబా దర్శనార్థం చాలామంది భక్తులు రావడంతో ద్వారకామాయి ప్రాంగణమంతా నిండిపోయింది. ఇంకా చాలామంది భక్తులు బాబా దర్శనం కోసం బయట వేచివున్నారు. ద్వారకామాయి ప్రవేశద్వారం వద్ద ఉన్న మాధవ్ తనలో తాను, "ఏమిటి బాబా! మీ దర్శనం కోసం మాలాంటి పేదవాళ్ళం చాలా సమయం వేచివుండాలా?" అని అనుకున్నాడు. మరుక్షణం బాబా, "మాధవ్‌ని లోపలికి రానివ్వండి" అని బిగ్గరగా అరిచారు. అది వింటూ ఆశ్చర్యపడిన అతడు, 'బాబా అంతర్యామి. ఆయనకన్నీ తెలుసు. మనలోని చిన్న ఆలోచన సైతం ఆయనకు తెలియకుండా ఉండద'ని గ్రహించాడు.

కొంతకాలం గడిచిన పిమ్మట రఘోపంత్‌కి ఇంటినుండి వెళ్ళిపోయిన మాధవ్ కాశీయాత్ర చేసి, అక్కడినుంచి షేగాఁవ్ చేరుకొని, చివరిగా శిరిడీలో స్థిరపడ్డాడని తెలిసింది. దాంతో వాళ్ళు మాధవ్‌ని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి శిరిడీకి బయలుదేరారు. అదేసమయంలో సర్వాంతర్యామి అయిన బాబా మాధవ్‌తో, "మాధవ్! నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇద్దరు వ్యక్తులు గుర్రం మీద వస్తున్నారు. నువ్వు వాళ్లతో ఇంటికి వెళ్ళు. కానీ నువ్వేం చింతించకు! నువ్వెప్పుడూ నువ్వు వ్రాసిన ఆరతి పాటతో నా చెంతనే ఉంటావు" అని చెప్పారు. బాబా చెప్పినట్లుగానే మరుసటిరోజు ఇద్దరు వ్యక్తులు అతనిని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చారు. బాబా అప్పటికే వాళ్లతో వెళ్ళమని మాధవ్‌కి చెప్పి ఉన్నందున అతనికి ఇష్టం లేకపోయినా బాబా ఆదేశానుసారం వాళ్లతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ముగ్గురూ బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా మాధవ్‌తో, "ఇప్పుడు నువ్వు వాళ్లతో వెళ్ళు. ఇంకా ఇక్కడ ఉండకు. వెళ్ళు! నీకు కొడుకు పుడతాడు. తనకి 'రామ్' అని పేరు పెట్టు" అని చెప్పారు. వాళ్ళు ముగ్గురూ బాబాకి నమస్కరించుకొని వాళ్ల గ్రామానికి వెళ్లిపోయారు.

బాబా చెప్పినట్లుగానే ఒక సంవత్సరం తరువాత 1915, మార్చి 4న మాధవ్‌కు కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి 'రామచంద్ర' అని నామకరణం చేశారు. బిడ్డను బాబా దివ్యపాదాలచెంత ఉంచాలని బిడ్డను తీసుకుని మాధవ్ తన భార్య గంగూబాయితో శిరిడీ వచ్చాడు. బాబా రామచంద్రను తమ ఒడిలోకి తీసుకొని ప్రేమగా లాలిస్తూ ఆశీర్వదించారు. తరువాత మాధవ్‌కు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమెకు పండరిపురానికి చెందిన శ్రీరోపాలేకర్‌తో వివాహమైంది. అయితే ఆమె తన తల్లిలాగే ఎక్కువకాలం జీవించలేదు. అందువలనే రామచంద్రకి ఉపనయనం జరిగినప్పుడు తన కుటుంబం తరపున తన తండ్రి మాత్రమే ఉన్నాడు.

మాధవ్ అడ్కర్ శిరిడీనుండి దూరంగా ఉన్న సందర్భాలలో అతని మనస్సు చాలా చంచలంగా ఉండేది. 'ఎప్పుడెప్పుడు శిరిడీ చేరుకుంటానా!' అని అతని హృదయం కొట్టుమిట్టాడుతుండేది. ఒకసారి రామనవమి పండుగ సమీపిస్తోంది. అతడు వీలైనంత త్వరగా శిరిడీలో ఉండాలని తపిస్తున్నాడు. అయితే తన ఆరోగ్యం బాగాలేనందున ఆ స్థితిలో శిరిడీ ఎలా వెళ్లగలనా అని భయపడ్డాడు. అంతలో తన స్నేహితులిద్దరు వచ్చి అతన్ని చాలా జాగ్రత్తగా శిరిడీకి తీసుకొని వెళ్లారు. అలా బాబా తన భక్తుని మనస్సులోని తపన తెలుసుకుని దానిని నెరవేర్చారు.

మాధవ్‌పై దాసగణు ప్రభావం చాలా ఉండేది. అతడు దాసగణును తన అన్నగా భావించి గౌరవిస్తూ అతనిపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించేవాడు. అతను దాసగణును కూర్చోబెట్టి, పూలమాలలు వేసి, అతని కాళ్ళకి మ్రొక్కి, కాళ్ళు కడిగి పూజించి, ఆ నీటిని ‘పవిత్రజలం’గా భావించి త్రాగేవాడు. ఇవన్నీ దాసగణుకి ఇబ్బందిగా ఉండేవి, కానీ నియంత్రించలేకపోయేవాడు. ప్రతిరోజూ 12సార్లు విష్ణుసహస్రనామాన్ని పఠించడం దాసగణుకు అభ్యాసం. అది తెలిసిన మాధవ్ కూడా ఆ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాడు. అది తన తుదిశ్వాసవరకు కొనసాగించాడు. ఇప్పటికీ అతని కుటుంబసభ్యులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. అతడు చాలా త్వరితగతిన కవితలు రచించగలిగేవాడు. కానీ దాసగణు వంటి గొప్ప కవి యొక్క పాండిత్యం ముందు అతనెప్పుడూ వినయపూర్వకంగా తలవంచేవాడు. దాసగణు కీర్తనలను అతడెంతగానో ఇష్టపడేవాడు. 1952 వరకు ప్రతిసంవత్సరం దాసగణుతో కలిసి రామనవమి పండుగకు హాజరవుతుండేవాడు.

మాధవ్‌కు ఉత్తరాలు వ్రాయడం చాలా ఇష్టం. వాటిలో కుటుంబ విషయాల ప్రస్తావన చాలా అరుదుగా ఉండి ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఉండేవి. చాలా తరచుగా దాసగణు గురించి ఆ లేఖలలో ప్రస్తావిస్తుండేవాడు. ఆ లేఖల పైభాగంలో అతను ‘శ్రీ శంకర్’ అని వ్రాసేవాడు. అది కూడా దాసగణు యొక్క అలవాటు. ఆ లేఖల కాపీని తన కొడుకు శ్రీరామచంద్రపంత్‌కు కూడా పంపేవాడు. అతడు వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ముఖ్యంగా అతను ప్రతివిషయంలో దాసగణును సంప్రదించేవాడు. అప్పుడప్పుడు శ్రీసాయిశరణానంద్, నానాసాహెబ్ చందోర్కర్, జి. టి. కార్నిక్, రావుబహదూర్ సాఠే, త్రిపాఠి మొదలగు ఇతర సాయిభక్తులతో కూడా సంభాషించేవాడు. ఈ లేఖలు చాలావరకు మొదట్లో మరాఠీ, సంస్కృతంలోనే ఉండేవి. తరువాత తరువాత ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో కూడా ఉండేవి. మాధవ్‌కు సంస్కృతం, మోడీ, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ, మరాఠీ, తెలుగు, కన్నడ, గుజరాతీ మరియు హిందీ వంటి అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈ భాషలలో ఆయన వ్రాసిన లేఖలు అతని వారసులవద్ద లభిస్తాయి. ఈ భాషలపై అతనికున్న పాండిత్యం అతని రచనలు, కవితల ద్వారా తెలుసుకోవచ్చు. 1948లో గుజరాత్‌కు చెందిన శ్రీరంగాచార్యస్వామి మహరాజ్ అనే సమకాలీన సాధువుపై మాధవరావు సంస్కృతంలో ఒక గ్రంథాన్ని రచించారు. దాని రూపకల్పనలో అతని కళాత్మకత గోచరిస్తుంది. ఆ గ్రంథాన్ని చూస్తే అది చేతివ్రాత కాదు ముద్రణ అని అనిపించకమానదు. అంత గొప్పగా ఉంటుంది అతని చేతివ్రాత. అతను తన స్వహస్తాలతో ‘విష్ణుసహస్రనామం' కూడా రచించాడు. అది చూసి దాసగణు ఎంతగానో సంతోషించి లోనీ గ్రామంలో వుంటున్న మాధవ్‌కు రూ.3 మనియార్డర్ చేశాడు. తరువాత ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఇరువురి కళ్ళనుండి కన్నీళ్ళు పొంగిపొర్లాయి. వారిరువురి మధ్య అంతటి ప్రేమానురాగాలు ఉండేవి.

ఒకసారి మాధవ్‌ను ఒక చిన్న గ్రామంలో పోస్ట్ చేశారు. అక్కడ ఉండగా ఒక బ్రిటిష్ అధికారి పాఠశాలను తనిఖీ చేయడానికి అక్కడకు వచ్చాడు. మాధవ్‌తో  మాట్లాడుతున్నప్పుడు, ఆంగ్లభాషపై అతనికున్న పాండిత్యం చూసి ఆ బ్రిటిష్ అధికారి ముగ్ధుడయ్యాడు. వెంటనే అతను, 'అటువంటి మారుమూల గ్రామంలో ఇంతటి నైపుణ్యం ఉన్న వ్యక్తిని పోస్ట్ చేయడం చాలా దారుణమ'ని పై అధికారులకు వ్రాశాడు. దానికి పైఅధికారులు, "మీరు చెప్పేది నిజం. కానీ సమస్య ఏమిటంటే ఆ పెద్దమనిషి ఏ ఒక్క ప్రదేశంలోనూ ఎక్కువకాలం కొనసాగడు" అని బదులిచ్చారు.

1955 నవంబరు 13న మాధవ్ అడ్కర్ మరణావస్థలో ఉన్నప్పుడు తన కొడుకు రామచంద్రుని దగ్గరకు పిలిచి, "ఒక మంచి కఫ్నీ పంపించమని శిరిడీ సంస్థాన్‌కి ఉత్తరం వ్రాయమ"ని చెప్పాడు. తర్వాత కొద్దిరోజులకి నవంబరు 18న తన కొడుకుతో, "రామ్, బాబా ఆరతి పాట పాడు. అలాగే భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం, విష్ణుసహస్రనామం పఠించు. బాబా నామస్మరణ చేయి" అని చెప్పాడు. అప్పుడు రామచంద్ర, "నాన్నగారూ! మీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. అందుకు మాధవ్, "నేను సంతృప్తిగా ఉన్నాను. నువ్వు స్మరణ ఆపవద్దు" అని చెప్పాడు. తర్వాత కుటుంబమంతా బాబా ఆరతి పాడుతూ ఉండగా మాధవ్ అడ్కర్ తన తుదిశ్వాస విడిచాడు. అలా బాబా ఆరతి వింటూ, బాబా మీద ధ్యాస నిలిపి తన జీవితాన్ని చాలించిన ధన్యజీవి మాధవ్ అడ్కర్.

సాయిబాబా ఆశీస్సులతో జన్మించిన మాధవ్ అడ్కర్ కుమారుడు రామచంద్ర అడ్కర్ వివిధ రంగాలలో గొప్ప విజయాలను సాధించాడు. బహుముఖ వ్యక్తిత్వం కలిగిన అతడు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సమర్థుడైన వైద్యునిగా, జ్యోతిష్కునిగా, ఉపాధ్యాయునిగా అతడు గొప్ప ఖ్యాతి గడించాడు. వీటిన్నిటికీ మించి అతడు సాయిబాబాకు అంకిత భక్తుడు. అతడు సాయిబాబా ఇచ్చిన ప్రేరణతో పూణే సమీపంలోని 'లోని' అనే ప్రదేశంలో 2001-2005 మధ్యకాలంలో 3 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన సాయిబాబా మందిరాన్ని నిర్మించాడు. ఈ సాయిమందిరం ద్వారా వందలాదిమంది సాయిభక్తులు సాయి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ మందిరంలో మందిర ప్రారంభోత్సవాన్ని (ఫిబ్రవరి 19), శ్రీమాధవ్ అడ్కర్ సంవత్సరీకాన్ని (నవంబర్ 18) ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. శ్రీరామచంద్ర అడ్కర్ సుదీర్ఘకాలం జీవించి తన 103వ ఏట తన జన్మతేదీ అయిన మార్చి 4న 2017లో తుదిశ్వాస విడిచారు. చాలా చిన్నవయస్సులో అతడు బాబాను దర్శించినందున అతనికి బాబా ముఖం సరిగా గుర్తులేకపోయినప్పటికీ బాబా పాదాలు మాత్రం తన చివరిరోజులవరకు చాలా స్పష్టంగా గుర్తున్నట్లు అతడు చెప్పేవాడు.
రామచంద్ర అడ్కర్, అతని భార్య మధురాబాయి అడ్కర్ 
సమాప్తం.

Source: మరాఠీ(ఆంగ్లానువాదం సుధీర్) సాయిలీల సెప్టెంబరు-అక్టోబరు 2010,  http://www.saiamrithadhara.com/mahabhakthas/madhavrao_adkar.html

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo