సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 249వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. పదమూడేళ్ల కలను సాకారం చేసిన బాబా 
  2. సోదరునికి ఉద్యోగాన్ని అనుగ్రహించిన సాయి

పదమూడేళ్ల కలను సాకారం చేసిన బాబా 

నా పేరు దీప్తి. నేను బెంగళూరు నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను 2018, డిసెంబరు నుండి క్రమంతప్పకుండా బాబా గుడికి వెళుతున్నాను. అయితే అప్పటికి ఒక నెల ముందు నుండి ప్రతినెలలో ఒక వారం అన్నదానానికి డొనేషన్ కట్టడం మొదలుపెట్టాను. బాబా దయతో అది ఇప్పటికీ కొనసాగుతోంది. నేను బాబా చల్లని నీడలోకి చేరి ఒక సంవత్సరంకన్నా కాస్త ఎక్కువ కాలమయ్యింది. ఈ కాలంలో అడగకుండానే బాబా మా కుటుంబంపై కురిపించిన ప్రేమ అంతులేనిది. బాబా ఇచ్చిన ఆ అపూర్వమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.


13 సంవత్సరాలుగా నా భర్తకు విదేశాలకు వెళ్లే అవకాశం రావాలని మేమంతా ఎంతగానో ఎదురుచూస్తున్నాం. అందుకు తగిన ప్రయత్నం కూడా జరుగుతూ ఉండేది. కానీ మాకు ఆ అవకాశం అందనిద్రాక్షలానే ఉండిపోయింది. 2018, ఆగస్టు నెలలో మాత్రం ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. నేను బాబా గుడికి వెళ్లడం మొదలుపెట్టిన కొన్నిరోజులకి, అంటే 2019, జనవరి 2 గురువారంనాడు మావారికి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అదేరోజు దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా జరిగింది. మరుసటి గురువారం ఇంటర్వ్యూ విజయవంతమైనట్లు తెలియజేస్తూ ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ తరువాత గురువారం వీసా ప్రాసెస్ చేశారు. ఇలా అన్నీ గురువారమే జరగడం బాబా అనుగ్రహమే! చివరిగా జనవరి 29న వీసా ఆమోదించబడింది. అలా బాబా కృపతో నా భర్త సౌదీ అరేబియా వెళ్లి ఫిబ్రవరి 10న ఉద్యోగంలో చేరారు. వాస్తవానికి అది ఆరునెలల కాంట్రాక్ట్ ఉద్యోగం. ఆ గడువు ముగియనుందనగా నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. వ్రతం పూర్తయ్యే లోపల నా భర్త ఉద్యోగాన్ని మరో మూడునెలలు పొడిగించారు. 2019, అక్టోబరు 31తో ఆ గడువు కూడా ముగియడంతో మావారు తిరిగి ఇండియాకి వచ్చారు. మొత్తం మావారు విదేశాలలో 9 నెలలపాటు ఉద్యోగం చేశారు. బాబా ఇచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.


నాలుగేళ్ళక్రితం  2015, అక్టోబరు 24న ఒక పెద్ద ప్రమాదంలో నా నడుము భాగం పూర్తిగా దెబ్బతిన్నది. 2016, ఫిబ్రవరి 23న సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ నడుమును ఏర్పాటు చేశారు. అలాంటి నేను నా భర్త మా దగ్గర లేని ఆ తొమ్మిది నెలల కాలంలో వేరే ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ కేవలం బాబా దయవలన అది సాధ్యమైంది. అంతేకాదు, 'విదేశంలో ఉద్యోగం' అన్న మా కల కూడా కేవలం బాబా అనుగ్రహంతోనే సాకారమైంది. బాబా లేకుంటే జీవితంలో మేము ఈ ఆనందాన్ని అనుభవించేవాళ్ళం కాదు. ఎవరైతే సదా ఆయనపై దృష్టి నిలిపి ఆయన స్మరణ చేస్తూ ఉంటారో బాబా వారి వెన్నంటే ఉండి సహాయం చేస్తారనడానికి నిదర్శనమే నా ఈ అనుభవం అని అనిపిస్తుంది.


తరువాత నవంబరు నెలలో మావారు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. నవంబరు 27వ తేదీ రాత్రి ఏడుగంటల ముప్ఫై నిమిషాల సమయంలో నేను బాబా భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మావారికి మంచి ఉద్యోగం రాబోతుంటే, అందుకు సంకేతంగా రేపు గురువారం (నవంబరు 28) శిరిడీ ప్రసాదం పంపండి" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాని వేడుకోవడమైతే వేడుకున్నానుగానీ 'ఇది జరుగుతుందా?' అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం నేను యథావిధిగా బాబా గుడికి వెళ్లి ప్రసాదం పంచుతున్నాను. 10:30 సమయంలో ఒకాయన వచ్చి శిరిడీ ప్రసాదమని చెప్పి, దూద్ పేడా నా చేతికి అందించి, "అందరికీ పంచమ"ని చెప్పారు. జరిగినదానికి నన్ను నేనే నమ్మలేకపోయాను.  బాబా స్వయంగా నాకోసం ప్రసాదం పంపారు! కొద్దినిముషాలు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంకేతంతో మా ఆయనకి మంచి ఉద్యోగం వస్తుందని ధైర్యంగా ఉన్నాను. ఇది బాబా నాకిచ్చిన మరో అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాలను మీతో పంచుకోవడం మహాదానందమైన అనుభూతిని కలిగిస్తుంది. మా వారికి ఉద్యోగం వచ్చిన వెంటనే బాబా ఆశీర్వాదాన్ని మీ అందరితో పంచుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిభక్తులకు నా నమస్కారాలు. ఓం సాయిరామ్!

సోదరునికి ఉద్యోగాన్ని అనుగ్రహించిన సాయి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు సాధారణ భక్తురాలిని. ఆయనను తలచుకోనిదే నాకు తృప్తి ఉండదు. నాకు శ్రద్ధ ఉంది కానీ సబూరీతో ఉండలేకపోతున్నాను. ఆయనకు నా పరిమితులు తెలుసు కాబట్టి ప్రతీసారి నన్ను క్షమిస్తూ వస్తున్నారు. బాబాకు తనదైన సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వస్తే ఆయన సబూరీ కూడా నాకు ప్రసాదిస్తారు.

నా సోదరుడు బ్యాంక్ పరీక్షలలో విజయం సాధిస్తుండేవాడు, కానీ ఇంటర్వ్యూ వరకు వచ్చేసరికి ఏదో ఒక సమస్య వచ్చేది. ఆ విషయమై నేను 2018, జూన్-జులైలో ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్‌లో బాబాను అడిగాను. "రామనవమి సమీపంలో తనకి ఉద్యోగం వస్తుంద"ని సమాధానం వచ్చింది. రామనవమి అంటే వచ్చే ఏడాది అని నేను నిరాశ చెంది, "బాబా! మీరెందుకు అంత ఎక్కువ సమయం తీసుకుంటున్నారు?" అని అడిగాను. రోజులు గడిచేకొద్దీ నా సోదరుడు తను శాశ్వత ఉద్యోగం పొందగలననే ఆశను కోల్పోతుండేవాడు. బాబా మాటలు అసత్యం కావనే నమ్మకం నాకుండటంతో తనతో, "ఆశను కోల్పోకుండా ధైర్యంగా ఉండమ"ని చెప్పాను. తనకి పూజలపట్ల అంత ఆసక్తి లేకపోయినప్పటికీ నేనొక బాబా విగ్రహాన్ని తనకి పంపించి, ప్రతి ఆదివారం లేదా వీలుకుదిరినప్పుడు బాబాకు అభిషేకం చేయమని చెప్పాను. తను అలాగే చేస్తుండేవాడు. కొన్నిసార్లు తనే చేసేవాడు, కొన్నిసార్లు నేను గుర్తుచేసేదాన్ని. 2019లోకి వచ్చేసరికి తను పూర్తిగా నిరాశకు లోనయ్యాడు. బాబా సమాధానం గురించి నేను ఎప్పుడూ తనికి చెప్పలేదు. కానీ, నేను మాత్రం పూర్తి నమ్మకంతో ఉండేదాన్ని. చివరికి బాబా మాటలు నిజమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుఝామున ఒక బ్యాంకు ఉద్యోగానికి తను ఎంపికైనట్లు సందేశం వచ్చింది. ఆ తేదీకి సమీపంలోనే రామనవమి ఉంది. నా ఆనందానికి హద్దులు లేవు. బాబా దయవలన నేనీరోజు ఆయనకిచ్చిన మాట ప్రకారం ఈ అనుభవాన్ని మీతో పంచుకోగలుగుతున్నాను. "ధన్యవాదాలు బాబా! మీ దయవలన మా తల్లిదండ్రుల టెన్షన్ తీరింది. ఇంకా నాకున్న ఒక కోరిక మీకు తెలుసు. త్వరలోనే మీరు దాన్ని నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. బాబా! దయచేసి నాకు సహనంతో ఉండగలిగే శక్తినివ్వండి". 

3 comments:

  1. dear sai, prasna and jawabulu website address cheppagalara

    ReplyDelete
  2. Om sadguru sainathmaharajuki jai omsairam

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo