సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 730వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎంత దయ సాయికి!
  2. తలచుకున్నంతనే దయ చూపించిన బాబా


ఎంత దయ సాయికి!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబాతో తన అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిబాబాకు, సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. సాయిబాబాకి మా కుటుంబంపై చాలా దయ ఉంది. కానీ ఆ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎలాగంటే... నాకు చిన్నప్పటినుంచి ఆదిదంపతులైన ఆ శివపార్వతులంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మాది చిన్న పూరిల్లు. ఆ ఇంటి తలుపుకి శివపార్వతుల ఫోటో ఒకటి ఉండేది. నేను ఏ పని చేస్తున్నా, బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా ఆ ఫోటోలోని శివపార్వతులకు నమస్కరించి వారితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకసారి మా ఊరిలో సాయిబాబా మందిరం నిర్మించాలని సంకల్పించుకుని భక్తులు చందాల సేకరణ ప్రారంభించారు. అప్పుడు మేము చాలా బీదస్థితిలో ఉన్నాము. రోజుకి కేవలం ఐదు రూపాయలకు మాత్రమే పాలు కొనుక్కునే పరిస్థితి మాది. మా నాన్నగారు రైస్ మిల్లులో పనిచేసేవారు. మా అన్నయ్య సినిమా హాలులో ఆపరేటరుగా పనిచేసేవాడు. భక్తులు మా ఇంటికి చందాకు వచ్చినరోజు పాలకోసం ఉంచిన ఐదు రూపాయలు మాత్రమే ఇంట్లో ఉన్నాయి. వచ్చినవాళ్ళకి ఏమివ్వాలో అమ్మకు అర్థంకాలేదు. అప్పుడు ఆ చందాకి వచ్చినవాళ్ళలో ఒక పెద్దావిడ మా అమ్మతో, “పావలా ఉన్నా ఇవ్వమ్మా, చాలు” అని చెప్పింది. దాంతో ఆరోజు పాలకోసమని ఉంచిన ఆ అయిదు రూపాయలు తీసుకొచ్చి ఆ పెద్దావిడకి ఇచ్చాము. బాబా దయవల్ల ఈరోజు 65 రూపాయలు పెట్టి పాలు కొనుక్కుంటున్నాము. మాకు అంత స్తోమత ఇచ్చింది ఆ సాయిబాబానే.


బాబా మందిరం నిర్మించేటప్పుడు నాకు బాబా అంటే ఎవరో, ఏమిటో ఏమీ తెలియదు. “అబ్బో, సాయిబాబా గుడి అంట, ఎవరు వెళ్తారు?” అన్నాను నేను. కానీ, బాబా మందిరం ప్రారంభించిన రోజు నుంచి ప్రతి కార్యక్రమంలోనూ నన్ను భాగస్వామిని చేశారు బాబా. ఆ మందిరంలో బాబా విగ్రహాన్ని పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారు ప్రతిష్ఠించారు. సాయిబాబా వార్షికోత్సవానికిగానీ, గురుపౌర్ణమికిగానీ, విజయదశమిరోజుగానీ కమిటీ సభ్యులు మందిరానికి వచ్చేవారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ బాబా నా చేత చేయిస్తున్నారు. అప్పుడప్పుడు మందిరంలో సాయిసత్యవ్రతం చేసేవారు. ఆ సమయంలో భక్తులకు ఏమి కావాలో, వ్రతం ఎలా చేయాలో, అందుకు కావలసిన పూజాసామాగ్రి ఎలా అందించాలో, ఏది ఎక్కడ ఉందో, కమిటీవారికి కావలసినవి ఎలా అందించాలో అన్నీ నేనే చూసుకుంటాను. ‘ఎవరు వెళతారు గుడికి’ అన్న నాతోనే అన్నీ తానే చేయించారు బాబా. నా మీద ఎంత దయ సాయికి! “బాబా! నిన్ను తెలుసుకోలేనందుకు నన్ను క్షమించు తండ్రీ!” ఒకసారి గుడిలో బాబాకు పూజ చేసే పెద్దావిడకి సూతకం వచ్చినప్పుడు పదిహేను రోజుల పాటు ప్రతిరోజూ సాయిబాబాకి నేనే పూజ చేసి, అభిషేకాలు చేశాను. ఆరతి పాటలు పాడుతూ నాలుగు ఆరతులు ఇచ్చాను. ఇలా అన్ని సేవలూ బాబా నాతో చేయించుకున్నారు. బాబాకి నేనంటే అంత ప్రేమ. బాబా చూపిన ప్రేమను తలచుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది నేను సాయిబాబాకు చేసిన పూజే.


ఒకసారి బాబా మా కుటుంబాన్ని ఒక ఆపద నుండి ఎలా రక్షించారో వివరిస్తాను. మేము చాలా బీదస్థితిలో ఉన్న రోజుల్లో పడుకోవడానికి మంచం కూడా లేక అందరం క్రిందనే పడుకునేవాళ్ళం. ఒకరోజు మా అమ్మని పాము కరిచింది. తనను ఏదో గట్టిగా కుట్టినట్లు అనిపించి అమ్మ లేచి చూస్తే, పాము. చాలా విషపూరితమైన సర్పం అది. ఈ సంఘటన సుమారు అర్థరాత్రి పన్నెండు, ఒంటిగంట మధ్య జరిగింది. అమ్మ గట్టిగా ‘పాము, పాము’ అని అరవటంతో మా నాన్న లేచి ఆ పామును చంపేశారు. మా అన్నయ్య పాము విషం పైకెక్కకుండా అమ్మ కాలికి తాడుతో గట్టిగా కట్టాడు. నేను కొద్దిగా బాబా ఊదీని అమ్మ నోట్లో పెట్టి, మరికాస్త ఊదీని అమ్మ కాలిమీద రాశాను. ఆ రాత్రి సమయంలో పాము విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇప్పించడం కోసం అమ్మని రిక్షాలో తీసుకువెళ్లారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. కానీ ఆ రాత్రి సమయంలో ఎవరూ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. చివరికి బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయాన్నే ఒక హాస్పిటల్ వాళ్ళు అమ్మను జాయిన్ చేసుకుని విషానికి విరుగుడు ఇంజక్షన్ చేశారు. సాయి అనుగ్రహంతో మూడు రోజుల తర్వాత అమ్మ నార్మల్ అయింది. ఆ రాత్రంతా నేను అమ్మని కాపాడమని బాబాను ప్రార్థిస్తూ, బాబా జీవితచరిత్రలో శ్యామాను పాము కరిచినప్పుడు బాబా అతనిని కాపాడిన లీలను చదువుతూ, సాయికోటి పుస్తకం రాస్తూ ఉన్నాను. మా అమ్మను కాపాడింది ఏ ఇంజక్షనూ, ఏ డాక్టరూ కాదు, కేవలం ఆ సాయిబాబానే! బాబా ఊదీ పెట్టడం వలన, బాబా లీలను చదవటం వలన బాబానే తోడుగా ఉండి మా అమ్మను రక్షించారు. మా అమ్మకు నయమైతే అయ్యప్పస్వామి మాల ధరిస్తానని మా అన్నయ్య మ్రొక్కుకున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబా మా అన్నయ్య చేత 11 సంవత్సరాలు మాలధారణ చేయించారు. “నా భక్తులకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాను” అన్నారు బాబా. మా కుటుంబం విషయంలో అది అక్షర సత్యమైంది. 


గుర్తు తెచ్చుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో విషయాలలో శ్రీసాయిబాబా మా కుటుంబానికి తోడునీడగా ఉండి మమ్మల్ని ఆపదల నుంచి, కష్టాలనుంచి, భయాల నుంచి రక్షిస్తున్నారని తెలుసుకున్నాను. “బాబా! ఎంతో అమోఘమైన మీ కృపను వర్ణించడం నాకు చేతకావట్లేదు. తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి బాబా! ఈరోజు నా తల్లి, తండ్రి, అన్న, నా భర్త, బిడ్డ, నేను ఇలా ఉన్నాము అంటే అది నీ దయే బాబా! అన్నయ్యకి వివాహం విషయంలో చాలా ఆలస్యం అయింది. అనుకూలవతియైన అమ్మాయిని తీసుకువచ్చి మా అన్నయ్య వివాహం జరిపించు బాబా! ఆలస్యం చేసినా అమృతాన్ని, అంటే జీవితాన్ని ఇస్తావనే నమ్మకంతో ఉన్నాము సాయీ. ‘మనుషులు ఇచ్చేది మాసిపోతుంది, దేవుడు ఇచ్చేది జీవితాంతం ఉంటుంది’ అని నమ్ముకున్నవాళ్ళం బాబా. నీ చల్లని చూపు మాపై ప్రసరించి నా కోరిక తీర్చు తండ్రీ! తప్పకుండా ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. బాబా! మేము తెలియక చెడు దారిలో వెళ్తున్నా మీ బిడ్డలుగా మమ్మల్ని నీ మార్గంలో నడిపించు తండ్రీ. మాకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రీ. మా అందరినీ పవిత్రమైన సాయి మార్గంలో నడిపించు బాబా. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ తోడునీడగా ఉండు బాబా. నా మనసులోని చంచలత్వాన్ని తొలగించు, నాకు నీవే దిక్కు సాయీ!” 


ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను, సాయిభక్తుల అనుభవాలను చదువుతూవుంటే ‘అసలు బాబా అంటే ఏంటి’ అనేది తెలుసుకుంటున్నాను. నాకు ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో తెలియక నా మనసులో వచ్చిన ఆలోచనలను మీతో పంచుకున్నాను. తప్పులేమైనా ఉంటే మన్నించండి. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నా మనస్సు చాలా ఆనందంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.


తలచుకున్నంతనే దయ చూపించిన బాబా


సాయిభక్తుడు చంద్రకాంత్ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. బాబా దయవలన నాకు చాలా అనుభవాలు కలిగాయి, కలుగుతూనే ఉన్నాయి. ఇటీవల కలిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఈమధ్య నాకు ఒకసారి తల తిరుగుతూ అదోరకంగా అనిపించింది. దాంతో నాకు చాలా భయమేసి ఆ సాయినాథుని తలచుకొని, "తండ్రీ! ఈ కష్టం నుండి నన్ను కాపాడు. నాకు ఏ ఇబ్బందీ లేకుంటే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. చల్లని తండ్రి, తలచుకున్నంతనే నన్ను ఆ బాధ నుండి బయటపడేశారు. పిలిచిన వెంటనే పలికే నా  సాయినాథుని పాదాలకు శతసహస్రకోటి సాష్టాంగ దండప్రమాణాలు సమర్పించుకుంటూ..  "ఇకముందు కూడా నా వెంటే ఉంటూ నన్ను సమస్యల నుండి కాపాడండి బాబా" అని వేడుకున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 729వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. అడిగినంతనే బాబా చూపిన దయ
  2. బాబా కృపతో దొరికిన బంగారు గొలుసు - చేకూరిన ఆరోగ్యం
  3. కలలో ఇచ్చిన హామీని నిజం చేసిన బాబా


అడిగినంతనే బాబా చూపిన దయ


పేర్లు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి ఆఫీసులో సెలవులు తీసుకుని మేము మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు ట్రైనులో రిజర్వేషన్ దొరకటం కష్టమైంది. చివరికి ఎలాగో రిజర్వేషన్ దొరికింది. అయితే, మేము ట్రైన్ దిగినరోజు రాష్ట్రబంద్ కారణంగా బస్సులు తిరగట్లేదని తెలిసింది. దాంతో ఇంటికి ఎలా చేరుకోవాలా అని చాలా భయమేసింది. రైల్వేస్టేషన్ నుంచి బయటికి వచ్చి బాబాను తలచుకున్నాను. వెంటనే నాకు బాబా మందిరం కనిపించింది. మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా, ఎలాగైనా బస్సు దొరికేలా చూడండి” అని కోరుకున్నాను. బాబా దయవల్ల వెంటనే ఒక ప్రైవేట్ బస్సు దొరికింది. ఆ బస్సు ఎక్కి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. “థాంక్యూ సో మచ్ బాబా!”


మరొక అనుభవం:


నాకు నైట్ షిఫ్టులంటే అస్సలు నచ్చదు. కానీ ఉద్యోగ నిర్వహణలో భాగంగా నైట్ షిఫ్టులు తప్పదు కదా! ఒకరోజు నాకు నైట్ షిఫ్టుకి వెళ్ళటం అస్సలు ఇష్టంలేక, అక్కడ వర్క్ ఉండకపోతే బాగుండు అనుకుని, “బాబా! అక్కడ వర్క్ లేకుండా ఖాళీగా ఉండేలా చూడండి” అని బాబాను కోరుకున్నాను. నిజంగా బాబా అలానే చేశారు. అక్కడ చిన్న వర్క్ కూడా లేదు. అలాగే, ఒకసారి వర్కులో చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఎలాంటి గొడవా జరగకుండా బాబా కాపాడారు. “థాంక్యూ సో మచ్ బాబా! ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి బాబా!”


బాబా కృపతో దొరికిన బంగారు గొలుసు - చేకూరిన ఆరోగ్యం


సాయిభక్తురాలు సుమిత్ర తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. నా పేరు సుమిత్ర. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా అభినందనలు. ఈమధ్యకాలంలో మా అమ్మ బంగారు గొలుసు ఒకటి ఇంట్లో కనపడకుండా పోయింది. ఆ విషయమై అమ్మ దిగులుగా ఉంటుండేది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మ గొలుసు దొరికినట్లయితే సచ్చరిత్ర సప్తాహపారాయణ చేస్తాను. అలాగే నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా కృపవలన నాలుగు రోజుల తర్వాత మా ప్రక్కింటి వ్యక్తి ఆ గొలుసును పోలీస్ స్టేషన్లో మా అమ్మకు అప్పగించారు. "బాబా! మీరు చేసిన సహాయానికి చాలా చాలా ధన్యవాదములు".


మరొక అనుభవం:


ఈమధ్య నాకు ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పుడు నేను, "బాబా! నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ కృపతో నాకు ఆరోగ్యం చేకూరితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా నాపై దయచూపారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. "థాంక్యూ బాబా! మీ భక్తులందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించండి బాబా".


కలలో ఇచ్చిన హామీని నిజం చేసిన బాబా


ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్. నేను 2016 నుండి సాయి భక్తుడిని. సాయి నాకు చాలా అనుభవాలిచ్చారు, ఎన్నో విషయాలు నేర్పించారు. 2019-2020లో జరిగిన నా అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఇది నా హృదయాన్ని బాగా స్పృశించిన అనుభవం.


2019లో నేను ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నాను. నేను నా తల్లిదండ్రులపై ఇంకా ఆధార పడకూడదని అనుకున్నాను. అందువలన కాలేజీ విడిచిపెట్టే సమయానికి నా చేతిలో ఉద్యోగం ఉండాలని ఆశించాను. అయితే నేను సగటు విద్యార్థిని. పైగా మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ఉద్యోగావకాశాలు 2019లో భారీగా పడిపోయాయి. ఒకరోజు నేను సమీపంలోని సాయి మందిరానికి వెళ్లి, "నా కాలేజీ చదువు పూర్తి అయ్యేలోపు నాకొక ఉద్యోగం ఇవ్వమ"ని ప్రార్థించాను. అదేరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో బాబా దర్శనమిచ్చి, "కాలేజీ విడిచిపెట్టే లోపు ఉద్యోగం ఇస్తాన"ని హామీ ఇచ్చారు. రోజులు గడిచిపోయాయి, 2020 జనవరి వచ్చింది. కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఏడు కంపెనీలలో ప్రయత్నించిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాలేదు. దాంతో నేను ఆశను కోల్పోయాను. 'ఆశలు ఆవిరైపోయిన చోట బాబా అద్భుతాలు చేస్తార'ని నేను విన్నాను. అదే నిజమైంది. ప్లేస్‌మెంట్‌లన్నీ ముగిసాయనుకున్న సమయంలో అకస్మాత్తుగా మరో ప్లేస్‌మెంట్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. నేను ఎప్పటిలాగే ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యాను. అయితే పర్సనల్ ఇంటర్వ్యూను నేను మునుపెన్నడూ లేనంత దారుణంగా చేశాను. ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతానన్న ఆశ నాకు అస్సలు లేదు. బాబా ఇచ్చిన హామీ గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి చేరుకున్న మరు నిమిషంలో 'నేను ఆ ఉద్యోగానికి ఎంపిక అయ్యానని, వెంటనే ఆఫీసుకు రమ్మని' ఫోన్ వచ్చింది. అది చాలా ప్రఖ్యాత MNC సంస్థ. నా ఆనందానికి అవధుల్లేవు. నేను నేరుగా బాబా మందిరానికి వెళ్లి, ఆయన  పాదాల మీద పడ్డాను. మరుక్షణంలో నా తలపై ఒక పువ్వు పడింది. అలా బాబా నన్ను ఆశీర్వదించారు. ఆయన తన మాట నిలబెట్టుకోడానికి, తన భక్తుల సంక్షేమం కోసం ఏదైనా చేస్తారని నాకు అర్థమైంది. సాయికుటుంబంలోని సోదర, సోదరిమణులందరినీ బాబా మాటపై పూర్తి విశ్వాసంతో ఉండమని, ఎట్టి పరిస్థితిలోనూ అనుమానపడవద్దని కోరుకుంటున్నాను.


ఓం సాయిరాం!!!


Source : http://www.shirdisaibabaexperiences.org/2020/05/shirdi-sai-baba-miracles-part-2717.html


సాయిభక్తుల అనుభవమాలిక 728వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సందేశం ఎప్పటికీ సత్యం - శ్రద్ధ, సబూరీలు అవసరం
  2. "మీరు ఎక్కడ ఉన్నా నేను మీ వెంటే ఉంటాను!"

బాబా సందేశం ఎప్పటికీ సత్యం - శ్రద్ధ, సబూరీలు అవసరం


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును చక్కగా నిర్వహిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవంలో, బాబా మా తమ్ముడి వైవాహిక జీవితాన్ని ఎలా నిలబెట్టారో తెలియజేయాలనుకుంటున్నాను. మా అమ్మావాళ్ళకు ఆర్థికంగా సమస్యలేమీ లేవు. బాబా దయవల్ల వాళ్ళు బాగానే ఉన్నారు. మా తమ్ముడు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల తనకు సంబంధాలు చూడటం కష్టమయ్యింది. ఆస్తి ఉన్నా పెద్దగా చదువుకోకపోవడం వలన మా నాన్నగారి స్నేహితుడి బంధువుల అమ్మాయిని కట్నకానుకలేమీ తీసుకోకుండా మా తమ్ముడికిచ్చి పెళ్ళిచేశారు. మా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని కూతురికంటే మిన్నగా చూసుకుంటారు. కానీ, పెళ్ళయినప్పటినుంచి మా తమ్ముడు, మరదలి మధ్య ఎప్పుడూ గొడవలే. ఆ అమ్మాయిది సర్దుకుపోయే మనస్తత్వం కాదు. మా తమ్ముడి పరిస్థితీ అదే. దాంతో ఇద్దరూ ప్రతిరోజూ గొడవపడేవారు. గొడవ తీవ్రమైనప్పుడల్లా ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళి ‘ఇంక అత్తగారింటికి తిరిగి వెళ్ళను’ అని గొడవచేస్తుండటం, మా అమ్మావాళ్ళు తనకు సర్దిచెప్పి మా ఇంటికి తీసుకురావడం పరిపాటి అయింది. ఇటీవల సంక్రాంతి పండుగ తరువాత వాళ్ళ ఊరిలో సంబరానికని వెళ్ళి ‘మళ్ళీ తిరిగి రాన’ని గొడవచేసింది మా మరదలు. వాళ్ళకు 9 నెలల వయసున్న బాబు ఉన్నాడు. బాబును వదిలి ఉండలేక మా అమ్మావాళ్ళు బాబు మీద బెంగతో మానసికంగా కృంగిపోయారు. వాళ్ళను చూసి నాకు చాలా బాధగా ఉండేది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. మా నాన్నగారు ఇంటికి రమ్మని ఎన్నిసార్లు నచ్చజెప్పినా మా మరదలి నుండి ‘నేను రాను’ అనే సమాధానమే వస్తూ ఉండేది. విషయం తెలిసిన మా బంధువులంతా, “ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టండి. మీరు ఫోన్ చేయకండి. అప్పుడే ఆ అమ్మాయికి తన తప్పు అర్థమవుతుంది” అన్నారు. కానీ మా అమ్మ ఆరోగ్యం సరిగా ఉండదు. బాబు మీద బెంగతో తను బాధపడుతుంటే చూడలేక నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, “దక్షిణ దిశగా ఉన్న స్నేహితుడి ద్వారా సమస్య పరిష్కారమవుతుంది” అని వచ్చింది. ఈ విషయం నేను మా నాన్నగారికి చెప్పి, తన స్నేహితుడే మధ్యవర్తిగా ఉండటం వల్ల ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడమని చెప్పాను. కానీ ఆ అంకుల్ మాట కూడా మా మరదలు వినలేదు. బాబుకి 9వ నెలలో ద్వారకాతిరుమలలో పుట్టువెంట్రుకలు తీయించాలని ఈ సంవత్సరం(2021) మార్చి 11వ తారీఖున ద్వారకాతిరుమల వెళ్ళటానికి రిజర్వేషన్ చేయించుకున్నాము. పుట్టింటికి వెళ్ళి నెలరోజులు గడిచినా మా మరదలిలో మార్పురాలేదు. ద్వారకాతిరుమలకి వెళ్ళాల్సిన సమయం దగ్గరపడింది. బాబుకి 9వ నెల కూడా పూర్తికావస్తోంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. దాంతో బాబాను మళ్ళీ క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగితే, “పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు, పుణ్యస్థలాలను దర్శిస్తాడు” అని సమాధానం వచ్చింది. ఈసారి నాకు చాలా ధైర్యం వచ్చింది. అమ్మకి ఫోన్ చేసి, “నువ్వు కంగారుపడకు. బాబా మాట ఎప్పుడూ సత్యమే అవుతుంది” అని చెప్పాను. కానీ ద్వారకాతిరుమలకి వెళ్ళాల్సినరోజు దగ్గరకు వచ్చినా ఆ అమ్మాయిలో మార్పు రావడం లేదు. ఈసారి మళ్ళీ బాబాను అడిగితే, “బాబాకు సర్వస్యశరణాగతి చేయి, నీ సమస్య పరిష్కారమవుతుంది” అని సమాధానం వచ్చింది. నేను మా తమ్ముడికి ఫోన్ చేసి, “నువ్వు బాబాను నమ్మకంతో వేడుకోలేదు కదా?” అని అడిగాను. మా తమ్ముడు శివభక్తుడు. అందుకే, “అవును, నేను బాబాను నమ్మలేదు” అని అన్నాడు. అప్పుడు నేను తనతో, “సరే, ఈసారి నువ్వు బాబాను పూర్తిగా నమ్మి, బాబాను శరణు వేడుకుని, 2 రూపాయలు దక్షిణ సమర్పించి రా!” అని చెప్పాను. దాంతో మా తమ్ముడు ఈసారి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా మనస్ఫూర్తిగా బాబాను శరణు వేడుకున్నాడు. నేను కూడా బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు రేపు ఉదయంలోగా ఈ సమస్యకు పరిష్కారం చూపించు తండ్రీ!” అని వేడుకుని పడుకున్నాను. ఉదయం లేవగానే నాకొక ఆలోచన వచ్చింది. నా ఆలోచనను మావారితో చెప్తే ‘అలాచేస్తే బాగానే ఉంటుంది’ అన్నారు. నేను మా నాన్నగారికి ఫోన్ చేసి, “మీ అమ్మాయి రాను అంటోంది కదా, అందువల్ల మా మనవడిని మేము ద్వారకాతిరుమల తీసుకెళ్ళి మ్రొక్కుతీర్చుకుంటాము. మరి మాకు వెంకన్నబాబు మ్రొక్కు తీర్చుకోవడం చాలా ముఖ్యం కదా” అని మా మరదలి తల్లిదండ్రులతో చెప్పమన్నాను. దాంతో మా నాన్నగారు వాళ్ళకు ఫోన్ చేసి నేను చెప్పినట్టే చెప్పి, “మీ అమ్మాయిని అన్ని విషయాలూ మర్చిపోమని చెప్పండి. మేము కూడా జరిగిన గొడవలు మర్చిపోతాము. మీ అమ్మాయి వస్తే మీ అమ్మాయిని కూడా తీసుకువెళతాం. మీరంతా మాట్లాడుకుని నిర్ణయించుకోండి. మేమే మళ్ళీ ఫోన్ చేస్తాము, మీ నిర్ణయమేమిటో చెప్పండి” అన్నారు. బాబా ఏ అద్భుతం చేశారో తెలియదుగానీ కాసేపటి తరువాత వాళ్ళే ఫోన్ చేసి, “మా అమ్మాయి మీతో వస్తానంటోంది, మేము పంపిస్తాము” అని చెప్పారు. వెంటనే మా నాన్నగారు నాతో, “అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. బాబా మాట ఎప్పుడూ అసత్యం కాదు. ఆ అమ్మాయి మాతో రావటానికి అంగీకరించింది. ఇదంతా బాబా అనుగ్రహమే. ఇకనుండి నేను కూడా ప్రతి గురువారం బాబా మందిరానికి వెళతాను. అలాగే, గురువారంరోజున మాంసాహారం తినడం కూడా మానేస్తాను” అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా అమ్మావాళ్ళందరూ శివభక్తులే. వాళ్ళు నేను చెబితేనే బాబా దగ్గరకు వెళతారు. కానీ ఇప్పుడు బాబా మా తమ్ముడికి, నాన్నగారికి కూడా తన మహత్యాన్ని చూపించి తన దగ్గరకు చేర్చుకున్నారు. నేను ఈ రెండు నెలల కాలమంతా శ్రద్ధ, సబూరి అనే రెండు బాబా ఆదేశాలను పాటిస్తూ, సమస్యను తీర్చమని బాబానే మనసారా వేడుకున్నాను. బాబా మా తమ్ముడి సమస్యను తీర్చడమే కాకుండా వాళ్ళను కూడా తన భక్తులుగా చేసుకున్నారు.  బాబా మనకు ఇచ్చిన సందేశం ఎప్పటికీ సత్యమే అవుతుంది. కానీ మనం శ్రద్ధ, సబూరీలతో వేచిచూడాలి.


"మీరు ఎక్కడ ఉన్నా నేను మీ వెంటే ఉంటాను!"

సాయి భక్తురాలు ప్రియాంక వాగ్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.

"మీరు ఎక్కడ ఉన్నా నేను మీ వెంటే ఉంటాను!" అన్న బాబా మాట అక్షర సత్యం. కొన్నిసార్లు ఆయన మనకన్నా ముందుగానే ఆ ప్రదేశాలలో చేరుకున్నట్లు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు ఆయన కోసం వెతికివెతికి చివరికి మనం ఉన్నచోటనే ఆయనను కనుగొంటాము.

అది 2008వ సంవత్సరం. నేను లండన్ లో ఉన్నాను. భారతదేశంలో వాహనాలు, షాపులు మొదలు అన్నిచోట్ల బాబా ఫోటోలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా బాబాకోసం మన కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. ఇది నాకు బాగా అలవాటైంది. కానీ లండన్ లో పరిస్థితి భిన్నమైనది. అక్కడ అందమైన ప్రదేశాలు, సంవత్సరం పొడుగునా రంగులు మార్చే చెట్లు, పెద్దపెద్ద ఆట స్థలాలు, విశాలమైన రోడ్లు, కార్లు, అందమైన భవనాలు, మంచు మొదలైన ఎన్నో అందాలు ఉన్నా బాబా రూపాన్ని నా కళ్ళు చూడలేకపోయాయి. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే నా బాబాకోసం నా మనస్సు చాలా ఆరాట పడసాగింది. ఆయనను మిస్ అవుతున్నానని ఎంతోగానో ఫీల్ అయ్యేదాన్ని. 

ఇలా ఉండగా ఒక ఆదివారంనాడు ఉదయం 10:00 గంటల సమయంలో మేము మా టివి ఆన్ చేసాము. స్క్రీన్ మీద క్లోజ్ అప్ లో తెల్లని కఫ్నిలో బాబాను చూసి ఆశ్చర్యపోయాను. ఆనందంతో గట్టిగా 'బాబా' అని అరిచేసాను. ఆ క్షణం నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. బాబా పలికిన పలుకులు మరింత ముఖ్యమైనవి. "ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు నన్ను తలచుకుంటే, ఏడు సముద్రాలను దాటవలసి వచ్చినా నేను ముందు ఉంటాను" అనే మాటలతో ఆరోజు సీరియల్ ముగిసింది. అది రామానంద్ సాగర్ నిర్మించిన సాయిబాబా సీరియల్. మేము చూసింది బహుశా మొదటి ఎపిసోడ్. నిజానికి మేమెప్పుడూ ఆ సమయంలో టివి ఆన్ చేసింది లేదు. కానీ నా మనసు పడే ఆరాటం తెలిసిన బాబా ఆవిధంగా అనుగ్రహించి, 'నేనెక్కడ ఉన్నా ఆయన నాతో ఉన్నాన"ని భరోసా ఇచ్చారు. ఇక అప్పటినుండి మేము ప్రతి ఆదివారం ఉదయం టీవీకి అతుక్కుపోయే వాళ్లమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతటితో ముగియలేదు. ప్రతి ఎపిసోడ్ ద్వారా బాబా ఆ వారంలో నా మదిలో మెదిలిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుండేవారు. మొదటి కొన్ని వారాలు నేను దాన్ని యాదృచ్చికంగా భావించాను. తరువాత నేను కొన్ని ప్రాపంచిక, ఆధ్యాత్మికపరమైన  ప్రశ్నలను అడగడం ప్రారంభించాను. బాబా ఎప్పుడూ నన్ను నిరాశపరచలేదు. సీరియల్ నాకొక గొప్ప ఆలంబనమైంది. బాబా నా జ్ఞానాన్ని పెంపొందింపజేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఓం సాయిరామ్.


కాకాసాహెబ్ దీక్షిత్ - మూడవ భాగం...



బాబా అద్భుత బోధనా పద్ధతి:

ఒకసారి, వేదాంత తత్త్వశాస్త్ర గ్రంథాలలో సంసారం (ప్రాపంచిక జీవితం) గురించిన వర్ణనను చదివినప్పుడు అందులో చెప్పబడ్డ త్రాడు-పాము, ఎండమావి-నీరు, బంగారం-ఆభరణం, మట్టి-మట్టిపాత్రలు వంటి దృష్టాంతాలు ఒకేరకమైనవి కావని దీక్షిత్‌కి అనిపించింది. చీకటిలో త్రాడు పాములా కనిపిస్తుంది; ఎండమావిలో ఇసుకమీద తేలియాడే ఆవిరి దూరంనుంచి నీరులా కనిపిస్తుంది; ఇకపోతే స్వర్ణకారుని దెబ్బలకు బంగారం ఆభరణంగా మారుతుంది; కుమ్మరి తన నైపుణ్యంతో మట్టికి ఆకృతినిచ్చినప్పుడు మట్టిపాత్ర తయారవుతుంది. మొదటి రెండింటిలో - లేనిది ఉన్నట్లుగా కనపడితే, చివరి రెండింటిలో - ఉన్నది వివిధ ఆకృతుల్లో కనపడుతుంది. ఈ విభిన్నమైన దృష్టాంతాలు ఒకే ప్రాపంచిక జీవితానికి ఎలా వర్తిస్తాయో అర్థంకాక దీక్షిత్ చాలా కలవరానికి గురయ్యాడు. ఎంత ఆలోచించినా ఒక సంతృప్తికరమైన నిర్ణయానికి రాలేకపోయాడు. ఒకరోజు అదేమిటో తెలుసుకోవాలని దీక్షిత్ తీవ్రంగా ఆరాటపడుతున్న తరుణంలో, ‘తమకు 100 రూపాయలు కావాల’న్న బాబా సందేశంతో ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో దీక్షిత్ వద్ద కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అతను ఆ విషయాన్నే కబురు తెచ్చిన వ్యక్తికి తెలియజేసి, తన నమస్కారాలనే బాబాకు అందజేయమని చెప్పి పంపించాడు. ఆ వ్య్వక్తి అలా వెళ్ళగానే, 'ఎవరి వద్ద ఎంత ధనముందో అంతర్‌జ్ఞాని అయిన బాబా స్పష్టంగా తెలుసుకోగలరు. ఇక్కడ ఎవరి వద్దా 100 రూపాయలు లేవని వారికి తెలుసు. కాబట్టి నా మనసులో తలెత్తిన సందేహానికి 100 సంఖ్యతో ఏదో సంబంధం ఉండివుండాలి' అని దీక్షిత్‌కి అనిపించింది. వెంటనే అతను బాబా పటం ముందు నిలబడి తనకు మార్గనిర్దేశం చేయమని బాబాను ప్రార్థించాడు. బాబాను ప్రార్థించిన ఐదు నిమిషాల్లో అతనికి 100 సంఖ్యలోని అర్థం ఈ విధంగా స్ఫురించింది: 

“బాబా కోరిన '100' సంఖ్య సంసారానికి (జగత్తుకి) సంకేతం. '100' అంటే 1 ప్రక్కన రెండు సున్నాల చేరిక. అదేవిధంగా జగత్తు యొక్క ఉనికి. '100' సంఖ్యలో '1' పరబ్రహ్మతత్త్వానికి ప్రతీక కాగా, ప్రక్కనున్న రెండు సున్నాలు నామరూపాలతో కూడుకున్న జగత్తుకు ప్రతీకలు. '100' సంఖ్యలో 1 వలననే ప్రక్కనున్న సున్నాలకు విలువ. అలాగే నిత్యసత్యమైన పరబ్రహ్మ(1) వలననే భ్రమపూరితమైన నామరూప జగత్తుకు(00) ఉనికి. అంటే, పరబ్రహ్మ లేకుండా జగత్తుకు అస్తిత్వం లేదు. '100' సంఖ్యలో రెండు సున్నాలు లేకపోయినా ఒకటికి వచ్చిన ప్రమాదంగానీ, హానిగానీ లేదు, దాని అస్తిత్వం నశించదు. అలాగే నామరూప జగత్తు లేకున్నా వాటికాధారమైన పరబ్రహ్మతత్త్వం నిత్యమూ ఉంటుంది. అజ్ఞానం(చీకటి) వలన సత్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని అసత్యమైన నామరూప జగత్తు ఆవరించి త్రాడు పాముగా భ్రమింపజేసినట్లు, లేని జగత్తు ఉన్నట్లుగా గోచరిస్తుంది. నామ, రూపాలు భ్రమలు మాత్రమే, అవి కేవలం కనిపిస్తాయి. అంటే త్రాడు-పాము, ఎండమావి-నీరు ఉదాహరణలలో పాము, నీరు నామ, రూపాలవలె భ్రమలు మాత్రమే. ఇకపోతే బంగారం-ఆభరణాలు, మట్టి-మట్టిపాత్రలు ఉదాహరణలలో మూలపదార్థమే ఆయా రూపాలకు ఆధారం. అలాగే జగత్తుకు ఆధారం పరబ్రహ్మతత్త్వం. అందుకే వేదాంతం ఈ జగత్తు లేదనదు. జగత్తు అనే నామరూపాలు నశిస్తాయనీ, వాటికాధారమైనది నిత్యమనీ చెబుతుంది”.

దాంతో కాకాసాహెబ్ సందేహం తీరి, పై రెండు రకాల దృష్టాంతాలలో పరస్పర విరుద్ధత లేదనీ, అవి రెండూ జగత్తుకు అన్వయించవచ్చనీ అవగతమైంది. దీక్షిత్‌కు సందేహం కలగడం, వెంటనే బాబా 100 రూపాయలకోసం కబురుపెట్టడం,  అతను అర్థం స్ఫురింపజేయమని బాబా పటం ముందు ప్రార్థించడం, వెంటనే అతనికి అర్థం బోధపడటం గమనించినట్లయితే కాకాసాహెబ్ సాధనంతటినీ బాబా తామై నడిపిన వైనం మనకు అవగతమవుతుంది.

మరోసారి కాకాసాహెబ్ దీక్షిత్, బాలాసాహెబ్ భాటేలు ఏకనాథ భాగవతంలోని రెండవ అధ్యాయం పారాయణ చేస్తుండగా బాపూసాహెబ్ బూటీ బాబా వద్దనుండి ఒక సందేశం తీసుకొని అక్కడికి వచ్చాడు. అదేమిటంటే, “దీక్షిత్ వద్దనుండి పదహారున్నర రూపాయల దక్షిణ తీసుకొనిరమ్మ”ని, అలాగే “అక్కడ కూర్చొని దీక్షిత్ చదువుతున్న ఏకనాథ భాగవతం విని రమ్మ”ని. అప్పుడు కూడా దీక్షిత్ వద్ద బాబా ఒక గురుపౌర్ణమినాడు ఇచ్చిన ఒక రూపాయి తప్ప మరే డబ్బులు లేవు. అందువల్ల దీక్షిత్ ఆశ్చర్యపోతూ, 'సర్వాంతర్‌జ్ఞాని అయిన బాబాకు నా వద్ద ఎంత డబ్బు వుందో తెలుసు. అయినా కూడా పదహారున్నర రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని పంపారంటే, ఇందులో ఏదో మర్మం దాగి ఉంద’ని అనుకున్నాడు. అతను తన గ్రంథపఠన కొనసాగించాడు. బూటీ అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఈ క్రింది శ్లోకం వచ్చింది.

  "కాయేన వాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్,
   కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి"

భావం: నా శరీరం, వాక్కు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు మరియు ప్రకృతి ద్వారా జరిగే సమస్త కర్మలను ఆ నారాయణునికి సమర్పిస్తున్నాను.

ఆ శ్లోకంపై ఏకనాథ మహరాజ్ చేసిన విస్తృతమైన, బోధనాత్మకమైన వ్యాఖ్యానాన్ని పఠించడం పూర్తవుతూనే బాబా బూటీని పిలుస్తున్నారన్న వార్త తీసుకొని ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. దాంతో ఆ శ్లోకానికి, బాబా అడిగిన పదహారున్నర రూపాయలకు ఏదో సంబంధం ఉండివుంటుందని దీక్షిత్‌కి బలంగా అనిపించింది. వెంటనే ఆ శ్లోకంలో చెప్పబడ్డ తత్త్వాలను లెక్కించసాగాడు. శరీరం(1), వాక్కు(1), మనస్సు(1), బుద్ధి(1), అహంకారం(1), ఇంద్రియాలు(10) మరియు ప్రకృతి(½). మొత్తం 15½. కానీ బాబా అడిగింది 16½. కాబట్టి మిగిలిన ఒక రూపాయి గురించి కూడా అందులోనే ఉండివుంటుందని అతనికి అనిపించి ఏకనాథుని వ్యాఖ్యానాన్ని మళ్ళీ శ్రద్ధగా పరిశీలించినప్పుడు, ఆ శ్లోకంలో చిత్తం గురించి అసలు ప్రస్తావించనప్పటికీ, చిత్తాన్ని కూడా కలిపి ఏకనాథుడు చక్కటి వివరణ ఇచ్చినట్లు గుర్తించాడు. దాన్ని కూడా పైన అతను లెక్కించిన మొత్తం 15½ కి జోడించినట్లైతే 16½ అవుతుంది. ఆ 16½ తత్త్వాలను భగవంతుడికి అర్పించడమే 16½ రూపాయల దక్షిణ అడగటంలోని బాబా ఉద్దేశ్యం అని దీక్షిత్ గ్రహించాడు.

అయితే, ‘బాబా 16 రూపాయలు కాకుండా 16½ రూపాయలు ఎందుకు అడిగారు? ప్రత్యేకించి ½, అంటే ప్రకృతికి బాబా ప్రాధాన్యతనివ్వడంలో కారణమేమైంటుందా?’ అని దీక్షిత్ లోతుగా ఆలోచించగా, ఏదో ప్రత్యేక సూత్రంపై తన దృష్టిని కేంద్రీకరించమని చెప్పడం బాబా ఉద్దేశ్యంగా అతనికి తోచింది. దాంతో అతను ఏకనాథుని వ్యాఖ్యానాన్ని మళ్ళీ శ్రద్ధగా పరిశీలించాడు. అప్పుడు, ఎటువంటి ప్రయోజనాన్నీ ఆశించక ప్రకృతి సిద్ధంగా జరిగే కర్మలను, అంటే ఏవైతే భగవంతునికి అర్పించడం కష్టమో వాటిని భగవంతునికి అర్పించే మార్గం గురించి ఏకనాథుడు చెప్పినట్లు గుర్తించాడు. నిజానికి ఎరుకతో ఇంద్రియాల ద్వారా జరిగే కర్మలను భగవంతునికి అర్పించడం సాధ్యమవుతుంది, కానీ మన ప్రమేయం లేకుండా స్వభావసిద్ధంగా జరిగే కర్మలు, అంటే కనురెప్పలు వాల్చడం, ఉచ్ఛ్వాసనిశ్వాసాల వంటి వాటిని ఎలా అర్పిస్తాము? దానిగురించి ఏకనాథుడు, "కర్మ చేసి భగవంతునికి అర్పిస్తున్నానని అనుకొనే బదులు, ‘ఆ కర్మలను భగవంతుడే చేయిస్తున్నాడు, నేను ఒక ఉపకరణాన్ని మాత్రమే’ అని భావించడం మంచిద"ని పేర్కొన్నాడు. అంటే, ఒక ఉద్యోగి తనకు సొంతంకాని తన యజమాని యొక్క కోట్ల రూపాయల వ్యాపారంలో నిమగ్నమైనట్లుగా, ‘నా ద్వారా జరిగే చర్యలన్నీ భగవంతునివి’ అని భావించడమన్నమాట. ఈ రకమైన భావాన్ని పెంపొందించుకుంటే కోరికలులేని స్థితి, నిస్వార్థ గుణం వృద్ధి చెందుతాయి. అప్పుడు కర్మ ఎరుకతో జరిగినా, ఎరుక లేకుండా స్వభావసిద్ధంగా జరిగినా ప్రతిదీ ప్రత్యేకించి భగవంతునికి అర్పించాల్సిన అవసరం లేదు. అవి సహజంగానే భగవంతునికి అర్పితమవుతాయి. ఈ విధంగా తనను 16½ రూపాయలు దక్షిణ అడగటంలోని బాబా ఉద్దేశ్యాన్ని అవగతం చేసుకున్నాడు దీక్షిత్.

వైరాగ్యం:

ప్రాపంచిక జీవితంలో మనిషికి సంపదల పట్ల ఉండే వ్యామోహం ఎంత నిరర్థకమైనదో, ఒక సామాన్య సాధకుడు ఎంత నిరాడంబరంగా జీవించాలో తమ ఆదర్శ జీవిత విధానము మరియు బోధనల ద్వారా దీక్షిత్‌కు తెలియజేశారు బాబా. ఒకసారి దీక్షిత్ ఒక ఆవుని కొన్నాడు. అప్పుడు బాబా, "ఈ ఆవు ఒకప్పుడు జాల్నాలోని ఒక పెద్దమనిషిది. అంతకుముందు ఔరంగాబాదుకి చెందిన వ్యక్తిది. ఇంకా ముందు అది మహల్సాపతిది. నిజానికది ఎవరి సొత్తో భగవంతునికే ఎరుక" అని అన్నారు. అలా చెప్పడం ద్వారా సంపద అశాశ్వతమైనదనీ, అది ఎప్పుడూ చేతులు మారుతూ దాని రూపు మార్చుకుంటూ ఉంటుందనీ, కాబట్టి సంపద పట్ల నిర్లిప్తంగా ఉండాలనీ బాబా పరోక్షంగా బోధించారు. బాబా చెప్పిన మాటలు ‘ఈశావాస్య ఉపనిషత్తు’లోని క్రింది శ్లోకానికి సరిపోతాయి.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్।
తేన త్యక్తేన భుంజీతా మా గృధా కస్య స్విత్ ధనమ్||

అర్థం: ఈ ప్రపంచంలోని ఏ వస్తువైనా భగవంతునిచే ఆవరించబడి ఉన్నది. వాటిని అపేక్షించక పరిత్యజించి సంతోషంగా ఉండు. సంపద ఎవరిది? నీదిగాని, ఇతరులదిగాని సంపదను కోరుకోకు. సంపద ఎప్పుడూ చేతులు మారుతూ దాని రూపు మార్చుకుంటుంది. అది శాశ్వతం కాదు. కాబట్టి ఆనందాన్ని పొందడానికి సంపదను (ఆత్మనుండి)దూరంగా ఉంచాలి. సంపదలన్నీ వస్తూ పోతూ('ఆగమాపయినః') ఉంటాయని గుర్తించి, వాటి పట్ల నిర్లిప్తంగా ఉండాలి.

తన సద్గురువైన బాబా పట్ల భక్తి ప్రేమలతో పాటుగా దీక్షిత్‌లో వైరాగ్య భావనలు కూడా క్రమంగా వృద్ధి చెందసాగాయి. ముఖ్యంగా బాబా తన బాధ్యతలన్నీ స్వీకరించాక సంపాదన పట్ల, దాని సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం, సమయాన్ని, శక్తిని వెచ్చించడం ఎంత నిరర్థకమో అతను గ్రహించాడు. బాబా దగ్గరకు వచ్చిన తొలినాళ్ళలో దీక్షిత్‌కు పెద్దమొత్తంలో డబ్బు వస్తుండేది. ఒకసారి దీక్షిత్ శిరిడీ వచ్చినప్పుడు ఒక ట్రంకుపెట్టె నిండా రూపాయి నాణేలను (సుమారు వేయిరూపాయలు ఉండవచ్చు) తీసుకొచ్చి, దానిని బాబా ముందు ఉంచి, పెట్టెను తెరచి డబ్బును చూపిస్తూ, "బాబా! ఈ డబ్బంతా మీదే" అని అన్నాడు. బాబా, "అవునా!" అంటూ తమ రెండు చేతులను ఆ పెట్టెలో పెట్టి, దోసిలితో ఆ నాణేలను తీసి, డబ్బుకోసం ఈగల వలె తమ చుట్టూ చేరినవారికి పంచిపెట్టసాగారు. కొన్ని క్షణాల్లోనే ఆ ట్రంకుపెట్టె ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న దీక్షిత్ స్నేహితుడు, సబ్ జడ్జి అయిన గార్డే ఇలా చెప్పాడు: "కష్టపడి సంపాదించిన ధనాన్ని బాబా చకచకా పంచేస్తున్న సమయమంతా నేను దీక్షిత్ ముఖంలోని భావాలను నిశితంగా గమనిస్తూ ఉన్నాను. అతని స్థానంలో ఇంకెవరయినా ఉంటే అంత డబ్బును నష్టపోతున్నందుకు ఎంతో బాధపడేవారు. కానీ దీక్షిత్ ఏ మాత్రమూ చలించలేదు".

మొదటిసారి శిరిడీ దర్శించేనాటికి దీక్షిత్ బొంబాయిలో ప్రఖ్యాత న్యాయవాదిగా ఉన్నతస్థితిలో ఉన్నాడు. ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేనిది అతను కేవలం 15 సంవత్సరాలలో సాధించాడు. దాదాపు బాబాతో అనుబంధం ప్రారంభమైనప్పటినుండి అతను తాను ఆశ్రయించాల్సింది వారి పాదాలనేనని గుర్తించి వారి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలని తపించాడు. అందువల్ల వీలైనంత తరచుగా శిరిడీ దర్శిస్తూ ఎక్కువ సమయాన్ని బాబా దివ్యసన్నిధిలో గడుపుతుండేవాడు. దాంతో అతని న్యాయవాద ప్రాక్టీస్ దెబ్బతినసాగింది. అప్పుడప్పుడు బాబా అతనితో, “ప్రాక్టీస్ వదులుకోవద్దు, బొంబాయి వెళ్లి ప్రాక్టీస్ కొనసాగించు" అని చెబుతుండేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించి బొంబాయి వెళ్లినప్పటికీ దీక్షిత్ మనసు మాత్రం శిరిడీలో బాబా వద్దనే ఉండేది. అందువలన త్వరలోనే అతను తిరిగి శిరిడీ చేరుకొనేవాడు. అతనొకరోజు బాబాతో, "బాబా! భగవంతుడు నాకు చాలినంత సంపదనిచ్చాడు. తిండికి లోటులేదు. మరి నేనెందుకు ఈ ప్రాపంచిక బంధనాలలో ఉండాలి? నా అదృష్టం కొద్దీ శిరిడీలో మీ సన్నిధిలో నివసించే అవకాశం దక్కింది. శిరిడీ వంటి స్వర్గ సుఖాన్ని వదులుకొని ఏ నరకానికీ వెళ్లాలని నాకు కోరిక లేదు. నేను నా సొలిసిటర్ బిజినెస్‌ను మూసివేసి శాశ్వతంగా ఇక్కడే నివాసముండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. బాబా ఎంతో మృదుమధురంగా, "కాకా! వ్యాపారాన్ని (సొలిసిటర్ బిజినెస్) మూసివేయాల్సిన అవసరమేముంది?" అని అడిగారు. అందుకతను, "బాబా! నా వృత్తిలో నేను సత్యాన్ని అసత్యాలుగా, అసత్యాన్ని సత్యాలుగా వక్రీకరించి చెప్పాలి. అసలు అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేయాలి?" అని అడిగాడు. అందుకు బాబా, "ఇతరులు వాళ్ళకు నచ్చింది చేయనీ. కానీ మనమెందుకు అలా చేయాలి? నువ్వు ఎటువంటి తప్పులూ చేయకుండా నిజాయితీగా నీ వృత్తిని నిర్వర్తించు. అంతేగానీ వ్యాపారాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు" అని అన్నారు. బాబా చెప్పినట్లే దీక్షిత్ తన వ్యాపారాన్ని కొనసాగించాడు.

కానీ సంవత్సరంలో ఎక్కువకాలం శిరిడీలోనే ఉంటూ బాబాను హృదయపూర్వకంగా సేవించుకుంటూ ఉండేవాడు. అలా ఎక్కువ సమయాన్ని బాబా సన్నిధిలో గడుపుతుండటం వలన ప్రాపంచిక అనుబంధాలు, వ్యవహారాల పట్ల ఆసక్తి సన్నగిల్లి శిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు దీక్షిత్. దానివలన తన ప్రాపంచిక వ్యవహారాలలో ఎటువంటి పర్యవసానాలు ఎదురైనా అతను లెక్కచేయదలచుకోలేదు. వృత్తిపట్ల శ్రద్ధ మందగించడంతో ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. ఫలితంగా సొలిసిటర్ బిజినెస్‌లో అతని భాగస్వాములైన బహదూర్ ఎస్.నారాయణదాసు, ధన్‌జీ షాలు భాగస్వామ్యం నుండి తప్పుకున్నారు. దాంతో దీక్షిత్ క్రొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన పురుషోత్తంరాయ్ మార్ఖడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాడు. కానీ తరచూ దీక్షిత్ బొంబాయిలో లేకపోవడం, వృత్తిపట్ల ఆసక్తి చూపకపోవడం వలన అతను కూడా భాగస్వామ్యం నుండి వైదొలిగాడు. తొందరలోనే మాణిక్‌లాల్ మొదలైనవారు కూడా భాగస్వామ్యం నుంచి తప్పుకొని దీక్షిత్‌ని ఒంటరివాడిని చేశారు. దాంతో న్యాయవాదవృత్తి ద్వారా అతనికి వచ్చే రాబడి ఎంతగానో తగ్గిపోయింది. 1911వ సంవత్సరం నుండి అతని ఆదాయం శూన్యమైంది. అవధులు లేని అతని ఔదార్యం, అతిథి సత్కారాల వలన బొంబాయి, విల్లేపార్లే, లోనావాలాలలో ఉన్న మూడు ఇళ్ళు మినహా మిగతా సంపదంతా కరిగిపోయింది. చివరికి 1912లో దీక్షిత్ తన లాభదాయకమైన ప్రాక్టీసుని మూసివేయడంతో అతనిని ఆదర్శంగా భావించేవాళ్లు, స్నేహితులు, పరిచయస్థులు అందరూ ఆశ్చర్యపోయారు. 'సాయిబాబా అనే ఫకీరు అతనిని వశం చేసుకొని శిరిడీకి లాగి వెర్రివాడిని చేశాడ'ని చాలామంది అనుకోసాగారు. ఆ విమర్శలను దీక్షిత్ అస్సలు పట్టించుకోలేదు. లాభదాయకమైన ప్రాక్టీసును, సామాజికంగా, రాజకీయంగా మంచి గుర్తింపును కోల్పోయినప్పటికీ ఎటువంటి భయాలు, ఆందోళనలు, చింతలు లేకుండా అతను నిశ్చింతగా శిరిడీలో ఉండసాగాడు. సాధారణంగా, ఉన్న సంపదంతా ఊడ్చిపెట్టుకొనిపోయి డబ్బుకు కొరత ఏర్పడితే ఎవరికైనా మనసు కుదేలై, దురదృష్టంగా తలచి ఎంతో దుఃఖానికి లోనవుతారు. కానీ దీక్షిత్ విషయం అలా కాదు. న్యాయస్థానాలకు, సమాజానికి, ప్రజాసంబంధిత కార్యాలకు దూరంగా ఉండటం తన జీవితాన్ని నిస్తేజంగా, నిస్సారంగా చేసినప్పటికీ అతను భాగవతంలోని 27వ అధ్యాయం, పదవ స్కంథంలో, "నేను అనుగ్రహించదలచినవారి సంపదలు హరిస్తాను" అని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకొని, సంపదతో సంక్షేమం, సుఖంతో ఆనందం ముడిపడి ఉందన్న పెద్ద భ్రాంతిని తొలగించి ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిని, అంటే సద్గతిని ప్రసాదించేందుకు సద్గురువు తనకు శిక్షణనిస్తున్నారని తలచాడు. కాబట్టి, సహజంగానే సరళమైన జీవనశైలిని కలిగిన అతను విలాసవంతమైన జీవనాన్ని, అనవసరమైన ఖర్చులను విడిచిపెట్టి, చాలావరకు తన అవసరాలను తగ్గించుకుని అతి నిరాడంబరమైన జీవితాన్ని గడపసాగాడు. సాయిబాబాపట్ల అతనికున్న భక్తివిశ్వాసాలు అటువంటివి.

దీక్షిత్ అంతలా బాబాకు ఆకర్షితుడవడానికి, దీక్షిత్ బాధ్యతలన్నీ బాబా స్వీకరించడానికి అతనికి బాబాతో ఉన్న ఋణానుబంధమే కారణం. ఆ విషయాన్ని బాబానే స్వయంగా చెప్పగా జి.ఎస్.ఖపర్డే తన ‘శిరిడీ డైరీ’లో వ్రాసుకున్నాడు. ఒకరోజు బాబా ఖపర్డేతో, "పూర్వజన్మలో నువ్వు, నేను, కాకాసాహెబ్ దీక్షిత్, షామా, బాపూసాహెబ్ జోగ్ మరియు దాదాకేల్కర్ ఒకే వీధిలో మన గురువుతో కలిసి నివసించేవాళ్ళము. అందుకే ఈ జన్మలో మీ అందరినీ ఒకచోటికి చేర్చాను" అని చెప్పారు. మరో సందర్భంలో, ప్రాపంచిక కోరికలతో బాబా వద్దకు వచ్చే భక్తులను నిరసిస్తూ, “శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థించాలిగానీ, తుచ్ఛమైన ప్రాపంచిక కోరికలతో ఆశ్రయించకూడదు” అని హితవు చెబుతున్న దామోదర్ సావల్రాం రాస్నే అనే భక్తునితో బాబా, “అలా అనవద్దు. నాకు సంబంధించినవారు మొదట అలాంటి కారణాలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక, నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి రకరకాల మిషలమీద నేనే నా భక్తులను నా చెంతకు రప్పించుకుంటాను. వారెంత దూరాన ఉన్నా సరే, నేనే వారిని నా వద్దకు చేర్చుకుంటాను. ఎవరూ వారంతటవారుగ నా దగ్గరకు రారు” అని చెప్పారు. తమను బాబానే వారి వద్దకు లాక్కుంటున్నారన్న వాస్తవంగానీ, ఆ లాగడం వెనుకనున్న కారణంగానీ తెలియకపోయినా భక్తులు బాబాను ఆశ్రయిస్తారు. ఎక్కువమంది ప్రాపంచిక కష్టాల నుండి ఉపశమనం కోసమే భగవంతుని లేదా గురువుని ఆశ్రయిస్తారు. బాబాను ఆశ్రయించడానికి దీక్షిత్‌కి కూడా తన కాలి కుంటితనమే మూలకారణమైంది. కారణమేదైనా, సృష్టిలోని అన్ని జీవులపై, విషయాలపై బాబాకున్న అద్భుతమైన అధికారము, వేలాదిమందికి ప్రయోజనం చేకూర్చే వారి విలక్షణమైన ప్రేమ దీక్షిత్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూర్వజీవితంలో దత్తమహరాజ్ అనే సాధువుతో ఉన్న పరిచయం మరియు బాబా యొక్క స్వభావం, వారి అద్భుతశక్తి వారిని సమర్థ సద్గురువుగా గుర్తించేందుకు దీక్షిత్‌కి దోహదమయ్యాయి. ఫలితంగా అతను తనంతట తానే బాబాను తన గురువుగా భావించాడు. అయితే బాబా ఎన్నడూ తమను తాము గురువుగా ప్రకటించుకోలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన దీక్షిత్‌తో తమ గురుత్వాన్ని, అద్భుతమైన దాని స్వభావాన్ని చెప్పకనే చమత్కారంగా చెప్పారు. ఒకసారి దీక్షిత్ తదితరులు బొంబాయి వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు బాబా వాళ్లతో, “మీరు వెళ్ళవచ్చు” అని చెప్పారు. అక్కడే ఉన్న వేరొక భక్తుడు, "బాబా! ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. అందుకు బాబా, “పైకి!”, అంటే ‘భగవంతుని వద్దకు’ అనే నిగూఢమైన భావం వచ్చేలా పారమార్థిక పంథాలో బదులిచ్చారు. అందుకు ఆ భక్తుడు, "మార్గమేమిటి?" అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, "చాలాచోట్ల నుండి చాలా మార్గాలున్నాయి" అని చెప్పి, "ఇక్కడ (శిరిడీ లేదా మశీదు) నుండి కూడా ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గమంతా అవరోధాలు ఉన్నాయి. మార్గమందు పులులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే లోతైన అగాధాల్లో పడిపోయే ప్రమాదముంది" అని అన్నారు. అప్పుడు దీక్షిత్ బాబాను, "మార్గదర్శి తోడుంటేనో?" అని అడిగాడు. "అలాగైతే ఎటువంటి కష్టమూ, ప్రమాదమూ లేదు. పులులు, ఎలుగుబంట్లు ప్రక్కకు తప్పుకుంటాయి" అని బాబా చెప్పారు. ఈ విధంగా భగవంతుని చేరుకోవాలనుకునేవారు శిరిడీ నుండి కూడా తమ లక్ష్యాన్ని సాధించగలరని బాబా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, తమనాశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చునని పరోక్షంగానైనా బాబా చెప్పిన అతికొద్ది సందర్భాలలో ఇదొకటి. దానిని పొందే భాగ్యం దీక్షిత్‌కే లభించింది.

source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి, శ్రీసాయిబాబా బై వి.బి.ఖేర్.
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

సాయిభక్తుల అనుభవమాలిక 727వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబాను ప్రార్థిస్తే మనల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తారు
  2. బాబాను ప్రార్థించినంతనే విజయవంతమైన కోడ్

బాబాను ప్రార్థిస్తే మనల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తారు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే బాబా నాకు సమాధానం చెప్తున్నట్లు నాకు ఎన్నోసార్లు అనుభూతమైంది. నేను ఇదివరకు కూడా ఈ బ్లాగులో నా అనుభవాలను కొన్నిటిని పంచుకున్నాను. ఇప్పుడు బాబా మాకు ప్రసాదించిన మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను. మేము విదేశాలలో ఉంటున్నాము. మావారు డాక్టరుగా పనిచేస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం సెలవులు ఇస్తారు. ఒకసారి మావారు “ఈ డిసెంబరు నుండి మనం కొద్ది రోజులు సెలవులు తీసుకోవచ్చు” అని చెప్పారు. అప్పటినుంచి నేను, “అయితే ఈ డిసెంబరు నుండి సెలవులు తీసుకోండి. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల ఎలాగూ ఇండియాకి వెళ్ళలేము. అందువల్ల ఈ సెలవులలో ఇక్కడే చక్కగా పిల్లలతో ఆనందంగా గడపవచ్చు” అని తనను చాలా బలవంతపెట్టేదాన్ని. కానీ మావారు మాత్రం డిసెంబరులో తీసుకోకుండా ఫిబ్రవరిలో సెలవులు తీసుకున్నారు. తను సెలవులు తీసుకున్న రెండవరోజే నేను క్రిందపడటం వల్ల మోకాలికి బాగా దెబ్బ తగిలింది. ఒక ఆర్థోపిడీషియన్‌కి ఫోన్ చేసి విషయం చెబితే, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. దాంతో నేను, “ఏంటి బాబా ఇలా జరిగింది? దేశంకానిదేశంలో చిన్నపిల్లలతో ఇలాంటి సమస్యేంటి?” అని చాలా బాధపడ్డాను. అప్పుడు ఒక సాయిభక్తురాలి ద్వారా “తగ్గుతుంది” అని సమాధానమిచ్చారు బాబా. అయినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి 11.30 గంటలకి హాస్పిటల్‌కి వెళ్ళాము. (ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ట్రీట్‌మెంట్ వెంటనే కావాలంటే ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అక్కడ కోవిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు.) అక్కడ నా కాలికి ఎక్స్-రే తీసి, “ఫ్రాక్చర్ ఏమీ లేదు, కానీ సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీ ఏమైనా ఉండవచ్చు, ఒక వారంలో నొప్పి తగ్గకపోతే MRI స్కానింగ్ చేయాల్సివుంటుంది” అని చెప్పారు. దాంతో నాకు ఆందోళన మొదలైంది. “ఏంటి బాబా నాకు ఈ బాధ?” అని నేను బాబా వద్ద ఎంతో ఏడ్చాను. తరువాత ఈ బ్లాగ్ ఓపెన్ చేయగానే బాబా ఇలా సమాధానం చెప్పారు: “నీవు ధైర్యం వదలకు. ఏమీ చింతపడకు. నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంటిలో కూర్చో. నిర్భయంగా, నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసముంచు” అని. బాబా సందేశం చూసేసరికి ఒక్కసారిగా నేను ఏడుపు ఆపేసి, “ఇది బాబా నాకే చెప్తున్నార”ని ధైర్యం కలిగింది. ఇక కాలికి కట్టుతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒక వారమైనా నొప్పి తగ్గకపోయేసరికి MRI తీశారు. రిపోర్టులో సమస్యేమీ లేదని వచ్చింది. నేను చాలా సంతోషించాను. “కొన్ని రోజులు మందులు వాడి, బ్యాండేజీ వేసుకుంటే సరిపోతుంది” అని చెప్పారు. నేను ప్రతిరోజూ "నా కాలినొప్పిని త్వరగా తగ్గించమ"ని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని మోకాలికి రాసుకుని, కొద్దిగా ఊదీని నీళ్ళలో వేసుకుని త్రాగేదాన్ని. “నా కాలినొప్పి తగ్గిన తరువాత సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకున్నాను. కొద్దిరోజులకు బాబా అనుగ్రహంతో నా కాలినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు మాట ఇచ్చినట్లే నా అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకున్నాను. 


ఇప్పుడు చెప్తున్నాను వినండి సాయిబంధువులారా! బాబాకు జరగబోయేవన్నీ తెలుసు కాబట్టే నేను ఎంత అడిగినా మావారు డిసెంబరులో సెలవులు తీసుకోకుండా ఫిబ్రవరిలో తీసుకున్నారు. నా కాలికి దెబ్బతగిలిన సమయంలో గనక మావారు ఇంట్లో ఉండి నన్ను, పిల్లలను చూసుకోకపోతే ఈ దేశంకానిదేశంలో మేము చాలా ఇబ్బందిపడేవాళ్ళం. కాలికి దెబ్బతగిలి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నేను ఒక వారం సచ్చరిత్ర పారాయణ కూడా చేశాను. ఇదే సమయంలో మహాపారాయణ గ్రూపు నిర్వహించేవారు నా పేరున ఒక క్రొత్త గ్రూపు కూడా ప్రారంభించారు. నేను ఎంతో సంతోషించాను. కాలికి దెబ్బతగిలి నేను బాధపడుతుంటే బాబానే “నీకు నేనున్నాను” అని నా పేరు మీద మహాపారాయణ క్లాస్ ప్రారంభించేలా చేశారని అనుకున్నాను. ఇదే సమయంలో నాకు సాయిభక్తురాలి ద్వారా ‘తగ్గుతుంది’ అని సమాధానం వచ్చినప్పుడు కూడా సాయిబాబా ఆన్సర్స్ ఓపెన్ చేస్తే, ‘స్త్రీ సలహా పాటించు’ అని బాబా చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది, ఆమె ద్వారా బాబానే నాతో మాట్లాడారు అని. ఈ విధంగా బాబా ఎంతో దయచూపించి నాకు చాలా సహాయం చేసి నా సమస్యని గట్టెక్కించారు. “బాబా! నీ ప్రణాళికకి, నీ దయకి నా శతకోటి వందనాలు. సదా నీ స్మరణ చేస్తూ, నీయందు భక్తి ప్రేమలతో ఉండేలా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు బాబా!”


మరో అనుభవం:


ఒకసారి మా పాప తన గోరుతో మా బాబు కంటిలో గుచ్చింది. దాంతో మా బాబుకి కన్ను తెరవడానికి కూడా వీలుకాలేదు. ఎంతో ఏడుస్తూ ఆ రాత్రి బాబును తీసుకుని డాక్టర్ వద్దకు వెళితే, ‘కన్ను బాగా గీసుకుపోయింది’ అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వాడమని చెప్పారు. ఆ రాత్రంతా నొప్పితో మా బాబు ఏడుస్తూనే పడుకున్నాడు. మరుసటిరోజు ఉదయం “కన్ను అసలు తెరవలేకపోతున్నాను” అంటూ బాబు బాగా ఏడ్చాడు. నాకు చాలా బాధేసింది. అప్పుడు ఒక సాయిభక్తురాలు చెప్పడం వల్ల వెంటనే బాబాకు ముడుపుకట్టి మ్రొక్కుకున్నాను. బాబా ముందు కూర్చుని ఏడుస్తూ, “బాబా! మా బాబు కంటిసమస్యని తగ్గించండి. వాడి చూపుకి ఏమీ కాకుండా ఉండేలా అనుగ్రహించండి” అని బాబాను ఎంతో ప్రాధేయపడ్డాను. ఆ తరువాత ఇంకో డాక్టర్ వద్దకు బాబుని తీసుకువెళితే, “నయం కావటానికి కొంత సమయం పడుతుంది” అని చెప్పారు. కొన్ని రోజులకి బాబా దయవల్ల మా బాబు కంటిసమస్య నయమైంది. మనం బాబాను ప్రార్థిస్తే ఆయన ఏదో ఒకరకంగా సమాధానమిచ్చి మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. “మీకు చాలా ధన్యవాదాలు బాబా!”


బాబాను ప్రార్థించినంతనే విజయవంతమైన కోడ్


పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ప్రియమైన సాయిభక్తులందరికీ అనేక ప్రణామాలు. బాబా లీలలను ప్రచురిస్తూ అద్భుతమైన సాయిసేవను చేస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అనుభవాలన్నిటినీ ఆధునిక సాయిసచ్చరిత్రగా పేర్కొనవచ్చు. ఇక నా అనుభవానికి వస్తే...


నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. నేను ఇటీవల ఒక కోడ్‌ను విజయవంతం చేసే ప్రయత్నంలో ఎంతో కష్టపడ్డాను. కానీ, రోజులు గడుస్తున్నా ఆ కోడ్‌ను విజయవంతం చేయడం నాకు సాధ్యం కాలేదు. చివరికి నేను హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి, "ఆ కోడ్ విజయవంతమయ్యేలా సహాయం చేయమ"ని అర్థించాను. కోడ్ విజయవంతమైతే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. బాబాను ప్రార్థించినంతనే ఆ కోడ్ విజయవంతమైంది. నిజంగా ఇది అద్భుతం. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా". బాబాపై విశ్వాసం ఉంచండి, శ్రద్ధ-సబూరిలను అలవర్చుకోండి. బాబా సర్వవ్యాపి. ఆయన అనుగ్రహం మనపై సదా వర్షిస్తూ ఉంటుంది. మనం దేనికీ చింతించాల్సిన, భయపడాల్సిన పనిలేదు.


సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తుల అనుభవమాలిక 726వ భాగం....



ఈ భాగంలో అనుభవం:

  • సాయి అనుగ్రహధారలు


హైదరాబాదు నుండి సాయిభక్తుడు N.సూర్యనారాయణమూర్తి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


నా పేరు సూర్యనారాయణమూర్తి. మేము హైదరాబాదులోని విజయనగర్ కాలనీలో నివసిస్తున్నాము. నేను ఇంతకుముందు పంచుకున్న నా అనుభవాలు (నా అమెరికా ప్రయాణానికి బాబా సాయం) 2020, నవంబరు 10వ తేదీన ఈ బ్లాగులో ప్రచురితమయ్యాయి. ఆ లింకును ఈ క్రింద జతపరుస్తున్నాను.


https://saimaharajsannidhi.blogspot.com/2020/11/588.html


అందులో, మా అమ్మాయి సుఖప్రసవానికి బాబా చేసిన సహాయం గురించి కూడా చెప్పాను. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న 5 నెలల సమయంలో బాబా ఏవిధంగా మా ప్రక్కన నిలబడి మమ్మల్ని రక్షించి, తిరిగి 2021, మార్చి 5వ తేదీన హైదరాబాదుకు క్షేమంగా చేర్చారో మీతో పంచుకోబోతున్నాను.


మొదటి అనుభవం:


కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించి ఉన్నవేళ బాబా మాకు ప్రసాదించిన మా రెండవ అమ్మాయి సాయిలీలకు పుట్టిన రెండవ పాపను బాబా తమ అక్కున చేర్చుకుని అణువణువునా ప్రతిక్షణం కాపాడుతున్న తీరుకి ఎన్ని జన్మలెత్తినా బాబా ఋణం తీర్చుకోలేము. మేము అక్కడ ఉన్నన్ని రోజులూ బాబా నామం చెప్పుకుంటూ ఆ పాపను పెంచాము. “బాబా! మీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి” అని బాబాను ప్రార్థిస్తే, “నా అవతార ముఖ్యాంశము భక్తరక్షణమే” అనీ, “దిగులు వదలి ఉండమ”ని నాకు స్వప్నంలో విశ్వరూపదర్శనం ప్రసాదించారు బాబా. ఆ స్వప్నంలో అన్ని లోకాలూ బాబా దివ్యహస్తములో ఇమిడివున్నాయి.


2వ అనుభవం:


అమెరికాలో మేము అతిశీతలకాలంలో ఉన్నాము. కేవలం ఊదీ సహాయంతో అక్కడ కలిగిన అనేక బాధల నుంచి బాబా విముక్తి కల్పించారు. ఆ విపరీతమైన చలికి మేము భయపడుతున్నప్పుడల్లా సాయి మహరాజ్ సన్నిధిలో తగిన సందేశాలిచ్చి మమ్మల్ని ధైర్యవంతులను చేశారు బాబా. అట్టి బాబా సందేశాలలో ఒకటి...




3వ అనుభవం:


ఒకరోజు మా మనవరాలిని తీసుకుని పడకగదిలోకి వెళ్ళి అక్కడున్న బాబా ఫోటోకు నమస్కరించుకుని, “సాయీ! ఈరోజు పాప కొంత సమయం పాటు నిద్రపోయేలా చూడు తండ్రీ!” అని ప్రార్థిస్తే, కాలరూపుడైన సాయి నేను అడిగినంత సమయం పాపకు సుఖనిద్రను ప్రసాదించారు. అంతేకాదు, ఇప్పటికీ కరోనా తీవ్రంగా ఉన్న ఆ దేశంలో మా కుటుంబసభ్యులందరికీ చక్కటి ఆరోగ్యం ఉండేలా ఆశీర్వదించారు.


4వ అనుభవం:


ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మమ్మల్ని అమెరికా నుండి ఇండియాకు త్వరగా పంపించే ఏర్పాటు చేయండి” అని అడిగాను. ఆ మరునాడు బాబా నుండి ఈ క్రింది సందేశం వచ్చింది.


నీవు ఇక్కడే ఉండు. నా గురించిన విషయాలు ధ్యానించు. అక్కడ వ్యవహారములు నేను చూసుకుంటాను”. ఆ సందేశాన్ని చూసి నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


5వ అనుభవం:


ఒకరోజు మా అపార్టుమెంటులో ఫైర్ అలారం మ్రోగింది. అది మ్రోగితే అందరూ వారి వారి పాస్‌పోర్టులు మాత్రమే తీసుకుని క్రిందికి వెళ్ళిపోవాలి. ఆరోజు అక్కడి ఉష్ణోగ్రత -26 డిగ్రీల సెంటీగ్రేడ్ తో విపరీతమైన చలిగా ఉంది. చంటిపాపతో ఏం ఇబ్బందిపడాలో అనుకుని, పరిస్థితిని చక్కదిద్దమని బాబాను ప్రార్థించుకుని సాయినామం జపించటం ప్రారంభించాను. ప్రార్థించిన 10 నిమిషాలలో అంతా సద్దుమణిగేలా చేసిన దైవం మన బాబా.


6వ అనుభవం: 


నా అమెరికా పర్యటనలో నాకు రెండుసార్లు తీవ్రమైన పంటినొప్పి రాగా బాబా ఊదీ ధరించి, “సాయీ! నా పంటినొప్పి తగ్గించండి. పంటినొప్పి తగ్గగానే నా అనుభవాలలో దీనిని కూడా చేర్చి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కగానే తిరిగి ఇండియా వచ్చేవరకు పంటినొప్పి రాకుండా చేసిన అపర ధన్వంతరి మన సాయి.


7వ అనుభవం:


ఈ అమెరికా పర్యటనలో ఉండగానే తనకు బాబా చేసిన సహాయం గురించి సాయినామ ప్రచారకులు కీ.శే. డి.శంకరయ్యగారి రెండవ పుత్రిక శ్రీమతి సాయీశ్వరి చెప్పిన బాబా లీలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.


సాయీశ్వరి కెనడాలో గత 15 సంవత్సరాలుగా ఉంటున్నారు. అక్కడ కూడా ఆమె తన తండ్రి బాటలో నడుస్తూ, తన భర్త, కుమారుని సహాయంతో వారాంతపు సెలవులలో విరామం లేకుండా సాయినామ సంకీర్తనలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారు కెనడాలోని వాంకోవర్ రాష్ట్రం డెల్టా ఏరియాలో ఉంటున్నారు. ఈ కరోనా సమయంలో అడుగడుగునా, పదేపదే బాబా ఆ కుటుంబసభ్యులకు తన ఆశీస్సులను ప్రసాదించి అదే ప్రాంతంలో వారు క్రొత్త ఇల్లు కొనుక్కునేలా అనుగ్రహించారు. దానికి తగిన సహాయ సహకారాలను ప్రత్యక్షముగానూ, పరోక్షముగానూ బాబా అందించారు. చివరికి, గృహప్రవేశానికి ముందు పెట్టుకున్న రిజిస్ట్రేషన్‌కు కావలసిన డబ్బులో 15,000 డాలర్లు తక్కువైతే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయికి రావలసిన పాఠశాల రుసుము రిఫండ్ సరిగ్గా 15,000 డాలర్లు వారి బ్యాంకు అకౌంటుకి ట్రాన్స్‌ఫర్ అయిన లీల గురించి ఆమె కన్నీళ్ళతో నాకు ఫోనులో చెప్పి, ‘ఈ లీలను కూడా బ్లాగులో వచ్చేలా చూడండి’ అని చెప్పింది. “సద్గురువును నీవు ఏమీ కోరవద్దు. కేవలం భక్తితో ధ్యానించు, నిర్మలంగా ఉండు” అని ఆమెకు సందేశమిచ్చిన మన బాబా లీలలు అద్భుతం.


8వ అనుభవం:


చివరిగా, అమెరికా నుండి మా తిరుగు ప్రయాణానికి కావలసిన కరోనా టెస్ట్ ఏర్పాటు చేసి, నెగిటివ్ రిపోర్టు మా చేతికి వచ్చేలా అనుగ్రహించి, తన దివ్యహస్తమును మా దంపతులకు అందజేసి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా 2021, మార్చి 5వ తేదీనాటికి నేను కోరిన విధంగా కాకడ ఆరతి ప్రారంభ సమయానికి హైదరాబాదులోని మా ఇంటికి చేర్చిన సాయికి వేల లక్షల కోట్ల నమస్కారాలు తెలుపుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవాలను ప్రచురించి సాయి దివ్యకీర్తిని ప్రపంచం నాలుగు చెఱగులా చేరేలా చేస్తున్న సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ వారికి సాయి ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 725వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:
  1. కష్టమేదైనా బాబాకు చెప్పుకుంటే చాలు, కష్టం తీరిపోతుంది
  2. ఫోన్ కాల్ వచ్చేలా అనుగ్రహించి ఆందోళన తీసేసిన బాబా

కష్టమేదైనా బాబాకు చెప్పుకుంటే చాలు, కష్టం తీరిపోతుంది


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వాహకులకి నా నమస్కారములు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకు నా ధన్యవాదములు.


మొదటి అనుభవం:


ఇటీవల మావారి మొబైల్ ఫోన్ కనపడకుండా పోయింది. ఆయన ఉద్యోగానికి సంబంధించిన ఫోన్ కాల్స్ అన్నీ ఆ ఫోనుకే వస్తాయి. అందువలన మేము చాలా ఆందోళనచెందాము. నిజానికి ఇంట్లోనే కనపడకుండా పోయినప్పటికీ ఆ ఫోన్ కోసం ఎంతగా వెతికినా దొరకలేదు. మూడు రోజులు గడిచినా ఫోన్ జాడ తెలియలేదు. అప్పుడు నేను ఈ సమస్య గురించి బాబాకు చెప్పుకొని, "మొబైల్ దొరికిన వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థనను విన్నారు. సరిగ్గా రెండు గంటల్లో మొబైల్ దొరికింది. పట్టలేని ఆనందంతో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.


రెండవ అనుభవం:


చాలారోజుల నుంచి మావారు తలనొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "స్కానింగ్ చేయాలి" అని అన్నారు. మావారు స్కానింగ్ చేయించుకున్నారు. రిపోర్టు ఎలా వస్తుందోనని నాకు భయమేసి, "ఎలాంటి సమస్యా లేదని రిపోర్టు వచ్చినట్లయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవలన డాక్టర్, "మీకున్న సాధారణ మెడనొప్పి వలనే ఇలా తలనొప్పి వస్తోంద"ని చెప్పి కొన్ని మాత్రలిచ్చి వాడమన్నారు. వాటితో నొప్పి తగ్గిపోతుందని కూడా చెప్పారు. "ఎలాంటి పెద్ద సమస్య లేకుండా కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


మూడవ అనుభవం:


మాకు చిన్నబాబు ఉన్నాడు. ఇటీవల తను మూడు రోజులుగా ఏమీ తినలేదు. తినడానికి ఏమి పెట్టినా ఏడ్చేవాడు. అప్పుడు నేను బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. "థాంక్యూ బాబా! మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను".


ఫోన్ కాల్ వచ్చేలా అనుగ్రహించి ఆందోళన తీసేసిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. బాబాకి మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


మాకు ఒక వ్యాపారం ఉంది. మావారు ఆ వ్యాపార నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తుండేవారు. కనీసం వారంలో ఒకసారైనా వెళ్లేవారు. అయితే కరోనా మొదలయ్యాక మావారు హైదరాబాద్ వెళ్లడం కాస్త తగ్గించారు. మావారికి కాళ్లనొప్పులు ఉన్నాయి. ఆయన కాళ్ళకి ఆపరేషన్ కూడా అయింది. ఇటీవల 2021, మార్చి 6వ తేదీ ఉదయాన మావారు పనిమీద హైదరాబాద్ వెళ్లారు. ఆయన వెళ్లిన కొంతసేపటికి నేను ఫోన్ చేస్తే, "నేను బస్సు ఎక్కి అరగంట అయింది" అని చెప్పారు. ఇంక నేను నా పనుల్లో పడ్డాను. మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేశాను. మావారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు సమయం 12:30 అవుతోంది. అప్పటినుండి  సాయంత్రం 4:30 దాకా ఫోన్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎన్నిసార్లు చేసినా మావారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించి స్థిమితంగా ఉండలేకపోయాను. దాంతో 'బాబా.. బాబా' అని బాబాను స్మరించుకుంటూ, "మావారు ఫోన్ చేస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. సాయి చాలీసా కూడా చదివాను. ఆ తరువాత కూడా బాబాను తలచుకుంటూ ఉండగానే మావారు ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తుతూనే, "మనుషులు అనే వాళ్ళు ఉంటారు, కాల్ చేస్తారని తెలుసు కదా!" అని మావారిని బాగా కోప్పడ్డాను. అందుకాయన, "నా ఫోన్ సైలెంట్ లోకి వెళ్ళిపోయింది" అని అన్నారు. "ఆ విషయం మాకు తెలియదు కదా! సరే, అదే సైలెంట్ లోకి వెళ్లి ఉండొచ్చు. కానీ నేను కాల్ చేస్తానని మీకు తెలుసు కదా, కాస్త ఫోన్ చూసుకోవచ్చుగా" అని అన్నాను. ఏదేమైనా బాబా దయవలన మావారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo