సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 701వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నా మాటలు విన్నారు - నాకు సమాధానం ఇచ్చారు
  2. బాబా వెంట ఉంటే సకల కార్యాలూ దిగ్విజయంగా అవుతాయి

బాబా నా మాటలు విన్నారు - నాకు సమాధానం ఇచ్చారు


సాయిభక్తురాలు సాయిసంహిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు సాయిసంహిత. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. “నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా!” నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని ఇంతకుముందు మీతో పంచుకున్నాను కదా! ఇటీవల మాకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాతో పాటు నా స్నేహితురాలికి కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం ఇష్టం లేదు. దాంతో తను ఏం చేద్దామని నన్నడిగింది. “బాబాను అడుగుదాము, బాబా ఏం చెప్తే అదే చేద్దాం” అని చెప్పాను. తను అందుకు అంగీకరించింది. నేను బాబాకు పూజ చేసి, ‘వ్యాక్సిన్ వేయించుకో’, ‘వద్దు’ అని రెండు చీటీలు రాసి బాబా ముందు వేసి, నాకు సమాధానం చెప్పమని బాబాను ప్రార్థించి, ఒక చీటీని తీశాను. అందులో ‘వద్దు’ అని వచ్చింది. దాంతో నేను వ్యాక్సిన్ వేయించుకోకూడదని నిర్ణయించుకున్నాను. జరిగిన విషయాన్ని నా స్నేహితురాలికి చెప్తే తను కూడా వ్యాక్సిన్ వేయించుకోను అన్నది. అయితే, వ్యాక్సిన్ వేయించుకోవడానికి రమ్మని మాకు వరుసగా కాల్స్ రాసాగాయి. ఈ విషయం నేను మా డాడీకి చెప్తే, “ఒక సంవత్సరం నుంచి ఈ వ్యాక్సిన్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూశారు. నీకు ఫ్రీగా ఇస్తున్నారు, వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకో!” అని అన్నారు. “బాబా వద్దన్నారు కదా! పైగా ఇవాళ ఉదయం శ్రీసాయిసచ్చరిత్ర చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో ‘బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకోవద్దు’ అని కూడా చదివాను. బాబా చెప్పాక అందుకు వ్యతిరేకంగా నడుచుకోకూడదు కదా. నాన్న వ్యాక్సిన్ వేయించుకోమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు, కానీ నేను వేయించుకోను బాబా” అని మనసులోనే అనుకుంటూ బాబా వైపు చూసి, “నాన్న కూడా వ్యాక్సిన్ వద్దు అని చెప్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. తరువాత నాన్న దగ్గరకు వెళ్ళి, “నాన్నా, ఉదయం బాబా దగ్గర చీటీలు వేశాను. ‘వ్యాక్సిన్ వేయించుకోవద్దు’ అని బాబా సమాధానం వచ్చింది. అందువల్ల నేను వ్యాక్సిన్ వేయించుకోను” అని చెప్పి, “కావాలంటే నీకు నమ్మకం కలిగించడానికి మళ్ళీ చీటీలు వేస్తాను” అని మళ్ళీ బాబా ముందు చీటీలు వేసి ఈసారి నాన్నతోనే తీయించాను. అందులో ‘వద్దు’ అని వచ్చింది. “బాబా సమాధానం చూశావా నాన్నా!  బాబా వద్దంటున్నారు, ఇంక నేను వెళ్ళను” అని చెప్పాను. మా నాన్నగారు సరేనన్నారు. “నాన్న మనసు మార్చినందుకు ధన్యవాదాలు బాబా! ఇంత ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి”. నా స్నేహితురాలు కూడా చీటీల ద్వారా బాబాను అడిగితే బాబా ‘వద్దు’ అని సమాధానమిచ్చారట. దాంతో తను కూడా వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్ళలేదు.


మరొక అనుభవం:


నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను. కానీ అంత త్వరగా నాకు ఉద్యోగం రాలేదు. అప్పుడు బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు ఉద్యోగం వస్తే కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి, తద్వారా కూడబెట్టిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసి, దానిద్వారా వచ్చిన డబ్బుతో నేను అనాథాశ్రమం ప్రారంభించి నలుగురికీ చేతనైనంత సహాయం చేస్తాను” అని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. నా జీతం నుండి కొంత డబ్బు తీసి ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్ చేస్తే కొన్ని సంవత్సరాలయ్యాక నాకు కాస్త పెద్దమొత్తంలో డబ్బు వస్తుంది, దానితో నేను అనుకున్నది కొంతైనా చేయవచ్చు అని అనుకుని బ్యాంకువాళ్ళని సంప్రదించాను. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి బ్యాంకువాళ్ళు నాకు 2021 ఫిబ్రవరి 10వ తేదీన అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆరోజు ఉదయం నేను బాబా మందిరానికి వెళ్ళి, “బాబా! మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నట్టు, నేను చెప్పేది వింటున్నట్టు నాకు తెలియాలి. నా సందేహాలను మీరు తీరుస్తూ ఉండాలి. నా బండి మీద ఎప్పుడూ మీరు కూర్చోవాలి” అని బాబాను ప్రార్థించాను. తరువాత బయటికి వచ్చి బండి తీస్తూ, “బాబా! మీరు నా బండిమీద కూర్చున్నారని నాకు అనిపించాలి. మీ ఫోటో రూపంలో గానీ, మీ నామం రూపంలో గానీ నాకు దర్శనమివ్వండి” అని అనుకున్నాను. 5 నిమిషాలు వేచివున్నాక బాబా దర్శమిచ్చారు. తరువాత బాబాతో మాట్లాడుతూ, “బాబా, నేను చేయాలనుకున్న మంచిపనికి నాకు ఎక్కువ డబ్బు అవసరమవుతుందని మీకు తెలుసు. నేను వ్యాపారం చేస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే, నాకు ఆలస్యంగా ఉద్యోగం వచ్చింది, పైగా నేను ఆశించిన ఉద్యోగం రాలేదు కూడా. ఆ మంచిపని కోసం ఈరోజే తొలి అడుగు వేస్తున్నాను. ఆ మంచిపని కోసం ఎక్కువ డబ్బు సమకూరేలా మీరే అనుగ్రహించండి” అని చెప్పుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాక వాట్సాప్‌లో ఈక్రింది బాబా మెసేజ్ కనిపించింది.


సాయి వచనాలు:-


నేనెవరినుండైనా ఒక్క రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పదిరెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడూ ఏదీ ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూపిన వారినుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి, తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరిసంపదలు ధర్మాన్ని సాధించడం కోసం వున్నాయి. కేవలం సుఖాలకోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇదివరకు ధర్మం చేసి వుంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే గనుక, భగవంతునికివ్వడం వలన భక్తిజ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి స్వీకరించి, పదిరెట్లు ఇస్తున్నాను”.


నాకు ఎక్కువ డబ్బు కావాలని బాబాను అడిగాను కదా, నాకు పదిరెట్లు ఇస్తాను అని బాబా ఈ మెసేజ్ రూపంలో తెలియజేశారు. అంటే, బాబా నా మాటలు విన్నారు, నాకు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, ఆరోజు వాట్సాప్ గ్రూపులో నా అనుభవం కూడా వచ్చింది. ఆ అనుభవంలో కూడా కలలో నేను బాబాను, “బాబా! మీరు నేను చెప్పేది విని నాకు సమాధానం ఇస్తూ ఉంటారు కదా?” అని అడిగితే, బాబా “చెప్తాను” అని సమాధానమిచ్చారు. అలాగే ఇవాళ మందిరంలో బాబాను అడిగిన ప్రశ్నకు బాబా నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాధానం ఇచ్చారు. “నాకు సమాధానం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా! మీ కృప అందరిపైనా ఉండాలి బాబా. నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయంలో కూడా మీ సమాధానం సానుకూలంగా వచ్చింది. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు బాబా. నన్ను వెయిట్ చెయ్యమని అంటున్నారు. మీ సమాధానం కోసం వేచిచూస్తున్నాను. అంతా సానుకూలంగానే జరుగుతుందని ఆశిస్తున్నాను. మీ అనుగ్రహంతో నేను ఆశించింది త్వరగా జరిగితే ఆ లీలను కూడా నేను ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకోవాలని కోరుకుంటున్నాను బాబా!”


బాబా వెంట ఉంటే సకల కార్యాలూ దిగ్విజయంగా అవుతాయి


సాయి భక్తురాలు శ్రీమతి పద్మావతి బాబా తమకి ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఈ కరోనా సమయంలో నెల రోజుల వ్యవధిలో మా ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాము. పెళ్ళిళ్ళకు వచ్చిన వాళ్ళకు గానీ, మాకు గానీ కరోనా రాకుండా రక్షించమని నా సాయినాథుని వేడుకున్నాను. “కరోనా బారినుండి మమ్మల్నందరినీ రక్షిస్తే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా కృపతో మా అమ్మాయిల వివాహాలు ఎటువంటి ఆటంకాలూ లేకుండా సవ్యంగా జరిగాయి. ఇలాగే బాబా కృప మా మీద, మా కూతుళ్ళు, అల్లుళ్ళ మీద సదా ఉండాలని బాబాను మనసారా వేడుకుంటున్నాను. “బాబా! మీరు మా వెంట ఉంటే సకల కార్యాలూ దిగ్విజయంగా అవుతాయి తండ్రీ! మేము మీ పాదాలనే నమ్ముకున్నాము, మీరు మా చెయ్యి వదలకండి బాబా!”


సాయినాథ్ మహరాజ్ కీ జై!



6 comments:

  1. Om sai ram baba thanku after vaccine I am fine with your blessings������ 2nd vaccine is to be taken. Please bless my family. Be with us

    ReplyDelete
  2. Baba amma arogyam bagundela chudu thandri pleaseeee

    ReplyDelete
  3. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  4. సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo