సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 717వ భాగం....



ఈ భాగంలో అనుభవం:
  • మనకు అంతా సాయిబాబానే - మన బాగోగులు చూసుకొనేది ఆయనే - మొదటి భాగం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. మేము హైదరాబాదులో ఉంటున్నాము. గత 6 నెలల కాలంలో నా జీవితంలో ఏర్పడిన అనేక ఒడిదుడుకులలో, కష్టసమయాల్లో సాయిబాబా ఎలా ఆదుకున్నారో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నబ్బాయి చాలా చాలా సున్నితమనస్కుడు, భయస్థుడు. తను మాకు బాబా ప్రసాదించిన వరం. ఒకరోజు తనకి ‘మా ఇద్దరి అబ్బాయిల రక్షణ పూర్తిగా తమ బాధ్యత’ అని బాబా స్వయంగా తెలియజేశారు. ఎప్పుడైతే బాబా ఆ మాట చెప్పారో అప్పటినుండి అంతా వారే అయి మా బిడ్డలను చూసుకుంటున్నారు. ఇకపోతే 2020, సెప్టెంబరు నెల మొదటివారంలో ఒకరోజు మా చిన్నబ్బాయి తన ఆరోగ్య సమస్యను మాతో పంచుకున్నాడు. ఆ విషయం తను చెప్పేవరకు స్వంత తల్లిదండ్రులమైన మేము తనకి ఆ సమస్య ఉందని అస్సలు పసిగట్టలేకపోయాము. సరే ఆ విషయాన్ని మా అబ్బాయి తనకు తానుగా చెబితే మేము చాలా తేలికగా తీసుకుని, "అదేమీ సమస్య కాద"ని అన్నాము. కానీ తను నమ్మలేదు. దాంతో మేము, “సరే, మేము ఏమి చెప్పినా నీకు నమ్మకం కలగదు. అది పెద్ద సమస్యేమీ కాదని డాక్టర్ చెప్తేనే నీ మనస్సు కుదుటపడుతుంది” అని చెప్పి తనను మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి అంతా వివరంగా చెప్పాము. ఆయన బాబుని లోపలికి తీసుకెళ్ళి చెకప్ చేసి, బయటికి వచ్చి చాలా కంగారుగా, “ఇన్నాళ్ళూ ఈ సమస్యని మనం ఎలా గుర్తించలేదు? వెంటనే స్కానింగ్ చేయించి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైపోయింది. అసలు అది సవ్యంగా ఉందో లేక వేరేరకంగా ఉందో, ఇంత ఆలస్యమైంది కాబట్టి ఏమీ చెప్పలేము” అని చెప్పేటప్పటికి, నాకు, మావారికి పైప్రాణాలు పైనే పోయాయి. ఆ రోజులు గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ నాకు వణుకుపుడుతుంది. సరైన సమయంలో బాబానే మా అబ్బాయికున్న సమస్యను తనకే తెలియపరచారు. ఇంకా ఆలస్యమైతే చాలా ప్రమాదమయ్యేది. ఇంక ఆరోజు నుండి మా చిన్నబ్బాయిని వెంటతీసుకుని ఛైల్డ్ స్పెషలిస్ట్ సర్జన్లను కలవటం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం, అవసరమైన పరీక్షలు చేయించటం జరుగుతూ ఉంది. ఆ డాక్టర్లందరూ, “ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెంటనే సర్జరీ చేయాల”ని చెప్పారు. ఇంక నేను ప్రతిరోజూ రాత్రి, పగలు “బాబా! బాబుకి సర్జరీ చేస్తేనే మంచిదని డాక్టర్లంతా అంటున్నారు. అందుకు సరైన డాక్టర్ని మీరే మాకు చూపించాలి” అని వేడుకుంటూనే ఉన్నాను. నిజం చెప్తున్నాను, ఆరోజుల్లో నా మనస్సు ఎంతో బాధతో తల్లడిల్లిపోయేది. ఏ తల్లి తన బిడ్డను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళుతుంటే తట్టుకోగలదు? పిల్లవాడు ఎక్కడ చూస్తాడో అని మనస్ఫూర్తిగా ఏడవలేను. అప్పటికే పిల్లవాడు తనకు ఆపరేషన్ జరగబోతోందని తెలిసి చాలా భయపడి ఏడ్చేవాడు. బాబుకు ఆపరేషన్ చేయించడానికి సరైన డాక్టరును ఎంచుకునే ప్రక్రియలో అందరి ఛైల్డ్ సర్జన్ల వివరాలూ క్షుణ్ణంగా తెలుసుకుని వాళ్ళలో ఒక నలుగురిని ఎంపిక చేసుకున్నాము. మొదటి డాక్టర్ దగ్గరకు వెళితే ఆయన మాటతీరుకి బాబు చాలా భయపడిపోయాడు. మరో ఇద్దరు డాక్టర్ల దగ్గర మాకు సరైన భరోసా కలగలేదు. ఆఖరి డాక్టర్ని ఎవరో తెలిసినవాళ్ళు సిఫారసు చేశారు. అసలు ఆయన దగ్గరకు వెళ్ళాలని కూడా మేము అనుకోలేదు. “బాబా! నా బిడ్డను ఏ డాక్టరుకి అప్పజెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. బిడ్డ మీద ప్రేమతో అతిగా ఆలోచించడం వల్ల ఏ డాక్టర్ మీదా నాకు భరోసా కలగడం లేదు. అంతా పిచ్చిగా ఉంది బాబా, దయచేసి నాకు సహాయం చేయండి” అంటూ నేను కన్నీళ్ళతో బాబాను ప్రార్థించేదాన్ని. ఇక్కడ బాబావారి గొప్ప కరుణ చూడండి. 


ఒకరోజు మేము ఆ నాలుగవ డాక్టర్ దగ్గరకు బయలుదేరాము. ఆ క్లినిక్ వాతావరణం చూడగానే మా అబ్బాయి, నేను బిగుసుకుపోయాము. మా అబ్బాయైతే, “ఈ డాక్టర్ అసలు వద్దు, ఈ క్లినిక్ వద్దు. ఆపరేషన్ ఇక్కడ అయితే నేను అస్సలు చేయించుకోను” అని ఒకటే ఏడుపు. అది చూసి, “ఎంచుకున్న నలుగురు డాక్టర్లలో ఎవరి దగ్గరా భరోసా లభించలేదు. ఇంక మాకేది దారి? అంతా చీకటిగా అయిపోయింది” అని అనుకున్నాను. అయినా సరే నేను, మావారు, “ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి డాక్టరుకి చూపించి ఆయన అభిప్రాయం తీసుకుని వెళ్ళిపోదాము” అని మా అబ్బాయిని సముదాయించి లోపలికి తీసుకువెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్ద బాబా ఫోటో! బాబాను అక్కడ చూస్తూనే నేను నిర్ఘాంతపోయాను. “అయ్యో బాబా, ఆపరేషన్ చేయడానికి ఈ డాక్టర్ని నియమించారా? ఈ హాస్పిటల్లో ఒక్క గంట కూడా కూర్చోలేము. ఈ డాక్టర్ ఇక్కడ తప్ప మరెక్కడా వైద్యం చేయరని తెలిసింది. మీరేమో ఈ డాక్టర్నే సూచిస్తున్నారు. పిల్లవాడు ఈ హాస్పిటల్లో సర్జరీ అంటే అస్సలు ఒప్పుకోడు కదా. అసలు ముందు నేనే ఒప్పుకోలేకపోతున్నాను. ఏమిటయ్యా ఇది, చిన్నబిడ్డ పట్లనా మీ పరాచికాలు?” అని ఏవేవో తిట్టేసుకున్నాను పెద్ద నేనేదో గొప్ప తల్లిలాగా. (నన్ను క్షమించు తండ్రీ!) బిడ్డ సమస్యని ఆ బిడ్డ ద్వారానే బాబా మాకు తెలియజేసేవరకు గ్రుడ్డిమొహంలా ఉన్న నేను ఆయన లీలను ఎలా కనిపెట్టగలను చెప్పండి? అపాయింట్‌మెంట్ తీసుకుని డాక్టర్ కోసం వేచిచూడసాగాము. బాబు ఒకటే ఏడుపు వెళ్ళిపోదామని. ఇక్కడ ఎంత అద్భుత లీల జరిగిందో చూడండి.


కొంతసేపటి తరువాత డాక్టర్ వద్దకు వెళ్ళాము. అప్పుడు అర్థమైంది, ఆయన ఒక సీనియర్ డాక్టర్ అని. ఆయన మా బాబుని పరీక్షించి, తన సమస్య గురించి మాకు, మా అబ్బాయికి ఎంతో వివరంగా అర్థమయ్యేలా చెప్పి (అంతకుముందు వరకూ ఏ డాక్టరూ చెప్పలేదు), సర్జరీ ప్రక్రియ గురించి ఎంతో ఓర్పుగా వివరించి, సర్జరీ సక్సెస్ గురించి నాకున్న అన్ని భయాలను తీసేసి, “అంతా మంచే జరుగుతుంది, ఆపరేషన్‌కు ఇదే సరైన సమయం” అని చెప్పారు. కానీ, వచ్చిన చిక్కల్లా, ఆ హాస్పిటల్లో సర్జరీ చేయించటం మా అబ్బాయికిగానీ, నాకుగానీ, మావారికిగానీ అస్సలు ఇష్టం లేదు. దాంతో నేను డాక్టరుగారితో, “సార్, మీరే మా అబ్బాయికి సర్జరీ చేయాలి. కానీ, ఈ హాస్పిటల్లో సర్జరీ మాకు ఇష్టం లేదు. బయట వేరే హాస్పిటల్లో చేస్తారా?” అని అడిగాను. వెంటనే ఆయన మేముండేది ఎక్కడో అడిగి తెలుసుకుని, “మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రఖ్యాతమైన హాస్పిటల్ వాళ్ళు పిలిచినప్పడు ఆపరేషన్లు చేయడానికి వెళతాను. మీకు ఆ హాస్పిటల్ ఇష్టమైతే అన్ని ఏర్పాట్లూ నేనే చూసుకుంటాను” అని చెప్పారు. ఇంక చూడండి మా ఆనందం. వెంటనే ఆ హాస్పిటల్లో ఎవర్ని కలవాలో ఆయన చెప్పడం, మేము వాళ్ళను కలవడం, వాళ్ళు అవసరమైన టెస్టులన్నీ చేసి ఆపరేషన్ తేదీని నిర్ణయించడం జరిగింది. కాదు, కాదు, బాబానే నిర్ణయించారు. ఇంక అప్పటినుండి బాబుని సర్జరీకి ఎలా సిద్ధం చేయాలా అని కాస్త ఆందోళనచెందాము. ఎందుకంటే తనకు సర్జరీ అనేసరికి బాబు చాలా భయపడిపోయాడు. డాక్టరుగారు ఆయన పర్సనల్ నెంబర్ మాకిచ్చి, బాబు భయపడినప్పుడల్లా మేము మెసేజ్ పెడితే వెంటనే చక్కగా ప్రతిస్పందించేవారు. ఇంక చూడండి, సర్జరీ అంటే అంతగా భయపడి ఏడుస్తున్న మా అబ్బాయి తాను భయపడటం మానేసి, ఎంతగానో భయపడుతున్న నాకు ధైర్యం చెప్పేవాడు. ఆపరేషన్ జరిగే తేదీన మా అబ్బాయిని ఉదయమే హాస్పిటల్‌కి కారులో తీసుకువెళుతుంటే మావారు, మా పెద్దబ్బాయి బయటికి కనిపించకుండా బాధపడిపోతున్నారు. నన్ను ఎవ్వరూ కదపటం లేదు. కదిపితే నేను ఎక్కడ వెక్కి వెక్కి ఏడుస్తానో అని. మా చిన్నబ్బాయి కారులో నా ప్రక్కనే కూర్చుని, నా చేతిని తన చేతిలోకి తీసుకుని, “అమ్మా, నేనేమీ భయపడటం లేదు. నువ్వేమీ భయపడకు. మనకు అంతా సాయిబాబానే కదా చూపేది. ఈ డాక్టరుని కూడా సాయిబాబానే చూపించారు కదా! అంతా బాబానే చేస్తుంటే ఇంక మనకు భయం ఎందుకమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు” అని చెప్పాడు. హాస్పిటల్‌కి వెళ్ళాక బాబుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళేముందు డాక్టరుగారు బాబు చేతిని తన చేతుల్లోకి తీసుకుని, “నీకేం భయం లేదు. నన్ను నమ్ము, నేను ఉన్నానుగా” అని అంటే మా అబ్బాయి నవ్వుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. డాక్టరుగారు నా వైపు చూసి, “అమ్మా, ఏమీ భయపడవద్దు. ముందు మీరు టెన్షన్ పడకుండా స్థిమితంగా ఉండండి” అని అంటే సరేనన్నాను గానీ, ఆయన బాబుని తీసుకుని లోపలికి వెళ్ళగానే ఏడుపు ఆపుకోవటం నా వల్ల కాలేదు. భోరుభోరున ఏడ్చేశాను. మా పెద్దబ్బాయి బలవంతంగా నన్ను రూములోకి తీసుకెళ్ళాడు. (హాస్పిటల్లో అప్పటికే మేము ఒక రూమ్ తీసుకున్నాము.) బాబా ఎంత బాగా అనుగ్రహించారంటే, ఆపరేషన్ చాలా బాగా జరగటమే కాకుండా, మా బాబు చాలా త్వరగా కోలుకుని, ఆ తరువాత చేసిన అన్ని టెస్టుల రిపోర్టులు నార్మల్‌గా వచ్చి ఇంక భవిష్యత్తులో ఏ సమస్యా లేకుండా శాశ్వతంగా నయం చేసేశారు. నా బిడ్డల బాధ్యత తనదని భరోసానిచ్చిన బాబా సమస్యను బయటపెట్టి, డాక్టర్ని సూచించి అంతా ఆయనే చూసుకున్నారు. నేను ఏమీ చేయలేదు, ‘బాబా, బాబా’ అని వెక్కివెక్కి ఏడవటం తప్ప. బాబా దయవల్ల ఇప్పుడు మా అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు.


రెండవ అనుభవం: 


పైన చెప్పిన సంఘటన జరిగిన నెలరోజులకి మా చెల్లికి, మరిదికి, వాళ్ళ అమ్మాయికి ముగ్గురికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళకు కరోనా పాజిటివ్ అని తెలియడానికి 4 రోజుల ముందు, మావారి స్నేహితుడొకరు, "తనకు తెలిసిన డాక్టర్ ఫోన్ ద్వారా కరోనా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, ఆయన దగ్గర కరోనా పేషెంట్స్ అందరూ పూర్తిగా కోలుకున్నార"ని చెప్పి మావారు వద్దంటున్నా వినకుండా ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ మా వారికి ఇచ్చారు. సరిగ్గా 4 రోజులకి మా చెల్లెలి కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. మా చెల్లికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాళ్ళు, చేతులు ఆడటం లేదు. మా చెల్లి పరిస్థితి చూసిన అందరూ తనను హాస్పిటల్లో చేర్చమని చెప్పారు. నిజానికి తనను హాస్పిటల్లో చేర్చాలి. కానీ మా చెల్లెలు “నేను ఇంట్లోనే ఉంటా, హాస్పిటల్లో అస్సలు ఉండను” అని ఒకటే ఏడుపు. దాంతో వెంటనే మావారు, "నేనెంత వద్దన్నా ఈ డాక్టర్ నెంబర్ నా వద్దకు ఎందుకు వచ్చిందో, ఆ వెంటనే వీళ్ళకి కరోనా డిటెక్ట్ అవడం ఎందుకు జరిగిందో” అని అనుకుని ఆ డాక్టర్ని ఫోన్ ద్వారా సంప్రదించి, మా చెల్లి ఫ్యామిలీని కనెక్ట్ చేశారు. నిజంగా బాబా దయ చూడండి. వెంటనే ఆ డాక్టర్ కొన్ని మందులను సూచించడం, వాళ్ళందరికీ, ముఖ్యంగా మా చెల్లికి ఎంతో ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఏమీ భయపడనక్కరలేదని ఎంతో ధైర్యం చెబుతూ, ఎంతో బాగా మాట్లాడుతూ, అర్థరాత్రి ఎప్పుడు కాల్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అవుతూ, మధ్యలో ఒకరోజు మా చెల్లెలి ఆరోగ్యం మరికాస్త క్షీణించి మేమంతా భయపడుతుంటే, మాకు ఎంతో ధైర్యం ఇచ్చి, “ఏం కాదు, కంగారుపడకండి” అని చెప్పి ట్రీట్‌మెంట్ చేశారు. బాబా దయవల్ల 15 రోజులకల్లా ముగ్గురూ కోలుకున్నారు. జరగబోయేదాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్నీ ముందే ఏర్పాటు చేసి మమ్మల్ని దగ్గరుండి నడిపించారు బాబా.


మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో...

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.


9 comments:

  1. ఇంత అద్భుతమైన సాయి అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు ఒక్కసారిగా ఆందోళనకు గురి చేస్తే వెంటనే అక్కున చేర్చుకుంటే నిన్ను అర్థం చేసుకోవడం అనితర సాధ్యం.
    మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని ఈ జీవితాన్ని మా కుటుంబాన్ని సదా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడి తండ్రి.

    మీ నామ ఉచ్చారణ శ్వాసగా బ్రతుకుతున్నాం తండ్రి..

    ReplyDelete
  2. Om sai ram very nice experience. Baba saves all from difficulties. We must trust sai baba. Om sai baba������ ❤��❤��

    ReplyDelete
  3. Kothakonda SrinivasMarch 18, 2021 at 12:07 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundela chudu thandri sainatha

    ReplyDelete
  7. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  8. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo