- నమ్ముకున్న భక్తులకు అండగా ఉంటామనే ఋజువు ఇచ్చిన బాబా
- సచ్చరిత్ర పారాయణతో నెరవేరిన కోరికలు
నమ్ముకున్న భక్తులకు అండగా ఉంటామనే ఋజువు ఇచ్చిన బాబా
సాయిభక్తురాలు శిరీష ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తూ, సాయిభక్తులంతా తమ తమ అనుభవాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ, ఆ అనుభవాల ద్వారా సాయిభక్తులకు బాబాపై మరింత దృఢమైన శ్రద్ధాభక్తులను పెంచుతూవున్న బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు శిరీష. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
లాక్‌డౌన్ సమయంలో మా పాప మెచ్యూర్ అయిందనీ, అప్పుడు బాబా మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేశారనీ ఇంతకుముందు అనుభవంలో పంచుకున్నాను. లాక్‌డౌన్ కారణంగా కరోనా వచ్చిన 8 నెలల తరువాత మేము మా ఊరికి వెళ్ళాము. అప్పుడు మా బంధువులంతా మావారితో, “మీకు ఒక్క పాపే కదా! లాక్‌డౌన్ వల్ల తన ఫంక్షన్ మేము చూడలేకపోయాము. అందువల్ల మీరు మళ్ళీ మన ఊరిలో ఫంక్షన్ చేయండి” అన్నారు. ఆ సమయంలోనే మేము ఊళ్ళో ఉన్న మా ఇళ్ళను కూడా రిపేర్ చేయించాము. అందువల్ల అందరూ, “సత్యనారాయణస్వామివ్రతం, పాప ఫంక్షన్ రెండూ ఒక్కసారే పెడదాము, బాగుంటుంది” అన్నారు. మావారు కూడా ‘సరే, అలానే చేద్దామ’న్నారు. పదిరోజుల్లోనే రెండు ఫంక్షన్స్‌కి కావలసిన ఏర్పాట్లు ప్రారంభించాము. అందరికీ ఫోన్లు చేసి ఆహ్వానించడం కూడా మొదలుపెట్టాము. అంతలోనే, రాజమండ్రిలో క్రొత్త స్ట్రెయిన్ కరోనా కేసు వెలుగుచూసిందనీ, ఆ బాధితురాలు కూడా రాజమండ్రి హాస్పిటల్లోనే ఉందనీ టీవీ వార్తల్లోనూ, దినపత్రికలోనూ చూశాము. దాంతో మాకు భయం వేసింది. ఎందుకంటే, మేము ఫంక్షన్ చేసేది రాజమండ్రిలోనే. మా మావయ్యగారు కూడా, “అమ్మా! మీరు ఫంక్షన్ రాజమండ్రిలో పెట్టారు. కానీ రాజమండ్రిలో లాక్‌డౌన్ ఉందని మా షావుకారు ఫోన్ చేశారు. మీరేమో ఫంక్షన్‌కి అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నారు. మరోసారి ఆలోచించుకోండి” అన్నారు. ఇంక మావారికి, నాకు భయం మొదలైంది. “ఫంక్షన్‌కి అందరినీ ఆహ్వానించాము, అన్ని ఏర్పాట్లూ చేశాము, ఇప్పుడెలాగా?” అనుకున్నాము. కానీ బాబా మాతో ఉన్నారనే విశ్వాసంతో ధైర్యంగా ఫంక్షన్ చేశాము. ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఫంక్షన్ అయిన తరువాత మావారు నాతో, “ఫంక్షన్ అయితే బాబా దయవల్ల చాలా బాగా జరిగింది. కానీ మనవల్ల ఎవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యా రాకుండా ఉండాలి. అప్పుడే మనం ఫంక్షన్ బాగా చేసినట్లు” అన్నారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరే దగ్గరుండి రెండుసార్లు పాప ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిపించారు. రాబోయే 15 రోజుల్లో ఈ ఫంక్షన్‌కి వచ్చినవారెవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యా రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లయితే నేను సచ్చరిత్ర పారాయణ చేసి, నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పటికి అంతా బాగానే ఉంది. ఎవ్వరికీ ఏ సమస్యా రాలేదు. “అంతా మీ దయవల్లనే బాబా. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని నమ్ముకున్న భక్తులను చేయిపట్టుకుని ఆ సమస్యల నుండి బయటకు తీసుకువస్తారని ఎప్పుడూ ఋజువుచేస్తూనే ఉన్నారు బాబా!”
శ్రీ సచ్చిదానంద సదగ్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సచ్చరిత్ర పారాయణతో నెరవేరిన కోరికలు
ఓం రాజాధిరాజాయ విద్మహే
యోగిరాజాయ ధీమహి
తన్నో సాయి ప్రచోదయాత్
ఓం సాయి! సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నడుపుతున్న సాయికి నా ప్రత్యేక నమస్కారాలు. ఇటీవల మా అబ్బాయిల విషయంలో నేను కోరుకున్నవి నెరవేరాలని బాబాను ప్రార్థించి సాయి సచ్చరిత్ర సప్తాహపారాయణ ప్రారంభించాను. ఫిబ్రవరి 25, గురువారంరోజుకి సప్తాహపారాయణ ముగిసింది. పారాయణ ముగిసేలోగానే మా పెద్దబ్బాయి విషయంలో నేను కోరుకున్నది బాబా నెరవేర్చిన అనుభవాన్ని (మా కోడలు విదేశాలకు వెళ్ళే విషయంలో తన మనసు మార్చుకున్న అనుభవం) మీతో పంచుకున్నాను. ఇప్పుడు, మా చిన్నబ్బాయి విషయంలో నేను కోరుకున్న రెండు కోరికలను బాబా నెరవేర్చిన అనుభవాన్ని పంచుకోబోతున్నాను.
మా చిన్నబ్బాయి ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలైంది. మొదటి సంవత్సరం ట్రైనింగ్, తరువాతి సంవత్సరం ఉద్యోగంలో ఉన్నాడు. మా అబ్బాయికి జీతం పెరగాల్సి ఉంది. అంతేకాదు, బోనస్ కూడా అందవలసి ఉంది. అది చాలా మంచి కంపెనీ. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల కంపెనీవాళ్ళు తనకు జీతం పెంచటం ఆలస్యమైంది. అందువల్ల నేను పారాయణ ప్రారంభించేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా చిన్నబ్బాయికి త్వరగా జీతం పెరిగేలా, బోనస్ కూడా త్వరగా వచ్చేలా అనుగ్రహించండి” అని కోరుకున్నాను. ఆశ్చర్యకరంగా, బుధవారం రాత్రి నా కలలో మా చిన్నబ్బాయి కనిపించి, “నాకు బోనస్ వచ్చిందమ్మా” అని చెప్పాడు. విచిత్రం! రెండు రోజుల తరువాత, శుక్రవారంనాడు, అంటే పారాయణ పూర్తయిన మరునాడు మా చిన్నబ్బాయి ఆఫీసు నుండి నాకు ఫోన్ చేసి, “అమ్మా! నాకు ఆరువేల రూపాయల జీతం పెంచారు. అంతేకాదు, బోనస్ కూడా త్వరలోనే వస్తుంది” అన్నాడు. తన మాట వినగానే ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అదేరోజు సాయంత్రం మా చిన్నబ్బాయి మళ్ళీ ఫోన్ చేసి, “అమ్మా! నాకు 94 వేల రూపయల బోనస్ వస్తుందని చెప్పారు” అని చెప్పాడు. బాబా చూపిన అనుగ్రహానికి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, “ఎల్లప్పుడూ మాపై దయవుంచు సాయీ! అందరినీ చల్లగా చూడు సాయీ!” అని బాబాను వేడుకున్నాను. “బాబా! తల్లి, తండ్రి లేని మాకు అన్నీ నీవే అయి మమ్మల్ని చల్లగా చూడు సాయీ! మమ్మల్ని కాపాడు సాయీ!”
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om sai please be with us. With your blessings Tirupati trip must with out any trouble.give darshan of God.om sai baba������❤
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram baba ma amma arogyam bagundela chudu thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete