సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాధువు మరియు కూలీ రూపాలలో సీతాకాంత్ గారిని రక్షించిన బాబా


రైలు ప్రమాదం నుండి తన భక్తుని రక్షించిన బాబా లీల.

'తన భక్తులను కాపాడటానికి బాబా అనేక రూపాలను ధరిస్తారు' అని శ్రీసాయిసచ్చరిత్రలో మనం చదువుకున్నాము. అటువంటి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీరు చదవబోతున్నారు. ఈ లీలలో, రైలు ప్రమాదం నుండి తమ భక్తుడైన సీతాకాంత్ కామత్‌ని కాపాడటానికి బాబా ఒక సాధువు మరియు కూలీ రూపాలను ధరించారు.

సీతాకాంత్ కామత్ మిజోరంలో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ అతని పదవీకాలం పూర్తికావడంతో ఆగస్టు, 1971లో అతనికి మిజోరం నుంచి ముంబైకి బదిలీ అయ్యింది. మిజోరం నుంచి ముంబై వెళ్ళే ప్రయాణం సుదీర్ఘమైనదనీ, దుర్భరమైనదనీ మరియు ప్రమాదకరమైనదనీ అతని సహచరులు సూచించారు. అందుచేత కామత్ తన ప్రయాణం క్షేమంగా సాగాలని తమ కులదేవతను ప్రార్థించి, ముంబై బయలుదేరాడు. మొదటిదశ ప్రయాణం బస్సులో పర్వతప్రాంతాల గుండా జరిగింది. ఆ మార్గమంతా ఒకవైపు నిటారుగా ఉన్న పర్వతాలు, మరోవైపు అతి లోతైన లోయలతో నిండివుంది. పొరపాటున డ్రైవర్ నియంత్రణను కోల్పోయినట్లయితే, మరుక్షణం బస్సు లోతైన లోయలో పడిపోవటం ఖాయం. ఆ మార్గంలో ఎటువంటి ప్రమాద హెచ్చరికలూ లేవు. అంతటి ప్రమాదకరమైన మార్గంలో తన ప్రయాణం సాగింది. ఏదైతే ఏమి, చివరకు డ్రైవర్ సురక్షితంగా సిల్చార్ అనే ప్రాంతానికి చేర్చాడు.

ఇక, తన ప్రయాణంలో రెండవదశ ట్రైన్‌లో వెళ్లవలసివుంది. కామత్ సిల్చార్‌లో ముంబయికి ఒక టికెట్ తీసుకొని ఒక మిలిటరీ ఆఫీసర్ ద్వారా బెర్త్ కూడా సంపాదించాడు. రైలు భారీ సొరంగాల గుండా గౌహతికి వెళ్లనుంది. కామత్ తన బెర్త్‌పై సౌకర్యవంతంగా పడుకొని చిన్న గురక తీస్తూ ఉన్నాడు. అనుకోకుండా తన పక్కన ఎవరో నిల్చుని ఉన్నట్లు తోచి కామత్ కళ్ళు తెరిచి చూశాడు. ప్రక్కనే తెల్లని గడ్డం మరియు మీసంతో, పొడవైన కఫ్నీ ధరించి ఉన్న ఒక ఫకీరుని చూశాడు. ఆ ఫకీరుకి సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు ఉంది. అతడు హిందీలో, "బాబూజీ, ఇక్కడ దిగి ఈ నగరాన్ని, కామాక్షి దేవాలయాన్ని సందర్శించండి" అని చెప్పి కనుమరుగైపోయాడు. ఇప్పుడు కామత్ ఒక పెద్ద గందరగోళంలో పడ్డాడు. "ఇప్పుడు ఇక్కడ దిగిపోతే, మొత్తం లగేజీ ఎక్కడ పెట్టాలి? మళ్ళీ మరో రైలులో ప్రయాణించాల్సి వస్తుంది. ఒకవేళ టికెట్ పొందలేకపోతే?" అని సందిగ్ధంలో పడిపోయాడు. ఇటువంటి స్థితిలో ఉన్న కామత్‌కి గౌహతి స్టేషన్‌లో రైలు నిలిచి ఉందని కూడా తెలియలేదు. ఇంతలో ఒక కూలీ వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఆ కూలీ అచ్చం అంతకుముందు కామత్ చూసిన ఫకీరులానే ఉన్నాడు, కాకపోతే, బ్యాడ్జి ఉండే రైల్వే కూలీలు ధరించే ఎర్రని యూనిఫామ్ ధరించి ఉన్నాడు. అతని బ్యాడ్జిపై '389' అనే నెంబర్ ఉంది. ఆ కూలీ వేగంగా కామత్ సామానులన్నీ తన చేతిలోకి తీసుకొని, 'పదండి' అని అన్నాడు. కామత్ ఏదో ఒక మైకంలో అతన్ని అనుసరించాడు. సామాన్లన్నీ క్లోక్‌రూమ్‌లో డిపాజిట్ చేసి కూలీవాడు అదృశ్యమైపోయాడు. తరువాత కామత్ స్నానం చేసి, టీ త్రాగుతూ ఉండగా, ఇంతలో అతను దిగిన రైలు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిన తరువాత ఒక ఘోర ప్రమాదానికి గురైందని విని నిర్ఘాంతపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో అనేకమంది ప్రయాణీకులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది తీవ్రమైన గాయలపాలయ్యారు. తనని రైలు నుండి దించి తన జీవితాన్ని కాపాడిన ఆ కూలీ గుర్తుకువచ్చి అతని కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ అతనెక్కడా కనిపించకపోవటంతో స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి బ్యాడ్జి నెంబర్ 389 గల కూలీ గురించి అడిగాడు. స్టేషన్ మాస్టర్ ద్వారా 'ఆ బ్యాడ్జ్ నెంబర్ గల కూలీ ఎవరూ లేరని, అసలు ఆ నెంబరుతో బ్యాడ్జే లేద'ని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

మరుసటిరోజు అతను నాసిక్ చేరుకున్నాడు. వెంటనే అతనికి శిరిడీ సందర్శించాలని తీవ్రమైన ప్రేరణ కలిగి అక్కడి నుండి నేరుగా శిరిడీ చేరుకుని, సమాధిమందిరంలోకి వెళ్ళాడు. సమాధిమందిరంలోని బాబా విగ్రహాన్ని చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే, ఆ మూర్తి తన జీవితాన్ని కాపాడిన ఫకీరు మరియు కూలీని పోలివుంది! ఆ రూపాలలో వచ్చి తనను కాపాడింది బాబానే అని అర్థమై కన్నీళ్ళతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

సోర్స్: శ్రీసాయిసాగర్ మ్యాగజైన్, జులై-ఆగస్ట్ 2006

కదిలే ట్రైన్ నుండి పడిపోతున్న భక్తుని కాపాడిన బాబా


కదిలే ట్రైన్ నుండి పడిపోతున్న తనని బాబా ఎలా రక్షించారో శ్రీR.మెర్‌వాలా ఇలా చెప్తున్నారు...

నేను ముంబాయిలో వకీలుగా పనిచేసేవాడిని. నేను దేవీ, దేవుళ్ళను అంతగా నమ్మేవాణ్ణికాదు. కానీ నాకు సాయిబాబాపై నమ్మకం వుండేది. అది 1963వ సంవత్సరం. ఒకరోజు నేను లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్‌లో చాలా రద్దీగా ఉండటం వలన నేను ఎంట్రన్స్ దగ్గరే నిలబడి ఉన్నాను. లోపల అంతా తోపులాటగా ఉంది. అంతలో నేను రన్నింగ్ ట్రైన్ నుంచి క్రిందపడబోయాను.  ఆ సమయంలో వెంటనే నాకు బాబా గుర్తుకువచ్చి మనసులో బాబా స్మరణ చేసుకున్నాను. అంతే! ఎలా వచ్చారో, ఎక్కడ నుంచి వచ్చారో గానీ ఒక వృద్ధుడు వచ్చి ట్రైన్ ఆపడానికి ఉపయోగించే 'అలారం చెయిన్' పట్టుకొని లాగారు. ట్రైన్ ఆగిపోయింది. ఇంతలో ట్రైన్ స్టాఫ్ వెతుక్కుంటూ వచ్చి‌, 'చెయిన్ ఎవరు లాగార'ని అడిగారు. అందరూ ఆ వృద్ధుని కోసం చూశారు. కానీ ఆ వృద్ధుడు ఎవరికీ కనపడలేదు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. నేను ఇంటికి వెళ్లి మావాళ్ళతో జరిగినదంతా చెప్పాను.

ఈ సంఘటన జరిగిన 11 సంవత్సరాల తరువాత మా అబ్బాయి ఒక సత్పురుషుడిని కలవడానికి 'చాలీస్‌గాఁవ్' అనే ఊరికి వెళ్ళాడు. ఆ సత్పురుషుడు, "ఏమి? నేను ఆరోజు మీ నాన్నను ట్రైన్ నుంచి పడబోతుంటే రక్షించలేదా?" అని అడిగారు. అంతే! అక్కడున్న అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. దీనివలన, బాబా సర్వవ్యాపకుడు, జగదీశ్వరుడు అనీ, పిలిచిన వెంటనే సమయానికి వస్తారనీ, తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారనీ స్పష్టమవుతుంది.

అమాయక భక్తులను సాయిబాబా ఎంతో ప్రేమిస్తారు


సాయిబాబా గొప్ప లీల.

కొన్ని నెలల క్రితం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ని కలుసుకున్నాను. ఆమె పేరు విక్కీ. నేను ఆమెని 'విక్కీదీదీ' (దీదీ అంటే అక్క) అని పిలుస్తుంటాను. ఆమె ఒక సంవత్సర కాలంగా టచ్‌లో లేరు. అనుకోకుండా ఆరోజు కలుసుకున్నాను. మేము తనని లంచ్‌కి రమ్మని ఆహ్వానించాము. ఆమె ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని సమస్యల కారణంగా ఆమె తన భర్తనుండి విడిగా ఉందని తెలిసింది. వారికి మంచి నడవడిగల చక్కటి అందమైన 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆమె ఇతర మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించడం కోసం ఆలోచించకుండా విడాకులకు ప్రయత్నిస్తోంది. ఆమె సమస్యలను విన్న తరువాత నేను ఆమెకు బాబా గురించి చెప్పాను. "బాబాను నమ్ము, ఏదైనా అద్భుతం జరగవచ్చు" అని పట్టుబట్టాను. ఆమెకు నేను బాబా లీలల గురించి, నేను అనుభూతి చెందిన కొన్ని అనుభవాల గురించి వివరంగా చెప్పాను. నాకు నా బాబా గురించి మాట్లాడటమంటే ఎంతో ఇష్టం. నేను ఇలా బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె అంత శ్రద్ధగా వినకపోయినప్పటికీ, ఆమె కొడుకు మాత్రం చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఆరోజు గురువారం, పైగా మధ్యాహ్న ఆరతి సమయం కావడంతో నేను వారిని కొంచెం వేచి ఉండమని, నేను బాబాకి ఆరతి ఇవ్వడం మొదలుపెట్టాను.

నేను పూజ మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ నా వెనుక నిలుచున్నారు. నేను దీపాలు వెలిగించి, బాబాకు చందనం పెట్టడం, నైవేద్యం పెట్టడం చేస్తూ ఉంటే బాబు పూజ అంతా శ్రద్ధగా గమనించి, "చికూదీదీ! దీపాలు, ధూపం ఎందుకు? ఆహారం ఎందుకు? ఈ విగ్రహం తింటుందా?" అని ప్రశ్నించాడు. తను అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలకు నేను చాలా తార్కికంగా వాడికి జవాబు చెప్పాను, ఎందుకంటే పిల్లవాడి యొక్క ఉత్సుకత నిజంగా అధికంగా ఉందని నాకు తెలుసు. "దీపం వలన విశ్వాసం పెరుగుతుంది, దీపం వెలుగులో మనం మన హృదయాలలో ఉండే దేవుని కాంతిని చూడగలుగుతాం. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని వాటిని నెరవేరుస్తాడు. మనం ప్రేమతో ఆహారం పెట్టినట్లయితే సాయిబాబా తప్పకుండా తింటారు. మనకు పళ్ళెం నిండుగా ఆహారం ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆయన ఖచ్చితంగా తింటారు" అని చెప్పాను. తరువాత నేను ఆమెను బాబా నుండి తన ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూడమని కూడా చెప్పాను. అదే వారం చివర్లో వచ్చిన ఆదివారంనాడు ఒక టీవీ సీరియల్‌లో, "పిల్లలు దేవుని దూతలు(ప్రతిరూపాలు)" అని బాబా చెప్పారు. 

తరువాత జరిగిన బాబా లీల చూడండి.

తరువాత ఒక ఆదివారంనాడు సాయిమందిరంలో ఆమెను కలుసుకున్నాను. ఎవరైతే బాబాను నమ్మలేదో తను ఇప్పుడు బాబా మందిరంలో! పిల్లాడు తన తండ్రి చేతుల్లో ఉన్నాడు!!!

ఆమె మమ్మల్ని చూసి ఏడవటం ప్రారంభించింది. "బాబా దర్శనం చేసుకున్న తరువాత మీ ఇంటికే వద్దామని అనుకున్నాను" అని చెప్పింది. మా అమ్మ, "నీ కథలో ట్విస్ట్ గురించి చెప్పు" అని ఆమెని అడిగింది. "ఆరోజు మీ ఇంటినుండి తిరిగి వచ్చినపుడు బాబు చిన్న బాబా ఫోటోతోపాటు, దీపములు మరియు అగరుబత్తీలు తీసుకోమని పట్టుబట్టాడు. తర్వాత ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత ఎవరి సహాయం లేకుండా వాడే వాటిని వెలిగించి, "చికూదీదీ (యొక్క) సాయిబాబా! మీరు అందరి కోరికలు నెరవేరుస్తారు కదా! మా డాడీని మా ఇంటికి తీసుకొని రండి. ఈ కోరిక తీర్చండి బాబా!" అని ప్రార్థించేవాడు.

తరువాత ఒక గురువారంనాడు నా భర్త ఇంటికి వచ్చి తన కొడుకును తనకు ఇమ్మని అడిగాడు. "నాకు మమ్మీ కూడా కావాలి" అని బాబు అన్నాడు. దానితో అతను అన్నీ మర్చిపోయి మమ్మల్ని తనతో తీసుకు వెళ్ళడానికి అంగీకరించారు. మేము బయలుదేరి అతనితో వెళ్ళేటప్పుడు, "చికూదీదీ సాయిబాబాను మనతో తీసుకొని వెళ్దాం" అని బాబు అన్నాడు. తండ్రికి బాబా ఫోటో తన కొడుకుకి ఇష్టమైన ఒక ఆటబొమ్మలా అనిపిస్తున్నప్పటికీ, పిల్లవాడికి తెలుసు, తన సాయిబాబానే కష్టపడి తన తండ్రిని తెచ్చారని. 

మేము నా భర్త ఇంటికి చేరుకున్న తరువాత బాబుకి మ్యాగీ తయారుచేసి ఇచ్చారు. వాడు సంతోషంగా దానిని తీసుకొని, ఎంతో ప్రేమగా ముందు దానిని బాబాకు పెట్టాడు. తన కొడుకు చేసినది చూసి అతను ఎంతో మురిసిపోయారు. ఇప్పుడు సాయి ఆలయానికి రావడం కూడా ఆయన కోరికే!" అని చెప్పింది. 

ఇది అద్భుతమైన బాబా లీల కాదా! అమాయక భక్తులను సాయిబాబా ఎంతో  ప్రేమిస్తారు.

బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు


సాయిబాబా దేవుడు. నేను 'శ్రీసాయిబాబా దేవుని కంటే ఎక్కువ' అని చెప్తాను. సాయిబాబా ఇప్పటికీ ఈ విశ్వంలో ఉన్నారని నా అభిప్రాయం.  ప్రాచీనకాలంలో నిజమైన భక్తులు దేవుణ్ణి చూశారని అంటారు. వారు దేవుని దర్శనం కోసం తపస్సులు చేశారు. కానీ శ్రీసాయిబాబా శిరిడీలో కొన్ని సంవత్సరాలపాటు సత్పురుషులుగా ఉన్నారు. ఎంతోమంది వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందారు. తద్వారా వారంతా ఎంతో మేలు పొందారు. ఇప్పటికీ బాబా పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారు బాబా దీవెనలు, సహాయం పొందుతున్నారు. నేటికీ ఎంతోమంది భక్తులు శ్రీసాయిబాబా దర్శనం పొందుతున్నారు. ఆరాధనకు సంబంధించినంతవరకూ ఏ దేవునియందైనా విశ్వాసం చాలా ముఖ్యమైన అంశం. "ఏ సాధారణ రాయిని పూర్ణ విశ్వాసంతో ఆరాధన చేసినా, ఆ రాయిలో దేవుని చూడవచ్చు" అని మరాఠీలో ఒక సామెత ఉంది. కాబట్టి మీకు నచ్చిన దేవతని పూజించేటప్పుడు పూర్ణ విశ్వాసం ఉండాలి.

నేను శ్రీసాయిబాబా యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటూ నా కష్టాలలో నాకు సహాయం చేశారు. ఎప్పుడైనా నేను ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు బాబాను తలచుకొని 'ఆ పని విజయవంతం కావాల'ని ప్రార్థిస్తాను. బాబా ఆశీర్వాదం వలన నా పనులన్నీ విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

1985 జూన్ చివరి వారంలో బొంబాయి నగరం మరియు శివారు ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. అన్ని లోకల్ రైళ్ళు అస్తవ్యస్తంగా నడపబడుతున్నాయి. ఒకరోజు ఉదయం పరిస్థితి బాగుండటం వలన పోర్ట్ ప్రాంతంలో ఉన్న 'బొంబాయి పోర్ట్ ట్రస్ట్' కార్యాలయానికి వెళ్ళాను. కానీ మధ్యాహ్నం 2 గంటల నుండి వాతావరణం పూర్తిగా మారిపోయి, నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. దాని ఫలితంగా సెంట్రల్ రైల్వే లోకల్ రైళ్లు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యాయి. అన్ని స్థానిక రైళ్ళు కుర్లా స్టేషన్ వరకు నడుస్తున్నాయి. కుర్లా తర్వాత ఉన్నవారు కుర్లా వరకు స్థానిక రైళ్ల ద్వారా వెళ్లి అక్కడి నుండి టాక్సీ లేదా ఆటోరిక్షాను అద్దెకు తీసుకొని థానేకు వెళ్ళాలి. నా నివాసం బద్లాపూర్. అది బొంబాయి V.T(విక్టోరియా టెర్మినల్) నుండి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు ఇంటికి చేరుకోవడం నాకు ఒక పెద్ద సమస్య అయ్యింది. బొంబాయి నగరంలో ఉండటానికి నాకు మరో ప్రత్యామ్నాయం లేదు. భారీవర్షం కురుస్తూ ఉండటంతో నాకు ఏమి చేయాలో తోచక కలత చెందుతున్నాను. ఈ పరిస్థితులలో నేను నా బంధువుల వద్దకు వెళ్ళలేను. ఈ పరిస్థితిలో నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చి ఆయనను ప్రార్థించాను. ఆయన నన్ను ఎటువంటి పరిస్థితిలోనైనా ఇంటికి తీసుకువెళతారని నేను నిశ్చయించుకున్నాను. ఇలా అనుకున్న తర్వాత బాబా నన్ను మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్లాట్‌ఫాం వద్దకు నడిపించారు. డెక్కన్ క్వీన్ రైలు బొంబాయి V.T. స్టేషన్ 9వ నెంబర్ ప్లాట్‌ఫాంలో నిలబడి ఉంది. నిజానికి అది గంట క్రితం వెళ్లిపోవల్సినది, కానీ ఒక గంట ఆలస్యమై ప్లాట్‌ఫాం పైన ఉంది. డెక్కన్ క్వీన్ సాయంత్రం 6.10కి V.T. స్టేషన్‌లో బయలుదేరింది. ఇది బద్లాపూర్ దాటిన తర్వాత వచ్చే కర్జత్ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. అయినప్పటికీ నేను 'కర్జత్‌కి వెళ్లి అక్కడినుండి లోకల్ రైలులో బద్లాపూర్ తిరిగి రావచ్చులే' అని మనసులో అనుకున్నాను. భారీవర్షం కారణంగా డెక్కన్ క్వీన్ దాదర్, థానా, కళ్యాణ్ వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతూ పోతుంది. కళ్యాణ్ తర్వాత కర్జత్‌లో మాత్రమే ఆగుతుంది. కానీ నా ఆశ్చర్యానికి అవధులు లేవు. డెక్కన్ క్వీన్ బద్లాపూర్ స్టేషన్‌లో ఆగింది. "నా ప్రియమైన బిడ్డా! ఇది నీవు దిగవలసిన స్టేషన్, దిగి ఇంటికి వెళ్ళు" అని బాబా చెప్తున్నట్లు అనిపించింది. బాబా ఆశీర్వాదంతో నేను బద్లాపూర్ స్టేషన్‌లో సంతోషంగా దిగాను. నేను రాత్రి 9.30 గంటలకు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాను. ఇంటిలో నా భార్యాపిల్లలు ఆందోళనగా ఉన్నారు. రైళ్ళు కుర్లా స్టేషన్ వరకు మాత్రమే వస్తున్నాయని వారికి తెలిసిన కారణంగా వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. బాబానే నన్ను క్షేమంగా ఇక్కడకు తీసుకువచ్చారని నేను వారికి చెప్పి, బాబా ఫోటో ముందు నిలిచి తలవంచి నమస్కరించుకొని, హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా నిజంగా సర్వశక్తిమంతుడు. ఈవిధంగా బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నారు.

మధుకర్ వఖరే, బద్లాపూర్.

సోర్స్: శ్రీ సాయిలీల, సెప్టెంబర్ 1985.

రండి బండ్లకొద్దీ ఊదీని తీసుకొని పోండి.


పిలిస్తే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శిరిడీ సాయినాథునికి పాదాభివందనం. నా పేరు విజయరాణి సురేష్. మేము L.B.నగర్‌ (హైదరాబాద్)లో ఉంటాము. "నా మనసులో ఉన్న కోరికను బాబా ఎలా తీర్చారో అన్న అనుభవాన్ని, నా సంతోషాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు బాబా. ఎల్లప్పుడూ నా మనసులోని కోరికను తెలుసుకుని వాటిని నెరవేరుస్తూ, నేను క్షణక్షణం సంతోషంగా ఉండేలా చేస్తున్నందుకు ధన్యవాదాలు." "నా భక్తులను అన్నివిధాలుగా ఆదుకోవడానికే నేను ఉన్నది" అని బాబా అనేవారు. బాబా సజీవంగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన  భక్తుల మనసులోని కోరికలను తీర్చి వారిని సంతోషపెడుతున్నారన్నది నిజం.

మామూలుగా మా కుటుంబసభ్యులందరం కలిసి శిరిడీ పుణ్యక్షేత్రం దర్శించేవాళ్ళం. కానీ, ఒకసారి కొన్ని కారణాల వల్ల మావారు సురేష్ ఒక్కరే శిరిడీ వెళ్లారు. మా ఇంట్లో ఎప్పుడూ బాబా ఊదీ ఉంటుంది. కానీ ఆ సమయంలో మా ఇంట్లో ఒకటి రెండు ఊదీ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల మావారు శిరిడీ బయలుదేరేటప్పుడు, 'శిరిడీ నుండి ఊదీ ప్రసాదం ఎక్కువగా తీసుకునిరండి' అని చెబుదామనుకుని మర్చిపోయాను. తరువాత ఆ విషయం గుర్తుకొచ్చి తనకు ఫోన్ చేసి చెబుదామంటే ఫోన్ అస్సలు కలవట్లేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! ఊదీ అయిపోవస్తోంది, మళ్ళీ శిరిడీ వెళ్లేవరకు ఒకటో, రెండో ఊదీ ప్యాకెట్లతో ఎలా సరిపెట్టుకోవాలి?" అని కేవలం మనసులో చెప్పుకున్నాను. "బాబా! "రండి, బండ్లకొద్దీ ఊదీని తీసుకొనిపోండి" అని మీరు అంటారు కదా! అయితే నాకు ఊదీ ప్రసాదం చాలా పంపించండి బాబా" అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ విశ్వమంతా వ్యాపించిన బాబాకు నా మనసులోని కోరికను తెలుసుకోవడం చాలా చిన్న విషయం కదా! మావారు శిరిడీ నుండి 30, 40 ఊదీ ప్యాకెట్లు తెచ్చారు. "ఇదెలా సాధ్యం? ఒకసారి లైనులో నిలబడితే ఒక ఊదీ ప్యాకెట్ మాత్రమే ఇస్తారు కదా! మీరు 40 సార్లు లైనులో నిలుచున్నారా?" అని అడిగాను. అందుకు మావారు, "కాదు, ఒక తెలియని వ్యక్తి నా వద్దకు వచ్చి, 'ఇదిగో, ఊదీ ప్రసాదం తీసుకో!' అని ఇచ్చారు. నేను తీసుకున్నాను" అని చెప్పారు. చూశారా! బాబా నా మనసులోని మాటను గ్రహించి నాకు ఊదీ ప్రసాదం ఇచ్చారు. బాబా ప్రేరణతోనే కదా ఆ వ్యక్తి మావారికి ఊదీ ఇచ్చింది? పైగా శిరిడీలో! ఇది బాబా నాకు ఇచ్చిన ఊదీ ఆశీర్వాదం.

ఇంకోసారి నా మనసులో 'బాబా రాతిపై కూర్చున్న ఫోటో కావాల'ని అనిపించింది. "బాబా! ఆ ఫోటోకు పూజ చేస్తే బాగుంటుంది కదా!" అనుకున్నాను. అంతే, మూడు రోజుల తరువాత మా బంధువులలో ఒకరు బాబా రాతిపై కూర్చున్న ఒరిజినల్ ఫోటో తీసుకొచ్చి నా ముందు ఉంచారు. నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే, బాబా అంటారుగా, "నాకు, నా ఫోటోకి తేడా లేదు. నా ఫోటో ఉంటే నేను ఉన్నట్టే" అని. "బాబా, ఇలా కరుణించారా!" అని ఆశ్చర్యపోయాను. 'బాబా, అలా అనుకుంటే ఇలా మీకు  తెలిసిపోతుందా!' అని ఆనందంగా అనిపించింది. ఆ శిరిడీ సాయినాథుడే ఫోటో రూపంలో వచ్చారు. నా చేత పూజలందుకుంటున్నారు.

బాబా నా భర్తకి పునర్జన్మనిచ్చారు


నా పేరు అనూరాధ. నా వయస్సు 56 సంవత్సరాలు. మేము చెన్నై నివాసస్థులం. నేను నా జీవితంలో మర్చిపోలేని సాయిలీల ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అనుభవంతో నేను బాబా యొక్క అమితమైన ప్రేమను చవిచూశాను. నమ్మకమే లేని నేను ఈ అనుభవంతో సాయికి అంకిత భక్తురాలిని అయిపోయాను. కేవలం నేనే కాదు, మా కుటుంబమంతా సాయిభక్తులం అయిపోయాం.

1997వ సంవత్సరం, ఫిబ్రవరి నెల 8వ తేదీన నేను ఆఫీసుకి వెళ్ళడానికి దాదాపుగా సిద్ధమయ్యాను. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఏదో ఆందోళనగా అనిపించింది. అందువలన ఇంటిలోనే ఉండిపోయాను. అప్పటికే నా భర్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. యాంటీబయాటిక్స్ వాడినా తనకి నయం కాలేదు. రోజు గడుస్తున్నకొద్దీ, అంటే మధ్యాహ్నం తరువాత జ్వరతీవ్రత ఇంకా అధికం కావడంతో ఆయన స్పృహలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అత్యవసర పరిస్థితిలో తనని మేము హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాము. డాక్టర్ ఆయనని పరీక్షించి, 'Pnuemococal Menningitis'గా నిర్ధారణ చేశారు. అంటే, చాలా అరుదుగా వచ్చే బ్రెయిన్ ఫీవర్. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఆ రోగం వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. డాక్టర్స్ కూడా, "ఆయన చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ"ని చెప్పారు. అటువంటి పరిస్థితిలో నాకు ఏమి చేయాలో తోచక నిస్సహాయంగా ఉండిపోయాను.

అట్టి స్థితిలో ఆ ఆపద నుండి నన్ను బయటపడవేయడానికి సాయిబాబా నా జీవితంలోకి అడుగుపెట్టారు. అంతవరకూ నేను ఎన్నడూ వినని 'శ్రీసాయిసచ్చరిత్ర' పుస్తకం గురించి చెప్పి, నన్ను పారాయణ చెయ్యమని మా దగ్గర బంధువు ఒకామె సలహా ఇచ్చారు. 'ఆ పుస్తకం సాయిబాబా జీవితం మరియు బోధనల గురించి తెలియజేస్తుందని, అది పారాయణ చేస్తే ఎంతో మేలు జరుగుతుంద'ని కూడా తను చెప్పింది. ఆరోజే నేను 'శ్రీసాయిసచ్చరిత్ర'  పుస్తకం తీసుకొని, సమయ నియమం అంటూ ఏమీ లేకుండా, 'ఆ స్థితిలో బాబా మాత్రమే నాకు సహాయం చేయగలర'న్న నమ్మకంతో ఎంతో శ్రద్ధగా పారాయణ చేశాను.

48 గంటల తరువాత ఒక అద్భుతం జరిగింది. నేను, మా చెల్లి మైలాపూరులో ఉన్న బాబా గుడికి వెళ్లాము. బాబా దర్శనం చేసుకొని, దయచూపమని బాబాను ప్రార్థించి, ఊదీ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాము. గత మూడు రోజుల నుండి నా భర్త కోమాలోనే ఉన్నారు. నేను హృదయపూర్వకంగా బాబాని ప్రార్థించి, నా భర్త నుదుటి మీద ఊదీ రాశాను. ఊదీ రాసిన కొద్ది క్షణాలలో గదిలో ఏదో శబ్దం వినిపించినట్లు అయ్యింది. చూస్తే ఆశ్చర్యం! మావారి అవయవాలలో కదలిక కనపడింది. అప్పుడు బాబా ఊదీ మహిమ ఏమిటో నాకు అర్థమైంది. ఆసుపత్రిలో వైద్యులు 'వైద్యచరిత్రలో ఇది ఒక అద్భుతమ'ని అన్నారు. వైద్యులకే వైద్యుడు మన సాయి క్రమంగా నా భర్తకు నయం చేశారు.

సాయికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా జీవితాంతం నేను సాయికి ఋణపడి ఉంటాను. ఆ కష్టసమయంలో అండగా నిలిచిన నా కుటుంబసభ్యులు నా సోదరులు, నా తల్లి, నా మరదలు మరియు నా సోదరి, ముఖ్యంగా సాయిని పరిచయం చేసిన మా బంధువుకు నా కృతజ్ఞతలు.

ప్రియమైన సాయిభక్తులకు నేను చెప్పేది ఒకటే - కష్టకాలంలో సాయి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారని నేను గ్రహించాను. కేవలం మనం భక్తి విశ్వాసాలతో ఆయనపై దృష్టి పెట్టి, ఆయన నామస్మరణ చేసుకుంటే చాలు.

"నా సమాధి నుండి నా కార్యం నిర్వహిస్తాను. మీరు ఎక్కడవున్నా, నన్ను తలచిన మరుక్షణం నేను మీ ముందు ఉంటాను" అని బాబా చెప్పారు.



నీవు చింతించకు, ప్రతిదీ జాగ్రత్త తీసుకోబడుతుంది


వాట్సాప్ గ్రూపులోని ఒక సాయిబంధువు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.



2018, జూన్ 18 నాటి ఒక కల మీతో పంచుకుంటాను.



కొన్నిరోజుల క్రితం నేనుఒక సాయిబంధువు బాబా పేరు మీద జరుగుతున్న మోసాల గురించి చాలా బాధగా చర్చించుకున్నాం. "ఏదైనా  విషయంలో బాబాయే చేయాలిమనము చేయగలిగింది ఏమీ లేదు" అని అనుకున్నాము.



2018, జూన్ 16 శనివారం సాయంత్రం ఒక సాయిభక్తుడు ఇలా చెప్పారు"రెండు సంవత్సరాల క్రితం ఒకతను  విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నా వద్ద నుండి డబ్బు తీసుకొని మోసం చేసాడుఇప్పుడు  డబ్బు తీసుకున్న వ్యక్తి 'గురువు'గా అవతారమెత్తి కనిపించాడుప్రజలు గుడ్డిగా అతనిని అనుసరిస్తున్నారుఅతను బాబా పేరు చెప్పుకొని ప్రజల వద్ద నుండి డబ్బు గుంజుతున్నాడు".


ఇటువంటి సంఘటనే 2015లో నాకు కూడా జరిగిందిఢిల్లీలోని ఒకచోట సాయి మందిర నిర్మాణం చేస్తామంటేనేను  చోటుకు సమీపంలో ఉన్న రెండు కమ్యూనిటీల నుండి నిధులను సేకరించి ఇచ్చాను వ్యక్తి కూడా డబ్బంతా తీసుకొని పారిపోయాడు. ఇప్పటివరకు అతని గురించి  సమాచారం లేదు.


నిన్న రాత్రి నేను ఇటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేకపోయానునా మనస్సులో ఎన్నెన్నో ప్రశ్నలువేటికీ సమాధానాలు లేవుచివరికి నేను బాబాని"బాబాఏం జరుగుతుందివాళ్ళు అలా తప్పులు చేయడానికి మీ పేరును ఎందుకు ఉపయోగించుకుంటున్నారువాళ్ళు మీరే కావాలని(ప్రతి ఒక్కళ్ళు బాబాలే అయిపోవాలనిప్రయత్నిస్తున్నారువాళ్ళు మిమ్మల్నే దోచుకుంటున్నారుఏమిటిదంతా?" అని అడిగాను.


తరువాత సుమారు 2 గంటల సమయంలో నేను నిద్రపోయాను, 4గంటలకి నా అలారం మ్రోగటం వలన మెలకువ వచ్చిందికానీ మళ్ళీ నిద్రపోయానుకాసేపటికి నాకు 1977లో వచ్చిన "షిర్డీ కే సాయిబాబాచిత్రంలో బాబాగా నటించిన అతని మాటలు వినిపించాయిఅతను"నీవు చింతించకుప్రతిదీ జాగ్రత్త తీసుకోబడుతుంది" అని చెప్పారుతరువాత కొద్దిసెకన్లు అంతా నిశ్శబ్దంగా ఉందితరువాతఒక పేపర్ గానిపెన్ను గానిచేయి గాని ఏదీ కూడా కనిపించకుండా, "నా ఎముకలు మీతో మాట్లాడతాయిమీకు ఆశను కలిగిస్తాయి" అని వాటంతట అవే వ్రాయబడ్డాయి. ఇదంతా ప్రాతఃకాలాన వచ్చిన కల కల అక్కడితో ముగిసింది.


ఆరోజు తేదీ జూన్ 18 అంటే 1 + 8 = 9.


 కల ద్వారా బాబా నన్ను ఆశీర్వదించారు"నేను ఎక్కడికీ పోలేదుఇప్పటికీ మీతోనే ఉన్నానుప్రతిరోజూ మీతో మాట్లాడుతూనే ఉన్నాను" అని బాబా నిరూపించారు.


ధన్యవాదాలు బాబా.

బాబా పెట్టిచ్చిన వ్యాపారం - నిజదర్శనం.


సాయిబంధువులందరికీ నమస్కారం! బాబా ఆశీస్సులు తన పిల్లలమైన మన అందరిపై ఉండాలని ఆ సాయి మహరాజ్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


నా పేరు సురేష్‌ గౌడ్. నేను L.B.నగర్‌లో ఉంటాను. నా జీవితంలో ఒక అద్భుతమైన లీల జరిగింది. దానిని "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా మీతో పంచుకోవడానికి బాబా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. 



20 సంవత్సరాల క్రితం నేను, మా బావమరిది కలిసి ఒక బిజినెస్ మొదలుపెట్టాం. అంతా సజావుగా సాగి వ్యాపారం బాగానే అభివృద్ధి చెందింది. కాలక్రమేణా మా బావమరిదికి, నాకు మధ్యన మనస్పర్థలు వచ్చాయి. ఇక నాకు అతనితో కలిసి ఉండడం ఇష్టంలేక బిజినెస్ నుండి పక్కకు తప్పుకున్నాను. ఆ సమయంలో నా దగ్గర కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే మిగిలాయి. నాకు అప్పుడే  కొత్తగా పెళ్లయింది దానికితోడు ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలో అర్థంకాక మనస్సు ఏమీ బాగోలేదు. ఏమీ తోచని ఆ స్థితిలో బాబా గుడికి వెళ్లి బాబా కాళ్ళు పట్టుకుని గట్టిగా నా మొర చెప్పుకున్నాను. "బాబా! ఏం చేస్తావో నాకు తెలియదు. నా దగ్గర ఏడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటిని పదింతలుగా చేసి నాతో బిజినెస్ పెట్టివ్వు. భారమంతా నీ మీదనే వేస్తున్నాను" అని చెప్పి ఇంటికి వెళ్ళాను.



"ఎవరికైతే నమ్మకం, ఓపిక ఉంటాయో వారిని భగవంతుడు రక్షిస్తాడు." నా నమ్మకము, నా ధైర్యం అంతా సాయిబాబానే. కొన్ని రోజులు గడిచాయి. నా బంధువులలో ఒకరు చిట్టి మొత్తం ఎత్తుకుని తీసుకొని, "నీవు బిజినెస్ పెట్టుకో! తర్వాత నాకు ఇవ్వు" అంటూ నాకు డబ్బులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, నేను వారిని డబ్బులు అడగలేదు. అడిగితే ఇవ్వడమే కష్టం. కానీ అడగకుండా ఇవ్వడం అంటే అది బాబా ప్రేరణ కాకుంటే ఇంకేమిటి? వారు ఇచ్చిన డబ్బుతో బిజినెస్ పెట్టుకున్నాను. చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది. సంతోషంగా ఉన్నాం. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి.



ఒకరోజు షాపులో సత్యనారాయణవ్రతం చేసుకోవడానికి అంత సిద్ధం చేసుకున్నాము. అంతలో కాషాయ వస్త్రం ధరించిన ఒక ముసలాయన (అచ్చం బాబాలాగే ఉన్నారు.) నా దగ్గరకు వచ్చి దక్షిణ అడిగారు. “నేనే నీకు అన్నం పెట్టాను. నాకు నువ్వు డెబ్భై రూపాయలు ఖర్చు చేసి అన్నం తినిపించాలి” అన్నారు. నేను అతనికి పది రూపాయలు ఇచ్చి, "వెళ్ళు, తినుపో" అన్నాను. అప్పట్లో ఏడు రూపాయలకు భోజనం హోటల్లో దొరుకుతుంది. కానీ తాను డెబ్భై రూపాయలు అడుగుతున్నందున "ఇవ్వను, వెళ్ళు వెళ్లు" అన్నాను. "నేను ఇచ్చిన అన్నం తింటూ నాకు అన్నం పెట్టవా? అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా?” అని అంటూ నేను కూర్చున్న కుర్చీ వెనక బాబా ఫోటోకి ఉన్న దండలోనుండి ఒక పువ్వుని తీసి చేతితో నలిపి విభూతిగా మార్చారు. “ఇంకా నమ్మట్లేదా!” అని మళ్ళీ ఇంకో పువ్వు నలిపి మళ్ళీ విభూతిగా మార్చి నా నుదుటిన పెట్టారు. అయినప్పటికీ 'అతను ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు' అని అనుకున్నాను. “ఇంకా నమ్మవా?” అంటూ మూడోసారి కూడా పువ్వు నలిపి  విభూతిగా మర్చి చూపించారు. “నాకు భోజనానికి డెబ్భై రూపాయలు ఇవ్వు. నీకు అంతా మంచి జరుగుతుంద"ని చెప్పారు"ఈ మసీదులో నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్నే ఈ మాయ బంధిస్తుంది" అనేవి బాబా వాక్కులు. కానీ అదే మాయ నన్ను జయించింది. బాబాని గుర్తించలేకపోయాను. "ఎవరైనా ధన సహాయం కానీ ఇతర సహాయం కానీ కోరి నీ వద్దకు వస్తే ఇవ్వటానికి ఇష్టం లేకుంటే ఇవ్వకు. కానీ వారిపై కుక్కలా అరవకు" అని బాబా అన్న మాటలు గుర్తొచ్చి పదిరూపాయలు ఇచ్చి పంపించాను. అయినాగానీ బాబా ఎంతటి కరుణాసాగరుడో! ఆయన అడిగినంత ఇవ్వకపోయినా నన్ను ఆశీర్వదించి "నీకు మంచే జరుగుతుందిలే, దిగులుపడకు" అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన బయటకు వెళ్ళిపోయాక అప్పుడు నాకు అనిపించింది, 'ఒకవేళ నిజంగా బాబానేమో! మోసం ఏం లేదేమో' అని. అలా అనుకుని బయటకు వచ్చాను. కానీ ఆయన క్షణంలో మాయం అయిపోయారు. నా అజ్ఞానంతో నేను నా సాయిని గుర్తించలేకపోయానని చాలా బాధేసింది. నాకోసం తాను కదిలొచ్చారు. ఎంత ప్రేమ సాయికి తన పిల్లలపైన!



భగవంతుని మార్గం అసామాన్యమైనది, మిక్కిలి విలువైనది, అది కనుగొన వీలులేనిది, భగవంతుడే మనకు దారి చూపుతాడు. నా భగవంతుడైన సాయి మహరాజ్ నాకు ధన సహాయంగా ఏడు వేలను డెబ్భై వేలుగా మార్చి నాతో బిజినెస్ పెట్టించారు. నన్ను కష్టకాలంలో ఆదుకున్నారు. అందుకే ఏడు రూపాయల భోజనం కోసం డెబ్భై రూపాయలు అడగడానికి వచ్చారు. తనకి మనం ఎంత సమర్పించుకుంటామో దానికి పదింతలు నేను మీకు సమర్పించాల్సి ఉంటుంది అని బాబా అనేవారు కదా! అందుకే డెబ్భై రూపాయలు అడిగారని తర్వాత అర్థం అయింది. కానీ నేను తనని మాయతో గుర్తించలేకపోయాను. అందుకే బాబా గుడిలో అన్నదానం కోసమని నాకు తోచినంత సహాయం చేస్తూ అప్పుడు ఇవ్వని దక్షిణ ఇప్పుడు ఇలా అన్నదాన రూపంలో బాబాకు సమర్పించుకుంటున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని బాబా అన్నారుగా. సాయి మహరాజ్ కీ జై!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo