సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రండి బండ్లకొద్దీ ఊదీని తీసుకొని పోండి.


పిలిస్తే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శిరిడీ సాయినాథునికి పాదాభివందనం. నా పేరు విజయరాణి సురేష్. మేము L.B.నగర్‌ (హైదరాబాద్)లో ఉంటాము. "నా మనసులో ఉన్న కోరికను బాబా ఎలా తీర్చారో అన్న అనుభవాన్ని, నా సంతోషాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు బాబా. ఎల్లప్పుడూ నా మనసులోని కోరికను తెలుసుకుని వాటిని నెరవేరుస్తూ, నేను క్షణక్షణం సంతోషంగా ఉండేలా చేస్తున్నందుకు ధన్యవాదాలు." "నా భక్తులను అన్నివిధాలుగా ఆదుకోవడానికే నేను ఉన్నది" అని బాబా అనేవారు. బాబా సజీవంగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన  భక్తుల మనసులోని కోరికలను తీర్చి వారిని సంతోషపెడుతున్నారన్నది నిజం.

మామూలుగా మా కుటుంబసభ్యులందరం కలిసి శిరిడీ పుణ్యక్షేత్రం దర్శించేవాళ్ళం. కానీ, ఒకసారి కొన్ని కారణాల వల్ల మావారు సురేష్ ఒక్కరే శిరిడీ వెళ్లారు. మా ఇంట్లో ఎప్పుడూ బాబా ఊదీ ఉంటుంది. కానీ ఆ సమయంలో మా ఇంట్లో ఒకటి రెండు ఊదీ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల మావారు శిరిడీ బయలుదేరేటప్పుడు, 'శిరిడీ నుండి ఊదీ ప్రసాదం ఎక్కువగా తీసుకునిరండి' అని చెబుదామనుకుని మర్చిపోయాను. తరువాత ఆ విషయం గుర్తుకొచ్చి తనకు ఫోన్ చేసి చెబుదామంటే ఫోన్ అస్సలు కలవట్లేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! ఊదీ అయిపోవస్తోంది, మళ్ళీ శిరిడీ వెళ్లేవరకు ఒకటో, రెండో ఊదీ ప్యాకెట్లతో ఎలా సరిపెట్టుకోవాలి?" అని కేవలం మనసులో చెప్పుకున్నాను. "బాబా! "రండి, బండ్లకొద్దీ ఊదీని తీసుకొనిపోండి" అని మీరు అంటారు కదా! అయితే నాకు ఊదీ ప్రసాదం చాలా పంపించండి బాబా" అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ విశ్వమంతా వ్యాపించిన బాబాకు నా మనసులోని కోరికను తెలుసుకోవడం చాలా చిన్న విషయం కదా! మావారు శిరిడీ నుండి 30, 40 ఊదీ ప్యాకెట్లు తెచ్చారు. "ఇదెలా సాధ్యం? ఒకసారి లైనులో నిలబడితే ఒక ఊదీ ప్యాకెట్ మాత్రమే ఇస్తారు కదా! మీరు 40 సార్లు లైనులో నిలుచున్నారా?" అని అడిగాను. అందుకు మావారు, "కాదు, ఒక తెలియని వ్యక్తి నా వద్దకు వచ్చి, 'ఇదిగో, ఊదీ ప్రసాదం తీసుకో!' అని ఇచ్చారు. నేను తీసుకున్నాను" అని చెప్పారు. చూశారా! బాబా నా మనసులోని మాటను గ్రహించి నాకు ఊదీ ప్రసాదం ఇచ్చారు. బాబా ప్రేరణతోనే కదా ఆ వ్యక్తి మావారికి ఊదీ ఇచ్చింది? పైగా శిరిడీలో! ఇది బాబా నాకు ఇచ్చిన ఊదీ ఆశీర్వాదం.

ఇంకోసారి నా మనసులో 'బాబా రాతిపై కూర్చున్న ఫోటో కావాల'ని అనిపించింది. "బాబా! ఆ ఫోటోకు పూజ చేస్తే బాగుంటుంది కదా!" అనుకున్నాను. అంతే, మూడు రోజుల తరువాత మా బంధువులలో ఒకరు బాబా రాతిపై కూర్చున్న ఒరిజినల్ ఫోటో తీసుకొచ్చి నా ముందు ఉంచారు. నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే, బాబా అంటారుగా, "నాకు, నా ఫోటోకి తేడా లేదు. నా ఫోటో ఉంటే నేను ఉన్నట్టే" అని. "బాబా, ఇలా కరుణించారా!" అని ఆశ్చర్యపోయాను. 'బాబా, అలా అనుకుంటే ఇలా మీకు  తెలిసిపోతుందా!' అని ఆనందంగా అనిపించింది. ఆ శిరిడీ సాయినాథుడే ఫోటో రూపంలో వచ్చారు. నా చేత పూజలందుకుంటున్నారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo