సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా పెట్టిచ్చిన వ్యాపారం - నిజదర్శనం.


సాయిబంధువులందరికీ నమస్కారం! బాబా ఆశీస్సులు తన పిల్లలమైన మన అందరిపై ఉండాలని ఆ సాయి మహరాజ్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


నా పేరు సురేష్‌ గౌడ్. నేను L.B.నగర్‌లో ఉంటాను. నా జీవితంలో ఒక అద్భుతమైన లీల జరిగింది. దానిని "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా మీతో పంచుకోవడానికి బాబా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. 



20 సంవత్సరాల క్రితం నేను, మా బావమరిది కలిసి ఒక బిజినెస్ మొదలుపెట్టాం. అంతా సజావుగా సాగి వ్యాపారం బాగానే అభివృద్ధి చెందింది. కాలక్రమేణా మా బావమరిదికి, నాకు మధ్యన మనస్పర్థలు వచ్చాయి. ఇక నాకు అతనితో కలిసి ఉండడం ఇష్టంలేక బిజినెస్ నుండి పక్కకు తప్పుకున్నాను. ఆ సమయంలో నా దగ్గర కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే మిగిలాయి. నాకు అప్పుడే  కొత్తగా పెళ్లయింది దానికితోడు ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలో అర్థంకాక మనస్సు ఏమీ బాగోలేదు. ఏమీ తోచని ఆ స్థితిలో బాబా గుడికి వెళ్లి బాబా కాళ్ళు పట్టుకుని గట్టిగా నా మొర చెప్పుకున్నాను. "బాబా! ఏం చేస్తావో నాకు తెలియదు. నా దగ్గర ఏడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటిని పదింతలుగా చేసి నాతో బిజినెస్ పెట్టివ్వు. భారమంతా నీ మీదనే వేస్తున్నాను" అని చెప్పి ఇంటికి వెళ్ళాను.



"ఎవరికైతే నమ్మకం, ఓపిక ఉంటాయో వారిని భగవంతుడు రక్షిస్తాడు." నా నమ్మకము, నా ధైర్యం అంతా సాయిబాబానే. కొన్ని రోజులు గడిచాయి. నా బంధువులలో ఒకరు చిట్టి మొత్తం ఎత్తుకుని తీసుకొని, "నీవు బిజినెస్ పెట్టుకో! తర్వాత నాకు ఇవ్వు" అంటూ నాకు డబ్బులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, నేను వారిని డబ్బులు అడగలేదు. అడిగితే ఇవ్వడమే కష్టం. కానీ అడగకుండా ఇవ్వడం అంటే అది బాబా ప్రేరణ కాకుంటే ఇంకేమిటి? వారు ఇచ్చిన డబ్బుతో బిజినెస్ పెట్టుకున్నాను. చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది. సంతోషంగా ఉన్నాం. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి.



ఒకరోజు షాపులో సత్యనారాయణవ్రతం చేసుకోవడానికి అంత సిద్ధం చేసుకున్నాము. అంతలో కాషాయ వస్త్రం ధరించిన ఒక ముసలాయన (అచ్చం బాబాలాగే ఉన్నారు.) నా దగ్గరకు వచ్చి దక్షిణ అడిగారు. “నేనే నీకు అన్నం పెట్టాను. నాకు నువ్వు డెబ్భై రూపాయలు ఖర్చు చేసి అన్నం తినిపించాలి” అన్నారు. నేను అతనికి పది రూపాయలు ఇచ్చి, "వెళ్ళు, తినుపో" అన్నాను. అప్పట్లో ఏడు రూపాయలకు భోజనం హోటల్లో దొరుకుతుంది. కానీ తాను డెబ్భై రూపాయలు అడుగుతున్నందున "ఇవ్వను, వెళ్ళు వెళ్లు" అన్నాను. "నేను ఇచ్చిన అన్నం తింటూ నాకు అన్నం పెట్టవా? అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా?” అని అంటూ నేను కూర్చున్న కుర్చీ వెనక బాబా ఫోటోకి ఉన్న దండలోనుండి ఒక పువ్వుని తీసి చేతితో నలిపి విభూతిగా మార్చారు. “ఇంకా నమ్మట్లేదా!” అని మళ్ళీ ఇంకో పువ్వు నలిపి మళ్ళీ విభూతిగా మార్చి నా నుదుటిన పెట్టారు. అయినప్పటికీ 'అతను ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు' అని అనుకున్నాను. “ఇంకా నమ్మవా?” అంటూ మూడోసారి కూడా పువ్వు నలిపి  విభూతిగా మర్చి చూపించారు. “నాకు భోజనానికి డెబ్భై రూపాయలు ఇవ్వు. నీకు అంతా మంచి జరుగుతుంద"ని చెప్పారు"ఈ మసీదులో నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్నే ఈ మాయ బంధిస్తుంది" అనేవి బాబా వాక్కులు. కానీ అదే మాయ నన్ను జయించింది. బాబాని గుర్తించలేకపోయాను. "ఎవరైనా ధన సహాయం కానీ ఇతర సహాయం కానీ కోరి నీ వద్దకు వస్తే ఇవ్వటానికి ఇష్టం లేకుంటే ఇవ్వకు. కానీ వారిపై కుక్కలా అరవకు" అని బాబా అన్న మాటలు గుర్తొచ్చి పదిరూపాయలు ఇచ్చి పంపించాను. అయినాగానీ బాబా ఎంతటి కరుణాసాగరుడో! ఆయన అడిగినంత ఇవ్వకపోయినా నన్ను ఆశీర్వదించి "నీకు మంచే జరుగుతుందిలే, దిగులుపడకు" అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన బయటకు వెళ్ళిపోయాక అప్పుడు నాకు అనిపించింది, 'ఒకవేళ నిజంగా బాబానేమో! మోసం ఏం లేదేమో' అని. అలా అనుకుని బయటకు వచ్చాను. కానీ ఆయన క్షణంలో మాయం అయిపోయారు. నా అజ్ఞానంతో నేను నా సాయిని గుర్తించలేకపోయానని చాలా బాధేసింది. నాకోసం తాను కదిలొచ్చారు. ఎంత ప్రేమ సాయికి తన పిల్లలపైన!



భగవంతుని మార్గం అసామాన్యమైనది, మిక్కిలి విలువైనది, అది కనుగొన వీలులేనిది, భగవంతుడే మనకు దారి చూపుతాడు. నా భగవంతుడైన సాయి మహరాజ్ నాకు ధన సహాయంగా ఏడు వేలను డెబ్భై వేలుగా మార్చి నాతో బిజినెస్ పెట్టించారు. నన్ను కష్టకాలంలో ఆదుకున్నారు. అందుకే ఏడు రూపాయల భోజనం కోసం డెబ్భై రూపాయలు అడగడానికి వచ్చారు. తనకి మనం ఎంత సమర్పించుకుంటామో దానికి పదింతలు నేను మీకు సమర్పించాల్సి ఉంటుంది అని బాబా అనేవారు కదా! అందుకే డెబ్భై రూపాయలు అడిగారని తర్వాత అర్థం అయింది. కానీ నేను తనని మాయతో గుర్తించలేకపోయాను. అందుకే బాబా గుడిలో అన్నదానం కోసమని నాకు తోచినంత సహాయం చేస్తూ అప్పుడు ఇవ్వని దక్షిణ ఇప్పుడు ఇలా అన్నదాన రూపంలో బాబాకు సమర్పించుకుంటున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని బాబా అన్నారుగా. సాయి మహరాజ్ కీ జై!


1 comment:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo