సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆకలి తీర్చానని పుష్ప గుచ్చం స్వీకరించిన దయామయుడు


సిద్ధిపేట సాయిబాబా టెంపుల్ ఛైర్మెన్ కొండా క్రిష్ణమూర్తిగారు తమ అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. ఒకసారి నేను, నా స్నేహితులు కలిసి బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాము. మేము బాబా దర్శనానికి వెళుతుంటే బయట పువ్వులు అమ్మేవాళ్లు 'పువ్వులు తీసుకో'మని మా వెంటపడ్డారు. నేను నా మనసులో, 'పూలు తీసుకెళ్తానుగానీ, వాటిని బాబా సమాధి మీద ఉంచుతారో, లేదో! ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని పక్కన పడేయడం?' అని అనుకుని వద్దంటే వద్దని అన్నాను. కానీ ఆ పిల్లలు అస్సలు వదలలేదు. "తీస్కోండి సార్! మీరు తీసుకుంటే వచ్చిన డబ్బులతో మా ఆకలి తీర్చుకుంటాము" అని అన్నారు. అలోచించి, 'సర్లే ఒకరి ఆకలి ఇలా తీరుతుంటే మంచిదేగా!' అని అనుకుని, డబ్బులు ఇచ్చి పువ్వులు తీసుకున్నాను. కానీ, ఆ పువ్వులు వాడిపోయి ఉన్నాయి. 'సరే, డబ్బులు వాళ్ళ ఆకలి తీరుస్తున్నాయిగా' అని అనుకుని సాయినామం చెప్పుకుంటూ హారతికి వెళ్ళాం. నా ముందు చాలా జనం ఉన్నారు. హారతి అవుతుంటే బాబా దివ్యమంగళరూపాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు. మనసంతా ఏదో తెలియని తన్మయత్వంతో నిండిపోయింది. మంత్రపుష్పం మొదలైంది. అంతలో ఒక పూజారి నా దగ్గరకు వచ్చి, నా దగ్గర ఉన్న పుష్పగుచ్ఛం తీసుకుని, నేరుగా వెళ్లి బాబా సమాధి మీద ఉంచారు. 'అరే, నా ముందు ఇంతమంది ఉంటే, పూజారి నా వద్దకొచ్చి పుష్పగుచ్ఛం తీసుకెళ్లి అక్కడ బాబా దగ్గర ఉంచడం ఏమిట'ని నేను ఆశ్చర్యపోయాను. ఇదెంతో అద్భుతమని, బాబా లీల అని నాకు అన్పించింది. తరువాత ఆ పిల్లల ఆకలి తీర్చడం కోసమే ఆ పుష్పగుచ్ఛం కొన్నందుకు ఆ దయామయుడు, కరుణామయుడు అయిన సాయినాథుడు సంతోషించి, వాడిన పువ్వులు అయినా సరే ప్రేమతో స్వీకరించారని నేను అనుకున్నాను. బాబాకు హంగులు, ఆర్భాటాలు నచ్చవు. అందుకే పువ్వుల కోసం ఖర్చుచేసే డబ్బులు బయట భిక్షువులకు ఇస్తే బాబా ఆనందిస్తారని నా ఉద్దేశ్యం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo