సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పిపోకుండా బాబా ఇచ్చిన ‘మచ్చ’



కొల్హాపూర్ నివాసస్థుడైన భాయ్ (దురదృష్టవశాత్తు ఇతని పూర్తి పేరు, ఏ సంవత్సరంలో బాబాను దర్శించిందీ తెలియలేదు) అనే భక్తుడు ఒకసారి ముంబాయిలో నివాసముంటున్న తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని మేనకోడలు అతని నుదుటిపై ఉన్న పెద్ద మచ్చ గురించి అడిగింది. అందుకతను, “ఈ మచ్చ బాబా నాకు ప్రసాదించిన గొప్ప బహుమతి” అని చెప్పి ఆనందభరితుడయ్యాడు. తరువాత ఇంకా ఇలా చెప్పాడు: “నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి శిరిడీ వెళ్ళాను. నేను అప్పటికే ‘బాబా తమ పాదాలకు గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తారని, తరచూ భక్తుల వద్దనుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారని, పెద్దపెద్దగా భక్తులపై అరుస్తార’ని విని ఉన్నందువలన ‘బాబాలో ఏదైనా దైవత్వం ఉందా? లేక ఆయనొక డాంబికుడా?’ అని తెలుసుకొని, వారిని గేలి చేయాలన్నది నా ఉద్దేశ్యం. 

శ్రమతో కూడుకున్న సుదూర ప్రయాణం తరువాత మేము శిరిడీ చేరుకుని ద్వారకామాయికి వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ చాలామంది భక్తులు భక్తిగీతాలు పాడుతుండగా, మరికొందరు సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారు. బాబా తమ చేతులతో చిరతలు వాయిస్తూ ఉల్లాసంగా నృత్యం చేస్తున్నారు. మేము వెళ్లి కూర్చున్నంతనే బాబా, “వీళ్ళు ఇక్కడికి నన్ను ఎగతాళి చేయాలని వచ్చారు” అని అంటూ తమ చేతిలో ఉన్న చిరతలను నాపై విసిరారు. అవి నా నుదుటికి తాకి గాయమై బాగా రక్తం కారసాగింది. అయినా బాబా నన్ను పట్టించుకోకుండా తమ నృత్యాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తరువాత భక్తులు నన్ను పిలిచి, రక్తస్రావాన్ని ఆపడానికి గాయమైనచోట ఊదీ రాశారు. ఆశ్చర్యంగా మరుక్షణమే రక్తస్రావం ఆగిపోయింది. 

అప్పుడు బాబా మా జేబులు ఖాళీ చేసి తమ ముందు పెట్టమన్నారు. మా వద్ద ఉన్న డబ్బు, పర్సులు అన్నీ తీసుకున్న తరువాత, “మీరు దేనినైతే చూడాలని ఇక్కడికి వచ్చారో అదంతా చూసినట్లయితే మీరు ఇప్పుడే బయలుదేరవచ్చు” అని అన్నారు బాబా. అయితే అప్పటికే చీకటిపడింది, మేమంతా ఆకలితో బాధపడుతూ అలసిపోయి ఉన్నాము. పైగా మా దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ బాబా మమ్మల్ని వెళ్ళమన్నాక మాకు ఇంకో దారి లేదు. అందువలన మేము కోపర్‌గాఁవ్ వైపు అడుగులు వేశాము. బాగా చీకటిపడింది, కనీసం వీధిదీపాలు కుడా లేవు. ఆ చీకటిలోనే అతికష్టం మీద మా నడక సాగించాము. కొంతదూరం పోయాక మేము దారి తప్పినట్టు గుర్తించి విశ్వాసంతో బాబాపై భారం వేసి ముందుకుసాగాము. కొద్దిదూరంలో ఒక రాయిపై కూర్చొని చిలుం త్రాగుతున్న వ్యక్తిని చూసి నేను పరిగెత్తుకుంటూ వెళ్లి, “బాబా! మేము దారితప్పాము. దయతో స్టేషన్‌కి మాకు దారి చూపిస్తారా? మేము మీకు ఋణపడివుంటాము” అని అన్నాను. అప్పుడు బాబా నా చేయి పట్టుకున్నారు. ఆయన చేయి చాలా చల్లగా వుంది, ఆ స్పర్శకు నేను వణికిపోసాగాను. తరువాత బాబాతో కలిసి మేము అయిదడుగులు వేశాము. అంతే, మా ముందు స్టేషన్ వుంది. అప్పుడు బాబా, “ఇక నేను వెళతాను. ఇకపై ఈ విధంగా దారి తప్పకండి” అని చెప్పి అదృశ్యమయ్యారు. 

ఆ క్షణాన నా అజ్ఞానం, అహంకారం అంతరించిపోయాయి. నా అజ్ఞానం పూర్తిగా నశించి బాబా మాటలలోని ఆంతర్యం అవగతమైంది. అంతలోనే మా తిరుగు ప్రయాణ టికెట్లు, ఆహారానికి సంబంధించిన ప్రశ్న తలెత్తింది. మరుక్షణం నా స్నేహితుడొకడు, “నీ జేబు ఎత్తుగా ఎందుకుంది? అందులో ఏమున్నాయో నన్ను చూడనీ” అంటూ నా జేబులో వెతికాడు. ఆశ్చర్యం! మా పర్సులు, డబ్బులు అన్నీ ఆ జేబులో వున్నాయి. అంతటితో మేమంతా తృప్తిగా భోజనం చేసి మా ఇళ్లకు చేరుకున్నాము. నా జీవితాంతం ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పిపోకుండా బాబా నాకు ఈ మచ్చని ప్రసాదించారు”.

ఈ మిథ్యాప్రపంచంలో దారి తప్పినప్పుడు గురువు మన చేయి పట్టుకొని వాస్తవికత వైపు నడిపిస్తారు.

 సమాప్తం .....

రిఫరెన్స్: సాయి ప్రసాద్ పత్రిక, 1995 దీపావళి సంచిక.
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ.

6 comments:

  1. Very nice Baba's leela om sai ram

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  4. Kothakonda SrinivasMay 15, 2021 at 7:13 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo