సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1278వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎల్లవేళలా భక్తులను రక్షించే బాబా
2. సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి
3. సమస్యను సామరస్యంగా పరిష్కరించిన బాబా 

ఎల్లవేళలా భక్తులను రక్షించే బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ముందుగా మా ఇంటి దైవం శ్రీమల్లిఖార్జునస్వామికి, శ్రీసాయిబాబాకి నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు నా కంట్లో నలుసు పడి నేను చాలా చాలా బాధపడ్డాను. మందులు వేసుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. ఇంకా ఆ రాత్రి నేను నిద్రపోయేముందు బాబా ఊదీ ధరించి, "నొప్పి తగ్గి, నలుసు పోయినట్లైతే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని నిద్రపోయాను. తక్షణమే నిద్రపట్టి కొంత సమయం తరువాత మెలకువ వచ్చింది. అప్పటికి నొప్పి తగ్గింది. నలుసు కూడా పోయింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి నా తలకు దెబ్బ తగిలి నొప్పిగా ఉంటే, బాబా ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల నొప్పి తగ్గింది. ఇంకోసారి నా కాలు తిమ్మిరెక్కి ఎంతకీ తగ్గలేదు. రెండు, మూడు రోజులైనా కూడా ఆ తిమ్మిరి తగ్గలేదు. అప్పుడు నేను బాబా ఊదీ నా కాళ్ళకు రాసుకుంటే తిమ్మిరి తగ్గుముఖం పట్టి, క్రమంగా తగ్గిపోయింది.


ఒకసారి మేము తిరుపతి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక స్టేషన్‌లో రైలు ఆగితే నీళ్లకోసమని మా అన్నయ్య, బావ దిగారు. రైలు కదిలాక మా బావ వచ్చారు కాని, అన్నయ్య కనిపించలేదు. నేను కంగారుగా బాబాను తలుచుకుంటూ తనకోసం వెతికితే తను వాష్ రూమ్‌లో నుంచి బయటకి వచ్చాడు.


ఒకసారి నా బ్యాంకు ఏటీఎం కార్డు కనిపించలేదు. ఇంకా మినీ బ్యాంకుకి వెళ్లి నా అకౌంట్లో నుండి కొంత డబ్బు తెచ్చుకున్నాను. మరికొంత డబ్బు అకౌంట్లో ఉండగా హఠాత్తుగా  ఏటీఎం ద్వారా 500 రూపాయలు తీసిన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను వెంటనే బ్యాంకుకి వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ చేయించాను. తరువాత ఆలోచిస్తే, చాలారోజుల క్రితం నా ఏటీఎం నా ఫ్రెండ్‌కి ఇచ్చానని, తను నాకు తిరిగి ఇవ్వలేదని గుర్తొచ్చింది. ప్రస్తుతం అతను వేరే ప్రాంతంలో ఉన్నాడు. అతనికి నా ఏటీఎం పిన్  తెలుసు కాబట్టి అతనే నా ఏటీఎం కార్డు ద్వారా నా అకౌంట్లో నుండి డబ్బులు తీశాడని అర్థమైంది. బాబా దయవల్ల అతను నా అకౌంట్ నుండి డబ్బులు తీసే సమయానికి కొద్దిసేపు ముందే నేను మినీ బ్యాంకుకి వెళ్లి డబ్బులు తెచ్చుకున్నాను, లేదంటే ఆ డబ్బులు కూడా నష్టపోయేవాడిని. బాబానే పెద్ద నష్టం జరగకుండా, సమస్య ఎదురవకుండా నన్ను రక్షించారు.


ఒకరోజు రాత్రి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. నేను ఆ నొప్పిని తట్టుకోలేక బాబాని ప్రార్థించి, "తలనొప్పి తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. కొద్దిసేపట్లో అంత నొప్పి కూడా తగ్గిపోయి నాకు నిద్ర పట్టింది. ఈవిధంగా బాబా కృప నాపైన, మా కుటుంబంపైన ఉంది. ఆయన ఎల్లవేళలా తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఆయన పిలిచిన పలికే దైవం. అంతా సాయిమయం. "ధన్యవాదాలు బాబా".


సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి


సాయి బంధువులందరికీ నమస్కారం. భక్తుల అనుభవాలను ప్రచురిస్తూ తోటి భక్తుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఈ బ్లాగు నిర్వహకులకు శతకోటి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు పద్మజ. మేము ఇండోర్‍లో ఉంటున్నాము. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2021, డిసెంబరులో నేను సెలవులకి గుంటూరులో ఉన్న మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడొకరోజు నా కొత్త ఫోను క్రిందపడి స్క్రీన్ మొత్తం పాడైపోయింది. ఇక అది పని చేయదని అనుకున్నాము. సామ్‍సంగ్ కంపెనీవాళ్ళకి ఫోన్ చేస్తే, ఫోన్ తీసుకుని రండి అని అన్నారు. సరేనని ఫోన్ తీసుకుని వెళితే, వాళ్ళు మొబైల్ అంతా చెక్ చేసి 8,000 నుండి 10,000 దాకా ఖర్చవుతుందని అన్నారు. అప్పుడు నేను, "బాబా! పైసా ఖర్చు లేకుండా నా ఫోన్ బాగైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు కంపెనీవాళ్ళు ఫోన్ చేసి, అంతా వివరంగా చెప్పి, ఫోన్ తీసుకుని రండి అని అన్నారు. నేను ఇండోర్కి తిరిగి వెళ్ళాక ఫోన్ తీసుకుని వెళితే, ఒకే ఒక్కరోజులో పైసా ఖర్చు లేకుండా నా ఫోన్ బాగు చేసి ఇచ్చారు. ఇదంతా బాబా కృపవలనే సాధ్యం అయింది. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడు సాయిబాబా".


2022, జూన్ 30న ఎల్.ఐ.సిలో పనిచేసిన మా అమ్మ పదవీవిరమణ చేసారు. ఆ సందర్భంగా మేము గుంటూరు వెళ్లడానికి, "ఏ ఆటంకం లేకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాము. ఆయన దయవల్ల చాలా సుళువుగా మావారికి లీవ్ సాంక్షన్ అయింది. అలాగే ఆ సమయంలో మా బాబుకి ఏ పరీక్షలు లేకుండా చేసారు బాబా. ట్రైన్ టిక్కెట్లు కూడా దొరికేలా అనుగ్రహించారు. మేము సంతోషంగా వెళ్లి, కార్యక్రమానికి హాజరై తిరిగి వచ్చాం. "ఎప్పుడైనా, ఎక్కడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనుంటాను. భయం వద్దు" అని చెప్పినట్లే బాబా నా పెద్ద పెద్ద సమస్యలను చాలా తేలికగా పరిష్కరించారు. నా సొంత ఇంటి కలను నేరవేర్చారు. మాకు కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలతో మేము పడిన బాధను తీర్చారు. సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. సాయిని ఎల్లవేళలా ప్రార్ధించండి. "ధన్యవాదాలు బాబా. అమ్మ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి. నేను ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కోరిక కోరుతున్నాను తండ్రి. తొందరగా దానిని అనుగ్రహించండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


సమస్యను సామరస్యంగా పరిష్కరించిన బాబా 


సాయి బంధువులందరికీ నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును మాకు అందించిన బ్లాగు నిర్వాహక బృందానికి ధన్యవాదాలు. నా పేరు గోపాలకృష్ణ. నేను గతంలో కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొంచెం ఆలస్యంగా ఈ అనుభవం పంచుకుంటున్నందుకు ముందుగా క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. 2022, జూలై 23, శనివారం నాడు మా ఇంట్లో నాకు, నా భార్యకు మరియు నా సవతి తల్లి(పిన్ని)కి పెద్ద గొడవ జరిగింది. దాంతో, 'నా సమస్యేంటో బాబాకి తెలుసు. ఆయన దానినుండి బయటపడవేస్తార'ని నమ్మకంతో బ్రతుకుతున్న నేను, సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని కాస్త అసహనానికి గురై ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాను. తరువాత, "బాబా! ఇప్పటి నుండి ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడు తండ్రి. అలా చేస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అధ్భుతం చేశారు. నేను ఇంటికి వచ్చేసరికి అందరూ నిశబ్ధంగా ఉన్నారు. ఒక వారం రోజులు గమనించాను. బాబా దయవల్ల అందరమూ ప్రశాంతంగా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. ఇదేవిధంగా అందరికీ సహాయం చేయండి బాబా. నిన్నే నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి కాపాడు తండ్రి"..


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1277వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమస్య వచ్చినా తండ్రిలా ఆదుకునే బాబా
2. స్మరణతో లభించిన బాబా అనుగ్రహం
3. వర్షం పడకుండా అనుగ్రహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా

ఏ సమస్య వచ్చినా తండ్రిలా ఆదుకునే బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. మన నిత్య జీవితంలో ప్రతిక్షణం బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తుంటారు. ఆయన దయవల్ల నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా బాబు ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉండటానికి వెళ్ళాడు. తను అక్కడ ఒక హోటల్ రూమ్‍లో ఉండి రూమ్ కోసం చాలా చోట్ల వెతికాడు. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కానీ, రూమ్ దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! పిల్లాడికి అక్కడ ఒక రూమ్ దొరికేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం 5 గంటలకు బాబు ఫోన్ చేసి, "అమ్మా! రూమ్ దొరికింది" అని చెప్పాడు. నాకు చాలా షంతోషంగా అనిపించింది. వేడుకున్నంతనే కరుణ చూపిస్తారు బాబా.


ఉగాది ముందురోజు నా కడుపులో కుడివైపు నొప్పి వచ్చింది. నేను ఆ నొప్పిని భరించలేక "తట్టుకోలేకపోతున్నాను బాబా" అని బాబాతో చెప్పుకుని, ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి నొప్పి తగ్గింది.


మా తమ్ముడు ఒక పని విషయంగా ఒక రేకుల షెడ్ ఎక్కాడు. అప్పుడు రేకు పగిలిపోయి తను 25 అడుగుల ఎత్తు నుండి కిందకి పడిపోయాడు. మాకు చాలా భయమేసింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే, మా తమ్ముడు నాన్నలాగా మాకు ఎంతో సహాయంగా ఉంటాడు. వాడికేదన్నా అయితే మేము అస్సలు తట్టుకోలేము. అయితే తమ్ముడు చిన్నదెబ్బలతో ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. తరువాత, "అమ్మా! నువ్వెందుకు దిగులుపడుతున్నావు? నీకు ప్రియమైనవారు, నాకూ ప్రియమైనవారే కదా!" అని బాబా మెసేజ్ వచ్చింది. అప్పుడు, 'అంత ఎత్తునుండి పడిపోయినా తమ్ముడిని బాబానే  కాపాడార'ని నాకు అర్థమైంది.


మా అన్నయ్య (పెదనాన్న కొడుకు) బాగా త్రాగుతాడు. ఒకసారి తన ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసారు. డాక్టర్లు, "లివర్ పాడైంది. త్రాగుడు మానేయాల"ని చెప్పారు. అతను కొన్నాళ్ళు త్రాగుడు మానేసి మళ్ళీ ఈమధ్య త్రాగుతున్నాడని నాకు తెలిసింది. అతని భార్య చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. నేను చాలా భయపడి, "బాబా! వాడు త్రాగకుండా చేయండి. వాడికి ఏదన్నా జరిగితే పిల్లలిద్దరూ అన్యాయం అయిపోతారు. వాడు త్రాగడం మానేశాడని తెలిస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. తరువాత అతను తాగుతున్నాడో లేదో తెలుసుకుందామని భయంభయంగా ఫోన్ చేస్తే, తాగట్లేదని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నాకు ఏ సమస్య వచ్చినా తండ్రిలా బాబా ఆదుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు. ఏమైనా తప్పులుంటే క్షమించండి బాబా. ఎల్లవేళలా మాకు తోడుగా ఉండి మమ్మల్ని, మా పిల్లల్ని సన్మార్గంలో నడిపించండి బాబా. నా పిల్లల భారం మీకే అప్పగించాను. వాళ్ళ విషయంలో మేలు చేయండి తండ్రి. నా మనస్సులో ఒక కోరిక ఉంది. దాన్ని మీరే నెరవేర్చగలరు తండ్రి. అది జరిగాక నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


స్మరణతో లభించిన బాబా అనుగ్రహం


సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈ మధ్య డిగ్రీ పరీక్షలు వ్రాసాను. ఫలితాలు వెలువడ్డాక చూసుకుంటే, నేను కొన్ని సబ్జెక్టులలో పాసయ్యాను. ఇంకొన్ని సబ్జెక్టులలో ఫెయిల్  అయ్యాను. దాంతో నేను చాలా బాధపడుతుంటే నా స్నేహితురాలు ఫోన్ చేసి, "బాధపడకు, ఒక అవకాశం ఉంది. రీవాల్యూయేషన్కి అప్లై చేయి. తప్పకుండా పాసవుతావు" అని చెప్పింది. మళ్లీ ఒక వారం తరువాత తనే నాకు ఫోన్ చేసి, "రీవాల్యూయేషన్కి అప్లై చేయాల్సిన తేదీ వెల్లడించారు. నువ్వు నీ ఆధార్ కార్డు తీసుకుని కాలేజీకి వెళ్లి, ఫీజు కట్టు" అని చెప్పింది. అయితే నేను నా ఆధార్ కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలాసేపు వెతికినా దొరకలేదు. సరేనని కాలేజీకి వెళ్ళొచ్చాను. ఇంటికి వచ్చాక సాయికి నమస్కారం చేసుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని అనుకుంటూ పొద్దున్న ఎక్కడైతే వెతికానో అదే చోట మళ్లీ వెతికాను. ఆశ్చర్యం! నా ఆధార్ కార్డు దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ దయతో నేను డిగ్రీ అన్ని సబ్జెక్టులు పాసయ్యేలా  అనుగ్రహించండి బాబా. నేను గనక పాస్ అయితే, నా అనుభవాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను బాబా".


మా నాన్నగారు సౌదీలో ఉంటున్నారు. ఒకరోజు ఆయన ఫోన్‍లో నాతో, "కొన్నిరోజులుగా నా కళ్ళు విపరీతంగా మండుతున్నాయ"ని చెప్పారు. నేను బాబా ఫోటో ముందు కూర్చుని, సచ్చరిత్రలోని ఊదీ కథలు చదివి, ఆపై ఊదీని నా చేతిలోకి తీసుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించి నాన్నకి బదులు నేనే ఆ ఊదీని నా నుదుటన ధరించి, మరికొంత ఊదీని నోట్లో వేసుకున్నాను. అలా ఒక రెండు రోజులు చేశాక నాన్న ఫోన్ చేసి, "నా కంటి సమస్య తగ్గింది" అని చెప్పారు. నేను సంతోషంగా బాబా దగ్గరకి వెళ్లి మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను. చెప్పుకున్నంతనే ప్రతి విషయంలో బాబా నా కుటుంబాన్ని కాపాడుతున్నారు. "థాంక్యూ సో మచ్ సాయిబాబా. ఇలాగే నా అరికాలి మంటలు తగ్గేలా అనుగ్రహించండి బాబా".


వర్షం పడకుండా అనుగ్రహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా నా తండ్రి సాయినాథునికి కోటి కోటి ప్రణామాలు. సాయి కుటుంబసభ్యులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు అమరనాథ్. ఆ సాయినాథునితో అనుబంధం మరియు ఆయన లీలలకు సంబంధించి నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఆశీర్వాదంతో మరో అనుభవం పంచుకుంటున్నాను. నేను మా అబ్బాయికి వీసా వచ్చి, అన్నీ సక్రమంగా జరగాలని మా గ్రామదేవత 'రెడ్డి పేరంటాలమ్మ'కు కుంకుమ బండి కట్టి పూజ చేసుకుంటానని, అలాగే భోజనాలు పెడతానని అమ్మని వేడుకున్నాను. మేము కోరుకున్నట్లే బాబుకి వీసా రావడంతో జులై 21వ తారీఖున మేము మా కుటుంబసమేతంగా హైదరాబాద్ నుండి మా స్వగ్రామమైన సాలూరు వెళ్ళాము. అక్కడ ఎడతెరిపి లేకుండా పగలు, రాత్రి ఒకటే వర్షం కురుస్తుంది. మేము ఇంత వర్షంలో 24వ తేదీన చేయాల్సిన పూజ కార్యక్రమానికి, భోజనాలకి కావాల్సిన సరంజామా అంతా ఎలా తెచ్చుకోవాలని చాలా టెన్షన్ పడ్డాము. ఏ కష్టం వచ్చినా మనకి మొదట గుర్తుకు వచ్చేది బాబాయే కనుక నేను బాబాతో నా కష్టం చెప్పుకుని, "జులై 23 నుండి 24 రాత్రి భోజనాలు అయ్యేవరకు వర్షం పడకుండా చూడండి తండ్రి" అని వేడుకున్నాను. బాబా ఎంతో దయ చూపారు. ఆ రెండు రోజులు వర్షం కురవనేలేదు. చాలా ఆనందంగా పూజ మరియు భోజన కార్యక్రమాలు జరిగాయి. అందులో నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులందరూ చాలా సంతోషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాబా దయవల్లనే అంతా సక్రమంగా జరిగింది. "బాబా! మా అబ్బాయి అమెరికా వెళుతున్నాడు. మీరు ఎల్లప్పుడూ తన వెంటే ఉండి తనని జాగ్రత్తగా కాపాడండి తండ్రి. ఇంకా లోన్ శాంక్షన్ కాలేదు బాబా. అది కూడా ఏర్పాటు చేయండి తండ్రి. రాజాధిరాజు, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడవైన మీ పాదపద్మములకు శతకోటిప్రణామాలతో.. మీ పుత్రుడు అమర్నాథ్".


సాయిభక్తుల అనుభవమాలిక 1276వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ తరంగాలు
2. కేవలం రెండు గంటల్లో 80% పని పూర్తిచేసేలా అనుగ్రహించిన బాబా
3. బాబా దయతో తగ్గిన బాబు జ్వరం

శ్రీసాయి అనుగ్రహ తరంగాలు

సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలను ఇచ్చారు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మేము మా ఇంట్లో ఒక హోమం చేయాలని అనుకున్నాము. హోమం చేసిన తర్వాత తిరుపతి వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాము. అయితే అదే సమయంలో నాకు, మా పాపకి నెలసరి సమయం ఉండటం వల్ల నేను చాలా భయపడ్డాను. బాబాకి దణ్ణం పెట్టుకుని, "హోమానికి ఇబ్బంది లేకుండా చూడండి బాబా. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. ఆయన దయతో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోమం, తిరుపతి యాత్ర పూర్తిచేసుకున్నాము. "థాంక్యూ సో మచ్ బాబా".

మా పాప స్నేహితునికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్‌కి తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఆరోగ్య సమస్య వల్ల ఆ అబ్బాయి ఏమీ తినలేకపోయేవాడు. ఏది తిన్నా కూడా వెంటనే వాంతి అయిపోతుండేది. దానితో ఆ అబ్బాయి 10 కేజీల బరువు తగ్గిపోయాడు. ఇట్టి స్థితిలో నేను, "బాబా! మీ దయతో ఆ అబ్బాయికి త్వరగా నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత వాళ్ళు ఇంకో హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడి డాక్టరు అబ్బాయిని పరిశీలించి పెద్ద సమస్యేమీ లేదని, కొన్ని మందులు రాసిచ్చారు. బాబా దయవల్ల ఇప్పుడు ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుంది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఈమధ్య మావారి బాబాయిగారు చనిపోయారు. ఆయన చివరిరోజు కార్యక్రమాలకని 2022, జూలై 14న మావారు వెళ్లొచ్చారు. మరుసటిరోజు నుండి మావారికి జ్వరం, వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. టాబ్లెట్ వేసుకుంటే జ్వరం కంట్రోల్ అయ్యింది. కానీ, వాంతులు, విరోచనాలు మాత్రం తగ్గలేదు. డాక్టరు దగ్గరకి వెళ్తే మందులు ఇచ్చారు. కానీ నాకు భయమేసి, "బాబా! మావారికి త్వరగా నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అప్పటినుండి మావారికి తగ్గడం మొదలై, క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. నేను అనుకున్నట్లుగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను "థాంక్యూ సో మచ్ బాబా". 

2022, జూలైలో సమయం దాటిపోయి ఒక వారమైనా నాకు నెలసరి రాలేదు. ఆ కారణంగా నాకు బాగా కడుపునొప్పి, వెన్నునొప్పి ఉంటుండేవి. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "నాకు నెలసరి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న రెండో రోజుకి నాకు నెలసరి వచ్చింది. బాబాకి మాట ఇచ్చినట్లు నా అనుభవాలను మీ అందరితో ఇలా పంచుకుని, ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీ ప్రేమ ఎప్పుడూ మా అందరిమీద ఇలాగే ఉండాలని, అలాగే త్వరగా కరోనా అంతమైపోయి ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".

కేవలం రెండు గంటల్లో 80% పని పూర్తిచేసేలా అనుగ్రహించిన బాబా

నా పేరు శ్వేత. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగులో వచ్చిన అనుభవాలు చదువుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా ఎంతోమందికి ఎన్నో సమస్యలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారో చదువుతూ నేను మనసులో ఎన్నోసార్లు బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. ఇక నా అనుభవానికి వస్తే... ఒకసారి మా ఆఫీసులో కొంచెం వర్క్ తొందరగా పూర్తిచేసి ఇవ్వమని నాతో చెప్పారు. అందుకు నేను సరేనన్నాను. కానీ, ఆ వారంలో మా అన్నయ్యవాళ్ళు మా ఇంటికి వచ్చినందువల్ల నేను వర్క్ కొంచెం కూడా చేయలేకపోయాను. హఠాత్తుగా ఒకరోజు ఉదయం కంపెనీవాళ్ళు ఫోన్ చేసి, "ఈరోజు 11:30కి కాల్ చేస్తాము. వర్క్ ఎంతవరకు వచ్చిందో చూపించమ"ని అన్నారు. దాంతో నా కాళ్ళుచేతులు అస్సలు ఆడలేదు. చాలా టెన్షన్‌గా అనిపించి వెంటనే పని మొదలుపెట్టి, బాబా నామస్మరణ చేస్తూ, "మీరే సహాయం చేయాలి సాయీ" అని అనుకుంటూ పనిచేశాను. బాబా దయవల్ల రెండు గంటల్లో 80% పని పూర్తిచేయగలిగాను. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే, "ఇంకా కొద్దిగా చేయాల్సి ఉంది, చేస్తున్నాను" అని చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. రెండు గంటల్లో అంత వర్క్ ఎలా చేశానో నాకే తెలియట్లేదు. బాబానే నాతో చేయించారు. ఏ సమస్యా లేకుండా అంతా మంచిగా జరిగితే బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పుకున్నట్లు నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి సాయీ. థాంక్యూ సాయీ. ఎప్పుడూ అందరికీ ఇలాగే తోడుగా ఉండి కాపాడు సాయీ. ఆఫీసుకి దగ్గర్లో మేము ఇల్లు చూస్తున్నాం, తొందరగా మంచి ఇల్లు దొరికేలా ఆశీర్వదించండి సాయీ".

బాబా దయతో తగ్గిన బాబు జ్వరం

నా పేరు శివ. నా జీవితంలో బాబా ఎన్నోసార్లు కష్టం నుండి నన్ను కాపాడారు. ఇదివరకు అటువంటి అనుభవాలు కొన్ని పంచుకున్నాను. 2022, జూలై మూడో వారంలో బాబా నా కొడుకుకి సంబంధించి ఒక అందమైన అనుభవాన్ని ప్రసాదించారు. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా కొడుకు పేరు పవన్. తను నాలుగవ తరగతి చదువుతున్నాడు. జూలై మూడో వారంలో ఒకరోజు తనకి స్వల్పంగా జ్వరమొచ్చింది. ఆ జ్వరం మినహా వేరే ఇతర లక్షణాలేవీ లేనందున నేను అంతగా పట్టించులేదు. మరుసటిరోజు బాబు మామూలుగానే స్కూలుకి వెళ్ళొచ్చాడు. కానీ ఆ రాత్రి తనకి జ్వరం తీవ్రంగా వచ్చింది. దానితోపాటు తలనొప్పి, కళ్ళమంటలు కూడా ఉండేసరికి నేను వెంటనే బాబాని ప్రార్థించి, "పరిస్థితి విషమంగా ఉందా బాబా?" అని అడిగాను. సాధారణంగా నేను సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని బాబాను ప్రశ్న అడుగుతాను. అప్పుడు బాబా సూచించే పేజీ నెంబరులో నాకు ఆయన సమాధానం దొరుకుతుంది. అలాగే ఆరోజు బాబాను అడిగినప్పుడు దురదృష్టవశాత్తూ, "బాబు పరిస్థితి విషమంగా ఉంటుంద"ని బాబా సమాధానం వచ్చింది. మరుక్షణం నేను, "బాబా! ఈ బిడ్డని మీరే మాకు ప్రసాదించారు. ఇప్పుడు వీడి పరిస్థితి విషమంగా ఉందని మీరు చెప్తున్నారు. నేను ఏ డాక్టరునీ సంప్రదించను. రేపటికల్లా మీరు నా కొడుకుకి నయంచేస్తే, నేను నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని ఆ రాత్రంతా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతసేపటికి బాబుకి జ్వరం తగ్గింది. కానీ, వేకువఝామున మరలా వచ్చింది. అప్పుడు నేను బాబు నుదుటన ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి వాడి చేత త్రాగించాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. ఇప్పుడు బాబు పూర్తి ఆరోగ్యంతో రోజూ స్కూలుకి వెళ్తున్నాడు. "మీ కృపకు ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు మన్నించండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1275వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అపారమైన బాబా అనుగ్రహం
2. ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా
3. భక్తుల ప్రేమకోసం తపించే సాయి - వారి బాధను తీర్చకుండా ఉంటారా!

అపారమైన బాబా అనుగ్రహం

ముందుగా సాయి కుటుంబీకులకు నా నమస్కారాలు. నా పేరు కిషోర్. నేనొక ప్రైవేటు కళాశాలలో లెక్చరరుగా పనిచేస్తున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక శనివారంరోజున నేను మా కాలేజీ లైబ్రరీలో చదువుకుని ఇంటికి వచ్చేటప్పుడు నా బ్యాగు మరిచిపోయి వచ్చేశాను. ఆ బ్యాగులో బ్యాంక్ పాస్‌బుక్, చెక్‌బుక్ మరియు ఎంతో కష్టపడి వ్రాసుకున్న నోట్‌బుక్స్ ఉన్నాయి. మరుసటిరోజు ఆదివారం సెలవు కనుక సోమవారం వెళ్లి చూస్తే, నా బ్యాగు కనపడలేదు. లైబ్రరీ యాజమాన్యాన్ని అడిగితే, వాళ్ళు చూడలేదని చెప్పారు. సరేనని, కనీసం ఒక గంటసేపు లైబ్రరీ అంతా నా బ్యాగుకోసం వెతికాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "నా బ్యాగు దొరికేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను దీనంగా వేడుకుని, నిరుత్సాహంతో మా కాలేజీ ఆఫీసుకు వెళ్ళాను. ఆశ్చర్యం! అక్కడ బయట ఉన్న ఒక కుర్చీలో నా బ్యాగు కనబడింది. అది చూసి నా ఆనందానికి మాటల్లేవు. ఇప్పటికీ అది అక్కడికెలా వచ్చిందో నాకు చిక్కువీడని ప్రశ్న. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

నేను మా కాలేజీలో టాప్ సెక్షన్ పిల్లలకు కెమిస్ట్రీ బోధిస్తాను. ఆ సెక్షన్‍లోని విద్యార్థులకి 60కి 60 మార్కులు రాకపోతే దానికి మనల్ని బాధ్యులని చేసి నిలదీస్తారు. నేను ఎంత కష్టపడి విద్యార్థులను చదివించినా నా దురదృష్టంకొద్దీ చెప్పని ప్రశ్న ఒకటి పరీక్షలో వచ్చింది. నేను బాధతో కుమిలిపోతూ, "బాబా! ఏదో ఒక విధంగా మా సెక్షన్లోని కనీసం 10-15 మంది పిల్లలకు 60కి 60 మార్కులు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రాధేయపడ్డాను. బాబా నా మొర ఆలకించి 12 మంది విద్యార్థులకి 60కి 60 మార్కులు వచ్చేలా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

JEE మెయిన్స్‌లో ర్యాంక్ అన్నది మూడు సబ్జెక్టులపై (లెక్కలు, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ) ఆధారపడి ఉంటుంది. అయితే మా కాలేజీలో లెక్కలు, ఫిజిక్స్ చెప్పే మాస్టార్ల టీచింగ్ అనుభవంతో పోలిస్తే నా అనుభవం చాలా చాలా తక్కువ. కనుక నేను రోజూ బాబాను, "మిగతా సబ్జెక్టుల వలె నేను చెప్పే కెమిస్ట్రీలో కూడా విద్యార్థులకి మంచి మార్కులు వచ్చి ఉత్తమ పర్సెంటైల్ రావాలని" కోరుకుంటూ ఉండేవాడిని. అద్భుతం! వెలువడిన ఫలితాల్లో ఓవరాల్ 99.07 పర్సెంటైల్ రాగా, నేను చెప్పిన కెమిస్ట్రీలో 99.9 పర్సెంటైల్ వచ్చింది. నా ఆనందానికి హద్దులు లేవు. అలాగే EAPCETలో కూడా కెమిస్ట్రీలో మంచి మార్కులు వచ్చాయి. మా కాలేజీవాళ్ళు నన్ను ఒక గొప్పవాడిలా చూస్తూ ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. నా జీతం పెంచుతానని వాగ్దానం కూడా చేశారు. ఇదంతా అపారమైన బాబా అనుగ్రహం. "ధన్యవాదాలు బాబా. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం తండ్రీ?".

ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా

సాయిభక్తులందరికీ నా నమస్సులు. నా పేరు ధనలక్ష్మి. మాది హైదరాబాద్. బాబా అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుమునుపు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా అక్క కూతురు జర్మనీలో ఉంటుంది. తను మూడు సంవత్సరాల క్రితం జర్మనీ వెళ్ళేటప్పుడు తన బంగారమంతా బ్యాంకు లాకరులో పెట్టి వెళ్ళింది. దాని తాళంచెవిని తను ఇండియాలోనే వదిలేసి వెళ్ళింది. అయితే సంవత్సరం తర్వాత వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు లాకర్ ఓపెన్ చేద్దామని చూస్తే, దాని తాళంచెవి ఎక్కడా కనిపించలేదు. దాంతో సరేనని సెలవులు అయిపోయాక జర్మనీకి తిరిగి వెళ్లిపోయారు. 2022, జూన్ 9న మా చిన్నక్క కూతురు పెళ్లి ఉంటే, ఆ పెళ్లికని పెద్దక్క కూతురు జూన్ 4న జర్మనీ నుండి వచ్చింది. అప్పుడు తను బ్యాంకుకి వెళ్లి, "లాకర్ తాళంచెవి కనిపించడం లేదు" అని చెపితే, బ్యాంకువాళ్ళు, "పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, FIR ఫైల్ చేయాల"ని చెప్పారు. తను నాతో ఆ విషయం చెప్తే నేను, "బాబా! లాకర్ తాళంచెవి దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని మా అక్కకూతురితో ఈ బ్లాగు గురించి చెప్పాను. తరువాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఆ ప్రాసెస్ పూర్తికావడానికి నెలరోజుల సమయం పడుతుందని అన్నారు. అయితే అక్కకూతురువాళ్ళు 2022, జూన్ 19న తిరిగి జర్మనీకి వెళ్ళిపోవాల్సి ఉంది. అందువలన నేను, "బాబా! లాకర్ తాళంచెవి దొరకడం లేదు. పోలీస్ కంప్లైంట్, నెలరోజుల గడువు వంటివేమీ లేకుండా ఏదైనా సులభ మార్గం చూపించు తండ్రీ" అని వేడుకున్నాను. 2022, జూన్ 13న మళ్ళీ బ్యాంకుకి వెళ్లి అడిగితే, "పోలీస్ కంప్లైంట్ అవసరం లేదు, ఎల్లుండి రండి, ఓపెన్ చేద్దాం" అని బ్యాంకు మేనేజర్ చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే మా అక్కకూతురు నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ రెండురోజుల తర్వాత బ్యాంకుకి వెళితే, "లాకర్ ఓపెన్ చేసేవాళ్ళు రాలేదు, రేపు రండి" అని అన్నారు. నేను, "అయ్యో బాబా, ఏంటి ఇలా చేశావు తండ్రీ?" అని అనుకున్నాను. కానీ మరుసటిరోజు బ్యాంకుకి వెళ్తే, లాకర్ ఓపెన్ చేశారు. మా సమస్య తీరి, ఎంతో సంతోషంగా అనిపించింది. బాబా ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారు. బాబా అనుగ్రహంతో మా ఇంటిల్లిపాది ఆనందంలో మునిగిపోయాము. మా కుటుంబమంతా బాబా భక్తులమే. నేను ఏ చిన్న విషయానికైనా 'బాబా నీవే దిక్కు' అనుకుంటాను. బాబా వెంటనే నాకు దారిచూపిస్తారు. మరో అనుగ్రహాన్ని మీతో పంచుకోవాలని బాబాని కోరుకుంటూ ఈ అవకాశమిచ్చిన సాయినాథునికి నా శతకోటి వందనాలు.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

భక్తుల ప్రేమకోసం తపించే సాయి - వారి బాధను తీర్చకుండా ఉంటారా!

సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నాకు గురువు, దైవం అన్నీ సాయే. ఆ తండ్రి నాపై చూపుతున్న అనుగ్రహానికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియదు. అందుకే ఇలా బాబాకి నమస్కరిస్తూ నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2022, మే నెలలో నాకు నెలసరి రాలేదు. చాలా ఆలస్యంగా, 40 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఆ తరువాత 2 రోజులకి నెలసరి వచ్చింది. అలా జూన్‍లో వచ్చిన నెలసరి దగ్గర దగ్గర 20 రోజుల వరకు కనపడుతూనే ఉంది. ఆ సమయంలో నేను సాయిపై భారం వేసి రోజూ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగుతుండేదాన్ని. కానీ ఇంట్లో దేవుడికి పూజ చాలా రోజులు చేయలేకపోయాను. నిజానికి నేను, నా భర్త ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి, బాబా సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది ఈ సమస్యతో నేను నా సాయికి దూరం అయ్యాను. అసలు నాకు ఏమి జరుగుతోందో తెలియక, "నాకు ఏమిటి ఈ పరీక్ష సాయీ?" అని బాధపడేదాన్ని. చివరికి భరించలేక ఒక శుక్రవారంనాడు నేను సాయిని ఒకటే అడిగాను: "నేను శనివారం మీ ముందు దీపం పెట్టాలి, పూజ చేయాలి. నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని. భక్తుల ప్రేమకోసం తపించిపోయే నా సాయి శనివారంనాడు నా పూజ అందుకున్నారు. శ్రద్ధ, సబూరీలతో ఉంటే అంతా బాబా చూసుకుంటారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. ఎల్లవేళలా మీకు ఋణపడి ఉంటాను".

సాయిభక్తుల అనుభవమాలిక 1274వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న బాబా
2. రిపోర్టు మంచిగా వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. విదేశాలలో ఉంటున్న మా అమ్మాయి ఈమధ్య సెలవులకి ఇండియా వచ్చింది. తనకి అలర్జీ మరియు వాతావరణ కాలుష్యం వల్ల విపరీతమైన దగ్గు వంటి సమస్యలున్నాయి. అందువలన నేను, "బాబా! ఇక్కడున్నన్ని రోజులు అమ్మాయికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడద"ని బాబాని ప్రార్థించాను. శ్రీసాయిలీలామృతం పారాయణ కూడా చేశాను. బాబా దయవలన మా అమ్మాయి ఇండియాలో ఉన్నన్ని రోజులూ క్షేమంగా ఉంది.

ఇప్పుడు శిరిడీలో బాబా మాకు ప్రసాదించిన ఆయన దర్శనభాగ్యం గురించి చెప్తాను. బాబా ఉనికిని, అనుగ్రహాన్ని నేను ఎంతగానో చవిచూసి ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వల్ల హైదరాబాద్ నుండి శిరిడీకి రైలులో ప్రయాణమంటే ఏదో ఒక మూల కొంచెం భయపడ్డాను. ఆ సమయంలో ఒకరోజు బ్లాగులో అనుభవాలు చదువుతుంటే, అక్కడొక భక్తురాలు తమ శిరిడీ దర్శనభాగ్యాన్ని పంచుకున్నారు. అందులో ఆమె శిరిడీకి వెళ్లేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో 'శిరిడీకి వచ్చేందుకు సిద్ధంగా ఉండు' అని బాబా ఒక మెసేజ్ ద్వారా తనకి చెప్పారని పంచుకున్నారు. అది చదివాక బాబా నాకు కూడా అలాగే చెప్తున్నారనిపించి కొండంత ధైర్యం వచ్చింది. ఇక శిరిడీకి బయలుదేరేరోజు మేము 2 గంటలు ముందుగానే ఇంటినుండి బయలుదేరాము. మామూలుగా అయితే మా ఇంటినుండి స్టేషన్ చేరుకోవడానికి ఒక గంట సమయమే సరిపోతుంది. కానీ మేముండే ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒకసారి గోకర్ణయాత్రకు బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ట్రైన్ మిస్ అయ్యాను. అందుచేత ఈసారి రెండు గంటల ముందు బయలుదేరాము. కానీ ఆరోజు ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. సమయానికి స్టేషన్ చేరుకోలేమనిపించి బాబాను స్మరించసాగాను. అప్పటినుండి ముందు వెళుతున్న వాహనాల మీద బాబా అభయహస్తంతో పలుమార్లు దర్శనమిస్తూ మేము రైలు అందుకునేలా చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అలానే జరిగింది.

మేము శిరిడిలో దిగిన వెంటనే మధ్యాహ్న ఆరతి సమయానికి ద్వారకామాయికి చేరుకోవాలని అనుకున్నాము. కానీ బస్సు ఆలస్యమై మేము ఎంతలా ప్రయత్నించినా ఆరతి సమయానికి ఖండోబా మందిరం వద్దకి మాత్రమే చేరుకోగలిగాము. సరేనని, అక్కడ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము. అక్కడున్న సిబ్బంది, "ఆరతి మొదలవుతోంది, రండి, రండి" అని పిలిచి మేము లోపలికి వెళ్ళిన వెంటనే తలుపులు వేసేశారు. తరువాత ఎవరినీ లోపలికి రానీయలేదు. అక్కడ మా స్వహస్తాలతో ఖండోబా రూపంలో ఉన్న తమకి ఆరతి ఇచ్చేలా అనుగ్రహించారు బాబా. మర్నాడు గురువారం ఉదయం 6 గంటలకి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అందరినీ తొందరచేస్తూ బయటకు పంపిస్తున్నారు. కానీ మమ్మల్ని ఏమీ అనలేదు. పరమపవిత్రమైన గురువారంనాడు మేము బాబాకు ఎదురుగా నిలబడి వారి దివ్యమంగళస్వరూపాన్ని కన్నులారా తృప్తిగా దర్శించుకున్నాము. తరువాత నందదీపం దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మా చెల్లెలికి బాబా అనుగ్రహప్రసాదమైన ఊదీ ప్యాకెట్ దొరికింది. చావడిలో బాబాకు భక్తులు ఎర్రని వస్త్రాలు సమర్పిస్తారు కదా! ఆ వస్త్రమొకటి బాబా నాకు ప్రసాదంగా అనుగ్రహించారు. తరువాత నాసిక్ సమీపంలో ఉన్న శ్రీత్రయంబకేశ్వరుని దర్శించుకుని క్షేమంగా ఇల్లు చేరాము. వేసవికాలమే అయినప్పటికీ శిరిడీలో ఉన్న 3 రోజులూ మాకు ఎండ తీవ్రత అస్సలు తెలీలేదు.

ఇక మా అమ్మాయి విదేశాలకు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు మేము ఎయిర్‌పోర్టుకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటే, ఆ క్యాబ్‌లో ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. 'బాబా మా అమ్మాయి వెన్నంటి ఉన్నార'ని నాకు సంతోషంగా అనిపించింది. అమ్మాయి అక్కడికి చేరుకున్న తరువాత రెండురోజులకి తనకి దగ్గు, జలుబు, విపరీతమైన ఒళ్ళునొప్పులు వచ్చాయి. కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అది తెలిసి నాకు ఆందోళనగా అనిపించినప్పటికీ, 'బాబా అమ్మాయి వెన్నంటి ఉన్నారు కదా!' అని ధైర్యం తెచ్చుకుని, భారం ఆయన మీద వేసి, "అమ్మాయి త్వరగా కోలుకుంటే సచ్చరిత్ర సప్తాహపారాయణ చేసి, అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయచూపారు. రెండవరోజుకే అమ్మాయికి దగ్గు తగ్గింది. మిగిలిన లక్షణాలు కూడా క్రమంగా తగ్గుతూ 5వ రోజుకి కరోనా నెగిటివ్ వచ్చింది. అక్కడ మా అమ్మాయితో సన్నిహితంగా ఉన్న మావారికి తీవ్రంగా జలుబు చేసినా 3 రోజులలో తగ్గిపోయింది. అలాగే మా అమ్మాయి స్నేహితురాలికి ఏ ఇబ్బందీ లేకుండా బాబా అనుగ్రహించారు.

ఒకరోజు మా అమ్మాయికి మెసేజ్ చేస్తే, తన దగ్గర నుంచి రిప్లై రాలేదు. నేను తను ఏదో బిజీలో ఉందేమో అనుకున్నాను. అయితే ఎంతసేపైనా రిప్లై రాకపోయేసరికి వాట్సాప్ చాట్ చూస్తే, ముందురోజు సాయంత్రం నుంచి (దాదాపు 24 గంటలు) తను తన ఫోన్ చూడలేదని అర్థమైంది. తన క్షేమసమాచారం గురించి వేరే ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే అక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. నాకు కొంచెం కంగారుగా అనిపించి వెంటనే బాబాను తలచుకుని, "బాబా! వెంటనే మా అమ్మాయి దగ్గర నుంచి నాకు మెసేజ్ వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. ఒక అరగంటలోపే మా అమ్మాయి కాల్ చేసి నాతో మాట్లాడింది. ఆ సమయంలో అక్కడ రాత్రి. ఒకవేళ తను ఫోన్ చూడకుండా అలానే నిద్రపోయుంటే మరో 8 గంటలసేపు నేను ఇక్కడ ఆందోళనపడాల్సి వచ్చేది. కానీ బాబా దయతో నా ఆందోళనను ఆలస్యం లేకుండా తొలగించారు. ఇది చాలా చిన్న విషయమే. కానీ మన ఆత్మీయులు ముఖ్యంగా దూరంగా ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళ గురించి తెలియకపోయినా ఎంతో ఆందోళనగా ఉంటుంది. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి అందరినీ చల్లగా చూడు తండ్రీ".

రిపోర్టు మంచిగా వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై! నమ్మినవారి కోర్కెలను తీర్చే సాయినాథునికి నా ప్రణామాలు. సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. నాకు ఏ బాధ వచ్చినా నేను సాయినాథునితోనే చెప్పుకుంటాను. ఆయన చాలా విషయాలలో నన్ను అనుగ్రహించారు. నేను ఒక సంవత్సరం నుండి గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బందిపడుతున్నాను. డాక్టరు దగ్గరికి వెళితే, ఆయన 15 రోజులకు మందులు ఇచ్చేవారు. ఆ మందులతో కొద్దిరోజులు సమస్య తగ్గి మళ్ళీ వచ్చేది. దాంతో మళ్ళీ టాబ్లెట్లు వాడేదాన్ని. అలా కంటిన్యూగా మందులు వాడుతూనే ఉన్నాను. చివరికి మావారు, "సంవత్సరం నుండి ఈ టాబ్లెట్లు వాడుతున్నా సమస్య తగ్గడం లేదు కదా. ఒకసారి హోమియోపతి మందులు వాడదాం. అవి నిదానంగా పనిచేసినా సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది" అని అన్నారు. ఆయన సలహామేరకు నేను హోమియోపతి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయన, "కడుపును స్కానింగ్ తీయించండి. కిడ్నీలో రాళ్లు ఉన్నా గ్యాస్ సమస్య ఉండే అవకాశం ఉంది" అని అన్నారు. నాకు చాలా భయంగా అనిపించి, "బాబా! నా కడుపులో ఎలాంటి సమస్యా ఉండకూడదు. అంతా మంచిగా ఉండాలి. రిపోర్టులో అంతా మంచిగా ఉందని వస్తే, బ్లాగు ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులందరితో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. స్కానింగ్ రిపోర్టులో, 'కిడ్నీలో రాళ్లు లేవు. కడుపులో అంతా మంచిగానే ఉంది' అని వచ్చింది. ఆ రిపోర్టు తీసుకుని మళ్ళీ హోమియోపతి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయన, "ఏ ప్రాబ్లమ్ లేదుకాని, కరోనా వచ్చి తగ్గింది కదా! ఆ మందుల ప్రభావం వల్ల కరోనా తగ్గిన తరువాత కొందరకి గ్యాస్ సమస్య ఉంటుంది. కానీ ఇబ్బందేమీ లేదు. ఈ హోమియోపతి మందులు వాడండి. సమస్య పూర్తిగా నయమవుతుంది" అని చెప్పి మందులిచ్చారు. వాటివల్ల గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గుతుందని బాబా మీద నమ్మకముంచి వేసుకుంటున్నాను. "ఈ మందులతో పూర్తిగా తగ్గి ఇక మందులు అవసరం లేకుండా చేయండి బాబా. మీ దయవల్ల పూర్తిగా తగ్గిపోతే మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను సాయి. మమ్ము కరుణించి కాపాడు సాయి. మా కుటుంబానికి మీరే రక్ష. మమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి సాయి".

ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1273వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భయాలను దూదిపింజెలా తీసేసిన బాబా
2. బాబా చేసిన మేలు
3. కోరుకున్నది అనుగ్రహించే బాబా

భయాలను దూదిపింజెలా తీసేసిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈమధ్య నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవడం అలవాటుగా చేసుకున్నాను. అలాగని అన్నీ ఎక్కడ పంచుకోగలం? ఎందుకంటే, మనందరికీ సాయితో అనుభవాలు కోకొల్లలు. కానీ కష్టం మరీ ఇబ్బంది పెట్టినప్పుడు తెలియకుండానే బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పుకుంటున్నాను. అలాంటి అనుభవమే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 2022, జూలై 10, ఆదివారం మేము మా సొంతూరు వెళ్ళాము. అక్కడొకరోజు మేము, మా తమ్ముళ్ళ కుటుంబాలు కలిసి బయట రాత్రి భోజనం చేశాము. ఇంకోరోజు అందరమూ ఒకరి ఇంట్లో భోజనాలు చేసి సంతోషంగా గడుపుతుండగా మావారు కొంచెం జ్వరంగా ఉందని, కాసేపు పడుకున్నారు. ఆయన లేచిన తర్వాత మేము మా ఊరికి వచ్చేశాం. అప్పటికి మావారికి బాగానే ఉంది కానీ, ఆ రాత్రి మళ్ళీ జ్వరమొస్తే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. మరుసటిరోజు ఉదయం మావారు తనకి నీరసంగా ఉందని అన్నారు. నాకు అనుమానమొచ్చి కోవిడ్ టెస్ట్ చేయాలనుకున్నాను. కానీ నా గత అనుభవాల దృష్ట్యా నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మేము మా ఆప్తులను పోగొట్టుకున్నాం. అయితే మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరికీ కోవిడ్ రాలేదు. ఈమధ్యనే కొంచెం మాస్కులు తొలగించి తిరుగుతున్నాం. ఇంతలోనే మావారికి ఇలా అయ్యేసరికి అందరూ, "గతంలోలాగా ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేద"ని చెప్తున్నప్పటికీ నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. సాయిని స్మరిస్తూ, "కోవిడ్ లేకపోతే, నవగురువారవ్రతం చేస్తాన"ని బాబాకి మ్రొక్కుకుని కోవిడ్ టెస్టు చేస్తే, మావారికి పాజిటివ్ వచ్చింది. ఇంక నా భయం మాటల్లో చెప్పలేను. భయంభయంగా, "బాబా! సీరియస్ కాకుండా కొద్దిపాటి లక్షణాలతో మావారికి తగ్గిపోవాలి. నాకు, మా అమ్మాయికి కోవిడ్ రాకూడదు. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. కానీ మర్నాటికి మా ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ బాబా దయవల్ల పెద్ద తీవ్రత లేదు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే, మాక్కూడా కోవిడ్ వచ్చాక నాకు కొంచెం భయం తగ్గింది. పరవాలేదులే అని అనుకుంటూ ఉండగా అక్కడ మా తమ్ముడికి పాజిటివ్ అని తెలిసింది. వాడికి అదివరకే ఒకసారి కోవిడ్ చాలా తీవ్రంగా వచ్చి ఉన్నందువల్ల నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. కానీ బాబా దయవలన రెండు రోజుల్లో అందరికీ కోవిడ్ లక్షణాలు తగ్గి మామూలుగా అయ్యాము. కానీ, "ఎలాంటి చెడు జరగకూడద"ని బాబాను ప్రార్దిస్తూనే ఉన్నాను. బాబా కృప వలన సరిగ్గా వారంరోజులకి 2022, జూలై 18న మావారికి నెగిటివ్ వచ్చింది. రెండురోజుల్లో మేము టెస్ట్ చేసుకోవాలి. బాబా దయవల్ల మాకు కూడా నెగిటివ్ వస్తుందని నమ్మకంతో ముందుగానే నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను.


ఒకేసారి అన్ని సమస్యలు వచ్చి మీదపడతాయన్నట్టు, మేము పైన చెప్పిన కోవిడ్ కష్టంలో ఉన్నప్పుడే మా స్వంతింటి బాల్కనీలో ఎండ పడకుండా వేయించిన రేకులు పెనుగాలికి విరిగి కిందపడ్డాయని మాకు తెలిసింది. అయితే అదృష్టం కొద్దీ వాటివల్ల ఎవరికీ ఏ హాని జరగకుండా బాబా కాపాడారు. అసలే మా పక్కింటివాళ్ళు గొడవల మనుషులు. వాళ్ళవైపు ఆ రేకులు పడుంటే చాలా గొడవ అయ్యుండేది. ఆ ఇంట్లో మనుషులు ఉన్నా కూడా గొడవ జరిగి ఉండేది. అందుకే ఆ ఇల్లు అద్దెకివ్వకుండా ఖాళీగా ఉండేలా బాబా చేశారేమోనని నాకు అనిపిస్తుంది. అదే బాబా టైమింగ్. ఆయన ఇవ్వడం, ఇవ్వకపోవడం వంటి అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా ఇంటిలోకి ఎవరైనా మంచివాళ్ళు అద్దెకి వచ్చేలా చూడండి సాయీ. చాలారోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. నేను మ్రొక్కుకున్న మ్రొక్కులను గుర్తుచేసి వాటిని తీర్చుకునేలా అనుగ్రహించండి సాయీ. చివరిగా మరోసారి  భయాలను దూదిపింజెలా తీసేసిన మీకు వేలవేల ధన్యవాదాలు సాయీ".


బాబా చేసిన మేలు


సాయిబంధువులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చేసిన మేలుని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022, జులై 18న మా అమ్మకి ఉన్నట్టుండి కడుపునొప్పి వచ్చింది. ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి అలా అమ్మకి కడుపునొప్పి వచ్చేసరికి మేము చాలా భయపడిపోయాం. కానీ బాబా ఉండగా మనకి భయమేల? నేను వెంటనే, "బాబా! మీ దయతో అమ్మ కడుపునొప్పి తగ్గిపోతే, నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, ఒక పదినిమిషాల తర్వాత మా అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఏదో కొద్దిపాటి నొప్పి ఉన్నా మరుసటిరోజు ఉదయానికి అది కూడా తగ్గిపోయేలా చేశారు బాబా. "థాంక్యూ బాబా. ఎప్పుడూ ఇలానే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రీ".


ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే టీ త్రాగడం నాకలవాటు. అలవాటు అనేకంటే వ్యసనం అని చెప్పాలి. ఎందుకంటే, టీ త్రాగకుండా నేను అస్సలు ఉండలేను. అలాంటిది ఒకసారి విపరీతమైన గొంతుమంట వలన రెండునెలలపాటు నేను టీ, పాలు త్రాగడం మానేయాల్సి వచ్చింది. చివరికి టాబ్లెట్లతో ఆ మంట తగ్గింది. ఈమధ్య మళ్ళీ అదే సమస్య వచ్చి ఏం తిన్నా చాలా మంటగా ఉండేది. అప్పుడు నేను, "బాబా! నేను టీలో ఊదీ వేసుకుని తాగుతాను, మందులు వేసుకోను. దయతో నా గొంతునొప్పి తగ్గించండి బాబా" అని బాబాతో చెప్పుకుని రోజూ టీలో ఊదీ వేసుకుని త్రాగాను. గొంతునొప్పి దానంతటదే తగ్గిపోయింది. అంతా బాబా దయ


ఈమధ్య ఒకసారి నా కాళ్ళుచేతులు విపరీతంగా లాగుతూ ఉండేవి. ఏదైనా ఆయిల్ లేదా బామ్ రాస్తేగానీ నిద్రపోలేని పరిస్థితి. అప్పుడు నేను బాబాను, "బాబా! నా కాళ్ళుచేతులు లాగడం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల చాలావరకు కాళ్ళుచేతులు లాగడం తగ్గింది. అయితే రోజూ నా అనుభవం పంచుకుంటానని అనుకుంటూనే ఆలస్యం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య మొదలైంది. బాబాని క్షమించమని వేడుకుంటూ నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను. "నన్ను క్షమించండి బాబా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


కోరుకున్నది అనుగ్రహించే బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు శ్వేత సాయి. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన అనుభవమొకటి ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2022, జులై 21న జరిగిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిని. ఈమధ్య నేను హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు డాక్టర్ స్కానింగ్, షుగర్ టెస్టు చేయించమని సూచించారు. అప్పుడు నేను, "బాబా! స్కాన్ మరియు షుగర్ రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి, కడుపులో బేబీ బాగుందని చెప్పాలి. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే, స్తవనమంజరి ఒక వారం పారాయణ చేస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా నేను కోరుకున్నట్టే రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి, బేబీ బాగుంది అనేలా చేశారు. అలాగే నేను ప్రయాణం చేయడానికి డాక్టరు ఒప్పుకునేలా బాబా చేశారు. ఇది అందరికీ చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ ఒక గర్భవతి అయిన స్త్రీకి బేబీ చిన్న విషయం కాదు. అమ్మ కాబోయే స్త్రీకి బిడ్డ చాలా విలువైనది. సరే, నేను హాస్పిటల్ నుండి మధ్యాహ్నం హారతికి బాబా గుడికి వెళ్ళాను. అక్కడ నేను నా బ్యాగు తెరిస్తే, అందులో నా మొబైల్ కనిపించలేదు. ఫోన్ ఎక్కడ వదిలేసానో అర్థంకాక వెంటనే బాబాని తలచుకుని, "బాబా! ప్రస్తుతం నేనున్న ఆర్థిక సమస్యలలో కొత్త ఫోన్ కొనే పరిస్థితి లేదు. దయచేసి ఫోన్ దొరికేలా చేయండి. ఫోన్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని జపిస్తూ ఇంటికి వెళ్లి చూస్తే, ఫోన్ ఇంట్లోనే ఉంది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మీకు మాట ఇచ్చినట్టుగానే గురువారం రెండు అనుభవాలు పంచుకున్నాను తండ్రీ. ఎప్పుడూ ఇలానే నాతో ఉంటూ నన్ను మీరే నడిపించండి సాయికన్నయ్యా. నా చేతిని ఎన్నడూ వదలకు తండ్రీ. నువ్వే నా ప్రాణం, సర్వం తండ్రీ. నువ్వు లేని జీవితం లేదు, వద్దు. ఎప్పుడూ మీ అభయహస్తం మాపైన ఉండనివ్వు సాయీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1272వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రత్యక్ష దైవం బాబా
2. సాయి పాదాలను ఆశ్రయించినంతనే లభించిన అనుగ్రహం
3. బాబా కృపతో ఒక్కరోజులో తగ్గిన జ్వరం

ప్రత్యక్ష దైవం బాబా


అందరికీ నమస్తే. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇలానే ఎప్పుడూ పంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా అమ్మ ఆరోగ్య విషయంలో నాకు ఎప్పుడూ టెన్షన్‍గా ఉంటుంది. ఎందుకంటే, ఆమెకి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం వంటి మొదలైన చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. అవి చాలదన్నట్టు అమ్మ కాలిపై ఒక సెగగడ్డ వచ్చింది. అమ్మని సర్జన్ దగ్గరకి తీసుకుని వెళ్తే, "సర్జరీ చేయాలి. కానీ గాయం మానిపోవడం షుగర్ నియంత్రణలో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు. నాకు చాలా బాధగా, భయంగా అనిపించి, "ఉన్న ఆరోగ్య సమస్యలకి తోడు కొత్తగా ఈ ప్రాబ్లం ఏంటి బాబా?" అని అనుకున్నాను. ఆయన్ని ఆర్తిగా వేడుకోవడం తప్ప మన చేతుల్లో ఏముందని బాబాని ప్రార్థించడం మొదలుపెట్టి, "గాయం తొందరగా తగ్గేటట్లు చూస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు డాక్టరు చెక్ చేసి, "షుగర్ నియంత్రణలో ఉంది. కాబట్టి తొందరగా నయమవుతుంది" అని అన్నారు. "చాలా సంతోషం సాయితండ్రి. మీ వల్ల ఏదైనా సాధ్యపడుతుందని అర్థమవుతుంది బాబా. చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి బాబా".


ఇటీవల మా బావగారికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. మేము మందులతో తగ్గిపోతుంది అనుకున్నాము. కానీ డాక్టరుని సంప్రదిస్తే, "స్కాన్ చేయాలి" అన్నారు. డాక్టరు అలా చెప్పేసరికి భయమేసి నేను, "బాబా! స్కానింగ్‍లో బావగారికి సమస్య లేదని వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల స్కాన్ రిపోర్టు నార్మల్ వచ్చింది.  "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అనుగ్రహ రూపమైన అనుభవాలతో నా జీవితం నిండిపోవాలని కోరుకుంటున్నాను తండ్రి. మీ వల్ల అసాధ్యం అయినది కూడా సుసాధ్యం అవుతుంది. మీరే మా పాలిట ప్రత్యక్ష దైవం బాబా. నా మనసులో ఉన్న కోరికలు ఏంటో మీకు తెలుసు. వీలైనంత త్వరగా వాటిని కూడా తీర్చండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఇలానే ఉండనీయండి బాబా".


మా మావయ్యగారు పోస్టు కోవిడ్ సమస్యల వలన చాలా బాధపడుతుంటే నేను, "ఒకసారి గుండె అంతా చెక్ చేయిద్దాము" అని చెప్తూండేదాన్ని. కానీ అయన వినేవారు కాదు. అలా ఒక 6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆయన, "హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళదాం" అన్నారు. నేను పోస్టు కోవిడ్ వల్ల ఆయనకి మేజర్ సమస్యలు ఏమైనా ఉంటాయేమోనని చాలా భయపడి, "బాబా! మీ దయవల్ల రిపోర్టులు అన్నీ నార్మల్‍గా‍ వస్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. ఇలా అన్ని విషయాలలో మీరు అండగా ఉండండి బాబా".


నెలన్నర వయసున్న మా అక్క మనవడికి చెవి మరియు మాడు మీద ఇన్ఫెక్షన్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, వాడు పుడుతూనే పెద్ద గండం నుంచి బయటపడ్డాడు(ఆ అనుభవాన్ని ఇదివరకు పంచుకున్నాను). మళ్ళీ ఇంతలోనే బాబుకు ఇంకో సమస్య రావడంతో నేను, "బాబా! 'పెద్ద సమస్యేమీ కాదు, మామూలు సమస్య' అని డాక్టరు చెప్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బాబుకి పెద్ద సమస్యేమీ లేదు, వాడు బాగున్నాడు. బాబా దయవల్ల బాబు ఆరోగ్యంగా ఉన్నాడన్న ఆనందంలో మా అక్క వాడికి బారసాల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అప్పుడే బాబుకి ఇంకో ఆరోగ్య సమస్య మొదలైంది. అది ఏంటంటే, వాడికి ఎలర్జీలా వచ్చి మళ్లీ ఆయాసం, గురక మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "రోజుకు ఐదుసార్లు బాబుకి నెబులైజర్ పెట్టాలి" అని చెప్పారు. దాంతో మా అందరికీ భయం వేసింది. ఫంక్షన్ చేద్దామంటే, ఇలా అయిందేంటి అని అనుకున్నాము. అప్పుడు నేను, "బాబా! బాబు బారసాల బాగా జరిగి, అలాగే వాడి ఆరోగ్యం బాగుంటే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బారసాల బాగా జరిగింది. బాబు ఆరోగ్యం కూడా చాలా బాగుంది. "చాలా ధన్యవాదాలు బాబా. సమస్య ఏదైనా మీ చేయి గట్టిగా పట్టుకుంటే చాలు, గట్టున పడేస్తావు తండ్రి. మా అక్కకి మానసిక ప్రశాంతతని ప్రసాదించండి బాబా. అలాగే నా కోపాన్ని తగ్గించి, అందరిలో మంచిని చూసే స్వభావాన్ని, మనోధైర్యాన్ని నాకు ప్రసాదించండి బాబా. నా జీవితమంతా మీ స్మరణలో ఉండాలి. నేను ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోకూడదు. మీరు నాకు సదా తోడుగా ఉండండి బాబా. నేను ఏం కోరుతున్నానో మీకు తెలుసు, వాటిని తీర్చి తత్సంబంధిత అనుభవాలను త్వరలో తోటి భక్తులతో పంచుకునేలా అనుగ్రహిచండి. మీదే భారం. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి".


సాయి పాదాలను ఆశ్రయించినంతనే లభించిన అనుగ్రహం


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా శిరిడీ శ్రీసాయి మహరాజ్ కి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నేను నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. నా పేరు శివకుమార్ పల్లెంపాటి. మాది కృష్ణ జిల్లాలోని విజయవాడకి సమీపంలో ఉన్న పోరంకి గ్రామం. 2022, జులై రెండో వారంలో నేను, నా శ్రీమతి హైదరాబాద్ వెళ్ళాము. మేము అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి కుండపోతగా ఒకటే వర్షం. ఆ వర్షంలోనే ఒకరోజు మేము మా అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్న మా నాన్నగారిని పలకరించి, ఇంకో రోజు ఒక ఫంక్షన్‍‍కి వెళ్ళి, ఇంకో రోజు మా చిన్న అక్క వాళ్ళింట్లో ఉండి నాలుగో రోజు ఉదయం విజయవాడకి బస్సులో తిరుగు ప్రయాణమయ్యాము. అంతకు ముందురోజు రాత్రి నుంచే నాకు జ్వరం, జలుబు మొదలయ్యాయి. మా అక్క, బావ ఇద్దరూ డాక్టర్లు అవ్వటం వలన అస్వస్థత నుంచి ఉపశమనం కోసం నాకు కొన్ని మందులిచ్చి, ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉండటానికి మరికొన్ని మందులు ఇచ్చారు. మేము వాటిని తీసుకుని బయలుదేరాము. ఆ సాయినాథుని కృపాశీస్సులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. అయితే ఇంటికి వచ్చేసరికి జ్వరం తీవ్రత, ఒళ్ళునొప్పులు చాలా ఎక్కువయ్యాయి. అక్కాబావ ఇచ్చిన మందులు కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రం కలిగించేవి. విపరీతమైన నీరసంతో ఎప్పుడు చూసిన మంచం మీద పడుకోవాలని అనిపించేది. ఇలా మూడురోజులు గడిచాక నాలుగోరోజు నిద్రకు ఉపక్రమించే ముందు నేను ఆ సాయినాథుని పాదాలకు నమస్కరించి, కొంచెం ఊదీ నోట్లో వేసుకుని పడుకున్నాను. ఆశ్చర్యం! అర్ధరాత్రి దాటాక నా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఆ తరువాత క్రమేణా జ్వర తీవ్రత, నీరసం తగ్గి ఇప్పుడు నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను. నేను తమ పాదాలను ఆశ్రయించినంతనే నన్ను ఆశీర్వదించి, అస్వస్థత నుండి ఉపశమనం కలుగజేసిన ఆ సాయినాథునికి వేలవేల నమస్కారపూర్వక ధన్యవాదాలు.


ఆ సాయినాథుని ఆశీస్సులతో మా అబ్బాయి చిరంజీవి రామప్రణీత్ ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరి గత 15 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు. తను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అవసరమైన గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సాయి భగవానుని ఆశీస్సులతో 2020 సంవత్సరంలో గ్రీన్ కార్డు కరెంట్ అయి అక్టోబరులో దానికి సంబధించిన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దేశం విడిచి బయటకు వెళ్లకూడదు. కానీ మరదలు పెళ్లికోసం మా అబ్బాయి ఇండియాకి రావాల్సి వచ్చింది. అదే పెద్ద ఇబ్బంది అయి తన తోటి వారందరికీ గ్రీన్ కార్డు వచ్చినా మా అబ్బాయికి రాకుండా ఆగిపోయింది. అప్పుడు నేను సాయినాథుని కాళ్ళ మీద పడి, "మా బాబుకి ఏ అవాంతరం లేకుండా గ్రీన్ కార్డు వచ్చేటట్లు చూడండి బాబా" అని చిన్న కోరిక కోరుకున్నాను. విశాల హృదయులైన సాయి మా మొర ఆలకించారు. ఆయన మా చిరంజీవిని ఆశీర్వదించి 2022, జూలై 18న గ్రీన్ కార్డు అప్రూవ్ చేయించారు. ఇంతటి మహోపకారం చేసిన ఆ సాయినాథునికి వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో నా అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారికి అనేక కృతజ్ఞతలు. ముందు ముందు రాబోయే రోజుల్లో నా అనుభవాలను ఇంకా ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటానని వినమ్రంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.


బాబా కృపతో ఒక్కరోజులో తగ్గిన జ్వరం


ముందుగా సాయి బంధువులకు మరియు బ్లాగ్ నిర్వాహకులకు నమస్తే. నా పేరు సత్యనారాయణమూర్తి. నేను గతంలో రెండుసార్లు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకున్నాను. ఇది మూడవసారి. 2022, జూలై రెండో వారంలో మా బాబుకి ఉన్నట్టుండి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. నేను వెంటనే, "బాబా! రేపటికల్లా జ్వరం పూర్తిగా తగ్గి, బాబుకి నార్మల్ అయితే, వెంటనే నేను మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని సాయినాథునికి నమస్కరించుకుని కొద్దిగా బాబా ఊదీ ఒక గ్లాసు నీటిలో కలిపి బాబు చేత త్రాగించి నిద్రపుచ్చాను. బాబా దయవల్ల మర్నాటికి జ్వరం నార్మల్ అయి బాబు తేలిక పడ్డాడు. "ధన్యవాదాలు సాయినాథా! మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం కొద్దిగా ఆలస్యమైంది. నన్ను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1271వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన మేలు
2. అన్నివిధాలా కాపాడే బాబా
3. భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీసాయిబాబా

బాబా చేసిన మేలు


సాయిబంధువులందరికీ నమస్కారం. ముందుగా ఈ బ్లాగును నడుపుతున్న సాయిసోదరులకు కృతజ్ఞతలు. నా పేరు లత. ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకొన్న నేను, ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు మావారు, 'నా ఉంగరం ఎక్కడో పోయింది, కనిపించటంలేద'ని చెప్పారు. దాంతో అన్నిచోట్లా ఉంగరం కోసం వెతికాము, కానీ ఉంగరం దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ కృపవలన ఉంగరం దొరికితే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అంతే, ఆ ఉంగరం విచిత్రంగా మావారి జేబులోనే దొరికింది. మాకు చాలా సంతోషమేసింది.


కోవిడ్ సమయంలో మా మనవడి పుట్టినరోజు జరుపుకోవటానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అలా ఆ రెండు సంవత్సరాలూ మనవడి పుట్టినరోజు చేయలేకపోయాము. కాబట్టి మూడవ పుట్టినరోజైనా ఘనంగా జరిపించదలచి, "మా కోరికను నెరవేర్చమ"ని సాయితండ్రిని వేడుకుని బహిరంగప్రదేశంలో పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశాము. బాబా కరుణించి ఆరోజు వర్షం పడకుండా, ఇంకెలాంటి ఆటంకాలు లేకుండా చేసి వేడుకను చాలా ఘనంగా జరిపించి మా కోరిక నెరవేర్చారు. "ధన్యవాదాలు బాబా. మీ దయ మాపై ఎల్లప్పుడూ ఇలాగే ప్రసరించాలని వేడుకుంటున్నాను సాయితండ్రీ".


మావారికి కోవిడ్ వచ్చి తగ్గాక పోస్ట్ కోవిడ్ సమయంలో 'బైపోలార్ డిజార్డర్' అనే ప్రాబ్లెమ్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా అది కంట్రోల్ కాలేదు. మాకు చాలా భయమేసి, "బాబా! నీదే భారం తండ్రీ, మీ పాదాలనే నమ్ముకున్నాం. ఏమి చేసినా మీరే చేయాలి. అది తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు నుండి ఆ సమస్య క్రమేపీ తగ్గిపోతూ బ్యాలెన్స్ అయి ఇప్పుడు మావారు మామూలు స్థితికి వచ్చారు. "థాంక్యూ బాబా. మీ పాదాల చెంత మాకు చోటు ఇవ్వమని అడగటం తప్ప ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం? మీరు చేసిన మేలు అంతా ఇంతా కాదు సాయితండ్రీ. బ్లాగులో పంచుకోవటం కొంచెం ఆలస్యమైంది. నన్ను మన్నించు తండ్రీ".


ఒకసారి మా ఇన్నోవా కారు రిపేర్ చేయించాల్సి వచ్చి ఎన్నిసార్లు షోరూంకి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అవలేదు. అప్పుడు నేను బాబాకి చెప్పుకున్నాను. తరువాత ఒక ప్రైవేట్ మెకానిక్‌కి కారుని చూపిస్తే, బాబా దయవల్ల సమస్య పరిష్కారమైంది. "థాంక్యూ బాబా".


ఈమధ్య డాక్టరు నాతో థైరాయిడ్ టెస్టు చేయించుకోమని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! రిపోర్ట్ నార్మల్ వచ్చేలా అనుగ్రహించండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. రిపోర్టులో థైరాయిడ్ బోర్డరులో ఉందని వచ్చింది. "మరేం పర్వాలేదు బాబా. ఈసారి నార్మల్ వచ్చేటట్లు అనుగ్రహించండి సాయితండ్రీ. నాకు గుర్తున్నంతవరకు మీ అనుగ్రహాన్ని పంచుకున్నాను బాబా. ఏవైనా మర్చిపోయివుంటే, అవి నాకు గుర్తుకొచ్చేలా చేయండి. థాంక్యూ సో మచ్ బాబా బంగారం".


అన్నివిధాలా కాపాడే బాబా


నేనొక సాయిభక్తుడిని. సాయిబాబా తమ కరుణాకటాక్షాలతో నన్ను, నా కుటుంబాన్ని చాలాకాలం నుంచి కాపాడుతున్నారు. మేము ఈమధ్య మా అమ్మాయి ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నందున అమెరికా వెళదామని నిర్ణయించుకుని టికెట్లు మొదలుకుని అన్నీ సిద్ధం చేసుకున్నాం. తరువాత ప్రయాణమయ్యేలోపు నేను మెడికల్ చెకప్ చేయించుకుంటే, అందులో ట్రెడ్‌మిల్ టెస్టులో తేడా కనిపించింది. మా ఫ్యామిలీ డాక్టరు, "తప్పనిసరిగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి యాంజియోగ్రామ్ చేయించుకోండి" అని బలవంతం చేశారు. దాంతో నాకు ఏం చేయడానికీ తోచక బాబాకి విన్నవించుకున్నాను. అప్పుడు బాబా నుండి కూడా కార్డియాలజిస్టుని కలవమని సందేశమొచ్చింది. నేను బాగా భయపడిపోయి, "బాబా! ఏ ప్రాబ్లం లేకపోయినట్లయితే తప్పనిసరిగా నా అనుభవాన్ని, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి డాక్టరు దగ్గరకి వెళ్ళాను. అక్కడ కొన్ని టెస్టులు చేసి, "అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు అమెరికా వెళ్లొచ్చిన తరువాత కావాలంటే యాంజియోగ్రామ్ చేయించుకోండి" అని చెప్పారు. అది విని నా మనసు కుదుటపడింది. బాబా మనల్ని అన్నివిధాలా కాచి కాపాడుతుంటారని తెలిసినా మనం భయపడుతుంటాం. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకునేలా అనుగ్రహించిన మీకు శతకోటి వందనాలు తండ్రీ". ఈ బ్లాగుని స్వయంగా బాబానే నిర్వహిస్తున్నారని, నిజంగా ఇది 'వర్తమానకాల సాయిసచ్చరిత్ర' అని నా భావన.


భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీసాయిబాబా


సాయిభక్తులకు నా నమస్కారాలు. 'ఆధునిక సచ్చరిత్ర' అయిన ఈ బ్లాగులో పంచుకుంటామని చెప్పుకుంటే ఎంతటి బాధైనా మాయం అయిపోతుంది. "ఈ బ్లాగు ద్వారా ఎన్నో కోరికలు తీరుస్తూ మీరు మాతోనే ఉన్నారు బాబా. మీ దివ్య పాదాలకి నా వందనాలు తండ్రీ". నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. కరోనా సమయం మళ్ళీ మొదలైన ప్రస్తుత తరుణంలో జ్వరం అంటేనే భయం వేస్తోంది. అలాంటిది మొదట మా ఇంట్లో మా బాబుకి జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. బాబుకి తగ్గకపోయేసరికి మేము తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. జ్వరం తగ్గింది కానీ, దగ్గు తగ్గలేదు. దాంతో నేను, "బాబా! బాబుకి దగ్గు తగ్గితే, సాయిభక్తుల అనుభవమాలికలో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల తరువాత బాబుకి దగ్గు తగ్గింది. కానీ మా ఇంట్లో అందరికీ కూడా ఒకరి తరువాత ఒకరికి జ్వరం వచ్చింది. బాబా ఉండగా మనకి భయమెందుకు? ఆయన కృపతో మా అందరికీ కూడా తగ్గింది. అయితే మా బాబుకి మళ్లీ జ్వరం వచ్చింది. "మీ దయతో తగ్గుతుందని నమ్ముతున్నాను బాబా. భక్తుల పాలిట కల్పవృక్షం మీరు". 


ఈమధ్య మా అక్క కూతురు EAPCET వ్రాసింది. తరువాత ఆ పరీక్ష తాలూకా 'కీ' చూసినప్పుడు, తనకి 38 మార్కులే వచ్చాయి. కానీ ఆ పరీక్షలో 40 మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అందువలన మేము చాలా టెన్షన్ పడ్డాము. మా టెన్షన్ బాబాకి తెలుసు. మేము ఆయనతో, "బాబా! మీ దయతో పాప పరీక్షలో క్వాలిఫై అవ్వాలి తండ్రీ. అలా జరిగితే, 'సాయిభక్తుల అనుభవమాలిక'లో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని వేడుకున్నాము. నా బాబా ఏం కోరుకున్నా తీరుస్తారు కదా! ఆయన దయవల్ల అద్భుతం జరిగింది. ఆ అమ్మాయి 44 మార్కులతో క్వాలిఫై అయింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా.  లవ్ యు సో మచ్ సాయీ. మీ ప్రేమను కోరుకోవడం తప్ప, మీకు మేము ఏమీ ఇవ్వలేము".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1270వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు
2. బాబా కృప

శ్రీసాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు


"అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ మహాప్రభూ!!! మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు. అనుదినం, ప్రతీ అడుగు మీ సహాయంతో వేసే భక్తులం మేము నాయనా! ఒక్క క్షణం కూడా నీ కృపావీక్షణాలు మాపై నుండి మరల్చవద్దు. మమ్మల్ని మాయ శిక్షించకుండా కాపాడు తండ్రీ! చిన్నవి, పెద్దవి ఎన్ని అనుభవాలని వ్రాయగలం తండ్రీ? గుర్తొచ్చినవన్నీ ఈసారి బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి సాయినాథా". నేనొక సాయిభక్తురాలిని. సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహించడం ద్వారా ఆ సాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు మా అందరి యందు ప్రసరింపజేస్తున్న సాయికి కృతజ్ఞతలు. మీ వల్ల, ఈ బ్లాగు వల్ల మేము ప్రతిరోజూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ సాయినాథుని మనసారా కొలుచుకుంటున్నాము. ఈ బ్లాగులోని మిగతా భక్తుల అనుభవాలలో మా సమస్యలకు సమాధానాలు లభిస్తున్నాయనడంలో సందేహమే లేదు. 'భక్తులారా! చిన్న, పెద్ద విషయాలలో బాబా ఇచ్చే అభయహస్తం, ఆయన కరుణాకటాక్షవీక్షణాలు మనపై ఎలా ప్రసరిస్తాయో చెప్పే సాధనమే ఈ బ్లాగు. 'ఓం శ్రీ సాయినాథాయ నమః' అన్న ఈ నామమే భక్తకోటిని అడుగడుగునా రక్షించే దివ్యకవచం. సాయి నామాన్ని పఠించండి. ఎల్లవేళలా ఆయన రక్షణలో ఉండండి'. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...


2022, మే నెల రెండవ వారంలో ఉపాధ్యాయులకు పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు వేశారు. రోజూ 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఎప్పుడు సెలవులు ఇస్తారా అని ఎదురుచూసే నాకు కూడా డ్యూటీ వేయడంతో, "సాయినాథా! నేను అంత సుదీర్ఘ సమయం కూర్చుని పనిచేయలేను. పైగా మండు వేసవి. నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీని ఎలాగైనా రద్దు అయ్యేలా చేయండి బాబా. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మా పైఅధికారులు, "పడిన డ్యూటీ ఎవ్వరికీ తప్పిపోవడమంటూ ఉండదు" అని బలవంతంగా (ఒకరకంగా చెప్పాలంటే బెదిరిస్తూ) అందర్నీ స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలో నిమగ్నపరచి పేపర్లు దిద్దించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మాత్రం మనస్సులో భయంగా ఉన్నా, బాబా మీద నమ్మకంతో ఆయన నామజపం చేస్తూ దూరంగా ఉండిపోయాను. కొంతసేపటికి ఇక తప్పదని డ్యూటీలో చేరిపోదామని మా సబ్జెక్టు క్యాంపు ఆఫీసర్(సీనియర్ హెడ్ మాస్టర్) దగ్గరకు వెళ్ళాను. ఆయన నా చేత సంతకం చేయించుకుని డ్యూటీలోకి తీసుకున్నారు. కానీ పావుగంట తరువాత ఆయనే,  "అమ్మా! స్పాట్ వాల్యుయేషన్ చేసే గ్రూపులన్నీ పూర్తిగా ఏర్పడ్డాయి. మీరు అదనంగా మిగిలిపోయారు. కాబట్టి మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాను, వెళ్లిపోండి" అని అన్నారు. ఆశ్చర్యం! నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం. మా పాప చదువు విషయంలో బాబా తనని ముందుకు నడిపించి మంచి పేరుప్రఖ్యాతులున్న ఒక యూనివర్సిటీలో తనకి సీటు ఇప్పించి ఎంతో మేలు చేశారు. "బాబా! తనకి అడుగడుగునా దిశానిర్దేశం చేసి తన జీవితాన్ని చక్కగా స్థిరపరిచే బాధ్యత మీదే తండ్రీ".


"జాతకాలు చూడవద్ద"ని బాబా చెప్పినప్పటికీ ఒక మహిళ ప్రోద్బలం వలన మానవ సహజమైన కుతూహలంతో నేను 2022, జూన్ నెలలో ఒక జ్యోతిష్య పండితుణ్ణి సంప్రదించాను. అయితే, బాబా అతని మోసకారి బుద్ధి మాకు త్వరగా తెలిసివచ్చేలా చేసి మమ్మల్ని రక్షించారు. "తండ్రీ! మీ మాట వినలేదని కోపగించుకోకుండా మమ్మల్ని రక్షించావు. సదా మీ కరుణ మాపై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాపై కోపగించుకోకు దయామయా. మా అజ్ఞానాన్ని క్షమించి మమ్ము ఆదరించు బాబా".


నా తోటి ఉపాధ్యాయిని కుమారుడికి(చిన్నబాబు) తరచూ జ్వరం వస్తుంటే చాలా టెస్టులు వ్రాశారు. ఇటు జాబు, అటు బాబు గురించి ఆమె సతమతమవుతుంటే నేను ఆ తల్లి బాధ చూడలేక, "బాబా! ఆ బాబుకి నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ సమర్థ సద్గురు సాయినాథుని దయవల్ల ఇప్పుడు ఆ బాబు చక్కగా కోలుకుని స్కూలుకి వెళ్తున్నాడు.


ఒకరోజు సాయంత్రం మెడికల్ టెస్టుల కోసమని బయలుదేరి వెళ్లిన నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు క్రికెట్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ వేరే మార్గంలోకి మళ్లించడం వలన ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాను. ఒంటరిగా ఆటోలో కూర్చుని ఇంటికి చేరడానికి రెండు, మూడు గంటలు పడుతుందేమోనని, "బాబా! నన్ను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మీదే" అని బాబాని ప్రార్థించసాగాను. అంత ట్రాఫిక్‌జామ్ కూడా చిత్రంగా అరగంటలో క్లియర్ అయిపోయింది. తరువాత మావారి సహాయం తీసుకుని మరో 20 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాను. ఇలా చిన్న, పెద్ద విషయాలలో బాబా చేసే సహాయాలు మరువలేనివి. "ధన్యవాదాలు బాబా. మా పాప కాలేజీ జాయినింగ్ విషయంలో మాకున్న సమస్యలన్నీ తొలగించి, మార్గం సుగమం చేసి, పని పూర్తి చేయించిన మీకు శతసహస్ర వందనాలు బాబా. పాప మంచిగా చదువుకుని, తను చక్కని జీవితం పొందేలా చూసే బాధ్యత మీదే బాబా. నా ఆరోగ్య సమస్యల దృష్ట్యా నాకు దగ్గర ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చూడు తండ్రీ. చెల్లెలి ట్రాన్స్‌ఫర్ మరియు ఇంటి సమస్యలను కూడా తీర్చి తన కుటుంబానికి కూడా మీ భక్తకోటిలో స్థానమివ్వు తండ్రీ. శిరిడీ, తిరుమల దర్శించి చాలాకాలం అయ్యింది. దయచేసి తొందరలో ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇల్లు కొనుగోలు విషయంలో, లోన్ శాంక్షన్ విషయంలో అడుగడుగునా మీ సహాయం మరువలేనిది బాబా. అలాగే మీ దయతో మిగిలిన పనులు కూడా సక్రమంగా జరిగి మేము గృహప్రవేశం చేసుకోవాలి తండ్రీ. మేము మా కొత్త ఇంటికి 'ద్వారకామాయి' అని పేరు పెట్టుకుంటున్నాము. సదా ఆ గృహం మీ నిలయంగా విలసిల్లాలని, ఒక్కక్షణం కూడా మేము మీ రక్షణకు, మీ దయకు దూరం కాకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రీ".


సర్వేజనాః సుఖినోభవంతు!!!

జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబా!!!


బాబా కృప


అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నా జీవితంలో ప్రతి చిన్న విషయమూ బాబా దయవల్లే జరుగుతుందని నా పూర్తి విశ్వాసం. ఈమధ్య మా పాపకి బాగా జ్వరం వచ్చింది. నేను పాపచేత బాబా ఊదీనీళ్లు త్రాగించి, రాత్రంతా పాప శరీరాన్ని తడిబట్టతో తుడుస్తూ, "తెల్లవారేసరికి జ్వరం తగ్గి పాప మామూలుగా అయితే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి పాప నార్మల్ అయింది. కానీ పాపకి కొంచెం ఆయాసంగానూ, గొంతులో నసగానూ ఉండటంతో కోవిడ్ ఏమో అని నాకు అనిపించింది. వెంటనే, "బాబా! పాపకి ఉన్న ఇబ్బందులన్నీ తగ్గించండి తండ్రీ" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజుకి పాపకి ఆయాసం, జ్వరం పూర్తిగా తగ్గాయి. ఆ మరుసటిరోజు తెల్లవారేసరికి గొంతులో నస కూడా తగ్గిపోయింది. అయితే కొంచెం దగ్గు వస్తూ ఉదయం పూట కఫం పడుతూ ఉండేది. ఒకసారి ఆ కఫంలో కొద్దిగా రక్తం కనిపించేసరికి నాకు బాగా టెన్షన్‌గా అనిపించి, బాబా ఊదీని నీళ్లలో కలిపి పాప చేత త్రాగించి, "ఏ ప్రాబ్లెమ్ లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కేవలం రెండు రోజుల్లో ప్రాబ్లెమ్ తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

 

గుంటూరులో మేము కొన్న అపార్ట్‌మెంటుకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఏ సమస్యా లేకుండా నా పేరు మీదకి మారితే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల గురుపౌర్ణమినాడే ప్రాపర్టీ ట్యాక్స్ నా పేరు మీదకి మారింది. ఈమధ్య మావారి కోపాన్ని బాబా తగ్గించారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.


ఈమధ్య నా భర్త, తమ్ముడు ప్రసాద్ కలిసి తిరుపతి వెళ్లారు. అప్పుడు నేను, 'వాళ్ళ తిరుపతి ప్రయాణం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తయి క్షేమంగా తిరిగి వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు తిరుపతి ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి స్వామి దర్శనం బాగా జరిగింది.


ఇకపోతే, తమ్ముడు ప్రసాద్ ఇంట్లో తన భార్యతో గొడవలు జరిగి బాగా డిస్టర్బ్ అయ్యాడు. తను చాలా మూడ్ ఆఫ్ లో ఉండి 2022, జూన్ 30, గురువారం మహాపారాయణ గ్రూపు నుండి బయటకి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అనిపించి బాబాను, "బాబా! భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేలా చేసి, వాళ్ళు తొందరగా నార్మల్ అయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల రెండురోజుల్లో వాళ్లిద్దరూ నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు ఎటువంటి గొడవలూ లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ. అలాగే తమ్ముడు తిరిగి మహాపారాయణ గ్రూపులో జాయిన్ అయ్యేలా, మీ మీద తనకి నమ్మకం కలిగేలా చూడండి తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత గురుపౌర్ణమినాడు నేను తమ్ముడితో కలిసి బాబా గుడికి వెళదామని అనుకున్నాను. బాబా ఆరోజు తమ్ముడిని గుడికి రప్పించుకోవడమేకాక హారతి, పల్లకి సేవలలో తను అటెండ్ అయ్యేలా చేశారు. నాకు చాలా చాలా సంతోషమేసింది. బాబా తమ భక్తులని ఎన్నటికీ దూరం చేయరు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo